Saturday, January 30, 2010

ఉద్యమాలు, బాధ్యతలు, హక్కులు

        పాతికేళ్ల కిందట అనుకుంటాను ఒక ప్రముఖ రచయిత ఒక పత్రికలో లేఖ రాశారు. నినాదాలు రాసి గోడలు పాడు చేస్తున్న సంఘాలను ఆయన ఆ లేఖలో తీవ్రంగా తప్పుపట్టారు. ఎంతో ఖర్చుపెట్టి ఇంటికి వెల్ల వేసుకున్న ఒక మధ్యతరగతి గృహస్థు, తెల్లవారే సరికి తన ఇంటిగోడలు ఏవో రాతలతో నిండిపోతే ఎంత బాధపడతాడో ఉద్యమకారులు గ్రహించాలని ఆ రచయిత ఆ లేఖలో బాధపడ్డారు. దేశమంతా అశాంతితో ఆందోళనలతో రగిలిపోతుంటే తన ఇల్లు మాత్రం తెల్లగా ఉండాలని ఆశించడమేమిటని ఆ లేఖకు మరికొందరు రచయితలు జవాబు కూడా చెప్పారు. పత్రికలో ఇట్లా వివాదం సాగుతుండగానే ఒకరాత్రి సంఘాల వాళ్లు వెళ్లి ఆ లేఖ రాసిన రచయిత ఇంటిగోడల మీద అంగుళం కూడా వదలకుండా నినాదాలు నింపి వచ్చారు. పాపం ఆ రచయిత ఆలోచనలు వాస్తవికతకు ఎడంగా ఉండి ఉండవచ్చును కానీ, హక్కులకు, చట్టానికి దూరంగా లేవు. తన సొంత ఇంటి గోడలను ఒక్క రాతా లేకుండా కాపాడుకోవాలనుకోవడం ఆ గృహస్థు హక్కు. ఆ హక్కుకు ప్రభుత్వాల నుంచి కాకుం డా ప్రజా సంఘాల నుంచి భంగం కలిగినప్పుడు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక ఆయన పౌరసమాజానికే విజ్ఞప్తి చేసుకున్నారు.
సంఘజీవి అయిన మనిషి- సంఘంలో జరుగుతున్న దానితో నిమిత్తం లేకుండా ఒక ద్వీపంలాగా, సంఘపు మంచిచెడ్డలు అంటకుండా ఉండగలడా అన్నది కూడా ఆలోచించవలసిన ప్రశ్నే. రోడ్లు మురికిగా ఉన్నప్పుడు మన బట్టలు మురికి కాకుండా కాపాడుకోగలమా? రణగొణ ధ్వనుల మధ్య ఏకాంతాన్ని కల్పించుకోగలమా? రోదన లు ఆక్రందనలు వినిపిస్తున్నప్పుడు మధురసంగీతం వినే హక్కును డిమాండ్‌ చేయగలమా? మరి వ్యక్తి స్వేచ్ఛకూ సమష్టి ఆచరణకూ వైరుధ్యం ఏర్పడినప్పుడు దానికి పరిష్కారం ఏమిటి?
        గోడలను నినాదాలతో నింపడమన్నది చిన్న సమస్య.ఇప్పుడు రోడ్ల పక్కన గోడలే ఉండడం లేదు, ఉన్న గోడలకు కాపలాలు ఉంటున్నాయి, పైగా నినాదాలు రాసే సం ఘాలే తగ్గిపోయాయి, ఎన్నికల నినాదాలకు శేషన్‌ ఎప్పుడో బ్రేక్‌ వేశారు కాబట్టి- ఆ సమస్యా అంతరించిపోయింది. వ్యక్తి స్వేచ్ఛ ఒక్కటే సమస్య కాదు, ఒకవర్గం చేస్తున్న ఆందోళనలు తమకు నష్టం కలిగిస్తున్నాయని సమాజంలోని తక్కిన వర్గాలు అంటున్నా యి. నిజమే, ఉద్యమకారులు, సంఘాలు, ఆందోళనలు తక్కిన సమాజాన్ని, ప్రత్యేకించి కొన్ని సమూహాలను ఇబ్బంది పెట్టడం ఏదో రూపంలో జరుగుతూనే ఉన్నది.అంతే కాదు, ప్రజల సమష్టి ఆస్తులకు నష్టం

సమ్మక్క: రెండు సందర్భాలు

మేడారం జాతరకు ఒక మహా ఉత్సవంగా, మీడియా ఈవెంట్‌గా మారడం మొదలుపెట్టిన వెంటనే అక్కడి జంపన్నవాగు మీద ప్రభుత్వం వంతెన నిర్మించాలని భావంచింది.  వరంగల్‌ ములుగు అడవుల్లోకోయల సాంప్రదాయ రాజ్యానికి సరిహద్దు వంటిది జంపన్నవాగు.  వంతెననిర్మాణం మంచిచెడ్డలను చర్చిస్తూ 2002లో 'వార్త'లో 'సందర్భం' కాలమ్‌లో రాసిన వ్యాసం ' అడవిదారులన్నీ మూసుకుపోయే ఓ అద్భుత క్షణం కోసం'.
        2006లో మరోసారి మేడారం జాతర సందర్భంగా  'ఆంధ్రజ్యోతి' 'సంభాషణ' కాలమ్‌లో రాసినది "కుంకుమ బరిణె'. అప్పటికి జంపన్నవాగు వంతెన పూర్తయింది. జాతర లో కోయతనం నశించి ప్రధానస్రవంతి సంస్కృతిదిపై చేయి అయింది. అయినా అక్కడ మిగిలిన మార్మిక ప్రాకృతిక జనసంస్కృతికి నివాళిగా రాసినదీ వచనం.
       2010లో మళ్లీ వచ్చిన ఈ వనజన జాతర సందర్భంగా పాత కాలమ్‌లు రెండు...

అడవిదారులన్నీ మూసుకుపోయే ఓఅద్భుత క్షణం కోసం.....

     మాఘమాసపు పున్నమికి మూడురోజుల ముందు గోదావరితీరారణ్యపు బాహువుల లోకి జనసముద్రం నడిచివెడుతుంది. తాము తిరుగాడిన నేల కోసం, తమ అస్తిత్వానికి అర్థమయిన అడవి కోసం, తాము సహజీవనం చేసే నీటి కోసం ప్రాణమిచ్చిన సమ్మక్క సారక్కల కోసం,  యుగాలు గడచినా తీరని మొక్కులకు,అనంతకాలాలు  సిగమూగినా తీరని ఆవేశాలను జనం జంసన్నవాగుకుసమర్పిస్తారు.మానవ సమాజాలకున్న శక్తే అటువంటిది. గతించే తరాలను లెక్క చేయకుండా అది పురాస్మృతుల సొరంగాల గుండా ప్రయాణించి మరణాలను అపహసిస్తుంది. మార్మికమైన, మాంత్రికమయిన, అధిభౌతికమయిన మానవ సహజాత ఆచరణ- పసితనపు అమాయకతను, నిష్కల్మషపు అమాయకతను నిరంతరం పరిమళిస్తుంటుంది. అది కృతజ్ఞతమయినది. అది అల్పసంతోషి. ఒక చిన్నత్యాగానికి అనంతకాలాల సంస్మరణలను కానుకగా ఇస్తుంది. వేలగాథలను గానం చేస్తుంది.
     వరంగల్‌ జిల్లా ములుగు అడవులలోని మేడారం దగ్గర జరిగే ఈ కోయల జాతర నేడు ప్రమాదంలో పడిన ఒక చిరస్మరణ. జాతరకు వెళ్లే జనం పెరిగి ఉండవచ్చు. ఎడ్ల బండ్లకు బదులు మోటారు వాహనాలు మైళ్లపొడవునా బారులు తీరుతూ ఉండవచ్చు. సారా ఏరులై పారవచ్చు. జంతుబలులు రెట్టింపు జరగవచ్చు. అయినా సమ్మక్క సారక్క జాతర మాత్రం ఓడిపోతున్నది. అంతరించిపోతున్నది.  జంపన్నవాగు మీద వంతెన నిర్మాణంతో సమ్మక్క సారక్కల హత్య మరోసారి జరిగిపోయింది. ప్రతాపరుద్రుడు

Thursday, January 28, 2010

కుంకుమ బరిణె

కొక్కరి ఎంకన్న , చందాగోపాలరావు, సిద్ధబోయిన మునెందర్‌, సిద్ధబోయిన లక్ష్మణరావు, ఇటువంటి వాళ్లే,  ఈ పేర్ల వాళ్లే,  ఆ రోజు వీరులై పోతారు.  రాజ్యఖడ్గాన్ని, రాజముద్రికనీ ధరించిన ప్రభుత్వ యంత్రాంగం కాసేపు అనుచరగణమైపోగా, చిలుకలగుట్ట పాదాల దాకా వెడతారు. అందరినీ వెనుకనే నిలిపివేసి తామొక్కరే కొండమీది
కాలిబాటల్లోకి వెళ్లి మాయమవుతారు. తమకు మాత్రమే తెలిసిన రహస్యనిక్షేపం నుంచి కుంకుమ బరిణె రూపంలోని సమ్మక్కను తోడ్కొనివస్తారు.  కన్నెబోయినపల్లి నుంచి సారలమ్మను తరలించుకు వస్తారు. మేడారం లోయలోని గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు.

ఎంతటి అనాది వియోగమో అడవి మీద మనిషికి, మళ్లీ అమ్మకడుపులోకి చొచ్చుకుపోయినట్టు, సందోహం, సంరంభం, అప్పటికప్పుడు మొలకలెత్తి విరగపండిన జొన్నచేను వలె జనమే జనం. లక్షలాది శరీరాలు ఒక్కరూపు దాల్చి చరిత్రతో సంభాషిస్తున్నట్టు, దండకారణ్యానికి దండం పెడుతున్నట్టు.

Sunday, January 24, 2010

నమ్మదగ్గ నేత లేకపోవడమే శాపం


1944. నల్లగొండ జిల్లా భువనగిరిలో నైజామాంధ్ర మహాసభ పదో మహాసభలు. పధ్నాలుగేళ్లుగా విద్యా ప్రచారక, సాంస్కృతిక, సామాజిక ఉద్యమంగా ఎదుగుతూ వచ్చి రాజకీయ రూపం తీసుకుంటున్న తరుణంలో మహాసభ పగ్గాలు కమ్యూనిస్టుల చేతికి వెళ్లబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలున్న సభలు. కమ్యూనిస్టేతరులందరూ దాదాపుగా బహిష్కరించిన సభలు. అయినా ఒకటి రెండు అపవాదాలు. కాంగ్రెస్‌వాది అయినప్పటికీ పోరాటవాది అయిన కాళోజీ ఆ సభలకు రావడంలో ఆశ్చర్యం లేదు.
    కానీ, మరో వ్యక్తి, వృద్ధుడు,అక్కడ ఉంటారని ఎవరూ ఊహించని ఆశించని పెద్దమనిషి- సభ మందిరంలో దూరంగా ఒక మూల కూర్చుని కార్యక్రమాన్ని ఆసక్తి గా, ఒకింత ఆవేదనగా కూడా- పరిశీలిస్తున్నారు. ఆయన రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి. ఏడో నిజామ్‌కు అత్యంత ఆంతరంగికుడిగా ఉన్నవారు. దీర్ఘకాలం హైదరాబాద్‌ నగరానికి కొత్వాల్‌గా పనిచేసినవారు. ఆంధ్రమహాసభ చీలిపోకూడదని, ఎట్లాగైనా తెలంగాణలో రాజకీయ ఉద్యమం ఏకతాటిమీద నడవాలని మనస్ఫూర్తిగా ఆశించిన వారిలో వెంకటరామారెడ్డి ఒకరు.
    చీలిక తరువాత కమ్యూనిస్టు ఆంధ్రమహాసభను నిజాం ప్రభుత్వం కర్కశంగా అణచివేస్తుందని ముందుగా రావినారాయణరెడ్డిని ఆయన హెచ్చరించారు కూడా. తెలంగాణ భవిష్యత్తు గురించి ఆయన అంతగా కలవరపడడానికి కారణం ఏమిటి? నైజాం తెలుగు ప్రాంతాలలో విద్యను, చైతన్యాన్ని, ప్రజారంగాన్ని, పౌరసమాజాన్ని నిర్మించడానికి పునాది స్థాయిలో అసాధారణమైన దోహదం చేసిన వ్యక్తి రాజబహదూర్‌. ఆయన నిజాం రాజ్యయంత్రాంగంలో ముఖ్యవ్యక్తి అయి ఉండవచ్చు. బ్రిటిష్‌ యువరాజు హైదరాబాద్‌ పర్యటనను సాఫీగా నిర్వహించినందుకు ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ బిరుదును పొందిన రాజభక్తుడే కావచ్చు. కానీ, 20 శతాబ్ది ఆరంభ దశాబ్దాల లో హైదరాబాద్‌ తెలుగు సమాజం కొత్త నడకలు నేర్వడానికి కీలకమైన దోహదం చేసిన మనిషి ఆయన. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద భూస్వాములను, సంస్థానాధీశుల ను ఒప్పించి గోలకొండ పత్రికకు నిధులు సమకూర్చడంలో కావచ్చు, ఆ పత్రికకు నిజాం ప్రభుత్వం నుంచి అనుమతి సాధించడంలో కావచ్చు, ఆంధ్రమహాసభ అవతరణకు కావలసిన భూమికను ఏర్పరచడంలో కావచ్చు, మహాసభల నిర్వహణల్లో పోలీసు అనుమతులను సులభం చేయడంలో కావచ్చు- ఆయన ప్రమేయమే కనిపిస్తుంది. హైదరాబాద్‌ రాజ్యంలో ఆదిఆంధ్రుల ఉద్యమాన్ని నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ అయి నా, సికింద్రాబాద్‌లో దళితులను సంఘటితం చేసిన అరిగె రామస్వామి, ఎం.ఎల్‌ ఆదెయ్య వంటి వారికి అయినా ప్రభుత్వంలో పెద్ద దిక్కు వెంకటరామారెడ్డే. ఆయన సహాయం లేకపోతే, రెడ్డి విద్యార్థులకు విద్యావసతి కల్పించాలనుకున్న కొండా వెంకటరంగారెడ్డి ఆశయం రెడ్డి హాస్టల్‌ రూపంలో వాస్తవరూపం ధరించేదే కాదు. ఆ రెడ్డి హాస్ట లే లేకపోతే, తెలంగాణ సాయుధ పోరాటానికి గాని, జాతీయ ఉద్యమానికి కానీ నూత న నాయకత్వం లభించేదే కాదు. రెడ్డి హాస్టల్‌ మాత్రమే కాదు, హైదరాబాద్‌లోని రెసిడెన్సీ ప్రాంతంలో కనిపించే అనేకానేక విద్యార్థి వసతి గృహాలు, కులసంఘాల కార్యాలయాలు- వెంకటరామారెడ్డి ఆశీస్సులతో, సహాయంతో అవతరించినవే. మొక్కగా ఉన్నప్పటినుంచి తెలంగాణలో ఆధునిక వికాసానికి శ్రేయోభిలాషిగా ఉన్నారు కాబట్టే, ఆ వికాసం విచ్ఛిన్నమవుతుందేమోనని రాజబహదూర్‌ ఆందోళన చెందారు.
    కొత్వాల్‌ వెంకటరామారెడ్డే కాదు, ఆంధ్రపితామహుడు మాడపాటి హనుమంతరావు కానీ, బూర్గుల రామకృష్ణరావు కానీ, సురవరం ప్రతాపరెడ్డి కానీ, భాగ్యరెడ్డివర్మ కానీ నాటి తెలంగాణ ఆధునిక యుగంలోకి ప్రవేశించడానికి ఏమేమి అవసరమో ఆ కర్తవ్యాలన్నిటినీ నెరవేర్చడానికి ప్రయత్నించారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజాస్వామ్యవ్యవస్థలోకి ప్రవేశి స్తే అందుకు అవసరమైన మౌలిక వసతులేమిటో, మానవ వనరులేమి టో, నాయకత్వాలేమిటో వారికి అవగాహన ఉంది. ఒక దూరదృష్టి, దార్శనికత, సమగ్ర అవగాహన ఉన్న తరం అది.
తెలంగాణ ప్రాంతానికి ఒక విశ్వసనీయమైన నాయకత్వం అవతరించడానికి కాలం కడుపుతో ఉన్న కాలం అది. అటువంటి మనుషులు ఒక్కరంటే ఒక్కరు నాయకత్వ శ్రేణిలో లేకపోవడమే నేటి తెలంగాణ దౌర్భాగ్యం. వారి ప్రయత్నాలు ఫలించాయి. ఏదో ఒక స్థాయిలో ఒక నాయకత్వ శ్రేణి అవతరించింది. ఎందరి కృషి వల్లనో ఆవిర్భవించిన రాజకీయ, సామాజిక కార్యకర్తల తరం ఎందుకు గమ్యాన్ని చేరుకోలేకపోయింది? ఇందులో స్వయంకృతాపరాధం కొంత ఉంది. చరిత్ర చెలగాటం కొంత ఉంది. బాహ్యశక్తుల ప్రమేయం కొంత ఉంది.
    ప్రపంచప్రఖ్యాతమైన సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ నుంచి కొత్త నాయకత్వ తరా న్ని తీసుకువచ్చింది. ఆ నాయకత్వం తీవ్రమైన నిర్బంధాన్ని హింసలను ఎదుర్కొనవలసి వచ్చింది. 1952 ఎన్నికలలో ప్రజలు ఉద్యమ ప్రాంతాలలో ఆ కొత్త తరానికి బ్రహ్మాండమైన విజయాలను సమకూర్చారు. అయితే, ఉద్యమేతర ప్రాంతాలలో జాతీయవాద నాయకులు, ప్రధానంగా భూస్వామ్య వర్గం వారు విజయం సాధించా రు. కమ్యూనిస్టు విజయాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌ స్టేట్‌లో తెలుగేతర ప్రాంతాలు కూడా ఉండడం వల్ల తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వం మరాఠీ, కన్నడ ప్రాంతాల విజయాల సాయంతో అవతరించింది. మూడు ప్రాంతాల ఉమ్మడి అభ్యర్థిగా బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు తప్ప, తెలంగాణలో ఆయన వర్గానికి ఉన్న పలుకుబడి స్వల్పం. కొండా వెంకటరంగారెడ్డి వర్గానిదే ఆధిక్యం. తెలంగాణలో జాతీయవాదులుగా ఉన్న సాంప్రదాయ భూస్వామ్య వర్గంతో సమ స్య ఏమిటంటే, తక్కిన ప్రాంతాలలో మాదిరిగా వారికి రాజకీయ శిక్షణ లభించలేదు. బ్రిటిష్‌ ఆంధ్రప్రాంతాలలో 1920 నుంచి ఏదో ఒక పద్ధతిలో ఎన్నికల రాజకీయాలు ఉనికిలో ఉండడం, పలుకుబడి వర్గాలు రాజకీయవాదులుగా పరివర్తన చెందడం క్రమంగా జరిగిపోయాయి. తెలంగాణలో ఈ శక్తులు ప్రధాన స్రవంతి రాజకీయాలలో అనుభవం సాధించకుండా నాటి జాతీయోద్యమనాయకురాలైన కాంగ్రెసే అడ్డుపడింది. 1938లో సత్యాగ్రహ కార్యక్రమా న్ని త్వరలోనే ముగించి, హైదరాబాద్‌ స్టేట్‌లో కాంగ్రెస్‌ పేరుతో ఉద్యమాలు అవసరం లేదన్నది. సంస్థానాధీశులు జాతీయోద్యమానికి సహజ మిత్రులన్న వైఖరితో గాంధీజీ- ఇక్కడి జాతీయవాదులకు పనిలేకుండా చేశారు. ఈ అనుభవ రాహిత్యం- 1956 తరువాత విశాలాంధ్రలో వారిని ద్వితీయ శ్రేణి నాయకులుగా మార్చివేసింది. కమ్యూనిస్టు పార్టీలో ఎదిగిన తెలంగాణ తరం వారి నాయకత్వానికి లోబడి ఉండగా, తెలంగాణ భూస్వామ్య ప్రాబల్య వర్గాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తమ నేతలను వెదుక్కున్నారు. కొండా వెంకటరంగారెడ్డి వంటి వారు తెలంగాణ ప్రత్యేకతకే కట్టుబడి ఉన్నప్పటికీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాన్ని వామపక్ష ఉద్యమం నైతికంగా బలహీన పరచింది. భూస్వామ్యవర్గం,  వామపక్షీయులు- అన్న ద్వంద్వం రాష్ట్రావతరణ కాలం నుంచి తెలంగాణకు ఒక ప్రతికూల అంశంగా తయారైంది. కమ్యూనిస్టులు న్యాయంగా వేసిన దెబ్బ, బ్రిటిష్‌ ఆంధ్రలోని ప్రాబల్యవర్గం వేసిన ఆధిపత్య దెబ్బ- కలసి తెలంగాణ సాంప్రదాయిక నాయకత్వాన్ని మరుగుజ్జుగా మార్చాయి. తరువాత కాలంలో కూడా ఈ క్రమం కొనసాగుతూనే వస్తోంది. తెలంగాణ నుంచి వేరువేరు ఉద్యమాల ద్వారా ఏర్పడుతూ వస్తున్న మిలిటెంట్‌ శక్తులు ప్రభుత్వ దమనకాండకు బలి అవుతూ ఉండగా, ప్రాబల్య వర్గాల నుంచి కొత్త తరాన్ని మిలిటెంట్లే అదుపుచేస్తూ వచ్చారు.
రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి ఆశించినట్టు, 1944లో జాతీయవాదులు, కమ్యూనిస్టులు ఏదో ఒక ప్రాతిపదికపై సమీకరణ సాధించగలిగి ఉంటే (అటువంటి సమీకరణ అపచారమని అనుకోనక్కరలేదు, ఇప్పుడు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జరుగుతున్న సంకీర్ణ రాజకీయాలతో పోలిస్తే అదేమంత పెద్ద నేరం కాదు), నైజామ్‌ రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రభుత్వానికి, ఆ తరువాత ప్రజాస్వామ్య ప్రక్రియకు పోరా డి ఉంటే- పరిస్థితులు వేరుగా ఉండేవి. తెలంగాణ శ్రేయస్సే పరమావధిగా ఆలోచించి, వ్యవహరించే నాయకత్వం రూపొంది ఉండేది.  దేనికీ బాధ్యత వహించని, ఉత్తరకుమార ప్రతిజ్ఞలు చేయని, వెంట నడిచే ప్రజలకు ఆశ్వాసన ఇవ్వని, దేనికీ లొంగబోమన్న ధీమా ఇవ్వలేని, వెన్నెముక ఎక్కడ ఉన్నదో తెలియని నేటి తెలంగాణ రాజకీయ నాయకత్వంలోని బలహీనతకు మూలం నైజాం కాలం నాటి రాజకీయాలలోనే ఉన్నది. ఈ రాజకీయ శ్రేణికి సమాంతరంగా, భిన్నంగా ఎదుగుతూ వస్తున్న తాజా యువ, విద్యార్థి నాయకత్వాన్ని-మరోసారి ప్రభుత్వాల దమననీతికి, వ్యతిరేకుల కుటిలనీతికి బలికానివ్వకుండా కాపాడుకోవడం అందుకే నేటి అవసరం. ఆత్మహత్యల పేరుతోనో, అణచివేత పేరుతోనో స్వచ్ఛమైన ఈ కొత్త తరం అణగారిపోతే, ప్రత్యేక రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి, తెలంగాణ శాశ్వతంగా అనాథ అవుతుంది.

Tuesday, January 19, 2010

హఠాత్‌ జ్ఞానోదయాలు

అలజడి తగ్గలేదు, ఆందోళన తగ్గలేదు, పల్లెలకు చెవియొగ్గి వినగలిగితే  కలకలమూ తగ్గలేదు.  కాకపోతే  కోలాహలం కొంచెం తగ్గింది. ఉద్వేగాలు యథాతథంగానే ఉన్నాయి కానీ ఉద్రేకాలు తగ్గాయి.  కాబట్టి మంచీచెడూ మాట్లాడుకోవచ్చు.  ఇతరులలోని తప్పులను ధైర్యంగా చెప్పవచ్చు, మనలోని తప్పులను వినయంగా ఒప్పుకోవచ్చు. రేపటి అడుగులను ఆచితూచవచ్చు. టేబుల్‌కు రెండువైపులా కూర్చుని భిన్నపక్షాలు చర్చించవచ్చు. స్వపక్షమే అయితే, పక్కపక్కనే కూర్చుని వ్యూహరచన చేయవచ్చు.  కేంద్రప్రభుత్వం శాంతి ఎందుకు కోరుతున్నదో కానీ, ఉద్యమాలకు మాత్రం  ఒక  వెసులుబాటు అవసరం, కొంత మౌనం దొరికితే కొంత ధ్యానమూ సాధ్యపడుతుంది.

ఇక్కడే  తెలంగాణవాదులనుంచి మొదటి ప్రశ్న తారసపడుతుంది.  విషయాన్ని చర్చించడానికి కావలసిన  మౌనమూ విరామమూ శాంతీ నిజంగా ఇప్పటిదాకా లేవా? డిసెంబర్‌ 9 వ తేదీ కంటె ముందు  లేదూ నవంబర్‌29 కంటె ముందు సంభాషణకూ సంవాదానికీ చర్చకూ ఆస్కారమే లేదా?  మబ్బేలేని ఉరుమే లేని మెరుపే లేని ఆకాశం నుంచి ఉన్నట్టుండి పిడుగు పడిందా, మిన్నువిరిగి మీద పడిందా?  రామాయణమంతా పూసగుచ్చినట్టు చెప్పిన పౌరాణికుడు, శ్రోతలనుంచి ఏదైనా వివేకమంతమైన ప్రశ్నను, లోతైన సందేహాన్ని ఆశిస్తాడు. కానీ, రాముడికి సీత ఏమవుతుందన్న ప్రశ్న ఎదురయితే? అది అమాయకత్వమా, అజ్ఞానమా, నిర్లక్ష్యమా? పదిపన్నేండేళ్ల నుంచి గొంతుచించుకుని చేసిన నినాదాలు, లక్షలాది పుటలలో నింపి అచ్చొత్తిన సమాచారమూ,  కోటిగొంతుకలతో నినదించిన పాటలు, గర్జనలు, ఉపన్యాసాలు, ఊరేగింపులు, మహాసభలు, కూర్చిన గణాంకాలు, రెండు ఎన్నికలలో చేసిన ప్రచారాలు- వాటిని ఎవరూ ఆలకించనే లేదా? అన్నీ చరిత్ర నుంచి ఎరేజ్‌ అయిపోయాయా?  ఇప్పుడే మేలుకొన్నట్టు, ఏమిటీ హాహాకారాలు?

రాష్ట్రం విడిపోకూడదని, సమైక్యంగానే ఉండాలని ఉద్యమించిన సీమాంధ్ర ప్రజలను కానీ, విద్యార్థులను కానీ ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. విభజన వల్ల తమకు జరుగుతుందని భావిస్తున్న నష్టాల గురించి, హాని గురించి వారికి వారి ప్రజాప్రతినిధులు ఎవరూ చెప్పనే లేదన్న మాట. తెలంగాణలో గత దశాబ్దంగా జరుగుతున్న ఆందోళన గురించి, దాని పర్యవసానాల గురించి తమ ఓటర్లకు వారు వివరించనేలేదన్న మాట. చెప్పకపోవడమే కాదు, తమ ఓటర్ల నుంచి ఇంతటి ప్రతిస్పందన వస్తుందన్న అంచనా కూడా వారికి లేదన్న మాట.  ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియకుండానే వారు తమ తమ నేతలు తీసుకుంటున్న తెలంగాణ అనుకూల వైఖరులకు వత్తాసు పలికారన్న మాట. ఎన్నికల ప్రణాళికల్లో, పార్టీ మేనిఫెస్టోల్లో రాసుకోవడమే కాదు, ప్రణబ్‌ కమిటీకి లేఖలు ఇచ్చినా కూడా ఆ ప్రాంతాల ప్రజాప్రతినిధులు అనుమతించారన్న మాట. అంటే ఇదంతా జరిగేది కాదని, అంతిమంగా తెలంగాణ ప్రజలకు మొండిచెయ్యే దొరుకుతుందని వారికి ధీమా ఉండవచ్చు. తెలంగాణ అనుకూల వైఖరి తీసుకోవడం వల్ల కొన్ని ఓట్లు రాలితే మాత్రం వారికి అభ్యంతరం లేదన్న మాట. ఇటువంటి మోసపూరిత వైఖరిలో సీమాంధ్ర సాధారణ ప్రజలు కూడా భాగస్వాములని విశ్వసించలేము. వారికి నిజంగానే దీర్ఘకాలికమైన పర్యవసానాల గురించిన అవగాహన లేకపోయి ఉండవచ్చు. లేదా, ఇప్పుడు విభజన వల్ల ప్రమాదాలను వారికి డిసెంబర్‌ 9 తరువాత మాత్రమే వారి నేతలు ముందుకు తెచ్చి ఉండవచ్చు. లేదంటే, సీమాంధ్రప్రజాప్రతినిధులు కూడా తెలంగాణ వాదం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఈ దశాబ్దకాలం నెట్టుకువచ్చి ఉండవచ్చు. లేకపోతే, ఒక శాసనసభ్యుడే ఒక చానెల్‌ చర్చలో పాల్గొంటూ- " నాకు తెలియక అడుగుఆను, ఇంతకూ మీకు తెలంగాణ ఎందుకు?'' అని అడుగుతాడా?

సీమాంధ్ర నేతల వైఖరి కారణంగా, నిజాయితీతో సమైక్యతను కోరుకునేవారు సైతం నిరాయుధులవుతున్నారు. నిజానికి, సమైక్యవాదులు వేర్పాటువాదులను  ఉద్దేశించి ఐక్యతాబోధలు చేయాలి. అన్యాయం జరిగిందని భావిస్తున్నవారికి ఆశ్వాసనలివ్వాలి. అలాకాక, తెలంగాణ వాదానికి భూమికలుగా ఉన్న మౌలికవాదాలనే సవాల్‌చేస్తూ, ఉద్యమాన్ని కొట్టిపారేసే తీరులో సాగడం- ప్రత్యేకవాదులలో మరింత పట్టుదలను పెంచింది. విభ జన జరిగితే సీమాంధ్రప్రజలకు వాస్తవంగా ఎదురయ్యే ఇబ్బందులు చర్చలోకి రాకుండా పోతున్నాయి.  ఉత్తరాంధ్ర సమస్యలు కానీ, పోలవరం భవిష్యత్తు కానీ, రాయలసీమకు నీళ్లు కానీ- సోదిలోకి లేకుండా పోయి కేవలం హైదరాబాద్‌ మీద హక్కుకే వాదోపవాదాలు పరిమితమవుతున్నాయి. రాయలసీమలో, కొంత వరకు ఉత్తరాంధ్రలో వినిపిస్తున్న ప్రత్యేకరాగాలు అక్కడి రైతాంగానికి, సామాన్యులకు కావలసిన హామీల గురించి మాట్లాడుతున్నాయి.కోస్తాంధ్రలో జరగవలసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రత్యేక ఆంధ్రవాదులకు నిర్బంధమే ఎదురవుతున్నది.

సీమాంధ్రలో తలెత్తిన హఠాత్‌ ఉద్యమం, చిదంబరం వెనక్కి తగ్గి చర్చల ప్రక్రియ ప్రారంభించడం, తిరిగి తెలంగాణ రాష్ట్రసాధన ప్రశ్నార్థకం కావడం- తెలంగాణ ఉద్యమంలో తీవ్రమైన నిరాశను కలిగించాయి, పట్టుదలనూ పెంచాయి. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయనాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి నడిపిస్తున్నది మాత్రమే అని సీమాంధ్రలోని నేతలు బాహాటంగానే చెబుతున్నప్పటికీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గ్రామగ్రామాన తెలంగాణ నినాదం విస్తరించడమే కాక, గతంలో ఉద్యమంలో భాగంగా లేని అనేక వర్గాలు శ్రేణులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందరి ముఖంలోనూ ఒకే సంశయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.  వస్తుందా రాదా?  అసలింతటి వ్యతిరేకత ఎందుకు? న్యాయమైన ఆకాంక్షను కూడా ఇట్లా అణచివేస్తారా? - ఇవీ వారు అమాయకంగా ఆవేశంగా వేసే ప్రశ్నలు.

ఇక్కడే తెలంగాణవాదులు ఒక ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుంది. ఐదు దశాబ్దాల ఆకాంక్ష అంటున్నారు, తెలంగాణ వనరులు,అవకాశాలు దోపిడికి గురి అవుతున్నాయంటున్నారు,  మరి అంతటి విలువైన డిమాండ్‌ ఎటువంటి ప్రతిఘటనా లేకుండానే వస్తుందని ఎందుకు భ్రమించారు?  రాష్ట్ర విభజన అంటే పటం మీద గీతలు గీయడం కాదు కదా?  ఇంతదాకా ఉమ్మడిగా ఉన్న అనేక ఆర్థిక, సామాజిక, ప్రాకృతిక సంపదల విభాగం జరగవలసి ఉంటుంది. కలసి ఉంటే తమకు ప్రయోజనం ఉంటుందని భావించే వారు అంత సులువుగా విభజనకు అంగీకరిస్తారా?  ఏ స్పష్టమైన ప్రయోజనమూ లేకుండానే కేవలం సమైక్యభావనతోనో, అభద్రతతోనో వ్యతిరేకించే సామాన్యుల సంగతేమిటి? వారందరినీ సముదాయించే వారెవరు? పదేళ్ల ఉద్యమప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రసమితి కానీ, ఉద్యమంలో భాగంగా ఉన్న వివిధ ప్రజాసంస్థలు కానీ- సీమాంధ్రప్రజలకు నచ్చచెప్పడానికి, తెలంగాణలో ఉన్న ప్రాంతేతరులకు ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలెన్ని?  మొదటి జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికలలోనే పాల్గొనకుండా వెనక్కు తగ్గిన టిఆర్‌ఎస్‌- హైదరాబాద్‌ ప్రజలతో  తమ ఉద్యమం విషయంలో చేసిన ప్రచారం ఎంత? హైదరాబాద్‌ ముస్లిములలో ఉన్న ఊగిసలాటను పట్టించుకుని, వారిని విశ్వాసంలోకి తీసుకోవడానికి జరిగిన కృషి ఎంత? - ఈ శేషప్రశ్నలన్నీ తెలంగాణ డిమాండ్‌కు ఎదురైన ప్రతిఘటన కారణంగా ముందుకువచ్చినవి. విస్త­ృత భావప్రచారం జరగవలసిన ఆవశ్యకతను, వ్యతిరేకులను, తటస్థులను తమ వైపు తిప్పుకోవలసిన బాధ్యతను గుర్తించి ఉంటే, మొదట తెలంగాణకు అనుకూల నిర్ణయం వచ్చి ఆ తరువాత పంపకాలపై చర్చలు జరిగే అవకాశం ఉండేది. కేంద్ర సానుకూల వైఖరి తీసుకుంటే ఇక ఎటువంటి అవరోధమూ ఉండదనే భ్రమ కారణంగా ఇప్పుడు చర్చల ప్రక్రియ ముందు జరిగి తెలంగాణ నిర్ణయం తరువాత జరిగే పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యేకరాష్ట్ర అవతరణ ఒక సుదీర్ఘ ప్రక్రియఅని, అందుకు నిరంతరం ఒత్తిడి తేవడంతో పాటు తమ, పర వర్గాల కు చెందిన ప్రజలతో, ఉద్యమాలతో సంప్రదింపులు జరపడం అవసరమని తెలంగాణ వాదులు గుర్తించాలి.  ఆరేడువారాలుగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమం విరామకాలంలో చల్లారుతుందేమో, కేంద్రం వెనక్కు తగ్గతుందేమోనన్న భయాందోళనలు పక్కనపెట్టి, నేర్చుకున్న గుణపాఠాలతో ముందుకు సాగాలి.  తమది న్యాయమైన డిమాండ్‌ అయినంత మాత్రాన అదొక్కటే విజయానికి బాటలు వేయదు. ఇది న్యాయాన్యాయాల సమస్య కాదు, సాధ్యాసాధ్యాల సమస్య. విభజన కూడదనుకునే సమైక్యవాదులు- ప్రత్యేకవాదులను  ఉద్దేశించి తమ భావప్రచారాన్ని సాగించాలి. అరిగిపోయిన విషయాలపై చర్చ జరగకుండా, తమ ప్రయోజనాల గురించిన ప్రతిపాదనలు చేయాలి.  విభజన అనివార్యం అని గుర్తిస్తే, అనంతర విషయాల గురించి  తమ గొంతును విప్పాలి.

Friday, January 15, 2010

హైటెక్‌ గ్లోబులో ఒక చిన్న హైతీ

దేశాలను పరాధీనతను ­ముక్తిలోకి తీసుకువెళ్లిన నాయకులైతే తప్ప, స్వతంత్ర దేశాలలో పుట్టి నాయకత్వానికి ఎదిగిన రాజకీయనాయకులు తత్వవేత్తలు, ఆలోచనాపరులు, మేధావులు అయ్యే అవకాశాలు అతి తక్కువ.  తిరుగులేని అధికారం తలకెక్కిన సైనిక నియంతలు కూడా తాము తత్వవేత్తలమని, ప్రపంచ ­ముక్తి మార్గదర్శకులమని విర్రవీగిన సందర్భాలు కనిపించవు.  పెట్టుబడికీ, దాని 'వి­శ్వరూపానికి', దాని నాయకులకీ, బంటులకీ మాత్రం -  ఏ ­వినయానికీ ఆస్కారం లేనంత అహంకారం ఉంటుంది. తామే ప్రభువులమనీ, తామే కళాకారులమనీ, తామే భ­విష్యత్తు అనీ, తామే చరిత్ర అనీ వారు మాత్రమే అనగలరు.  లేకపోతే, ఈ ప్రపంచం ఈ క్షణాన ఎంతగా పెట్టుబడి గుప్పిటిలో ఉంటే మాత్రం  బిల్‌  క్లింటన్‌నూ, టోనీ బ్లెయిర్‌నూ, చంద్రబాబునాయుడునూ తృతీయ మార్గ ప్రతిపాదకులుగా, ­ముక్తి సాధకులుగా పరిగణించగలుగుతుందా? క్లింటన్‌ మాజీ అయిపోయి, టెన్నిస్‌ మ్యాచ్‌లూ, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లూ, భూకంప బాధిత ప్రాంతాలూ  చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు కానీ- టోనీ బ్లెయిర్‌ (బోలెడంత జనాకర్షక వాగ్దానాల సాయంతో ) రెండో ఇన్నింగ్స్‌ కూడా  ­జయవంతంగా ప్రారంభించారు. ఆయన తన మూడో మార్గ మతాన్ని నిరాఘాటంగా ప్రచారం చేసుకోవచ్చును. చంద్రబాబు నాయుడు కూడా అంతే స్పీడులో మొన్నటి వరకూ ఉన్నారు కానీ ఆయనకు తెలంగాణా తలనెప్పి ఒకటి వచ్చిపడింది.  

ఇటువంటి పెద్ద పెద్ద నాయకుల గురించి  ఎందుకు కానీ, మనం మంచి చెప్పుకునేందుకు ప్రపంచంలో ఇంకా చిన్న చిన్న ప్రజానాయకులు కొందరు ఉన్నారు. ఉదాహరణకు హైతీ ప్రజల నాయకుడు జీన్‌-బెర్ట్రండ్‌ అరిస్టయిడ్‌.  హైతీ ఎంతటి దేశం? మధ్య అమెరికాలోని ఒక కరేబియన్‌ దేశం. దాని చరిత్ర అంతా సైనిక తిరుగుబాట్ల చరిత్రే.  అంతటి హింసనూ, బీభత్సాన్ని, అమెరికా ముక్కు కింద ఉండడం వల్ల పెత్తనాన్ని - అన్నిటినీ భరిస్తూ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రే­మిస్తున్న ప్రజ హైతీప్రజలు. అరిస్టయిడ్‌ కూడా ప్రధానస్రవంతి పాలకపార్టీ నాయకుడే కానీ-  మూడో ప్రపంచ దేశాలకు ఈ నాడు అత్యావశ్యకమైన ఒక స్వతంత్ర దృష్టీ, ఆత్మాభిమాన వైఖరీ ఉన్న వాడు. ఒకనొక దశలో హైతీ సైనికపాలకులకు వ్యతిరేకంగా అమెరికా కూడా అరిస్టయిడ్‌ను సమర్థించింది కానీ,- అతనొక ఆదర్శాల చెత్త, ప్రయివేటు వ్యాపారాలని కొనసాగనివ్వని చాదస్తుడు, బహుళజాతి కంపెనీలకు తలనెప్పి- అని అమెరికన్‌ పత్రికలు తమ ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు హెచ్చరించాయి.  1991 లో అధికారానికి వచ్చి, సైనిక తిరుగుబాట్ల వల్ల అమెరికన్‌ ప్రవాసంలో గడిపి మళ్లీ 1994లో అధికారం చేపట్టిన అరిస్టయిడ్‌ 1996 ఎన్నికల తరువాత తన సన్నిహిత సహచరుడు పావల్‌కు అధికారం అప్పగించి పార్టీ నాయకుడిగా ఉంటున్నాడు.  లవలాస్‌ ఫ్యా­మిలీ లేదా ఎఫ్‌ ఎల్‌ అని పిలిచే అరిస్టయిడ్‌ పార్టీ ఈ మధ్య కాలంలో ప్రత్యర్థి రాజకీయ పక్షాల ­మీద హింసకు పాల్పడుతున్నదన్న ­విమర్శను ఎదుర్కొంటున్నది.

అరిస్టయిడ్‌ మంచి రచయిత.  1978 నుంచి రచనలు చేస్తున్న అరిస్టయిడ్‌ తాజా పుస్తకాలు: అరిస్టయిడ్‌- యాన్‌ ఆటోబయాగ్రఫీ (1992); థియాలజీ అండ్‌ పాలిటిక్స్‌ (1993), డిగ్నిటీ (1995); ఐస్‌ ఆఫ్‌ ది హార్ట్‌- సీకింగ్‌ ఎ పాత్‌ వర్‌ పూర్‌ ఇన్‌ ది ఏజ్‌ ఆఫ్‌ గ్లోబలైజేషన్‌ (2000). అరిస్టయిడ్‌ స్వతంత్రతనూ, సృజనాత్మకతనూ గుర్తించాలంటే- ఆయన ఈ మధ్యనే రాసిన  'పందుల కథ' (ఇది కథ కాదు, నడుస్తున్న చరిత్రకు సృజనాత్మక వ్యాఖ్యానం ) ను చూడవచ్చును. 

''బలిపందులు"
హైతియన్‌ క్రెయోల్‌ పందుల నిర్మూలన 1980 దశాబ్దం ప్రారంభంలో మొదలయింది. ఈ పందిమేధయాగం  గ్లోబలైజేషన్‌కు మంచి ఉపమానంగా పనికివస్తుంది.  చిన్నగా, నల్లగా ఉండే క్రియోల్‌ పందులు హైతీ రైతాంగ ఆర్థికసమాజానికి గుండెకాయల వంటి­వి . ఈ పందులు హైతీ వాతావరణానికీ, పరిస్థితులకూ ఎంతో అనుకూలమైన­వి. చెత్తాచెదారం తిని బతుకుతాయి.  ఏ ఆహారమూ తీసుకోకుండా మూడురోజుల దాకా బతకగలుగుతాయి. అందుకే గ్రా­మీణ కుటుంబాలలో 85 శాతం ఈ పందులను పెంచుతాయి. ఈ పందుల వల్ల భూసారం ఆరోగ్యంగా ఉంటుంది.  అంతే కాదు, పందులున్నాయంటే బంగారం ఉన్నట్టే. ఏ పండుగా పబ్బమూ వచ్చినా పందులను అమ్ముకుని గట్టెక్కవచ్చు.  ప్రతిసంవత్సరంలో అక్టోబర్‌లో స్కూళ్లు తెరిచినప్పుడు ఫీజుల కోసమూ పుస్తకాల కోసమూ రైతులు పెద్దసంఖ్యలో పందులను అమ్ముతుంటారు.

1982లో అంతర్జాతీయ సంస్థలు హైతీ రైతులకు హితబోధ మొదలుపెట్టారు. ­మీ పందులు మంచి­ కావు, రోగిష్టి­­వి, వాటిని చంపేయాలి (వాటిని చంపకపోతే ఆ పందుల రోగం సంపన్నదేశాలకు కూడా పాకుతుంది) అని చెప్పాయి.  ­మీ దగ్గరున్న నాటు, జబ్బు పందులను చంపండి, మేము ­మీకు మంచి పందులు ఇస్తాము, అవి­ ­మీకు మంచి మాంసం ఇస్తాయి అని ఆశపెట్టారు.  ఏ ప్రభుత్వ పథకాలలోనూ చూడనంత వేగంతో, కేవలం పదకొండు నెలల కాలంలో హైతీలో ఉన్న పాత పందులన్నిటినీ చంపేశారు.

రెండు సంవత్సరాల తరువాత, కొత్త, 'మెరుగైన' పందులు హైతీలోకి దిగాయి.  అ­వి ఎంత 'మెరుగైన­వి' అంటే అ­వి మంచినీళ్లు తప్ప ముట్టవు. మరి హైతీలో మనుషులకే మంచినీళ్లు కరువు.  ఇంపోర్టెడ్‌ ఆహారం అయితే కానీ తినవు. కానీ రైతులు దాన్ని ఎలా అందించగలరు? అక్కడి వార్షిక తలసరి ఆదాయమే 130 డాలర్లు, మరి దిగుమతి దాణాకు ఏటా 90 డాలర్లు ఖర్చువుతుంది.  అంతే కాదు, ఆ కొత్త పందులు ఎక్కడ పడితే అక్కడ, ఏ దొడ్డిలో పడితే ఆ దొడ్డిలో ఉండవు. వాటికి ఎండావానా తగలని సురక్షితమైన పందులదొడ్లు కావాలి.  ఇన్ని రకాలుగా ఈ పందులు మెరుగైన­వి కాబట్టే, హైతీ ప్రజలు వాటిని 'నాలుగు కాళ్ల మహారాణులు' అని పిలవసాగారు.  ఇవన్నీ చాలవన్నట్టు, ఈ రాణీపందుల మాంసం ఏమాత్రం రుచిగా ఉండదట.

పందిపునరుజ్జీవన వి­ప్లవం పూర్తిగా ­ఫలమైందని వేరే చెప్పనక్కరలేదు కదా?  ఈ మొత్తం వ్యవహారంలో హైతియన్‌ రైతాంగం 600 ­మిలియన్‌ డాలర్లను నష్టపోయింది. దీని ప్రభావం హైతీసమాజం ­మీద బహుముఖంగా పడింది. గ్రా­మీణ పాఠశాలలో చేరేవారి సంఖ్య 30 శాతం పడిపోయింది.  గ్రా­మీణ ప్రజల ఆహారంలో మాంసకృత్తుల పాలు గణనీయంగా తగ్గిపోయింది.  హైతీప్రజలకు రెడీమేడ్‌ పెట్టుబడిగా ఉండిన పందులు లేకపోవడంతో వారి ఆర్థిక స్థోమత అణగారిపోయింది.  అది వారి వ్యవసాయం ­మీద, ఉత్పాదకత ­మీద ఎంతో ప్రతికూలమయిన ప్రభావం వేసింది. దానినుంచి హైతీ రైతాంగం ఇప్పటికికూడా కోలుకోలేదు. హైతీ గ్రా­మీణ ప్రాంతాలు అత్యధికం ఇప్పటికీ గ్లోబల్‌ మార్కెట్‌నుంచి వెలిగానే ఉన్నాయి. ఎందుకంటే గ్లోబలైజైషన్‌ మొదటి రుచిని వారు పందుల నిర్మూలనలోనే చూశారు. వారి స­ుష్టి జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉన్నది.  ఇప్పుడు వారికెవరైనా ఆర్థికసంస్కరణల గురించి చెబితే, ప్రయివేటీకరణ వారికి లాభం చేస్తుందని చెబితే- వారు భయంతో వణికిపోతారు. ప్రభుత్వరంగంలోని సంస్థలు జబ్బుపడ్డాయని, వాటిని ప్రయివేటుపరం చేయాలని 'వారు' వచ్చి మాకు చెబుతున్నప్పుడు మా రైతులు సాలోచనగా తలలు ఊపుతారు, ఒకసారి తమ క్రెయోల్‌ పందులను గుర్తుచేసుకుంటారు. ''

ఈ కథ చది­నప్పుడు మన దేశంలో ఒక్కడంటే ఒక్కడు ఈ మాత్రం పట్టింపు, సృజనశక్తీ, అవగాహనా ఉన్న ప్రధానస్రవంతి రాజకీయ నాయకుడు లేకపాయెనే అని బెంగ వేస్తుంది.

(ఇది 2001 లో అనుకుంటా వార్త పత్రికలో 'సందర్భం' కాలంలో రాశాను. హైతి లో పెద్ద భూకంపం వచ్చి లక్ష మందికి పైగా పోయారని తెలిసినప్పుడు, ఇది గుర్తుకు వచ్చింది. చిన్న దేశం చిన్న ప్రజలు అయినప్పటికీ వారిది  గొప్ప దేశమూ  వారు గొప్ప ప్రజలూ. చనిపోయినవారికి  క్షతగాత్రులకు సంతాపం సానుభూతి చెప్పడానికి ఈ కాలమ్ రిప్రోడ్యుస్ చేద్దామనిపించింది.)

Monday, January 11, 2010

ఆల్ మైటీ - అమాయకులూ

సీనియర్ పాత్రికేయులు బ్రహ్మానందరెడ్డి, వెంకటకృష్ణలను పోలీసులు వారి చానెల్‌ ఆఫీసునుంచి అరెస్టు చేసి తీసుకువెడుతున్నప్పుడు చూసి చాలా బాధ కలిగింది. వెంకటకృష్ణతో నాకు పెద్ద పరిచయం లేదు కానీ, బ్రహ్మానందరెడ్డి ఉదయం దినపత్రికలో నాకు సీనియర్‌గా పనిచేశారు. 1990 దశకం ఆరంభంలోనే కొత్త ఆలోచనలతో, ఆవేశాలతో పత్రికను తీర్చిదిద్దాలని ప్రయత్నించేవారు. జరిగిన పరిణామాల వెనుక పెద్ద కుట్ర ఉన్నదని భావిస్తున్నప్పుడు- అందులో ఈ జర్నలిస్టుల పాత్ర ఉంటే గింటే అది సాంకేతికమూ నామమాత్రమూ అయిఉంటుంది. వారే అసలు దోషులన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయం. అది వారికి జరుగుతున్న అన్యాయం మాత్రమేకాదు, మొత్తం సత్యానికి జరుగుతున్న అన్యాయం.

సమాజ సంచలనాలలో పత్రికల పాత్ర ప్రమేయం రానురాను అధికమవుతున్న కాలంలో- పెట్టుబడులకు రాజకీయాలకు అధికార వ్యూహాలకు మీడియా నిర్వహణకు దూరం తగ్గిపోతున్న సందర్భాలలో- పాత ప్రమాణాల ప్రకారం విషయాలను అర్థం చేసుకోవడం కష్టమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛలకు, ప్రజాస్వామ్యానికి విలువ పెరగడం ఆరంభమైన కాలం నుంచి, మన దేశంలో "పునరుజ్జీవన', జాతీయోద్యమ కాలాల దాకా పత్రికారంగానికి ఎంతో ప్రతిష్ఠ, గౌరవం ఏర్పడ్డాయి. మీడియా స్వభావమూ వ్యవహారమూ పూర్తిగా మారిపోయిన నేటి కాలంలో, ఆ గౌరవం అంతరించిపోతున్నది. పురాతనప్రతిష్ఠను కొంచెంకొంచెం కొరుక్కుతింటూ మీడియా నెట్టుకు వస్తోంది. ఇంగువ గట్టిన గుడ్డలాగా పూర్వసువాసనలు వెదజల్లుతోంది. ప్రింట్‌ మీడియాలో ఇంకా పత్రికావిలువల గురించిన తపన, పునరుద్ధరణ ప్రయత్నమూ కనిపిస్తున్నాయికానీ, కొత్తగా వచ్చిన విజువల్‌ మీడియా మాత్రం వేగంలో పడికొట్టుకుపోతోంది, దురాశతో నిర్విచక్షణగా వ్యవహరిస్తోంది.

జరుగుతున్న సంఘటనలను సంచలనీకరిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించడం ఒక ఎత్తుఅయితే, సంచలనాత్మక సంఘటనలు జరిగేటట్టు పథకాలు పన్నడం మరో ఎత్తు. ఇర్వింగ్‌ వాలెస్‌ "ఆల్‌మైటీ' నవలలో పత్రికాధిపతి సర్క్యులేషన్‌ కోసం, పేరు కోసం తానే సంఘటనలను రచిస్తూ, వాటిని పత్రికలో ముందుగా రిపోర్టు చేస్తుంటాడు. రాష్ట్రంలో జరిగినవి, జరుగుతున్నవి అటువంటి లాభాపేక్షతో జరుగుతున్నవి కూడా కావు. అవేవీ ఆయా మీడియా సంస్థలకు వ్యాపారపరంగా మేలుచేసేవి కూడా కావు. ఆ సంస్థలు తమ సొంత ప్రతిప్ఠను, మీడియా గౌరవాన్ని కూడా పణంగా పెట్టి సూత్రధారుల రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి ప్రయత్నించాయి.

మీడియా ఒక రాజకీయపక్షాన్ని సమర్థించడం కానీ, ఒక వివాదంలో ఒక పక్షంతో ఉండడం కానీ అసాధారణమేమీ కాదు. కాస్త హెచ్చుతగ్గులతో జాతీయోద్యమకాలం నుంచి పత్రికలలో ఈ ధోరణి కనిపిస్తుంది.. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని మీడియా సహజంగానే ప్రయత్నిస్తుంది. మన వంటి దేశాలలో అక్షరానికి ఆరాధన, విశ్వసనీయత ఎక్కువ కాబట్టి, ప్రింట్‌మీడియా ప్రభావమూ ఎక్కువే. కాకపోతే, అక్షరాస్యత అతి తక్కువ ఉన్న కాలంలో ఆ ప్రభావానికి పరిమితులు ఉండేవి. టెలివిజన్‌ వచ్చిన తరువాత అక్షరస్యత సమస్యేకాకుండా పోయింది. టీవీ మీడియం దాని స్వభావం రీత్యా- ఆలోచన మీద కాక ఆవేశాల మీద, ఉద్వేగాల మీద పనిచేస్తూ ఉంటుంది. "" ఐబాల్‌ గేమ్‌'' మెదడును బైపాస్‌ చేసి నాడీమండలం మీద నేరుగా పనిచేస్తుంది కాబోలు. కాబట్టి, పత్రికా మాధ్యమం ఉన్నంత ఉదారంగా, స్థిమితంగా, పరువుగా టీవీ మాధ్యమం ఉండలేదు, ఉండబోదు కూడా. అయితే, దానికి కూడా ఒక పరిధి ఉండాలి. పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినా దాని చూపు తన గూడునుంచి దూరంగా వెళ్లకూడదు- అని క్షేమేంద్రుడు చేసిన ఔచిత్య విచికిత్స దృశ్యమాధ్యమాలకూ ఉండాలి. ఒక వార్త మరిన్ని అటువంటి వార్తలకు, ఒక స్పందన మరిన్ని అటువంటి స్పందనలకు దారితీసే దుర్మార్గాన్ని నివారించాలి. 1984లో సిక్కులపై హత్యాకాండ కానీ, 2001లో తమిళులపై దాడులు కానీ, వైఎస్‌ మరణానంతర ఆత్మహత్యలుకానీ, కుట్రసిద్ధాంతంతో రిలయన్స్‌సంస్థలపై విధ్వంసం కానీ - వీటన్నిటిలో విజువల్‌ మీడియా పాత్ర ప్రేక్షక పాత్రకాదు, రిపోర్టింగ్‌ పాత్రా కాదు. సంఘటనల గొలుసుకట్టులో ఒక లంకెగా మారిన పాత్ర. ఇది ఎమ్‌బెడెడ్‌ జర్నలిజం కంటె అన్యాయమైనది. గతంలో దండయాత్రలలో యుద్ధకథకులు కూడా ఉండేవారు. ముస్లిమ్‌ దండయాత్రలలో యుద్ధచరిత్రకారులు, చిత్రకారులు కూడా ఉండేవారు. ఇరాక్‌ యుద్ధంలో వివిధ పత్రికల విలేఖరులు సాయుద pataalaala వెనుక నడిచారు. కాకపోతే, వీరంతా జరిగినవాటికి అతిశయం జోడించో, వక్రీకరించో, వాస్తవాలతోనో యుద్దకథనాలు చేసి ఉంటారు. స్వయంగా యుద్ధసంఘటనలను కల్పించి మాత్రం ఉండరు.

మీడియా శాంతికాలంలో నిష్పక్షపాతంగా ఉండడానికి ప్రయత్నిస్తుందట. సామాజిక ఘర్షణలున్న సమయంలో జాతీయవాదంతో వ్యవహరిస్తుందట. యుద్ధకాలంలో ఉన్మాదిగా ఉంటుందట. ఎవరో పెద్దాయన చెప్పారు. శాంతి కాలంలో సైతం నిష్పక్షపాతంగా ఉంటుందా అన్నది సమస్య. శాంతికాలంలో పత్రికలు, చానెళ్లు- నోమ్‌చామ్‌స్కీ అన్నట్టు- ప్రజలకు వార్తలు అందించడం కాక, కార్పొరేట్లకు వినియోగదార్లను అందించే పనిలో ఉంటాయి కాబోలు. వ్యవస్థల విషయంలో నెరవేర్చవలసిన ఇన్ని కర్తవ్యాల మధ్య- మీడియా ఎంతో కొంత మంచి చేయగలగడం విశేషమే. ఆ మంచిని పరిరక్షించాలని, ఎంతో కొంత పెంచాలని ప్రయత్నించే యాజమాన్యాలు, పాత్రికేయులు ఇప్పుడు అవసరం. రానురాను జనం దృష్టిలో పలచనైపోతున్న మీడియా- తనకున్న ప్రత్యేక ప్రతిపత్తిని, గౌరవాన్ని కోల్పోతే- ప్రజాస్వామ్యానికి చాలా అపకారం జరుగుతుంది.

Saturday, January 2, 2010

పాజ్‌, ప్లీజ్‌!

ధనుర్మాసపు ఉదయాలు అతి భారంగా మొలకెత్తుతాయి. వాకిలిముందు  చలిమంటలో పచ్చిసీతాఫలపు కట్టె వలె మసకచీకటి బద్ధకంగా రాజుకుంటుంది.  మంచుదుప్పటి కప్పుకుని మునగదీసుకున్న వేకువను శతకోటి కిరణాలతో సూర్యుడు నిద్రలేపుతాడు.  పగళ్లు కురచవై రాత్రుళ్లు పొడుగైన హేమంతంలో కాలం ఎడతెగకుండా ఉంటుంది. వేసవికాలం పల్లెటూళ్ల మధ్యాహ్నాలు కొండమీదకి లాగే బండరాళ్లవలె అంగుళం అంగుళం కదులుతాయి. గడియారపు ముళ్లకు ఎవరో బరువులు కట్టినట్టు పనీపాటాలేని పగళ్లు ఈడ్చుకుంటూ నడుస్తాయి.  ముసురుపట్టిన వానాకాలంలో  ఉదయాలు మూసుకుపోయి విరహకాలపు ఏకాంతం వలె క్షణమొక యుగంగా గడుస్తాయి.  నవప్రేమికుల ఆకాంక్షలకు దీటుగా కాలం నిజంగానే స్తంభించిపోతుంది.

ఎప్పటిమాటలివి? గడచిపోయిన కాలం గురించిన బెంగనైతే 'నోస్టాల్జియా' అనవచ్చును కానీ, స్వయంగా కాలమే గడచిపోతే ఆ దుఃఖానికి పేరేమిటి?

ఒకానొకప్పుడు, ఇటీవలి గతంలో కూడా- సుదీర్ఘయామినులలో  నలుగురి సమ్మేళనం ముషాయిరా వలె వెన్నెలనో చీకటినో వెదజల్లుతూ ఉండేది. మహానగరపు నిశిరాతిరి నిర్జనవీధుల్లో ఒక్కొక్క దీపస్తంభం కిందా పద్యం నాలుగుపాదాల పాటు విడిదిచేసేది. సెలయేరులా ఏ హోరూ లేని సంభాషణలు మంద్రంగా ప్రవహించేవి.  పెరేడ్‌చేసి పారిపోయే తూనీగల్లాగా చిరుగాలితరగలు ఘడియకొకటి పలకరించేవి. రాత్రులూ అర్థరాత్రులూ వేకువలూ పగళ్లూ సాయంత్రాలూ- క్షణక్షణంగా విడగొట్టి అనుభవించడానికి మనుషులు రెప్పార్చని అనిమేషులమయ్యేవాళ్లు. జీవితంతో కిక్కిరిసిన, జీవితాన్ని దట్టించిన నిమిషాలు- ఆ పల్లెల్లాగే, ఆ సెలయేళ్లలాగే, ఆ  ఎడ్లబండిలాగే,  ఆ మలయానిలంలాగే చితికిపోయాయి. కాలం మారకపు విలువ పడిపోయింది.  ఇరవైనాలుగు ఫ్రేముల క్షణం చిల్లిగవ్వకు కూడా కొరగానిదయింది.

ఎక్కడికిపోయింది అంతటి కాలం? గుప్పిళ్లనిండా దోసిళ్లనిండా అరచేతుల నిండా బాహువుల నిండా కళ్లు విప్పారే దృక్‌ వలయం నిండా పరచుకున్న  అపురూపమైన కాలం ఏమైపోయింది? పసిడిరెక్కలు విసిరి కాలం ఎక్కడికి పారిపోయింది? రోలర్‌ కోస్టర్‌లోనో, బులెట్‌ ట్రెయిన్‌లోనో, కంకార్డ్‌ విమానంలోనో బంధితులమయినట్టు, కాలాన్ని జీవిస్తున్నట్టు కాక దగ్ధం చేస్తున్నట్టు ఏమిటీ వేగం?  దేన్నీ లోపలికి తీసుకోకుండా, దేన్నీ ఆఘ్రాణించకుండా, దేనికీ పరవశులము కాకుండా ఎక్కడికి ఈ పరుగు? బహుశా, మనం మన గడియారాలకు హార్స్‌పవర్‌ మోటార్లు బిగించడం నేర్చుకుని చాలా కాలమయింది. యంత్రభూతాలకు ప్రాణంపోసి పెంచుకుంటున్నప్పటికీ నుంచి మన కాలం కుంచించుకుపోవడం మొదలయింది. అభివృద్ధి పేరుతో మనం మన వనరుల్ని నాశనం చేసుకుంటున్నట్టే, కాలాన్నికూడా ధ్వంసంచేసుకున్నాం. పొగచూరిన ఊపిరితిత్తుల వలె కాలానికి కూడా ఎలాస్టిసిటీ తగ్గిపోయింది.  కరిమింగిన వెలగపండులాగా సమయం ఉట్టి డొల్ల అయిపోయింది.

సాంకేతిక విప్లవం మనిషి మీద మోపిన పారవశ్యం వేగం- అంటాడు మిలన్‌ కుందేరా.  ఆ పారవశ్యాన్ని ఎరగా వేసి వేగవంతమైన ఉనికిని మనకు విక్రయిస్తున్నారని అతను వ్యాఖ్యానిస్తాడు.  వేగం మనకు మరపును ప్రసాదించే మాదకద్రవ్యం. వేగం అంటే విస్మ­ృతి. వర్తమానంలో నిలబడకుండా రేపటిలోకి తీసే పరుగు. అనుభవం ఇంకిపోకుండానే పారిపోయే ప్రవాహం. వేగం ఒక నియంత కూడా. స్వారీ ఒక నైపుణ్యంగా, మనుగడకు అవశ్యమైన సామర్థ్యంగా మారినప్పుడు- ప్రయాణం బుద్బుదప్రాయం. నిదానంగా ఉండడానికి అపారమైన కాలాన్ని ఉదారంగా వ్యయపరచగల శక్తి ఉండాలి. టైమ్‌ ఈజ్‌ మనీ అయినప్పుడు- దరిద్రుల దగ్గర తప్ప ఎవరిదగ్గర ఉంటుంది విశాలమైన సమయం?

విజయరహస్యం వేగమేనట. తట్టుకోగలిగినవాడే నెగ్గుతాడట. సింగరేణి బొగ్గుగనుల్లో అనేకచోట్ల గోడల మీద ఈ సూక్తి పలకరించింది. అక్కడనేమిటి, అన్ని చోట్లా ఇప్పుడు అదే వేదం.  ప్రపంచీకరణ పరమసూత్రం.  మృగాలకూ మెకాలకూ నడుమ ప్రకృతి విధించిన జీవనసూత్రాల కంటె కర్కశమైన మానవసిద్ధాంతం.  ఈ కొత్త ఉన్మాదం రాకముందు, త్యాగం కంటె లాభం, సంక్షేమం కంటె స్వార్థం పరమ విలువైపోకముందు-  మనిషి సాంప్రదాయికమైన వివేకం ఎప్పుడూ విచక్షణలేని వేగాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చింది.  వేగశాలి ధీశాలి కానక్కరలేదని కుందేలు తాబేలు కథ చెబుతుంది. స్థితప్రజ్ఞతో నడచివెడుతున్న గౌతమబుద్ధుడిని పరిగెత్తికూడా అంగుళీమాళుడు అందుకోలేకపోతాడు. ప్రపంచం చుట్టిరావాలన్న పందెంలో వాహనధారి కుమారస్వామి వేగాన్ని నమ్ముకుంటే,  గణేశుడు సారాంశం గ్రహించి తండ్రికి ప్రదక్షిణం చేసి నెగ్గుతాడు. పరిగెత్తి తాగే పాలకన్నా నిలబడి తాగే నీళ్లు గొప్పవని చెబుతారు. నిజం నిలకడమీదనే తెలుస్తుందంటారు కానీ వేగం మీద కాదు.

రోజులన్నీ పరస్పర ప్రతిధ్వనులయ్యే నిస్సారత గురించి ఒక భావకవి రాస్తాడు. వియోగభారం విధించే నిర్వ్యాపకత్వం గురించి ఆ ప్రేమకవి చెప్పి ఉండవచ్చును కానీ, రేపటి  గమ్యాలను నేడే అందుకోవాలని జరిగే ప్రయాణం తరచు గానుగెద్దు యాంత్రికతలోకి పరిణమిస్తుంది.   మూస దినచర్యలు నిర్ణయమైపోయి, పని కూడా మరెవరి బాణీకో పాడే పాటగా మారిపోతుంది.  పాట కూడా పనిలాగా బరువవుతుంది.  తాపత్రయం నుంచి విరామం కోసం  ఒక్క క్షణం పారిపోదలచినప్పుడు ఒక చిన్న ఆశ్రయం కూడా కరువవుతుంది. మనుషుల విశ్రాంతులను, వ్యక్తిగత సమయాలను- చివరకు పగటికలలను కూడా  అప్పుడే ఎవరో మార్కెట్‌ చేసేశారు. 

మనిషేమిటి, సమస్త సృష్టిదీ చలనశీలమే. కానీ, ఆ గతిలో ఒక లయ ఉంటుంది.  గమనంలో వేగమూ స్తబ్ధతా సాపేక్షమయినట్టే,  శాంతీ విశ్రాంతీ కూడా సాపేక్షాలే. వ్యక్తిదో సమాజానికదో ప్రయాణం మందగించినప్పుడు, స్తబ్ధత జడతగా మారబోయినప్పుడు- ఒక కుదుపు, ఒక గెంతు, ఒక లంఘన తప్పనిసరి అవుతాయి. మనిషి మనుగడను మరింత అర్థవంతంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దగలిగితే ఆ పరుగుకు సార్థకత ఉంటుంది.  ఇంత మౌనానికీ, కొంత ధ్యానానికీ తెరిపి ఇవ్వని కాలం  లిరిక్‌ మిగలని రొదసంగీతం వంటిది.  ఆకాశపు దారులెంట హడావుడిగా  వెళ్లిపోయే జగన్నాథచక్రాలు  ఏ తాత్కాలిక లక్ష్యాలనో నెరవేర్చవచ్చును కానీ, నేలమీద చిన్న పాదముద్రను కూడా మిగల్చవు.  జీవితాన్ని వస్తుసంచయంతో, వ్యాపకసమ్మర్దంతో నింపుకోవాలనుకున్నప్పుడు- అత్యంత ఆదిమమైన, నిసర్గమైన, సహజమైన అందాలను, ఆనందాలను, ఆకాశాలను మనిషి కోల్పోక తప్పదు. అనుభవాల కోసం జరిగే వెంపర్లాటలో, వెంపర్లాటే ఏకైక అనుభవంగా మారుతుంది.
                       
( 17 డిసెంబర్‌ 2004 తేదీ నాటి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ  'సంభాషణ'ను మళ్లీ ఐదేళ్ల తరువాత ఈ ధనుర్మాసంలో గుర్తు చేసుకుంటున్నాను)