Wednesday, December 23, 2009

చిదంబరం చిచ్చు-2

ఈ దేశాన్ని పాలిస్తున్న నేతలకు కించిత్‌ వివేకమూ ప్రజాహిత దృష్టీ ఉంటే నేడు రాష్ట్రంలో పరిస్థితులు ఈ స్థితికి వచ్చేవి కావు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరుమాసాలలోనే రాష్ట్రప్రభుత్వం సంక్షోభంలో పడిపోయి, రాష్ట్రపతిపాలన దిశగా పరిణామాలు సాగుతున్నాయి. గత నెల 29 వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె.చంద్రశేఖరరావు ఆమరణదీక్ష ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వయంత్రాంగం స్పందన, పాలన జరుగుతున్న తీరు అన్యాయంగా ఉన్నాయి. పోలీసుబలగాలు తప్ప ప్రభుత్వం ఎక్కడా కనిపించడం లేదు. చంద్రశేఖరరావు దీక్షతో పాటు ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ విద్యార్థుల ఉద్యమం, వివిధ వర్గాల నుంచి దానికి అందిన దోహదం కారణంగా రెండు వారాల కిందట కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామని, అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెడతామని చిదంబరం చేసిన ప్రకటన తెలంగాణలో ఆనందోత్సాహాలను నింపగా, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భిన్నమైన, తీవ్రమైన ప్రతిస్పందనలను కలిగించింది. రాష్ట్ర విభజన వంటి కీలకమైన నిర్ణయాన్ని అర్థరాత్రివేళ, హడావుడిగా మూడుముక్కలలో ప్రకటించడం- తెలంగాణేతర ప్రాంతాలలో ఆందోళనను రగిలించింది. ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేశారు. పార్టీలు నిలువునా చీలిపోయాయి. అక్కడ కూడా విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. చిదంబరం ప్రకటనకు సవరణ కావాలని, దిద్దుబాటు ప్రకటన వస్తేనే ఆందోళనలను విరమిస్తామని ఉద్యమనేతలు చేస్తున్న హెచ్చరికలకు కొద్దిరోజులుగా కేంద్రప్రభుత్వం మెత్తబడింది. ఏదో ఒక ప్రకటన చేసి ఉద్యమాలను శాంతింపజేయాలన్న ఆలోచనతో, మాటలతో కుస్తీపట్టి ప్రకటన కసరత్తు పూర్తిచేసింది. చిదంబరం మొదటి ప్రకటన ఒక చోట చిచ్చును చల్లార్చి, మరోచోట రగిలించగా, రెండో ప్రకటన అక్కడ చల్లార్చి, ఇక్కడ చిచ్చు రగలడానికి కారణమవుతున్నది. బుధవారం నాడు తెలంగాణ అంతటా మళ్లీ నిరసనలతో భగ్గుమన్నది. ప్రజాప్రతినిధుల రాజీనామాల పరంపర మొదలయింది. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఒక్కటవుతున్నారు.

రాష్ట్రాన్ని విభజించాలని, ఒక్కటిగా ఉంచాలని ఉద్యమిస్తున్న రెండు భిన్నమైన వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం సులభమేమీ కాదు. కేంద్రప్రభుత్వం ముందున్న సవాల్‌ చిన్నదేమీ కాదు. కానీ, మొదటినుంచీ కూడా ఈ సమస్యను కేంద్రం ఒక క్రీడగానే చూసింది తప్ప, అసంఖ్యాకమైన ప్రజల మనోభావాలతో, ఆవేశకావేశాలతో ముడిపడి ఉన్న ఒక చారిత్రక సమస్యగా పరగిణించలేదు. సమైక్యవాదులు భావిస్తున్నట్టు తెలంగాణ సమస్య గత నవంబర్‌29 నాడు పుట్టుకువచ్చినది కాదు. దీర్ఘకాలం నలుగుతూ ఉన్న ఒక సమస్యపై కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు- అందుకు సమాజాన్ని సంసిద్ధం చేయడం, పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహం రూపొందించడం కేంద్రం చేసి ఉండవలసింది. రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రం లో నెలకొని ఉన్న ప్రత్యేకపరిస్థితుల కారణంగా, కేంద్రం ఏకపక్షంగా తానే ప్రత్యక్ష ఏలికనన్నట్టు వ్యవహరిస్తూ వచ్చింది. ఆ ధోరణిలోనే డిసెంబర్‌9 అర్థరాత్రి సమయంలో చిదంబరం ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రావతరణ కనుచూపుమేరలోకి వచ్చిందన్నట్టుగా చిదంబరం చేసిన ప్రకటన- ఇంతకాలం తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకోకుండా అలక్ష్యం చేసిన సీమాంధ్ర ప్రాంతవాసులు ఒక్కసారిగా మేలుకునేట్టు చేసింది. రాష్ట్ర విభజన జరిగితే ఎదురయ్యే పర్యవసానాలు- వాస్తవమైనవో, వారి భయాందోళనలనుంచి జనించినవో- ఒక్కసారిగా కళ్లెదుట కనిపించసాగాయి. ప్రజాప్రతినిధుల, రాజకీయపక్షాల పోటాపోటీ స్పందనలు సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నికి ఆజ్యం పోశాయి. డిసెంబర్‌ నెల మొదటి పదిరోజులలో ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని మీడియాలో చూసిన ఇతరప్రాంతాలప్రజలు ఏమనుకున్నారో తెలియదు కానీ, చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణేతర ప్రాంతాలలో జరిగిన ఆందోళనను తెలంగాణవాదులు ఉత్కంఠతో,భయంతో గమనించారు. చిరకాల స్వప్నాన్ని అడ్డుకునే ప్రయత్నంజరుగుతోందన్న కలవరానికి గురి అయ్యారు. దిద్దుబాటు ప్రకటన పేరుతో కేంద్రం సమస్యను తిరిగి మొదటికి తెస్తుందని భయపడ్డారు. కాంగ్రెస్‌ కోర్‌కమిటీ ఎంతటి జాగ్రత్త తీసుకుని రెండో ప్రకటనను రూపొందించినప్పటికీ, అది తమకు వ్యతిరేకమైనదని తెలంగాణవాదులు భావించారు. తక్షణం ప్రతిస్పందించారు.

ఈ సంక్షోభానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరి తక్షణకారణమన్నది నిజమే అయినప్పటికీ, రాష్ట్రంలోని వివిధ రాజకీయపక్షాల అవకాశవాద వైఖరే అసలు కారణమన్నది స్పష్టం. మలివిడత తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటినుంచి, ఆ సమస్యను ఎన్నికల అంశంగా వాడుకోవడంలో కాంగ్రెస్‌దే పెద్దపీట. తరువాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనాయకుడి హోదాలోనే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలసమీకరణకు వినియోగించుకున్నారు. 2004లో తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తుపెట్టుకోవడం, ఉమ్మడి కనీస కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం, రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాలలో ప్రస్తావించడం- కాంగ్రెస్‌ ఈ సమస్యను ఎట్లా వినియోగించుకుందో తెలియజేస్తాయి. 2009 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ అనుకూల పక్షాలలోచేరిపోయింది. కొత్తగా అవతరించిన ప్రజారాజ్యం పార్టీ కూడా అటూ ఇటూ కాని ' సామాజిక తెలంగాణ' నినాదాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన సభానాయకుల సమావేశంలో ఈ రెండు పార్టీలూ తెలంగాణ తీర్మానానికి సానుకూలతను వ్యక్తంచేసి, చిదంబరం ప్రకటన వచ్చిన తరువాత మాట మార్చారు. ప్రత్యేకరాష్ట్ర నినాదాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తున్న సిపిఎం వంటి పార్టీలపై ఎటువంటి క్రియాశీల వ్యతిరేకత చూపించని తెలంగాణవాదులు ఈ పార్టీ ల విషయంలో ఆగ్రహావేశాలకు లోనుకావడం- వారి ద్వంద్వ వైఖరి కారణంగానే. ఒక సమస్యను రాజకీయలబ్ధి కోసం బంగారుబాతు వలె వాడుకోవడం- తెలంగాణ ప్రజలను తీవ్రంగా గాయపరిచింది. బుధవారం నాటి చిదంబరం ప్రకటనను- మరో దగాగా భావించడం వల్లనే తెలంగాణ మళ్లీ భగ్గుమన్నది.

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ మంచిచెడ్డలేమైనప్పటికీ, ప్రజల ఆకాంక్షలతో వ్యవహరించవలసిన పద్ధతి ఇది కాదు. తెలంగాణ విషయంలో నామమాత్రపు మద్దతు తెలిపితే సరిపోతుందనుకున్న పెద్దలు, తమకు ఇతర ప్రాంతాలలో కూడా ప్రయోజనాలున్నప్పుడు అక్కడి ప్రజలను కూడా విశ్వాసంలోకి తీసుకుని నచ్చచెప్పవలసిన బాధ్యత ఉంటుంది. ప్రజాప్రతినిధులు ప్రజాకాంక్షలను ప్రతిఫలించడంలో రెండు ప్రాంతాలలోనూ విఫలమయ్యారు. శుష్క అవకాశవాదాన్ని మాత్రమే ప్రదర్శించారు. ఇప్పుడు రగులుతున్న హింసాద్వేషాలకు ప్రధాన బాధ్యులు ఈ పార్టీల నేతలే. ఇప్పటికైనా, సమస్యను ప్రజాసమస్యగా గుర్తించి ప్రజలతో సంభాషణ ప్రారంభించాలి. ఆవేశకావేశాలను రగిలించడం కాక, న్యాయాన్యాయాలను పరిగణించి జనాభిప్రాయాన్ని తీర్చిదిద్దాలి. నేడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజల మధ్య నెలకొన్ని అపోహలు, ద్వేషభావాలు తెలంగాణ ఉద్యమం నడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ ఇంత తీవ్రంగా లేవు. గత నెలరోజుల కాలంలో మాత్రమే ఇవి పెరిగిపోయాయి. ప్రజల మధ్య మానసికమైన అడ్డుగోడలు ఏర్పడిపోయాయి. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, రెండు రాష్ట్రాలైనా- ఈ అడ్డుగోడలను రూపుమాపడం మాత్రం అవసరం. ప్రజల ఉద్వేగాలతో చెలగాటమాడడం రాజకీయపక్షాలూ ప్రభుత్వాలూ ఇకనైనా మానుకోవాలి.

No comments:

Post a Comment