Thursday, December 24, 2009

ద్వేషభాష తగదు


దుఃఖం కలుగుతున్నది. ఇంత హింస, ఇంత ఉద్రిక్తత, ఇంత విద్వేషం- ఇటీవలి కాలంలో ఎన్నడూ తెలుగుసమాజంలో విస్తరించలేదు. వైపరీత్యాలతోనో దుర్ఘటనలతోనో ఉగ్రబీభత్సాలతోనో పోల్చినప్పుడు నెత్తురోడింది తక్కువే కావచ్చు, ప్రాణనష్టం అధికంగా జరిగి ఉండకపోవచ్చు. కానీ, మనుషుల మధ్య ప్రాంతాల మధ్య వ్యాపించిన వైమనస్యం కలిగించే నష్టం విపరీతంగా ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుంది. ఎంతటి సంక్షోభంలోనూ సంఘర్షణలోనూ మనుషులు నిలుపుకోవలసిన శాశ్వత కనీస విలువలు కొన్ని ఉంటాయి.ఇప్పుడు జరుగుతున్నది చూస్తున్నప్పుడు- మనుషులుగా హీనపడవలసిన, న్యూనత చెందవలసిన స్థితికి వెడుతున్నామేమోనని ఆందోళన కలుగుతున్నది.

రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల మంచిచెడ్డల గురించి మాట్లాడడంలేదు. అన్యమనస్కంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంతర్భాగమైనప్పటినుంచి తరచు వివక్షను ప్రశ్నిస్తున్న, ఒకసారి నెత్తురోడిన తెలంగాణ ఉద్యమం నిర్హేతుకమైనదని, అన్యాయమైనదని ఎవరూ అనలేరు. అయిష్టంగానే మొదట కోస్తాంధ్రతో జతకట్టవలసి వచ్చిన రాయలసీమ విశాలాంధ్రలో కుదుటపడ్డ వేళ, కథ మళ్లీ మొదటికి వస్తే కలిగే ఆందోళనను ఎవరూ కాదనలేరు. అరవయ్యేళ్ల ఉమ్మడిరాష్ట్రంతో అనుబంధం పెంచుకున్న కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాలు విభజన కారణంగా తెగిన గాలిపటాలమవుతామని, తెలంగాణలో పరాయివారమవుతామని కలవరపడడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. నేటి పరిస్థితులకు గత అరవయ్యేళ్ల ప్రభుత్వాలు పాలకులతో పాటు, మనచేతిలో లేని చరిత్ర పరిణామం కూడా కారణం. సామాన్య ప్రజలు ఒకరినొకరు నిందించుకోవలసిన సమస్యలు కావు. పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోవలసినవి. ఉమ్మడి కుటుంబం విడిపోవలసిన పరిస్థితి రావడం కుటుంబసభ్యులెవరికీ సంతోషదాయకం కాదు. వేరుపడవలసి వచ్చినా మనసుల మధ్య అనుబంధాన్ని నిలుపుకోవాలనుకోవడమే పరిణతి.

గత నెల చివరి రెండు రోజుల నుంచి ఉధృతమైన తెలంగాణ ఉద్యమంలో ఆందోళనకారులు ఆంధ్రప్రాంతానికి సంబంధించినవని భావించిన చిహ్నాలపై దాడులు చేశారు. సమైక్యరాష్ట్రానికి పొట్టిశ్రీరాములును చిహ్నంగా భావించి, ఆయన విగ్రహాలను పాడుచేశారు. నిజానికి ఆయనకూ విశాలాంధ్రకూ ఎటువంటి సంబంధం లేదు. మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు ఆయన. ఆయన బలిదానం కారణంగానే భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల స్థాపన వేగవంతమైంది. తెలంగాణ ఉద్యమం భాషాప్రయుక్త రాష్ట్ర భావనకు వ్యతిరేకమైనది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దేశంలో రెండు తెలుగుభాషారాష్ట్రాలుంటాయి అంతే. ఇప్పుడు సమైక్యవాదం పేరుతో ఆందోళన చేస్తున్న రాయలసీమ, కోస్తాంధ్ర ఉద్యమకారులు సైతం పొట్టిశ్రీరాములును చిహ్నంగా స్వీకరించడం ఆశ్చర్యం. అది కూడా అచారిత్రకం. తెలంగాణవాదులు ఆయన విగ్రహాలపై దాడులు చేశారు కాబట్టి, అవతలిపక్షం వారు ఆయనను ప్రతీకగా స్వీకరిస్తున్నట్టు కనిపిస్తున్నది. నలభయ్యేళ్ల కిందటి తెలంగాణ ఉద్యమం కాలంలో ముఖ్యమంత్రిగా ఉండి, అణచివేతకు కారకులైన బ్రహ్మానందరెడ్డి విగ్రహాలను లక్ష్యంగా పెట్టుకుని చేసిన దాడులు కూడా నివారించదగ్గవి. చారిత్రక విషాదాలను సాధ్యమైనంతగా సుప్తావస్థలోనే ఉంచడం మంచిది. బ్రహ్మానందరెడ్డిని ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మహానాయకుడిగా ఎవరూ పరిగణించడం లేదు. కాలగర్భంలో కలసిపోయిన నాయకుడి స్మ­ృతిని పనిగట్టుకుని మలినపరచడం అనవసరం. అలాగే, 'ఆంధ్ర' అన్న మాట మీదనే ద్వేషం చూపిస్తూ వివిధ చారిత్రక సంస్థల పేర్లను మార్చడానికి ప్రయత్నించడం దుందుడుకు చర్యగానే భావించాలి. అలాగే, తెలంగాణ ఉద్యమనాయకుడు స్వయంగా ఇచ్చిన 'ఆంధ్రావాలే భాగో' నినాదం సైతం వాంఛనీయం కాదు. నలభయ్యేళ్ల కిందటి ఉద్యమం స్వరూపస్వభావాలు వేరు. అప్పుడు ఉద్యోగావకాశాలను ఇతరులు హరించుకుపోవడం మీదనే ఉద్యమం ప్రధానదృష్టి ఉండింది. ఇప్పుడు ఇరిగేషన్‌, అభివృద్ధి నమూనా, భూముల అన్యాక్రాంతం వంటి అనేక పెద్ద అంశాలను తెలంగాణవాదం ముందుకు తెచ్చింది. వివక్షను విధానంగా కొనసాగిస్తున్న ప్రభుత్వాలు తప్ప, వ్యక్తులు ఉద్యమానికి లక్ష్యం కానక్కరలేదు. పెద్ద పెట్టుబడిదారులను, భూకబ్జాదారులను ఉద్దేశించి మాత్రమే తామా నినాదం ఇచ్చామని టిఆర్‌ఎస్‌ పార్టీ చెబుతున్నప్పటికీ, తెలంగాణలో స్థిరపడిన సాధారణ, మధ్యతరగతి ఆంధ్రులు సైతం భయాందోళనలకు గురిఅయ్యారు. వారిని స్థానికులుగానే సమానులుగానే పరిగణిస్తామని ఉద్యమనేతలు పదే పదే చెబుతున్నప్పటికీ, ఆ హామీ ఒక్కటే చాలదు. అటువంటి నినాదాలను విరమించుకోవడం కూడా చేయాలి.

విడిపోతామని చెబుతున్నవారికి ఇతరుల మీద ఫిర్యాదులుంటాయి. కాబట్టి, వారు నోరు జారవచ్చు, విమర్శించవచ్చు. కానీ, కలసి ఉందామని చెబుతున్న సమైక్యవాదులకు ఆ వెసులుబాటు లేదు. వారు ఎవరితో కలసిఉండాలనుకుంటున్నారో వారిని ఉద్దేశించి సామరస్యపూర్వకంగా మాట్లాడాలి. వారిని అవమానపరచకూడదు. ప్రత్యేక వాదుల కోరిక తీరాలంటే ప్రభుత్వాలు తలచుకుంటే సరిపోతుంది. కానీ, సమైక్యతను కోరుకునేవారి ఆకాంక్ష తీరాలంటే వేర్పాటు కోరే ప్రజల సహకారం కూడా కావాలి. ఏ కారణాల చేత వేర్పాటు భావన కలిగిందో తెలుసుకుని, ఆ కారణాలను తొలగిస్తామని అభయం ఇవ్వాలి. కానీ, ఇప్పుడు ఆంధ్రా, రాయలసీమల్లో జరుగుతున్న ఆందోళనలు తెలంగాణవాదులను, ప్రత్యేక రాష్ట్ర భావనను అవమానించే తీరులో సాగడం విచారకరం. ప్రత్యేక రాష్ట్రం గురించిన ఒక కీలక ప్రకటననైనా సాధించిన నాయకుడిగా ప్రాంత ప్రజలందరూ ప్రత్యేకంగా పరిగణించే వ్యక్తిని రకరకాలుగా అవహేళన చేయడం తెలంగాణవాసులలోఎటువంటి భావనను కలిగిస్తుందో ఆందోళనకారులు గమనించాలి. 'సమైక్యవాద' రాజకీయ నాయకులు తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి- వారికి సభ్యత లేదని, వ్యవసాయం తెలియదని, విద్య తక్కువని - అవన్నీ తామే సమకూర్చామన్న రీతిలో మాట్లాడడం సోదరుల మధ్య సుహృద్భావాన్ని పెంచే ధోరణి కాదు. అలాగే, తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన ప్రాంతేతరుల భద్రత గురించి పదే పదే మాట్లాడుతూ, ఆ వర్గాలలో భయాందోళనలను పెంచడం కూడా వాంఛనీయం కాదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా రాకపోయినా ఎక్కడి ప్రాంతం వారైనా ఇతర ప్రాంతీయులతో సఖ్యతగా ఉండగలగాలి. ఉద్యమ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒకరు 'భాగో' అన్నా, మరొకరు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించినా అది దీర్ఘకాలికంగా అశాంతినే సృష్టిస్తుంది. సంక్షోభం ఆవరించిన ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మాటను ఆచి తూచి మాట్లాడాలి.

ఉద్యమాలు ఎలా సాగినా, తెలుగువారిగా భారతీయులుగా మనందరం సోదరులమన్న సంగతి మరచిపోకూడదు. మనం గొప్పదని, తియ్యదని చెప్పుకునే తెలుగు భాషను ద్వేషభాషగా మార్చుకోగూడదు.

4 comments:

 1. nice balanced article. i was born in telangana, but my parents are from andhra. i never had this feeling of disputes. what ever, stay together or seperate we need to maintain peace and harmony towards each other. i like the point you mentioned, people who want to be united should have more patience and extend more love and concern than humiliating the person leading the movement for seperate statehood. we need to focus and work on the problem rather than person raising the problem.
  i am big fan of AJ and espicially the editors columns.

  ReplyDelete
 2. కేవలం రాజకీయ నాయకుల్నే తప్పు పట్టనవసరం లేదు. మీడియాకూడ అంతే బాధ్యతా రహితంగా తయారయ్యింది. పత్రికలు రాజకీయ పార్టీల కరపత్రికల్లా తయారయ్యాయి. వాస్తవాలకీ, వార్తలకీ తేడా ఉంది. ఇండియాలో పత్రికల్నుండి, ముఖ్యంగా తెలుగు పత్రికల్నుండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆశించడం శుద్ధ దండగ. ప్రస్తుతమున్నది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాదు, ఇన్‌ఫర్మేషన్ జర్నలిజం. దౌర్భాగ్యం ఏమిటంటే ప్రజల పక్షాన మాట్లాడవలసిన పత్రికలు రాజకీయ నాయకులకి గాత్ర సౌకర్యాన్ని అందజేసి, భజన చేస్తున్నాయి. నిక్కచ్చిగా ఏ విషయమూ ఉండదు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే పక్క రాష్ట్రాల్నుండొచ్చే పత్రికలు చదవాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. జరిగింది తెలియాలంటే ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తే కానీ తెలీదు. తెలుగు జాతి సిగ్గుపడేలా ఉంది నేటి పరిస్థితి. బాగుపడే సూచన్లు దగ్గర్లో లేవు. రాజకీయ నాయకుల భాషే కాదు, పత్రికల భాషా కూడా అంతే స్థాయిలో ఉంది.

  -సాయి బ్రహ్మానందం గొర్తి

  ReplyDelete
 3. అవును... ఒకటి అన్యాయానికి గురైంది.. మరొకటి.. అన్యాయమైపోతామోమో అనే ఆందోళనలో ఉంది. అందుకే ఈ పరిస్థితి. రెండు ప్రాంతాల వారూ.. సంయమనంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకరినొకరు అవమానుపర్చుకోవడమంటే.. ఇతరుల ముందు మన పరువు మనం తీసుకుంటున్నట్లే. రెండు రాష్ట్రాలుగా విడిపోతే.. ఎవరికీ వచ్చే నష్టం లేదు.. లాభం తప్ప. కానీ ఆ విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. తాత్కాలిక భావోద్వేగాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ.. దీర్ఘకాలిక ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఆ మార్పు రానంతవరకూ.. ఇదే పరిస్థితి

  ReplyDelete
 4. అవును, దుఃఖంగానే ఉంది. ఆవేదనగానే ఉంది! నిస్సహాయత అంటే ఏమిటో తెలుస్తోంది.

  సంయమనం అనే మాటకు అర్థం అంతా మర్చిపోయారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలీని స్థితి! అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకచోట రావణ కాష్టం రగులుతూనే ఉంది.

  మధ్యలో బలవుతున్నది సామాన్యులే!

  ఈ పాపంలో మీడియా కట్టుకున్న పుణ్యం ఎంతో ఉంది! ముఖ్యంగా కొన్ని మీడియా ఛానెళ్ళు నాయకుల చేత రెచ్చగొట్టి ప్రోబ్ చేసే ప్రశ్నలు వేసి వాగించాయి.

  ఈ భావోద్వేగాలకు తెర ఎప్పుడుపడుతుందో!రాష్ట్రం , ప్రజా జీవితం మామూలు స్థితికి ఎప్పుడు వస్తాయో!

  ReplyDelete