Tuesday, December 29, 2009

మనుషులను ప్రేమిస్తే అంతా భూమిపుత్రులే

నలబై ఏళ్ల కిందటి తెలంగాణ ఉద్యమం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా,  అప్పట్లో హైదరాబాద్‌నుంచి వెనక్కి వెళ్లిపోవలసి వచ్చిన కోస్తాంధ్ర ఉద్యోగుల భయాందోళనల గురించి మాట్లాడే మిత్రులు చాలా మందే ఉన్నారు. ఒక ఉద్రిక్త, సంక్షోభ పరిస్థితిలో ఉన్నఊరు వదిలివెళ్ల వలసి రావడం ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఏ ప్రత్యేక వాదమూ అవరోధం అవుతుందని అనుకోను.

1946-48 నాటి తెలంగాణసాయుధపోరాటం, రజాకార్ల కల్లోలం, పోలీస్‌ యాక్షన్‌ సందర్భాలలో తెలంగాణ స్థానికులే ఉన్న ఊర్లు వదిలి, కృష్ణకు ఆవలివైపు వెళ్లి తలదాచుకోవలసివచ్చింది. 1969 ఉద్యమం సందర్భంగా కోస్తాంధ్ర మిత్రుల కష్టాల గురించి మాట్లాడే సందర్భంలో - నా ప్రత్యేక అనుభవం గురించి చెప్పాలనిపిస్తుంది. చెబుతుంటాను కూడా. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లారి, జై ఆంధ్ర ఉద్యమం అంకురిస్తున్న సమయంలో కోస్తాంధ్ర నుంచి వెనక్కి వచ్చేసిన తెలంగాణ కుటుంబం నాది. అప్పటికి నేను చాలా చిన్నవాడినే అయినా, నాటి కల్లోల స్థితి జ్ఞాపకాలు నాకింకా లీలగా మిగిలి ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు మేం ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర వేంసూరు గ్రామంలో ఉండేవాళ్లం. అక్కడి జిల్లా పరిషత్‌ హైస్కూల్లో మా నాన్న మొదటి గ్రేడ్‌ తెలుగుపండిట్‌గా పనిచేసేవారు. అప్పటికి ఎనిమిదేళ్లుగా అక్కడ పనిచేస్తున్న ఆయన ప్రైవేటుగా పోస్టు గ్రాడ్యుయేషన్‌, బిఎడ్‌ పూర్తిచేసి ఉన్నతావకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన భాషాప్రవీణ, విద్యాప్రవీణ వంటి డిగ్రీలు కూడా ఉండడం వల్ల కాబోలు, మచిలీపట్నం హిందూ కాలేజీలో ఆయనకు అధ్యాపకుడి ఉద్యోగం వచ్చింది. ఏడాది తరువాత ఉద్యోగం ఖరారు చేయకపోగా, తక్కువస్థాయికి ట్యూటర్‌గా మార్చారు. అందుకని, మరో ఉద్యోగం వెదుకుతూ చింతలపాటి బాపిరాజు విద్యాసంస్థలలో ఒకటైన ఏలూరు ఓరియంటల్‌ కాలేజీలో ప్రిన్సిపల్‌ ఉద్యోగం సంపాదించారు. ఇదంతా 1968-1970 మధ్యకాలం. ఆ సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉధృతంగా ఉండింది. కానీ, కోస్తాంధ్రలో తీవ్రమైన ప్రతిస్పందనలు ఇంకా మొదలు కాలేదు.

ఏలూరు ఆంధ్రజాతీయ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాను నేనప్పుడు. ఒకరోజు మా నాన్న మా అన్నయ్యను, తమ్ముళ్లను కూర్చోబెట్టుకుని- మీ సొంత ఊరేమిటని ఎవరైనా అడిగితే- జగ్గయ్యపేట అని చెప్పండి అని చెప్పారు. ఎందుకట్లా అని అడిగాము, మన మాటలో తేడా ఉంటుంది, అందుకని మీరెక్కడివాళ్లని ఎవరైనా అడిగినప్పుడు నల్లగొండ అని చెప్పకండి. జగ్గయ్యపేట అయితే నల్లగొండ జిల్లాకు సరిహద్దు కాబట్టి భాష మిశ్రమంగా ఉన్నదనుకుంటారు- అని వివరణ ఇచ్చారు. అందులోని తీవ్రత నాకు అర్థమైందనుకోలేను కానీ, సొంత ఊరేమిటో చెబితే ఇక్కడి వాళ్లకు అది ఇష్టం ఉండదు- అని మాత్రం అర్థమైంది.  మా నాన్న భయపడడానికి బయటజరుగుతున్న సంఘటనలేవో కారణమని అర్థమయ్యేది కానీ, అవేమిటో తెలియదు. అంతేకాదు, మా నాన్న తరచు హైదరాబాద్‌ వెళ్లి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మాకు తెలుస్తూ ఉండేది. ఇంతలో ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొడంగల్‌లో ఓరియంటల్‌ కాలేజీలో అధ్యాపక ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య గండం గడిచింది అని మా తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడం గుర్తుంది.

కొడంగల్‌లోని జడ్‌పిహెచ్‌ఎస్‌లో 1971లో ఏడోతరగతిలో చేరాను. అప్పటిదాకా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగిన ఊర్లలో  ఆ ఊరు కూడా ఒకటి. ఖమ్మం జిల్లాలోని కోస్తాసరిహద్దు గ్రామంలో,  ఆ తరువాత రెండు కోస్తా ముఖ్యపట్టణాలలో పెరిగిన నా భాష- సహజంగానే కొడంగల్‌లో పరాయిగా ఉండేది. అక్కడి తోటి పిల్లలు నన్నుకొంతకాలం పరాయిగానే చూశారు. చేశాను, చూశాను, చూస్తాను- వంటి క్రియల్లో దీర్ఘం తీసి మాట్లాడుతున్నప్పుడు వెక్కిరించారు. మచిలీపట్నంలో ఒకసారి నేను " ఉరుకు ఉరుకు' అని మా తమ్ముడితో అంటుంటే, విని పక్కింటివాళ్లు విరగబడినవ్వారు. అదీ, నేను కొడంగల్‌లో "పరిగెత్తు పరిగెత్తు' అంటే అంతే వెటకారంగా నవ్వారు. చిన్నతనంలో భాషను అలవరచుకోవడం పెద్ద కష్టం కాదు కాబట్టి- కొడంగల్లో అతి తొందరలోనే నేను స్థానిక భాషకు బదిలీ అయిపోయాను. ఆశ్చర్యం కలిగించేదేమంటే- నేను తెలంగాణ భాషకు మారిపోతుంటే మా అమ్మే నన్ను నిరోధించేది. నియత విద్య పెద్దగా లేని మా అమ్మ,  ఎన్ని ఊర్లు తిరిగినా ఇప్పటికీ స్వచ్ఛమైన నల్లగొండ గ్రామీణ బ్రాహ్మణ భాషే మాట్లాడుతుంది. కానీ, బందరు, ఏలూరు పట్టణాల్లో ఉన్న కాలంలో ఆమెకు- కోస్తాంధ్ర భాష నాజూకు భాష అని నమ్మకం కలిగింది.తాను అలవరచుకోలేకపోయినా, పిల్లలకు అలవరచాలని ప్రయత్నించింది.  ఆమె నిరోధం వల్ల కొంతా, హైదరాబాద్‌కు చేరాక తెలంగాణేతర సభ్యసమాజంతో ఎక్కువ పూసుకు తిరగడం వల్ల కొంత, అభ్యసించిన విద్య వల్ల మరికొంత- నా భాష కలుషితమై పోయింది. మాతృభాష నాకు దూరమై పోయింది. తరువాత కాలమంతా నేను తెలంగాణలోనే బతుకుతూ వస్తున్నాను. 1985-6లో, ఆ తరువాత 1992-93లో- మొత్తం మూడేళ్ల పాటు విజయవాడలో ఉద్యోగరీత్యా ఉన్నాను. తెలంగాణ- ఆంధ్రకు సంబంధించిన ఫీలింగ్స్‌, ప్రస్తావనలు, చర్చలు ఈ మధ్య కాలంలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి కానీ, మళ్లీ 1995 తరువాత అవి తిరిగి గట్టి రాజకీయరూపం తీసుకోవడం మొదలైంది.

తెలంగాణవారికి, ఆంధ్రవారికీ మధ్య స్నేహాలు, పనిసంబంధాలు, వివాహ సంబంధాలు ఈ మధ్యకాలంలో విస్తృతమవుతూ వస్తున్నాయి. అయినా, ఏదో ఒక విభేదరాగం అంతర్లీనంగా వినిపిస్తూనే ఉంది. తీవ్రంగా ద్వేషించుకున్నవారు కూడా కాలం గడుస్తున్నకొద్దీ సహజీవనాన్ని అలవరచుకుంటారు. వైద్యం దక్కనప్పటికీ, గాయాలను కాలమే ఒక్కోసారి మాన్పుతుంటుంది.

ఆవేశకావేశాలు ఉధృతంగా ఉన్న సమయంలో ఉన్నచోటినుంచి వెళ్లిపోవలసి వచ్చిన పరిస్థితులు ఎంతకాలం అలాగే ఉంటాయి? వెళ్లగొట్టినవాళ్లకు, వెళ్లిపోయినవాళ్లకు కూడా ఆవేశాలు, భయాందోళనలు తాత్కాలికంగానే ఉంటాయి. ప్రత్యేక తెలంగాణ ఆందోళన కారణంగా హైదరాబాద్‌నుంచి ఏలూరు  పారిపోయి వచ్చిన ఒక ఉద్యోగి, మా నాన్న పనిచేస్తున్న  ఏలూరు కాలేజీలో చేరారు. తాను ఎంతటి ఉద్రిక్త పరిస్థితులలో హైదరాబాద్‌ వదిలివచ్చిందీ ఆయన చెప్పేవాడు.  మా కుటుంబం ఏలూరు నుంచి తెలంగాణ తిరిగిరాగానే, మా నాన్న తన కాలేజీలో ఒక వెకన్సీ ఏర్పడితే, ఆయనను తెలంగాణ రప్పించుకున్నారు. తెలంగాణవాది అయినప్పటికీ,మా నాన్న సహోద్యోగి విషయంలో సానుభూతితోనే వ్యవహరించారు. చేదు అనుభవం ఎదురయి ఎక్కువ కాలం కాకపోయినా, ఆయన కూడా నిర్భయంగా తిరిగి తెలంగాణ వచ్చారు.

తెలంగాణ వైపు నుంచి కోస్తాంధ్ర, రాయలసీమకు వెళ్లి నివసించే ప్రక్రియ ఇప్పటికీ మందకొడిగానేఉన్నది, ఆ ప్రాంతాలనుంచి తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడే వారి సంఖ్య పెరిగిపోతూనే వచ్చింది. ప్రధానంగా విద్యా, ఉద్యోగ అవకాశాలలో వివక్షను ప్రశ్నిస్తూ 1969 ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం లేవనెత్తిన సమస్యకు సమాధానాలు దొరకలేదు కానీ, అది మరిన్ని రంగాలకు విస్తరించి నాలుగుదశాబ్దాలలో విశ్వరూపం ధరించింది.  ఇప్పటి ఉద్యమం వ్యవస్థాగత వివక్షను, విధానపరమైన పక్షపాతాన్ని, సాంస్కృతికమైన విభిన్నతను ముందుకు తెచ్చింది.

ఈ ఉద్యమంలో చిహ్నాలే తప్ప మనుషులు ప్రతికూల లక్ష్యాలు అయ్యే అవకాశం ఉండకూడదు. విభజన కారణంగా తమకు ఎదురయ్యే న్యాయమైన సమస్యలను చర్చకు పెట్టి వాటి పరిష్కారాన్నిడిమాండ్‌ చేయడం కాకుండా, ప్రత్యేక రాష్ట్రాన్నే వ్యతిరేకిస్తూ "సమైక్యాంధ్ర'  ఉద్యమాన్ని రాజకీయవాదులు ప్రోత్సహించడం వల్ల - తమ డిమాండ్‌నెరవేరే సమయం వచ్చినప్పుడు అవరోధం కల్పిస్తున్నారన్న భావన తెలంగాణవాదులలో ఏర్పడింది. ఈ భావన సహజంగానే ఉద్రేకాలకు దారితీస్తుంది.  ఉద్యమం తీవ్రతతో, దానికి ఇతర ప్రాంతాలలో వచ్చిన వ్యతిరేకత స్థాయితో పోలిస్తే, పౌరఘర్షణలు పెద్దసంఖ్యలో జరిగే ప్రమాదం ఉండింది. కానీ,  ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకున్న విద్యార్థులు ఎంతో పరిపక్వతతో, అవగాహనతో, సహనంతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రవర్తనే తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన ఇతర ప్రాంతాల వారికి శ్రీరామరక్షగా ఉన్నది. స్వయంగా వివక్షకు గురిఅయిన వారెవరూ ఇతరులను వివక్షకు గురి చేయరు.  ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు తాము పరాయిలవుతామని భయపడుతున్నారు కానీ, మా ఇంట్లోనే మేం పరాయివారిగా మారిపోతుంటే ఎవరూ మా రక్షణకు రాలేదేమి? - అని విద్యార్థులు వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.

Thursday, December 24, 2009

ద్వేషభాష తగదు


దుఃఖం కలుగుతున్నది. ఇంత హింస, ఇంత ఉద్రిక్తత, ఇంత విద్వేషం- ఇటీవలి కాలంలో ఎన్నడూ తెలుగుసమాజంలో విస్తరించలేదు. వైపరీత్యాలతోనో దుర్ఘటనలతోనో ఉగ్రబీభత్సాలతోనో పోల్చినప్పుడు నెత్తురోడింది తక్కువే కావచ్చు, ప్రాణనష్టం అధికంగా జరిగి ఉండకపోవచ్చు. కానీ, మనుషుల మధ్య ప్రాంతాల మధ్య వ్యాపించిన వైమనస్యం కలిగించే నష్టం విపరీతంగా ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుంది. ఎంతటి సంక్షోభంలోనూ సంఘర్షణలోనూ మనుషులు నిలుపుకోవలసిన శాశ్వత కనీస విలువలు కొన్ని ఉంటాయి.ఇప్పుడు జరుగుతున్నది చూస్తున్నప్పుడు- మనుషులుగా హీనపడవలసిన, న్యూనత చెందవలసిన స్థితికి వెడుతున్నామేమోనని ఆందోళన కలుగుతున్నది.

రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల మంచిచెడ్డల గురించి మాట్లాడడంలేదు. అన్యమనస్కంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంతర్భాగమైనప్పటినుంచి తరచు వివక్షను ప్రశ్నిస్తున్న, ఒకసారి నెత్తురోడిన తెలంగాణ ఉద్యమం నిర్హేతుకమైనదని, అన్యాయమైనదని ఎవరూ అనలేరు. అయిష్టంగానే మొదట కోస్తాంధ్రతో జతకట్టవలసి వచ్చిన రాయలసీమ విశాలాంధ్రలో కుదుటపడ్డ వేళ, కథ మళ్లీ మొదటికి వస్తే కలిగే ఆందోళనను ఎవరూ కాదనలేరు. అరవయ్యేళ్ల ఉమ్మడిరాష్ట్రంతో అనుబంధం పెంచుకున్న కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాలు విభజన కారణంగా తెగిన గాలిపటాలమవుతామని, తెలంగాణలో పరాయివారమవుతామని కలవరపడడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. నేటి పరిస్థితులకు గత అరవయ్యేళ్ల ప్రభుత్వాలు పాలకులతో పాటు, మనచేతిలో లేని చరిత్ర పరిణామం కూడా కారణం. సామాన్య ప్రజలు ఒకరినొకరు నిందించుకోవలసిన సమస్యలు కావు. పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోవలసినవి. ఉమ్మడి కుటుంబం విడిపోవలసిన పరిస్థితి రావడం కుటుంబసభ్యులెవరికీ సంతోషదాయకం కాదు. వేరుపడవలసి వచ్చినా మనసుల మధ్య అనుబంధాన్ని నిలుపుకోవాలనుకోవడమే పరిణతి.

గత నెల చివరి రెండు రోజుల నుంచి ఉధృతమైన తెలంగాణ ఉద్యమంలో ఆందోళనకారులు ఆంధ్రప్రాంతానికి సంబంధించినవని భావించిన చిహ్నాలపై దాడులు చేశారు. సమైక్యరాష్ట్రానికి పొట్టిశ్రీరాములును చిహ్నంగా భావించి, ఆయన విగ్రహాలను పాడుచేశారు. నిజానికి ఆయనకూ విశాలాంధ్రకూ ఎటువంటి సంబంధం లేదు. మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు ఆయన. ఆయన బలిదానం కారణంగానే భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల స్థాపన వేగవంతమైంది. తెలంగాణ ఉద్యమం భాషాప్రయుక్త రాష్ట్ర భావనకు వ్యతిరేకమైనది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దేశంలో రెండు తెలుగుభాషారాష్ట్రాలుంటాయి అంతే. ఇప్పుడు సమైక్యవాదం పేరుతో ఆందోళన చేస్తున్న రాయలసీమ, కోస్తాంధ్ర ఉద్యమకారులు సైతం పొట్టిశ్రీరాములును చిహ్నంగా స్వీకరించడం ఆశ్చర్యం. అది కూడా అచారిత్రకం. తెలంగాణవాదులు ఆయన విగ్రహాలపై దాడులు చేశారు కాబట్టి, అవతలిపక్షం వారు ఆయనను ప్రతీకగా స్వీకరిస్తున్నట్టు కనిపిస్తున్నది. నలభయ్యేళ్ల కిందటి తెలంగాణ ఉద్యమం కాలంలో ముఖ్యమంత్రిగా ఉండి, అణచివేతకు కారకులైన బ్రహ్మానందరెడ్డి విగ్రహాలను లక్ష్యంగా పెట్టుకుని చేసిన దాడులు కూడా నివారించదగ్గవి. చారిత్రక విషాదాలను సాధ్యమైనంతగా సుప్తావస్థలోనే ఉంచడం మంచిది. బ్రహ్మానందరెడ్డిని ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మహానాయకుడిగా ఎవరూ పరిగణించడం లేదు. కాలగర్భంలో కలసిపోయిన నాయకుడి స్మ­ృతిని పనిగట్టుకుని మలినపరచడం అనవసరం. అలాగే, 'ఆంధ్ర' అన్న మాట మీదనే ద్వేషం చూపిస్తూ వివిధ చారిత్రక సంస్థల పేర్లను మార్చడానికి ప్రయత్నించడం దుందుడుకు చర్యగానే భావించాలి. అలాగే, తెలంగాణ ఉద్యమనాయకుడు స్వయంగా ఇచ్చిన 'ఆంధ్రావాలే భాగో' నినాదం సైతం వాంఛనీయం కాదు. నలభయ్యేళ్ల కిందటి ఉద్యమం స్వరూపస్వభావాలు వేరు. అప్పుడు ఉద్యోగావకాశాలను ఇతరులు హరించుకుపోవడం మీదనే ఉద్యమం ప్రధానదృష్టి ఉండింది. ఇప్పుడు ఇరిగేషన్‌, అభివృద్ధి నమూనా, భూముల అన్యాక్రాంతం వంటి అనేక పెద్ద అంశాలను తెలంగాణవాదం ముందుకు తెచ్చింది. వివక్షను విధానంగా కొనసాగిస్తున్న ప్రభుత్వాలు తప్ప, వ్యక్తులు ఉద్యమానికి లక్ష్యం కానక్కరలేదు. పెద్ద పెట్టుబడిదారులను, భూకబ్జాదారులను ఉద్దేశించి మాత్రమే తామా నినాదం ఇచ్చామని టిఆర్‌ఎస్‌ పార్టీ చెబుతున్నప్పటికీ, తెలంగాణలో స్థిరపడిన సాధారణ, మధ్యతరగతి ఆంధ్రులు సైతం భయాందోళనలకు గురిఅయ్యారు. వారిని స్థానికులుగానే సమానులుగానే పరిగణిస్తామని ఉద్యమనేతలు పదే పదే చెబుతున్నప్పటికీ, ఆ హామీ ఒక్కటే చాలదు. అటువంటి నినాదాలను విరమించుకోవడం కూడా చేయాలి.

విడిపోతామని చెబుతున్నవారికి ఇతరుల మీద ఫిర్యాదులుంటాయి. కాబట్టి, వారు నోరు జారవచ్చు, విమర్శించవచ్చు. కానీ, కలసి ఉందామని చెబుతున్న సమైక్యవాదులకు ఆ వెసులుబాటు లేదు. వారు ఎవరితో కలసిఉండాలనుకుంటున్నారో వారిని ఉద్దేశించి సామరస్యపూర్వకంగా మాట్లాడాలి. వారిని అవమానపరచకూడదు. ప్రత్యేక వాదుల కోరిక తీరాలంటే ప్రభుత్వాలు తలచుకుంటే సరిపోతుంది. కానీ, సమైక్యతను కోరుకునేవారి ఆకాంక్ష తీరాలంటే వేర్పాటు కోరే ప్రజల సహకారం కూడా కావాలి. ఏ కారణాల చేత వేర్పాటు భావన కలిగిందో తెలుసుకుని, ఆ కారణాలను తొలగిస్తామని అభయం ఇవ్వాలి. కానీ, ఇప్పుడు ఆంధ్రా, రాయలసీమల్లో జరుగుతున్న ఆందోళనలు తెలంగాణవాదులను, ప్రత్యేక రాష్ట్ర భావనను అవమానించే తీరులో సాగడం విచారకరం. ప్రత్యేక రాష్ట్రం గురించిన ఒక కీలక ప్రకటననైనా సాధించిన నాయకుడిగా ప్రాంత ప్రజలందరూ ప్రత్యేకంగా పరిగణించే వ్యక్తిని రకరకాలుగా అవహేళన చేయడం తెలంగాణవాసులలోఎటువంటి భావనను కలిగిస్తుందో ఆందోళనకారులు గమనించాలి. 'సమైక్యవాద' రాజకీయ నాయకులు తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి- వారికి సభ్యత లేదని, వ్యవసాయం తెలియదని, విద్య తక్కువని - అవన్నీ తామే సమకూర్చామన్న రీతిలో మాట్లాడడం సోదరుల మధ్య సుహృద్భావాన్ని పెంచే ధోరణి కాదు. అలాగే, తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన ప్రాంతేతరుల భద్రత గురించి పదే పదే మాట్లాడుతూ, ఆ వర్గాలలో భయాందోళనలను పెంచడం కూడా వాంఛనీయం కాదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా రాకపోయినా ఎక్కడి ప్రాంతం వారైనా ఇతర ప్రాంతీయులతో సఖ్యతగా ఉండగలగాలి. ఉద్యమ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒకరు 'భాగో' అన్నా, మరొకరు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించినా అది దీర్ఘకాలికంగా అశాంతినే సృష్టిస్తుంది. సంక్షోభం ఆవరించిన ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మాటను ఆచి తూచి మాట్లాడాలి.

ఉద్యమాలు ఎలా సాగినా, తెలుగువారిగా భారతీయులుగా మనందరం సోదరులమన్న సంగతి మరచిపోకూడదు. మనం గొప్పదని, తియ్యదని చెప్పుకునే తెలుగు భాషను ద్వేషభాషగా మార్చుకోగూడదు.

Wednesday, December 23, 2009

చిదంబరం చిచ్చు-2

ఈ దేశాన్ని పాలిస్తున్న నేతలకు కించిత్‌ వివేకమూ ప్రజాహిత దృష్టీ ఉంటే నేడు రాష్ట్రంలో పరిస్థితులు ఈ స్థితికి వచ్చేవి కావు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరుమాసాలలోనే రాష్ట్రప్రభుత్వం సంక్షోభంలో పడిపోయి, రాష్ట్రపతిపాలన దిశగా పరిణామాలు సాగుతున్నాయి. గత నెల 29 వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె.చంద్రశేఖరరావు ఆమరణదీక్ష ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వయంత్రాంగం స్పందన, పాలన జరుగుతున్న తీరు అన్యాయంగా ఉన్నాయి. పోలీసుబలగాలు తప్ప ప్రభుత్వం ఎక్కడా కనిపించడం లేదు. చంద్రశేఖరరావు దీక్షతో పాటు ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ విద్యార్థుల ఉద్యమం, వివిధ వర్గాల నుంచి దానికి అందిన దోహదం కారణంగా రెండు వారాల కిందట కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామని, అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెడతామని చిదంబరం చేసిన ప్రకటన తెలంగాణలో ఆనందోత్సాహాలను నింపగా, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భిన్నమైన, తీవ్రమైన ప్రతిస్పందనలను కలిగించింది. రాష్ట్ర విభజన వంటి కీలకమైన నిర్ణయాన్ని అర్థరాత్రివేళ, హడావుడిగా మూడుముక్కలలో ప్రకటించడం- తెలంగాణేతర ప్రాంతాలలో ఆందోళనను రగిలించింది. ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేశారు. పార్టీలు నిలువునా చీలిపోయాయి. అక్కడ కూడా విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. చిదంబరం ప్రకటనకు సవరణ కావాలని, దిద్దుబాటు ప్రకటన వస్తేనే ఆందోళనలను విరమిస్తామని ఉద్యమనేతలు చేస్తున్న హెచ్చరికలకు కొద్దిరోజులుగా కేంద్రప్రభుత్వం మెత్తబడింది. ఏదో ఒక ప్రకటన చేసి ఉద్యమాలను శాంతింపజేయాలన్న ఆలోచనతో, మాటలతో కుస్తీపట్టి ప్రకటన కసరత్తు పూర్తిచేసింది. చిదంబరం మొదటి ప్రకటన ఒక చోట చిచ్చును చల్లార్చి, మరోచోట రగిలించగా, రెండో ప్రకటన అక్కడ చల్లార్చి, ఇక్కడ చిచ్చు రగలడానికి కారణమవుతున్నది. బుధవారం నాడు తెలంగాణ అంతటా మళ్లీ నిరసనలతో భగ్గుమన్నది. ప్రజాప్రతినిధుల రాజీనామాల పరంపర మొదలయింది. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఒక్కటవుతున్నారు.

రాష్ట్రాన్ని విభజించాలని, ఒక్కటిగా ఉంచాలని ఉద్యమిస్తున్న రెండు భిన్నమైన వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం సులభమేమీ కాదు. కేంద్రప్రభుత్వం ముందున్న సవాల్‌ చిన్నదేమీ కాదు. కానీ, మొదటినుంచీ కూడా ఈ సమస్యను కేంద్రం ఒక క్రీడగానే చూసింది తప్ప, అసంఖ్యాకమైన ప్రజల మనోభావాలతో, ఆవేశకావేశాలతో ముడిపడి ఉన్న ఒక చారిత్రక సమస్యగా పరగిణించలేదు. సమైక్యవాదులు భావిస్తున్నట్టు తెలంగాణ సమస్య గత నవంబర్‌29 నాడు పుట్టుకువచ్చినది కాదు. దీర్ఘకాలం నలుగుతూ ఉన్న ఒక సమస్యపై కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు- అందుకు సమాజాన్ని సంసిద్ధం చేయడం, పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహం రూపొందించడం కేంద్రం చేసి ఉండవలసింది. రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రం లో నెలకొని ఉన్న ప్రత్యేకపరిస్థితుల కారణంగా, కేంద్రం ఏకపక్షంగా తానే ప్రత్యక్ష ఏలికనన్నట్టు వ్యవహరిస్తూ వచ్చింది. ఆ ధోరణిలోనే డిసెంబర్‌9 అర్థరాత్రి సమయంలో చిదంబరం ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రావతరణ కనుచూపుమేరలోకి వచ్చిందన్నట్టుగా చిదంబరం చేసిన ప్రకటన- ఇంతకాలం తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకోకుండా అలక్ష్యం చేసిన సీమాంధ్ర ప్రాంతవాసులు ఒక్కసారిగా మేలుకునేట్టు చేసింది. రాష్ట్ర విభజన జరిగితే ఎదురయ్యే పర్యవసానాలు- వాస్తవమైనవో, వారి భయాందోళనలనుంచి జనించినవో- ఒక్కసారిగా కళ్లెదుట కనిపించసాగాయి. ప్రజాప్రతినిధుల, రాజకీయపక్షాల పోటాపోటీ స్పందనలు సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నికి ఆజ్యం పోశాయి. డిసెంబర్‌ నెల మొదటి పదిరోజులలో ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని మీడియాలో చూసిన ఇతరప్రాంతాలప్రజలు ఏమనుకున్నారో తెలియదు కానీ, చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణేతర ప్రాంతాలలో జరిగిన ఆందోళనను తెలంగాణవాదులు ఉత్కంఠతో,భయంతో గమనించారు. చిరకాల స్వప్నాన్ని అడ్డుకునే ప్రయత్నంజరుగుతోందన్న కలవరానికి గురి అయ్యారు. దిద్దుబాటు ప్రకటన పేరుతో కేంద్రం సమస్యను తిరిగి మొదటికి తెస్తుందని భయపడ్డారు. కాంగ్రెస్‌ కోర్‌కమిటీ ఎంతటి జాగ్రత్త తీసుకుని రెండో ప్రకటనను రూపొందించినప్పటికీ, అది తమకు వ్యతిరేకమైనదని తెలంగాణవాదులు భావించారు. తక్షణం ప్రతిస్పందించారు.

ఈ సంక్షోభానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరి తక్షణకారణమన్నది నిజమే అయినప్పటికీ, రాష్ట్రంలోని వివిధ రాజకీయపక్షాల అవకాశవాద వైఖరే అసలు కారణమన్నది స్పష్టం. మలివిడత తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటినుంచి, ఆ సమస్యను ఎన్నికల అంశంగా వాడుకోవడంలో కాంగ్రెస్‌దే పెద్దపీట. తరువాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనాయకుడి హోదాలోనే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలసమీకరణకు వినియోగించుకున్నారు. 2004లో తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తుపెట్టుకోవడం, ఉమ్మడి కనీస కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం, రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాలలో ప్రస్తావించడం- కాంగ్రెస్‌ ఈ సమస్యను ఎట్లా వినియోగించుకుందో తెలియజేస్తాయి. 2009 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ అనుకూల పక్షాలలోచేరిపోయింది. కొత్తగా అవతరించిన ప్రజారాజ్యం పార్టీ కూడా అటూ ఇటూ కాని ' సామాజిక తెలంగాణ' నినాదాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన సభానాయకుల సమావేశంలో ఈ రెండు పార్టీలూ తెలంగాణ తీర్మానానికి సానుకూలతను వ్యక్తంచేసి, చిదంబరం ప్రకటన వచ్చిన తరువాత మాట మార్చారు. ప్రత్యేకరాష్ట్ర నినాదాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తున్న సిపిఎం వంటి పార్టీలపై ఎటువంటి క్రియాశీల వ్యతిరేకత చూపించని తెలంగాణవాదులు ఈ పార్టీ ల విషయంలో ఆగ్రహావేశాలకు లోనుకావడం- వారి ద్వంద్వ వైఖరి కారణంగానే. ఒక సమస్యను రాజకీయలబ్ధి కోసం బంగారుబాతు వలె వాడుకోవడం- తెలంగాణ ప్రజలను తీవ్రంగా గాయపరిచింది. బుధవారం నాటి చిదంబరం ప్రకటనను- మరో దగాగా భావించడం వల్లనే తెలంగాణ మళ్లీ భగ్గుమన్నది.

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ మంచిచెడ్డలేమైనప్పటికీ, ప్రజల ఆకాంక్షలతో వ్యవహరించవలసిన పద్ధతి ఇది కాదు. తెలంగాణ విషయంలో నామమాత్రపు మద్దతు తెలిపితే సరిపోతుందనుకున్న పెద్దలు, తమకు ఇతర ప్రాంతాలలో కూడా ప్రయోజనాలున్నప్పుడు అక్కడి ప్రజలను కూడా విశ్వాసంలోకి తీసుకుని నచ్చచెప్పవలసిన బాధ్యత ఉంటుంది. ప్రజాప్రతినిధులు ప్రజాకాంక్షలను ప్రతిఫలించడంలో రెండు ప్రాంతాలలోనూ విఫలమయ్యారు. శుష్క అవకాశవాదాన్ని మాత్రమే ప్రదర్శించారు. ఇప్పుడు రగులుతున్న హింసాద్వేషాలకు ప్రధాన బాధ్యులు ఈ పార్టీల నేతలే. ఇప్పటికైనా, సమస్యను ప్రజాసమస్యగా గుర్తించి ప్రజలతో సంభాషణ ప్రారంభించాలి. ఆవేశకావేశాలను రగిలించడం కాక, న్యాయాన్యాయాలను పరిగణించి జనాభిప్రాయాన్ని తీర్చిదిద్దాలి. నేడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజల మధ్య నెలకొన్ని అపోహలు, ద్వేషభావాలు తెలంగాణ ఉద్యమం నడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ ఇంత తీవ్రంగా లేవు. గత నెలరోజుల కాలంలో మాత్రమే ఇవి పెరిగిపోయాయి. ప్రజల మధ్య మానసికమైన అడ్డుగోడలు ఏర్పడిపోయాయి. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, రెండు రాష్ట్రాలైనా- ఈ అడ్డుగోడలను రూపుమాపడం మాత్రం అవసరం. ప్రజల ఉద్వేగాలతో చెలగాటమాడడం రాజకీయపక్షాలూ ప్రభుత్వాలూ ఇకనైనా మానుకోవాలి.

Monday, December 21, 2009

సంకేతస్థలం

సత్తుపల్లి తిరుగుదారిలో మళ్లీ ఆ బోర్డు పలకరించింది. వేంసూరు 12 కిలోమీటర్లు. విశాలంగా పరచుకున్న రహదారి నుంచి ఒక సన్నటి రోడ్డు. దాని మీద చాపిన చూపు కొంత దూరం సాగి, విరిగిపోయింది. కుతూహలాన్ని భయం జయించింది. స్ప­ృశించలేను ఆ జ్ఞాపకాన్ని. చిరముద్రితమైన చిత్రాలను వాస్తవంతో సరిచూసుకోలేను.

ఆ ఊరు మారి ఉండవచ్చు. నా దగ్గర ఉన్న పటం చెదిరిపోయి ఉండవచ్చు. ఎన్ని అంగుళాల దుమ్మును చెరిపినా నా పేరు కనిపించకపోవచ్చు. ఆ ఊరు మారకనూ పోవచ్చు. నాలాంటి వారెందరో వెళ్లిపోయి వుట్టి ఊరు మిగిలి ఉండవచ్చు.

అస్పష్టమైన అసమాపకమైన అనేక మసక మసక ఛిద్రదృశ్యాలు కోలేజ్‌. లేయర్లను విడదీయలేను. మోసుకు తిరుగుతున్న అతిబాల్యపు సద్దిమూటను రావిచెట్టు సెంటర్‌లో విప్పలేను. ఆ బండల మీద పులిజూదం ఆడానో ఊరు ఊరంతా ఇల్లుగా తిరిగానో బడివెనుక మావిడితోటలో ఆటలాడానో పి ఎల్‌ 480 గోధుమ రవ్వ ఉప్మా పారేసివచ్చానో చెరువుగట్టున కోడిపందేలు చూశానో- ఆనవాళ్లెవరికి చూపగలను? తరాలు మారి మరో సజీవతలో తొణికిసలాడే ఆ పల్లెటూరులోని నా స్మ­ృతిశిథిలాలను ఎక్కడని వెదకను? చంద్రమౌళిశాస్త్రి ఆనుకుని రాసుకునే వసారా స్తంభం ఇప్పుడుందో లేదో ప్రతిరోజూ తియ్యటి లేహ్యంతో నన్ను ముద్దుచేసిన ఆయుర్వేద డాక్టర్‌ ఇప్పుడేమయ్యారో నాకే గుర్తులేని శంకరం గారి అబ్బాయికి నా పేరు గుర్తుందో లేదో? బహుశా, మొహమాటంగా బెరుకుబెరుకుగా ఆ ఊరు నన్ను తప్పుకు తిరుగుతుంది, పేర్లుగానో, డాబామీది ఆటలుగా, నలిగిన పేర్లుగానో మెదిలే రావుడూభీముడూకృష్ణుడూ కాలం విసిరిన కందకం ఆవల అపరిచితంగా కనిపిస్తారు.

ఒక్క ఊరు కాదు. ఎక్కడికక్కడ వేళ్లతో సహా పెకిలించుకుని, మళ్లీ మరోచోట పాదుగా మారి- జ్ఞాపకాలు పందిరిగా అల్లుకోనేలేదు. మళ్లీ కలుస్తామన్న వాగ్దానం ఎక్కడా లేదు. తిరిగి రమ్మన్న ఆహ్వానమూ లేదు.

స్థలకాలాలు మనల్ని దూరంగా విసిరేయడం ఏదో ఒక్క దశలోనే జరగదు. ఎవరి ప్రామిస్డ్‌ ల్యాండ్‌ దిశగా వారి పయనం జరుగుతూనే ఉంటుంది. జారిపోయేవారు, ఆరిపోయేవారు, ఆగిపోయేవారు, మరోదారిలోకి మళ్లేవారు ఉంటూనే మహాప్రస్థానం పొడువునా ఉంటారు. మనసు బెంగపడినా, కాలం నిర్దాక్షిణ్యంగా మనల్ని ఏదో ఒకవైపు లాగివేస్తుంది. జీవం నిండిన సాహచర్యంలో ఎడబాటు తీవ్రమైన దుఃఖాన్నీ బెంగనూ మిగులుస్తుంది. లోలోపలే చచ్చిపోయిన మానవసంబంధం లాంఛనం పూర్తిచేసుకుంటే, నిర్లిప్తత మిగులుతుంది. సప్తసముద్రాలు ఆవల ఉన్నా, విరహం జ్వలించవచ్చు. సముఖంలోనే ఉన్నా స్పర్శలు గాజుతెరలకు తగిలి పరావర్తనం చెందవచ్చు.

అసంబంధం నేటి యుగధర్మం. అందుకే, మనుషులు తమకు తెలిసిన దానినుంచి, తెలియని దాని నుంచి, వాస్తవమైనదానినుంచి, ఊహలనుంచి కూడా ఎడబాటు అనుభవిస్తున్నారు. సంబంధీకుల కోసం కులంలో, మతంలో, ధర్మంలో, సంస్క­ృతిలో, గతంలో వెదుక్కుంటున్నారు. ఏదో తాదాత్మ్యాన్ని, మమేకతను మనసుకు అందించే ఒక రీయూనియన్‌ కోసం తపించిపోతున్నారు. ప్రవాసుల కోసం ఎయిర్‌పోర్టుల్లో, రైల్‌స్టేషన్లలో వినిపించే వీడ్కోలు స్వాగత రోదనలు మానవీయ అగాధానికి అతి సాధారణ వ్యక్తీకరణ. నెత్తురూ కన్నీళ్లూ శరీరశకలాలూ రకరకాల విరహాల పరమరూపాలు. ప్రేమనుంచి, తన తనం నుంచి విడివడ్డ మనిషి, తన బెంగ తీరే సంకేతస్థలాన్ని కాలంలో అన్వేషిస్తున్నాడు. కేవలం తన మనసులో మాత్రమే ఉన్న జ్ఞాపకాన్ని లేదా నిర్మిత జ్ఞాపకాన్ని వాస్తవంలోకి అనువదించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన ఉనికికి న్యాయం జరగడమే పునస్సమాగమం.

నాగరికత అంటే విసిరివేయడమే, విడదీయడమే. అభివృద్ధి అంతా మనిషి వేళ్లను కత్తిరించి వెంటిలేటర్లు బిగించడమే. ఒకరి మాట మరొకరికి అర్థం కాకుండా శపించింది దేవుడు కాదు. అన్‌జాన్‌ ముఖాల మధ్య, రూపాయిది మాత్రమే ముఖచిత్రం. పొట్టచేతిలోకి వచ్చాక, తల్లిపేగును విదిలించుకోవలసిందే, స్కూళ్లనుంచి, కాలేజీల నుంచి, ఉద్యోగాల నుంచి, ఊర్ల నుంచి, దేశాల నుంచి వెళ్లిపోతున్నప్పుడల్లా ఒక అనుభవసంపుటిని ఖననం చేయవలసిందే. బెంగటిల్లీ బెంగటిల్లీ కొత్త రంగస్థలంలోకి వెళ్లవలసిందే. కొత్త విషయాలు, కొత్త సందర్భాలు, కొత్త స్నేహాలు జీవితాన్ని సంపన్నం చేయవలసిందే. బతుకు లోపలిపొరల్లోనుంచి సరికొత్త అనుభవాలను వెలికితీయవలసిందే. తెలుసుకున్న కొత్త సత్యాలను పాతనేస్తాలతో కలబోసుకోవలసిందే. గాయాలను, గేయాలను, సంపాదించుకున్న రత్నాలను పరస్పరం ప్రదర్శించుకోవలసిందే. కలబోత లేనప్పుడు ఇన్ని కలలు అనవసరం. ఆకాశంతో పాటు, నేలలోకి కూడా చొచ్చుకుపోనప్పుడు చెట్టు ఎవరికి ఆదర్శం?

సమాజాలు, సమష్టి సమూహాలు స్వప్నించే సమాగమాలు సాధించుకోవలసినవే. 'భవితవ్యంతో భేటీ' ఏ అర్ధరాత్రి రాసిపెట్టి ఉందో ఎవరికి ఎరుక? ఈ లోగా వ్యక్తులు ఎవరి వియోగాలను వారే దుఃఖించాలి. ఎవరి దూరాలను వారే చెరిపేసుకోవాలి. దూరమో కాలమో మనుషుల మధ్య అగడ్తగా మారకుండా, అప్పుడప్పుడు తారసపడాలి.

మళ్లీ కలుసుకోవడం బాగుంటుంది. దశకుమారుల వలె దశదిశలకు వెళ్లి లోకానుభవం గడించి, తిరిగి ఒక సంకేతస్థలంలో కలుసుకోవడం బాగుంటుంది. పన్నెండేళ్ల కొకసారి నదీపుత్రులంతా పుష్కరసమాగమం జరుపుకోవడం బాగుంటుంది. ఒక్కసారి జీవించిన ప్రతి క్షణాన్నీ స్థలాన్నీ తిరిగి తిరిగి జీవించడం బాగుంటుంది. తెలిసినచోట తప్పిపోయి తెలియనిచోట దొరికిపోవడం బాగుంటుంది. జ్ఞాపకంతో ముఖాముఖీ చేయగల ధైర్యం ఉన్నప్పుడు, దాన్ని ఎత్తుకుని ముద్దాడే మనసు న్నప్పుడు జ్ఞాపకంలోకి వెళ్లడమే బాగుంటుంది. ఎడబాటు తడబాటై, మనసు పూర్తిగా రివైండ్‌ కాలేదనుకో, పాతస్నేహం ఫిర్‌సే అజ్నబీ కావడం ఎంత బాగుంటుంది?