Sunday, January 24, 2010

నమ్మదగ్గ నేత లేకపోవడమే శాపం


1944. నల్లగొండ జిల్లా భువనగిరిలో నైజామాంధ్ర మహాసభ పదో మహాసభలు. పధ్నాలుగేళ్లుగా విద్యా ప్రచారక, సాంస్కృతిక, సామాజిక ఉద్యమంగా ఎదుగుతూ వచ్చి రాజకీయ రూపం తీసుకుంటున్న తరుణంలో మహాసభ పగ్గాలు కమ్యూనిస్టుల చేతికి వెళ్లబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలున్న సభలు. కమ్యూనిస్టేతరులందరూ దాదాపుగా బహిష్కరించిన సభలు. అయినా ఒకటి రెండు అపవాదాలు. కాంగ్రెస్‌వాది అయినప్పటికీ పోరాటవాది అయిన కాళోజీ ఆ సభలకు రావడంలో ఆశ్చర్యం లేదు.
    కానీ, మరో వ్యక్తి, వృద్ధుడు,అక్కడ ఉంటారని ఎవరూ ఊహించని ఆశించని పెద్దమనిషి- సభ మందిరంలో దూరంగా ఒక మూల కూర్చుని కార్యక్రమాన్ని ఆసక్తి గా, ఒకింత ఆవేదనగా కూడా- పరిశీలిస్తున్నారు. ఆయన రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి. ఏడో నిజామ్‌కు అత్యంత ఆంతరంగికుడిగా ఉన్నవారు. దీర్ఘకాలం హైదరాబాద్‌ నగరానికి కొత్వాల్‌గా పనిచేసినవారు. ఆంధ్రమహాసభ చీలిపోకూడదని, ఎట్లాగైనా తెలంగాణలో రాజకీయ ఉద్యమం ఏకతాటిమీద నడవాలని మనస్ఫూర్తిగా ఆశించిన వారిలో వెంకటరామారెడ్డి ఒకరు.
    చీలిక తరువాత కమ్యూనిస్టు ఆంధ్రమహాసభను నిజాం ప్రభుత్వం కర్కశంగా అణచివేస్తుందని ముందుగా రావినారాయణరెడ్డిని ఆయన హెచ్చరించారు కూడా. తెలంగాణ భవిష్యత్తు గురించి ఆయన అంతగా కలవరపడడానికి కారణం ఏమిటి? నైజాం తెలుగు ప్రాంతాలలో విద్యను, చైతన్యాన్ని, ప్రజారంగాన్ని, పౌరసమాజాన్ని నిర్మించడానికి పునాది స్థాయిలో అసాధారణమైన దోహదం చేసిన వ్యక్తి రాజబహదూర్‌. ఆయన నిజాం రాజ్యయంత్రాంగంలో ముఖ్యవ్యక్తి అయి ఉండవచ్చు. బ్రిటిష్‌ యువరాజు హైదరాబాద్‌ పర్యటనను సాఫీగా నిర్వహించినందుకు ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ బిరుదును పొందిన రాజభక్తుడే కావచ్చు. కానీ, 20 శతాబ్ది ఆరంభ దశాబ్దాల లో హైదరాబాద్‌ తెలుగు సమాజం కొత్త నడకలు నేర్వడానికి కీలకమైన దోహదం చేసిన మనిషి ఆయన. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద భూస్వాములను, సంస్థానాధీశుల ను ఒప్పించి గోలకొండ పత్రికకు నిధులు సమకూర్చడంలో కావచ్చు, ఆ పత్రికకు నిజాం ప్రభుత్వం నుంచి అనుమతి సాధించడంలో కావచ్చు, ఆంధ్రమహాసభ అవతరణకు కావలసిన భూమికను ఏర్పరచడంలో కావచ్చు, మహాసభల నిర్వహణల్లో పోలీసు అనుమతులను సులభం చేయడంలో కావచ్చు- ఆయన ప్రమేయమే కనిపిస్తుంది. హైదరాబాద్‌ రాజ్యంలో ఆదిఆంధ్రుల ఉద్యమాన్ని నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ అయి నా, సికింద్రాబాద్‌లో దళితులను సంఘటితం చేసిన అరిగె రామస్వామి, ఎం.ఎల్‌ ఆదెయ్య వంటి వారికి అయినా ప్రభుత్వంలో పెద్ద దిక్కు వెంకటరామారెడ్డే. ఆయన సహాయం లేకపోతే, రెడ్డి విద్యార్థులకు విద్యావసతి కల్పించాలనుకున్న కొండా వెంకటరంగారెడ్డి ఆశయం రెడ్డి హాస్టల్‌ రూపంలో వాస్తవరూపం ధరించేదే కాదు. ఆ రెడ్డి హాస్ట లే లేకపోతే, తెలంగాణ సాయుధ పోరాటానికి గాని, జాతీయ ఉద్యమానికి కానీ నూత న నాయకత్వం లభించేదే కాదు. రెడ్డి హాస్టల్‌ మాత్రమే కాదు, హైదరాబాద్‌లోని రెసిడెన్సీ ప్రాంతంలో కనిపించే అనేకానేక విద్యార్థి వసతి గృహాలు, కులసంఘాల కార్యాలయాలు- వెంకటరామారెడ్డి ఆశీస్సులతో, సహాయంతో అవతరించినవే. మొక్కగా ఉన్నప్పటినుంచి తెలంగాణలో ఆధునిక వికాసానికి శ్రేయోభిలాషిగా ఉన్నారు కాబట్టే, ఆ వికాసం విచ్ఛిన్నమవుతుందేమోనని రాజబహదూర్‌ ఆందోళన చెందారు.
    కొత్వాల్‌ వెంకటరామారెడ్డే కాదు, ఆంధ్రపితామహుడు మాడపాటి హనుమంతరావు కానీ, బూర్గుల రామకృష్ణరావు కానీ, సురవరం ప్రతాపరెడ్డి కానీ, భాగ్యరెడ్డివర్మ కానీ నాటి తెలంగాణ ఆధునిక యుగంలోకి ప్రవేశించడానికి ఏమేమి అవసరమో ఆ కర్తవ్యాలన్నిటినీ నెరవేర్చడానికి ప్రయత్నించారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజాస్వామ్యవ్యవస్థలోకి ప్రవేశి స్తే అందుకు అవసరమైన మౌలిక వసతులేమిటో, మానవ వనరులేమి టో, నాయకత్వాలేమిటో వారికి అవగాహన ఉంది. ఒక దూరదృష్టి, దార్శనికత, సమగ్ర అవగాహన ఉన్న తరం అది.
తెలంగాణ ప్రాంతానికి ఒక విశ్వసనీయమైన నాయకత్వం అవతరించడానికి కాలం కడుపుతో ఉన్న కాలం అది. అటువంటి మనుషులు ఒక్కరంటే ఒక్కరు నాయకత్వ శ్రేణిలో లేకపోవడమే నేటి తెలంగాణ దౌర్భాగ్యం. వారి ప్రయత్నాలు ఫలించాయి. ఏదో ఒక స్థాయిలో ఒక నాయకత్వ శ్రేణి అవతరించింది. ఎందరి కృషి వల్లనో ఆవిర్భవించిన రాజకీయ, సామాజిక కార్యకర్తల తరం ఎందుకు గమ్యాన్ని చేరుకోలేకపోయింది? ఇందులో స్వయంకృతాపరాధం కొంత ఉంది. చరిత్ర చెలగాటం కొంత ఉంది. బాహ్యశక్తుల ప్రమేయం కొంత ఉంది.
    ప్రపంచప్రఖ్యాతమైన సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ నుంచి కొత్త నాయకత్వ తరా న్ని తీసుకువచ్చింది. ఆ నాయకత్వం తీవ్రమైన నిర్బంధాన్ని హింసలను ఎదుర్కొనవలసి వచ్చింది. 1952 ఎన్నికలలో ప్రజలు ఉద్యమ ప్రాంతాలలో ఆ కొత్త తరానికి బ్రహ్మాండమైన విజయాలను సమకూర్చారు. అయితే, ఉద్యమేతర ప్రాంతాలలో జాతీయవాద నాయకులు, ప్రధానంగా భూస్వామ్య వర్గం వారు విజయం సాధించా రు. కమ్యూనిస్టు విజయాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌ స్టేట్‌లో తెలుగేతర ప్రాంతాలు కూడా ఉండడం వల్ల తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వం మరాఠీ, కన్నడ ప్రాంతాల విజయాల సాయంతో అవతరించింది. మూడు ప్రాంతాల ఉమ్మడి అభ్యర్థిగా బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు తప్ప, తెలంగాణలో ఆయన వర్గానికి ఉన్న పలుకుబడి స్వల్పం. కొండా వెంకటరంగారెడ్డి వర్గానిదే ఆధిక్యం. తెలంగాణలో జాతీయవాదులుగా ఉన్న సాంప్రదాయ భూస్వామ్య వర్గంతో సమ స్య ఏమిటంటే, తక్కిన ప్రాంతాలలో మాదిరిగా వారికి రాజకీయ శిక్షణ లభించలేదు. బ్రిటిష్‌ ఆంధ్రప్రాంతాలలో 1920 నుంచి ఏదో ఒక పద్ధతిలో ఎన్నికల రాజకీయాలు ఉనికిలో ఉండడం, పలుకుబడి వర్గాలు రాజకీయవాదులుగా పరివర్తన చెందడం క్రమంగా జరిగిపోయాయి. తెలంగాణలో ఈ శక్తులు ప్రధాన స్రవంతి రాజకీయాలలో అనుభవం సాధించకుండా నాటి జాతీయోద్యమనాయకురాలైన కాంగ్రెసే అడ్డుపడింది. 1938లో సత్యాగ్రహ కార్యక్రమా న్ని త్వరలోనే ముగించి, హైదరాబాద్‌ స్టేట్‌లో కాంగ్రెస్‌ పేరుతో ఉద్యమాలు అవసరం లేదన్నది. సంస్థానాధీశులు జాతీయోద్యమానికి సహజ మిత్రులన్న వైఖరితో గాంధీజీ- ఇక్కడి జాతీయవాదులకు పనిలేకుండా చేశారు. ఈ అనుభవ రాహిత్యం- 1956 తరువాత విశాలాంధ్రలో వారిని ద్వితీయ శ్రేణి నాయకులుగా మార్చివేసింది. కమ్యూనిస్టు పార్టీలో ఎదిగిన తెలంగాణ తరం వారి నాయకత్వానికి లోబడి ఉండగా, తెలంగాణ భూస్వామ్య ప్రాబల్య వర్గాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తమ నేతలను వెదుక్కున్నారు. కొండా వెంకటరంగారెడ్డి వంటి వారు తెలంగాణ ప్రత్యేకతకే కట్టుబడి ఉన్నప్పటికీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాన్ని వామపక్ష ఉద్యమం నైతికంగా బలహీన పరచింది. భూస్వామ్యవర్గం,  వామపక్షీయులు- అన్న ద్వంద్వం రాష్ట్రావతరణ కాలం నుంచి తెలంగాణకు ఒక ప్రతికూల అంశంగా తయారైంది. కమ్యూనిస్టులు న్యాయంగా వేసిన దెబ్బ, బ్రిటిష్‌ ఆంధ్రలోని ప్రాబల్యవర్గం వేసిన ఆధిపత్య దెబ్బ- కలసి తెలంగాణ సాంప్రదాయిక నాయకత్వాన్ని మరుగుజ్జుగా మార్చాయి. తరువాత కాలంలో కూడా ఈ క్రమం కొనసాగుతూనే వస్తోంది. తెలంగాణ నుంచి వేరువేరు ఉద్యమాల ద్వారా ఏర్పడుతూ వస్తున్న మిలిటెంట్‌ శక్తులు ప్రభుత్వ దమనకాండకు బలి అవుతూ ఉండగా, ప్రాబల్య వర్గాల నుంచి కొత్త తరాన్ని మిలిటెంట్లే అదుపుచేస్తూ వచ్చారు.
రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి ఆశించినట్టు, 1944లో జాతీయవాదులు, కమ్యూనిస్టులు ఏదో ఒక ప్రాతిపదికపై సమీకరణ సాధించగలిగి ఉంటే (అటువంటి సమీకరణ అపచారమని అనుకోనక్కరలేదు, ఇప్పుడు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జరుగుతున్న సంకీర్ణ రాజకీయాలతో పోలిస్తే అదేమంత పెద్ద నేరం కాదు), నైజామ్‌ రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రభుత్వానికి, ఆ తరువాత ప్రజాస్వామ్య ప్రక్రియకు పోరా డి ఉంటే- పరిస్థితులు వేరుగా ఉండేవి. తెలంగాణ శ్రేయస్సే పరమావధిగా ఆలోచించి, వ్యవహరించే నాయకత్వం రూపొంది ఉండేది.  దేనికీ బాధ్యత వహించని, ఉత్తరకుమార ప్రతిజ్ఞలు చేయని, వెంట నడిచే ప్రజలకు ఆశ్వాసన ఇవ్వని, దేనికీ లొంగబోమన్న ధీమా ఇవ్వలేని, వెన్నెముక ఎక్కడ ఉన్నదో తెలియని నేటి తెలంగాణ రాజకీయ నాయకత్వంలోని బలహీనతకు మూలం నైజాం కాలం నాటి రాజకీయాలలోనే ఉన్నది. ఈ రాజకీయ శ్రేణికి సమాంతరంగా, భిన్నంగా ఎదుగుతూ వస్తున్న తాజా యువ, విద్యార్థి నాయకత్వాన్ని-మరోసారి ప్రభుత్వాల దమననీతికి, వ్యతిరేకుల కుటిలనీతికి బలికానివ్వకుండా కాపాడుకోవడం అందుకే నేటి అవసరం. ఆత్మహత్యల పేరుతోనో, అణచివేత పేరుతోనో స్వచ్ఛమైన ఈ కొత్త తరం అణగారిపోతే, ప్రత్యేక రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి, తెలంగాణ శాశ్వతంగా అనాథ అవుతుంది.

3 comments:

 1. మంచి విషయం మంచిగా చెప్పినవన్నా..

  ReplyDelete
 2. Good writeup sreenivas garu.తెలియని చరిత్ర మీ వ్యాసం ద్వారా తెలుసుకోగలిగా.మీరన్నది నిజం
  "తెలంగాణ ప్రాంతానికి 'ఒక విశ్వసనీయమైన నాయకత్వం' అవతరించడానికి కాలం కడుపుతో ఉన్న కాలం అది. అటువంటి మనుషులు ఒక్కరంటే ఒక్కరు నాయకత్వ శ్రేణిలో లేకపోవడమే నేటి తెలంగాణ దౌర్భాగ్యం. "

  ReplyDelete
 3. రాజా రావు బహద్దూర్ వెంకట్రామిరెడ్డి గారి మరొక పెద్ద సామాజిక కార్యం - స్త్రీ విద్య. నేటికీ హైదరాబాదు నడి బొడ్డున, నారాయణగూడాలో - మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల, రాజా రావు బహద్దూర్ వెంకట్రామిరెడ్డి మహిళా కళాశాల దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడి ఉన్నాయి. నేను అక్కడే చదువుకున్నాను. ఆ గొప్ప వ్యక్తుల గురించి అక్కడే తెలుసుకున్నాను. 1920ల్లోనే ఆడవారు చదువుకోవాలని ఆశించి, దానికి స్థలాన్ని సమకూర్చి, ఎందరితోనో కలిసి, ఒక పెద్ద మహా వృక్షాలని వారు నాటారు. ఆ చెట్ల నీడన మాలాటివారం విద్యా ధనాన్ని సంపాదించుకున్నాము. ఆలాటి దార్శనికత ఉన్న నాయకులు చాలా అరుదుగా కనబడుతారు. మీరన్నట్లు అలాటి నాయకులు లేకపోవడం వల్ల చాలా మూల్యమే చెల్లించుకోవలసి వస్తోంది నేడు.

  ReplyDelete