Thursday, January 16, 2014

కాసనోవ, జనవరి 17


ఒక తూనీగ ఎగురుతూ వచ్చి
నా చూపుడు వేలుపై
అక్షరాల పుప్పొడి రాల్చింది
దేశపు పూవో
ఎన్ని యోజనాలు ఎగురుతూ వచ్చిందో
ఒక మందపవనం
నా ఊపిరిలో కలిసి
గుసగుసల పరిమళాన్ని విరజిమ్మింది
అత్తరు సుగంధమో
కనుమల నుంచి మోసుకుని వచ్చిందో
ఒక నీలిమేఘం
నా వక్షం మీద
చందనపు తుంపర చల్లింది
ఏ అరణ్యాకాశాల నుంచి
పలకరింపులను చిలకరించిందో
పుప్పొడి పరిమళాల తుంపరలో
ఇప్పుడు నేను తలమునకలై పోయాను 

Saturday, December 21, 2013

పండుగ

కను కొలకుల్లోకిటికీ కొసన. గుమ్మం మీద. వీధి చివరన. డొంక  దారినకొండ కొమ్మున. రేవు మీద. నేలా  ఆకాశమూ  కలిసే చోట .
ఒక అశ్రువునెత్తుటి చుక్క.
ఎడతెగదు

మహారణ్యాలను దాటుకుని, సముద్రాలను లంఘించి, లక్ష అమావాస్యలను గడిపి
ఒక నెలపొడుపు . ఒక వెలుతురు  చుక్క.  
దాహానికొక్కటి 
మోహానికి  ఒక్కటి
జీవితానికొక్కటి
చలివేంద్రం
చెలివేంద్రం
బతికిన క్షణం
రెప్పార్చి  గుటక వేసి  ఊపిరి పీల్చి.. 
ఈరోజు పండగ

Tuesday, April 2, 2013

సమాధానం లేని సంకీర్ణ ప్రశ్నలు

జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రుడు అడిగాడు- "పోయిన సంవత్సరమే మా రాష్ట్రం కొంత కుదుటపడింది. పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి, అభివృద్ధికి శాంతియుత పరిస్థితులే పునాది అని మీరు అంటున్నారు కదా, కానీ, కేంద్రం వ్యవహరించిన తీరు వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది కదా?''- అఫ్జల్ గురు ఉరితీత వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే అతను ఆ ప్రశ్న అడిగాడని ఆర్థిక మంత్రి చిదంబరం అర్థం చేసుకున్నారు. ఆయన గతంలో హోంశాఖ మంత్రి కూడా కదా మరి! ఆయన అప్పుడు అన్నారు- "దాన్ని అట్లా అర్థం చేసుకోగూడదు, ఉరితీత అనేది న్యాయప్రక్రియ అమలులో భాగంగా జరిగింది, అంతా పద్ధతి ప్రకారం జరిగింది, దర్యాప్తు, ప్రాసిక్యూషన్, కిందికోర్టు తీర్పులు, పైకోర్టు నిర్ధారణలు, క్షమాభిక్ష పిటిషన్, నిరాకరణ.. అన్నీ సవ్యంగా జరిగాయి. అందువల్ల నిరసనలు, అశాంతి అంటారా, వాటిని ఊహించాము కూడా, త్వరలోనే సమసిపోతాయని ఆశిస్తున్నాను''

యూపీఏకు డీఎంకే మద్దతు ఉపసంహరించిన మరునాడే, స్టాలిన్ ఇంటి మీద సీబీఐ దాడి చేయడం, ఇతర పక్షాలను బెదిరించడానికే కదా అని మన రాష్ట్రం నుంచి వచ్చిన ఒక పాత్రికేయుడు అడిగినప్పుడు- సంబంధిత మంత్రి నారాయణస్వామి కాస్త తడబడ్డారు. విదేశీ కార్లు, పాతకార్లుగా చెప్పి దిగుమతి చేసుకోవడం, సుంకాలు ఎగవేయడం వంటి వివరాలన్నీ ఏకరువు పెట్టారు. అంతా సక్రమంగానే జరిగిందన్నట్టు మాట్లాడారు. దాడి చేసిన సమయం వల్ల జనం దాన్ని అక్రమమనే భావిస్తారు కదా అని మళ్లీ అడిగితే, అదే, అదే, తగిన సమయం కాదని ప్రధానమంత్రి దగ్గర నుంచి అంతా అన్నారు కదా, టైమింగే తప్పు- అని ముక్తాయించారు. దర్యాప్తు సమయంలో కానీ, ప్రాసిక్యూషన్ సందర్భంగా కానీ, సీబీఐ పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకోనే చేసుకోదని గట్టిగా ప్రకటించారు.

అన్నీ చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం జరిగాయని, తమకు ఎటువంటి ఉద్దేశాలూ లేవని చిదంబరం, నారాయణ స్వామి మాత్రమే కాదు, జాతీయ సంపాదకుల సదస్సులో పాల్గొన్న ప్రతి మంత్రీ, అధికారీ చెప్పడానికి ప్రయత్నించారు. అటువంటి మాటలను వినడానికి, విని దేశ ప్రజలకు ఆ సందేశాన్ని అందించడానికే ఈ సదస్సును ఉద్దేశించారు. మొన్న 23, 24 తేదీలలో న్యూఢిల్లీ విజ్ఞానభవన్‌లో పీఐబీ నిర్వహించిన ఈ సదస్సులో