Saturday, January 30, 2010

అడవిదారులన్నీ మూసుకుపోయే ఓఅద్భుత క్షణం కోసం.....

     మాఘమాసపు పున్నమికి మూడురోజుల ముందు గోదావరితీరారణ్యపు బాహువుల లోకి జనసముద్రం నడిచివెడుతుంది. తాము తిరుగాడిన నేల కోసం, తమ అస్తిత్వానికి అర్థమయిన అడవి కోసం, తాము సహజీవనం చేసే నీటి కోసం ప్రాణమిచ్చిన సమ్మక్క సారక్కల కోసం,  యుగాలు గడచినా తీరని మొక్కులకు,అనంతకాలాలు  సిగమూగినా తీరని ఆవేశాలను జనం జంసన్నవాగుకుసమర్పిస్తారు.మానవ సమాజాలకున్న శక్తే అటువంటిది. గతించే తరాలను లెక్క చేయకుండా అది పురాస్మృతుల సొరంగాల గుండా ప్రయాణించి మరణాలను అపహసిస్తుంది. మార్మికమైన, మాంత్రికమయిన, అధిభౌతికమయిన మానవ సహజాత ఆచరణ- పసితనపు అమాయకతను, నిష్కల్మషపు అమాయకతను నిరంతరం పరిమళిస్తుంటుంది. అది కృతజ్ఞతమయినది. అది అల్పసంతోషి. ఒక చిన్నత్యాగానికి అనంతకాలాల సంస్మరణలను కానుకగా ఇస్తుంది. వేలగాథలను గానం చేస్తుంది.
     వరంగల్‌ జిల్లా ములుగు అడవులలోని మేడారం దగ్గర జరిగే ఈ కోయల జాతర నేడు ప్రమాదంలో పడిన ఒక చిరస్మరణ. జాతరకు వెళ్లే జనం పెరిగి ఉండవచ్చు. ఎడ్ల బండ్లకు బదులు మోటారు వాహనాలు మైళ్లపొడవునా బారులు తీరుతూ ఉండవచ్చు. సారా ఏరులై పారవచ్చు. జంతుబలులు రెట్టింపు జరగవచ్చు. అయినా సమ్మక్క సారక్క జాతర మాత్రం ఓడిపోతున్నది. అంతరించిపోతున్నది.  జంపన్నవాగు మీద వంతెన నిర్మాణంతో సమ్మక్క సారక్కల హత్య మరోసారి జరిగిపోయింది. ప్రతాపరుద్రుడు
చేయలేనిపని ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసేసింది. ములుగు, ఏటూరు నాగారం దాకా అడవిని మింగిన మైదాన ప్రాంత నాగరికులు, 'ప్రవాసాంధ్రులు' తమ ఆకలికి కొత్త ఎరలను వెదుక్కొనవచ్చును. అందుకు కాకపోతే, జలదేవత సిగపాయలను ఒడిసిపట్టి ఒడ్డుకు ఈదే కోయకు, జలపాతాన్ని పట్టి కొండలకెగబాకే గిరిజనుడికి వంతెనలేల?
         స్థానిక పాలకులకు పరిహారం ఇచ్చి రాజ్యాలు పెంచుకోవాలని నమ్మింది నాటి సామ్రాజ్యవాదం, ప్రజలను భాగస్వాములను చేసి వనరులను కబళించమని చెబుతోంది నేటి ప్రపంచబ్యాంకు సిద్ధాంతం. రోడ్డువేయండి, టోల్‌గేట్‌ కాంట్రాక్టు గిరిజనులకు ఇవ్వండి. మైనింగ్‌ చేయండి. గిరిజనులకు రాయల్టీ ఇవ్వండి. భూములను ఆక్రమించండి. గిరిజనులకు కూలిపనులు కల్పించండి. వారి అడవిలో వారితోనే ఉమ్మడి అటవీ యాజమాన్యం నిర్వహించండి. అడవులు వాణిజ్య అవసరాలకే అన్న విషాన్ని వారికి కూడాఎక్కించండి. ఇదీ నేటి భాగస్వామ్య అభివృద్ధి సిద్ధాంతం.అందుకని, సమ్మక్కసారక్క జాతరకు వెళ్లే దారిలోని టోల్‌గేట్‌ల నిర్వహణను ప్రభుత్వం గిరిజనులకే ఇచ్చింది. బహుశా కొత్తగా కట్టిన వంతెన నిర్వహణ కూడా గిరిజనులకే ఇచ్చి ఉండాలి.
         ఫ్లయ్‌ ఓవర్లు, డబల్‌ టాపింగ్‌లు, రోడ్ల మీద రోడ్లు- కనీసం అసెంబ్లీకి కూడా సమాచారం లేకుండా జరిగిపోతు్న కాంట్రాక్టు పనుల విప్లవంతో-రోడ్డును వ్యతిరేకిస్తే అభివృద్ధి నిరోధకమే. తమకు ఇబ్బంది అవుతుందన్న కారణం చేతనే  కావచ్చు.  నక్సలైట్లు జంపన్నవాగు వంతెన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తే ఎన్ని మాటలు పడవలసి వచ్చింది?
         వంతెన అంటే ఏమిటోతెలుసుకోవడానికి ఒక్కసారి ఖమ్మం జిల్లాలోకి తొంగిచూడాలి. ముప్పై సంవత్సరాల కిందట భద్రాచలం దగ్గర గోదావరి మీద చింతూరు దగ్గర శబరి మీద వంతెనలు కట్టకముందు  జిల్లాలోని గిరిజనుల పరిస్థితిని ఇప్పటి పరిస్థితిని పోల్చి చూస్తే చాలు. ఈ వంతెనలు ఎవరికి నల్లేరు మీద బండి బాటు వేశాయి, ఎవరిని నిస్సహాయంగా, నిరాయుధంగా దుర్మార్గ నాగరిక ప్రపంచం ముందునిలబెట్టాయి అర్థమవుతుంది. కూనవరం నుంచి శబరి మీదుగా నిర్మిస్తున్న రోడ్డు వంతెన ఎవరి ప్రయోజనం కోసమో తెలిసిపోతుంది. సారవంతమయిన గోదావరి తీర భూములన్నిటినీ కోస్తా జిల్లాల నుంచి వచ్చిన ప్రవాస రైతులు ఆక్రమించి (ఇప్పుడు బహుళజాతి కంపెనీలు) మిర్చి, పొగాకులతో బంగారం పండించుకుంటుంది. తమకు వేలయేండ్ల నుంచి పరిచితమైన జీవన విధానాన్ని వదులుకుని కొత్త నాగరికతను బలవంతంగా నేర్చుకుని ఎకరాకు రెడు బస్తాల వరి పండించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. సూర్యుడు కూడా జొరరాని కీకారణ్యాలన్నీ ఇప్పుడు ఆరు బయలు పొలాలుగా మారడానికి, భూములన్నీ అన్యాక్రాంతం కావడానికి- ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండిన అ్ని ప్రభుత్వాలు క్రియాశీలంగా ప్రవాసులకు, మైదాన ప్రాంతాల సెటిలర్లకు సహకారం అందించాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వాలు భాగస్వాములు. పక్షపాతంతో కూడిన భాగస్వాములు. ఒక వైపున గిరిజనుల నుంచి వారి వనరులను దొంగిలిస్తూ వారి మీదనే ఆరోపణలు చేయడం నాగరికులకు మాత్రమే సాధ్యం. కోయలు అనాగరికులనీ, గొత్తికోయలు క్రూరులనీ, కొండరెడ్లు మూఢులనీ వ్యాఖ్యానించడానిఇక వారికిన ఓరెలా వస్తుందో అర్థం కాదు. కోయల దేవుడైన ఒక నల్లటి ధనుర్ధారిని హింద్వీకరించి, కోదండ రామునిగా మార్చి భద్రాచలం రామాలయంగా కట్టారని సీతారాం ఏచూరి ఒక వ్యాసంలో అంటారు. భద్రాచలమే కాదు,అరణ్యప్రాంతాలలోనో, వాటి సమీపంలోనో ఉన్న ఆలయాలన్నీ స్థానికుల దేవతలేనని, వాటికి 'మత పరివర్తన'  జరిపారని చరిత్రలో ఎన్నో ఆధారాలున్నాయి. పోకల దమ్మక్క కోయ స్త్రీయే కాదని, రామాలయ నిర్మాణం కోయల ఇష్టపూర్తిగా జరిగింది కాదని వాదించేవారున్నారు. సంస్కృతిని,దేవుళ్లనీ లొంగదీసుకోనిదే మనుషులను పూర్తిగా జయించినట్టుకాదని బయటినుంచి వచ్చిన గజనీ,గోరీలకేకాదు, స్థానిక మతస్థులకు కూడా బాగానే తెలుసును. మాదేవుళ్లను మాకు ఇమ్మని శ్రీశైలం చెంచులు, భద్రాచలం కోయలు నిలదీస్తే అశోక్‌ సింఘాల్‌ ఏమి చేస్తాడో?
         సమ్మక్క సారక్కలనుసినిమాకు ఎక్కించినప్పుడు కోయపూజారులు అభ్యంతరం చెప్పారు. తమ దేవతలను అంగడిలో పెట్టవద్దని బతిమాలారు. వక్రీకరించవద్దని అభ్యర్థించారు.ఆ దేవతలను హిందూ దేవతలుగానో, విప్లవకారులుగానో చూపించవద్దని పదే పదే చెప్పారు. గిరిజనుల సాంస్కృతిక మనోభావాలను అర్థం చేసుకునేంతగా మన వ్యవస్థ ఎదగలేదు కనుక వారి విన్నపాలకు ఎవరూ కరగలేదు.  ఆ దేవతలను, వారి జాతరలను 'కలుపుకోవడం ద్వారా' కోయల సొంత అస్తిత్వాన్ని రద్దుచేయడానికి ప్రయత్నం జరుగుతోంది. జంపన్నవాగు మీద వంతెన ఆ ప్రయత్ననికి ఒక రాజకీయార్థిక రూపం.
         వరంగల్‌,ఖమ్మం జిల్లాల ఏజెన్సీలో గడచిన ముప్పై సంవత్సరాలుగా జీవిస్తున్న ఏ ప్రవాసినైనా సరే అడగండి. విధ్వంసం అంటే ఏమిటో, అభివృద్ధికి మరోపేరు అది అని చెబుతారు. ఎప్పటికయినా ఈ గిరిజనులు ఈ రోడ్లను ధ్వంసం చేసి, ఈ వంతెనలను కూల్చివేసి, ప్రవాసులను గాలిమరల ఆవలకు తరిమివేసి, పురాతనారణ్యాలను మళ్లీ ఆవిష్కరిస్తారు, చూడండి అని ఒక కాలజ్ఞాని వలె చెబుతారు. ఈ పాపిష్ఠి అభివృద్ధిని రద్దుచేయగలిగితే, దొంగలు పడి దోచుకోవడానికి వీలుగా పరచుకున్నరహదారులను తిరిగి వెనక్కు చుట్టేయగలిగితే- తనను తాను మళ్లీ బతికించుకోవడానికి అడవీ సిద్ధంగా ఉన్నది. నిద్రాహారాలు మాని దేవతలను కావిరంగు బట్టలలో తీసుకురావడానికి గిరిజనులూ సిద్ధంగానే ఉన్నారు. అప్పటిదాకా-- నదీస్నానాలకు,దేవతాస్మరణలకుఎంతో అనువైన ప్రతి రెండవ మాఘమాసపు వేళ- సమ్మక్కసారక్కల జ్ఞాపకం కొడిగట్టిపోకుండా కాపాడుకోవాలి.

No comments:

Post a Comment