Monday, January 11, 2010

ఆల్ మైటీ - అమాయకులూ

సీనియర్ పాత్రికేయులు బ్రహ్మానందరెడ్డి, వెంకటకృష్ణలను పోలీసులు వారి చానెల్‌ ఆఫీసునుంచి అరెస్టు చేసి తీసుకువెడుతున్నప్పుడు చూసి చాలా బాధ కలిగింది. వెంకటకృష్ణతో నాకు పెద్ద పరిచయం లేదు కానీ, బ్రహ్మానందరెడ్డి ఉదయం దినపత్రికలో నాకు సీనియర్‌గా పనిచేశారు. 1990 దశకం ఆరంభంలోనే కొత్త ఆలోచనలతో, ఆవేశాలతో పత్రికను తీర్చిదిద్దాలని ప్రయత్నించేవారు. జరిగిన పరిణామాల వెనుక పెద్ద కుట్ర ఉన్నదని భావిస్తున్నప్పుడు- అందులో ఈ జర్నలిస్టుల పాత్ర ఉంటే గింటే అది సాంకేతికమూ నామమాత్రమూ అయిఉంటుంది. వారే అసలు దోషులన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయం. అది వారికి జరుగుతున్న అన్యాయం మాత్రమేకాదు, మొత్తం సత్యానికి జరుగుతున్న అన్యాయం.

సమాజ సంచలనాలలో పత్రికల పాత్ర ప్రమేయం రానురాను అధికమవుతున్న కాలంలో- పెట్టుబడులకు రాజకీయాలకు అధికార వ్యూహాలకు మీడియా నిర్వహణకు దూరం తగ్గిపోతున్న సందర్భాలలో- పాత ప్రమాణాల ప్రకారం విషయాలను అర్థం చేసుకోవడం కష్టమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛలకు, ప్రజాస్వామ్యానికి విలువ పెరగడం ఆరంభమైన కాలం నుంచి, మన దేశంలో "పునరుజ్జీవన', జాతీయోద్యమ కాలాల దాకా పత్రికారంగానికి ఎంతో ప్రతిష్ఠ, గౌరవం ఏర్పడ్డాయి. మీడియా స్వభావమూ వ్యవహారమూ పూర్తిగా మారిపోయిన నేటి కాలంలో, ఆ గౌరవం అంతరించిపోతున్నది. పురాతనప్రతిష్ఠను కొంచెంకొంచెం కొరుక్కుతింటూ మీడియా నెట్టుకు వస్తోంది. ఇంగువ గట్టిన గుడ్డలాగా పూర్వసువాసనలు వెదజల్లుతోంది. ప్రింట్‌ మీడియాలో ఇంకా పత్రికావిలువల గురించిన తపన, పునరుద్ధరణ ప్రయత్నమూ కనిపిస్తున్నాయికానీ, కొత్తగా వచ్చిన విజువల్‌ మీడియా మాత్రం వేగంలో పడికొట్టుకుపోతోంది, దురాశతో నిర్విచక్షణగా వ్యవహరిస్తోంది.

జరుగుతున్న సంఘటనలను సంచలనీకరిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించడం ఒక ఎత్తుఅయితే, సంచలనాత్మక సంఘటనలు జరిగేటట్టు పథకాలు పన్నడం మరో ఎత్తు. ఇర్వింగ్‌ వాలెస్‌ "ఆల్‌మైటీ' నవలలో పత్రికాధిపతి సర్క్యులేషన్‌ కోసం, పేరు కోసం తానే సంఘటనలను రచిస్తూ, వాటిని పత్రికలో ముందుగా రిపోర్టు చేస్తుంటాడు. రాష్ట్రంలో జరిగినవి, జరుగుతున్నవి అటువంటి లాభాపేక్షతో జరుగుతున్నవి కూడా కావు. అవేవీ ఆయా మీడియా సంస్థలకు వ్యాపారపరంగా మేలుచేసేవి కూడా కావు. ఆ సంస్థలు తమ సొంత ప్రతిప్ఠను, మీడియా గౌరవాన్ని కూడా పణంగా పెట్టి సూత్రధారుల రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి ప్రయత్నించాయి.

మీడియా ఒక రాజకీయపక్షాన్ని సమర్థించడం కానీ, ఒక వివాదంలో ఒక పక్షంతో ఉండడం కానీ అసాధారణమేమీ కాదు. కాస్త హెచ్చుతగ్గులతో జాతీయోద్యమకాలం నుంచి పత్రికలలో ఈ ధోరణి కనిపిస్తుంది.. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని మీడియా సహజంగానే ప్రయత్నిస్తుంది. మన వంటి దేశాలలో అక్షరానికి ఆరాధన, విశ్వసనీయత ఎక్కువ కాబట్టి, ప్రింట్‌మీడియా ప్రభావమూ ఎక్కువే. కాకపోతే, అక్షరాస్యత అతి తక్కువ ఉన్న కాలంలో ఆ ప్రభావానికి పరిమితులు ఉండేవి. టెలివిజన్‌ వచ్చిన తరువాత అక్షరస్యత సమస్యేకాకుండా పోయింది. టీవీ మీడియం దాని స్వభావం రీత్యా- ఆలోచన మీద కాక ఆవేశాల మీద, ఉద్వేగాల మీద పనిచేస్తూ ఉంటుంది. "" ఐబాల్‌ గేమ్‌'' మెదడును బైపాస్‌ చేసి నాడీమండలం మీద నేరుగా పనిచేస్తుంది కాబోలు. కాబట్టి, పత్రికా మాధ్యమం ఉన్నంత ఉదారంగా, స్థిమితంగా, పరువుగా టీవీ మాధ్యమం ఉండలేదు, ఉండబోదు కూడా. అయితే, దానికి కూడా ఒక పరిధి ఉండాలి. పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినా దాని చూపు తన గూడునుంచి దూరంగా వెళ్లకూడదు- అని క్షేమేంద్రుడు చేసిన ఔచిత్య విచికిత్స దృశ్యమాధ్యమాలకూ ఉండాలి. ఒక వార్త మరిన్ని అటువంటి వార్తలకు, ఒక స్పందన మరిన్ని అటువంటి స్పందనలకు దారితీసే దుర్మార్గాన్ని నివారించాలి. 1984లో సిక్కులపై హత్యాకాండ కానీ, 2001లో తమిళులపై దాడులు కానీ, వైఎస్‌ మరణానంతర ఆత్మహత్యలుకానీ, కుట్రసిద్ధాంతంతో రిలయన్స్‌సంస్థలపై విధ్వంసం కానీ - వీటన్నిటిలో విజువల్‌ మీడియా పాత్ర ప్రేక్షక పాత్రకాదు, రిపోర్టింగ్‌ పాత్రా కాదు. సంఘటనల గొలుసుకట్టులో ఒక లంకెగా మారిన పాత్ర. ఇది ఎమ్‌బెడెడ్‌ జర్నలిజం కంటె అన్యాయమైనది. గతంలో దండయాత్రలలో యుద్ధకథకులు కూడా ఉండేవారు. ముస్లిమ్‌ దండయాత్రలలో యుద్ధచరిత్రకారులు, చిత్రకారులు కూడా ఉండేవారు. ఇరాక్‌ యుద్ధంలో వివిధ పత్రికల విలేఖరులు సాయుద pataalaala వెనుక నడిచారు. కాకపోతే, వీరంతా జరిగినవాటికి అతిశయం జోడించో, వక్రీకరించో, వాస్తవాలతోనో యుద్దకథనాలు చేసి ఉంటారు. స్వయంగా యుద్ధసంఘటనలను కల్పించి మాత్రం ఉండరు.

మీడియా శాంతికాలంలో నిష్పక్షపాతంగా ఉండడానికి ప్రయత్నిస్తుందట. సామాజిక ఘర్షణలున్న సమయంలో జాతీయవాదంతో వ్యవహరిస్తుందట. యుద్ధకాలంలో ఉన్మాదిగా ఉంటుందట. ఎవరో పెద్దాయన చెప్పారు. శాంతి కాలంలో సైతం నిష్పక్షపాతంగా ఉంటుందా అన్నది సమస్య. శాంతికాలంలో పత్రికలు, చానెళ్లు- నోమ్‌చామ్‌స్కీ అన్నట్టు- ప్రజలకు వార్తలు అందించడం కాక, కార్పొరేట్లకు వినియోగదార్లను అందించే పనిలో ఉంటాయి కాబోలు. వ్యవస్థల విషయంలో నెరవేర్చవలసిన ఇన్ని కర్తవ్యాల మధ్య- మీడియా ఎంతో కొంత మంచి చేయగలగడం విశేషమే. ఆ మంచిని పరిరక్షించాలని, ఎంతో కొంత పెంచాలని ప్రయత్నించే యాజమాన్యాలు, పాత్రికేయులు ఇప్పుడు అవసరం. రానురాను జనం దృష్టిలో పలచనైపోతున్న మీడియా- తనకున్న ప్రత్యేక ప్రతిపత్తిని, గౌరవాన్ని కోల్పోతే- ప్రజాస్వామ్యానికి చాలా అపకారం జరుగుతుంది.

3 comments:

 1. శ్రీనివాస్ గారూ,
  విజువల్ మీడియా గురించి మీరు చెప్పింది నిజం. వార్తా చానల్స్ ని, ఓ సస్పెన్స్ సినిమా చూసినట్లు గా ఫాలో అయ్యే వాళ్ళని మన పల్లెటూర్లలో నేను చూశాను. వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం నవల "డ్రామా ఆఫ్ రియాలిటీ" ని చూపిస్తుంది అంటారు. ఆ నవలేమో గానీ,ఈ వార్తా చానల్స్ మాత్రం రియాలిటీ ని సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపిస్తున్నాయి.

  పెట్టుబడిదారీ వ్యవస్థ లో, "సమాజం పరిణామం చెందే దిశ" ని మనిషి స్వార్థానికి ప్రతి రూపమైన డబ్బు నిర్దేశిస్తుంది. మనం ఈ వ్యవస్థ లో ఉన్నంత వరకూ, మీడియా వాళ్ళొ, న్యాయమూర్తు లో, డాక్టర్లో మిగతా వృత్తుల వారికంటే ఉన్నతం గా ఉండాలనుకోవటం ఒక రకం గా జర్నలిస్టుల పట్లా, డాక్టర్ల పట్లా, న్యాయమూర్తుల పట్లా వివక్ష చూపించినట్లౌతుంది. సమాజం లో మిగిలిన అందరూ స్వార్థం తో వ్యవహరిస్తున్నప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు ఉన్నతం గా ఉండాలి? ఈ వ్యవస్థ లో ఫలానా వాడు నిజాయితీగా లేడు అనటం గొంగట్లో తింటూ జుట్టు వెతకటం వంటిదే. సమాజం ఈ విధం గా గుల్లబారి పోవటాన్ని నేను బ్లాగు చేసిన నవల లో కొంతవరకూ చూపించటానికి ప్రయత్నిచాను ఇక్కడ. http://bondalapati.wordpress.com .మీకు తీరికుంటే చదవండి.

  ReplyDelete
 2. bondalapati చాలా బాగా చెప్పారు మీడియా వాల్లో,న్యాయమూర్తులో ,డాక్టర్లో మిగతా వృత్తుల వారికంటే వున్నతంగా వుండాలనుకోవడం ..నిజంగా చాలా చక్కగా చెప్పారు ...సమాజం లో అందరూ స్వార్దమ్ తో వ్యవహరిస్తూ వీళ్లను మాత్రం మడి కట్టుకు కూర్చోమంటారు?విలువలు అన్నీ రంగాల్లోని వాళ్ళూ పాటించాలిగా?మిగతా సొసైటి అంతా విచ్చల విడిగా ప్రవర్తిస్తూ వీరిని మాత్రం సచ్చీలులిగా చూడాలని కోరుకుంటుంది..

  ReplyDelete
 3. న్యాయాధిపతులనూ, జర్నలిస్టులనూ సచ్ఛీలులిగా చూడాలని కోరుకోవటంలో తప్పేమిటి? వారే గీత దాటితే సమాజానికి మార్గదర్శనం చేసే వారెవరు?

  ReplyDelete