Thursday, January 28, 2010

కుంకుమ బరిణె

కొక్కరి ఎంకన్న , చందాగోపాలరావు, సిద్ధబోయిన మునెందర్‌, సిద్ధబోయిన లక్ష్మణరావు, ఇటువంటి వాళ్లే,  ఈ పేర్ల వాళ్లే,  ఆ రోజు వీరులై పోతారు.  రాజ్యఖడ్గాన్ని, రాజముద్రికనీ ధరించిన ప్రభుత్వ యంత్రాంగం కాసేపు అనుచరగణమైపోగా, చిలుకలగుట్ట పాదాల దాకా వెడతారు. అందరినీ వెనుకనే నిలిపివేసి తామొక్కరే కొండమీది
కాలిబాటల్లోకి వెళ్లి మాయమవుతారు. తమకు మాత్రమే తెలిసిన రహస్యనిక్షేపం నుంచి కుంకుమ బరిణె రూపంలోని సమ్మక్కను తోడ్కొనివస్తారు.  కన్నెబోయినపల్లి నుంచి సారలమ్మను తరలించుకు వస్తారు. మేడారం లోయలోని గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు.

ఎంతటి అనాది వియోగమో అడవి మీద మనిషికి, మళ్లీ అమ్మకడుపులోకి చొచ్చుకుపోయినట్టు, సందోహం, సంరంభం, అప్పటికప్పుడు మొలకలెత్తి విరగపండిన జొన్నచేను వలె జనమే జనం. లక్షలాది శరీరాలు ఒక్కరూపు దాల్చి చరిత్రతో సంభాషిస్తున్నట్టు, దండకారణ్యానికి దండం పెడుతున్నట్టు.


మాఘమాసపు పున్నమి వెళ్ళిన పాడ్యమి నుంచి,  తల్లీబిడ్డలయిన ఆ తల్లులిద్దరూ గద్దెనెక్కిన దగ్గర నుంచి,  అక్కడి ఆకాశం పసుపుతో పీతాంబరమవుతుంది. కుంకుమతో రాగరంజితమవుతుంది. బెల్లం నైవేద్యంతో గాలి గుప్పుమంటుంది. తెగిన వేటలతో పరిమళం వెగటవుతుంది. నరవాసన దుర్గంధం అవుతుంది. ఊగీతూగీ

వివశులయ్యే మనుషులు, కోరికలు దట్టించుకుని నారికేళమై పగిలిపోయే దీనులు, నుదుటిమీద అమ్మలను ధరించి ధైర్యం పొందే సామాన్యులు-- అత్యంత ఆదిమమైన ఉద్వేగపు భాషతో ప్రకృతి చేసే సంభాషణ ఆ కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. 

వీరుడా ధీరుడా కాకతీయ శూరుడా ఎవరు తలుస్తున్నారయ్యా నీ ప్రతాపరౌద్రాన్ని? ఓరుగల్లు తోరణం ఒంటరిగా నిలబడింది. ఆనవాలే లేక నీ రాజభవనం నేలమట్టమయింది. మట్టిపోసే రాళ్లు పోసీ కట్టుకున్న కోట ఢిల్లీ దాడికి తల్లడిల్లిపోయింది. కన్నీరుమున్నీరై ఊరుసాగనంపింది. అవమానం నిన్ను తొలిచివేసింది. సామంతం చెయ్యలేకనే కదా నువ్వు పోరాడింది, కప్పం కట్టలేకనే కదా నువ్వు కత్తిపట్టింది, తిమింగలాన్ని ఎదిరించినవాడిని, చిన్నచేపను ఎందుకు మింగాలనుకున్నావు? సిపాయి వెన్నులో కత్తిదింపినప్పుడు, చిలుకల గుట్టలోకి వెనుదిరిగి సమ్మక్క ఏమి శపించింది? ఏ సర్వనాశనాన్ని నీకు ఆకాంక్షించింది?

జంపన్న రక్తంతో సంపంగివాగు పరమళించింది. ఎదిరించి అమరుడైన పగిడిద్దరాజు ప్రతిజాతరకూ జువ్విచెట్టు మీద పామై పడగవిప్పిసమ్మక్క వైభవాన్ని తన్మయంతో పరికిస్తాడు. ప్రాణమిచ్చిన సారలమ్మకుప్రతి రెండేళ్లకూ సారెపెట్టి గద్దెనెక్కిస్తారు. పులిమీద సవారి చేసిన సమ్మక్క పేరు చెబితే అడవి అడవంతా పులకరిస్తుంది.

విజేతలు చరిత్రనే కాదు, పురాణాలను కూడా రాస్తారు. దేవుళ్లనూ సృష్టిస్తారు. కోయలను, చెంచులను, ఎరుకలను శిక్షించి, నిర్మూలించి, కబళించి, లొంగదీసుకున్న వీరులందరూ అవతారాలయ్యారు. దేవుళ్లయ్యారు. మల్లన్నలనూ కొండన్నలనూ అప్పన్నలనూ నర్సన్నలనూ  పరాయివాళ్లు ఎత్తుకుపోయి, పెద్దపెద్ద పేర్లు పెట్టుకున్నారు. కొత్తదేవుడితో పాటు పూజారులనూ ప్రతిష్ఠించుకున్నారు. చెంచులక్ష్ములూ కన్నప్పలూ భక్తశబరులూ ఆదర్శంగా నిలిపారు.

అడవిమల్లంపల్లిలో అడవి అంతరించవచ్చు, జంగిల్‌పల్లి ఉత్త నామవాచకమే కావచ్చు, చిలుకలగుట్ట మీద ఒక్క చిలుకా లేకపోవచ్చు,  వేలంవెర్రి తిరణాలలో కోయతనమే బలికావచ్చ. దురాక్రమణకుఇదొక సాంస్కృతిక రహదారి కావచ్చు. జంపన్నవాగువంతెన మీద వన్‌వేట్రాఫిక్కే సాగవచ్చు.  సమ్మక్క సారక్కల బలిదానాలు మారుపేర్లతో కొనసాగుతూనే ఉండవచ్చు.
అయినప్పటికీ...

పరాజితులురాసుకున్న చరిత్ర సమ్మక్క. ఓడిపోయి కూడా గెలిచిన జనగాథ సమ్మక్క. వేదం దూరని కారడవి సమ్మక్క... అడవి మీద మైదానం ఆధిపత్యాన్ని, సంస్కృతి మీద నాగరికత పెత్తనాన్ని ప్రశ్నించిన వీరవనిత సమ్మక్క... వెయ్యి క్రూరదైవాలకు మొక్కిన పాపాన్నంతా కడిగివేసే కుంకమ బరిణె సమ్మక్క...

కప్పం కట్టను పొమ్మని ధిక్కరించే ఎవరికైనా కత్తిలాంటి జ్ఞాపకం సమ్మక్క.

1 comment: