Saturday, January 30, 2010

ఉద్యమాలు, బాధ్యతలు, హక్కులు

        పాతికేళ్ల కిందట అనుకుంటాను ఒక ప్రముఖ రచయిత ఒక పత్రికలో లేఖ రాశారు. నినాదాలు రాసి గోడలు పాడు చేస్తున్న సంఘాలను ఆయన ఆ లేఖలో తీవ్రంగా తప్పుపట్టారు. ఎంతో ఖర్చుపెట్టి ఇంటికి వెల్ల వేసుకున్న ఒక మధ్యతరగతి గృహస్థు, తెల్లవారే సరికి తన ఇంటిగోడలు ఏవో రాతలతో నిండిపోతే ఎంత బాధపడతాడో ఉద్యమకారులు గ్రహించాలని ఆ రచయిత ఆ లేఖలో బాధపడ్డారు. దేశమంతా అశాంతితో ఆందోళనలతో రగిలిపోతుంటే తన ఇల్లు మాత్రం తెల్లగా ఉండాలని ఆశించడమేమిటని ఆ లేఖకు మరికొందరు రచయితలు జవాబు కూడా చెప్పారు. పత్రికలో ఇట్లా వివాదం సాగుతుండగానే ఒకరాత్రి సంఘాల వాళ్లు వెళ్లి ఆ లేఖ రాసిన రచయిత ఇంటిగోడల మీద అంగుళం కూడా వదలకుండా నినాదాలు నింపి వచ్చారు. పాపం ఆ రచయిత ఆలోచనలు వాస్తవికతకు ఎడంగా ఉండి ఉండవచ్చును కానీ, హక్కులకు, చట్టానికి దూరంగా లేవు. తన సొంత ఇంటి గోడలను ఒక్క రాతా లేకుండా కాపాడుకోవాలనుకోవడం ఆ గృహస్థు హక్కు. ఆ హక్కుకు ప్రభుత్వాల నుంచి కాకుం డా ప్రజా సంఘాల నుంచి భంగం కలిగినప్పుడు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక ఆయన పౌరసమాజానికే విజ్ఞప్తి చేసుకున్నారు.
సంఘజీవి అయిన మనిషి- సంఘంలో జరుగుతున్న దానితో నిమిత్తం లేకుండా ఒక ద్వీపంలాగా, సంఘపు మంచిచెడ్డలు అంటకుండా ఉండగలడా అన్నది కూడా ఆలోచించవలసిన ప్రశ్నే. రోడ్లు మురికిగా ఉన్నప్పుడు మన బట్టలు మురికి కాకుండా కాపాడుకోగలమా? రణగొణ ధ్వనుల మధ్య ఏకాంతాన్ని కల్పించుకోగలమా? రోదన లు ఆక్రందనలు వినిపిస్తున్నప్పుడు మధురసంగీతం వినే హక్కును డిమాండ్‌ చేయగలమా? మరి వ్యక్తి స్వేచ్ఛకూ సమష్టి ఆచరణకూ వైరుధ్యం ఏర్పడినప్పుడు దానికి పరిష్కారం ఏమిటి?
        గోడలను నినాదాలతో నింపడమన్నది చిన్న సమస్య.ఇప్పుడు రోడ్ల పక్కన గోడలే ఉండడం లేదు, ఉన్న గోడలకు కాపలాలు ఉంటున్నాయి, పైగా నినాదాలు రాసే సం ఘాలే తగ్గిపోయాయి, ఎన్నికల నినాదాలకు శేషన్‌ ఎప్పుడో బ్రేక్‌ వేశారు కాబట్టి- ఆ సమస్యా అంతరించిపోయింది. వ్యక్తి స్వేచ్ఛ ఒక్కటే సమస్య కాదు, ఒకవర్గం చేస్తున్న ఆందోళనలు తమకు నష్టం కలిగిస్తున్నాయని సమాజంలోని తక్కిన వర్గాలు అంటున్నా యి. నిజమే, ఉద్యమకారులు, సంఘాలు, ఆందోళనలు తక్కిన సమాజాన్ని, ప్రత్యేకించి కొన్ని సమూహాలను ఇబ్బంది పెట్టడం ఏదో రూపంలో జరుగుతూనే ఉన్నది.అంతే కాదు, ప్రజల సమష్టి ఆస్తులకు నష్టం
కలిగించడం కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నా యి. కానీ, అధికారంలోఉన్న పార్టీలతో కలుపుకుని అన్ని రాజకీయపార్టీలూ తమ ఆందోళనల్లో వివాదాస్పద పద్ధతులు అనుసరించకుండా ఉంటున్నాయా అంటే అదీ లేదు.
         ప్రజాఉద్యమాలు అనుసరించే ఆందోళనా కార్యక్రమాలను, రాజ్యాంగ స్వేచ్ఛలకు అనుగుణమైనవికాదన్న రీతిలో వాదనలు వినిపించడం మలివిడత ప్రపంచీకరణ ప్రక్రి య ప్రారంభమైన రెండు దశాబ్దాలనుంచి అధికమైంది. న్యాయవ్యవస్థ కూడా ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోవలసిన పరిస్థితి నెలకొన్నది.1997లో కేరళ హైకోర్టు బెంచ్‌ బంద్‌లకు వ్యతిరేకంగా కీలకమైన తీర్పు ఇచ్చింది. 1998లో సుప్రీంకోర్టు బంద్‌లను నిషేధించాలనే దాకా వ్యాఖ్యలు చేసింది. 2003లో కూడా ఒకసారి సుప్రీంకోర్టు బంద్‌లకు వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చివరకు, 2009 ఫిబ్రవరిలో బంద్‌లు ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయమైన భావప్రకటనా స్వేచ్ఛను వ్యక్తీకరించడంలో భాగమని ప్రకటించింది. కేరళ హైకోర్టులో పదమూడేళ్ల కిందటి తీర్పు ఇచ్చిన బెంచ్‌లో సభ్యులుగా ఉన్న జస్టిస్‌ కె.జి. బాలకృష్ణన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తుది నిర్ధారణ చేయడం విశేషం. చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైన రీతిలో సామూహిక బేరసారాలకు దిగడంగా కేరళ హైకోర్టు బంద్‌లను భావించింది. ఆ తీర్పు ప్రధానంగా ప్రభుత్వోద్యోగుల ఆందోళనా కార్యక్రమాలను ఉద్దేశించినవే అయినప్పటికీ, మొత్తంగా సమ్మెలను, బంద్‌లను, యూనియన్లను వ్యతిరేకించే ధోరణి ప్రబలుతున్న కాలంలో సమాజంలోని ప్రధాన భావజాలాన్ని ప్రతిఫలించేటట్టుగానే న్యాయస్థానాలు ఆలోచించాయని భావించవచ్చు. వివిధ ఉద్యోగసంఘాలు సమ్మెలకు దిగినప్పుడు- వాటికి వ్యతిరేకం గా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను న్యాయస్థానాలు అనుమతిస్తూ వస్తున్నాయి.  అనేక సందర్భాలలో సమ్మెలు విరమించవలసిందని ఆదేశాలు జారీచేశాయి. చివరకు మహాసభలు, ఊరేగింపులు, బహిరంగప్రదర్శనలు జరుపుకోవడానికి అనుమతులు కూడా తరచు న్యాయస్థానాల పరిశీలనకు వెడుతున్నాయి. న్యాయస్థానాలు సాధారణంగా న్యాయపక్షంలో, బాధితుల పక్షం లో ఆదేశాలు జారీచేస్తున్నప్పటికీ, ప్రాథమిక హక్కుల అంశాలు తరచు కోర్టుల ముందుకు రావడం ప్రజాస్వామ్యానికి ఏమంత మంచి పరిణామం కాదు.
            కేపిటలిస్టు ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ కీలకమని చెబుతారు. ఆ స్వేచ్ఛల్లోనూ రెండు ప్రధానమైనవి. ఒకటి ఆస్తి కలిగి ఉండే, సంపాదించుకునే స్వేచ్ఛ. రెండోది భావప్రకట నా స్వేచ్ఛ. ఈ రెండు స్వేచ్ఛలను పరస్పర విరుద్ధమైనవిగా చిత్రించే ప్రయత్నం జరుగుతున్నది. చైనా వంటి దేశాలను విమర్శించేవారు అక్కడ ఆర్థికరంగంలో ఉదారవాదం వచ్చింది కానీ, రాజకీయ వ్యవస్థలో ఉదారవాదం రాలేదని అంటుంటారు. అంటే అక్కడ సమ్మెల హక్కు,ఊరేగింపుల హక్కు, రాజకీయ అసమ్మతి చెప్పే హక్కు లేవని వారి ఫిర్యాదు. వారే మన దేశంలోకి వచ్చే సరికి- ఈప్రజాస్వామ్య హక్కులు ఆర్థి క, పారిశ్రామికాభివృద్ధులకు ఆటంకంగా ఉన్నాయని బాధపడుతుంటారు.  ప్రజల సమస్యలేమైనప్పటికీ, వారి జీవన్మరణ పోరాటాలేమైనప్పటికీ తమ వ్యాపారాలు, ఉత్పత్తులు మాత్రం సజావుగా సాగాలని కోరుకోవడంలోని స్వీయ ప్రయోజనవాదం సంగ తి పక్కనపెట్టి, అటువంటి స్థితిగతులు ఉండడానికి అనువైన వాతావరణం ఉన్నదా లేదా అన్నది వారు ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. బెంగాల్‌ నుంచి కార్ల ఫ్యాక్టరీని విరమించుకున్న టాటాలు- బెంగాల్‌లోని వామపక్ష వాతావరణాన్ని, సింగూరు ఉద్యమకారులపై మరింతగా విరుచుకుపడలేని ప్రభుత్వ పరిమితిని తమ విరమణకు కారణమని చెప్పారు. కానీ, పంట భూములను వదులుకోవడానికి ఇష్టపడని రైతాంగం న్యాయమైన ఆవేదనను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయాలను అన్వేషించాలనే విశాల దృష్టిని పారిశ్రామికవేత్తలు చూపించలేకపోయారు.
       తాము భాగస్వాములు కాని అభివృద్ధిని ప్రజలు పరాయిదిగానే భావిస్తారని, తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి చేసే ప్రయత్నాలలో ప్రాణాలతో సహా ఏమైనా కోల్పోవడానికి సిద్ధపడతారని గుర్తించకపోతే- అనేక అంతరాలు, అంచెలంచెల అభివృద్ధి ఉన్న భారతదేశంలో ప్రయోజనాల ఘర్షణ ఎందుకు ఆహ్లాదకరంగా జరగదో అర్థం కాదు.చిన్నరోదన వినిపించినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తే ప్రజలు ఆక్రోశించే అవసరం రాదు. కొవ్వొత్తుల ప్రదర్శనలతోనే సమస్యలు పరిష్కారం అయితే, రణన్నినాదాల అవసరమే రాదు. ప్రభుత్వాల చర్మం మొద్దుబారిపోయిందని గుర్తించకుండా, ప్రజల ప్రవర్తన సున్నితంగా, మృదువుగా ఉండాలని ఆశించడంలో అన్యాయం లేదా? దుష్ప్రచారం కారణంగా తమ గొలుసు వ్యవస్థల మీద దుండగులు దాడులు చేసినప్పుడు, అంబానీలు ప్రధానమంత్రికి నేరుగా ఫిర్యాదు చేసి న్యాయం కోరగలిగారు.మరి వివక్షను, అన్యాయాన్నీ ఎదుర్కొనే సామాన్యులకెంతమందికి అధికార పీఠాలను ఆశ్రయించగలిగే అవకాశం ఉంటుంది? అటువంటి అవకాశాలు లేని సామాన్యులు తమ గొంతు బిగ్గరగా వినిపించడానికి కేకలు పెట్టడం తప్ప గత్యంతరం ఏముంది? యూనియన్లు, శాంతిభద్రతల సమస్యలు ఉంటే వ్యాపారాలు జరగవనే మాట నికార్సైన వాస్తవమేమీ కాదు. చాలా కాలంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్న నేపాల్‌లో, యుద్ధమే కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్‌లో మనదేశపు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే- లాభసాటిగా ఉన్న చోట ఎంతటి ప్రమాదాన్ని వరించడానికైనా వారు సిద్ధంగా ఉంటారనే అర్థమవుతుంది.
      గాంధీమహాత్ముడు సాగించిన అహింసాయుత సహాయనిరాకరణపై కూడా విమర్శ లు ఉండేవని మరచిపోకూడదు. బ్రిటిష్‌ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితం అయ్యే విధంగా గాంధీ కార్యక్రమం ఉన్నదని, దాని పర్యవసానం రోజుకూలీలపై, నిరుపేదలపై పడుతుందని ఆయన విమర్శకులు ధ్వజమెత్తేవారు. "మంచికి సహకారం అందించడం ఎంత అవసరమో, చెడుకు సహాయ నిరాకరణ చేయడం కూడా అంతే అవసరం'' అన్నది వారికి గాంధీజీ సమాధానం. అయితే, ఆస్తుల విధ్వంసం లేకుండా, సామాన్యుల జీవనవ్యాపారాలు దెబ్బతినకుండా ఉద్యమాలు ఎట్లా నిర్వహించాలో ప్రజాస్వామికవాదులు ఇంకా నేర్చుకోవలసి ఉన్న మాట నిజమే. మొరటు పద్ధతులను అనుసరించకుండా, తటస్థులు కూడా వ్యతిరేకభావం పెంపొందించుకోకుండా ఉద్యమాలు నాగరికంగా, వీలయినంత శాంతియుతంగా జరిగేటట్టు పౌరసమాజం ఒత్తిడి తేవాలి. అన్యాయమైన ఉద్యమాలు, అనవసరమైన అల్లకల్లోలం సృష్టించి పబ్బం గడుపుకునే శక్తులను ప్రజలే నిరాకరిస్తారు, ఓడిస్తారు. అటువంటి అవాంఛనీయశక్తులను బూచిగా చూపించి మొత్తంగా ఉద్యమాలే వద్దనడం అన్యాయం. ప్రజాస్వామ్య వ్యక్తీకరణే తప్పన్నట్టుగా, ఆర్థికరంగం ఆరోగ్యం కోసం ప్రజానీకం హక్కులను త్యాగం చేయాలన్నట్టుగా భావించడం- దీర్ఘకాలికంగా నియంతృత్వానికి దారితీస్తుంది.

No comments:

Post a Comment