Monday, December 21, 2009

సంకేతస్థలం

సత్తుపల్లి తిరుగుదారిలో మళ్లీ ఆ బోర్డు పలకరించింది. వేంసూరు 12 కిలోమీటర్లు. విశాలంగా పరచుకున్న రహదారి నుంచి ఒక సన్నటి రోడ్డు. దాని మీద చాపిన చూపు కొంత దూరం సాగి, విరిగిపోయింది. కుతూహలాన్ని భయం జయించింది. స్ప­ృశించలేను ఆ జ్ఞాపకాన్ని. చిరముద్రితమైన చిత్రాలను వాస్తవంతో సరిచూసుకోలేను.

ఆ ఊరు మారి ఉండవచ్చు. నా దగ్గర ఉన్న పటం చెదిరిపోయి ఉండవచ్చు. ఎన్ని అంగుళాల దుమ్మును చెరిపినా నా పేరు కనిపించకపోవచ్చు. ఆ ఊరు మారకనూ పోవచ్చు. నాలాంటి వారెందరో వెళ్లిపోయి వుట్టి ఊరు మిగిలి ఉండవచ్చు.

అస్పష్టమైన అసమాపకమైన అనేక మసక మసక ఛిద్రదృశ్యాలు కోలేజ్‌. లేయర్లను విడదీయలేను. మోసుకు తిరుగుతున్న అతిబాల్యపు సద్దిమూటను రావిచెట్టు సెంటర్‌లో విప్పలేను. ఆ బండల మీద పులిజూదం ఆడానో ఊరు ఊరంతా ఇల్లుగా తిరిగానో బడివెనుక మావిడితోటలో ఆటలాడానో పి ఎల్‌ 480 గోధుమ రవ్వ ఉప్మా పారేసివచ్చానో చెరువుగట్టున కోడిపందేలు చూశానో- ఆనవాళ్లెవరికి చూపగలను? తరాలు మారి మరో సజీవతలో తొణికిసలాడే ఆ పల్లెటూరులోని నా స్మ­ృతిశిథిలాలను ఎక్కడని వెదకను? చంద్రమౌళిశాస్త్రి ఆనుకుని రాసుకునే వసారా స్తంభం ఇప్పుడుందో లేదో ప్రతిరోజూ తియ్యటి లేహ్యంతో నన్ను ముద్దుచేసిన ఆయుర్వేద డాక్టర్‌ ఇప్పుడేమయ్యారో నాకే గుర్తులేని శంకరం గారి అబ్బాయికి నా పేరు గుర్తుందో లేదో? బహుశా, మొహమాటంగా బెరుకుబెరుకుగా ఆ ఊరు నన్ను తప్పుకు తిరుగుతుంది, పేర్లుగానో, డాబామీది ఆటలుగా, నలిగిన పేర్లుగానో మెదిలే రావుడూభీముడూకృష్ణుడూ కాలం విసిరిన కందకం ఆవల అపరిచితంగా కనిపిస్తారు.

ఒక్క ఊరు కాదు. ఎక్కడికక్కడ వేళ్లతో సహా పెకిలించుకుని, మళ్లీ మరోచోట పాదుగా మారి- జ్ఞాపకాలు పందిరిగా అల్లుకోనేలేదు. మళ్లీ కలుస్తామన్న వాగ్దానం ఎక్కడా లేదు. తిరిగి రమ్మన్న ఆహ్వానమూ లేదు.

స్థలకాలాలు మనల్ని దూరంగా విసిరేయడం ఏదో ఒక్క దశలోనే జరగదు. ఎవరి ప్రామిస్డ్‌ ల్యాండ్‌ దిశగా వారి పయనం జరుగుతూనే ఉంటుంది. జారిపోయేవారు, ఆరిపోయేవారు, ఆగిపోయేవారు, మరోదారిలోకి మళ్లేవారు ఉంటూనే మహాప్రస్థానం పొడువునా ఉంటారు. మనసు బెంగపడినా, కాలం నిర్దాక్షిణ్యంగా మనల్ని ఏదో ఒకవైపు లాగివేస్తుంది. జీవం నిండిన సాహచర్యంలో ఎడబాటు తీవ్రమైన దుఃఖాన్నీ బెంగనూ మిగులుస్తుంది. లోలోపలే చచ్చిపోయిన మానవసంబంధం లాంఛనం పూర్తిచేసుకుంటే, నిర్లిప్తత మిగులుతుంది. సప్తసముద్రాలు ఆవల ఉన్నా, విరహం జ్వలించవచ్చు. సముఖంలోనే ఉన్నా స్పర్శలు గాజుతెరలకు తగిలి పరావర్తనం చెందవచ్చు.

అసంబంధం నేటి యుగధర్మం. అందుకే, మనుషులు తమకు తెలిసిన దానినుంచి, తెలియని దాని నుంచి, వాస్తవమైనదానినుంచి, ఊహలనుంచి కూడా ఎడబాటు అనుభవిస్తున్నారు. సంబంధీకుల కోసం కులంలో, మతంలో, ధర్మంలో, సంస్క­ృతిలో, గతంలో వెదుక్కుంటున్నారు. ఏదో తాదాత్మ్యాన్ని, మమేకతను మనసుకు అందించే ఒక రీయూనియన్‌ కోసం తపించిపోతున్నారు. ప్రవాసుల కోసం ఎయిర్‌పోర్టుల్లో, రైల్‌స్టేషన్లలో వినిపించే వీడ్కోలు స్వాగత రోదనలు మానవీయ అగాధానికి అతి సాధారణ వ్యక్తీకరణ. నెత్తురూ కన్నీళ్లూ శరీరశకలాలూ రకరకాల విరహాల పరమరూపాలు. ప్రేమనుంచి, తన తనం నుంచి విడివడ్డ మనిషి, తన బెంగ తీరే సంకేతస్థలాన్ని కాలంలో అన్వేషిస్తున్నాడు. కేవలం తన మనసులో మాత్రమే ఉన్న జ్ఞాపకాన్ని లేదా నిర్మిత జ్ఞాపకాన్ని వాస్తవంలోకి అనువదించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన ఉనికికి న్యాయం జరగడమే పునస్సమాగమం.

నాగరికత అంటే విసిరివేయడమే, విడదీయడమే. అభివృద్ధి అంతా మనిషి వేళ్లను కత్తిరించి వెంటిలేటర్లు బిగించడమే. ఒకరి మాట మరొకరికి అర్థం కాకుండా శపించింది దేవుడు కాదు. అన్‌జాన్‌ ముఖాల మధ్య, రూపాయిది మాత్రమే ముఖచిత్రం. పొట్టచేతిలోకి వచ్చాక, తల్లిపేగును విదిలించుకోవలసిందే, స్కూళ్లనుంచి, కాలేజీల నుంచి, ఉద్యోగాల నుంచి, ఊర్ల నుంచి, దేశాల నుంచి వెళ్లిపోతున్నప్పుడల్లా ఒక అనుభవసంపుటిని ఖననం చేయవలసిందే. బెంగటిల్లీ బెంగటిల్లీ కొత్త రంగస్థలంలోకి వెళ్లవలసిందే. కొత్త విషయాలు, కొత్త సందర్భాలు, కొత్త స్నేహాలు జీవితాన్ని సంపన్నం చేయవలసిందే. బతుకు లోపలిపొరల్లోనుంచి సరికొత్త అనుభవాలను వెలికితీయవలసిందే. తెలుసుకున్న కొత్త సత్యాలను పాతనేస్తాలతో కలబోసుకోవలసిందే. గాయాలను, గేయాలను, సంపాదించుకున్న రత్నాలను పరస్పరం ప్రదర్శించుకోవలసిందే. కలబోత లేనప్పుడు ఇన్ని కలలు అనవసరం. ఆకాశంతో పాటు, నేలలోకి కూడా చొచ్చుకుపోనప్పుడు చెట్టు ఎవరికి ఆదర్శం?

సమాజాలు, సమష్టి సమూహాలు స్వప్నించే సమాగమాలు సాధించుకోవలసినవే. 'భవితవ్యంతో భేటీ' ఏ అర్ధరాత్రి రాసిపెట్టి ఉందో ఎవరికి ఎరుక? ఈ లోగా వ్యక్తులు ఎవరి వియోగాలను వారే దుఃఖించాలి. ఎవరి దూరాలను వారే చెరిపేసుకోవాలి. దూరమో కాలమో మనుషుల మధ్య అగడ్తగా మారకుండా, అప్పుడప్పుడు తారసపడాలి.

మళ్లీ కలుసుకోవడం బాగుంటుంది. దశకుమారుల వలె దశదిశలకు వెళ్లి లోకానుభవం గడించి, తిరిగి ఒక సంకేతస్థలంలో కలుసుకోవడం బాగుంటుంది. పన్నెండేళ్ల కొకసారి నదీపుత్రులంతా పుష్కరసమాగమం జరుపుకోవడం బాగుంటుంది. ఒక్కసారి జీవించిన ప్రతి క్షణాన్నీ స్థలాన్నీ తిరిగి తిరిగి జీవించడం బాగుంటుంది. తెలిసినచోట తప్పిపోయి తెలియనిచోట దొరికిపోవడం బాగుంటుంది. జ్ఞాపకంతో ముఖాముఖీ చేయగల ధైర్యం ఉన్నప్పుడు, దాన్ని ఎత్తుకుని ముద్దాడే మనసు న్నప్పుడు జ్ఞాపకంలోకి వెళ్లడమే బాగుంటుంది. ఎడబాటు తడబాటై, మనసు పూర్తిగా రివైండ్‌ కాలేదనుకో, పాతస్నేహం ఫిర్‌సే అజ్నబీ కావడం ఎంత బాగుంటుంది?

1 comment:

 1. Hi Sir,

  This is Narendra from Vemsoor. Hope you are doing well. Its nice to
  see about Vemsoor in your blog. Can you please let us know more about
  your personal relationship with Vemsoor. I want to create a blog about
  Vemsoor so please share your experiences.

  Thanks
  Narendra Morampudi

  ReplyDelete