Sunday, February 14, 2010

ఎంత చెడ్డా కమిటీతోనూ కొంత లాభం

     మంచిదో చెడ్డదో కమిటీ వచ్చేసింది. నిర్ణీత సమయానికి నివేదిక ఇస్తామని కమిటీ పెద్ద మాట ఇచ్చారు. సమైక్యాంధ్రవాదుల స్పందనలు చూస్తే వారికి కమిటీ పై పెద్దగా అభ్యంతరాలున్నట్టు కనిపించడంలేదు. ఇదంతా మోసమని, కథను మళ్లీ మొదటికి తేవడమని, కాలయాపన చేసి కోల్డ్‌స్టోరేజిలోకి నెట్టడమని భావిస్తున్న తెలంగాణవాదులు నిరసనలు చెబుతున్నారు.  ఇప్పటిదాకా కెమెరాల ముందు కంచుకంఠాలను మోగించిన ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు కొందరు జారుకోవచ్చు, వారిని చూసి మరికొందరు నోరుమెదపకపోవచ్చు, కొందరు మాటవరస నిరసనలు తెలపవచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు ఇప్పడే తీవ్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ గణితంతో, జూదక్రీడతో నిమిత్తం లేని శక్తులు, విద్యార్థులు, ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు ఏో రూపంలో ఒత్తిడిని కొనసాగిస్తూ ఉండవచ్చు. వారితో గొంతు కలుపుతున్నట్టు ప్రత్యేకవాద రాజకీయనేతలు 'మమ'అనవచ్చు. కమిటీ అధ్యయనం, అభిప్రాయసేకరణ సాగుతున్నంతకాలం ఈ నేపథ్య కల్లోల సంగీతం వినిపిస్తూనే ఉండవచ్చు.

      ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా- కమిటీ వల్ల కొంత మంచి జరిగే అవకాశమున్నది. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించేవారికి వారి కారణాలు వారికి ఉన్నా యి కానీ, ఎంతో కొంత శాతం కేంద్ర ప్రభుత్వం నిజాయితీతోనే ఈ ప్రక్రియ సాగిస్తూ ఉండవచ్చు. కమిటీ అధ్యయనం ఫలితాలు నిజంగానే సమస్యకు పరిష్కారాన్ని సాధించవచ్చు. కాబట్టి, కమిటీ చేసే శోధనను బహిష్కరించినందువల్ల
ఉపయోగం లేదు. ప్రజలలో ఉన్న ఉద్యమ తీవ్రతను నిలబెట్టుకోవడానికి నిరంతరం కార్యక్రమాలను నిర్వహించి ఒత్తిడిని కొనసాగించాలనుకోవడంలో తప్పులేదు. అయితే, అదే సమయంలో తమ వాదాన్ని నిరూపించుకోవడానికి కమిటీ ద్వారా స్తున్న ఒక అధికారిక అవకాశాన్ని అన్ని పక్షాలూ ఉపయోగించుకోవలసిందే.

       చిదంబరం డిసెంబర్9నాడు తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన వెంటనే, రాష్ట్ర విభజన అనివార్యమయ్యే పరిస్థితి వస్తున్నదన్న ఆందోళనలో తెలంగాణేతర ప్రాంతాలనుంచి తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది. తెలంగాణ ప్రత్యేకవాదాన్ని తాము అప్పుడే వింటున్న పద్ధతిలో ఆ స్పందన ఉండింది. తాము ఎంతో కాలంనుంచి రకరకాల సాధనాల ద్వారా ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని వివరిస్తున్నప్పటికీ, అది ఇతర ప్రాంతాల వారి చెవికి సోకలేదన్న ఆవేదన తెలంగాణలో తలెత్తింది.   నిజంగానే, గత దశాబ్ద కాలంలో తెలంగాణలోని వివిధ వర్గాల వారు పుస్తకాల ద్వారా, సభల ద్వారా, పత్రికా వ్యాసాల ద్వారా చేస్తున్న వాదనలను ఇతర ప్రాంతాల వారు సీరియ స్‌గా తీసుకున్నట్టు లేదు. విభజన జరిగే పక్షంలో, తమ వాదాన్ని బలంగా వినిపించి సాధ్యమైనంతగా ప్రయోజనాలను కాపాడుకోవాలన్న ఉదదేశంతో సీమాంధ్ర రాజకీయవాదులు- తెలంగాణ వాదాన్ని పూర్తిగా నిరాకరిస్తూ, సమైక్యరాష్ట్రం కొనసాగించడం మినహా మరోదానికి తాము అంగీకరించేది లేదన్న తీవ్రమైన వైఖరి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్య గురించి, సమస్య పరిష్కారాల గురించి చాలా తేలికపాటి, అలవోక, హాస్యాస్పదమైన ప్రతిపాదనలు, చిట్కాపరిష్కారాలు, నిర్హేతుకమైన వాదనలు కూడా ముందుకు వచ్చాయి.

       మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ అని పేరు మారిస్తే సరిపోతుంది కదా, అందుకు తాము సిద్ధమేనని ఒక మేధావి ప్రతిపాదిస్తే, రాష్ట్రంలో అసెంబ్లీ పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచి, మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే సమస్య తీరిపోతుందని ఒక సామాన్యు డు భావించాడు. రాయలసీమతో కలిపి తెలంగాణ ఒక రాష్ట్రంగా చేస్తే చాలునని ఒకరంటే, రాష్ట్రాన్ని మూడు భాగాలు చేసి మూడు ప్రాంతాలకూ సమద్రతీరం ఉండేట్టు విభజించాలని మరొకరు యోచించారు.   హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇప్పుడే ఇచ్చేయొచ్చునని ఒక రాజకీయవాది సిద్ధపడితే, ఆంధ్రప్రదేశ్‌ను అడ్డం గా కాక, నిట్టనిలువుగా ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా చీల్చాలని మరో ఆలోచనాపరుడు ప్రతిపాదించాడు. శ్రీశైలం రాసివ్వం డి, తెలంగాణకు అడ్డం రాబోమని ఒక రాయలసీమ నాయకుడు అంటే, హైదరాబాద్ రాజధానిగా చేసి, మహబూబ్‌నగర్‌ను రాయలసీమలో కలపాలని మరో సమైక్యవాది ఆశిస్తున్నారు.

హైదరాబాద్, భద్రాచలంతో సహా తెలంగాణ యథాతథంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రత్యేకవాదులు కోరుకుంటున్నారు కాబట్టి, వారి దగ్గర రకరకాల ప్రతిపాదనలు లేవు. ఇట్లా రకరకాల ప్రతిపాదనలు చేస్తున్నవారి జ్ఞాన పరిమితులను సందేహించవచ్చును కానీ, సమస్య పరిష్కారానికి తాము కూడా మేధోమథనం చేయాలనుకుంటున్న వారి నిజాయితీని శంకించలేము. అందరూ పరిష్కారాన్ని అన్వేషించవసిందే. కాకపోతే, వాస్తవాల ఆధారంగా, సాధ్యాసాధ్యాల ఆధారంగా నిర్ధారణలకు రావలసి ఉంటుంది. అందుకే కమిటీలు, కమిషన్లు అవసరం. ఇక గణాంకాల విషయంలో కూడా నోటిలెక్కల చెలామణీ రెండు నెలలుగా పెరిగింది. తెలంగాణ వారు ఇంతకాలం చెబుతూ వస్తున్న లెక్కలన్నీ సరిఅయినవేనని అంగీకరించనక్కరలేదు. కానీ, వారికి సమాధానాలు చెప్పేవారు కూడా కొంచెం హోమ్‌వర్క్ చేయవలసి ఉంటుంది. చూసే దృక్పథాన్ని బట్టి గణాంకాలకు ఒక్కొక్కసారి అర్థం మారిపోతుంటుంది. వేరువేరు శిబిరాలు ఒకే వివరాలను వేరువేరుగా అన్వయిస్తుంటాయి. తెలంగాణలో తెలంగాణేతర వ్యాపారులు, సంపన్నుల వల్ల ఇంత భూమి పరాధీనమయిందని, స్థానికులు ఇంతగా నష్టపోయారని ప్రత్యేకవాదు లు వాదించవచ్చు. లేదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తాము హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని, ఫలితంగా నగరంలో జీవనప్రమాణాలు పెరిగాయని ఇతరులు వాదించవచ్చు. హైదరాబాద్‌లో ఇతర ప్రంతాల వారి సంఖ్య ఒకరు పదిలక్షలని, మరొకరు ఇరవై లక్షలని, ఇంకొకరు నలభై లక్షలని చెబుతున్నారు. 1981 జనాభా లెక్కల్లో మాత్రమే హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల వారి జనాభాను ప్రత్యేకంగా లెక్కించారు. ఇప్పుడు ఎవరు తక్కువ చెప్పినా, ఎక్కువ చెప్పినా వారి వారి ఆకాంక్షలకు, రాజకీయోద్దేశాలకు అనుగుణంగానే చెబుతున్నారని భావించే అవకాశం ఉంది. ఈ లెక్కలను తేల్చేదెవ్వరు? దృక్పథాలను బట్టి వ్యాఖ్యానించే అభివృద్ధిని కానీ, వివక్షను కానీ మదింపు వేసేదెవ్వరు? చరిత్రను సమీక్షించి, న్యాయాన్యాయాలను నిర్ధారించడానికే కాదు, భవిష్యత్తు కోసం వనరుల పంపకాన్ని, అంచనాలను వేయవలసి వస్తే - అందుకు అనుసరించవలసిన ప్రమాణాలేమి టి? - కమిటీ బహుశా ఇటువంటి పనులే చేస్తుంది, చేయాలి, చేసేట్టు చూడాలి.

       మేధావులు, విద్యావంతుల సహకారంతో దీర్ఘకాలంగా ఉద్యమం నడుపుతున్న తెలంగాణ వాదులు సహితం కొన్నిసార్లు విచిత్ర వాదనలు చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం 1956 కంటె ముందే ఉనికిలో ఉందని చంద్రశేఖరరావుతో సహా ప్రత్యేకవాదులందరూ వాదనలు చేస్తుంటారు. 1948 నుంచి 1956 దాకా హైదరాబాద్ బహుళ భాషా రాష్ట్రం (కాంపోజిట్‌స్టేట్) తెలుగు, మరాఠీ, కన్నడ ప్రాంతాలతో ఉండేది. హైదరాబాద్‌ను కాంపోజిట్ రాష్ట్రంగా కాక, ప్రత్యేక తెలుగురాష్ట్రం (తెలంగాణ)గా చేయాలనే ఆలోచన 1956 కంటె ముందు బలంగానే ఉండింది. ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫార్సు కూడా అందులో ఒకటి. అలాగే, 610 జీవో అమలు వైఫల్యం గురించి మాట్లాడుతుంటారు కానీ, జీవో 36 గురించి కానీ, ముల్కీ నిబంధనలు అష్ట సూత్రాలకు ఆ తరువాత ఆరుసూత్రాలకు పలచబడిన క్రమం గురించి పెద్దగా ప్రస్తావించ రు. తెలంగాణలో భూముల పరాయీకరణ కానీ వారు చెబుతున్న ఇతర నష్టాలు కానీ- గత అయిదేళ్లకాలంలో ఉధృతస్థాయిలో జరిగాయని, ఆ కాలంలో కళ్లెదుట జరుగుతున్న పరిణామాలను తాముసహిస్తూ అనుమతించామని తెలంగాణవాద రాజకీయవాదులు మరచిపోతుంటారు. రాజకీయవాదులు చెప్పినా చెప్పకపోయి నా- వివక్షో, అభివృద్ధి ఏకాలంలో ఎట్లా జరిగిందో చెప్పాలంటే ఒక తటస్థ వ్యవస్థ అవసరం. కమిటీని అందుకోసమైనా అనుమతించాలి.

        కమిటీ ఏది న్యాయమో చెప్పినంత మాత్రాన కేంద్రం దాన్ని ఆమోదించాలని లేదు. కానీ, న్యాయ నిర్ధారణ అయితే జరగాలి. తమదే న్యాయ పక్షమని విశ్వసించేవారు నిర్ధారణకు వెనుదీయకూడదు. సంబంధిత పక్షాలన్నిటికీ వారు కోరుకున్న న్యాయం జరుగడం సాధ్యమా అన్నది రావలసిన సందేహమే. కానీ, తమ మాట వినిపించామని, తమ మాటను విన్నారని, తీర్పు ఆ తరువాతే వచ్చిందని సకల పక్షాలూ భావించాలి. అప్పుడే అంతిమ నిర్ధారణకు నైతికస్థాయి లభిస్తుంది.

3 comments:

 1. ఆలోచిస్తే అసలు మొట్టమొదటగా కేంద్రప్రబుత్వం ఈ కమిటీనే ప్రకటించి వుంటే బావుండేది ఒక రాష్ట్రాన్ని కోరుతూ డిమాండ్ వచ్చినపుడు ఆ డిమాండ్లో నిజానిజాలు యెవరో ఒకరు తేల్చాలి కదా ..మంచిచెడ్డలు ఆలోచించి విషయాన్ని లోతుగా ఆధ్యయనం చేసి సమస్యలోతుపాతులు చర్చించాలి కదా ?ఇక్కడ విషయం తెలంగాణా డిమాండ్ సహేతుకమే అయినాగానీ దాన్ని నిర్దారించి ,..,ఇదిగో ఈ కమిటీ.... ఈ కారణాలవల్ల వారి డిమాండ్ తీర్చాలిసిందే అని... కారణాలు విశ్లేషించింధి... ...అని ప్రజలందరికీ తెలియచేయాల్సింధే కదా ...ఇదేమీ చేయకుండా రేపు ప్రజల్ని వేరే మరెవరో రెచ్చగొడితే ప్రత్యేక రాష్ట్రాల్ని ప్రకటించేస్తారా ?గాబట్టి దిమాండ్ యెంత కరక్ట్ అయినాగానీ వాటిని కూలంకషమ్ గా అద్యయనం చేయాలి ,,వాటిల్లో నిజం వున్నపుడు ఆ దెమాండ్లను తప్పనిసరిగా నిజాయితీగా ఒప్పుకోవాలి ..కానీ ఆ నిజాయతీ ఈ రాజకీయుల్లో వున్నదా??? గాబట్టి ఈలాంటి సమస్యలు వుత్పన్నమయినప్పుడు కమిటీ లు తప్పనిసరి ...మంచి చెడ్డ తెలవలసిందే ...

  ReplyDelete
 2. Another sane voice amongst a group of extremists.

  Very well said Sir!

  ReplyDelete
 3. పనిలో పనిగా కోతిపుండు లాంటి తెలంగాణ సమస్యని బ్రహ్మరాక్షసి చెయ్యటంలో మీడియా పాత్రెంతో కూడా ఈ కమిటీ పరిశీలించాలి. అసలీ ఇరవినాలుగ్గంటల చానళ్లు మూసిపారేసి రోజుకో గంటో అరగంటో మాత్రమే వార్తలందించే పద్ధతి తీసుకొస్తే దేశంలో జనాలకి బోలెడంత సమయం ఆదా, బీపీల్లాంటి రోగాలు తగ్గుతాయి, సగం సమస్యలు వాటంతటవే తీరిపోతాయి .... దరిద్రం వదిలిపోతుంది.

  ReplyDelete