Tuesday, December 14, 2010

ఏలినవారికి ఏకాంత భంగం!

ప్రపంచీకరణ తొలిరోజుల్లోని పారవశ్యం గుర్తుందా? ఎల్లలన్నీ కల్లలైపోతాయి. లోకపు పిడికిలి ముడుచుకుపోతుంది. చెక్‌పోస్టులులేని అంతర్జాతీయ ర హ దారులు విస్తరిస్తాయి. చరిత్ర ముగిసిపోతుంది. నాగరికతల మధ్య అంతిమ యుద్ధం మొదలవుతుంది. స్థల కాలాలకు అర్థాలు మారిపోతాయి. వేళ్లు తెగిన సమూహాలు కొత్తకొత్త స్నేహాలతో వర్చువల్ కమ్యూనిటీలు అవతరిస్తాయి. ఫ్లైబైనైట్ వైమానికులు మార్కెట్లను బ్రీఫ్‌కేసుల్లో మోసుకు తిరుగుతారు. అమెరికా అయినా ఆఫ్రికా అయినా, హూస్టన్ అయినా హైదరాబాద్ అన్ని భాషల్లోనూ అ అంటే అభివృద్ధే. గ్రోత్‌రేట్ రేసుల్లో అందరికీ రెండంకెల పతకమే. అన్ని భవనాలమీదా డాలర్ పతాకమే. హద్దులులేని సంపదలో ప్రపంచం ఓలలాడుతుంది. లాభం అట్టడుగులకు ఇంకిపోయి బడుగులు సైతం బాగుపడతారు.

మరి అదంతా జరిగిందా? కొంత జరిగింది, కొంత జరగలేదు. ప్రక్రియ జరుగుతూనే ఉంది, ఫలితం భిన్నంగా ఉంది. అనుకున్నవి కాక అనుకోనివి కూడా జరిగా యి. సంక్షేమం స్థానంలో లాభం వెలిసింది. పేదలకు సబ్సిడీలుపోయి పెద్దలకు రాయితీలు వచ్చాయి. హత్యలు తగ్గి ఆత్మహత్యలు పెరిగాయి. స్వతంత్ర దేశాల గుండెల మీద పరమ స్వతంత్ర సంస్థానాలు వెలిశాయి. భూగర్భంలో దాక్కున్న వనరులకు కూడా రెక్కలు వచ్చాయి. తీర ప్రాంతాలపై పెట్టుబడుల సునామీ విరుచుకుపడుతున్నది. ఎల్లలులేని సామ్రాజ్యవాదీ, హద్దులు లేని ఉగ్రవాదీ చెరో ధ్రువం మీదా నిలబడ్డారు.

స్టాక్‌మార్కెట్‌కు ఏ దేశంలో పడిశెం పట్టినా మన దేశంలోనూ తుమ్ముతున్నారు. మనుషులందరూ ఒకే పొడవుండడానికి కొందరు కాళ్లు నరుక్కుంటున్నారు, మరికొందరు మెడలు సాచి ఎత్తు పెంచుకుంటున్నారు. న్యాయదేవత కూడా ప్రపంచభాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. వ్యాపారం గురించి వ్యవహారం గురించి బోధించే ప్రపంచ ప్రభువులే హక్కుల గురించి సామాజిక భద్రత గురించి సమ్మిశ్రిత అభివృద్ధి

Monday, November 29, 2010

వంశ ప్రతిష్ఠ ఉండగా, వృథాప్రయాస ఎందుకు?

మందబుద్ధులయిన రాజపుత్రులకు కాస్త వివేకాన్ని లోకజ్ఞానాన్ని అందించాలని ఓ రాజుగారు విష్ణుశర్మ అనే పండితుడిని పురమాయిస్తే 'పంచతంత్రం' అనే గొప్ప కథాసాహిత్య గ్రంథం తయారయింది. యుక్తవయస్సు రాగానే పట్టాభిషేకం చేయబోతే, లోకానుభవం గడించి వచ్చాక రాజునవుతాను లెమ్మని రాకుమారులు ఒంటరిగానో ఓ విదూషక మిత్రునితోనో దేశాటనానికి బయలుదేరే వారని చందమామ కథల్లో చదువుకున్నాము. అంటే, రాజుగారి కడుపున పుట్టినంత మాత్రాన రాజ్యయోగ్యత వచ్చినట్టు కాద ని, అందుకు ఇతర అర్హతలు కూడా ఉండాలనీ మన సంప్రదాయం భావిస్తుందన్న మాట. రాహుల్‌గాంధీకి కూడా ఆ సంప్రదాయం మీద గౌరవం ఉన్నట్టుంది కాబట్టే, ప్రధానమం త్రి స్థానానికి ఎగబడిపోకుండా రాజకీయాలను అభ్యసిస్తూ ప్రొబేషన్‌లో నిరీక్షించాలని భావిస్తున్నారు. సరికొత్త రాజకీయ యువతరాన్ని నిర్మిస్తూ, చిన్న చిన్న విజయాలు సాధి స్తూ, రాజ వంశీకుడిగా తనకు లభించే ప్రత్యేక సదుపాయాలను, ప్రచారాన్నీ స్వీకరిస్తూనే ఒక విశ్వసనీయతను, ఆమోదనీయతను సాధించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తున్నది. ఆ వ్యూహ సాధనకు సాధారణ ఎన్నికలు జరిగే 2014 సంవత్సరాన్ని గడువుగా భావిస్తున్నారు. కాకపోతే, ఆయన మనసులోను, ఆయన మాతృమూర్తి ఆకాంక్షల్లోనూ ఉన్న దీర్ఘకాలిక వ్యూహం అనుకున్న ఫలితాలను సాధిస్తున్నట్టు కనిపించడంలేదు.

నెహ్రూ వంశగౌరవం ఆధారంగా నేరుగా రాజకీయాల్లోకి, అగ్రస్థానానికీ వెళ్లకుండా, దీర్ఘకాలికమయిన ప్రస్థానాన్ని ఎంచుకోవడమే రాహుల్‌గాంధీ చేసిన పొరపాటేమో అనిపిస్తుంది. రాహుల్‌గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకుంటున్నదెవరు? ఎందుకని 2014ను అందుకు లక్ష్యంగా నిర్ణయించాలి? 2004లో పరిస్థితి వేరు, ఎన్నికల నాటికి రాహుల్ రాజకీయ ప్రవేశం జరిగి కొన్ని నెలలు మాత్రమే గడిచాయి. 2009లో ఆయనను ప్రధానిచేస్తే ఎవరు అభ్యంతర పెట్టేవారు? 2007లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు, యువజన, విద్యార్థి విభాగాలను ఆయన ప్రక్షాళన చేయడం ఆరంభించారు. యుపి ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచిన కీర్తి కూడా సంపాదించారు. వచ్చే 2014లో అయినా, కాంగ్రెస్ కూటమే అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన ఎన్నిక కావడానికి ఉన్న అవరోధమేమిటి? నిజానికి అభ్యంతరాలూ అవరోధాలూ ఏమీ లేవు. సోనియాగాంధీ ప్రధాని కావడానికి ఉన్న అభ్యంతరా లు రాహుల్‌కు ఉండవు. కాంగ్రెస్‌పార్టీలో ఆనువంశిక నాయకత్వం కొత్తదేమీ కాదు. కానీ, సోనియాగాంధీ కానీ, రాహుల్‌గాంధీ స్వయంగా కానీ, కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ ఉండే లోక్‌సభను లేదా ఒకటిరెండు పార్టీలతో తప్ప భాగస్వామ్యం అవసరం లేని భారీబలాన్ని

Tuesday, November 23, 2010

'రాజా'ల కూటమిలో మీడియా కూడానా?

ఆశ్చర్యం, అవినీతి మళ్లీ జాతీయ చర్చాంశం అయి కూర్చుంది. అప్పుడెప్పుడో బోఫోర్స్ కుంభకోణం సందర్భంగా రాజకీయాల్లో అవినీతి గురించి, కంపెనీలకు వారి దళారులకు రాజకీయవేత్తలకు ఉండే సంబంధం గురించి కలకలం రేగింది. అది రాజీవ్ ప్రభుత్వ పతనానికి, కుడిఎడమల మద్దతుతో ఒక భిన్నమయిన ప్రభుత్వం అవతరించడానికి దారితీసింది. ఇప్పుడు ప్రభుత్వాలేమీ కూలిపోయే పరిస్థితి లేదు కానీ, మహా మహా శిఖరాలు కూలిపోతున్నాయి.

అవినీతి ఒక శాశ్వత సత్యమని, దానితో సహజీవనం చేయవలసిందేనని మనసు రాయి చేసుకున్న జనం కూడా గుండెలు బాదుకునేంత హీనమయిన, దారుణమయిన అవినీతి అనుభవంలోకి వస్తున్నది. ఈ పాపాలకు బాధ్యత వహిస్తూ ఏవైనా తలకాయలు దొర్లవలసిందేనని ప్రజలు ఏమీ పట్టుపట్టడంలేదు కానీ, విశ్వసనీయత కోల్పోయిన స్థితిని భరించలేక వ్యవస్థే ఏదో ఒకటి చేసి తనను తాను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నది. పరిస్థితి చేయి దాటిపోలేదని, ఆశ చంపుకోవలసిన పనిలేదని నమ్మకం కలిగించాలని చూస్తున్నది.

మన్మోహన్‌సింగ్ వ్యక్తిగత నిజాయితీ గురించి ఇప్పటికి వాడిన విశేషణాలను, రాసిన వాక్యాలను పోగేస్తే అవి బస్తాల కొద్దీ ఉద్గ్రంథాలవుతాయి. విషాదమేమిటంటే, వ్యవస్థాగతంగా అతి పెద్ద అవినీతి యంత్రాంగాన్ని నిర్వహించే పవిత్ర బాధ్యతలో ఆయన తలమునకలు కావలసి వచ్చింది. గత ఇరవయ్యేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటీకరించడం తో మొదలుపెట్టి, ప్రస్తుతం సహజ వనరులను (స్పెక్ట్రమ్ కూడా సహజ వనరేనని అంటున్నారు) వ్యాపారులకు దోచిపెట్టడం దాకా సాగుతున్న నూతన ఆర్థికవిధానాల గమనం లో, చేతులు తడుపుకునే అవకాశాన్ని ఏ ద్వారపాలకుడూ వదిలిపెట్టడం లేదు. ఆ దళారీ వాటాల కోసమే రాజకీయాలలోకి ఉన్న, కొత్తగా వస్తున్న శ్రేణులు ఎగబడుతున్నాయి.  సంస్కరణలతో పాటుగా వెలసిన అనేక అడ్డదారుల్లో అకస్మాత్ సంపన్నులవుతున్న

Tuesday, November 16, 2010

ప్రజాస్వామ్యం, వెన్నుపోట్లు, కుటుంబపాలన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ సర్‌సంఘ్‌చాలక్ కె.ఎస్. సుదర్శన్ సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని, నిరసననీ సృష్టించాయో చూస్తున్నాము. ఇందిర, రాజీవ్ హత్యల్లో సోనియా ప్రమేయం ఉన్నదన్న ఆరోపణను పరిగణనలోనికి తీసుకోవడం కూడా అనవసరం. మధ్యయుగాలలోని పామర పౌరులెవరో రాచరిక రాజకీయాల గురించి చెప్పుకునే కథలను పోలిన మాటలవి. ఆ వ్యాఖ్యల కు తమ ఆమోదం లేదని చెప్పిన తరువాత ఆర్ఎస్ఎస్‌ను నిందించడం కూడా అనవసరం. సోనియాగాంధీ విదేశీ సంతతికి చెందిన వ్యక్తి కావడాన్ని దృష్టిలో పెట్టుకుని, అంతఃపుర కుట్ర లాంటిదేదో జరిగి జాతీయ నేతల హత్యలు జరిగాయని సుదర్శన్ ఆరోపించి ఉండవచ్చు.కానీ, ప్రజాస్వామ్యంలో అంతఃపుర కుట్రలు జరుగుతాయా? నేపాల్‌లో బీరేంద్ర కుటుంబాన్ని జ్ఞాతి జ్ఞానేంద్రే హత్య చేసినట్టు (అందులో ఇండియా ప్రోత్సాహమూ ఉన్నట్టు..) విశ్వసించేవారు ఉన్నారు. ఆ దేశమంటే రాజరికంలో ఉండింది కాబట్టి, కుట్రలు జరగవచ్చును కానీ, భారత్ వంటి ప్రజాస్వామ్యంలో అటువంటివి సాధ్యమా?

వెన్నుపోట్లు రాచరికాల్లో ఉంటాయి కానీ ప్రజాస్వామ్యంలో ఉండవు అని ఒక టీవీచర్చలో ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. 1995లో ఎన్టీయార్ విషయంలో జరిగింది రాజకీయమైన చీలికే తప్ప, వెన్నుపోటు కాదని ఆ విశ్లేషకుడి వాదన. కావ చ్చు. రాజకీయమైన అభ్యంతరాలే నాటి పరిణామాలకు దారితీసి ఉండవచ్చు. కానీ, ఇన్నేళ్లు గడచినా సాధారణ ప్రజల జ్ఞాపకంలో చంద్రబాబునాయుడు తన మామగారికి అన్యాయం చేశారన్న ముద్రే కొనసాగుతున్నది. నాటి పరిణామాల తరువాత, చంద్రబాబును ప్రజలు ఆమోదించి ఉండవచ్చు, ఎన్నికల్లో తమ ఘనమైన సమ్మతినీ తెలిపి ఉండవచ్చు. అయినా, ఎన్టీయార్ దయనీయంగా పదవీచ్యుతులు కావడం, తరువాత కొద్ది కాలానికే కన్నుమూయడం వల్ల- ఆయనపై సానుభూతి నాటి పరిస్థితులకు అతీతంగా స్థిరపడిపోయింది. ఆంతరంగిక కుట్రకు అన్యాయమైపోయిన చక్రవర్తిని తలచుకున్నట్టే ఆయనను తలచుకుంటున్నారు. జనంలో ఉన్న తలపును ఆసరా చేసుకుని చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు తరచు ఆయనను నిందించడానికి 'వెన్నుపోటు' ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అధికార సోపానాన్ని అధిరోహించడానికి ముఖ్యమంత్రులపై అసమ్మతి అస్త్రాన్ని ప్రయోగించారని, ఒకానొక సందర్భంలో రాజధానిలో మతకలహాలను కల్పించి ముఖ్యమంత్రిని పదవీచ్యుతుడిని చేశారని దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి మీద వచ్చిన ఆరోపణ కూడా ఏ ఆధారమూ లేకపోయినా

Monday, November 8, 2010

ఒబామా సందర్శన: కొన్ని సంకేత స్థలాలు

18సెప్టెంబర్ 1857. ఎర్రకోటకు నాలుగు మైళ్ల దూరంలో...
మేజర్ విలియమ్ హడ్సన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
దగ్గరలోని కట్టడం నుంచి కదిలిన పల్లకీ హడ్సన్ ముందు ఆగింది. భారతదేశపు చివరి చక్రవర్తి రెండో బహదూర్ షా జఫర్ అందులో కూర్చుని ఉన్నాడు.
'హడ్సన్ గారూ, మీ హామీని మరోసారి చెబుతారా?'- అని అడిగాడు వృద్ధచక్రవర్తి. అప్పటికి అతను మానసికంగా చచ్చిపోయి ఉన్నాడు. ఎర్రకోటనుంచి భార్య జన్నత్ మహల్‌తో , అతి కొద్దిమంది పరివారంతో బయటపడి అక్కడ తలదాచుకుంటున్నాడు.

భారత ప్రథమ స్వాతంత్య్రపోరాటం అప్పటికి అణగారిపోయింది, ఢిల్లీ తెల్లవాళ్ల చేతుల్లోకి పోయింది. ఇంకా మిగిలి ఉన్న తిరుగుబాటుదారులు తమ సంకేతాత్మక సేనాధిపతి బహదూర్‌షాను తమతో పాటు రమ్మంటున్నారు. వృద్ధాప్యం, మొగల్ రాజ్యం తనతో అంతరిస్తుందన్న వేదన, పోరాటంలో దేశం పరాధీనమైపోయిందన్న బాధ, గెలవలేమన్న నిరాశ- అతన్ని ఎటూ తేల్చుకోకుండా మథనపెడుతున్నాయి.

మీ పరివారం ప్రాణానికి నాది హామీ- అని చెప్పాడు హడ్సన్. నాదిర్షా, జహంగీర్‌ల పేర్లు లిఖించి ఉన్న రెండు ఖడ్గాలను జఫర్ సమర్పించాడు. ఆ క్షణంతో భారతదేశ సర్వంసహాధికారం లాంఛనంగా అన్యాక్రాంతమైంది. బలహీనుడైన ఆఖరి మొగలాయి పాలకుడు సిపాయిల తిరుగుబాటు కంటె చాలా ఏళ్ల ముందే నామమాత్రుడైపోయాడు, ఢిల్లీకోటను దాటి ఎరుగని స్వచ్ఛంద బందీగా బతికాడు. కానీ, ప్రథమస్వాతంత్య్రపోరాటం అతన్ని తిరిగి దేశప్రేమికునిగా, సర్వసైన్యాధిపతిగా అభిషిక్తంచేసింది. హుమాయూన్ సమాధి దగ్గర దొరికిన జఫర్ బందీగా మాత్రమే తిరిగి ఎర్రకోటకు నడిచాడు.

ఆదివారం నాడు అమెరికా అధ్యక్షుడు హుమాయూన్ సమాధిని ప్రత్యేకంగా సందర్శించబోతున్నారు. భారతదేశపు సార్వభౌమాధికారం పాశ్చాత్యవలసవాదుల అధీనమైపోయిన ఆ స్థలంతో బరాక్ ఒబామాకు ఏమి పని? ఆ స్థలానికి ఉన్న ఆ విశేషమే ఆయనను ఆకర్షించిందా? నాడు కత్తులతో చేయవలసి వచ్చిన ఆక్రమణలు నేడు ఒప్పందాలతోనే జరిగిపోతున్నాయని చెప్పడానికి ఈ సమకాలీన చారిత్రక సందర్భం ఈ సన్నివేశాన్ని కల్పించిందా? హడ్సన్ ప్రాతినిధ్యం వహించిన శక్తులతో పోల్చడానికి ఒబామా సరిపోతాడేమో కానీ, బహదూర్‌షా జఫర్ కు చరిత్ర ఇచ్చినంత గౌరవం నేటి మన పాలకులకు ఇవ్వగలమా? ఆ చివరి చక్రవర్తి అంతిమదినాలలో చూపించిన ఆత్మాభిమానమో, దేశాభిమానమో మన ఏలికలకు ఉన్నదా?

హుమాయూన్ మొగల్ చక్రవర్తులలో పెద్ద ప్రాభవమూ వైభవమూ వెలగబెట్టినవాడు కాదు. బాబర్ తనయుడూ, అక్బర్ తండ్రీ కావడం తప్ప ఆయన సాధించినదేమీ కనిపించదు. రాజ్యం స్థిరపడకముందే బాబర్ మరణించగా, 22 ఏళ్ల వయస్సులోనే రాజ్యానికి వచ్చిన హుమాయూన్ అంతఃకలహాలను, తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. సుదీర్ఘకాలం ప్రవాసంలో గడిపాడు. యుద్ధంతో అట్టుడుకుతున్న రాజ్యాన్ని వారసత్వంగా పొంది, కుదురుకోవడానికే జీవితమంతా సరిపోయిన హుమాయూన్‌కు ఒబామాతో

Thursday, October 28, 2010

పేరు మార్చవద్దు

కావలసినవారు కన్నుమూసినప్పుడు, వారి స్మృతిని చిరకాలం భద్రపరచుకోవాలని తాపత్రయపడడం మానవ సహజం. చనిపోయిన పెద్దల పేర్లను పిన్నలకు పెట్టి వారి జ్ఞాపకాన్ని కాపాడుకుంటారు. ప్రజలు తాము అభిమానించే నేతల పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. ప్రజా రంగంలో సేవ చేసిన వారి పేర్లను ప్రజా వ్యవస్థలకు పెట్టుకుంటారు. ఇందులో అభ్యంతర పెట్టవలసింది ఏమీ లేదు. కానీ, అభిమానం విపరీతమైనప్పుడు, స్మరణ భజనగా మారినప్పుడు, వ్యక్తి పూజ తారస్థాయికి చేరినప్పుడు అది వెగటు పుట్టిస్తుంది. అటువంటి వేలంవెర్రి వెనుక అధికార రాజకీయాల ప్రభావం, ప్రమేయం ఉన్నప్పుడు- ఎంతటి మహా నాయకుడి స్మరణ కూడా విముఖతనే కలిగిస్తుంది.

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న తెలుగు లలిత కళాతోరణానికి రాజీవ్‌గాంధీ పేరు జోడించబోతున్నారన్న వార్త వినగానే అటువంటి ప్రతికూల స్పందనే వ్యక్తమవుతోంది. ఆ నామకరణాన్ని వ్యతిరేకిస్తున్న వారు రాజీవ్‌గాంధీకి వ్యతిరేకులేమీ కాదు. ఆయన అంతటి గౌరవానికి అర్హుడు కారని కూడా ఎవరూ వాదించడం లేదు. తెలుగులలిత కళాతోరణం అవతరించిన నేపథ్యానికి, అది సంకేతంగా నిలిచిన సంస్కృతులకు రాజీవ్‌గాంధీకి ఏమి సంబంధమన్నదే వారి ప్రశ్న.

ఆ నామకరణానికి ఉన్న ఔచిత్యం గురించినదే వివాదమంతా! లలిత కళాతోరణాన్ని ఆధునీకరిస్తారట. ఆరుబయలు వేదికగా ఉన్న ఆ వ్యవస్థకు పై కప్పు సమకూరుస్తారట. ఇంకా ఏవేవో హంగులు ఏర్పాటు చేస్తారట. అందుకు ప్రభు త్వం వద్ద నిధులు లేవట. అందుకని దాతలు ముందుకు వస్తే, వారి పేరు జోడిస్తారట. ఒక మహాదాత అందుకు సిద్ధపడి, రాజీవ్‌గాంధీ పేరు పెట్టాలని కోరారట, ప్రభుత్వం అంగీకరించిందట. 'రాజీవ్ గాంధీ లలిత కళాతోరణం' అని పెట్టాలనుకున్నారట. నిరసనల వేడిచూసి 'తెలుగు' కూడా అందులో ఉంచడానికి ప్రభుత్వం ఒప్పుకుందట.

తెలుగు అన్న మాటను తీసేయకున్నా, రాజీవ్‌గాంధీ పేరు పెట్టడంలోని ఔచిత్యం ప్రశ్నార్థకంగానే మిగిలింది. గాంధీ, నెహ్రూ వంటి మహా జాతీయ నేతలను ఎట్లాగూ రకరకాల వ్యవస్థల ద్వారా గౌరవిస్తూనే ఉన్నాము. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి దేశ నేతల పేర్లను కూడా అనేక జనావాసాలకు, సంస్థలకు పెట్టుకున్నాము. వారి వారి ప్రాణ త్యాగాలు జరిగిన వెనువెంటనే అటువంటి స్మారక నామకరణాలు జరిగిపోయా యి. కాకపోతే, ఆ ఇద్దరి స్మృతికి 2004 తరువాత రాష్ట్రంలో పునరుజ్జీవనం మొదలయింది. తొమ్మిది సంవత్సరాల తెలుగుదేశం పాలన

Wednesday, October 27, 2010

మావోయిస్టులకు...అవసరమా?

సుమారు నెలరోజుల కిందట (సెప్టెంబర్28, 2010) టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే ఫలితాన్ని ప్రకటించింది. ప్రసిద్ధ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ ఐఎమ్ఆర్‌బి ద్వారా చేయించిన ఆ సర్వే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం గురించిన ఆసక్తికరమైన అంశాలను వెలికి తీసింది. గతంలో నక్సలైట్ల ప్రభావంలో ఉండి ఇప్పుడు సద్దుమణిగి న ఐదు జిల్లాల్లో అభిప్రాయ సేకరణ జరిగింది.  మొత్తం మీద నక్సలిజం మంచిదే అని 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కల్పనలో ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే నక్సలిజానికి మూలమని మూడింట రెండువంతుల మంది భావిస్తుండగా, నక్సల్స్‌ను అణచివేసిన తరువాత దోపిడీ పీడనలు పెరిగాయని 48 శాతం మంది దాకా అనుకుంటున్నారట. నక్సలైట్లను రాష్ట్రంలో భౌతికంగా లేకుండా చేసినప్పటికీ, వారి ప్రభావం, వారిపై సానుకూల దృష్టీ ప్రబలంగా ఉన్నాయని ఆ సర్వే నిరూపించింది.

అదే పత్రిక శనివారం (అక్టోబర్23, 2010) నాడు మావోయిస్టుల గురించి మరో ఆసక్తికరమైన వార్తా కథనాన్ని ప్రచురించింది. మావోయిస్టులు రాష్ట్రంలో పునరుజ్జీవం పొందుతున్నారా? అన్న ప్రశ్నా శీర్షికతో సాగిన ఆ కథనంలో పెద్దగా కొత్త విషయాలు ఏమీ లేవు కానీ, ప్రజాగాయకుడు గద్దర్ మావోయిస్టుల ప్రోద్బలం, ఒత్తిడి మేరకే తెలంగాణ ప్రజాఫ్రంట్‌ను స్థాపించారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నట్టు ఆ కథనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఫ్రంట్ స్థాపన ద్వారా మావోయిస్టుల ప్రాబల్యాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సూచించడానికి ఆ కథనం ప్రయత్నించింది. గద్దర్ రాజకీయ అభిప్రాయాలు, ఆయన అనుబంధాలు కొత్త విషయాలేమీ కావు. మావోయిస్టు అనుకూల రాజకీయాలను వదులుకోకుండానే, చాలా కాలంగా ఆయన తన కార్యాచరణ వేదికను విస్తృతం చేసుకుంటూ వస్తున్నారు.

సాయుధ పోరాట రాజకీయాలతో ఏకీభావమూ సంబంధమూ లేని అనేక సామాజిక ఉద్యమ సంస్థలు, బృం దాలు, వ్యక్తులు గద్దర్‌ను ఒక తరహా రాజకీయాలకే పరిమితమైన వ్యక్తిగాకాక, 'అంద రి' మనిషిగా పరిగణిస్తూ వస్తున్నారు. ఆయన ప్రజాజీవిత వ్యక్తిత్వంలో మార్పు ఉన్నందునే, ఏ రాజకీయ పక్షమూ కూడా ప్రజాఫ్రంట్ స్థాపన వెనుక ఎవరి హస్తమో ఉన్నట్టు బాహాటంగా ఆరోపణలు చేయలేదు. కాకపోతే, ఎన్నికలపై అనుసరించవలసిన

Monday, October 11, 2010

ఎన్నికలంటే ఎందుకు అంత బెదురు?

సమాజంలో మౌలికమయిన సామాజిక, ఆర్థిక మార్పులు ఎన్నికల ద్వారా వస్తా యా, పోరాటాల ద్వారా వస్తాయా అనే చర్చలో అర్థముంది. ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రాన్ని విడదీసి రెండు రాష్ట్రాలు చేయడం ఎన్నికల ద్వారా జరుగుతుందా ఉద్యమాల ద్వారానా అన్న ప్రశ్నకు అర్థమే లేదు. ఎందుకంటే, రాజ్యంగ పరిధిలోనే నెరవేరవలసి ఉన్న ఆకాంక్షలు ప్రజా ఉద్యమాల ద్వారానే పరిపూర్తి అవుతాయని చరిత్ర నిరూపిస్తూనే ఉన్నది. ఉద్యమ ప్రస్థానంలో ఎన్నికలు కూడా భాగమయి ఉండవచ్చును కానీ, ఎన్నికలే ఉద్యమంగా ఎన్నడూ ఏ ప్రత్యేక ఉద్యమమూ సాగలేదు.

ఉమ్మడి మద్రా సు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ, సంయుక్త మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడుగానీ, మొత్తంగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ అంతా కానీ ఉద్యమాల ద్వారానే జరిగింది. తొలి విడత రాష్ట్రాల ఏర్పాటు తరువాత తలెత్తిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. తొలివిడత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రజాఉద్యమంగా మొదలై, రాజకీయ సంస్థ రూపం తీసుకున్నది.

ఉద్యమం జరుగుతూ ఉండగానే ఎన్నికలు వచ్చినందున పోటీచేసి, తెలంగాణ ప్రజాసమితి ఘనవిజయం సాధించింది. ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ- నాయకత్వం ఉద్యమ విరమణ చేసింది. ఎన్నికల వల్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరదని చెప్పడానికి 1971 ఉదంతాన్ని పదే పదే ప్రస్తావించడం చూస్తుంటాము. అలాగే,

Saturday, October 9, 2010

సాటి లేని శంకరన్

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు- అని ప్రజాకవి అందెశ్రీ రాసిన పాట, మనుషులలో మృగ్యమవుతున్న మానవవిలువల గురించిన ఆవేదన కావచ్చును కానీ, మంచి మనుషులు భౌతికంగా కూడా మాయమైపోతున్నారు. నిజాయితీకి, నిప్పులాంటి ఆచరణకీ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మారుపేరుగా మెలగి న హక్కుల నేత కె.బాలగోపాల్ కన్నుమూసి ఏడాది అయిన సందర్భంగా శుక్రవా రం నాడు ఆయనను సగౌరవంగా కృతజ్ఞతతో ఇంకా ఆరని కన్నీళ్లతో సంస్మరించుకోబోతున్నాము. ఇంతలోనే మరో శిఖరం కూలిపోయింది. జీవితాంతం దళితుల సంక్షేమం కోసం, పేదవారి అభ్యున్నతి కోసం తపన చెందుతూ, అధికార యంత్రాంగం అనే ఇసుము నుంచి సంక్షేమ తైలాన్ని పిండిన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ గురువారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు రెండు దశాబ్దాల కిందట రిటైరయ్యేదాకా ప్రభుత్వ సర్వీసులోనూ, ఆ తరువాత సామాజిక కార్యక్షేత్రంలోనూ తాను నమ్మిన ఆదర్శాల కోసమే పనిచేస్తూ వచ్చిన అరుదైన వ్యక్తి శంకరన్. ఆయన చేసిన కృషిని సవినయంగా స్మరించుకుని శ్రద్ధాంజ లి ఘటించేటప్పుడు- ఆయన వంటి వారు రాను రాను కరువవుతున్న వర్తమానం భయం కలిగిస్తున్నది.

కుటుంబం స్వార్థ చింతన కలిగిస్తుందని, తన ఆదర్శాలకు అవరోధం అవుతుంద ని పెళ్లే చేసుకోకుండా ఉన్న వ్యక్తి శంకరన్. ప్రశాసన నగర్ వైభవం చూసిన వారికి పంజాగుట్టలో శంకరన్ నివసించిన పాతకాలపు క్వార్టర్స్ చూస్తే చాలు ఆయనేమి టో అర్థమవుతుంది. బాలగోపాల్‌లో లాగే శంకరన్‌లో కూడా నిరాడంబరత, నిస్వా ర్థం వ్యక్తిత్వ విశేషాలే తప్ప, అవే వారి వ్యక్తిత్వ సారాంశాలు కావు. పరిస్థితులను మార్చాలన్న దృఢమైన, చైతన్యవంతమైన సంకల్పమే వారి వ్యక్తిత్వాలను అట్లా తీర్చిదిద్దింది.

సాంఘిక సంక్షేమ శాఖలో ఆయన పనిచేసిన కాలం- శంకరన్ యుగం. ఆయన హయాంలో

Wednesday, October 6, 2010

గద్దర్ ఫ్రంట్

ప్రజాగాయకుడు గద్దర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ప్రజాఫ్రంట్ తెలంగాణ రాజకీయాల లో కలకలం సృష్టిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తిరుగులేని నాయకత్వశక్తిగా కనిపిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ఎస్)కి అకస్మాత్తుగా గట్టి పోటీదారు రంగప్రవేశం చేయడంతో, ఆ పార్టీ మీద అసంతృప్తి ఉన్న శ్రేణులు, శక్తులు అన్నీ పునఃసమీకరణ ప్రయత్నాలలో పడ్డాయి. కార్యవాదులైన విద్యార్థి ఉద్యమకారుల కమిటీలు, దళిత, బహుజ న, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యమసంఘాలు, క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేస్తూ నాయకత్వ సరళిపై ఆగ్రహంతో ఉన్న స్థానిక జేఏసీలు- గద్దర్ ఫ్రంట్‌కు తమ మద్దతు తెలియజేస్తున్నాయి. టిఆర్ఎస్ రాజకీయ వ్యూహంతో బెంబేలెత్తినట్టు కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు, తెలంగాణ ఉద్యమంలో అనుయాయి పార్టీగా మారిపోయి న బిజెపి నాయకులు కూడా ప్రజాఫ్రంట్ ప్రయత్నాన్ని స్వాగతించారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు కోసం ఉద్యమనిర్మాణం, డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ భారీ జనసమీకరణ- ఇవి రెండు మాత్రమే ఇప్పటివరకు ఫ్రంట్ కార్యక్రమం గురించి తెలిసిన అంశాలు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో జరిగే విస్తృత సమావేశం అనంతరం ఫ్రంట్ విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళిక వెల్లడవుతాయని భావిస్తున్నారు. ఆ తరువాతే, వివిధ రాజకీయ పక్షాలు ఫ్రంట్ గురించిన తమ అధికారిక వైఖరులను వెల్లడించే అవకాశం ఉంది.

మలి విడిత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టిఆర్ఎస్ ఆవిర్భావానికి ఆరేడేళ్లకు ముందే ఆరంభమయింది. 1996లో భువనగిరిలో జరిగిన 'తెలంగాణ జనసభ' ఉద్యమారంభ దశ లో మైలురాయి. తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొన్న నేతలు, వివిధ ప్రజాసంఘాలు, కళాకారులు పాల్గొన్న ఆ సభలో గద్దర్ ప్రధానాకర్షణ. అనంతరం, వరంగల్‌లో జరిగిన మరొక భారీ జనసమీకరణ తెలంగాణ ఉద్యమానికి రెండవ మైలురాయి. కళా, సాహిత్య,

Monday, October 4, 2010

సంయమనం, సెన్సార్‌షిప్

తీర్పులు చెప్పిన తరువాత సంచలనాలు, ఉద్రిక్తతలు రావడం మునుపు అనుభవమే కాని, ముందస్తుగా తేదీలు ప్రకటించిన తీర్పు చుట్టూ ఇంత ఉత్కంఠ, ఇన్ని భయాందోళనలు కమ్ముకోవడం మాత్రం అయోధ్య వ్యాజ్యం విషయంలోనే జరిగింది. అలహాబాద్ లక్నో బెంచి తీర్పు తేదీని ప్రకటించిన వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశం దేశప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా 'సున్నితమైన ప్రాంతాలు' అని భావించిన చోట భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు, అదనపు బలగాలను మోహరించారు, మీడియాకు ముందు జాగ్రత్తలు చెప్పారు. మతపెద్దలు, శాంతి కార్యకర్తలు హితబోధలు చేశారు. తీర్పు తేదీ సెప్టెంబర్24 నుంచి వాయిదాపడి చివరకు 30వ తారీఖుకు ఖరారు అయింది. తీర్పు వచ్చింది. ఏ హింసా సంఘటనలు లేకుండానే ఉద్రిక్తత చల్లారిపోయింది.

ఇంతకీ అంతటి భయం ఎందుకు వ్యాపించింది? సుమారు పాతిక సంవత్సరాలు గా భారతీయ సమాజంలో అశాంతికి, అనేక అప్రియ సంఘటనలకు కారణమైన ఒక సున్నితమైన వివాదానికి సంబంధించి వెలువడే తీర్పు-సహజంగా ఏ తీర్పు అయినా కక్షిదారులలో ఒకరికి అనుకూలంగా, మరొకరికి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి- తీవ్రమైన ప్రతిస్పందనలకు కారణమవుతుందని ప్రభుత్వాధినేతలు, అధికార యంత్రాంగం, రాజకీయ వాదులు ఆందోళన చెందారు. రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యతా రహితంగా వ్యవహరించే నేతలకు మన దేశంలో

Monday, September 27, 2010

బహుముఖమవుతున్న విభజన

సెప్టెంబర్24 నాడు ఏదో ఉపద్రవం రాబోతున్నదన్న భయం దేశమంతా వ్యాపించింది. అంతటి ముందు జాగ్రత్త బహుశా అవసరమే కావచ్చు. క్షణికావేశాలను, అవధుల్లేని ఆవేశ ఉద్వేగాలను అటువంటి వాతావరణం నెమ్మదింపజేసే అవకాశం ఉండవచ్చు. కానీ, భిన్న విశ్వాసాలున్న జనవర్గాలు తమ వివాదాలను స్వయంగా తామే న్యాయస్థానానికి అప్పజెప్పినా- సమాజంలో సంప్రదింపులు, సంభాషణ, నచ్చచెప్పుకోవడం కోర్టు బయట కూడా కొనసాగుతున్నప్పుడే న్యాయ నిర్ణయాన్ని అంగీకరించే సంసిద్ధత ఉభయ పక్షాలకూ సమకూరుతుంది.  లేకపోతే, బొమ్మాబొరుసా వంటి నిర్ణయమేదో న్యాయస్థానం నుంచి వస్తుందని, అది ఏదో ఒక పక్షాన్ని తీవ్రంగా ఆశాభంగానికి గురిచేస్తుందని భయపడక తప్పదు. పోయిన శుక్రవారం ఆ 'గండం' తప్పిపోయింది. ఇప్పట్లో మళ్లీ ఆ పరిస్థితి రాదని, ఏదో చేసి వివాదాన్ని తీర్పుతో సహా వాయిదాల అటక ఎక్కిస్తారని అనుకుంటున్నారు కానీ, 28 నాడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందో నిరీక్షించవలసే ఉన్నది.

అయోధ్య వివాదంతో పోల్చకూడదు కానీ, ఈ ముందు జాగ్రత్తల హడావుడి చూసినప్పుడు, రాష్ట్ర విభజన సమస్య కూడా చాలా మందికి స్ఫురించింది. శ్రీకృష్ణకమిటీ తన నివేదికను సమర్పించినప్పుడో, ఆ నివేదికపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించేరోజు వచ్చినప్పుడో కూడా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితే నెలకొంటుందా? ఆ నిర్ణయాన్ని నిబ్బరంగా స్వీకరించడానికి ఉభయ ప్రాంతాల ప్రజలు సంసిద్ధంగా ఉన్నారా? లాటరీ ఫలితం కోసం చూసినట్టుగా ప్రజలు ఎదురుచూస్తున్నారా? లేదా- నిర్ణయానికి తమను తాము సంసిద్ధం చేసుకుంటున్నారా?- ఈ ప్రశ్నలు సహజమైనవే కానీ, సమాధానం లేనివేమీ కావు. అయోధ్య వివాదానికీ, రాష్ట్ర విభజన సమస్యకూ తుదినిర్ణయం విషయంలో కూడా పోలిక లేదు. అయోధ్య విషయంలో సామాజిక సామరస్య ప్రక్రియలు,

Thursday, September 2, 2010

విమోచన వివాదం

సెప్టెంబర్‌17 మరొకసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఉధృతమైన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, ఈసారి వివాదం మరింత బలంగా ముందుకు వచ్చింది. అనుకూల ప్రతికూల వాదాలతో వాతావరణం వేడెక్కుతున్నది. 'తెలంగాణ విమోచన' దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడానికి ప్రభుత్వాల వద్ద  అప్రకటిత కారణాలేమి ఉన్నాయో అవి  ఇంకా యథాతథంగానే ఉన్నాయి. సెప్టెంబర్‌17 వ తేదీని  ఒక ఉత్సవదినంగా పరిగణించడానికి తెలంగాణలోని వివిధ వర్గాలకున్న అభ్యంతరాలు కూడా తొలగిపోలేదు. సీమాంధ్ర ప్రాంతం నుంచి కొత్తగా వినిపిస్తున్న వ్యతిరేకత కూడా ఈ పరిస్థితికి తోడవుతున్నది.

బ్రిటిష్‌ వలసపాలన భారతదేశంలో సృష్టించివెళ్లిన సమస్యలు అనేకం. అనేకానేక చారిత్రక కారణాల వల్ల బ్రిటిష్‌వారు భారతదేశంలోని అనేక భూభాగాలను ప్రత్యక్షంగా పాలించగలిగారు, అవే చారిత్రక కారణాల వల్ల కొన్ని ప్రాంతాలను స్వదేశీ సంస్థానాధీశుల సామంత పాలన కింద వదిలివేశారు. అటువంటి స్వదేశీసంస్థానాలలో ముఖ్యమైనది, పెద్దది హైదరాబాద్‌ సంస్థానం. అధికారికంగా హైదరాబాద్‌పాలకులు  సామంతులు కాకపోయినప్పటికీ, బ్రిటిష్‌వారి పరమాధికారాని (పారమౌంట్‌సీ)కి లోబడి వ్యవహరించారు. సొంతంగా సైన్యం, సొంతంగా విదేశాంగ విధానం లేని సంస్థానాధీశులు స్వతంత్రులని చెప్పడానికి లేదు, అదే విధంగా సొంత పోలీసు, న్యాయ యంత్రాంగాలు, సొంత కరెన్సీ కలిగినందున పూర్తి అధీనులనీ చెప్పలేము. హైదరాబాద్‌, కాశ్మీర్‌,మైసూర్‌, బరోడా వంటి సంస్థానాలలో ప్రజలు బ్రిటిష్‌వలసపాలనలోని మంచిచెడ్డలకు వెలిగానే ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాలు 1947 ఆగస్టు 15 తరువాత కూడా హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం పాలనలో ఉన్నాయి. భారతదేశానికి  స్వాతంత్య్రం 'ఇచ్చిన' బ్రిటిష్‌వారు, స్వదేశీసంస్థానాల భవితవ్యాన్ని త్రిశంకుస్వర్గంలో ఉంచారు. భారత్‌లో  కలవాలా, పాకిస్థాన్‌లో భాగం కావాలా, స్వతంత్రంగా ఉండాలా అన్నది సంస్థానాలే నిర్ణయించుకోవాలని చెప్పారు. సర్దార్‌ పటేల్‌ మంత్రాంగం వల్ల మూడువందలకు పైగా సంస్థానాలు భారతయూనియన్‌లో విలీనం కావడానికి అంగీకరించాయి కానీ, హైదరాబాద్‌,కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్థానాల విషయంలో సమస్య తలెత్తింది. ఏడవ నిజాం స్వతంత్రంగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. భారత-హైదరాబాద్‌ ప్రభుత్వాలు యథాతథ ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఫలితంగా 1947 ఆగస్టు 15 నాడు హైదరాబాద్‌ సంస్థానంపై పరమాధికారం బ్రిటిష్‌వలస పాలకుల నుంచి భారతయూనియన్‌కు సంక్రమించింది. బ్రిటిష్‌ రెసిడెంట్‌ స్థానంలో భారత ప్రతినిధి బాధ్యత తీసుకున్నాడు. 

Sunday, August 22, 2010

కోస్తా పొడవునా కొండచిలువ!

పదేళ్ల కిందటి మాట. మలివిడత తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే బలంగా వినిపిస్తున్నది. ఆ నేపథ్యంలో సమైక్యవాదాన్ని విశ్వసించే ఒక వామపక్షనాయకుడు ఒక ఆసక్తికరమైన వాదన వినిపించారు. 'కోస్తాంధ్ర అభివృద్ధి చెందిందం టే అందుకు భౌగోళికమైన కారణాలు కూడా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాలకు ఏ దేశంలో అయినా అభివృద్ధికి అధిక అవకాశాలుంటాయి.  చైనాలో కూడా కోస్తాప్రాంతాలన్నీ తక్కిన దేశం కంటె అభివృద్ధి చెందుతున్నాయి.' ప్రాంతీయ అసమానతలకు విధానపరమైన లోపాలు, ఆధిపత్యధోరణులు కారణమని భావించే వారికి ఆ నైసర్గిక, భౌగోళిక కారణాలు విచిత్రంగానే ధ్వనించాయి.

సముద్రతీరం మాత్రమే కాదు, కొన్నిచోట్ల జీవనదులు, మరికొన్ని చోట్ల పర్వతశ్రేణు లు, కొన్ని చోట్ల విశాలమైన మైదాన ప్రాంతాలు కూడా-ఆయా దేశాలకు సానుకూలతలుగా ఉంటాయి. జీవనం ఎంతో దుర్భరంగా ఉండే ఎడారి సీమలు కూడా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకు బంగారు గనులుగా పనికి వస్తాయి. పరిసర ప్రాకృతిక వ్యవస్థతో తన మనుగడను అనుసంధానించుకోగలిగితేనే మనిషి అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. సమాజాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఎట్లా సమష్టి ప్రయోజనాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకుంటారన్న ది, వాటి వాటి విచక్షణ, వివేకాల మీద ఆధారపడి ఉంటుంది.   దారిద్య్రం కానీ, సంపన్నత కానీ ఆ విచక్షణ, వివేకం మీదనే సంక్రమిస్తాయి. బంగారాన్ని తవ్వితీయడం తెలిసి, దాన్నొక సాధారణ అలంకార లోహంగా వినియోగించుకుంటున్న అమెరికా ఖండ మూలవాసులు యూరోపియన్ల దెబ్బకు దాదాపు అంతరించిపోయారు, అదే బంగారం అమెరికాను స్వర్ణమయం చేసింది. బంగారం, బొగ్గు, వజ్రాలు పుష్కలం గా ఉన్న ఆఫ్రికా ఖండం చీకటిలోనే మిగిలిపోయింది. వనరులు ఎక్కడ ఉన్నాయన్న ది కాక, ఎవరిచేతిలో ఉన్నాయన్నది చాలా ముఖ్యమైన అంశం.

శ్రీకృష్ణకమిటీ సభ్యుడు అబూ సలే షరీఫ్ గతవారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదిహేనేళ్ల కాలంలో కోస్తాంధ్రలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతుందని, ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అభివృ ద్ధి ఇకపై కోస్తాంధ్రకు తరలివస్తుందని ఆయన అన్నారు. గ్యాస్‌పైప్‌లైన్లు,

Monday, August 16, 2010

ఝండా వూంచా రహే హమారా

మూడునాలుగు దశాబ్దాల కిందటి దాకా ఆగస్టు 15 అంటే కనీసం పిల్లల కు ముఖ్యంగా పల్లెల బడిపిల్లలకి పెద్ద హడావుడి. తెల్లవారుజామునే లేచి ఊరుఊరంతా చుట్టేసే ప్రభాతభేరి. బోలో స్వతంత్రభారత్‌కీ జై, గాంధీ మహాత్మునికీ జై, పండిట్ నెహ్రూ అమర్‌హై- అంటూ చిన్నారిగొంతుల నినాదా లు. స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియకపోవచ్చు, ఏ పరాధీనత నుంచి విము క్తి లభించిందో అర్థం కాకపోవచ్చు. కానీ, ఏదో ఒక ఉద్వేగం. దేశభక్తి గీతాలు వింటే ఒక పులకింత. సినిమాల్లో గాంధీ నెహ్రూల క్లిప్పింగులు కనిపిస్తే, చప్పట్లతో నివాళులు. దేనినో పొందిన ఉత్సాహం ఇంకా కొత్తగానే ఉన్న రోజులు. నిరా శ ఆవరిస్తున్నా నిస్ప­ృహలోకి వెళ్లని రోజులు. కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి- అంటూ దేశభక్తికి కొనసాగింపు కోరుతున్న సందేశాలు. త్యాగం,నిరాడంబరత, సమాజహితాన్ని కోరే ఆదర్శం- ఇంకా అప్పటికి చెల్లుతున్న నాణేలు.

పల్లెల్లో పరిస్థితి ఇప్పుడు బాగానే మారిపోయి ఉంటుంది. కొద్దిపాటి శక్తి ఉన్న కుటుంబాల పిల్లలంతా ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. స్పెషల్ క్లాసు లు రద్దుచేసి, జెండావందనాలు చేస్తారో లేదో తెలియదు. కార్పొరేట్ కాలేజీల్లో సోమవారం టెస్టులుంటాయి, ఆదివారం జెండాపండుగకు వచ్చి నాలుగు మార్కులు నష్టపోతారో లేదో తెలియదు. సర్కారీస్కూళ్లలో చదువుకునే ఎస్సీఎస్టీ అట్టడుగుబీసీ పిల్లలూ వాళ్లకుపాఠాలుచెప్పే పంతుళ్లలో మిగిలి న దేశభక్తులూ పాడుబడిన బడిగోడల మధ్య జెండా ఎగరేసి నాలుగుమంచిమాటలు చెప్పుకోవచ్చు.

పట్నాల్లో అయితే, ఏదైనా సరే ఒక తిరణా లే కాబట్టి, ఇండిపెండెన్స్ డే కూడా ధమాకా గానే జరిగిపోతుంది. ట్రాఫిక్ జంక్షన్లదగ్గర చిన్న చిన్న పిల్లలు కార్లకు అడ్డం పడి, జెండాలు అమ్ము తూ వ్యాపారదక్షత

Sunday, August 1, 2010

ఆశారాహిత్యమే అసలు కారణం

అప్పుడు చనిపోయిన వేణుగోపాలరెడ్డి, శనివారం నాడు కన్నుమూసిన ఇషాన్‌రెడ్డి ప్రత్యక్ష దృశ్యాలుగా మారకుండా అపరాత్రివేళ ఆత్మాహుతు లు చేసుకున్నారు కానీ, శ్రీకాంత్‌చారి కానీ, యాదయ్యకానీ వేలాది ప్రజల మధ్య, వందలాది కెమెరాకళ్ల ముందు తమను తాము అగ్నిజ్వాలలుగా ప్రదర్శించుకున్నారు. ఎవరైనాసరే ఎందుకైనా సరే ప్రాణాలు తీసుకోవడం సమర్థించకూడదు, అటువంటి చర్యలను ప్రోత్సహించకూడదు. అటువంటి ఆత్మహననానికి పాల్పడిన వారిని కీర్తించడం, శ్లాఘించడం కూడా పొరపాటే కావచ్చు. కానీ, ఈ దారుణాలకు, బీభత్స దృశ్యాలకు మానసిక దౌర్బల్యమో, నిరాశా నిస్పృహలో కారణమని నిర్ధారించి, విద్యార్థులకు, యువతకు ఉచిత ఉపదేశాలు చేయడం వల్ల ప్రయోజనం ఉన్నదా? ఇటువంటి విషాద సంఘటనలు పునరావృత్తం కాకుండా నిరోధించగలిగే శక్తి ఉద్యమ నాయకత్వం సహా సంబంధిత పక్షాలకు ఉన్నదా? వ్యక్తిగతంగా ఉజ్వల భవిష్యత్తు ఉండి కూడా ఒక ఆకాంక్ష నెరవేర్చుకోవడానికో, నెరవేరనందుకో ప్రాణాలు తీసుకుంటూ, ప్రాణత్యాగాన్ని ఒక రాజకీ య నిరసన రూపంగా మార్చుకుంటున్న యువతరానికి విశ్వాసం కలిగించగలిగిన చిత్తశుద్ధి మన నాయకులకు, పాలకులకు ఉన్నదా?

ఈ ప్రశ్నలు ఎందువల్ల ప్రాసంగికం అంటే- ఆత్మాహుతులు కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఉధృతం కావడం వల్ల మాత్రమే జరగడం లేదు. నెలకొని ఉన్న పరిస్థితుల మీద నిర్వేదంతో, ఉద్యమ గమనం మీద అసంతృప్తితో, నిర్ణయం తీసుకోవలసిన బాధ్యులలో కనిపిస్తున్న స్పందనా రాహిత్యంపై నిరసనతో జరుగుతున్నవి. తెలంగాణ సమస్య విషయంలో మాత్రమే కాదు, మొత్తంగా అన్ని ప్రజా సమస్యల విషయంలో పాలకులు, రాజకీయ పక్షాలు, ప్రభుత్వ యంత్రాంగం

Monday, July 26, 2010

ప్రతిష్ఠానం నుంచి బాబ్లీ దాకా...

నీటి కంటె నెత్తురు చిక్కన అన్నది ఇంగ్లీషు వాడి సామెత. మానవ సంబంధాల తిరుగులేని తనాన్ని చెప్పే వ్యక్తీకరణ అది. అలమట్టి వివాదం సందర్భం గా కర్ణాటకతో కానీ, తాజాగా బాబ్లీ సమస్య సందర్భంగా మహారాష్ట్రతో కానీ రాజకీయంగా ఎంతగా కత్తులు నూరుకున్నా- తెలుగు వారికి, కన్నడిగులకు, మహారాష్ట్రులకు మధ్య వైమనస్యం, విద్వేషం పాదుకొనకపోవడం నెత్తురు చిక్కదనాన్ని నిరూపించిన సందర్భం. తెలుగుదేశం పార్టీ నేతలపై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన దౌర్జ న్యం చిన్నదేమీ కాదు. అయితే, ఉభయ ప్రాంతాల మధ్య నిర్మితమైన అనుబంధం ఒక్క దుర్ఘటనతో చెదిరిపోయేదీ కాదు.

నీరు సామాన్యమైనది కాదు. పిడచగట్టుకుపోయిన గొంతులకు అది జీవధార అవుతుంది. చినుకై వానై మనుగడకు ఆధారమైనదే, వరదై విలయమై ఉనికినే తుడిచిపెడుతుంది. ప్రవాహాల వెంటనే మనిషి ప్రస్థానం సాగుతూ వచ్చింది. భూమీ నీరూ పచ్చదనమూ సంపదలైన తరువాత, వనరుల పంపకాల కోసం నెత్తురు జీవనదిగా పారింది.  అమృతం కోసం దేవదానవులు కొట్లాడుకున్నారేమో కానీ, మంచినీళ్ల కోసమే మానవులు మహాయుద్ధాలు చేశారు. న్యాయమే గెలిచిందో ఏ జగన్మోహిను లు వచ్చి అక్రమ పంపకాలు చేశారో తెలియదు కానీ, బలవంతుడి పెరట్లోనే గంగ మ్మ చెరపడింది. రాజులు మహానదుల కోసం పోరాడితే, సామాన్యులు పొలంగట్ల దగ్గర ఆరాటపడ్డారు.

అన్నదమ్ములై ఇచ్చిపుచ్చుకుంటే నీటికి కొదవేముంది కానీ, దాయాదులై దురాశాపరులైన మనిషికే దుర్భిక్షం ఎదురవుతున్నది. గౌతమ బుద్ధుని కాలం నాటికే గణతంత్ర రాజ్యాల మధ్య జలవివాదాలుండేవని చరిత్ర చెబుతున్నది. సమ్మక్కసారక్క జాతర కు నేపథ్యమైన యుద్ధం కూడా నీళ్ల కోసం జరిగిందేనని పురా ణం చెబుతోంది. ఐదునదులనూ నెత్తుటితో ముంచిన పంజాబ్ పోరాటం చివరకుఉగ్రవాదమో తీవ్రవాదమో అయింది కానీ, ఆరంభమయింది నీటి వాటా గురించిన ఆందోళనగానే.

మహారాష్ట్రతో మన సంబంధమేమిటని వేసుకునే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే కాదు, క్లిష్టం కూడా. రాష్ట్రాలు ఏర్పడి ఐదున్నర దశాబ్దాలు మాత్రమే గడిచాయని, ప్రజల భావోద్వేగాలు ఇంకా భాషాప్రయుక్తంగా స్థిరపడలేదని గుర్తించకపో తే, కొన్ని కొన్ని సౌహార్దతలు, కొన్ని కొన్ని అపనమ్మకాలు ఎందుకు బలపడ్డాయో అర్థం కావు. ఆర్యావర్తం, మధ్యభారతం, దక్షిణాపథం- వంటి స్థూల విభాగాలు భారతదేశానికి ఎప్పటినుంచో ఉన్నాయి కానీ, ఆ ప్రాతిపదికకు లొంగని ఇతర అస్తిత్వాలు కూడా చరిత్ర క్రమంలో ఏర్పడ్డాయి. నర్మద, తుంగభద్ర వంటి రెండు అప్రధాన నదుల మధ్య భూభాగం సుమారు ఏడెనిమిది శతాబ్దాలుగా 'దక్కన్' పేరుతో ఒకప్రత్యేక అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నది. అంతకు ముందు చాలా కాలం నుంచి, నేటి మహారాష్ట్రకు

Sunday, July 18, 2010

మళ్లీ వచ్చిన కృష్ణదేవరాయలు

'కృష్ణరాయలు తెలుగు దుర్గములగు కొండవీడు 'నగల్చ'గా, 'బెల్లముకొండ అచ్చు చెఱచ'గా, 'కంబుమెట్టు కదల్చ'గా, ఆనాటి ఆంధ్రకవులు 'భళా'అని ఆ కర్ణాట క్షితినాథుని కరవాల ధారాచకచ్చకలను వర్ణించిరే కాని ఆంధ్రులకు పట్టిన దుర్దశను గూర్చి కన్నీటి చుక్క వదలలేదు' (-సి.నారాయణరెడ్డి, ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు- ప్రయోగములు, 1989, పేజీ 373) 

చరిత్ర విచిత్రమైనది. అది గతం గురించి చెబుతున్నట్టుంటుంది కానీ, వర్తమానంమీదే దాని గురి. కాలం విధించిన కర్తవ్యం అసంపూర్తిగా ఉండిపోతే, ఆ చరిత్ర మళ్లీ మళ్లీ కొత్త కొత్త వ్యాఖ్యానాలతో ప్రత్యక్షమవుతుంది. చిహ్నంగా మారిన చరిత్రలో భావావేశాలకే కానీ, వాస్తవాలకు తావులేదు. ఆంధ్రదేశంలో మరోసారి వీరవిహారం చేస్తున్న శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి ఇరవయ్యొక్కేళ్ల పాటు ఎట్లా పాలించాడో, అతని మాతృభాష ఏమిటో, అతను ఏమేమి మంచిపనులు చేశాడో, పాలకుడిగా ఏయే కాఠిన్యాలను ప్రదర్శించాడో తెలుసుకుని అంచనా వేయడం ఒక పండిత ప్రక్రి య. కానీ, చరిత్రలోని చాలా మంది చక్రవర్తుల వలె అతను కూడా రాజకీయ చిహ్నంగా మారిపోయాడు కాబట్టి అతని గురించి మనమేమి చెప్పుకోదలచుకున్నా మో దాన్ని మాత్రమే వింటున్నాము.

కృష్ణరాయలు తెలుగువాడేనని బల్లగుద్ది వాదించేవారున్నారు. మావాడేనని చెప్పుకునే ఫలానా కులాలు అనేకం ఉన్నాయి. వైభవోజ్జ్వల విజయనగరం సామ్రా జ్యం కాకతీయ అవశేషమేనని చెప్పే చరిత్ర ఉన్నది. ఆ మాట ఉంటే కన్నెర్ర చే సే కర్ణాటక పండితులున్నారు. దక్షిణాదిలో ముస్లిమ్ రాచరికాన్ని నిలువరించిన హైందవ యోధుడిగా కృష్ణదేవరాయలను కీర్తించే దేశభక్తులున్నారు. లేదు, బుడత కీచులకు దేశంలో స్థావరమిచ్చినవాడు అతనేనని విమర్శించే సందేహ జీవులూ ఉన్నారు. రాచరికాన్ని పక్కన బెట్టి మానవత్వంతో చేసిన 'రాయల కరుణ కృత్యము'ల గురించి రచనలు చేసిన వారున్నారు. మల్లీశ్వరిగా తెరకెక్కించినవారూ ఉన్నారు. ఏ వివాద మూ లేని సార్వజనీన

Sunday, July 11, 2010

ఒక అబద్ధం కావాలి, ప్లీజ్!

ఆడుకుందునే అమ్మా నాకొక చంద్రుడు కావాలని రామచంద్రుడు అడిగినప్పుడు మంత్రి సుమంతుడు అద్దంలో ప్రతిబింబాన్ని చూపి అల్లరిమాన్పాడట. అట్లాగే, అనగనగా ఒక చిట్టి రాకుమారికి కూడా మబ్బుతునకతో ఆడుకోవాలని మనసయిందట. ఎవరూ తెచ్చి ఇవ్వకపోయే సరికి బెంగపెట్టుకుని మంచం పట్టిందట. చివరకు ఒక తోటమాలి దూది పోగేసి మబ్బుముక్కలా చేసి రాకుమార్తెకు ఇచ్చాడట. కోరినది నెరవేరినదీ అనుకుని అమ్మాయి కోలుకున్నదట. జురెక్ బెకర్ అనే జర్మన్ రచయిత రాసిన 'జాకబ్ ద లయర్' అనే నవలలో కథానాయకుడుతన అసత్యవర్తనకు సమర్థనగా చెప్పుకున్న కథ అది. జాకబ్ కానీ, సుమంతుడు కానీ చెప్పింది అబద్ధమా? లేక కృత్రిమ సత్యమా?

అగ్రజన్ముడి హక్కు కోసం బైబిల్‌లోని జాకబ్ కూడా అబద్ధమాడతాడు. బెకర్ నవలలోని జాకబ్, నవల పేరుతోనే వచ్చిన సినిమాలో హీరో రాబిన్ విలియ మ్స్ కూడా అబద్ధమాడతారు కానీ ఈ అబద్ధం వేరు, ఇది సత్యమంత పవిత్రమైనది. జర్మన్ ఆక్రమణలోని ఒక పోలిష్ ఘెట్టోలో యూదులు అత్యంత హీనమైన జీవితానికీ, అనివార్యమైన మరణానికీ నడుమ వేలాడుతూ ఉంటారు. ఫాసిజా న్ని తుడిచిపెట్టడానికి సోవియట్ సేనలు వస్తున్నాయన్న వార్త వారి కొనప్రాణాలకు కొత్తఊపిరి పోసింది.

లీలగా తెలిసిన ఆ సమాచారానికి చిలవలు పలవలు జోడించి, నిత్యం అసత్యంతో పోషించి జాకబ్ సహయూదులలో ఆశను సజీవం గా ఉంచుతాడు. తన దగ్గర రేడియో ఉన్నదని, దాని ఆధారంగానే తాను మిత్రరాజ్యసేనల కదలికల గురించి చెప్పగలుగుతున్నానని నమ్మిస్తాడు. ఆ రేడియో ఒక అబద్ధం. తాను రోజూ చెబుతున్న విజయవార్తలు అబద్ధం. గెస్టొపో జాకబ్ ను బంధించి, ఆ అబద్ధాన్ని అబద్ధంగా అందరిముందూ ఒప్పుకొమ్మని అడుగుతారు. తన అసత్యానికి కట్టుబడి జాకబ్ నోరుమెదపడు. అందుకు బదులుగా చచ్చిపోతాడు. ఘెట్టో అంతటినీ హింసాశిబిరాలకు తరలిస్తుండగా, రష్యన్‌సేనలు ఎదురుపడతాయి.

'జాకబ్ ద లయర్'లో నాయకుడు తోటివారి ఆశ కొడిగట్టకుండా చూడడానికి అబద్ధమాడితే, '

Thursday, July 8, 2010

వాస్తవాలు తెలియాలి

ఆదిలాబాద్ జిల్లాలో గత శుక్రవారం నాడు జరిగిన 'ఎన్‌కౌంటర్'లో మావోయిస్టు అగ్రనాయకుడు చెరుకూరి రాజకుమార్‌తోపాటు మరణించిన హేమచంద్ర పాండే ఎవరన్నది వివాదంగా మారింది. అతను పాత్రికేయుడని, బహిరంగ సాధారణ జీవితం గడుపుతున్న ఉద్యోగి అని భార్య, కుటుంబ సభ్యులు చెబుతుండగా, కాదు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి అని అధికార యంత్రాంగం వాదిస్తున్నది. మావోయిస్టు నేతను హతమార్చిన ఎన్‌కౌంటరే పెద్ద ప్రశ్నార్థకమైనప్పటికీ, అది ఆశ్చర్యపడనక్కరలేనంత, కొత్తగా ఆందోళనపడనక్కరలేనంత సర్వసాధారణమైనందున, పాండే గుర్తింపే ఇప్పుడు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది.

పాండే జర్నలిస్టు అయితే చంపకూడదని, నక్సలైట్ అయితే చంపవచ్చునని కాదు. పాత్రికేయుడై ఉంటే, వృత్తిపరమైన సమాచార సేకరణలో భాగంగా ఆజాద్‌ను కలసినప్పుడు, పోలీసులు ఆయనను చంపి ఉంటే, మన ప్రజాస్వామ్య, మానవ హక్కుల ప్రస్థానం మరో 'ఉన్నత' స్థానానికి చేరుకున్నట్టు లెక్క. అది సహజంగానే పత్రికలు, ప్రసార సాధనాలన్నీ ఆందోళన చెందవలసిన పరిణామం, స్వేచ్ఛను ప్రేమించేవారంతా కలవరపడవలసిన దుర్మార్గం. ఎన్‌కౌంటర్లలో ఉన్న బూటకానికి, దౌష్ట్యానికి తోడు మరింత క్రౌర్యం జతకలిసిన దారుణం. ప్రధాన స్రవంతి రాజకీయాల వైఫ ల్యం కారణంగా, దేశవ్యాప్తంగా వివిధ మిలిటెంట్ ఉద్యమాలు పెరిగిపోతున్నాయి, సంక్షోభం రానురాను ఉధృతమవుతున్నది. మావోయిస్టు ఉద్యమం మధ్య, ఉత్తర, తూర్పు భారత్‌లలో వేగంగా విస్తరిస్తున్నది.

ఈ పరిణామాలను ప్రజలకు నిష్పక్షపాతంగా అందజేయవలసిన బాధ్యత మీడియా మీద ఉంటుంది. ప్రభుత్వాలు వివిధ మిలిటెంట్ ఉద్యమాల నేతలను ఎట్లా పరిగణించినప్పటికీ, ప్రజాప్రయోజనాల రీత్యా,

Monday, July 5, 2010

బతుకును ప్రేమిస్తే మరణమే బహుమతి

రెండు దశాబ్దాల తరువాత కొత్త రూపు దిద్దుకుని విడుదలైన కొమురం భీమ్ సిని మా, నిర్మాణ ప్రమాణాలలో ఎన్ని పరిమితులున్నప్పటికీ, చెప్పవలసింది మాత్రం చెప్పగలిగింది. త్యాగానికీ సంకల్ప బలానికీ సాహసానికీ ఉండే శాశ్వత గౌరవాన్ని చాటి చెప్పింది. తన గురించి తాను మాట్లాడకుండా పక్కవాళ్ల గురించి మాట్లాడతావెందుకని నిజాము ప్రభుత్వాధికారి కొమరం భీమ్‌ను అడుగుతాడు. ముప్పై ఎకరాలు పట్టా ఇస్తానన్నా భీమ్ ఎందుకు పోరాటం విరమించడో అసిఫాబాద్ అవ్వల్ తాలూక్‌దార్ ఆశ్చర్యపోతాడు.

అధికారబలం ఉన్నవాడికి ప్రపంచమంతా బానిసల్లాగే కనిపిస్తారు. అర్థబలం ఉన్నవాడికి ప్రతీదీ అమ్ముడుపోయే సరుకుగానే కనిపిస్తుంది. ఆశ, ప్రలోభం, స్వార్థం, లాభం- ఇవి తప్ప మనుషుల్ని నడిపించేవేవీ ఉండవని వాళ్లకు గట్టి నమ్మకం ఉంటుంది. పైవాడికి మోకరిల్లడం, కిందివాడిని అణగదొక్కడం తప్ప మరో విలువ వాళ్లకు తెలియదు. ఏటికి ఎదురీదే ఉలిపికట్టెలను చూస్తే వారికి నిరసన. ఎవరైనా సరే, గెలవలేని యుద్ధాలు ఎందుకు చేస్తారన్నది వారికి కొరుకుడు పడని ప్రశ్న.

సమస్కంధులైనవారో, కాస్త అటూ ఇటూగా ఉన్న బలాల వారో ప్రత్యక్ష యుద్ధం ద్వారా విజేతలు కావడానికి ప్రయత్నిస్తారు. పాలకవర్గాల మధ్య, రాజుల మధ్య జరిగే దండయాత్రలూ ఆక్రమణలూ అటువంటి కోవలోకి వస్తాయి. కానీ, చరిత్రలో అన్ని యుద్ధాలూ అట్లా సమానస్థాయి పక్షాల మధ్య జరగవు. కొండలను ఢీకొనే పొట్టేళ్లూ, మహాశక్తులతో తలపడే అల్పప్రాణులూ మానవజాతి చరిత్ర నిండా తారసపడుతూనే ఉంటాయి.

ధర్మం పక్షానో, న్యాయం పక్షానో పోరాడేవాళ్లు, అవమానానికి వ్యతిరేకం గా, అభిమానాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేసేవాళ్లు జనగాథల్లో చిరస్మరణీయులుగా

Friday, June 25, 2010

 చీకటి రోజులు


"గట్టి ప్రతిపక్షం, స్వతంత్రమైన న్యాయవ్యవస్థ, ఆంక్షలు లేని మీడియా- ప్రజాస్వామ్య సౌధానికి ఈ మూడే స్తంభాలు. ఎమర్జెన్సీ ఈ మూడింటినీ ధ్వంసం చేసింది''- ముప్పయ్యైదేళ్ల కిందట జూన్25 అర్థరాత్రి ఇందిరాగాంధి విధించిన అత్యవసర పరిస్థితి పై అకాలీనాయకుడు లోంగోవాల్, తానింకా కటకటాల వెనుకకు వెళ్లక ముందు చేసిన వ్యాఖ్య అది.

ఎమర్జెన్సీ అనగానే, నిర్బంధానికి లోనయిన మహామహులైన జాతీయ ప్రతిపక్షనేతలతో పాటు, సంస్థలుగా మార్క్సిస్టు పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అనేక చిన్నా పెద్దా విప్లవసంఘాలు గుర్తుకు వస్తాయి కానీ, అకాలీదళ్ గురించి పెద్దగా చెప్పుకోము. కానీ, ప్రశ్నించే పెద్ద గొంతులన్నీ మూగబోయిన తరువాత కూడా అత్యవసర పరిస్థితి విధింపును  నిలకడగా బాహాటంగా ఎదిరిస్తూ వచ్చిన రాజకీయపక్షం అకాలీదళ్.  మొత్తం మీద ఎమర్జెన్సీ కాలంలో లక్షాయాభైవేల మంది నిరంతర నిర్బంధంలోకి వెడితే, అందులో సుమారు మూడోవంతు మంది అకాలీలు, వారి అనుయాయులైన సిక్కులే. ఆందోళనకారులపై, అకాలీనేతలపై ఇందిర ప్రభుత్వం విరుచుకుపడింది, జైళ్లలో కుక్కింది. అంతటితో ఆమె ప్రతిక్రియ పూర్తికాలేదు. అది ప్రతీకారంగా రూపుదిద్దుకుంది.  1980లో తిరిగి అధికారంలోకి రాగానే, పంజాబ్ అకాలీ ఉద్యమంలో చిచ్చుపెట్టే కార్యక్రమం చేపట్టింది. తరువాత కథ

Monday, June 21, 2010

దెయ్యాల వేదాలు, మానవ రవాణా

బాధ వేస్తుంది.

మనదేశం ఒక అమానవీయస్థితిలో ఉన్నందుకు గణాంకాల్లో పెద్దపీట లభిస్తే గుండె రగిలిపోతుంది. పనిమనుషులుగా వెట్టిమనుషులుగా వేశ్యలుగా పెద్దలూ పిన్న లూ రవాణా అవుతున్న దుర్మార్గం మనదేశంలో విస్త­ృతంగా జరుగుతున్నదని, దాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక అభియోగం మోపింది. కొలంబియా, నైజీరియా వంటి దేశాల కంటె కూడా మన దేశం అధ్వాన్నంగా ఉన్నదట. మానవ రవాణాలో దారుణపరిస్థితిలో ఉన్న మూడో అంచె దేశాలు- సౌదీ అరేబియా, జింబాబ్వేల కంటె కొంచెం మెరుగ్గా ఉండి, రెండో అంచెదేశాలలో స్థానం సంపాదించుకున్నదట.

ఇంతకీ ఈ మానవ రవాణా ఏమిటి? ఆధునిక రూపాలలో సాగుతున్న ఒకానొక శ్రామిక వ్యాపారం. బలవంతపు శ్రమ కావచ్చు, వెట్టి చాకిరీ కావచ్చు, రుణవిమోచనకోసం పనిచేయడం కావచ్చు, వలస వెళ్లి కష్టం చేయడం కావచ్చు, అపహరణకో మోసానికో గురై వ్యభిచారవృత్తిలోకి వెళ్లడం కావచ్చు, ఇళ్లల్లో పనిమనుషులుగా వెళ్లడం కావచ్చు, పిల్లల చేత పనిచేయించడం కావచ్చు, బాలవేశ్యలను తయారుచేయడం కావచ్చు... ఇవన్నీ పోవాలని ఎవరికి మాత్రం ఉండదు? సమాజంలో ఇటువం టి దుర్మార్గాలు ఉండడం ఎవరికి మాత్రం సంతోషం?

భూస్వామ్య వ్యవస్థలో వెట్టి ఒక దోపిడిరూపం. దానికి కులవ్యవస్థ కూడా తోడై సామాజిక సాధికారత లభించింది. స్వాతంత్య్రం వచ్చి ఇంత కాలమైనా భూస్వామ్యం మనదేశంలో చెప్పుకోదగినంత బలహీనపడిందని చెప్పలేము. కాకపోతే, ఇంకా పాతవ్యవస్థలు ప్రబలంగా ఉన్న ప్రాంతాలతో సహా, శ్రమదోపిడీ రూపాల్లో ఎంతో కొంత మార్పు వస్తున్నది. బహుశా అమెరికా విదేశాంగ శాఖ 'ఆందోళన' చెందుతున్నది ఈ అవశేష దురాచారం విషయంలో అయి ఉండదు. ఆధునికమైన, సమకాలికమైన వెట్టిచాకిరీల గురించి, మనుషుల నుంచి దౌర్జన్యంగా శ్రమను పిండడం గురించి ఆ దేశాని కి ఇంత కలవరం ఉండడం ఆశ్చర్యమే కాబట్టి, మరేదో అంతరార్థం కూడా ఈ అభియోగాల వెనుక ఉండవచ్చు.

అమెరికాకే కాదు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ దాతృత్వ సంస్థలకు కూడా మానవ రవాణా ఇప్పుడు ఒక ప్రియాతిప్రియమైన చర్చనీయాంశం. పశ్చిమం లో వాన పడితే ఇప్పుడు ప్రపంచం అంతా గొడుగు పడుతుంది కాబట్టి, భారతదేశం వంటి దేశాల్లో కూడా అది ఒక ప్రాధాన్య అంశం. ఈ మధ్య కాలంలో,

Sunday, June 13, 2010

భోపాల్‌: భూతమేకాదు భవిష్యత్తు కూడా!

పురుగుమందులు మనుషుల్ని చంపడం మనకు కొత్త కాదు.
ఎండ్రిన్‌ దగ్గర నుంచి మోనోక్రోటోఫాస్‌ దాకా  మందులన్నిటికీ  పురుగులకంటె మనుషులంటేనే మహా ఇష్టం. మనుషుల్ని పురుగుల్లా చంపడమంటే బలే ఇష్టం.
మిథైల్‌ ఐసో సైనేట్‌.
క్రిమిసంహారకాలని  తయారుచేయడంలో  అది ఒక రసాయనం. కట్టలు తెంచుకున్నప్పుడు అది విషవాయువై విరుచకుపడుతుంది.
అనగనగా పాతికేళ్ల కిందట, అది ఒకే ఒక్క రాత్రి భోపాల్‌ పట్నం మీద మృత్యువై వ్యాపించింది.  వేలాదిమందిని చంపేసింది, లక్షలాదిమందిని రోగిష్ఠులను చేసింది. అక్కడి గాలినీ నీటినీ సమస్త జీవనాన్నీ టన్నుల కొద్దీ విషంతో నింపింది.

అల్పప్రాణాలపై  అలక్ష్యంతో మాత్రమే విషవాయువు హత్యలు చేయదు. అహంకారపూర్వకంగా యుద్ధోన్మాదంతో కూడా హత్యలు చేస్తుంది. వియత్నాంలో అది భూతకాలం.  ఇరాక్‌లో, ఆఫ్ఘనిస్థాన్‌లో అది నిరంతర వర్తమానం. నాపామ్‌, లిండేన్‌, పైరేత్రమ్‌, అల్యుమినియమ్‌ఫాస్పేట్‌, డిల్ట్రిన్‌, డయాజినిన్‌... విష రసాయనాల జాబితా అనంతం.

విషం మారువేషం కూడా వేస్తుంది. హరితవిప్లవమై పలకరించి పెస్టిసైడై వెక్కిరిస్తుంది. విత్తనాన్నే కాదు చిత్తాలను కూడా జన్యుమార్పిడి చేస్తుంది. మనకు ఊపిరాడడం కోసం మన తలుపులకే కన్నం వేస్తుంది. ప్రజాస్వామ్యంలో  సంస్కరణల సంస్థానాలు నిర్మిస్తుంది.

యూనియన్‌కార్బైడ్‌ ఒక నామవాచకం కాదు. సర్వనామం. వారెన్‌ ఆండర్సన్‌ వ్యక్తి కాదు, వ్యవస్థ.  అన్నిటి కంటె అతి పెద్ద విషవాయువు సామ్రాజ్యవాదం, దానికి పర్యాయపదం అమెరికా.

***

వాస్కొడిగామా వచ్చి ఒక మిరియం మొక్క అడిగాడు. కంపెనీవాడు వచ్చి షాజహాన్‌ను మూడు అడుగులనేల అడిగాడు.  చంద్రగిరి చేరి చెన్నపట్నం అడిగాడు. కళ్లు తెరిచి చూసే సరికి, దేశం మీద యూనియన్‌ జాక్‌  రెపరెపలాడింది. గ్రామం కుత్తుక కోసి, మగ్గం వేళ్లు నరికి, పన్నుల  పంట పండించుకుని ఓడలకొద్దీ నెత్తుటినీ చెమటనీ తరలించుకుపోయింది.  

అదంతా ఫ్లాష్‌బ్యాక్‌. ఇప్పుడంతా కొత్తకథ. ఎవడూ వచ్చి మనల్ని స్థలం అడగడు. తలుపు దగ్గర నుంచుని రారమ్మని మనమే పిలుస్తుంటాము. భూమినిచాపగా చుట్టి వాడి చంకలో మనమే పెడతాము. పంచభూతాలను పళ్లెంలో పెట్టి మనమే సమర్పిస్తాము. వినయంగా అప్పు తీసుకుని విధేయంగా కప్పం కడతాము.  స్వేచ్ఛ కోరినవాడిని స్వచ్ఛందంగా మనమే చంపుకుంటాము. కోరితే, ఏలినవారికి  మన కుత్తుక కోసుకుని మనమే అప్పగిస్తాము. ప్రాణవాయువును ఎగుమతి చేసి, విషవాయువు దిగుమతి చేసుకుంటాము. వారి రథాల కోసం

Monday, June 7, 2010

కోహినూరే కాదు, ఇంగ్లండ్ వెలుగే మనది!

సుమారు ఇరవయ్యేళ్ల కిందట. రాంచీలో జర్నలిస్టుల జాతీయ సభలు జరుగుతుంటే వెళ్లి, పనిలో పనిగా కొందరు మిత్రులం బుద్ధగయ, రాజగృహ, నలంద చూడడానికి వెళ్లాం. నలంద నుంచి గయ తిరిగి వచ్చేటప్పుడు ఒక ప్రైవే టు జీపులో వచ్చాము. లోకల్‌గా షటిల్ సర్వీసు నడిపే ఆ జీపు డ్రైవర్ మా దగ్గర మనిషికి ఇర వై రూపాయలు అడిగాడు. అదే జీపులో ఎక్కిన ఇద్దరు విదేశీ టూరిస్టులకు మాత్రం మనిషికి మూడువందలు డిమాండ్ చేసి బేరం తరువాత రెండువందలకు దిగాడు. వాళ్లు అదే మహద్భాగ్యమని ఎక్కేశారు. మేం జీపు డ్రైవర్‌తో మాటలు కలిపి, అన్యాయం కదా, వాళ్ల దగ్గర రెండొందలు రెండొందలు వసూలుచేయడమని అడిగాము. అప్పుడా బీహారీ డ్రైవర్ చెప్పిన సమాధానం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. రెండొందలేళ్లు దోచుకున్నారు సార్, ఎన్ని రెండొందలు అయి తే ఆ బాకీ తీరుతుంది?''. ఆ ఇద్దరు విదేశీ టూరిస్టులు బ్రిటిషర్లు అవునో కాదో కానీ, ఆ డ్రైవర్ అందరు తెల్లటూరిస్టుల నుంచి అదే తర్కంతో నైతిక ధైర్యంతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నాడు.

navya. చరిత్రకు సంబంధించిన ఒక స్పృహ, చారిత్రక అన్యాయాలకు పరిహారం పొందాలన్న దృష్టీ ఒక సాధారణ ఉత్తరాది అర్థ విద్యావంతునికి ఉండడం ఆశ్చ ర్యం కలిగిస్తుంది. భారతదేశంలోని మహా మహా దేశభక్తులకీ, మేధావులకీ అటువంటి ఆలోచనే లేకపోవడంతో పాటు, అసలేమీ జరగనట్టు బ్రిటన్‌పైనా అమెరికాపైనా ఆరాధానాపూర్వక అభిప్రాయాలు ఉంటాయి. ముప్పయ్యేళ్ల కిందట ప్రిన్స్ చార్లెస్ మనదేశం వచ్చినప్పుడు ఒక సినిమా నటి ఆయనను ముద్దుపెట్టుకుని సృష్టించిన సంచలనమే తప్ప మరో రాజకీయ ప్రకంపన లేదు. మన రాష్ట్రం లో మాత్రం రాడికల్స్ అల్లూరి సీతారామరాజు అమరత్వాన్ని గుర్తుచేసుకుని గోబ్యాక్ చెప్పారు. భారతదేశం స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఎలిజబెత్ రాణి మన దేశ సందర్శనకు వచ్చినప్పుడు మాత్రం జలియన్ వాలాబాగ్ మారణకాండకు బ్రిటన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ప్రబలంగా వినిపించింది. చివరకు ఆమె క్షమాపణ చెప్పలేదనుకోండి. మధ్య ఆసియానుంచో, పడమటి కనుమల గుండానో మన దేశానికి వచ్చి రాజ్యాలు స్థాపించి

Monday, May 31, 2010

వైఎస్ జగనూ, శ్రీకృష్ణకమిటీ, చిరంజీవీ, మధ్యంతరమూ

రాష్ట్రంలో పెరిగిన రాజకీయ ఉష్ణోగ్రత యాదృచ్ఛికంగా ముసురుకున్న అనేక పరిణామాల ఫలితమని అనిపిస్తుంది కానీ, నిజంగా అందులో యాదృచ్ఛికత పాలు ఎంత ఉన్నదో ఆలోచించవలసినదే. భావోద్వేగాలు, ఉద్యమ అవసరాల రీత్యానే జగన్ పర్యటనను తెలంగాణవాదులు నిరోధించాలనుకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న కలహం కీలకదశకు చేరడానికి అది దోహదపడడమేమిటి, చిరంజీవికి సోనియా పిలువు రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు అదనపు ఓట్ల కోసమని చెబుతున్నా, అంతకు మించిన ఆంతర్యమేదో అందరికీ బోధపడడమేమిటి, తమ పార్టీ ప్రభుత్వం మీదనే జగన్ ఫిర్యాదు చేయడమేమిటి, తమ పార్టీ ఎంపీ మీదనే ప్రణబ్ బహిరంగ అభిశంసన ఇవ్వడమేమిటి- అంతా ఆశ్చర్యమే.

లగడపాటి దగ్గరనుంచి లక్ష్మీపార్వతి దాకా జగన్‌కు కొత్త సమర్థకులు లభించడమేమిటి, నిన్నటిదాకా తెలంగాణలో అనుంగు సహచరులుగా ఉన్నవారు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఎడం జరగడమేమిటి, ఇంత కోలాహలం నడుమ తెలుగుదేశం మహానాడు గొంతు పీలగానైనా వినిపించకపోవడమేమిటి- అన్నీ ఆశ్చర్యాలే.

navya. సద్దుమణిగిందనుకున్న తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉందని కొందరు కనిపెట్టి ఉండవచ్చు. ప్రజారాజ్యానికి మంచిరోజులు వస్తున్నాయని మరికొందరు శకునం చెప్పవచ్చు. జగన్‌తో పోరాడుతున్నది రోశయ్యో అధిష్ఠానమో ఎవరైతేనేం
వారిదే పైచేయి అయిందని ఇంకొందరు విశ్లేషించవచ్చు. అయితే ఏమిటి? అంతవరకేనా ఆసక్తులు ఉండవలసింది? పైనచెప్పిన పరిణామాలూ వ్యక్తులూ సంస్థలూ ఉద్యమాలూ అన్నీ అందరూ ప్రజాజీవనంతో ముడిపడిఉన్నవారు కాదా?

Sunday, May 23, 2010

కార్పొరేట్ రాజ్యమూ... కొల్లాయి గాంధీ..

"నేను ప్రభుత్వం వారి ఆస్తిని కాదు. అమెరికా ప్రభుత్వానికి ఇక వీడ్కోలు. నా ఇష్టానికి వ్యతిరేకంగా అది నా మీద రుద్దిన పౌరసత్వానికి వీడ్కోలు. అది చేసే హత్యల్లో నేను భాగం కాలేను, నాకు జీవితం మీద అపారమైన ప్రేమ ఉంది.''- పోయిన సంవత్సరం జూన్19 నాడు తన అమెరికన్ పాస్‌పోర్టును, బర్త్ సర్టిఫికేట్‌ను ముక్కలు ముక్కలు చేసి ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి మీద సమర్పిస్తూ జెఫ్ నేబెల్ చేసిన ప్రకటనలోని కొన్ని వాక్యాలవి.   వియత్నాం యుద్ధంలో పాల్గొని, అమెరికాయుద్ధోన్మాదం ఎట్లా ఉంటుందో స్వానుభవంలో తెలుసుకుని, గాంధీ రచనల ద్వారా ప్రత్యామ్నాయ ఆలోచనల ప్రేరణ పొందిన నేబెల్ పదిహేను సంవత్సరాలుగా భారత్‌లోనే ఉంటున్నారు. మానసికంగా అమెరికాతో ఎప్పుడో తెగదెంపులు చేసుకున్న నేబెల్, సాంకేతికంగా కూడా మాతృదేశాన్ని పరిత్యజించారు.

navya. అమెరికా ప్రభుత్వమే కాదు, ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ దుర్మార్గమైనవే అన్నది నేబెల్ అవగాహన. ఇరవయ్యొకటో శతాబ్దం ప్రథమదశాబ్దం ముగుస్తున్నప్పుడు- గాంధీ, సత్యాగ్రహం అన్న మాటలు అతి పురాతనంగా, శిథిలంగా వినిపిస్తున్నప్పుడు నేబెల్ ఒక ఉలిపికట్టె, తెల్లతోలు ఉలిపికట్టె.

నేబెల్ ఇప్పుడు ఏ దేశపౌరసత్వమూ లేని మనిషి. అమెరికా పౌరుడిగా ఆ దేశ ప్రతిష్ఠను, సర్వాధికారాన్ని ధిక్కరించిన నేరగాడు. అతను భారత్‌లో ఏ ప్రతిపత్తితో నివసించగలడు? తనకు ఆశ్రయం ఇవ్వాలని అతను కోర్టును కోరాడు. అతని నివేదన విచారణలో ఉన్నది. దౌత్యఅంశాలు, చట్టపరమైన నిబంధనలు ఏమి చెబుతున్నా, అతను గాంధేయవాదిగానే ఆ సత్యాగ్రహాన్ని ప్రదర్శించాడన్నది ఫలితంపై ప్రభావం చూపించక తప్పదు. సోషలిజాన్ని సాధన చేసిన దేశాల దగ్గరనుంచి, నియంతృత్వంతో తలలెగురవేసిన దేశాల దాకా- అన్నీ దుర్మార్గమైన ఏకస్వామ్య దేశాలనీ, ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ అంటే ఆయా దేశాల ప్రజలకు తెలియదని అమెరికా చెబుతూ వచ్చింది, దేశదేశాల నుంచి ఏలికల బాధలు పడలేక శరణు కోరిన వారికి తన పాదాల చెంత కొంత చోటిచ్చింది. 

Thursday, May 20, 2010

సరిహద్దులు

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి పనిచేస్తున్న శ్రీకృష్ణ కమిటీ ప్రస్తుతం సాగుతున్న 'సరిహద్దు'వివాదాన్ని గమనిస్తున్నదో లేదో తెలియదు. జనం సంగతేమో కానీ, రాజకీయాలలో మాత్రం స్పష్టమైన విభజన కనిపిస్తున్నది. ఎటువంటి ప్రత్యేక అనుమతులూ లేకుండా దేశంలోనే ఎక్కడైనా ఎవరైనా సంచరించవచ్చునని రాజ్యాంగం చెబుతుండగా, ఇంకా విభజన జరగని ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మరొకరు పర్యటించడం మీద పెద్ద రగడే జరుగుతున్నది.

వై.ఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్ మలివిడత 'ఓదార్పు యాత్ర' తెలంగాణ ప్రాంతంలో జరగనున్నది. లోక్‌సభలో సమైక్యాంధ్ర పక్షాన నిలిచిన జగన్ తెలంగాణలో అడుగుపెట్టడానికి వీలులేదని, ప్రతిఘటిస్తామని తెలంగాణ వాదులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆసక్తికరంగా ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీలో చిరుపోరు జరుగుతోంది. ఇక, ప్రత్యేకాంధ్రవాదుల ఆహ్వానం మీద ఈ నెలాఖరులో తీరాంధ్రలో పర్యటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె.చంద్రశేఖరరావు నిర్ణయించుకున్నారు. పర్యటనకు అభ్యంతరం లేదని సమైక్యాంధ్రవాదులు, నేతలు అన్నారు కానీ, గతంలో వాడిన 'విద్వేష' భాషకు కెసిఆర్ క్షమాపణ చెప్పికానీ రావడానికి వీలులేదనే గొంతులూ వినిపిస్తున్నాయి.

ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చుననే దానిలో సూత్రప్రాయంగా అభ్యంతరపెట్టవలసినదేమీ ఉండదు. ప్రజారంగంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను, సందర్భశుద్ధిని, ఔచిత్యాన్ని పరిగణనలోకి తీసుకుని తమ తమ చర్యలను రూపొందించుకోవలసి ఉంటుంది. ఎవరి సంచారమైనా జనభద్రతకు హానికరంగా పరిణమిస్తుందని భావించిన పక్షంలో

Sunday, May 16, 2010

 ఉరిశిక్షతో అంతా క్షేమమా?

కొందరు నిష్క్రమించినప్పుడు ప్రపంచం కాసేపు లేదా కొన్నాళ్లు శూన్యంగా కనిపించవచ్చు. మరి కొందరు వెళ్లిపోయినప్పుడు మాత్రం లోకం సజావుగా సాగుతున్నట్టు కనిపిస్తుంది కానీ, ఏదో ఒక చీకటి విడతలు విడతలుగా విరుచుకుపడుతుంది. పదే పదే ఆ ఖాళీని తడుముకోవలసివస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు, సమైక్యాంధ్ర నినాదం పరిస్థితిని అనూహ్యమైన మలుపులు తిప్పినప్పుడు - బాలగోపాల్ లేకపోవడం అటువంటి లోటుగానే కనిపించింది.   ఆయన క్రియాశీల ప్రజాజీవితం గురించిన లోటు సరే, ఆలోచనాపరుడిగా ఆయన ఉనికి చాలా అవసరంగా అనిపించిన సందర్భం అది. చలం చెప్పిన 'సూనృతశక్తి' కారణంగా లోకానికి దుర్నిరీక్ష్యంగా కనిపించి, అనివార్య గౌరవాన్ని, తన మాటలకు సాధికారతను పొందిన మేధావి ఆయన. అంతటా మౌనమో, ఒకే ఒక ఆవేశమో అలముకున్న సమయంలో, పరిస్థితిని అర్థం చేయించే చూపు ఆయన ఇవ్వగలిగేవాడు.

navya. బాలగోపాల్ ఇప్పుడేం చెబుతాడో అని వెదుక్కున్న అనేకానేక సందర్భాలలో తాజా సందర్భం కసబ్ ఉరిశిక్ష ప్రకటన. అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష తీర్పు అసహజమో అనూహ్యమో కాదు. కానీ దానికి భారతదేశ పౌరసమాజం, అందులోనూ ఉదారవాద భావాలున్న శ్రేణులూ ఎట్లా స్పందిస్తాయన్నది ఒక అవసరమైన కుతూహలం.
న్యాయం జరిగిందన్న ఆనందమూ దానితో ముడిపడిన ఆవేశోద్వేగాలూ అంతటా తీవ్రశ్రుతిలో వినిపించాయి తప్ప, భిన్నమైన స్వరాల అలికిడే లేదు. 'ఓపెన్' వారపత్రిక డిప్యూటీ ఎడిటర్ మనూజోసెఫ్ 'వేర్ ఆర్ ద బ్యూటిఫుల్ పీపుల్'?' (మే 14, 2010 సంచిక) అన్న వ్యాసంలో ఈ ప్రశ్నే వేశారు. కసబ్ వంటి వ్యక్తిని చంపకుండా వదిలిపెట్టాలని అనుకోగలిగే నైతిక ధైర్యం సామాన్యులకైతే ఉండదు కానీ, ఉన్నతమైన నైతిక స్పష్టత ఉన్న వాళ్లు ప్రతికూల స్పందనలకు, దూషణలకు కూడా సిద్ధపడి గొంతువిప్పాలి కదా? అన్నది ఆయన ప్రశ్న. బాలగోపాల్ ఉండి ఉంటే దీనిపై ఆలోచించడానికి ఒక ప్రాతిపదిక ఇచ్చి ఉండేవాడు.

మనూజోసెఫ్ ఆవేదనలో కొంత తొందరపాటు కూడా ఉన్నది. ఎంతటి అవగాహనాధైర్యమూ ఉన్నవారైనా సందర్భశుద్ధి లేకుండా స్పందనలను, అందులోనూ అప్రియ స్పందనలను అందించాలని కోరుకోవడం పొరపాటు, అందులోనూ జనంలో భావావేశాలు బలంగా ఉన్నప్పుడు. కాకపోతే, ఇప్పుడు ఘనీభవించిన మౌనాన్ని చూసినప్పుడు, క సబ్ విషయంలో కొంత కాలం గడచిన తరువాత అయినా గొంతులు విచ్చుకుంటాయా అని జోసెఫ్‌లో భయసందేహం కలిగి ఉండవచ్చు. ఎందుకంటే, కసబ్ మరణశిక్ష తీర్పు తరువాత వినపడవలసిన గొంతులేవీ వినిపించలేదు. మావోయిస్టు ఉద్యమం విషయంలో సాహసోపేతమైన రిపోర్టు రాసి, తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న అరుంధతీరాయ్ సైతం ఈ విషయంలో ఏమీ మాట్లాడలేదు. ఇందిర హంతకుల వకల్తా పుచ్చుకున్న రామ్ జెఠ్మలానీ వంటి వారు సైతం ఏమీ వ్యాఖ్యానించలేదు. కసబ్ విషయంలో జరగవలసింది ఒకటే అని దేశంలోని అసంఖ్యాకులు అనుకుంటున్నారు, ఈ విషయంలో మౌనమే శరణ్యమని ఇతరులు కూడా భావిస్తున్నారు. ఈ వాతావరణం ఎంత కాలం ఉంటుందో

Friday, April 30, 2010

ఖడ్గ సృష్టికర్త

"నిజంగా ప్రపంచానికి కవిత్వమే కావలిస్తే ఇంతకంటె అదను లేదు. సాహసీ! నీ సందేశం కోసం విశ్వం తన చాతక వదనం తెరుచుకున్నది. నీ గానానికి మా వీణా తంత్రుల శ్రుతి సవరిస్తున్నా ము. తలుపులన్నీ వివృతం చేసి ఉంటాము. నువ్వు రావాలి. రావా లి.... నువ్వు ఎప్పుడు వస్తావో! ఎలాగ వస్తావో! నువ్వు Cyclone లాగో, Sulphuric Acidలాగో గంధ సింధూరం లాగో గండ భేరుండం లాగో రావోయ్! రావోయ్! యువకవీ!! నవకవీ!!''
(శ్రీశ్రీ: 1936)

edit. కష్టజీవికి రెండువైపులా నిలబడిన కవికి నమస్కారం. కాలం కడుపుతో ఉండి కన్న మహాకవికి నమస్కారం. 'అంచనా వేయలేమతని చలచ్చంచల దీప్తలేఖిని' అంటూ తరతరాలు పారవశ్యపడిన ప్రతిభామూర్తికి నమస్కారం. అనేక శిఖరాలు అధిరోహించిన సాహసికి నమస్కారం. తప్పటడుగులు వేసిన పసి బాలుడికి, తప్పుటడగులు వేసిన సామాన్య మానవుడికి నమస్కారం.

హేలీ తోకచుక్కలాగో, గురజాడ 'తోకచుక్క'లాగో శ్రీరంగం శ్రీనివాసరావు 1910లో కళ్లు తెరిచాడు. డెబ్బైమూడు సంవత్సరాల పాటు ఈ లోకంలో తుఫానులాగా, గంధక«ధూమం లాగా, గండభేరుండంలాగా సంచరించాడు. వీరుడూ తానే విదూషకుడూ తానే అయి తిరిగి వెళ్లిపోయాడు. సమకాలంలోనూ భవిష్యత్తులోని అనంతకాలాల్లోనూ జాతిజనులు పాడుకునే 'మంత్రాలను' అందించి వెళ్లా డు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించాడు.

'మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం'- ఇదీ శ్రీశ్రీ సారాంశం. పతితులను, భ్రష్ఠులను, బాధాసర్పదష్టులను, అధోజగత్సహోదరులను, సమ్మె కట్టిన కూలీలను, వారి భార్యలను, పిల్లలను, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలను, ఉరితీయబడ్డ శిరస్సులను, పడుపుకత్తెలను, ఖైదీలను, ఖూనీకోర్‌లను,

Saturday, April 17, 2010

సైనిక రాజకీయవాదులూ, అర్ధ మావోయిస్టులూ..

ప్రపంచపు దుఃఖాన్ని కళ్లారా చూస్తున్నప్పుడు మిధ్యావాదాన్ని అంగీకరించలేము. లోకపు అశాశ్వతతని  చూస్తూ కూడా ఉనికే సత్యమని భ్రమించలేము. అందుకని, తథాగతుడు రెండు తీవ్రవాదాలనూ కాదని మధ్యేమార్గాన్ని ప్రతిపాదిస్తున్నాడు. కార్యకారణాల వల్లనే అస్తిత్వమూ నాశనమూ కలుగుతున్నాయి. కారణాన్ని అంతరింపజేస్తేనే కార్యంకూడా అంతరిస్తుంది.
- సంయుక్తాగమ, 12వ అధ్యాయం

ఏ దృక్పథం కారణంగా సమస్యలు ఉత్పన్నమయ్యాయో అదే దృక్పథంతో వాటిని పరిష్కరించలేము
- అల్బర్ట్ ఐన్‌స్టీన్

  navya.తనతో లేనివాళ్లంతా బిన్‌లాడెన్‌తో ఉన్నట్టేనని జార్జిబుష్ జూనియర్ 2001లో అన్నాడు. మావోయిస్టులపై తీవ్రమైన సాయుధ చర్యలు తీసుకోవాలనే వాదనతో ఏ మాత్రం విభేదించే వాళ్లయినా అర్ధమావోయిస్టులేనని బిజెపి నేత అరుణ్‌జైట్లీ అంటున్నాడు. పతంజలి కథలో ఒక తొండ ప్రపంచాన్ని అంతే సులువుగా అర్థంచేసుకుంటుంది.

  తొండలు, తొండలు తినేవి, తొండల్ని తినేవి- ఈ మూడే రకాల జీవులే ప్రపంచంలో ఉంటాయనేది దాని జ్ఞానం. సమస్యలను యుద్ధరంగంలో మాత్రమే తేల్చుకోవాలనుకునే వాళ్లంతా ప్రపంచాన్ని తాము, ఇతరులు అనే సరళమైన ద్వంద్వంలోనే అర్థంచేసుకుంటారు.

  తన కొలువు కూటంలోనే ఉంటూ వీలయినప్పుడల్లా హితవచనాలు పలికిన భీష్మద్రోణుల్ని పాండవ పక్షపాతులని నిందించగలిగాడుకానీ, సైన్యాధిపత్యం ఇవ్వవలసివచ్చినప్పుడు వారి విధేయతను దుర్యోధనుడు శంకించలేకపోయాడు. మావోయిస్టులంటే మనప్రజలే కదా, వారి మీద విమాన బాంబులను ఎట్లా వేస్తాం?- అని వ్యాఖ్యానించింది భారతవాయుసేన అధిపతి కాబట్టి సరిపోయింది కానీ, అతనొక రాజకీయవాది అయితే పార్లమెంటులో అతనికి ఐఎస్ఐ కిరీటాన్ని అల్‌ఖాయిదా పతకాన్ని దేశద్రోహ బిరుదాన్ని అలంకరించి ఉండేవారు.

  ప్రతిపక్షం అంతా ఒకటిగాఉంటే కాంగ్రెస్‌లో రెండు గొంతులు వినిపిస్తున్నాయన్నది బిజెపి ఆరోపణ. ఆకుపచ్చని వేట మీద వామపక్షమూ రామపక్షమూ ఒకటికావడం విడ్డూరం కానప్పుడు, ఛత్తీస్‌గఢ్‌లో, జార్ఖండ్, బెంగాల్‌లలో రాజకీయ ప్రయోజనాలున్న కాంగ్రెస్‌లో ఒక దిగ్విజయు డో మరొకరో భిన్నంగా మాట్లాడడంలో వింత ఏమున్నది? పంజాబ్‌లో అణచివేతను అతి పకడ్బందీగా నిర్వహించిన కెపిఎస్ గిల్ సైతం ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నదేమిటి, దాన్నెట్లా సమర్థిస్తాం- అని అడుగుతుంటే - ప్రజాప్రతినిధులుగా ఎన్నికై సమస్యను పౌర, రాజకీయ దృక్పథం నుంచి చూడవలసిన వారంతా యూనిఫారాలు ధరించిన తుపాకీ భాష మాట్లాడడం నేడు కనిపిస్తున్న దృశ్యం.  అడవుల్లో ఉండి పోరాడుతున్నవారు ఒకపక్షం, పార్లమెంటులో ఉన్నవారిది ఒకపక్షం- రెండు పక్షాలు

  Sunday, April 11, 2010

  నిరంతర మరణ స్రవంతి

  మనుషులు అట్లా మూటలు మూటలుగా, ఛిద్రమైన అవయవాలతో, కాలిపోయిన చర్మంతో కళేబరాలుగా మారిపోవడం గుండెల్ని పిండేస్తుంది. నిటారుగా నడవవలసిన మనుషులు అట్లా నేలపై శవాలుగా బారులు తీరడం బాధ కలిగిస్తుంది. మనుషులు, వాళ్లెవరైనా సరే, మనుషులైతే చాలు, నిస్సహాయంగా పిట్టలురాలినట్టు రాలిపోవడం అమానవీయమనిపిస్తుంది.

  ఏ అమ్మ కన్న బిడ్డలో, ఏ రైతు కొడుకులో, ఏ నిరుపేద సంతానమో దేశంకాని దేశంలో చావునోట చిక్కి తల్లులకు కడుపుకోత మిగిల్చినప్పుడు, రోదించాలనీ, కడివెడు కన్నీరు కార్చాలనీ ఏ అనుబంధమూ లేని వారికి కూడా అనిపిస్తుంది. దేవుడా, బీభత్స మరణాలు, అర్థాయుష్షులు లేని కాలంలోకి మమ్మల్ని తీసుకువెళ్లవా అని ప్రార్థించాలనిపిస్తుంది.

  navya. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో బుధవారం నాడు మావోయిస్టులు పన్నిన ఉచ్చులో చిక్కి 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించినప్పుడు అయ్యో పాపం అనుకోని వారుండరు. భారత్‌లో చురుకుగా ఉన్న మిలిటెంట్ ఉద్యమాలన్నిటిలో, చివరకు కాశ్మీర్ సాయుధసంస్థల చేతుల్లో కూడా ఇంతమంది భద్రతాసిబ్బంది ఒకే సంఘటనలో మరణించలేదు కాబట్టి, దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది. పాలనతో, భద్రతానిర్వహణతో సంబంధం ఉన్న వారంతా తీవ్రంగా కలవరపడ్డారు, ఆగ్రహం చెందారు. విశ్లేషకులు, విమర్శకులు, వ్యాఖ్యాతలు కూడా స్పందనల్లో ఆవేశాలకు ఉద్వేగాలకు పెద్దపీట వేశారు. సంఘటన ఎంతటి తీవ్రమైనదంటే, చివరకు ఆ నరహననానికి పాల్పడిన మావోయిస్టులు సైతం ఆ మరణాలకు విచారపడ్డారు.

  దుఃఖం కలిగినప్పుడు దుఃఖపడవలసిందే. మరణం ఎదురైనప్పుడు వెంటనే కలగవలసిన తెలివిడి- జీవితం కొనసాగవలసిందేనని. అప్పుడు దుఃఖ కారణాలను వెదకాలి. మళ్లీ అటువంటి దుఃఖం ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి. వివేకం లోపించనప్పుడు వ్యక్తులే అటువంటి సమీక్షకు సిద్ధపడతారు. అటువంటప్పుడు, యావత్ జాతికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మరింతగా బుద్ధికి పనిచెప్పాలి. ఆవేశాలకు లోనుకావడానికి ప్రభుత్వాధినేతలు పామర కక్షిదారులు కారు. కానీ, మన దేశరక్షణ మంత్రి చిదంబరం గారు మాత్రం ప్రతీకారభాష మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే ఆయన కూడా ఖంగు తిని ఉంటారు కాబట్టి, అట్లా మాట్లాడారు

  Sunday, April 4, 2010

  చందమామ లాంటి అందమైన దీవి...

  ప్రళయానికీ ప్రళయానికీ మధ్య ప్రపంచం, యుద్ధానికీ యుద్ధానికీ మధ్య శాంతి. అనేక గ్రీష్మాల మధ్య ఒక వర్షం. ముసుర్ల మధ్య తెరిపి. దుఃఖమే నిత్యం. ఆనందం బుద్బుదం.

  అంతా సమసిపోయినట్టే ఉంటుంది. కర్ఫ్యూ కాస్త సడలించినట్టే ఉంటుంది. జీవితం మళ్లీ మొదలయినట్టే ఉంటుంది. దుమ్ము కిందికి తోసేశాక, తివాచీ శుభ్రంగానే ఉంటుంది. కత్తులు మొలిచిన వీధి పూలతోట లాగా నటిస్తుంటుంది. నెత్తుటి ఆటను రేపటికి వదిలి, 'నేడు' శాకాహారి అవుతుంది. ఓ.కె. జీవితం రణరంగమైనప్పుడు, విరామకాలంలోనే జీవించడం నేర్చుకోవాలి. కాలికీ వేలికీ తగిలే కళేబరాల మధ్య ఒక తరం తరం గడిపింది బీరుట్ నగరం. బాంబుకీ బాంబుకీ నడుమ కునుకుతీయడం నేర్చుకుంది బాగ్దాద్ పట్టణం.

  navya. ఒక అర్థగోళం వెలిగిపోతున్నప్పుడు మరొక సగం చీకటిలో మునిగినట్టు- ఈ ప్రపంచం కొంత వైభవోజ్జ్వల మహాయుగంలో, మరికొంత వల్లకాటి అధ్వాన్నశకంలో. ఆమూలన చమురుచుక్క, ఈ మూలన ఇంధనం కావడమే ప్రపంచీకరణ. ఒక చెమటచుక్క ఖండాంతరాలు పయనించడమే ఏకధ్రువం. లోకానికంతటికీ ఒకేనేరం, ఒకరే పోలీస్- అదే నూతనవ్యవస్థ.

  సృష్టి ఆరంభకాలంలో- భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. - కదా? అందుకని ఒక నావను కల్పించి కొందరిని రక్షించాడు, భూమిని ముంచేశాడు. నేటి బలాత్కారాన్ని దేవుడు ఇంకా చూచియుండలేదు. మంచిమనుషులకు నావను

  Tuesday, March 30, 2010

  మట్టిదేశం

          (పాలమూరు.  అధికార భాషలో   ఆ జిల్లా పేరు మహబూబ్‌నగర్‌.  ఆకలిజిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా- ఇట్లా దానికి పర్యాయనామాలు అనేకం. బిరబిరా కృష్ణమ్మ ఆ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది కానీ, గుక్కెడునీరు కూడా ఎత్తిపోయదు.  దేశంలోని భారీ ప్రాజెక్టులన్నిటికీ మట్టి తట్టలు మోసింది పాలమూరు కూలీలే. బతుకు యుద్ధంలో పోరాడడానికి దేశం కాని దేశం వె ళ్లే పాలమూరు కష్టజీవులు, అయితే జీవచ్ఛవాలుగానో, కాకపోతే మృతదేహాలుగానో తిరిగివస్తారు. అక్కడ శాశ్వతంగా విడిదిచేసిన కరువు, దేవుని వరమో, ప్రకృతిశాపమో కాదని- అది మానవ  కల్పితమని, వ్యవస్థ దుర్మార్గం వల్లనే దురవస్థ అని చాటి చెప్పిన సంస్థ 'కరువు వ్యతిరేక పోరాట కమిటీ'. 1995 నుంచి 2005 వరకు దశాబ్దం పాటు, మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రామీణ జీవనబీభత్సాన్ని  హృదయవిదారకంగా,  ఉద్యమప్రేరకంగా ఆవిష్కరించిన సంస్థ అది. ప్రజలతో సజీవసంబంధం పెట్టుకుని, పుట్టినమట్టికి చుక్కనీరు కోసం తపించిన ఉపాధ్యాయ కార్యకర్తల అసామాన్య కృషి అది. కమిటీ వెలికి తెచ్చిన వాస్తవాలను, గణాంకాలను చట్టసభల్లో, రాజకీయసభల్లో వల్లెవేసి పేరు తెచ్చుకున్న నాయకులు,  ఆ సంస్థ బలవన్మరణం పొందకుండా ఆపలేకపోయారు.  ఎవరికోసం వారు తపనపడడం ఒక నేరమైతే, పరుల కోసం పాటుపడడం మహాపరాధమని భావించిన వ్యవస్థ- ఆ సంస్థ మీద నిందలు వేసింది. దాని బాటలో పల్లేర్లు చల్లింది. తనను తాను రద్దుచేసుకుంటున్నట్టు సంస్థ ప్రకటించుకునేట్టు చేసింది. పది సంవత్సరాల  పాటు పాలమూరు తనను తాను లోలోపలికి చూసుకునేట్టు, వెలుపలికి వ్యక్తం అయ్యేట్టు చేసిన కరువు వ్యతిరేక పోరాట కమిటీ- ఇప్పుడు లేదు. ఆసంస్థ తన పదిసంవత్సరాల కార్యాచరణలో ప్రచురించిన కరపత్రాలను సంకలనం చేసి 'పాలమూరు అధ్యయన వేదిక' 'గొంతెత్తిన పాలమూరు'పేరుతో పుస్తకంగా ప్రచురించింది. దీనికి కె.బాలగోపాల్‌ ముందుమాట రాశారు.
         మార్చి 28 ఆదివారం నాడు మహబూబ్‌నగర్‌ టౌన్‌హాల్‌లో  ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. పాలమూరు కరువు కారణంగా అసహజమరణం చెందినవారి కుటుంబసభ్యులు పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కరువు వ్యతిరేక పోరాట కమిటీ నేడు లేకున్నా అది చేసిన కృషి పాలమూరు ప్రజాజీవితాన్ని ఎట్లా వెలిగించగలదో వక్తలందరూ ఆశాభావంతో చెప్పారు.
        కరువు వ్యతిరేక పోరాట కమిటీ కరపత్రాలతోపాటు, పాలమూరు స్థితిగతులపై, కమిటీ రద్దయిపోవడంపై పత్రికల్లో వచ్చిన సంపాదకీయాలను, ఇతర రచనలను కూడా  ఈ పుస్తకంలో ప్రచురించారు. 2001లో పాలమూరు వలసమరణాల గురించి తెలుసుకుందామని కమిటీ సహకారంతో జిల్లాలో పర్యటించిన రచయితల బృందంలో నేను కూడా ఉన్నాను. అది జరిగిన వెంటనే అప్పడు 'వార్త' దినపత్రికలో రాస్తున్న 'సందర్భం' కాలమ్‌లో 'మట్టిదేశం' అనే  రచనచేశాను. ఆ రచనను  కూడా 'గొంతెత్తిన పాలమూరు'పుస్తకంలో చేర్చారు. ఆ కాలమ్‌ ఇక్కడ  చదవండి: )

  నువ్వు పెళ్లిచేసుకుని పోయేచోట ఎంతో సిరిసంపద ఉన్నది, గోడ్డుగోదా ఉన్నది, మంచి వ్యవసాయం ఉన్నది, నువ్వు మెట్టినింట సుఖపడతావు- అంటూ బొంగురు తీగల సారంగిని శ్రుతిచేసి శ్రుతిచేసి ఆ వృద్ధ గాయకుడు పాడుతున్నాడు. అనామక కళాకారుడు అతను. పేరు ఆలియా, అతనొక 'ఢాడి', లంబాడాల వంశచరిత్రలగాయకుడు. అతని పాట వందల ఏండ్ల కిందటి రాజస్థానంలోకి, అక్కడి ఎడతెగని ఆరుబయళ్లలోకి, అక్కడి పంచరంగుల దుస్తులలోకి , వెన్నెల వన్నెల వెండి సొమ్ములలోకి  మమ్మల్ని తీసుకువెళ్లింది. సారంగితో పాటు తంబూరా వంటి రబాబ్‌ అనే వాయిద్యంతో అతను  లంబాడాల పాటలుపాడాడు.  ఆలియా వేలికొసలనుంచి ­విరజిమ్ముతున్న ప్రకంపనాలు ఒక బిడారు ప్రయాణంలాగా, ఒక ఎడతెగని వలస లాగా, ఒక అనాది దుఃఖంలాగా..

  ఆలియాపాట ఒక స్వప్నం మాత్రమే. లంబాడా అమ్మాయి పెళ్లిచేసుకుని వెళ్లేచోట ఏ సిరిసంపదా ఉండదు. వడిబియ్యం నింపుకున్న కడుపుతోనే దేశంపోవాలె, మట్టితట్టలతోనే కొత్తకాపురం మొదలుపెట్టాలె.  ''దూరాన నా రాజు కే రాయిడౌనో'' అని ­  విరహగీతాలు పాడుతూ

  Thursday, March 25, 2010

  చట్టం, నీతి

  వివాహానికి ముందు శృంగార సంబంధాల విషయంలో, పెళ్లి లేకుండా స్త్రీ పురుషులు కలసి జీవించడం విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నాడు (మార్చ్ 23 , 2010 )  చేసిన కొన్ని వ్యాఖ్యలు సహజంగానే భారతీయ సమాజంలో కలకలం రేపుతున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్‌తో సహా ముగ్గురు న్యాయమూర్తులున్న ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆదేశాలో తుదితీర్పులో అంతర్భాగాలో కావు. వివాహానికి ముందు శృంగార సంబంధాలు కలిగి ఉండడంలో తప్పులేదని అన్నందుకు తమిళ సినీనటి ఖుష్‌బూపై దాఖలయిన క్రిమినల్ కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు అవి. తనపై కేసులను కొట్టివేయాలంటూ కుష్‌బూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తుదితీర్పును న్యాయమూర్తులు రిజర్వ్ చేశారు.

  ఎయిడ్స్ గురించిన భావప్రచారంలో భాగంగా 2005లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్‌బూ సురక్షిత శృంగారం అవసరాన్ని చెప్పారు. "అమ్మాయిలు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పేమీ లేదు. అయితే, గర్భం రాకుండా, లైంగిక వ్యాధులు రాకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి'' అని ఆమె వ్యాఖ్యానించారు. అంతే కాదు, చదువుకున్న మగవాడెవరైనా తనకు భార్యగా లేదా ప్రియురాలిగా ఉండేవాళ్లు అంతకుముందు కన్యలుగా ఉండాలని ఆశించడం తగదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ముఖ్యంగా దళిత పాంథర్స్ పార్టీ, పిఎంకె పార్టీలు ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. అనేకమంది ఆమె మీద కేసులు పెట్టారు. ఈ మొత్తం వివాదంలో సినీ పరిశ్రమ నుంచి కానీ, తమిళ సమాజం నుంచి కానీ తనకు మద్దతు పెద్దగా రాకపోయినప్పటికీ, ఖుష్‌బూ తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నారు. వివాదం ఉద్రిక్తతకు దారితీసినప్పటికీ ధైర్యంగా నిలబడ్డారు. తన మీద పెట్టిన కేసుల ఫలితం ఏమైనప్పటికీ, ఖుష్‌బూ ఎదుర్కొన్న చేదుఅనుభవం వృధాగా పోలేదు. అది మరింత విస్త­ృతమైన చర్చగా మరోసారి ముందుకు రానున్నది. సాక్షాత్తూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు- ఆ చర్చకు మరింత ఆమోదం, గౌరవం లభించనున్నది.

  పెళ్లికిముందే శృంగారం కానీ, పెళ్లి లేకుండా సహజీవనం కానీ ఎట్లా నేరం అవుతాయి?- అని న్యాయమూర్తులు న్యాయవాదులను అడిగారంటే అర్థం చట్టం ఏమి చెబుతోందో వివరించమని మాత్రమే. చట్టప్రకారం అవి నేరాలు కావనే ధ్వని అందులో

  Friday, March 19, 2010

  ఎం. ఎఫ్‌. హుస్సేన్‌లోని వైరుధ్యం

  'ఇది మంచిది కాదు' అన్న శీర్షికతో ఈ మధ్య రాసిన సంపాదకీయంలో ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ భారత పౌరసత్వాన్ని త్యజించడం మీద వ్యాఖ్యానించాను. ఆయన స్వదేశాన్ని వదిలి వెళ్లవలసి రావడం భారత్‌కు అప్రతిష్ఠాకరమని , ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదని ఆ వ్యాసంలో నేను అభిప్రాయపడ్డాను.  ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ మార్చి 19 తేదీ నాడు రాసిన కాలమ్‌లో ఇదే అంశాన్ని మరో కోణం నుంచి స్పృశించారు. హుస్సేన్‌లోని ద్వంద్వ విలువలను ఎత్తి చూపుతూ, ఆయన ఖతార్‌ దేశాన్ని ఎంచుకోవడంలోని వైరుధ్యాన్ని నిరూపించారు. ఇర్ఫాన్‌ వ్యాసం వల్ల భారతీయ సమాజం మీది నా అసంతృప్తి ఏ మాత్రం తగ్గలేదు. హుస్సేన్‌ మీది గౌరవం మాత్రం తగ్గింది.  ఇర్ఫాన్‌ వ్యాసం ' పౌరసత్వం వదులుకోవడం తగదు' ఇక్కడ చదవండి:

  పౌరసత్వం వదులుకోవడం తగదు
  మొహమ్మద్‌ ఇర్ఫాన్

  ప్రపంచంలో అత్యంత కఠిన రాచరిక వ్యవస్థ కలిగిన రాజ్యాలలో గల్ఫ్ దేశాలు ప్రధానమైనవి. స్వేచ్ఛాయుత వాతావరణం, భావస్వేచ్ఛ అనేది ఇక్కడ మరిచిపోవలసిందే! అందు కే కీలకమైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ.టి.ఓ)లో వర్ధమాన దేశాలకు సంబంధించిన సదస్సును ఖతార్‌లో నిర్వహించడానికి కార ణం ఇక్కడ నిరసన గళం విప్పడానికి అవకాశం ఉండకపోవడమే. అలాంటి దేశాన్ని ప్రఖ్యాత చిత్రకారుడు మగ్బూల్ ఫిదా హుస్సేన్ (ఎం.ఎఫ్.హుస్సేన్) తన దేశంగా ఏరికోరి ఎంపిక చేసుకోవడం విస్మయం కలిగించింది. స్వేచ్ఛ కలిగిన యూరప్ లేదా అమెరికాను కాకుండా గల్ఫ్ బందీఖానాలో ఈ చిత్రకారుడు ఎందుకు వచ్చి పడ్డాడో తెలియదు.

  దేశం గర్వించదగ్గ చిత్రకారుడైన హుస్సేన్ గూర్చి పాశ్చత్య దేశాలలోని చిత్రాభిమానులకు తెలిసిన దాంట్లో ఒక్క శాతం కూడా గల్ఫ్ అరబ్బులకు తెలియదు. అసలు హుస్సేన్ తరహా భావాలు కలిగిన వ్యక్తులు లేదా కళాకారులంటే అరబ్బులకు గిట్టదు. అయినప్పటికి ఆయన గత నాలుగేళ్లుగా గల్ఫ్‌లో నివాసముంటున్నారు. ఆయన గీసిన కొన్ని దేవతల బొమ్మలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని 2004లో ఆందోళన మొదలైన కొద్దికాలానికి ఆయన దుబాయికి మకాం మార్చారు.

  navya. దుబాయిలో తన కళకు సరైన ఆదరణ లేకపోవడంతో ఆయన ఎక్కువగా ప్యారిస్, లండన్ నగరాలలోని ఆర్ట్ గ్యాలరీలలో తన ప్రదర్శనలు నిర్వహించి తిరిగి దుబాయి వచ్చేవారు. అనతి కాలంలోనే దుబాయిలోని భారతీయ ప్రముఖులలో ఒకరుగా ఎదిగిన హుస్సేన్ భారతీయ కాన్సలేట్ జనరల్ తన నివాసంలో నిర్వహించే అన్ని ముఖ్య విందులలో పాల్గొనేవారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న శశి థరూర్ అధికారంలోకి రాక ముందు దుబాయికి వచ్చిన సందర్భంగా జరిగిన విందులో కూడా హుస్సేన్ పాల్గొన్నారు.

  స్వదేశంలో ఆయనపై ఎన్ని కేసులున్నా విదేశాలలో మాత్రం భారతీయ అధికారులతో సహా భారతీయులందరూ ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారు. దుబాయిలో 2007లో ఒకసారి నోవాటెల్ హోటల్‌లో ఆయన ఆర్ట్ గ్యాలరీ షోను ఏర్పా టు చేయడానికి సిద్ధమైనా భారత్‌లోని ఒక హిందూ సంస్థ నుంచి వచ్చిన బెదిరింపు కారణాన భారతీయులైన దాని నిర్వాహకులు షోను రద్దుచేశారు. దుబాయి నుం చి ఆయన కొన్నిసార్లు ఖతార్‌కు వెళ్లారు. అక్కడ

  Saturday, March 13, 2010

  ఉత్తరాంధ్ర 'అవతార్'

  అద్భుత సాంకేతిక విలువలున్న 'అవతార్' సినిమాకు ఆస్కార్‌లూ, ప్రేక్షకాదరణా లభించడంలో ఆశ్చర్యం లేదు కానీ, ఒక సినిమా హాలీవుడ్‌నుంచి అటువంటి కథతో రావడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదో ఒక సుదూరలోకంలో లభించే విలువైన ఖనిజం కోసం సకల ఆయుధ సంభారాలతో వెళ్లిన మానవులు, మనుషుల్లాగానే ఉండే అక్కడి జీవులను అణచివేసి, వారి 'ఆత్మవృక్షాన్ని' కూల్చివేసి దాని కింద ఉన్న నిక్షేపాన్ని అపహరించాలని ప్రయత్నించడం ఆ సినిమా ఇతివృత్తం.  సాధారణంగా అమెరికాలో నిర్మాణమయిన సినిమాల్లో గ్రహాంతరవాసులు మానవులకు హాని తలపెట్టబోతారు, మనుషులు వారిని తిప్పికొడతారు. కానీ, ఇందులో కథ తిరగబడింది. పైగా, సామ్రాజ్యవాదులు, బహుళజాతి కంపెనీలు అనేక మూడో ప్రపంచదేశాల వనరుల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని స్ఫురింపజేసేట్టు కథనం సాగుతుంది.  ఒక బ్రిటిష్ దాతృత్వ స్వచ్ఛంద సంస్థ 'సర్వైవల్ ఇంటర్నేషనల్' డైరెక్టర్ స్టీఫెన్ కొర్రీ ఈ మధ్య బెంగాల్‌ను సందర్శించినప్పుడు 'అవతార్' కథనూ ఒరిస్సాలో బాక్సైట్ మైనింగ్ ప్రయత్నాలనూ పోల్చి వ్యాఖ్యలు చేశారు. 'అవతార్' ఒక కల్పనా కథ. ఒరి స్సా గిరిజనులు వాస్తవంలో అదే పోరాటాన్ని చేస్తున్నారు- అని ఆయన వ్యాఖ్య.

  సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీలన్నీ విశాఖమన్యంలో బాక్సై ట్ చిచ్చు గురించి ప్రస్తావించాయి. బాక్సైట్ తవ్వకాలను జిందాల్ కంపెనీకి అప్పగించడంపై తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఒరిస్సాలో వేదాంత కంపెనీ అయినా, ఆంధ్రలో జిందాల్ అయినా ఆదివాసీల మనుగడకు, పర్యావరణానికీ చేస్తున్న హాని ఒక్కటే. ఇంతకాలం గొప్పగా చెప్పుకుంటున్న అటవీ పరిరక్షణ చట్టాలను, ఆదివాసీ సార్వభౌమిక జీవహక్కులను అత్యంత నిస్సంకోచంగా రకరకాల పద్ధతులలో ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. ఆదివాసీలను ప్రలోభపెడుతున్నాయి, వారిలో వారికి చీలికలు తెస్తున్నాయి. వారితో ఉండి పోరాటానికి నిర్దేశం చేస్తున్నవారిని నిర్మూలిస్తున్నాయి.

  'అవతార్' వంటి సందర్భాలు మనదేశంలో కేవలం ఆదివాసీల విషయంలోనే ఎదురుకావడం లేదు. అభివృద్ధి పేరుతో స్థానిక మనుగడలను, ప్రకృతిని ధ్వంసం చేసే పని మైదాన ప్రాంతాలలో కూడా సాగుతున్నది. పరిశ్రమల కోసమని పచ్చనిపంట పొలాలను బలి ఇవ్వడం మన రాష్ట్రమంతటా అదే పనిగా సాగుతున్నది. బహుళజాతి సంస్థలు, బడా పారిశ్రామికులు ప్రారంభించిన ఈ 'ప్రకృతిమేధం' సకలరంగాలకూ విస్తరిస్తున్నది. కోస్తాంధ్ర తీరం పొడవునా తలపెట్టిన 'కారిడార్' అభివృద్ధిని,జీవనోపాధిని ఎంతగా సాధిస్తుందో తెలియదు కానీ, కోట్లాది మంది సాంప్రదాయిక జీవనాధారాలను, అపురూపమైన సహజ పర్యావరణరక్షణలను «ధ్వంసం చేయనున్నాయి. విద్యుదుత్పాదన

  Sunday, March 7, 2010

  విప్లవానికి డెడ్‌లైన్

  edit."భారతదేశంలోని ఏ పల్లెకైనా వెళ్లండి, ఒక రైతు కూలీని, చిన్న రైతును గుసగుసగా అడగండి, ఏం చేద్దామని- మీకు వచ్చే సమాధానం ఒకటే, భూస్వామిని ఖత మ్ చేద్దాం''- స్వాతంత్య్రానంతరం దేశంలో కొత్త తరం విప్లవ రాజకీయాలకు ఆద్యుడై న చారు మజుందార్ అన్న మాటలవి. గ్రామీణ భారతమంతా భూస్వామ్య పీడనలో నలిగిపోతూ, విముక్తి కోసం పరితపిస్తోందని, ఆ ఆకాంక్షను అందుకుంటే చాలు విప్ల వం మూలమలుపులో ఉన్నట్టేనని ఆయన బలంగా నమ్మారు.

  నక్సల్బరీ వసంత మేఘ గర్జన 1967లో ఆరంభమై బెంగాల్‌లో మారుమోగి, శ్రీకాకుళంలో ప్రతిధ్వనించినప్పు డు ఆయన 1975 నాటికి భారతవిప్లవం పూర్తవుతుందని విశ్వసించారు, పదే పదే తన రచనలలో ఆ ఆశాభావాన్నే ప్రకటించారు. నక్సల్బరీ, శ్రీకాకుళం రెండూ 1971 నాటికి తీవ్ర నిర్బంధంలో అణగిపోయాయి. విప్లవం వస్తుందనుకున్న సంవత్సరానికి ఎమర్జె న్సీ వచ్చింది.   చారుమజుందారే 1975 దాకా జీవించలేదు. విప్లవానికి సారధ్యం వహించాలనుకున్న సిపిఐఎంఎల్ ముక్కచెక్కలైంది. ఇంకా అక్కడక్కడా మిగిలిపోయిన సాయుధ బృందాలు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ఇక అంతా ముగిసిపోయిందనే పాలకులు భావించారు.

  కానీ, ముగిసిపోలేదు. 1980లో కె.ఎ. అబ్బాస్ తీసిన 'నక్సలైట్స్' సినిమా ముగింపులో పెద్ద ఎన్‌కౌంటర్ తరువాత అంతా సమసిపోయిందనుకుని పోలీస్ అధికారి 'అబ్ కోయీ నక్సల్‌వాదీ జిందా హై' అని మెగాఫోన్‌లో అరుస్తుంటాడు. గూడెంలో నుంచి ఒక గిరిజన బాలుడు విల్లంబులు పట్టుకుని చేతులు ఎత్తుతాడు.  ఏమంత గొప్పగా లేని ఆ

  Tuesday, March 2, 2010

  ఇది మంచిది కాదు

  ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ ఇకపై భారతీయ సంతతికి చెందినవాడిగా తప్ప, భారతీయుడిగా ఉండబోవడం లేదనే వార్త లౌకిక, ప్రజాస్వామికవాదులందరినీ కలచివేసింది. ఆయన చిత్రాలపై సుమారు దశాబ్దంన్నరగా సాగుతున్న వివాదాలేమైనప్పటికీ, 95 సంవత్సరాల పండువయస్సులో ఆయన దేశంకానిదేశంలో తలదాచుకోవలసి రావ డం, చివరకు ఖతార్ అనే చిన్నదేశంలో పౌరసత్వం పొంది శాశ్వతంగా మాతృదేశంనుంచి వేరుకావలసి రావడం సామాన్య భారతీయులకు కూడా బాధ కలిగిస్తున్నవిషయం. పైగా, అంతర్జాతీయంగా భారతదేశానికి ఇది అప్రదిష్టను కలిగించిన పరిణామం.

  ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌కు ప్రత్యేకమైన గుర్తిం పు ఉన్నది. ఆంతరంగికంగా ఎన్ని సమస్యలున్నా, అణచివేతలు, సంక్షోభాలు, ఘర్షణలూ ఉన్నా- అంతర్జాతీయ పటం మీద మాత్రం భారత్‌ది తలెతతుకుని నిలుచున్న చరిత్ర. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో జాతివిముక్తి పోరాటాలన్నిటికీ బాసటగా నిలబడి నెల్సన్ మండేలా, యాసర్ అరాఫత్, ఫిడెల్ కాష్ట్రో వంటి నేతల ప్రశంసలు పొందిన దేశం మనది. చైనా అభ్యంతరాలను లెక్కచేయకుం డా, టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న దలైలామాకు భారత్ ఆశ్రయమిచ్చింది. సోవియట్ యూనియన్‌తో సన్నిహిత మైత్రి నెరిపిన కాలంలో నే, స్టాలిన్ కుమార్తె స్వెత్లానా అమెరికా లో ఆశ్రయం పొందడం కోసం భారత్ నే మజిలీగా చేసుకున్నప్పటికీ, అందుకు అనుమతించింది. పాలస్తీనా ప్రవాస

  Saturday, February 27, 2010

  ప్రేమ

  రొండు హృదయాలు ఒకే పన్‌థాన పయనించుట ప్రేమ అట. ముళ్లపూడివాడు చెప్పాడు.
  లోకం దారికి హైజాక్‌ కావడమే ప్రేమ.
  దేవుని వలెనే ప్రేమయు లేదు అంటాడు సౌదా.
  లేదు లేదు లేదు, లేదా?

  ***

  పార్వతి దేవదాసు పెళ్లి జరిగితే ఏమయ్యేదిట?
  సి ఎస్సార్‌ ఇంట్లో కాక సావిత్రి  ఏ ఎన్నార్‌ ఇంట్లో అంట్లు తోమేదిట!
  మల్లీశ్వరీ నాగరాజూ కూడా అంటే. కోతికొమ్మచ్చులు మానేసి పిల్లల్ని కన్నారట అంతే.

  పెళ్జి జరిగితే అంతే. దే లివ్‌డ్‌ హేపీలీ ఎవరాఫ్టర్‌- సుఖంగా జీవించి పారేస్తారు.

  ***

  ప్రేమ అంటే వొకళ్లకోసం వొకళ్లు ఏడవడం, వొకళ్ల పిల్లల్నివొకళ్లు కనడం, వొకళ్ల బరువును వొకళ్లు మోయడం, వొకళ్ల సాన్నిధ్యాన్ని మరొకరు కలవరించడం.
  ప్రేమ అంటే వొకళ్లనొకళ్లు ఏడిపించడం, పిల్లల్ని పెంచలేక ఇద్దరూ ఏడ్వడం, వొకళ్లకొకళ్లు బరువుకావడం, వొకరినుంచి వొకరు విడిపోవడం.
  ప్రేమ అంటే వొకరినొకరు సంపూర్ణంగా కోరుకోవడం, వొకరితో మరొకరు సంపూర్ణం కావడం, వొకరిపైవొకరు వసంతం చల్లుకోవడం, వొకరికొకరు నిఘంటువు కావడం.

  ప్రేమ అంటే వొకరిని మరొకరు నిశ్శేషం చేయడం, పిల్లిలో ఎలక ఐక్యం కావడం, వొకరినొకరు అపార్థంచేసుకోవడం, వొకరిపై వొకరు బురద చిందించడం, వొకరికొకరు నారికేళపాకం కావడం

  ***

  తిలక్‌ తిలక్‌ నువ్వు బాగా చెప్తావు బద్ధవైరం లాంటి ప్రేమగురించి
  పురాణాలూ పురాణాలూ మీరు బాగా చెప్పారు కత్తిగట్టి జయవిజయులు సాధించిన సాయుజ్యం గురించి
  రాత్రి చీకటి బ్రాకెట్‌ మరీ ఇరుకవుతుందని రఘునాథం బలే అన్నావు!

  ***

  పెళ్లిలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రేమల గురించి చెప్పడం లేదు; అసలు ప్రేమే ఒక ఆత్మహత్య.
  పెళ్లి తప్పనేవాళ్లు, కుటుంబాలు తప్పనేవాళ్లు కూడా ప్రేమ కరెక్టంటారు. వొకళ్లకళ్లలోకి వొకళ్లు పాతాళాల లోతు చూడాలంటారు. వొకరి మనసులకు మరొకరు ఊకొట్టాలంటారు. వొకరి నిద్రలకు మరొకరు జోకొట్టాలంటారు.  ఒకరి విజయగాథలకు మరొకరు జైకొట్టాలంటారు. రాత్రిళ్లు 'ప్రేమేసి' కావులించుకుంటే 'భయపడ్డావా' అని అడక్కుండా మరింతగా హత్తుకుంటే రాజేశ్వరి అమీర్‌తో లేచిపోయేది కాదంటారు. భావుకత్వం వొండుకుని, కంపానియన్‌షిప్‌ను వొడ్డించుకుంటే ప్రేమ భుక్తాయాసంతో త్రేన్చవచ్చునంటారు.

  భక్తీ, మూఢభక్తీ లేనట్టే మంచి ప్రేమా, చెడ్డప్రేమా కూడా లేవు.
  భగ్నప్రేమికుల విషాద యోగం ఒక ఆత్మవంచనా భ్రమ.
  విజయప్రేమికుల  ఉత్సాహం ఒక పరవంచనాభ్రమ.

  ***

  కుటుంబం కూడా ఒక మతం అంటాడు సౌదా.
  ఆ మతంలో దేవుడు ప్రేమే.
  పెళ్లి వంటి యజ్ఞయాగాదులు చేసినా, శుద్ధప్రేమవాదం వంటి మధురభక్తిని ఆశ్రయించినా మతం మతమే
  .


  ( ఇది చాలా పాత కాలమ్. 1992  లో ఆంధ్ర జ్యోతి  ఆదివారం అనుబంధంలో రాసిన 'సింగిల్ కాలమ్' లో ఇది ఒక వారం రచన.)

  Sunday, February 21, 2010

  ఎటువంటి ప్రజలకు ఎటువంటి నేతలు!

  ఒక వార్తాచానెల్ వారు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఒక సీనియర్ తెలంగాణ నాయకుడు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలో వివరంగా చె ప్పారు. వై.ఎస్. అనుయాయివర్గంలో ఆయన కూడా ఒక ముఖ్యులు. వై.ఎస్. హయాంలో తెలంగాణ నాయకులకు ఏ పని కావాలంటే ఆ పని జరిగేదని, అటువంటి మహానాయకుడు లేనందున తెలంగాణకు న్యాయం కావాలంటే ప్రత్యేక రాష్ట్రమే మార్గమని ఆయన అన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రో, పార్టీ అధిష్ఠాన వర్గమో ఆయనను చేరదీసి పను లు జరిపించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే ఆయన నిబద్ధత మారుతుందేమోనని వినేవాళ్లకు సహజంగానే అనుమానం కలిగింది.

  పనులు జరుగుతాయని, కాంట్రాక్టుల బకాయి బిల్లులు పాస్ చేయించుకోవచ్చునని, మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ కోటాలో స్థానం దొరుకుతుందేమోన ి, 1969 ఉద్యమం ముగిసాక పీవీకి ఇచ్చినట్టు ఇప్పుడు కూడా కేంద్రం వెనక్కితగ్గి తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే అది తనకే దక్కుతుందని, ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ పార్టీ వెనుకబడకూడదని- ఇలా రకరకాల కారణాలతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి సరికొత్తగా దూకిన పెద్దలెందరో ఉన్నారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారికి ఆచారం ఎక్కువన్నట్టు- ఇట్లా కొత్తగా వీర ఉద్యమకారులైనవారంతా అరివీరభయంకరమైన ప్రసంగాలు, భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ వచ్చారు.

  వీరితో లాభం లేదు లెమ్మని నిశ్చయానికి వచ్చిన వారిలో కొత్త ఆశలు కలిగేలా సరికొత్త వెన్నెముకను ఝళిపిస్తూ వచ్చారు. వారందరూ శనివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ, రాష్ట్ర అభివృద్ధి మీద మనసు లగ్నం చేశారు. మరి కొందరు ఊళ్లోనే ఉండి మొహం చాటేశారు, మరికొందరు తమ ముఖారవిందాలను ఢిల్లీలో భద్రపరుచుకున్నారు.

  ఇక, ఎప్పుడో ఒకసాి వచ్చే నీలిచంద్రుడిలాగా ప్రత్యక్షమై, కత్తి నాలుకలతో నిప్పుమాటలతో,

  Saturday, February 20, 2010

  బొమ్మల బోనం

  ( తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో  ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు శేఖర్ గీసిన చిత్రాల పుస్తకం ' గిదీ  తెలంగాణ!'  విడుదలయింది. ఆ పుస్తకానికి రాసిన ముందుమాట ఇది)
   
  శేఖర్‌ కార్టూన్లలోని నైశిత్యం  నాకు ఇష్టం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నకాలంలో ఆయన వేసిన కార్టూన్లు చాలా పదునుగా, తీవ్రంగా ఉండేవి.  ఏదో ఒక ప్రదర్శనలో ప్రపంచబ్యాంకు సంస్కరణలు, చంద్రబాబు పాలన పై శేఖర్‌ కార్టూన్లు చూసి చాలా ప్రేమ కలిగింది. ఆయన కార్టూన్‌ కలం వైఎస్‌  హయాంలో అన్ని వంకరలు పోలేకపోయిందని నా అభియోగం. వై.ఎస్‌.హయాం అర్థంతరంగా ముగిసిపోకుండా ఉండి ఉంటే,   ఈపాటికి  శేఖర్‌ కార్టూను ఘాటు రోడ్డెక్కి ఉండేవేమో?

  తెలంగాణ కార్టూనిస్టులతో ఉన్న చిక్కేమిటంటే, విమర్శమీదున్నంత దృష్టి, వెటకారం మీద, వ్యంగ్యం మీద ఉండదు. తెలంగాణ జీవితంలో గాంభీర్యం ఒక లక్షణం అనుకుంటాను. ఇక్కడి సాహిత్యంలో సైతం వ్యంగ్య రచనలు, హాస్య రచనలు తక్కువ.  తెలంగాణ భాషలోనే వ్యంగ్యం సాధ్యం కాదని వాదించేవారున్నారు కానీ,  తెలంగాణ స్థానిక వ్యంగ్యం ప్రధానస్రవంతి సాహిత్యంలోకి రాలేదనడం నిజం. తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల వారికీ- హాస్య, వ్యంగ్య స్ఫూర్తి అర్థమయ్యే వక్రచిత్రాన్ని రచించాలంటే సాధ్యమేనా అని అనుమానం కలుగుతుంది. అందుకని 'అధికార'భాషలోని వెటకారాన్నే అందరూ ఆస్వాదించడం నేర్చుకున్నారు.  తెలంగాణ ప్రాంత కార్టూనిస్టులకు  అధికార ఆంధ్రభాషా సాహిత్యాలతో పెద్దగా అనుబంధం లేకపోవడం వల్ల కూడా  ప్రధానస్రవంతి కార్టూన్‌లో పూర్తి సాఫల్యం పొందలేకపోతున్నారనిపిస్తుంది.  ఒక్క శ్రీధర్‌ మాత్రమే ఈ పరిమితిని అధిగమించి  హాస్యం, వ్యంగ్యం, వెటకారం మేళవించిన కార్టూన్లను సృష్టించగలిగారు. శంకర్‌ కూడా గీత మీద దృష్టి పెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాడుకానీ వ్యాఖ్య ను దానికి దీటుగా ఉంచలేకపోతున్నారు.

  తెలంగాణ అంశం హాస్యస్ఫోరకమైనదికాదు. అందులో తీవ్రమైన విమర్శకు వాదానికీ తావున్నంతగా అపహాస్యానికి ఆస్కారం లేదు. తెలంగాణ అంటే పోరాటమని, పోరాటమంటే  నెత్తుటినీ దుఃఖాన్నీ పోరాటాన్నీ కలిపి చిత్తప్రసాద్‌ గీసిన బొమ్మలనీ మనకు గుర్తొస్తుంది. ఇప్పటి తెలంగాణ పోరాటం గురించి కార్టూన్లు వేయదలచుకున్న శేఖర్‌కు చిత్తప్రసాద్‌ మనసులో ఉన్నాడు. తెలంగాణను రగిలిస్తున్న వైరుధ్యాల గురించి ద్వంద్వాల గురించి కొన్ని కార్టూన్లు, తెలంగాణను వెలిగిస్తున్న సంస్క­ృతీ విశేషాల గురించి కొన్ని చిత్రాలు ఆయన ఈ పుస్తకంలో వేశారు. శేఖర్‌కు సహజమైన కర్కశమైన విమర్శ  ఈ బొమ్మల్లో కనిపిస్తుంది. ఆయనకు పుట్టినగడ్డ మీద ఉన్న ప్రేమ ఎలాగూ వీటిలో తొణికిసలాడుతోంది.

  తెలంగాణసాయుధ పోరాటం లాగానే , నేటి తెలంగాణ పోరాటంలో కూడా నెత్తురూ కన్నీరూ కలగలసి ఉన్నాయి. వాటికి తోడు నైసర్గికమైన సాంస్క­ృతిక పరిమళం కూడా ఈ యుద్ధరంగాన్ని ఆవరించి ఉంది. శేఖర్‌ బొమ్మల్లో  ఆ పరిమళభరిత జీవనపోరాటమే ప్రతిఫలిస్తోంది.

  Thursday, February 18, 2010

  అచ్చమాంబ : మనకు తెలియని మన చరిత్ర

   (సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో త్వరలో రానున్న కథాసంకలనం "" భండారు అచ్చమాంబ: తొలి తెలుగు కథానికలు'' కు రాసిన ముందుమాట ఇది. ఈ పుస్తకం ద్వారా అచ్చమాంబ రాసిన తెలుగుకథలు పది సుమారు శతాబ్దం తరువాత తెలుగుపాఠకులకు అందుబాటులోకి రానున్నాయి. )

   తెలుగు కథాసాహిత్యం ఆవిర్భావం గురించి దీర్ఘకాలం చెలామణీలో ఉన్న అభిప్రాయాలను తలకిందులు చేసిన రచయిత కథల పుస్తకం ఇది. గొప్పకథలూ అద్భుతమైన కథలూ కాకపోవచ్చును కానీ,  ఈ రచనలన్నీ సాహిత్య చరిత్రను కొత్తగా చూడడానికి, ఇంతకాలం అదృశ్యంగా ఉన్న లంకెలను కనుగొనడానికి పనికివచ్చేపాఠ్యాలు.  ఈ కథలు రాసిన కాలం ఒక ఆశ్చర్యమయితే,  రచయిత స్త్రీ కావడం మరో విశేషం. ఈ రెండూ కాక- రచయిత నేపథ్యం, సంచరించిన ప్రాంతాలు, స్వీకరించిన ప్రభావాలు పూర్తి విభిన్నం. రచయితకు దొరకవలసిన పరిగణన ఇంత కాలం లభించకపోవడానికి పై మూడు అంశాలూ కారణమైనప్పటికీ, మూడో అంశమే ముఖ్యకారణంగా కనిపిస్తున్నది.
   
    కొమర్రాజు అచ్చమాంబగా పుట్టి, భండారు అచ్చమాంబగా మారిన ఈ రచయిత (1874 -1905) పుట్టడం మాతామహుల ఇంట్లో కృష్ణాజిల్లాలో అయినప్పటికీ, బాల్యం మునగాల పరగణాలో, నల్లగొండ జిల్లాలో సాగింది. మొదటి భార్య మరణించిన మేనమామ భండారు మాధవరావుతో పదేళ్లు కూడా నిండని వయస్సులో  వివాహం జరిగాక సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లోని నాగపూర్‌కు ఆమె తరలివెళ్లారు. ఆ తరువాత ఆమె జీవితమంతా మహారాష్ట్రంలోనే. తనతో పాటే నాగపూర్‌కు వచ్చిన తమ్ముడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు చదువుకుంటుంటే, అతని పక్కనే కూర్చుని తాను కూడా చదువుకున్నారు. అట్లా హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తెలుగు భాషలు నేర్చుకున్నారు. సంస్క­ృతం తో కూడా కొంత పరిచయం సంపాదించారు. భర్త మాధవరావుకు ఆడవాళ్లు చదువుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ, ఆయనను ఒప్పించి తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు. ఆమె మీద మహారాష్ట్రంలోని జనజాగరణ ఉద్యమం ప్రభావం, మరాఠీ సమకాలీన సంస్కరణవాద సాహిత్యం ప్రభావం కనిపిస్తాయి. ఆమె ఎప్పుడు రచనా వ్యాసంగం మొదలుపెట్టారో ఖచ్చితంగా చెప్పలేము కానీ, 1898 నుంచి ఆమె రచనలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. అప్పటినుంచి ఆరు సంవత్సరాల పాటు, ఆమె తెలుగులో రచనలు చేశారు.   ఇప్పటివరకు దొరికిన రచనల ప్రకారం ఆమె మొదటి కథ 'గుణవతి యగు స్త్రీ' 1901లో ప్రచురితమైంది. మనకు తెలిసినంత వరకు తెలుగులో మొట్టమొదటి కథ ఇదే.
   
    మొట్టమొదటి కావ్యమేది, కథ ఏది, నవల ఏది, ఎప్పుడు వంటి ప్రశ్నలు - సాహిత్యచరిత్రలో తరచు తప్పుడు శోధనలకు, నిర్ధారణలకు కారణమవుతున్నాయి.  రచయితలకో వారి రచనలకో కిరీటాలు తొడగడానికి  ఆ ప్రశ్నలు పనికివస్తున్నాయి తప్ప, చారిత్రకదృష్టికి దోహదం చేయడం లేదు. వ్యక్తులో, ఒక సంఘటనో చరిత్రను మలుపుతిప్పుతాయని, తిప్పుతారని భావించే దృష్టి నుంచి తారీఖుల వివేచన వస్తుంది. పరిస్థితులు పరిపక్వం కానిదే, తగిన భావవాతావరణం సిద్ధం కానిదే ఏ ఒక్క మార్పూ అవతరించదు. కాలం నాడిని పట్టుకుని ద్రష్టగా, మార్గదర్శిగా ముందుకు రాగలగడం వ్యక్తుల సొంత ప్రతిభా చొరవా కావచ్చునేమో కానీ, మొత్తం ఘనత వారికే చెందదు.  ఆంధ్రమహాభారతం వంటి రచన అంతకు ముందు ఎటువంటి సన్నాహాలూ పూర్వరచనలూ లేకుండా రావడం సాధ్యం కాదన్న అవగాహన లేకుండా నన్నయకు మనం ఆదికవి బిరుదు ఇచ్చాము. లభ్యమో అలభ్యమో ఖండికలో కావ్యాలో శాసనాలో ఏవో వెయ్యేళ్ల పూర్వరంగం నన్నయకు ముందు తెలుగుసాహిత్యానికి ఉన్నదని తరువాత తరువాత కనుగొన్నాము. అట్లాగే, తెలుగులో తొలి కథ కానీ కథానిక గానీ 1910లో గురజాడ 'దిద్దుబాటు'

  Sunday, February 14, 2010

  ఎంత చెడ్డా కమిటీతోనూ కొంత లాభం

       మంచిదో చెడ్డదో కమిటీ వచ్చేసింది. నిర్ణీత సమయానికి నివేదిక ఇస్తామని కమిటీ పెద్ద మాట ఇచ్చారు. సమైక్యాంధ్రవాదుల స్పందనలు చూస్తే వారికి కమిటీ పై పెద్దగా అభ్యంతరాలున్నట్టు కనిపించడంలేదు. ఇదంతా మోసమని, కథను మళ్లీ మొదటికి తేవడమని, కాలయాపన చేసి కోల్డ్‌స్టోరేజిలోకి నెట్టడమని భావిస్తున్న తెలంగాణవాదులు నిరసనలు చెబుతున్నారు.  ఇప్పటిదాకా కెమెరాల ముందు కంచుకంఠాలను మోగించిన ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు కొందరు జారుకోవచ్చు, వారిని చూసి మరికొందరు నోరుమెదపకపోవచ్చు, కొందరు మాటవరస నిరసనలు తెలపవచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు ఇప్పడే తీవ్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ గణితంతో, జూదక్రీడతో నిమిత్తం లేని శక్తులు, విద్యార్థులు, ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు ఏో రూపంలో ఒత్తిడిని కొనసాగిస్తూ ఉండవచ్చు. వారితో గొంతు కలుపుతున్నట్టు ప్రత్యేకవాద రాజకీయనేతలు 'మమ'అనవచ్చు. కమిటీ అధ్యయనం, అభిప్రాయసేకరణ సాగుతున్నంతకాలం ఈ నేపథ్య కల్లోల సంగీతం వినిపిస్తూనే ఉండవచ్చు.

        ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా- కమిటీ వల్ల కొంత మంచి జరిగే అవకాశమున్నది. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించేవారికి వారి కారణాలు వారికి ఉన్నా యి కానీ, ఎంతో కొంత శాతం కేంద్ర ప్రభుత్వం నిజాయితీతోనే ఈ ప్రక్రియ సాగిస్తూ ఉండవచ్చు. కమిటీ అధ్యయనం ఫలితాలు నిజంగానే సమస్యకు పరిష్కారాన్ని సాధించవచ్చు. కాబట్టి, కమిటీ చేసే శోధనను బహిష్కరించినందువల్ల

  Sunday, February 7, 2010

  డబల్ మీనింగ్ చిదంబరం

  వారికోమాట వీరికో మాట చెప్పడం పాలక రాజకీయాల్లో భాగమే కానీ, ఒకే మాట ఇద్దరికీ వేరువేరు అర్థాల్లో చెప్పవలసి రావడం కేంద్ర ప్రభుత్వం నెలన్నరగా ప్రాక్టీసు చేస్తోంది. శ్లేషరచనలో ఇంతటి ఘనాపాటీలయిన అధికారగణాన్ని అభినందించి తీరాలి. వైరుధ్యాలని వెన్నెముకగా ధరించానని  కవి అజంతా  కవితాత్మకం గా చెప్పారు కానీ, మంత్రి చిదంబరం దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. మాటల వెను క దాక్కునే విద్య ఎప్పుడో ఒకప్పుడు వికటించే ప్రమాదం ఉన్నదన ఆయనకు తెలియక కాదు. పరిష్కారమంటే సమస్యను వాయిదా వేయడమేనని ఆధునిక రాజనీతి చెబుతున్నది కాబట్టి ఇప్పటికీ గండం గడిస్తే చాలును, అదే నూరేళ్ల ఆయుష్షు.

  జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అవతరణకు కారణాలేమిటి? అని తరచిచూస్తే సమాధానపడే సమాధానం దొరకదు. అరవయ్యేళ్ల తెలంగాణ ఆకాంక్ష,, నలభయ్యేళ్ల కిందటి మొదటి ఉద్యమం, పదిహేనేళ్లుగా  సాగుతూ నెలన్నరగా ఉధృతమైన మలి ఉద్యమం- వీటి ఫలితంగా కమిటీ వచ్చిందా? లేక డిసెంబర్9 నాడు చిదంబరం చేసిన తెలంగాణ ఏర్పా టు ప్రకటనకు తెలంగాణేతర ప్రాంతాలలో వచ్చిన ప్రతిస్పందన వల్ల వచ్చిందా? ఇది తెలంగాణ ప్రజల విజయమా, తెలంగాణేతర ప్రజల విజయమా? ఒకరు సంతోషిస్తే, మరొకరు విచారపడితే దాని ఆధారంగా కమిటీ మంచిచెడ్డలను బేరీజు వేయవచ్చు. కానీ ఇద్దరూ రెండు ప్రాంతాలలో సందేహంలోనే ఉన్నారెందుకు? ఇద్దరూ రెండు ప్రాంతాలలో సంతృప్తి చెందుతున్నారెందుకు? ఈ కమిటీ కాలయాపనకు, ఉద్యమాన్ని నీరుకార్చడానికి అని తెలుగుదేశం తెలంగాణవాదులు అనుకుంటుంటే, ఇది రాష్ట్ర విభజనకే ఉద్దేశించిందేమోనని  తెలుగుదేశం  సమైక్యవాదులు అనుమానిస్తున్నారు. పరవాలేదు,  కమిటీతోనే తెలంగాణ వస్తుందని కాంగ్రెస్ తెలంగాణవాదులు హామీ ఇస్తుంటే, సమైక్యవాదుల విజయమే కమిటీ అని కాంగ్రెస్ సమైక్యవాదులు ధీమాగా ఉన్నారు.

  రేపో ఎల్లుండో శ్రీకృష్ణ క మిటీ విధివిధానాలు ఖరారు అవుతాయి. తెలంగాణ ఏర్పాటు కోసం కమిటీయా, తెలంగాణ సాధ్యాసాధ్యాల నిర్ధారణకు కమిటీయా, సమైక్య ఉద్యమం పర్యవసానంగా ముందుకు వచ్చిన

  Saturday, January 30, 2010

  ఉద్యమాలు, బాధ్యతలు, హక్కులు

          పాతికేళ్ల కిందట అనుకుంటాను ఒక ప్రముఖ రచయిత ఒక పత్రికలో లేఖ రాశారు. నినాదాలు రాసి గోడలు పాడు చేస్తున్న సంఘాలను ఆయన ఆ లేఖలో తీవ్రంగా తప్పుపట్టారు. ఎంతో ఖర్చుపెట్టి ఇంటికి వెల్ల వేసుకున్న ఒక మధ్యతరగతి గృహస్థు, తెల్లవారే సరికి తన ఇంటిగోడలు ఏవో రాతలతో నిండిపోతే ఎంత బాధపడతాడో ఉద్యమకారులు గ్రహించాలని ఆ రచయిత ఆ లేఖలో బాధపడ్డారు. దేశమంతా అశాంతితో ఆందోళనలతో రగిలిపోతుంటే తన ఇల్లు మాత్రం తెల్లగా ఉండాలని ఆశించడమేమిటని ఆ లేఖకు మరికొందరు రచయితలు జవాబు కూడా చెప్పారు. పత్రికలో ఇట్లా వివాదం సాగుతుండగానే ఒకరాత్రి సంఘాల వాళ్లు వెళ్లి ఆ లేఖ రాసిన రచయిత ఇంటిగోడల మీద అంగుళం కూడా వదలకుండా నినాదాలు నింపి వచ్చారు. పాపం ఆ రచయిత ఆలోచనలు వాస్తవికతకు ఎడంగా ఉండి ఉండవచ్చును కానీ, హక్కులకు, చట్టానికి దూరంగా లేవు. తన సొంత ఇంటి గోడలను ఒక్క రాతా లేకుండా కాపాడుకోవాలనుకోవడం ఆ గృహస్థు హక్కు. ఆ హక్కుకు ప్రభుత్వాల నుంచి కాకుం డా ప్రజా సంఘాల నుంచి భంగం కలిగినప్పుడు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక ఆయన పౌరసమాజానికే విజ్ఞప్తి చేసుకున్నారు.
  సంఘజీవి అయిన మనిషి- సంఘంలో జరుగుతున్న దానితో నిమిత్తం లేకుండా ఒక ద్వీపంలాగా, సంఘపు మంచిచెడ్డలు అంటకుండా ఉండగలడా అన్నది కూడా ఆలోచించవలసిన ప్రశ్నే. రోడ్లు మురికిగా ఉన్నప్పుడు మన బట్టలు మురికి కాకుండా కాపాడుకోగలమా? రణగొణ ధ్వనుల మధ్య ఏకాంతాన్ని కల్పించుకోగలమా? రోదన లు ఆక్రందనలు వినిపిస్తున్నప్పుడు మధురసంగీతం వినే హక్కును డిమాండ్‌ చేయగలమా? మరి వ్యక్తి స్వేచ్ఛకూ సమష్టి ఆచరణకూ వైరుధ్యం ఏర్పడినప్పుడు దానికి పరిష్కారం ఏమిటి?
          గోడలను నినాదాలతో నింపడమన్నది చిన్న సమస్య.ఇప్పుడు రోడ్ల పక్కన గోడలే ఉండడం లేదు, ఉన్న గోడలకు కాపలాలు ఉంటున్నాయి, పైగా నినాదాలు రాసే సం ఘాలే తగ్గిపోయాయి, ఎన్నికల నినాదాలకు శేషన్‌ ఎప్పుడో బ్రేక్‌ వేశారు కాబట్టి- ఆ సమస్యా అంతరించిపోయింది. వ్యక్తి స్వేచ్ఛ ఒక్కటే సమస్య కాదు, ఒకవర్గం చేస్తున్న ఆందోళనలు తమకు నష్టం కలిగిస్తున్నాయని సమాజంలోని తక్కిన వర్గాలు అంటున్నా యి. నిజమే, ఉద్యమకారులు, సంఘాలు, ఆందోళనలు తక్కిన సమాజాన్ని, ప్రత్యేకించి కొన్ని సమూహాలను ఇబ్బంది పెట్టడం ఏదో రూపంలో జరుగుతూనే ఉన్నది.అంతే కాదు, ప్రజల సమష్టి ఆస్తులకు నష్టం

  సమ్మక్క: రెండు సందర్భాలు

  మేడారం జాతరకు ఒక మహా ఉత్సవంగా, మీడియా ఈవెంట్‌గా మారడం మొదలుపెట్టిన వెంటనే అక్కడి జంపన్నవాగు మీద ప్రభుత్వం వంతెన నిర్మించాలని భావంచింది.  వరంగల్‌ ములుగు అడవుల్లోకోయల సాంప్రదాయ రాజ్యానికి సరిహద్దు వంటిది జంపన్నవాగు.  వంతెననిర్మాణం మంచిచెడ్డలను చర్చిస్తూ 2002లో 'వార్త'లో 'సందర్భం' కాలమ్‌లో రాసిన వ్యాసం ' అడవిదారులన్నీ మూసుకుపోయే ఓ అద్భుత క్షణం కోసం'.
          2006లో మరోసారి మేడారం జాతర సందర్భంగా  'ఆంధ్రజ్యోతి' 'సంభాషణ' కాలమ్‌లో రాసినది "కుంకుమ బరిణె'. అప్పటికి జంపన్నవాగు వంతెన పూర్తయింది. జాతర లో కోయతనం నశించి ప్రధానస్రవంతి సంస్కృతిదిపై చేయి అయింది. అయినా అక్కడ మిగిలిన మార్మిక ప్రాకృతిక జనసంస్కృతికి నివాళిగా రాసినదీ వచనం.
         2010లో మళ్లీ వచ్చిన ఈ వనజన జాతర సందర్భంగా పాత కాలమ్‌లు రెండు...

  అడవిదారులన్నీ మూసుకుపోయే ఓఅద్భుత క్షణం కోసం.....

       మాఘమాసపు పున్నమికి మూడురోజుల ముందు గోదావరితీరారణ్యపు బాహువుల లోకి జనసముద్రం నడిచివెడుతుంది. తాము తిరుగాడిన నేల కోసం, తమ అస్తిత్వానికి అర్థమయిన అడవి కోసం, తాము సహజీవనం చేసే నీటి కోసం ప్రాణమిచ్చిన సమ్మక్క సారక్కల కోసం,  యుగాలు గడచినా తీరని మొక్కులకు,అనంతకాలాలు  సిగమూగినా తీరని ఆవేశాలను జనం జంసన్నవాగుకుసమర్పిస్తారు.మానవ సమాజాలకున్న శక్తే అటువంటిది. గతించే తరాలను లెక్క చేయకుండా అది పురాస్మృతుల సొరంగాల గుండా ప్రయాణించి మరణాలను అపహసిస్తుంది. మార్మికమైన, మాంత్రికమయిన, అధిభౌతికమయిన మానవ సహజాత ఆచరణ- పసితనపు అమాయకతను, నిష్కల్మషపు అమాయకతను నిరంతరం పరిమళిస్తుంటుంది. అది కృతజ్ఞతమయినది. అది అల్పసంతోషి. ఒక చిన్నత్యాగానికి అనంతకాలాల సంస్మరణలను కానుకగా ఇస్తుంది. వేలగాథలను గానం చేస్తుంది.
       వరంగల్‌ జిల్లా ములుగు అడవులలోని మేడారం దగ్గర జరిగే ఈ కోయల జాతర నేడు ప్రమాదంలో పడిన ఒక చిరస్మరణ. జాతరకు వెళ్లే జనం పెరిగి ఉండవచ్చు. ఎడ్ల బండ్లకు బదులు మోటారు వాహనాలు మైళ్లపొడవునా బారులు తీరుతూ ఉండవచ్చు. సారా ఏరులై పారవచ్చు. జంతుబలులు రెట్టింపు జరగవచ్చు. అయినా సమ్మక్క సారక్క జాతర మాత్రం ఓడిపోతున్నది. అంతరించిపోతున్నది.  జంపన్నవాగు మీద వంతెన నిర్మాణంతో సమ్మక్క సారక్కల హత్య మరోసారి జరిగిపోయింది. ప్రతాపరుద్రుడు

  Thursday, January 28, 2010

  కుంకుమ బరిణె

  కొక్కరి ఎంకన్న , చందాగోపాలరావు, సిద్ధబోయిన మునెందర్‌, సిద్ధబోయిన లక్ష్మణరావు, ఇటువంటి వాళ్లే,  ఈ పేర్ల వాళ్లే,  ఆ రోజు వీరులై పోతారు.  రాజ్యఖడ్గాన్ని, రాజముద్రికనీ ధరించిన ప్రభుత్వ యంత్రాంగం కాసేపు అనుచరగణమైపోగా, చిలుకలగుట్ట పాదాల దాకా వెడతారు. అందరినీ వెనుకనే నిలిపివేసి తామొక్కరే కొండమీది
  కాలిబాటల్లోకి వెళ్లి మాయమవుతారు. తమకు మాత్రమే తెలిసిన రహస్యనిక్షేపం నుంచి కుంకుమ బరిణె రూపంలోని సమ్మక్కను తోడ్కొనివస్తారు.  కన్నెబోయినపల్లి నుంచి సారలమ్మను తరలించుకు వస్తారు. మేడారం లోయలోని గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు.

  ఎంతటి అనాది వియోగమో అడవి మీద మనిషికి, మళ్లీ అమ్మకడుపులోకి చొచ్చుకుపోయినట్టు, సందోహం, సంరంభం, అప్పటికప్పుడు మొలకలెత్తి విరగపండిన జొన్నచేను వలె జనమే జనం. లక్షలాది శరీరాలు ఒక్కరూపు దాల్చి చరిత్రతో సంభాషిస్తున్నట్టు, దండకారణ్యానికి దండం పెడుతున్నట్టు.

  Sunday, January 24, 2010

  నమ్మదగ్గ నేత లేకపోవడమే శాపం


  1944. నల్లగొండ జిల్లా భువనగిరిలో నైజామాంధ్ర మహాసభ పదో మహాసభలు. పధ్నాలుగేళ్లుగా విద్యా ప్రచారక, సాంస్కృతిక, సామాజిక ఉద్యమంగా ఎదుగుతూ వచ్చి రాజకీయ రూపం తీసుకుంటున్న తరుణంలో మహాసభ పగ్గాలు కమ్యూనిస్టుల చేతికి వెళ్లబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలున్న సభలు. కమ్యూనిస్టేతరులందరూ దాదాపుగా బహిష్కరించిన సభలు. అయినా ఒకటి రెండు అపవాదాలు. కాంగ్రెస్‌వాది అయినప్పటికీ పోరాటవాది అయిన కాళోజీ ఆ సభలకు రావడంలో ఆశ్చర్యం లేదు.
      కానీ, మరో వ్యక్తి, వృద్ధుడు,అక్కడ ఉంటారని ఎవరూ ఊహించని ఆశించని పెద్దమనిషి- సభ మందిరంలో దూరంగా ఒక మూల కూర్చుని కార్యక్రమాన్ని ఆసక్తి గా, ఒకింత ఆవేదనగా కూడా- పరిశీలిస్తున్నారు. ఆయన రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి. ఏడో నిజామ్‌కు అత్యంత ఆంతరంగికుడిగా ఉన్నవారు. దీర్ఘకాలం హైదరాబాద్‌ నగరానికి కొత్వాల్‌గా పనిచేసినవారు. ఆంధ్రమహాసభ చీలిపోకూడదని, ఎట్లాగైనా తెలంగాణలో రాజకీయ ఉద్యమం ఏకతాటిమీద నడవాలని మనస్ఫూర్తిగా ఆశించిన వారిలో వెంకటరామారెడ్డి ఒకరు.
      చీలిక తరువాత కమ్యూనిస్టు ఆంధ్రమహాసభను నిజాం ప్రభుత్వం కర్కశంగా అణచివేస్తుందని ముందుగా రావినారాయణరెడ్డిని ఆయన హెచ్చరించారు కూడా. తెలంగాణ భవిష్యత్తు గురించి ఆయన అంతగా కలవరపడడానికి కారణం ఏమిటి? నైజాం తెలుగు ప్రాంతాలలో విద్యను, చైతన్యాన్ని, ప్రజారంగాన్ని, పౌరసమాజాన్ని నిర్మించడానికి పునాది స్థాయిలో అసాధారణమైన దోహదం చేసిన వ్యక్తి రాజబహదూర్‌. ఆయన నిజాం రాజ్యయంత్రాంగంలో ముఖ్యవ్యక్తి అయి ఉండవచ్చు. బ్రిటిష్‌ యువరాజు హైదరాబాద్‌ పర్యటనను సాఫీగా నిర్వహించినందుకు ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ బిరుదును పొందిన రాజభక్తుడే కావచ్చు. కానీ, 20 శతాబ్ది ఆరంభ దశాబ్దాల లో హైదరాబాద్‌ తెలుగు సమాజం కొత్త నడకలు నేర్వడానికి కీలకమైన దోహదం చేసిన మనిషి ఆయన. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద భూస్వాములను, సంస్థానాధీశుల ను ఒప్పించి గోలకొండ పత్రికకు నిధులు సమకూర్చడంలో కావచ్చు, ఆ పత్రికకు నిజాం ప్రభుత్వం నుంచి అనుమతి సాధించడంలో కావచ్చు, ఆంధ్రమహాసభ అవతరణకు కావలసిన భూమికను ఏర్పరచడంలో కావచ్చు, మహాసభల నిర్వహణల్లో పోలీసు అనుమతులను సులభం చేయడంలో కావచ్చు- ఆయన ప్రమేయమే కనిపిస్తుంది. హైదరాబాద్‌ రాజ్యంలో ఆదిఆంధ్రుల ఉద్యమాన్ని నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ అయి నా, సికింద్రాబాద్‌లో దళితులను సంఘటితం చేసిన అరిగె రామస్వామి, ఎం.ఎల్‌ ఆదెయ్య వంటి వారికి అయినా ప్రభుత్వంలో పెద్ద దిక్కు వెంకటరామారెడ్డే. ఆయన సహాయం లేకపోతే, రెడ్డి విద్యార్థులకు విద్యావసతి కల్పించాలనుకున్న కొండా వెంకటరంగారెడ్డి ఆశయం రెడ్డి హాస్టల్‌ రూపంలో వాస్తవరూపం ధరించేదే కాదు. ఆ రెడ్డి హాస్ట లే లేకపోతే, తెలంగాణ సాయుధ పోరాటానికి గాని, జాతీయ ఉద్యమానికి కానీ నూత న నాయకత్వం లభించేదే కాదు. రెడ్డి హాస్టల్‌ మాత్రమే కాదు, హైదరాబాద్‌లోని రెసిడెన్సీ ప్రాంతంలో కనిపించే అనేకానేక విద్యార్థి వసతి గృహాలు, కులసంఘాల కార్యాలయాలు- వెంకటరామారెడ్డి ఆశీస్సులతో, సహాయంతో అవతరించినవే. మొక్కగా ఉన్నప్పటినుంచి తెలంగాణలో ఆధునిక వికాసానికి శ్రేయోభిలాషిగా ఉన్నారు కాబట్టే, ఆ వికాసం విచ్ఛిన్నమవుతుందేమోనని రాజబహదూర్‌ ఆందోళన చెందారు.
      కొత్వాల్‌ వెంకటరామారెడ్డే కాదు, ఆంధ్రపితామహుడు మాడపాటి హనుమంతరావు కానీ, బూర్గుల రామకృష్ణరావు కానీ, సురవరం ప్రతాపరెడ్డి కానీ, భాగ్యరెడ్డివర్మ కానీ నాటి తెలంగాణ ఆధునిక యుగంలోకి ప్రవేశించడానికి ఏమేమి అవసరమో ఆ కర్తవ్యాలన్నిటినీ నెరవేర్చడానికి ప్రయత్నించారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజాస్వామ్యవ్యవస్థలోకి ప్రవేశి స్తే అందుకు అవసరమైన మౌలిక వసతులేమిటో, మానవ వనరులేమి టో, నాయకత్వాలేమిటో వారికి అవగాహన ఉంది. ఒక దూరదృష్టి, దార్శనికత, సమగ్ర అవగాహన ఉన్న తరం అది.
  తెలంగాణ ప్రాంతానికి ఒక విశ్వసనీయమైన నాయకత్వం అవతరించడానికి కాలం కడుపుతో ఉన్న కాలం అది. అటువంటి మనుషులు ఒక్కరంటే ఒక్కరు నాయకత్వ శ్రేణిలో లేకపోవడమే నేటి తెలంగాణ దౌర్భాగ్యం. వారి ప్రయత్నాలు ఫలించాయి. ఏదో ఒక స్థాయిలో ఒక నాయకత్వ శ్రేణి అవతరించింది. ఎందరి కృషి వల్లనో ఆవిర్భవించిన రాజకీయ, సామాజిక కార్యకర్తల తరం ఎందుకు గమ్యాన్ని చేరుకోలేకపోయింది? ఇందులో స్వయంకృతాపరాధం కొంత ఉంది. చరిత్ర చెలగాటం కొంత ఉంది. బాహ్యశక్తుల ప్రమేయం కొంత ఉంది.
      ప్రపంచప్రఖ్యాతమైన సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ నుంచి కొత్త నాయకత్వ తరా న్ని తీసుకువచ్చింది. ఆ నాయకత్వం తీవ్రమైన నిర్బంధాన్ని హింసలను ఎదుర్కొనవలసి వచ్చింది. 1952 ఎన్నికలలో ప్రజలు ఉద్యమ ప్రాంతాలలో ఆ కొత్త తరానికి బ్రహ్మాండమైన విజయాలను సమకూర్చారు. అయితే, ఉద్యమేతర ప్రాంతాలలో జాతీయవాద నాయకులు, ప్రధానంగా భూస్వామ్య వర్గం వారు విజయం సాధించా రు. కమ్యూనిస్టు విజయాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌ స్టేట్‌లో తెలుగేతర ప్రాంతాలు కూడా ఉండడం వల్ల తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వం మరాఠీ, కన్నడ ప్రాంతాల విజయాల సాయంతో అవతరించింది. మూడు ప్రాంతాల ఉమ్మడి అభ్యర్థిగా బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు తప్ప, తెలంగాణలో ఆయన వర్గానికి ఉన్న పలుకుబడి స్వల్పం. కొండా వెంకటరంగారెడ్డి వర్గానిదే ఆధిక్యం. తెలంగాణలో జాతీయవాదులుగా ఉన్న సాంప్రదాయ భూస్వామ్య వర్గంతో సమ స్య ఏమిటంటే, తక్కిన ప్రాంతాలలో మాదిరిగా వారికి రాజకీయ శిక్షణ లభించలేదు. బ్రిటిష్‌ ఆంధ్రప్రాంతాలలో 1920 నుంచి ఏదో ఒక పద్ధతిలో ఎన్నికల రాజకీయాలు ఉనికిలో ఉండడం, పలుకుబడి వర్గాలు రాజకీయవాదులుగా పరివర్తన చెందడం క్రమంగా జరిగిపోయాయి. తెలంగాణలో ఈ శక్తులు ప్రధాన స్రవంతి రాజకీయాలలో అనుభవం సాధించకుండా నాటి జాతీయోద్యమనాయకురాలైన కాంగ్రెసే అడ్డుపడింది. 1938లో సత్యాగ్రహ కార్యక్రమా న్ని త్వరలోనే ముగించి, హైదరాబాద్‌ స్టేట్‌లో కాంగ్రెస్‌ పేరుతో ఉద్యమాలు అవసరం లేదన్నది. సంస్థానాధీశులు జాతీయోద్యమానికి సహజ మిత్రులన్న వైఖరితో గాంధీజీ- ఇక్కడి జాతీయవాదులకు పనిలేకుండా చేశారు. ఈ అనుభవ రాహిత్యం- 1956 తరువాత విశాలాంధ్రలో వారిని ద్వితీయ శ్రేణి నాయకులుగా మార్చివేసింది. కమ్యూనిస్టు పార్టీలో ఎదిగిన తెలంగాణ తరం వారి నాయకత్వానికి లోబడి ఉండగా, తెలంగాణ భూస్వామ్య ప్రాబల్య వర్గాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తమ నేతలను వెదుక్కున్నారు. కొండా వెంకటరంగారెడ్డి వంటి వారు తెలంగాణ ప్రత్యేకతకే కట్టుబడి ఉన్నప్పటికీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాన్ని వామపక్ష ఉద్యమం నైతికంగా బలహీన పరచింది. భూస్వామ్యవర్గం,  వామపక్షీయులు- అన్న ద్వంద్వం రాష్ట్రావతరణ కాలం నుంచి తెలంగాణకు ఒక ప్రతికూల అంశంగా తయారైంది. కమ్యూనిస్టులు న్యాయంగా వేసిన దెబ్బ, బ్రిటిష్‌ ఆంధ్రలోని ప్రాబల్యవర్గం వేసిన ఆధిపత్య దెబ్బ- కలసి తెలంగాణ సాంప్రదాయిక నాయకత్వాన్ని మరుగుజ్జుగా మార్చాయి. తరువాత కాలంలో కూడా ఈ క్రమం కొనసాగుతూనే వస్తోంది. తెలంగాణ నుంచి వేరువేరు ఉద్యమాల ద్వారా ఏర్పడుతూ వస్తున్న మిలిటెంట్‌ శక్తులు ప్రభుత్వ దమనకాండకు బలి అవుతూ ఉండగా, ప్రాబల్య వర్గాల నుంచి కొత్త తరాన్ని మిలిటెంట్లే అదుపుచేస్తూ వచ్చారు.
  రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి ఆశించినట్టు, 1944లో జాతీయవాదులు, కమ్యూనిస్టులు ఏదో ఒక ప్రాతిపదికపై సమీకరణ సాధించగలిగి ఉంటే (అటువంటి సమీకరణ అపచారమని అనుకోనక్కరలేదు, ఇప్పుడు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జరుగుతున్న సంకీర్ణ రాజకీయాలతో పోలిస్తే అదేమంత పెద్ద నేరం కాదు), నైజామ్‌ రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రభుత్వానికి, ఆ తరువాత ప్రజాస్వామ్య ప్రక్రియకు పోరా డి ఉంటే- పరిస్థితులు వేరుగా ఉండేవి. తెలంగాణ శ్రేయస్సే పరమావధిగా ఆలోచించి, వ్యవహరించే నాయకత్వం రూపొంది ఉండేది.  దేనికీ బాధ్యత వహించని, ఉత్తరకుమార ప్రతిజ్ఞలు చేయని, వెంట నడిచే ప్రజలకు ఆశ్వాసన ఇవ్వని, దేనికీ లొంగబోమన్న ధీమా ఇవ్వలేని, వెన్నెముక ఎక్కడ ఉన్నదో తెలియని నేటి తెలంగాణ రాజకీయ నాయకత్వంలోని బలహీనతకు మూలం నైజాం కాలం నాటి రాజకీయాలలోనే ఉన్నది. ఈ రాజకీయ శ్రేణికి సమాంతరంగా, భిన్నంగా ఎదుగుతూ వస్తున్న తాజా యువ, విద్యార్థి నాయకత్వాన్ని-మరోసారి ప్రభుత్వాల దమననీతికి, వ్యతిరేకుల కుటిలనీతికి బలికానివ్వకుండా కాపాడుకోవడం అందుకే నేటి అవసరం. ఆత్మహత్యల పేరుతోనో, అణచివేత పేరుతోనో స్వచ్ఛమైన ఈ కొత్త తరం అణగారిపోతే, ప్రత్యేక రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి, తెలంగాణ శాశ్వతంగా అనాథ అవుతుంది.

  Tuesday, January 19, 2010

  హఠాత్‌ జ్ఞానోదయాలు

  అలజడి తగ్గలేదు, ఆందోళన తగ్గలేదు, పల్లెలకు చెవియొగ్గి వినగలిగితే  కలకలమూ తగ్గలేదు.  కాకపోతే  కోలాహలం కొంచెం తగ్గింది. ఉద్వేగాలు యథాతథంగానే ఉన్నాయి కానీ ఉద్రేకాలు తగ్గాయి.  కాబట్టి మంచీచెడూ మాట్లాడుకోవచ్చు.  ఇతరులలోని తప్పులను ధైర్యంగా చెప్పవచ్చు, మనలోని తప్పులను వినయంగా ఒప్పుకోవచ్చు. రేపటి అడుగులను ఆచితూచవచ్చు. టేబుల్‌కు రెండువైపులా కూర్చుని భిన్నపక్షాలు చర్చించవచ్చు. స్వపక్షమే అయితే, పక్కపక్కనే కూర్చుని వ్యూహరచన చేయవచ్చు.  కేంద్రప్రభుత్వం శాంతి ఎందుకు కోరుతున్నదో కానీ, ఉద్యమాలకు మాత్రం  ఒక  వెసులుబాటు అవసరం, కొంత మౌనం దొరికితే కొంత ధ్యానమూ సాధ్యపడుతుంది.

  ఇక్కడే  తెలంగాణవాదులనుంచి మొదటి ప్రశ్న తారసపడుతుంది.  విషయాన్ని చర్చించడానికి కావలసిన  మౌనమూ విరామమూ శాంతీ నిజంగా ఇప్పటిదాకా లేవా? డిసెంబర్‌ 9 వ తేదీ కంటె ముందు  లేదూ నవంబర్‌29 కంటె ముందు సంభాషణకూ సంవాదానికీ చర్చకూ ఆస్కారమే లేదా?  మబ్బేలేని ఉరుమే లేని మెరుపే లేని ఆకాశం నుంచి ఉన్నట్టుండి పిడుగు పడిందా, మిన్నువిరిగి మీద పడిందా?  రామాయణమంతా పూసగుచ్చినట్టు చెప్పిన పౌరాణికుడు, శ్రోతలనుంచి ఏదైనా వివేకమంతమైన ప్రశ్నను, లోతైన సందేహాన్ని ఆశిస్తాడు. కానీ, రాముడికి సీత ఏమవుతుందన్న ప్రశ్న ఎదురయితే? అది అమాయకత్వమా, అజ్ఞానమా, నిర్లక్ష్యమా? పదిపన్నేండేళ్ల నుంచి గొంతుచించుకుని చేసిన నినాదాలు, లక్షలాది పుటలలో నింపి అచ్చొత్తిన సమాచారమూ,  కోటిగొంతుకలతో నినదించిన పాటలు, గర్జనలు, ఉపన్యాసాలు, ఊరేగింపులు, మహాసభలు, కూర్చిన గణాంకాలు, రెండు ఎన్నికలలో చేసిన ప్రచారాలు- వాటిని ఎవరూ ఆలకించనే లేదా? అన్నీ చరిత్ర నుంచి ఎరేజ్‌ అయిపోయాయా?  ఇప్పుడే మేలుకొన్నట్టు, ఏమిటీ హాహాకారాలు?

  రాష్ట్రం విడిపోకూడదని, సమైక్యంగానే ఉండాలని ఉద్యమించిన సీమాంధ్ర ప్రజలను కానీ, విద్యార్థులను కానీ ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. విభజన వల్ల తమకు జరుగుతుందని భావిస్తున్న నష్టాల గురించి, హాని గురించి వారికి వారి ప్రజాప్రతినిధులు ఎవరూ చెప్పనే లేదన్న మాట. తెలంగాణలో గత దశాబ్దంగా జరుగుతున్న ఆందోళన గురించి, దాని పర్యవసానాల గురించి తమ ఓటర్లకు వారు వివరించనేలేదన్న మాట. చెప్పకపోవడమే కాదు, తమ ఓటర్ల నుంచి ఇంతటి ప్రతిస్పందన వస్తుందన్న అంచనా కూడా వారికి లేదన్న మాట.  ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియకుండానే వారు తమ తమ నేతలు తీసుకుంటున్న తెలంగాణ అనుకూల వైఖరులకు వత్తాసు పలికారన్న మాట. ఎన్నికల ప్రణాళికల్లో, పార్టీ మేనిఫెస్టోల్లో రాసుకోవడమే కాదు, ప్రణబ్‌ కమిటీకి లేఖలు ఇచ్చినా కూడా ఆ ప్రాంతాల ప్రజాప్రతినిధులు అనుమతించారన్న మాట. అంటే ఇదంతా జరిగేది కాదని, అంతిమంగా తెలంగాణ ప్రజలకు మొండిచెయ్యే దొరుకుతుందని వారికి ధీమా ఉండవచ్చు. తెలంగాణ అనుకూల వైఖరి తీసుకోవడం వల్ల కొన్ని ఓట్లు రాలితే మాత్రం వారికి అభ్యంతరం లేదన్న మాట. ఇటువంటి మోసపూరిత వైఖరిలో సీమాంధ్ర సాధారణ ప్రజలు కూడా భాగస్వాములని విశ్వసించలేము. వారికి నిజంగానే దీర్ఘకాలికమైన పర్యవసానాల గురించిన అవగాహన లేకపోయి ఉండవచ్చు. లేదా, ఇప్పుడు విభజన వల్ల ప్రమాదాలను వారికి డిసెంబర్‌ 9 తరువాత మాత్రమే వారి నేతలు ముందుకు తెచ్చి ఉండవచ్చు. లేదంటే, సీమాంధ్రప్రజాప్రతినిధులు కూడా తెలంగాణ వాదం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఈ దశాబ్దకాలం నెట్టుకువచ్చి ఉండవచ్చు. లేకపోతే, ఒక శాసనసభ్యుడే ఒక చానెల్‌ చర్చలో పాల్గొంటూ- " నాకు తెలియక అడుగుఆను, ఇంతకూ మీకు తెలంగాణ ఎందుకు?'' అని అడుగుతాడా?

  సీమాంధ్ర నేతల వైఖరి కారణంగా, నిజాయితీతో సమైక్యతను కోరుకునేవారు సైతం నిరాయుధులవుతున్నారు. నిజానికి, సమైక్యవాదులు వేర్పాటువాదులను  ఉద్దేశించి ఐక్యతాబోధలు చేయాలి. అన్యాయం జరిగిందని భావిస్తున్నవారికి ఆశ్వాసనలివ్వాలి. అలాకాక, తెలంగాణ వాదానికి భూమికలుగా ఉన్న మౌలికవాదాలనే సవాల్‌చేస్తూ, ఉద్యమాన్ని కొట్టిపారేసే తీరులో సాగడం- ప్రత్యేకవాదులలో మరింత పట్టుదలను పెంచింది. విభ జన జరిగితే సీమాంధ్రప్రజలకు వాస్తవంగా ఎదురయ్యే ఇబ్బందులు చర్చలోకి రాకుండా పోతున్నాయి.  ఉత్తరాంధ్ర సమస్యలు కానీ, పోలవరం భవిష్యత్తు కానీ, రాయలసీమకు నీళ్లు కానీ- సోదిలోకి లేకుండా పోయి కేవలం హైదరాబాద్‌ మీద హక్కుకే వాదోపవాదాలు పరిమితమవుతున్నాయి. రాయలసీమలో, కొంత వరకు ఉత్తరాంధ్రలో వినిపిస్తున్న ప్రత్యేకరాగాలు అక్కడి రైతాంగానికి, సామాన్యులకు కావలసిన హామీల గురించి మాట్లాడుతున్నాయి.కోస్తాంధ్రలో జరగవలసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రత్యేక ఆంధ్రవాదులకు నిర్బంధమే ఎదురవుతున్నది.

  సీమాంధ్రలో తలెత్తిన హఠాత్‌ ఉద్యమం, చిదంబరం వెనక్కి తగ్గి చర్చల ప్రక్రియ ప్రారంభించడం, తిరిగి తెలంగాణ రాష్ట్రసాధన ప్రశ్నార్థకం కావడం- తెలంగాణ ఉద్యమంలో తీవ్రమైన నిరాశను కలిగించాయి, పట్టుదలనూ పెంచాయి. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయనాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి నడిపిస్తున్నది మాత్రమే అని సీమాంధ్రలోని నేతలు బాహాటంగానే చెబుతున్నప్పటికీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గ్రామగ్రామాన తెలంగాణ నినాదం విస్తరించడమే కాక, గతంలో ఉద్యమంలో భాగంగా లేని అనేక వర్గాలు శ్రేణులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందరి ముఖంలోనూ ఒకే సంశయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.  వస్తుందా రాదా?  అసలింతటి వ్యతిరేకత ఎందుకు? న్యాయమైన ఆకాంక్షను కూడా ఇట్లా అణచివేస్తారా? - ఇవీ వారు అమాయకంగా ఆవేశంగా వేసే ప్రశ్నలు.

  ఇక్కడే తెలంగాణవాదులు ఒక ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుంది. ఐదు దశాబ్దాల ఆకాంక్ష అంటున్నారు, తెలంగాణ వనరులు,అవకాశాలు దోపిడికి గురి అవుతున్నాయంటున్నారు,  మరి అంతటి విలువైన డిమాండ్‌ ఎటువంటి ప్రతిఘటనా లేకుండానే వస్తుందని ఎందుకు భ్రమించారు?  రాష్ట్ర విభజన అంటే పటం మీద గీతలు గీయడం కాదు కదా?  ఇంతదాకా ఉమ్మడిగా ఉన్న అనేక ఆర్థిక, సామాజిక, ప్రాకృతిక సంపదల విభాగం జరగవలసి ఉంటుంది. కలసి ఉంటే తమకు ప్రయోజనం ఉంటుందని భావించే వారు అంత సులువుగా విభజనకు అంగీకరిస్తారా?  ఏ స్పష్టమైన ప్రయోజనమూ లేకుండానే కేవలం సమైక్యభావనతోనో, అభద్రతతోనో వ్యతిరేకించే సామాన్యుల సంగతేమిటి? వారందరినీ సముదాయించే వారెవరు? పదేళ్ల ఉద్యమప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రసమితి కానీ, ఉద్యమంలో భాగంగా ఉన్న వివిధ ప్రజాసంస్థలు కానీ- సీమాంధ్రప్రజలకు నచ్చచెప్పడానికి, తెలంగాణలో ఉన్న ప్రాంతేతరులకు ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలెన్ని?  మొదటి జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికలలోనే పాల్గొనకుండా వెనక్కు తగ్గిన టిఆర్‌ఎస్‌- హైదరాబాద్‌ ప్రజలతో  తమ ఉద్యమం విషయంలో చేసిన ప్రచారం ఎంత? హైదరాబాద్‌ ముస్లిములలో ఉన్న ఊగిసలాటను పట్టించుకుని, వారిని విశ్వాసంలోకి తీసుకోవడానికి జరిగిన కృషి ఎంత? - ఈ శేషప్రశ్నలన్నీ తెలంగాణ డిమాండ్‌కు ఎదురైన ప్రతిఘటన కారణంగా ముందుకువచ్చినవి. విస్త­ృత భావప్రచారం జరగవలసిన ఆవశ్యకతను, వ్యతిరేకులను, తటస్థులను తమ వైపు తిప్పుకోవలసిన బాధ్యతను గుర్తించి ఉంటే, మొదట తెలంగాణకు అనుకూల నిర్ణయం వచ్చి ఆ తరువాత పంపకాలపై చర్చలు జరిగే అవకాశం ఉండేది. కేంద్ర సానుకూల వైఖరి తీసుకుంటే ఇక ఎటువంటి అవరోధమూ ఉండదనే భ్రమ కారణంగా ఇప్పుడు చర్చల ప్రక్రియ ముందు జరిగి తెలంగాణ నిర్ణయం తరువాత జరిగే పరిస్థితి ఏర్పడింది.

  ప్రత్యేకరాష్ట్ర అవతరణ ఒక సుదీర్ఘ ప్రక్రియఅని, అందుకు నిరంతరం ఒత్తిడి తేవడంతో పాటు తమ, పర వర్గాల కు చెందిన ప్రజలతో, ఉద్యమాలతో సంప్రదింపులు జరపడం అవసరమని తెలంగాణ వాదులు గుర్తించాలి.  ఆరేడువారాలుగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమం విరామకాలంలో చల్లారుతుందేమో, కేంద్రం వెనక్కు తగ్గతుందేమోనన్న భయాందోళనలు పక్కనపెట్టి, నేర్చుకున్న గుణపాఠాలతో ముందుకు సాగాలి.  తమది న్యాయమైన డిమాండ్‌ అయినంత మాత్రాన అదొక్కటే విజయానికి బాటలు వేయదు. ఇది న్యాయాన్యాయాల సమస్య కాదు, సాధ్యాసాధ్యాల సమస్య. విభజన కూడదనుకునే సమైక్యవాదులు- ప్రత్యేకవాదులను  ఉద్దేశించి తమ భావప్రచారాన్ని సాగించాలి. అరిగిపోయిన విషయాలపై చర్చ జరగకుండా, తమ ప్రయోజనాల గురించిన ప్రతిపాదనలు చేయాలి.  విభజన అనివార్యం అని గుర్తిస్తే, అనంతర విషయాల గురించి  తమ గొంతును విప్పాలి.