Saturday, January 2, 2010

పాజ్‌, ప్లీజ్‌!

ధనుర్మాసపు ఉదయాలు అతి భారంగా మొలకెత్తుతాయి. వాకిలిముందు  చలిమంటలో పచ్చిసీతాఫలపు కట్టె వలె మసకచీకటి బద్ధకంగా రాజుకుంటుంది.  మంచుదుప్పటి కప్పుకుని మునగదీసుకున్న వేకువను శతకోటి కిరణాలతో సూర్యుడు నిద్రలేపుతాడు.  పగళ్లు కురచవై రాత్రుళ్లు పొడుగైన హేమంతంలో కాలం ఎడతెగకుండా ఉంటుంది. వేసవికాలం పల్లెటూళ్ల మధ్యాహ్నాలు కొండమీదకి లాగే బండరాళ్లవలె అంగుళం అంగుళం కదులుతాయి. గడియారపు ముళ్లకు ఎవరో బరువులు కట్టినట్టు పనీపాటాలేని పగళ్లు ఈడ్చుకుంటూ నడుస్తాయి.  ముసురుపట్టిన వానాకాలంలో  ఉదయాలు మూసుకుపోయి విరహకాలపు ఏకాంతం వలె క్షణమొక యుగంగా గడుస్తాయి.  నవప్రేమికుల ఆకాంక్షలకు దీటుగా కాలం నిజంగానే స్తంభించిపోతుంది.

ఎప్పటిమాటలివి? గడచిపోయిన కాలం గురించిన బెంగనైతే 'నోస్టాల్జియా' అనవచ్చును కానీ, స్వయంగా కాలమే గడచిపోతే ఆ దుఃఖానికి పేరేమిటి?

ఒకానొకప్పుడు, ఇటీవలి గతంలో కూడా- సుదీర్ఘయామినులలో  నలుగురి సమ్మేళనం ముషాయిరా వలె వెన్నెలనో చీకటినో వెదజల్లుతూ ఉండేది. మహానగరపు నిశిరాతిరి నిర్జనవీధుల్లో ఒక్కొక్క దీపస్తంభం కిందా పద్యం నాలుగుపాదాల పాటు విడిదిచేసేది. సెలయేరులా ఏ హోరూ లేని సంభాషణలు మంద్రంగా ప్రవహించేవి.  పెరేడ్‌చేసి పారిపోయే తూనీగల్లాగా చిరుగాలితరగలు ఘడియకొకటి పలకరించేవి. రాత్రులూ అర్థరాత్రులూ వేకువలూ పగళ్లూ సాయంత్రాలూ- క్షణక్షణంగా విడగొట్టి అనుభవించడానికి మనుషులు రెప్పార్చని అనిమేషులమయ్యేవాళ్లు. జీవితంతో కిక్కిరిసిన, జీవితాన్ని దట్టించిన నిమిషాలు- ఆ పల్లెల్లాగే, ఆ సెలయేళ్లలాగే, ఆ  ఎడ్లబండిలాగే,  ఆ మలయానిలంలాగే చితికిపోయాయి. కాలం మారకపు విలువ పడిపోయింది.  ఇరవైనాలుగు ఫ్రేముల క్షణం చిల్లిగవ్వకు కూడా కొరగానిదయింది.

ఎక్కడికిపోయింది అంతటి కాలం? గుప్పిళ్లనిండా దోసిళ్లనిండా అరచేతుల నిండా బాహువుల నిండా కళ్లు విప్పారే దృక్‌ వలయం నిండా పరచుకున్న  అపురూపమైన కాలం ఏమైపోయింది? పసిడిరెక్కలు విసిరి కాలం ఎక్కడికి పారిపోయింది? రోలర్‌ కోస్టర్‌లోనో, బులెట్‌ ట్రెయిన్‌లోనో, కంకార్డ్‌ విమానంలోనో బంధితులమయినట్టు, కాలాన్ని జీవిస్తున్నట్టు కాక దగ్ధం చేస్తున్నట్టు ఏమిటీ వేగం?  దేన్నీ లోపలికి తీసుకోకుండా, దేన్నీ ఆఘ్రాణించకుండా, దేనికీ పరవశులము కాకుండా ఎక్కడికి ఈ పరుగు? బహుశా, మనం మన గడియారాలకు హార్స్‌పవర్‌ మోటార్లు బిగించడం నేర్చుకుని చాలా కాలమయింది. యంత్రభూతాలకు ప్రాణంపోసి పెంచుకుంటున్నప్పటికీ నుంచి మన కాలం కుంచించుకుపోవడం మొదలయింది. అభివృద్ధి పేరుతో మనం మన వనరుల్ని నాశనం చేసుకుంటున్నట్టే, కాలాన్నికూడా ధ్వంసంచేసుకున్నాం. పొగచూరిన ఊపిరితిత్తుల వలె కాలానికి కూడా ఎలాస్టిసిటీ తగ్గిపోయింది.  కరిమింగిన వెలగపండులాగా సమయం ఉట్టి డొల్ల అయిపోయింది.

సాంకేతిక విప్లవం మనిషి మీద మోపిన పారవశ్యం వేగం- అంటాడు మిలన్‌ కుందేరా.  ఆ పారవశ్యాన్ని ఎరగా వేసి వేగవంతమైన ఉనికిని మనకు విక్రయిస్తున్నారని అతను వ్యాఖ్యానిస్తాడు.  వేగం మనకు మరపును ప్రసాదించే మాదకద్రవ్యం. వేగం అంటే విస్మ­ృతి. వర్తమానంలో నిలబడకుండా రేపటిలోకి తీసే పరుగు. అనుభవం ఇంకిపోకుండానే పారిపోయే ప్రవాహం. వేగం ఒక నియంత కూడా. స్వారీ ఒక నైపుణ్యంగా, మనుగడకు అవశ్యమైన సామర్థ్యంగా మారినప్పుడు- ప్రయాణం బుద్బుదప్రాయం. నిదానంగా ఉండడానికి అపారమైన కాలాన్ని ఉదారంగా వ్యయపరచగల శక్తి ఉండాలి. టైమ్‌ ఈజ్‌ మనీ అయినప్పుడు- దరిద్రుల దగ్గర తప్ప ఎవరిదగ్గర ఉంటుంది విశాలమైన సమయం?

విజయరహస్యం వేగమేనట. తట్టుకోగలిగినవాడే నెగ్గుతాడట. సింగరేణి బొగ్గుగనుల్లో అనేకచోట్ల గోడల మీద ఈ సూక్తి పలకరించింది. అక్కడనేమిటి, అన్ని చోట్లా ఇప్పుడు అదే వేదం.  ప్రపంచీకరణ పరమసూత్రం.  మృగాలకూ మెకాలకూ నడుమ ప్రకృతి విధించిన జీవనసూత్రాల కంటె కర్కశమైన మానవసిద్ధాంతం.  ఈ కొత్త ఉన్మాదం రాకముందు, త్యాగం కంటె లాభం, సంక్షేమం కంటె స్వార్థం పరమ విలువైపోకముందు-  మనిషి సాంప్రదాయికమైన వివేకం ఎప్పుడూ విచక్షణలేని వేగాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చింది.  వేగశాలి ధీశాలి కానక్కరలేదని కుందేలు తాబేలు కథ చెబుతుంది. స్థితప్రజ్ఞతో నడచివెడుతున్న గౌతమబుద్ధుడిని పరిగెత్తికూడా అంగుళీమాళుడు అందుకోలేకపోతాడు. ప్రపంచం చుట్టిరావాలన్న పందెంలో వాహనధారి కుమారస్వామి వేగాన్ని నమ్ముకుంటే,  గణేశుడు సారాంశం గ్రహించి తండ్రికి ప్రదక్షిణం చేసి నెగ్గుతాడు. పరిగెత్తి తాగే పాలకన్నా నిలబడి తాగే నీళ్లు గొప్పవని చెబుతారు. నిజం నిలకడమీదనే తెలుస్తుందంటారు కానీ వేగం మీద కాదు.

రోజులన్నీ పరస్పర ప్రతిధ్వనులయ్యే నిస్సారత గురించి ఒక భావకవి రాస్తాడు. వియోగభారం విధించే నిర్వ్యాపకత్వం గురించి ఆ ప్రేమకవి చెప్పి ఉండవచ్చును కానీ, రేపటి  గమ్యాలను నేడే అందుకోవాలని జరిగే ప్రయాణం తరచు గానుగెద్దు యాంత్రికతలోకి పరిణమిస్తుంది.   మూస దినచర్యలు నిర్ణయమైపోయి, పని కూడా మరెవరి బాణీకో పాడే పాటగా మారిపోతుంది.  పాట కూడా పనిలాగా బరువవుతుంది.  తాపత్రయం నుంచి విరామం కోసం  ఒక్క క్షణం పారిపోదలచినప్పుడు ఒక చిన్న ఆశ్రయం కూడా కరువవుతుంది. మనుషుల విశ్రాంతులను, వ్యక్తిగత సమయాలను- చివరకు పగటికలలను కూడా  అప్పుడే ఎవరో మార్కెట్‌ చేసేశారు. 

మనిషేమిటి, సమస్త సృష్టిదీ చలనశీలమే. కానీ, ఆ గతిలో ఒక లయ ఉంటుంది.  గమనంలో వేగమూ స్తబ్ధతా సాపేక్షమయినట్టే,  శాంతీ విశ్రాంతీ కూడా సాపేక్షాలే. వ్యక్తిదో సమాజానికదో ప్రయాణం మందగించినప్పుడు, స్తబ్ధత జడతగా మారబోయినప్పుడు- ఒక కుదుపు, ఒక గెంతు, ఒక లంఘన తప్పనిసరి అవుతాయి. మనిషి మనుగడను మరింత అర్థవంతంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దగలిగితే ఆ పరుగుకు సార్థకత ఉంటుంది.  ఇంత మౌనానికీ, కొంత ధ్యానానికీ తెరిపి ఇవ్వని కాలం  లిరిక్‌ మిగలని రొదసంగీతం వంటిది.  ఆకాశపు దారులెంట హడావుడిగా  వెళ్లిపోయే జగన్నాథచక్రాలు  ఏ తాత్కాలిక లక్ష్యాలనో నెరవేర్చవచ్చును కానీ, నేలమీద చిన్న పాదముద్రను కూడా మిగల్చవు.  జీవితాన్ని వస్తుసంచయంతో, వ్యాపకసమ్మర్దంతో నింపుకోవాలనుకున్నప్పుడు- అత్యంత ఆదిమమైన, నిసర్గమైన, సహజమైన అందాలను, ఆనందాలను, ఆకాశాలను మనిషి కోల్పోక తప్పదు. అనుభవాల కోసం జరిగే వెంపర్లాటలో, వెంపర్లాటే ఏకైక అనుభవంగా మారుతుంది.
                       
( 17 డిసెంబర్‌ 2004 తేదీ నాటి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ  'సంభాషణ'ను మళ్లీ ఐదేళ్ల తరువాత ఈ ధనుర్మాసంలో గుర్తు చేసుకుంటున్నాను)

2 comments:

  1. బావుంది శ్రీనివాస్ గారు. తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం.

    ReplyDelete
  2. కాలానికి మారకపు విలువ పడిపోలేదు సార్, అది ఇంకాఇంకా పెరిగిపోయింది. ఇదివరకు వెచ్చించిన కాలానికి మనసు నిండే సంగతులేవో వచ్చేవి, ఇప్పుడు జేబు నిండే సంగతులేమున్నాయని చూస్తున్నాం. కాలాన్ని ధ్వంసం చేసుకోకపోతే ఎలా? రేసులో ముందు నిలవొద్దా??

    ReplyDelete