Sunday, February 7, 2010

డబల్ మీనింగ్ చిదంబరం

వారికోమాట వీరికో మాట చెప్పడం పాలక రాజకీయాల్లో భాగమే కానీ, ఒకే మాట ఇద్దరికీ వేరువేరు అర్థాల్లో చెప్పవలసి రావడం కేంద్ర ప్రభుత్వం నెలన్నరగా ప్రాక్టీసు చేస్తోంది. శ్లేషరచనలో ఇంతటి ఘనాపాటీలయిన అధికారగణాన్ని అభినందించి తీరాలి. వైరుధ్యాలని వెన్నెముకగా ధరించానని  కవి అజంతా  కవితాత్మకం గా చెప్పారు కానీ, మంత్రి చిదంబరం దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. మాటల వెను క దాక్కునే విద్య ఎప్పుడో ఒకప్పుడు వికటించే ప్రమాదం ఉన్నదన ఆయనకు తెలియక కాదు. పరిష్కారమంటే సమస్యను వాయిదా వేయడమేనని ఆధునిక రాజనీతి చెబుతున్నది కాబట్టి ఇప్పటికీ గండం గడిస్తే చాలును, అదే నూరేళ్ల ఆయుష్షు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అవతరణకు కారణాలేమిటి? అని తరచిచూస్తే సమాధానపడే సమాధానం దొరకదు. అరవయ్యేళ్ల తెలంగాణ ఆకాంక్ష,, నలభయ్యేళ్ల కిందటి మొదటి ఉద్యమం, పదిహేనేళ్లుగా  సాగుతూ నెలన్నరగా ఉధృతమైన మలి ఉద్యమం- వీటి ఫలితంగా కమిటీ వచ్చిందా? లేక డిసెంబర్9 నాడు చిదంబరం చేసిన తెలంగాణ ఏర్పా టు ప్రకటనకు తెలంగాణేతర ప్రాంతాలలో వచ్చిన ప్రతిస్పందన వల్ల వచ్చిందా? ఇది తెలంగాణ ప్రజల విజయమా, తెలంగాణేతర ప్రజల విజయమా? ఒకరు సంతోషిస్తే, మరొకరు విచారపడితే దాని ఆధారంగా కమిటీ మంచిచెడ్డలను బేరీజు వేయవచ్చు. కానీ ఇద్దరూ రెండు ప్రాంతాలలో సందేహంలోనే ఉన్నారెందుకు? ఇద్దరూ రెండు ప్రాంతాలలో సంతృప్తి చెందుతున్నారెందుకు? ఈ కమిటీ కాలయాపనకు, ఉద్యమాన్ని నీరుకార్చడానికి అని తెలుగుదేశం తెలంగాణవాదులు అనుకుంటుంటే, ఇది రాష్ట్ర విభజనకే ఉద్దేశించిందేమోనని  తెలుగుదేశం  సమైక్యవాదులు అనుమానిస్తున్నారు. పరవాలేదు,  కమిటీతోనే తెలంగాణ వస్తుందని కాంగ్రెస్ తెలంగాణవాదులు హామీ ఇస్తుంటే, సమైక్యవాదుల విజయమే కమిటీ అని కాంగ్రెస్ సమైక్యవాదులు ధీమాగా ఉన్నారు.

రేపో ఎల్లుండో శ్రీకృష్ణ క మిటీ విధివిధానాలు ఖరారు అవుతాయి. తెలంగాణ ఏర్పాటు కోసం కమిటీయా, తెలంగాణ సాధ్యాసాధ్యాల నిర్ధారణకు కమిటీయా, సమైక్య ఉద్యమం పర్యవసానంగా ముందుకు వచ్చిన
పరిస్థితుల అంచనాకు కమిటీయా- అన్నది విధివిధానాలు తేల్చాలి. డిసెంబర్9 ప్రకటనకు కొనసాగింపా, 23 ప్రకటనకు కొనసాగింపా తేలాలి.

చంద్రబాబుకు రెండు ప్రాంతాలు రెండుకళ్లు అయినట్టే, సోనియాగాంధీకి అనేక కళ్లు. మీ మనసులో మాట నాకు తెలుసు- అని 2004 ఎన్నికలకు ముందు కరీంనగర్‌లో అన్యాపదేశంగా అన్నమాట, 2009 ఎన్నికల ప్రచారం లో 'జై ఆంధ్రప్రదేశ్' అని చేసిన నినాదం మినహాయించి, ఇప్పటిదాకా ఆమె మనసు లో ఏముందో రాష్ట్ర ప్రజలకు తెలియదు. మౌనంలోనూ మాటలోనూ కూడా రెండర్థా లు సాధించగలిగిన మహానాయకురాలు ఆమె. వైఎస్ఆర్ నిష్క్రమణ తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆమె అనేక ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీని చావుదెబ్బ తీయడానికి ఆమె డిసెంబర్9 ప్రకటన చేయించారా, నిజంగానే ఒక విధానంగా తెలంగాణ ఏర్పాటును భావిస్తున్నారా ఎవరికీ తెలియదు. తెలంగాణేతర ప్రాంతాల ప్రతిస్పందన తరువాత చిదంబరం మాటమార్పు సోనియా వ్యూహాత్మకమైన వెనుకడుగా, దిద్దుకున్న తప్పటడుగా తెలియదు. విధివిధానాలలో ఏ మాత్రం తేడా వచ్చినా తెలంగాణలో ఉద్యమం మరింత ఉధృ తం కావడం, సీమాంధ్రల్లో  ఆందోళన మళ్లీ పునరుజ్జీవం పొందడం ఖాయం.

ద్వంద్వ ప్రవృత్తి లేనివాళ్లు ఎవరైనా కనిపిస్తున్నారా అంటే వారు ఉభయప్రాంతాల ప్రజలు మాత్రమే. కమిటీ విధివిధానాలు సానుకూలంగా ఉంటాయని ఆశిస్తున్న తెలంగాణవాదులు ఎంతో ఆశగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ మోసమే ఎదురుకానున్నదని భయపడుతున్నవారు, విధివిధానాల ప్రకటనతో దాన్ని నిర్ధారణ చేసుకుందామని నిస్పృహను వాయిదా వేస్తున్నారు. ఆరునూరైనా రాష్ట్రవిభజన జరగనివ్వమని, బేరసారాలకు తావేలేదని భీషణ ప్రతిజ్ఞలు చేసిన నేతలు విధివిధానాల ప్రకటన ప్రతికూలంగా వస్తే నిజంగా మాటకు కట్టుబడతారా, రాజీలేని ఉద్యమం చేస్తారా- అని సీమాంధ్రలోని సమైక్యవాదులు సందేహిస్తున్నారు. చిదంబరమో, కమిటీ చైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణనో సోమవారమో మంగళవారమో కమిటీ విధివిధానాలను ప్రకటించినప్పుడు- అందులో మొగ్గును బట్టి ఉభయప్రాంతాలలో స్పందనలు తీవ్రంగా ఉంటాయనడంలో సందేహమే అక్కరలేదు. అందరినీ సంతృప్తిపరిచే వాక్యనిర్మాణం కోసం ఢిల్లీ రాయసగాళ్లు శాయశక్తులా ప్రయ త్నం చేస్తారన్నది ఖచ్చితమే. వారు అందులో విజయం సాధిస్తే- బహుశా ఇదే ఉత్కంఠ, ఇదే నిరీక్షణ, ఇదే అనిశ్చితి దీర్ఘకాలం కొనసాగుతుంది.

రాజకీయపార్టీల అధినాయకత్వాలో, కేంద్రంలోని హోంమంత్రిత్వశాఖో కట్టె విరగకుండా, పాము చావకుండా రెండంచుల కత్తులు ఝళిపించడం అర్థం చేసుకోవచ్చు. వారి పరిమితులు వారివి. రెండు ప్రజావర్గాల మధ్య ప్రయోజనాల ఘర్షణ ఉన్నప్పు డు, దానిని పరిష్కరించడం ఎట్లాగో తెలిసిన రాజకీయ నాయకత్వాలు ఇప్పుడు లేవు. అటువంటి దార్శనికత, ప్రజాహిత దృష్టి ఇప్పుడు కాలం చెల్లిన విలువలు. వీలయితే, అగ్గికి ఆజ్యం పోయడం తప్ప, పెద్ద మనసుతో పెద్దమనుషుల వలె న్యాయపక్షం మాట్లాడడం వారికి తెలియదు.

కానీ, రెండు ప్రాంతాలలో ప్రజల ఉద్వేగాలను ఆశ్రయించుకుని ప్రయోజనాలు పొందాలనుకుంటున్న రాజకీయనాయకులు, ప్రజలు కాకుండా ఉద్యమాన్ని తామే నిర్వహిస్తున్నామని గొప్పలు పోతున్న అధికార, ప్రతిపక్ష నాయకులు- నిజంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల మంచి కోరుతున్నా రా? కోరితే కనుక, మొత్తం తమ ఉద్యమ గమనాలు ఒక్క విధివిధానాల మీదనే ఆధారపడి ఉన్నాయన్న భావనను కలిగిస్తాయా? అంతా అనుకూలంగానే జరగవచ్చునన్న భ్రాంతిని కలిగిస్తాయా? రేపు విధివిధానాలకు సానుకూల అన్వయం చెప్పలేని పరిస్థితి ఉంటే, తమ తమ ప్రాంతాల ప్రజల్లో చెలరేగే ఉద్వేగాలకు, నిస్ప­ృహలకు ఎవరు బాధ్యత వహిస్తారు? దీర్ఘకాలికంగా ఉనికిలో ఉన్న తెలంగాణ సమస్యకు పరిష్కారం రాజకీయంగానే లభిస్తుందన్నది వాస్తవమే అయినప్పటికీ, కేవలం రాజకీయనిర్ణయమే మొత్తం ప్రక్రియను సాధ్యం చేయబోదన్న అవగాహన తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో లోపించింది.

రాష్ట్ర విభజనతో ప్రయోజనాలు ముడిపడి ఉన్న వివిధ వర్గా ల, ప్రాంతాల ప్రజలను ఒప్పించడం, పంపకాలకు సంబంధించిన యంత్రాంగం ఏర్పడడం- దీర్ఘకాలికంగా జరగవలసిన కార్యక్ర మం. ఒక నిర్ణయం జరిగిన తరువాత ఎంత కాలమైనా నిరీక్షించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ, తెలంగాణేతర ప్రాంతాలలో వచ్చిన ప్రతిస్పందన కారణంగా, నిర్ణయానికి ముందు కూడా కొంత ప్రక్రియ అవసరం అవుతోంది. ఉద్యమాన్ని పలచబరచకుండానే, ప్రజలలో వాస్తవిక దృష్టి కల్పించడానికి ఉద్యమ నాయకత్వం ప్రయత్నించాలి. గతంలో అనేక పర్యాయాలు మోసపోయిన అనుభ వం వల్ల ప్రజల్లో మరింత అపనమ్మకం, నిస్పృహ ఉన్నప్పుడు- తమ మీద తమకు నమ్మకం కలిగించవలసిన బాధ్యత కూడా నాయకత్వానిదే.

ప్రతికూల నిర్ణయాలు వస్తే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరికలు చేయడం ఉద్యమస్ఫూర్తికి అవసరం కావచ్చునేమో కానీ, అటువంటి ప్రగల్భాలు ఫలితాలను సాధిస్తాయని, తాము త్యాగాలకు సిద్ధపడతామని భ్రమ కల్పించడం మభ్యపెట్టడం కాదా? ఎంతో కాలంగా ఉన్న ఉద్యమానికి కేవలం పదమూడురోజుల ఆందోళనతో అడ్డుకట్ట వేయగలిగామని గొప్పగా చెప్పుకున్న సమైక్యవాద నేతలు సీమాంధ్ర ప్రజల్లో అవాస్తవికమైన ఆశలు కల్పిస్తున్నామని గుర్తించలేకపోతున్నారు. సర్వత్రా నెలకొని ఉన్న సంప్రదాయాల ప్రకారం- విభజన కోరుతున్న ప్రాంతం- కారణాలు సహేతుకమైనవైనా కాకపోయినా- ముక్త కంఠంతో నినదిస్తున్నప్పుడు- వారి ఆకాంక్షకు ఉన్న విలువ సమైక్యత కోరుతున్న వారి డిమాండ్‌కు ఉండదన్న అవగాహనను సీమాంధ్ర ప్రజలలో వారి నేతలు కల్పించలేకపోయారు. అంతిమంగా విభజన కూడా జరిగే అవకాశం ఉందనే ముందస్తు అవగాహనను వారు ప్రజల్లో కల్పించడం లేదు. అదే జరిగితే ఎటువంటి రక్షణలు, పరిహారాలు కావాలి అన్న అంశాలపై ప్రజాభిప్రాయాన్నిసమీకరించకుండా, విభజననే అడ్డుకోగలమనే అతివిశ్వాసాన్ని సీమాంధ్రనేతలు ప్రద ర్శిస్తున్నారు. వారి వల్ల ప్రభావితులైన సామాన్యప్రజలు- రేపు ఎటువంటి ప్రతికూల నిర్ణయం వచ్చినా- నిర్ణయమే అక్కరలేదు, సూచన వచ్చినా- తీవ్రంగా కలవరపడే ప్రమాదం ఉన్నది. ఉద్వేగాలను పోటీపడి ప్రదర్శించడానికి ఉత్సాహపడుతున్న నాయకులు- రేపటి సంక్షోభానికి బాధ్యత వహించగలరా? ఆశనిరాశల మధ్య ఉద్వేగాలు ఉద్రేకాల మధ్య నిరీక్షణలు నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రజలు- కేంద్రప్రభుత్వ ప్రకటనలకు స్థానిక నేతలు ఇచ్చే తీవ్ర అన్వయాల ప్రభావానికి లోనుకాకుండా- స్థిమితంగా నిగ్రహంగా పరిణామాలను అవగాహన చేసుకోవాలి.

ఎన్నికల గణితమే పరమావధిగా భావించే రాజకీయ మధ్యవర్తులు లేకుం డా, ఉభయప్రాంతాల ప్రజల మధ్య నేరుగా సంప్రదింపులు జరిగే పరిస్థితి నెలకొంటే- అంతకు మించిన ఉత్తమ పరిష్కారం లేదు. సామాన్యుల ప్రయోజనాల రక్షణే ధ్యేయంగా  సంప్రదింపులు జరగాలి. రేపటి విధివిధానాలపై లేనిపోని ఆశలు పెట్టుకోవడం అనవసరం. తమది న్యాయపక్షం అని విశ్వసించే వారెవరైనా భవిష్యత్తుమీద విశ్వాసం కోల్పోకూడదు. ద్వంద్వార్థాల రాజకీయ క్రీడలో భవితవ్యాన్ని వెదుక్కోకూడదు.

No comments:

Post a Comment