Tuesday, January 19, 2010

హఠాత్‌ జ్ఞానోదయాలు

అలజడి తగ్గలేదు, ఆందోళన తగ్గలేదు, పల్లెలకు చెవియొగ్గి వినగలిగితే  కలకలమూ తగ్గలేదు.  కాకపోతే  కోలాహలం కొంచెం తగ్గింది. ఉద్వేగాలు యథాతథంగానే ఉన్నాయి కానీ ఉద్రేకాలు తగ్గాయి.  కాబట్టి మంచీచెడూ మాట్లాడుకోవచ్చు.  ఇతరులలోని తప్పులను ధైర్యంగా చెప్పవచ్చు, మనలోని తప్పులను వినయంగా ఒప్పుకోవచ్చు. రేపటి అడుగులను ఆచితూచవచ్చు. టేబుల్‌కు రెండువైపులా కూర్చుని భిన్నపక్షాలు చర్చించవచ్చు. స్వపక్షమే అయితే, పక్కపక్కనే కూర్చుని వ్యూహరచన చేయవచ్చు.  కేంద్రప్రభుత్వం శాంతి ఎందుకు కోరుతున్నదో కానీ, ఉద్యమాలకు మాత్రం  ఒక  వెసులుబాటు అవసరం, కొంత మౌనం దొరికితే కొంత ధ్యానమూ సాధ్యపడుతుంది.

ఇక్కడే  తెలంగాణవాదులనుంచి మొదటి ప్రశ్న తారసపడుతుంది.  విషయాన్ని చర్చించడానికి కావలసిన  మౌనమూ విరామమూ శాంతీ నిజంగా ఇప్పటిదాకా లేవా? డిసెంబర్‌ 9 వ తేదీ కంటె ముందు  లేదూ నవంబర్‌29 కంటె ముందు సంభాషణకూ సంవాదానికీ చర్చకూ ఆస్కారమే లేదా?  మబ్బేలేని ఉరుమే లేని మెరుపే లేని ఆకాశం నుంచి ఉన్నట్టుండి పిడుగు పడిందా, మిన్నువిరిగి మీద పడిందా?  రామాయణమంతా పూసగుచ్చినట్టు చెప్పిన పౌరాణికుడు, శ్రోతలనుంచి ఏదైనా వివేకమంతమైన ప్రశ్నను, లోతైన సందేహాన్ని ఆశిస్తాడు. కానీ, రాముడికి సీత ఏమవుతుందన్న ప్రశ్న ఎదురయితే? అది అమాయకత్వమా, అజ్ఞానమా, నిర్లక్ష్యమా? పదిపన్నేండేళ్ల నుంచి గొంతుచించుకుని చేసిన నినాదాలు, లక్షలాది పుటలలో నింపి అచ్చొత్తిన సమాచారమూ,  కోటిగొంతుకలతో నినదించిన పాటలు, గర్జనలు, ఉపన్యాసాలు, ఊరేగింపులు, మహాసభలు, కూర్చిన గణాంకాలు, రెండు ఎన్నికలలో చేసిన ప్రచారాలు- వాటిని ఎవరూ ఆలకించనే లేదా? అన్నీ చరిత్ర నుంచి ఎరేజ్‌ అయిపోయాయా?  ఇప్పుడే మేలుకొన్నట్టు, ఏమిటీ హాహాకారాలు?

రాష్ట్రం విడిపోకూడదని, సమైక్యంగానే ఉండాలని ఉద్యమించిన సీమాంధ్ర ప్రజలను కానీ, విద్యార్థులను కానీ ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. విభజన వల్ల తమకు జరుగుతుందని భావిస్తున్న నష్టాల గురించి, హాని గురించి వారికి వారి ప్రజాప్రతినిధులు ఎవరూ చెప్పనే లేదన్న మాట. తెలంగాణలో గత దశాబ్దంగా జరుగుతున్న ఆందోళన గురించి, దాని పర్యవసానాల గురించి తమ ఓటర్లకు వారు వివరించనేలేదన్న మాట. చెప్పకపోవడమే కాదు, తమ ఓటర్ల నుంచి ఇంతటి ప్రతిస్పందన వస్తుందన్న అంచనా కూడా వారికి లేదన్న మాట.  ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియకుండానే వారు తమ తమ నేతలు తీసుకుంటున్న తెలంగాణ అనుకూల వైఖరులకు వత్తాసు పలికారన్న మాట. ఎన్నికల ప్రణాళికల్లో, పార్టీ మేనిఫెస్టోల్లో రాసుకోవడమే కాదు, ప్రణబ్‌ కమిటీకి లేఖలు ఇచ్చినా కూడా ఆ ప్రాంతాల ప్రజాప్రతినిధులు అనుమతించారన్న మాట. అంటే ఇదంతా జరిగేది కాదని, అంతిమంగా తెలంగాణ ప్రజలకు మొండిచెయ్యే దొరుకుతుందని వారికి ధీమా ఉండవచ్చు. తెలంగాణ అనుకూల వైఖరి తీసుకోవడం వల్ల కొన్ని ఓట్లు రాలితే మాత్రం వారికి అభ్యంతరం లేదన్న మాట. ఇటువంటి మోసపూరిత వైఖరిలో సీమాంధ్ర సాధారణ ప్రజలు కూడా భాగస్వాములని విశ్వసించలేము. వారికి నిజంగానే దీర్ఘకాలికమైన పర్యవసానాల గురించిన అవగాహన లేకపోయి ఉండవచ్చు. లేదా, ఇప్పుడు విభజన వల్ల ప్రమాదాలను వారికి డిసెంబర్‌ 9 తరువాత మాత్రమే వారి నేతలు ముందుకు తెచ్చి ఉండవచ్చు. లేదంటే, సీమాంధ్రప్రజాప్రతినిధులు కూడా తెలంగాణ వాదం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఈ దశాబ్దకాలం నెట్టుకువచ్చి ఉండవచ్చు. లేకపోతే, ఒక శాసనసభ్యుడే ఒక చానెల్‌ చర్చలో పాల్గొంటూ- " నాకు తెలియక అడుగుఆను, ఇంతకూ మీకు తెలంగాణ ఎందుకు?'' అని అడుగుతాడా?

సీమాంధ్ర నేతల వైఖరి కారణంగా, నిజాయితీతో సమైక్యతను కోరుకునేవారు సైతం నిరాయుధులవుతున్నారు. నిజానికి, సమైక్యవాదులు వేర్పాటువాదులను  ఉద్దేశించి ఐక్యతాబోధలు చేయాలి. అన్యాయం జరిగిందని భావిస్తున్నవారికి ఆశ్వాసనలివ్వాలి. అలాకాక, తెలంగాణ వాదానికి భూమికలుగా ఉన్న మౌలికవాదాలనే సవాల్‌చేస్తూ, ఉద్యమాన్ని కొట్టిపారేసే తీరులో సాగడం- ప్రత్యేకవాదులలో మరింత పట్టుదలను పెంచింది. విభ జన జరిగితే సీమాంధ్రప్రజలకు వాస్తవంగా ఎదురయ్యే ఇబ్బందులు చర్చలోకి రాకుండా పోతున్నాయి.  ఉత్తరాంధ్ర సమస్యలు కానీ, పోలవరం భవిష్యత్తు కానీ, రాయలసీమకు నీళ్లు కానీ- సోదిలోకి లేకుండా పోయి కేవలం హైదరాబాద్‌ మీద హక్కుకే వాదోపవాదాలు పరిమితమవుతున్నాయి. రాయలసీమలో, కొంత వరకు ఉత్తరాంధ్రలో వినిపిస్తున్న ప్రత్యేకరాగాలు అక్కడి రైతాంగానికి, సామాన్యులకు కావలసిన హామీల గురించి మాట్లాడుతున్నాయి.కోస్తాంధ్రలో జరగవలసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రత్యేక ఆంధ్రవాదులకు నిర్బంధమే ఎదురవుతున్నది.

సీమాంధ్రలో తలెత్తిన హఠాత్‌ ఉద్యమం, చిదంబరం వెనక్కి తగ్గి చర్చల ప్రక్రియ ప్రారంభించడం, తిరిగి తెలంగాణ రాష్ట్రసాధన ప్రశ్నార్థకం కావడం- తెలంగాణ ఉద్యమంలో తీవ్రమైన నిరాశను కలిగించాయి, పట్టుదలనూ పెంచాయి. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయనాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి నడిపిస్తున్నది మాత్రమే అని సీమాంధ్రలోని నేతలు బాహాటంగానే చెబుతున్నప్పటికీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గ్రామగ్రామాన తెలంగాణ నినాదం విస్తరించడమే కాక, గతంలో ఉద్యమంలో భాగంగా లేని అనేక వర్గాలు శ్రేణులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందరి ముఖంలోనూ ఒకే సంశయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.  వస్తుందా రాదా?  అసలింతటి వ్యతిరేకత ఎందుకు? న్యాయమైన ఆకాంక్షను కూడా ఇట్లా అణచివేస్తారా? - ఇవీ వారు అమాయకంగా ఆవేశంగా వేసే ప్రశ్నలు.

ఇక్కడే తెలంగాణవాదులు ఒక ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుంది. ఐదు దశాబ్దాల ఆకాంక్ష అంటున్నారు, తెలంగాణ వనరులు,అవకాశాలు దోపిడికి గురి అవుతున్నాయంటున్నారు,  మరి అంతటి విలువైన డిమాండ్‌ ఎటువంటి ప్రతిఘటనా లేకుండానే వస్తుందని ఎందుకు భ్రమించారు?  రాష్ట్ర విభజన అంటే పటం మీద గీతలు గీయడం కాదు కదా?  ఇంతదాకా ఉమ్మడిగా ఉన్న అనేక ఆర్థిక, సామాజిక, ప్రాకృతిక సంపదల విభాగం జరగవలసి ఉంటుంది. కలసి ఉంటే తమకు ప్రయోజనం ఉంటుందని భావించే వారు అంత సులువుగా విభజనకు అంగీకరిస్తారా?  ఏ స్పష్టమైన ప్రయోజనమూ లేకుండానే కేవలం సమైక్యభావనతోనో, అభద్రతతోనో వ్యతిరేకించే సామాన్యుల సంగతేమిటి? వారందరినీ సముదాయించే వారెవరు? పదేళ్ల ఉద్యమప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రసమితి కానీ, ఉద్యమంలో భాగంగా ఉన్న వివిధ ప్రజాసంస్థలు కానీ- సీమాంధ్రప్రజలకు నచ్చచెప్పడానికి, తెలంగాణలో ఉన్న ప్రాంతేతరులకు ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలెన్ని?  మొదటి జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికలలోనే పాల్గొనకుండా వెనక్కు తగ్గిన టిఆర్‌ఎస్‌- హైదరాబాద్‌ ప్రజలతో  తమ ఉద్యమం విషయంలో చేసిన ప్రచారం ఎంత? హైదరాబాద్‌ ముస్లిములలో ఉన్న ఊగిసలాటను పట్టించుకుని, వారిని విశ్వాసంలోకి తీసుకోవడానికి జరిగిన కృషి ఎంత? - ఈ శేషప్రశ్నలన్నీ తెలంగాణ డిమాండ్‌కు ఎదురైన ప్రతిఘటన కారణంగా ముందుకువచ్చినవి. విస్త­ృత భావప్రచారం జరగవలసిన ఆవశ్యకతను, వ్యతిరేకులను, తటస్థులను తమ వైపు తిప్పుకోవలసిన బాధ్యతను గుర్తించి ఉంటే, మొదట తెలంగాణకు అనుకూల నిర్ణయం వచ్చి ఆ తరువాత పంపకాలపై చర్చలు జరిగే అవకాశం ఉండేది. కేంద్ర సానుకూల వైఖరి తీసుకుంటే ఇక ఎటువంటి అవరోధమూ ఉండదనే భ్రమ కారణంగా ఇప్పుడు చర్చల ప్రక్రియ ముందు జరిగి తెలంగాణ నిర్ణయం తరువాత జరిగే పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యేకరాష్ట్ర అవతరణ ఒక సుదీర్ఘ ప్రక్రియఅని, అందుకు నిరంతరం ఒత్తిడి తేవడంతో పాటు తమ, పర వర్గాల కు చెందిన ప్రజలతో, ఉద్యమాలతో సంప్రదింపులు జరపడం అవసరమని తెలంగాణ వాదులు గుర్తించాలి.  ఆరేడువారాలుగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమం విరామకాలంలో చల్లారుతుందేమో, కేంద్రం వెనక్కు తగ్గతుందేమోనన్న భయాందోళనలు పక్కనపెట్టి, నేర్చుకున్న గుణపాఠాలతో ముందుకు సాగాలి.  తమది న్యాయమైన డిమాండ్‌ అయినంత మాత్రాన అదొక్కటే విజయానికి బాటలు వేయదు. ఇది న్యాయాన్యాయాల సమస్య కాదు, సాధ్యాసాధ్యాల సమస్య. విభజన కూడదనుకునే సమైక్యవాదులు- ప్రత్యేకవాదులను  ఉద్దేశించి తమ భావప్రచారాన్ని సాగించాలి. అరిగిపోయిన విషయాలపై చర్చ జరగకుండా, తమ ప్రయోజనాల గురించిన ప్రతిపాదనలు చేయాలి.  విభజన అనివార్యం అని గుర్తిస్తే, అనంతర విషయాల గురించి  తమ గొంతును విప్పాలి.

3 comments:

 1. ఆచరించవలసిన దాని గురించి కనీసం ఆలోచిస్తే బాగుంటుంది.

  ReplyDelete
 2. టీ ఆర్ ఎస్ బలపడటానికి, ఆంధ్ర వాళ్ళని దోపిడీ దారులు గా చిత్రించటం కూడా ఒక ముఖ్య కారణం. ఇప్పుడు దోపిడీదారులన్న వాళ్ళతోనే సామరస్యం గా కూర్చొని చర్చించటం ఎంతవరకూ కుదురుతుందో చూడాలి.
  ఆస్థుల గురించిన సంప్రదింపులకు ముందు మిగిలిన వాళ్ళను తెలంగాణా ఆవశ్యకతా ప్రాతిపదికల గురించి ఒప్పించాలి. విభజనకు వెనుకబాటు తనం కారణమైతే, టీ ఆర్ ఎస్ వాళ్ళు, సీమాంధ్రులకు, "మీరు దోపిడీ చేశారు, అందుకే మేము వెనుక పడ్డాం. మేము వెనుకబడ్డాం కాబట్టీ మాకు వేరే రాష్ట్రం కావాలని" చెప్తారా?
  ఆత్మ గౌరవం కారణమైతే, "మీ ఆధిపత్య ధోరణి మా ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిందని. కాబట్టీ మాకు వేరే రష్ట్రం కావాలి", అని చెప్తారా?

  ReplyDelete
 3. "హఠాత్‌ జ్ఞానోదయాలు'' పోస్టింగ్‌ మీద వచ్చిన ఈ రెండు అభిప్రాయాలు ఏదో సాంకేతిక సమస్య వల్ల కామెంట్స్‌ శీర్షికలోకి పబ్లిష్‌కావడం లేదు. అందువల్ల వీటిని నేను విడిగా ఇస్తున్నాను.- కె.శ్రీనివాస్‌ (20 జనవరి 2010)

  "సురభి'' గారు ఇలా రాశారు:
  Srinivas gaaru,
  Excellent articles from you.
  I always read your articles in Andhrajyothy. My 'Thateyya' always reads as many newspapers as possibile both in english and telugu, as a kid I used to ask him when the news is same, what will you read new in all these papers. He replied me saying that if you really want to know or learn what is going around you read the articles and editorials. Now when I'am reading them, I clearly see what he meant to say.

  "విరజాజి'' గారు ఇలా రాశారు
  చాలా బాగా విశ్లేషించారు - కనీసం కొన్ని విషయాలని వేర్పాటు వాదులకి చెప్పి సరిగ్గ ఒప్పించగలిగితే కాస్తైనా ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వేర్పాటు వాదులు వినడానికి సిధ్ధంగా లేరు అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ అస్సలు సమస్యని ఒక కోణం నుంచీ చూడకుండా మరో కోణం నుంచీ చూడాలని ఇరు వర్గాలనీ సమాధాన పరచగలిగితే అస్సలు విభజన జరగకుండా కూడా ఆపవచ్చేమో. కేవలం కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు ఆడే ఆట లో సామాన్యులు, విద్యార్ధులు బలి పశువులవుతున్నారు. తెలంగాణా ప్రజల అమాయకత్వాన్ని వారి నాయకులే బాగా వాడుకుంటున్నారు. కనీసం ఇప్పుడైనా కొంత శాంతి వచనాలు, మధ్యే మార్గంగా ఏమి చెయ్యాలి అన్న అలోచనలు ముఖ్యం.

  ReplyDelete