Tuesday, December 29, 2009

మనుషులను ప్రేమిస్తే అంతా భూమిపుత్రులే

నలబై ఏళ్ల కిందటి తెలంగాణ ఉద్యమం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా,  అప్పట్లో హైదరాబాద్‌నుంచి వెనక్కి వెళ్లిపోవలసి వచ్చిన కోస్తాంధ్ర ఉద్యోగుల భయాందోళనల గురించి మాట్లాడే మిత్రులు చాలా మందే ఉన్నారు. ఒక ఉద్రిక్త, సంక్షోభ పరిస్థితిలో ఉన్నఊరు వదిలివెళ్ల వలసి రావడం ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఏ ప్రత్యేక వాదమూ అవరోధం అవుతుందని అనుకోను.

1946-48 నాటి తెలంగాణసాయుధపోరాటం, రజాకార్ల కల్లోలం, పోలీస్‌ యాక్షన్‌ సందర్భాలలో తెలంగాణ స్థానికులే ఉన్న ఊర్లు వదిలి, కృష్ణకు ఆవలివైపు వెళ్లి తలదాచుకోవలసివచ్చింది. 1969 ఉద్యమం సందర్భంగా కోస్తాంధ్ర మిత్రుల కష్టాల గురించి మాట్లాడే సందర్భంలో - నా ప్రత్యేక అనుభవం గురించి చెప్పాలనిపిస్తుంది. చెబుతుంటాను కూడా. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లారి, జై ఆంధ్ర ఉద్యమం అంకురిస్తున్న సమయంలో కోస్తాంధ్ర నుంచి వెనక్కి వచ్చేసిన తెలంగాణ కుటుంబం నాది. అప్పటికి నేను చాలా చిన్నవాడినే అయినా, నాటి కల్లోల స్థితి జ్ఞాపకాలు నాకింకా లీలగా మిగిలి ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు మేం ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర వేంసూరు గ్రామంలో ఉండేవాళ్లం. అక్కడి జిల్లా పరిషత్‌ హైస్కూల్లో మా నాన్న మొదటి గ్రేడ్‌ తెలుగుపండిట్‌గా పనిచేసేవారు. అప్పటికి ఎనిమిదేళ్లుగా అక్కడ పనిచేస్తున్న ఆయన ప్రైవేటుగా పోస్టు గ్రాడ్యుయేషన్‌, బిఎడ్‌ పూర్తిచేసి ఉన్నతావకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన భాషాప్రవీణ, విద్యాప్రవీణ వంటి డిగ్రీలు కూడా ఉండడం వల్ల కాబోలు, మచిలీపట్నం హిందూ కాలేజీలో ఆయనకు అధ్యాపకుడి ఉద్యోగం వచ్చింది. ఏడాది తరువాత ఉద్యోగం ఖరారు చేయకపోగా, తక్కువస్థాయికి ట్యూటర్‌గా మార్చారు. అందుకని, మరో ఉద్యోగం వెదుకుతూ చింతలపాటి బాపిరాజు విద్యాసంస్థలలో ఒకటైన ఏలూరు ఓరియంటల్‌ కాలేజీలో ప్రిన్సిపల్‌ ఉద్యోగం సంపాదించారు. ఇదంతా 1968-1970 మధ్యకాలం. ఆ సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉధృతంగా ఉండింది. కానీ, కోస్తాంధ్రలో తీవ్రమైన ప్రతిస్పందనలు ఇంకా మొదలు కాలేదు.

ఏలూరు ఆంధ్రజాతీయ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాను నేనప్పుడు. ఒకరోజు మా నాన్న మా అన్నయ్యను, తమ్ముళ్లను కూర్చోబెట్టుకుని- మీ సొంత ఊరేమిటని ఎవరైనా అడిగితే- జగ్గయ్యపేట అని చెప్పండి అని చెప్పారు. ఎందుకట్లా అని అడిగాము, మన మాటలో తేడా ఉంటుంది, అందుకని మీరెక్కడివాళ్లని ఎవరైనా అడిగినప్పుడు నల్లగొండ అని చెప్పకండి. జగ్గయ్యపేట అయితే నల్లగొండ జిల్లాకు సరిహద్దు కాబట్టి భాష మిశ్రమంగా ఉన్నదనుకుంటారు- అని వివరణ ఇచ్చారు. అందులోని తీవ్రత నాకు అర్థమైందనుకోలేను కానీ, సొంత ఊరేమిటో చెబితే ఇక్కడి వాళ్లకు అది ఇష్టం ఉండదు- అని మాత్రం అర్థమైంది.  మా నాన్న భయపడడానికి బయటజరుగుతున్న సంఘటనలేవో కారణమని అర్థమయ్యేది కానీ, అవేమిటో తెలియదు. అంతేకాదు, మా నాన్న తరచు హైదరాబాద్‌ వెళ్లి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మాకు తెలుస్తూ ఉండేది. ఇంతలో ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొడంగల్‌లో ఓరియంటల్‌ కాలేజీలో అధ్యాపక ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య గండం గడిచింది అని మా తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడం గుర్తుంది.

కొడంగల్‌లోని జడ్‌పిహెచ్‌ఎస్‌లో 1971లో ఏడోతరగతిలో చేరాను. అప్పటిదాకా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగిన ఊర్లలో  ఆ ఊరు కూడా ఒకటి. ఖమ్మం జిల్లాలోని కోస్తాసరిహద్దు గ్రామంలో,  ఆ తరువాత రెండు కోస్తా ముఖ్యపట్టణాలలో పెరిగిన నా భాష- సహజంగానే కొడంగల్‌లో పరాయిగా ఉండేది. అక్కడి తోటి పిల్లలు నన్నుకొంతకాలం పరాయిగానే చూశారు. చేశాను, చూశాను, చూస్తాను- వంటి క్రియల్లో దీర్ఘం తీసి మాట్లాడుతున్నప్పుడు వెక్కిరించారు. మచిలీపట్నంలో ఒకసారి నేను " ఉరుకు ఉరుకు' అని మా తమ్ముడితో అంటుంటే, విని పక్కింటివాళ్లు విరగబడినవ్వారు. అదీ, నేను కొడంగల్‌లో "పరిగెత్తు పరిగెత్తు' అంటే అంతే వెటకారంగా నవ్వారు. చిన్నతనంలో భాషను అలవరచుకోవడం పెద్ద కష్టం కాదు కాబట్టి- కొడంగల్లో అతి తొందరలోనే నేను స్థానిక భాషకు బదిలీ అయిపోయాను. ఆశ్చర్యం కలిగించేదేమంటే- నేను తెలంగాణ భాషకు మారిపోతుంటే మా అమ్మే నన్ను నిరోధించేది. నియత విద్య పెద్దగా లేని మా అమ్మ,  ఎన్ని ఊర్లు తిరిగినా ఇప్పటికీ స్వచ్ఛమైన నల్లగొండ గ్రామీణ బ్రాహ్మణ భాషే మాట్లాడుతుంది. కానీ, బందరు, ఏలూరు పట్టణాల్లో ఉన్న కాలంలో ఆమెకు- కోస్తాంధ్ర భాష నాజూకు భాష అని నమ్మకం కలిగింది.తాను అలవరచుకోలేకపోయినా, పిల్లలకు అలవరచాలని ప్రయత్నించింది.  ఆమె నిరోధం వల్ల కొంతా, హైదరాబాద్‌కు చేరాక తెలంగాణేతర సభ్యసమాజంతో ఎక్కువ పూసుకు తిరగడం వల్ల కొంత, అభ్యసించిన విద్య వల్ల మరికొంత- నా భాష కలుషితమై పోయింది. మాతృభాష నాకు దూరమై పోయింది. తరువాత కాలమంతా నేను తెలంగాణలోనే బతుకుతూ వస్తున్నాను. 1985-6లో, ఆ తరువాత 1992-93లో- మొత్తం మూడేళ్ల పాటు విజయవాడలో ఉద్యోగరీత్యా ఉన్నాను. తెలంగాణ- ఆంధ్రకు సంబంధించిన ఫీలింగ్స్‌, ప్రస్తావనలు, చర్చలు ఈ మధ్య కాలంలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి కానీ, మళ్లీ 1995 తరువాత అవి తిరిగి గట్టి రాజకీయరూపం తీసుకోవడం మొదలైంది.

తెలంగాణవారికి, ఆంధ్రవారికీ మధ్య స్నేహాలు, పనిసంబంధాలు, వివాహ సంబంధాలు ఈ మధ్యకాలంలో విస్తృతమవుతూ వస్తున్నాయి. అయినా, ఏదో ఒక విభేదరాగం అంతర్లీనంగా వినిపిస్తూనే ఉంది. తీవ్రంగా ద్వేషించుకున్నవారు కూడా కాలం గడుస్తున్నకొద్దీ సహజీవనాన్ని అలవరచుకుంటారు. వైద్యం దక్కనప్పటికీ, గాయాలను కాలమే ఒక్కోసారి మాన్పుతుంటుంది.

ఆవేశకావేశాలు ఉధృతంగా ఉన్న సమయంలో ఉన్నచోటినుంచి వెళ్లిపోవలసి వచ్చిన పరిస్థితులు ఎంతకాలం అలాగే ఉంటాయి? వెళ్లగొట్టినవాళ్లకు, వెళ్లిపోయినవాళ్లకు కూడా ఆవేశాలు, భయాందోళనలు తాత్కాలికంగానే ఉంటాయి. ప్రత్యేక తెలంగాణ ఆందోళన కారణంగా హైదరాబాద్‌నుంచి ఏలూరు  పారిపోయి వచ్చిన ఒక ఉద్యోగి, మా నాన్న పనిచేస్తున్న  ఏలూరు కాలేజీలో చేరారు. తాను ఎంతటి ఉద్రిక్త పరిస్థితులలో హైదరాబాద్‌ వదిలివచ్చిందీ ఆయన చెప్పేవాడు.  మా కుటుంబం ఏలూరు నుంచి తెలంగాణ తిరిగిరాగానే, మా నాన్న తన కాలేజీలో ఒక వెకన్సీ ఏర్పడితే, ఆయనను తెలంగాణ రప్పించుకున్నారు. తెలంగాణవాది అయినప్పటికీ,మా నాన్న సహోద్యోగి విషయంలో సానుభూతితోనే వ్యవహరించారు. చేదు అనుభవం ఎదురయి ఎక్కువ కాలం కాకపోయినా, ఆయన కూడా నిర్భయంగా తిరిగి తెలంగాణ వచ్చారు.

తెలంగాణ వైపు నుంచి కోస్తాంధ్ర, రాయలసీమకు వెళ్లి నివసించే ప్రక్రియ ఇప్పటికీ మందకొడిగానేఉన్నది, ఆ ప్రాంతాలనుంచి తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడే వారి సంఖ్య పెరిగిపోతూనే వచ్చింది. ప్రధానంగా విద్యా, ఉద్యోగ అవకాశాలలో వివక్షను ప్రశ్నిస్తూ 1969 ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం లేవనెత్తిన సమస్యకు సమాధానాలు దొరకలేదు కానీ, అది మరిన్ని రంగాలకు విస్తరించి నాలుగుదశాబ్దాలలో విశ్వరూపం ధరించింది.  ఇప్పటి ఉద్యమం వ్యవస్థాగత వివక్షను, విధానపరమైన పక్షపాతాన్ని, సాంస్కృతికమైన విభిన్నతను ముందుకు తెచ్చింది.

ఈ ఉద్యమంలో చిహ్నాలే తప్ప మనుషులు ప్రతికూల లక్ష్యాలు అయ్యే అవకాశం ఉండకూడదు. విభజన కారణంగా తమకు ఎదురయ్యే న్యాయమైన సమస్యలను చర్చకు పెట్టి వాటి పరిష్కారాన్నిడిమాండ్‌ చేయడం కాకుండా, ప్రత్యేక రాష్ట్రాన్నే వ్యతిరేకిస్తూ "సమైక్యాంధ్ర'  ఉద్యమాన్ని రాజకీయవాదులు ప్రోత్సహించడం వల్ల - తమ డిమాండ్‌నెరవేరే సమయం వచ్చినప్పుడు అవరోధం కల్పిస్తున్నారన్న భావన తెలంగాణవాదులలో ఏర్పడింది. ఈ భావన సహజంగానే ఉద్రేకాలకు దారితీస్తుంది.  ఉద్యమం తీవ్రతతో, దానికి ఇతర ప్రాంతాలలో వచ్చిన వ్యతిరేకత స్థాయితో పోలిస్తే, పౌరఘర్షణలు పెద్దసంఖ్యలో జరిగే ప్రమాదం ఉండింది. కానీ,  ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకున్న విద్యార్థులు ఎంతో పరిపక్వతతో, అవగాహనతో, సహనంతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రవర్తనే తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన ఇతర ప్రాంతాల వారికి శ్రీరామరక్షగా ఉన్నది. స్వయంగా వివక్షకు గురిఅయిన వారెవరూ ఇతరులను వివక్షకు గురి చేయరు.  ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు తాము పరాయిలవుతామని భయపడుతున్నారు కానీ, మా ఇంట్లోనే మేం పరాయివారిగా మారిపోతుంటే ఎవరూ మా రక్షణకు రాలేదేమి? - అని విద్యార్థులు వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.

9 comments:

 1. లెస్స పలికితిరి..

  ReplyDelete
 2. చాలా బాగుంది ..
  నూతన సంవత్సర శుభాకంక్షలు..
  నా కానుకగా ఈ టపా అందుకోండి
  http://creativekurrodu.blogspot.com/

  ReplyDelete
 3. నానీ తెలంగాణ!-రానీ తెలంగాణ!!
  తెలంగాణ
  నాడు మౌన వీణ
  నేడు దశదిశల
  మారు మ్రోగే రుద్రవీణ

  ఉక్కుపాదాలకింద
  తెలంగాణా
  నవాబులు దొరలు ఆంధ్రుల
  కారణాన

  వెయ్యేళ్లకైనా
  వేరుతప్పదు
  ఇక ప్రత్యేక తెలంగాణా
  పోరుతప్పదు

  తెలంగాణా
  ఉద్యమాల ఖజానా
  త్యాగధనుల
  చిరునామా

  తెలంగాణా
  కాదెవరి దయాభిక్ష
  ఈడి అణగారిన
  ప్రజల ఆకాంక్ష

  ఆంధ్రులు మేధావులు?!
  బత్కనేర్చిన జీవులు
  చంకెక్కి నెత్తెక్కే
  స్వభావులు

  ఇది మా తెలంగాణా
  బతుకనివ్వండి
  స్వేచ్ఛగా
  మమ్ము మా మానాన

  తేల్చుకోలేమంటే
  చావోరేవో
  నువ్వసలు
  తెలంగాణావాడివే కావో

  ఏకులై వస్తారు
  మేకులై ఉంటారు
  ఆంగ్లేయుకేం తీసిపోరు
  ఆంధ్రులు!


  ఎన్నాళ్లీ వివక్ష
  తెలంగాణాపై
  మొసలి కన్నీళ్లే
  ప్రభుత సమీక్ష

  తెలుగు తోటలో
  ఉర్దూ సౌరభం!
  తథ్యంగా
  అది తెలంగాణే!
  తెలంగాణా ఉద్యమ గీతాలకై/పాటలకై చూసి స్పందించి ప్రచారం చేయండి.

  www.raki9-4u.blogspot.com

  ReplyDelete
 4. శ్రీనివాస్ గారు
  తెలుగు బ్లాగులోకంలో మరో మేధావి ప్రవేసిస్తున్నందుకు అభినందనలు .సుస్వాగతం

  ReplyDelete
 5. శ్రీనివాస్‌గార్కి,
  సందర్భం బ్లాగు ద్వారా మీ నేపథ్యం 'కొంత' తెలిసినందుకు సంతోషంగా ఉంది. మీరు రాసిన 1969 తెలంగాణా ఉద్యమం చదువుతుంటే నా బాల్యం కదలాడింది.
  నాన్నగారు నైజాం పోలీసుగా 1948లో తెలంగాణ వచ్చారు. అన్నయ్య 1955లో గజ్వేల్‌లో పుట్టగా, నేను 1960లో సిద్దిపేటలో పుట్టాను. నేను పుట్టిన ఏడాదికే మహబూబ్‌నగర్‌ వచ్చేశాం నాన్నగారి బదీలీపైన.
  1969 ఉద్యమ సమయం - (నేనీ ప్రపంచంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిదేళ్లు. నే జీవిస్తున్న ప్రపంచం తెలంగాణలోని ఒక ప్రాంతమని తెలిసిందప్పుడే) మహబూబ్‌నగర్‌, రాంనగర్‌ ప్రాంతంలోని ఒక ప్రైమరీ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. పోలీసులు మా ఇంటి సందుల్లోకి దూరి కవాతు నిర్వహించడం గుర్తుంది. వాళ్ల బూట్ల చప్పుడు విని నేను కేకలేస్తుంటే మా అమ్మ నా నోరు మూయడం గర్తుంది. అదీగాక అప్పుడు అక్కినేని, జయలలితల సినిమా 'అదృష్టవంతుడు' వచ్చింది. అందులోని 'చింతచెట్టు చిగురు చూడు' పాట ట్యూన్ని కాసుల బ్రహ్మానందరెడ్డి/రాఘవమ్మల పైన కట్టి పాడేకునే వాళ్లం. అదే మాదిరి 'చెంచకు చెంచ - చెన్నరెడ్డి చెంచా' అనే ఊతపదాల్ని వల్లె వేసుకునేవాళ్లం. మాకు 4వ తరగతి పరీక్షలు జరగలేదు. 10 పైసల స్టాంపు పైన సంతకం లాంటిదేదో తీసుకుని మమ్మల్ని 5వ తరగతిలోకి ప్రమోట్‌ చేశారు. మళ్లీ సరిగ్గా 40 ఏళ్లకు అదే ఉద్యమం. 1969 ఉద్యమంలో బాగా వినబడిన పదం 'ఆంధ్రా గో బ్యాక్‌' అని. ఏది ఏమైనా 'తెలంగాణ' ఎందుకు విడపోవాలనే దానిపై చాలా మందికి సరైన అవగాహన లేదు. (ఈ మ««ధ్య డిసెంబర్‌ 23 నుండి 27 వరకు సూర్యలో వచ్చిన రంగనాయకమ్మ వ్యాసం చదివితే తెలంగాణకు జరిగిన అన్యాయం వివరంగా అర్థమౌతుంది) తెలంగాణ చారిత్రక నేపథ్యంతో పాటు ఆంధ్రసీమలతో విలీనమైన సందర్భంలో జరిగిన ఒప్పందాన్ని ప్రజలకు తేటతెల్లగా చెప్పే ప్రక్రియ సక్రమంగా లేదు. అది తెలిసినాడు సీమాం«ధులు కూడా నిజమే! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడంలో తప్పులేదని ఒప్పుకుంటారనిపిస్తుంది.
  - గొరుసు

  ReplyDelete
 6. శ్రీనివాస్ గారూ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం మీద సున్నితం గాను స్పష్టంగానూ ఈ పోస్ట్ రాసారు .అభినందనలు.

  ReplyDelete
 7. ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
  డీన్ అకడమిక్ అఫైర్స్
  ద్రావిడ విశ్వవిద్యాలయం

  ప్రియమైన శ్రీనివాస్ గారికి, అభివాదం...
  మీ బ్లాగును ఈ రోజే చూడడం తటస్థించింది. రెంటాల కల్పన గారి బ్లాగులోని లింకు ద్వారా దొరికింది. మీరు ఖమ్మం వారని తెలిసి చాలా ఆనందం కలిగింది. మీ బ్లాగును తీర్చిన పద్ధతి కూడా చాలా బాగుంది. చాలా రోజుల క్రితం ఒక బ్లాగును బ్లాక్ చేసాను. కాని దాన్ని ఇంకా తీర్చవలసి ఉంది. నేను ఖమ్మం వాడినే ఖమ్మంలోని మధిర మండలం మర్లపాడు మా ఊరు. అయితే ఇంటర్ నుండి డిగ్రీవరకు ఖమ్మంలోని మా తాతగారి ఇంట్లో ఉండి చదువుకున్నాను. 1980లో ఎం.ఎ కోసం హైదరాబాదు ఉస్మానియాకు వచ్చి అక్కడే పిహెచ్. డి దాకా డిగ్రీలు పొందాను. ఉస్మానియాలో తెలుగు శాఖలో ఆరు సంవత్సరాలు పని చేసాను. తర్వాత హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో 12 సంవత్సరాలు లెక్చరర్ గా చేసి 2003లో ద్రావిడ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ గా చేరాను. కులపురాణాల పరిశోధన వెలువరించిన పుస్తకాలు వ్యాసాలు నాకు పరిశోధకునిగా మంచి గుర్తింపును తెచ్చాయి. వీలైనప్పుడు నా పుస్తకాలు పంపుతాను. ఇంగ్లీషు వ్యాసాల వివరాలు నెట్ లో కూడా లభ్యం.

  ఇక ద్రౌపది నవల విషయానికి వస్తే. యార్లగడ్డ అనువాదం మీద ఇంత చర్చ జరగడం చూస్తే నాకొక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది. భైరప్ప నవల పర్వ కూడా మహాభారత కథ పైన ఆధారపడిన నవల. దీన్ని పర్వ అనే పేరుతోనే గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు తెలుగులో అనువాదం చేశారు. దీన్ని కూడా కేంద్ర సాహిత్య అకాడమీనే ప్రచురించింది. ఈ నవలలో ద్రౌపది పాత్రను ఇంకా ఇతర స్త్రీల పాత్రలను చాలా అభ్యంతరకరంగా కొందరు భావించేలా వర్ణించడం ఉంది. దీని పైన ఏ గలాటా కాని చర్చ కాని జరిగినట్లు లేదు. ఇప్పుడ జరగడం ఆశ్చర్యంగా నే ఉంది. ఒక నవలా కారునికి భారతాన్ని కాని రామాయణాన్ని కాని తను కోరిన రీతిలో పాత్రరచన చేసి ఇది నా వెర్షన్ అనే సౌకర్యం స్వేచ్ఛ ఉంటుంది. శతాబ్దాలుగా ఇన్ని రకాల రామాయణాలు, ఇన్ని భారతాలు రావడానికి ఇదే కారణం. ప్రామాణిక కథ అనేది ఒకటుంటుంది అనే వాదాన్ని ఆధునిక మిథాలజీకి చెందిన మెథడాలజీ అంగీకరించదు. ఇందువల్ల పాత్రచిత్రణ అభ్యంతరకరంగా ఉంది అని చెప్పడం వీలు కాదు. కాని ఖండించ వచ్చు ఒక వర్గం మనోభావం దెబ్బతింటుంది అని అనవచ్చు. కాని నిషేధించడం రచయితల మౌలిక స్వేచ్ఛా సూత్రాన్ని కాదనడం అవుతుంది. దీనిపైన మరింత చర్చ చేయడానికి వీలుంది. మళ్ళీ ఒకసారి దీనిలోనే కలుస్తాను.
  పులికొండ సుబ్బాచారి.

  ReplyDelete
 8. సుబ్బాచారిగారూ,
  మనం ఒకరికొకరం పరిచయం అనే నాకు గుర్తు. మీ పుస్తకాలు, కాలమ్స్‌ నేను చూశాను. మా జిల్లా ఖమ్మం కాదు. నల్లగొండ జిల్లా. మా నాన్నగారి ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లా (నాటి మధిర తాలూకా) వేంసూరు గ్రామంలో ఉండేవాళ్లం. మూడోతరగతి దాకా అక్కడ చదువుకున్నాను.

  ReplyDelete
 9. Hi Sir,

  This is Narendra from Vemsoor. Hope you are doing well. Its nice to
  see about Vemsoor in your blog. Can you please let us know more about
  your personal relationship with Vemsoor. I want to create a blog about
  Vemsoor so please share your experiences.

  Thanks
  Narendra Morampudi

  ReplyDelete