Thursday, February 18, 2010

అచ్చమాంబ : మనకు తెలియని మన చరిత్ర

 (సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో త్వరలో రానున్న కథాసంకలనం "" భండారు అచ్చమాంబ: తొలి తెలుగు కథానికలు'' కు రాసిన ముందుమాట ఇది. ఈ పుస్తకం ద్వారా అచ్చమాంబ రాసిన తెలుగుకథలు పది సుమారు శతాబ్దం తరువాత తెలుగుపాఠకులకు అందుబాటులోకి రానున్నాయి. )

 తెలుగు కథాసాహిత్యం ఆవిర్భావం గురించి దీర్ఘకాలం చెలామణీలో ఉన్న అభిప్రాయాలను తలకిందులు చేసిన రచయిత కథల పుస్తకం ఇది. గొప్పకథలూ అద్భుతమైన కథలూ కాకపోవచ్చును కానీ,  ఈ రచనలన్నీ సాహిత్య చరిత్రను కొత్తగా చూడడానికి, ఇంతకాలం అదృశ్యంగా ఉన్న లంకెలను కనుగొనడానికి పనికివచ్చేపాఠ్యాలు.  ఈ కథలు రాసిన కాలం ఒక ఆశ్చర్యమయితే,  రచయిత స్త్రీ కావడం మరో విశేషం. ఈ రెండూ కాక- రచయిత నేపథ్యం, సంచరించిన ప్రాంతాలు, స్వీకరించిన ప్రభావాలు పూర్తి విభిన్నం. రచయితకు దొరకవలసిన పరిగణన ఇంత కాలం లభించకపోవడానికి పై మూడు అంశాలూ కారణమైనప్పటికీ, మూడో అంశమే ముఖ్యకారణంగా కనిపిస్తున్నది.
 
  కొమర్రాజు అచ్చమాంబగా పుట్టి, భండారు అచ్చమాంబగా మారిన ఈ రచయిత (1874 -1905) పుట్టడం మాతామహుల ఇంట్లో కృష్ణాజిల్లాలో అయినప్పటికీ, బాల్యం మునగాల పరగణాలో, నల్లగొండ జిల్లాలో సాగింది. మొదటి భార్య మరణించిన మేనమామ భండారు మాధవరావుతో పదేళ్లు కూడా నిండని వయస్సులో  వివాహం జరిగాక సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లోని నాగపూర్‌కు ఆమె తరలివెళ్లారు. ఆ తరువాత ఆమె జీవితమంతా మహారాష్ట్రంలోనే. తనతో పాటే నాగపూర్‌కు వచ్చిన తమ్ముడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు చదువుకుంటుంటే, అతని పక్కనే కూర్చుని తాను కూడా చదువుకున్నారు. అట్లా హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తెలుగు భాషలు నేర్చుకున్నారు. సంస్క­ృతం తో కూడా కొంత పరిచయం సంపాదించారు. భర్త మాధవరావుకు ఆడవాళ్లు చదువుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ, ఆయనను ఒప్పించి తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు. ఆమె మీద మహారాష్ట్రంలోని జనజాగరణ ఉద్యమం ప్రభావం, మరాఠీ సమకాలీన సంస్కరణవాద సాహిత్యం ప్రభావం కనిపిస్తాయి. ఆమె ఎప్పుడు రచనా వ్యాసంగం మొదలుపెట్టారో ఖచ్చితంగా చెప్పలేము కానీ, 1898 నుంచి ఆమె రచనలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. అప్పటినుంచి ఆరు సంవత్సరాల పాటు, ఆమె తెలుగులో రచనలు చేశారు.   ఇప్పటివరకు దొరికిన రచనల ప్రకారం ఆమె మొదటి కథ 'గుణవతి యగు స్త్రీ' 1901లో ప్రచురితమైంది. మనకు తెలిసినంత వరకు తెలుగులో మొట్టమొదటి కథ ఇదే.
 
  మొట్టమొదటి కావ్యమేది, కథ ఏది, నవల ఏది, ఎప్పుడు వంటి ప్రశ్నలు - సాహిత్యచరిత్రలో తరచు తప్పుడు శోధనలకు, నిర్ధారణలకు కారణమవుతున్నాయి.  రచయితలకో వారి రచనలకో కిరీటాలు తొడగడానికి  ఆ ప్రశ్నలు పనికివస్తున్నాయి తప్ప, చారిత్రకదృష్టికి దోహదం చేయడం లేదు. వ్యక్తులో, ఒక సంఘటనో చరిత్రను మలుపుతిప్పుతాయని, తిప్పుతారని భావించే దృష్టి నుంచి తారీఖుల వివేచన వస్తుంది. పరిస్థితులు పరిపక్వం కానిదే, తగిన భావవాతావరణం సిద్ధం కానిదే ఏ ఒక్క మార్పూ అవతరించదు. కాలం నాడిని పట్టుకుని ద్రష్టగా, మార్గదర్శిగా ముందుకు రాగలగడం వ్యక్తుల సొంత ప్రతిభా చొరవా కావచ్చునేమో కానీ, మొత్తం ఘనత వారికే చెందదు.  ఆంధ్రమహాభారతం వంటి రచన అంతకు ముందు ఎటువంటి సన్నాహాలూ పూర్వరచనలూ లేకుండా రావడం సాధ్యం కాదన్న అవగాహన లేకుండా నన్నయకు మనం ఆదికవి బిరుదు ఇచ్చాము. లభ్యమో అలభ్యమో ఖండికలో కావ్యాలో శాసనాలో ఏవో వెయ్యేళ్ల పూర్వరంగం నన్నయకు ముందు తెలుగుసాహిత్యానికి ఉన్నదని తరువాత తరువాత కనుగొన్నాము. అట్లాగే, తెలుగులో తొలి కథ కానీ కథానిక గానీ 1910లో గురజాడ 'దిద్దుబాటు'
వచ్చే దాకా లేదని చాలా కాలం చదువుతూ వస్తున్నాము. ఆచంట సాంఖ్యాయన శర్మ 'లలిత' (1903) కథ కొంతకాలం పొటీగా నిలబడింది కానీ  ఆధునిక కథాలక్షణాలు ఉన్నాయా లేదా అన్న ప్రశ్నతో దాన్ని వెనుకకు నెట్టివేశాము. మొట్టమొదటిదేది అన్న ప్రశ్న కాలక్రమానికి సంబంధించిందే తప్ప, సాహిత్య అంతర్లక్షణాల చర్చకు అందులో ఆస్కారం తక్కువ. పూర్తి భిన్నమైన ప్రక్రియగా కనిపిస్తే తప్ప, కథాలక్షణాలు ప్రాథమికంగా ఉన్నాయా, సమగ్రంగా ఉన్నాయా అన్న విచికిత్స చేయకూడదు. భండారు అచ్చమాంబ రాసిన పది కథలు 20 వ శతాబ్దం అంతా కథాచరిత్ర చర్చలో స్థానం సంపాదించుకోకపోవడానికి-గురజాడ ప్రాథమ్యం తిరుగులేనిదన్న విశ్వాసంతో పాటు, సాహిత్యరంగంలో వికాసం మొదట ఉత్తరాంధ్రలో తరువాత దక్షిణాంధ్రలో జరిగిందన్న అభిప్రాయం కూడా కారణం. గురజాడ 'దిద్దుబాటు' వెలువడిన ఒకటిరెండు సంవత్సరాలలోనే మాడపాటి హనుమంతరావు కథలు వెలువడి 1915నాటికి ఆయన కథాసంకలనం కూడా వచ్చినా తొలితరం కథకులలో ఆయనకు తగిన స్థానం లభించకపోవడానికి కూడా ప్రాంతీయ నేపథ్యం ప్రధాన కారణం. రాజకీయంగా కానీ, సాంస్క­ృతికంగా కానీ బెంగాల్‌ నుంచి ప్రసరించిన సంస్కరణవాద భావాలు, ఆధునిక సాహిత్య స్పర్శ తెలుగులో కొత్త సాహిత్యాన్ని ఉద్దీపింపజేశాయని నమ్ముతూ వచ్చాము. సంస్థాన రాజ్యాలలో పుట్టి అక్కడి నేపథ్యంలో ఉర్దూ-హిందీ సాహిత్యరచన చేసిన ప్రేమ్‌చంద్‌ ప్రభావాన్ని స్వీకరించిన మాడపాటి హనుమంతరావు కానీ, బ్రిటిష్‌ పాలిత మధ్యపరగణాలలోని  ఆధునిక సంస్కారభావాలకు, మహారాష్ట్రలో శతాబ్దాలుగా జరుగుతూ వస్తున్న సామాజిక సంచలనాలకు ప్రతిస్పందించి మాడపాడి కంటె దశాబ్దంముందే కథలు రాసిన భండారు అచ్చమాంబ కానీ - వ్యవస్థిత సాహిత్యచరిత్ర భౌతిక సరిహద్దులకు వెలుపల నుంచి సాహిత్యవ్యాసంగం చేసినవారు.  ఆ సరిహద్దులకు పూర్తిగా చెందనందువల్లనే కొమర్రాజు వెంకట లక్ష్మణరావుకు గురజాడ, కందుకూరి, గిడుగు త్రయానికి వచ్చిన కీర్తి రాలేదు.  అచ్చమాంబ, మాడపాటి- ఇద్దరూ కృష్ణాజిల్లాలో జన్మించినవారే. వారి నాటి కథలన్నీ రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం వంటి కోస్తాంధ్ర పట్టణాలనుంచి వెలువడిన పత్రికలలో ప్రచురితమైనవే.  కానీ వారి జీవితాలు మాత్రం బ్రిటిషాంధ్రకు వెలుపల సాగినవి.  సాంకేతికంగా వారు బ్రిటిషాంధ్రులైనప్పటికీ, వారి వారి  ఆచరణల రీత్యా, సాహిత్యస్వభావాల రీత్యా నాటి హైదరాబాద్‌ రాజ్యానికే చెందుతున్నారు.
 
  తెలుగు కథకు భావప్రభావాలు ఎక్కడివైనా  కథానిర్మాణం, రచనాపద్ధతి వంటి వాటిలో స్థానిక పరంపరకు చెందిన అంశాల ప్రమేయం కూడా ఉన్నది.  తొలినాటి తెలుగు కథలన్నిటిలో సంవాద, సంభాషణా ధోరణి అధికంగా కనిపిస్తుంది. వర్ణనలు తక్కువగా ఉంటాయి. 18,19  శతాబ్దాలలో విస్త­ృతంగా కనిపించే ప్రహసన రచన కూ తొట్టతొలి కథలలో కథనరీతికి పోలికలు కనిపిస్తాయి. ఇక, వర్ణనాత్మక వచన కథన ధోరణి కొంతకాలంగా రూపొందుతూ వచ్చి నవలల అవతరణతో స్థిరపడింది. తెలుగులో కథల కంటె నవలలే ముందు వచ్చాయని గుర్తు పెట్టుకుంటే, కథావతరణ క్రమం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.  తెలుగులో నూతన సంస్కారభావాలు బెంగాల్‌ నుంచి ఆంధ్రకు దిగుమతి అయ్యాయని, అవే మొత్తం తెలుగువారి సాహిత్య సాంస్క­ృతిక వికాసాలకు ప్రేరకాలు అనుకోవడం పొరపాటని అచ్చమాంబ రచనలు నిరూపిస్తాయి. ఆమె గురజాడ వలె ఇంగ్లీషు సాహిత్యాన్ని చదివిన వ్యక్తి కాదు. బెంగాలీ రచయితలతో ఉత్తరప్రత్యుత్తరాలుచేసిన వ్యక్తి కాదు. సోదరుడే కాక సహాధ్యాయి కూడా అయిన కొమర్రాజు లక్ష్మణరావు వల్ల కొంత అవగాహన, నాగపూర్‌లోనూ, ఉద్యోగరీత్యా భర్త వెళ్లిన ఇతర మహారాష్ట్ర పట్టణాలలోను పొందిన  జీవితానుభవం కొంత, చదివిన మరాఠీ, తెలుగు పుస్తకాల వల్ల మరికొంత- ఆమె చైతన్యం రూపొంది ఉండాలి. అలనాటి తెలంగాణకు చెందిన రచయితలందరి విషయంలో  వారి భావమూలాలను, ప్రభావాలను గుర్తించడానికి సాహిత్యచరిత్ర విద్యార్థులు ఇంకా పరిశ్రమించవలసి ఉన్నది.
 
   అచ్చమాంబ కథలన్నిటిలో సంవాద, సంభాషణా ధోరణి  ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆమె ప్రధానంగా మానవసంబంధాలపైనే కథావస్తువులను కేంద్రీకరించినందున- భార్య-భర్త, తల్లి-పిల్లలు ఇట్లా కుటుంబసభ్యుల మధ్య జరిగిన సంభాషణలే ప్రధానంగా కథలు నడిచాయి. ఏ కాలంలో, ఏనేపథ్యంలో, ఏ ప్రాంతంలో కథజరిగిందీ మనకు తెలిసే అవకాశం అతి తక్కువ. ఆమె వాడిన భాష సరళ గ్రాంథికం కావడం వల్ల భాష ప్రత్యేకతలు కూడా కనిపెట్టడం కష్టం. ముదిగంటి సుజాతారెడ్డి ( ఇదే సంకలనానికి ఆమె రాసిన ముందుమాట చూడండి)  ప్రత్యేకమైన దృష్టి పెట్టి-'సత్ప్రాత్రదానము' అన్న కథ హైదరాబాద్‌ నేపథ్యంలో రాసినట్టు గుర్తించారు. అంతే కాదు, ఆమె భాషలో కనిపిస్తున్న  తెలంగాణ మాండలిక పదాలను గుర్తించారు.
 
  1901, 1902,1903- ఈ మూడు సంవత్సరాలలో రాసిన పదికథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఏ కథలోనూ సంక్లిష్టమైన  ఇతివృత్తం లేదు. జటిలమైన సమస్యలు కానీ, గాఢమైన ఉద్వేగాంశాలు కానీ ఈ కథల్లో లేవు. ఆనాటికి అటువంటి కథలు వచ్చే అవకాశం లేదు.  కథలన్నిటిలో ముఖ్యమయిన కథాంశం- మానవసంబంధాలని మెరుగుపరచడం. విద్య ప్రాధాన్యాన్నో, నిరాడంబరత వంటి విలువల గొప్పదనాన్నో చెప్పి ఒప్పించడం ద్వారా జీవితాలను, సంబంధాలను ఉన్నతీకరించడానికి పాత్రలు ప్రయత్నిస్తాయి. ప్రతికథలోను 'నీతి' ఉన్నది. ప్రతి సంబంధంలోను గురుశిష్య సంబంధం ఉంది. చదువుకున్న భర్తలు తమ భార్యలకి మంచీచెడ్డా చెప్పే బాధ్యతని తీసుకుంటారు. అంతమాత్రాన ఆడవాళ్లు  కేవలం చెప్పింది వినే బలహీనులుగా ఉండరు. వాళ్లు ఏది నేర్చుకోవలని తమ భర్తలు ఆశిస్తున్నారో వాటిని ప్రశ్నిస్తారు. తాము కన్విన్స్‌ అయినతరువాతే ఆచరిస్తారు.  కాకపోతే, ప్రగతిశీల భావాలను భర్తలు చెబుతుంటే, సంప్రదాయ అభిప్రాయాలనుంచి భార్యలు వాటిని ప్రశ్నిస్తారు. భావాల సంగతి పక్కన పెడితే, ప్రశ్నించడం ఇక్కడ ముఖ్యం. సార్వకాలీనత ఉన్న చిన్న చిన్న అంశాలు కథావస్తువులు. ఉదాహరణకి 'ప్రథమకలహం' అన్న కథ, తమ మాటే నెగ్గాలని మొండిపట్టు పట్టడం, మాట పట్టింపులూ ఎంతదూరం మానవసంబంధాలని తీసుకెళ్లగలవు అనే విషయం అన్నది ఇందులో కథాంశం.  ఏ కాలంలో అయినా జీవితాలని ఛిద్రం చేయగలిగిన శక్తి మాట్లాడిన మాటకో, మాట్లాడని మాటకో ఉంటుంది.  మాటపట్టింపు కంటె జీవితం విలువైనదని,  ఒదిగి  ఉంటే తప్పులేదని చెప్పవలసిన కాలం అది. ఆత్మగౌరవానికే అధిక ప్రాధాన్యం ఇచ్చే కాలం ఇంకా రాలేదు.
 
  ఆడవాళ్లు 'నేర్చుకోవాలి' అనే కాలంలోని కథలివి. చదువు నేర్చుకోవాలనో, చీరలూనగల కంటె గుణసంపద గొప్పదనో నేర్చుకోవాలని తహతహలాడుతున్న కాలం కాబోలు. భర్తలని గురువులుగా నిరభ్యంతరంగా అంగీకరించారు. స్త్రీల అభివృద్ధిలో అదొక సందర్భం.  ఇపుడు వెనుకకు తిరిగి చూస్తే దాన్ని స్త్రీ ఉద్యమం వ్యూహాత్మకంగా వ్యవహరించిన సందర్భంగా కనిపిస్తుంది. తెలుగువారి ప్రాంతాలలో, ముఖ్యంగా బ్రిటిషాంధ్రలో, అగ్రకులాల స్త్రీలు మొదట చదువుకునే హక్కు కోసం తాపత్రయపడ్డారు. ఇతర కులాలలో పురుషులకే ఇంకా విద్య సమీపించలేదు కనుక, స్త్రీవిద్య గురించిన ఆకాంక్ష బలపడలేదు. వీరేశలింగం వంటి సంస్కర్తలు ప్రచారంలో పెడుతున్న సంస్కారభావాల సాయంతో, స్త్రీలు సాంప్రదాయ చట్రం నుంచి వెలుపలికి చూడనారంభించారు. వితంతువివాహాలనే సంస్కారాన్ని సాధన చేస్తున్న వీరేశలింగం కులాంతర వివాహాలు కాదుకదా, కనీసం శాఖాంతర వివాహాలను కూడా ప్రోత్సహించలేదు. తన ఉద్యమం పరిమితులను దృష్టిలో పెట్టుకుని గీసుకున్న గిరి అది. అట్లాగే, స్త్రీలు కూడా స్త్రీవిద్యను పురుషులకు మరింత సేవ చేయడానికో, కుటుంబాన్ని  ఉన్నతంగా తీర్చిదిద్దడానికో  కోరుకుంటున్నామని చెబుతూ వచ్చారు.  తొలినాటి సాహిత్యంలో పురుషులలోని ప్రతికూల అంశాలను కాక, స్త్రీలలో పురుషులు చూస్తున్న అవలక్షణాల మీదనే స్త్రీరచయితలు గురిపెట్టడం గమనించవచ్చు. అమ్మలక్కలతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడం, చీరలూ నగల మీద యావ ఉండడం,  కుతర్కంతో భర్తలకు అనుకూలవతులుగా మెలగకపోవడం- వంటి లక్షణాలు నాటి కొందరు స్త్రీలలో విద్యావంతులైన పురుషులకు కంటగింపుగా ఉండి ఉండవచ్చు. అటువంటి అవలక్షణాలన్నిటినీ అచ్చమాంబ తన కథలలో విమర్శించారు.  అచ్చమాంబ దృష్టిలో ఉన్నతమైన సంస్కారం అంటే- అణకువగా, వినయంగా ఉండడం, అధిక వ్యయాన్ని ఇష్టపడక మితంగా సంసారాన్ని  సాగించగలగడం, ఆర్థికస్థితి వల్ల కాయకష్టం చేయవలసి వచ్చినా ఆడవాళ్లు తమ ప్రవర్తన ద్వారా గౌరవాన్ని కాపాడుకోగలగడం, సేవకుల విషయంలో  పేదల విషయంలో కారుణ్యభావన కలిగి ఉండడం.
 
  అచ్చమాంబ వ్యక్తిత్వంలో కూడా అణకువ, కార్యసాధన కోసం అనువైన వాతావరణం కల్పించుకోవడం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. భర్తను తనకు అనుగుణంగా మలచుకోవడంతో పాటు, ఆయన విషయంలో ఆమె తీవ్రమైన కృతజ్ఞత చూపుతూ వచ్చారు. " ఎవరి పరిపూర్ణ కటాక్షంబుచే నాకీ గ్రంథము వ్రాయునంతటి శక్తియు, స్వాతంత్య్రంబును గలిగెనో''  ఆ భండారు మాధవరావుకు ఆమె 'అబలాసచ్చరిత్ర రత్నమాల'ను అంకితం చేశారు. తన చర్మంతో చెప్పులు కుట్టి ఇచ్చినా అతని రుణం తీరదని కూడా ఆమె ఆ అంకిత వాక్యాలలో అన్నారు. ఆమె వ్యక్తం చేసిన విధేయతను, పాతివ్రత్యాన్ని, కృతజ్ఞతను పక్కనబెడితే,  అచ్చమాంబ  వ్యక్తీకరణలోని స్పష్టతకు ఉదాహరణ- గ్రంథం రాయగలిగే  శక్తిని,  స్వాతంత్య్రాన్ని ప్రస్తావించడం. స్త్రీలకు నాడు కావలసినది శక్తిని సమకూర్చుకోవడం, స్వాతంత్య్రాన్ని జాగ్రత్తగా పెంచుకోవడం. వీరే శలింగం కార్యాచరణ ఆరంభించిన  దశాబ్దకాలానికే అచ్చమాంబ కోస్తాంధ్రలోని వివిధ పట్టణాలను భర్తతో సహా సందర్శించారు. వెళ్లిన ప్రతిచోటా మహిళలను కలవడం, వారిని  ఏదో ఒక రూపంలో సంఘటితం చేయడం చేస్తూ వచ్చారు. ముప్పయ్యేళ్ల జీవితంలో ఆమె సాధించిన కార్యాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సంస్కారభావాలతో ఉద్దీపన పొంది, దానికి అనుగుణమైన కార్యాచరణను లక్ష్యశుద్ధితో, చిత్తశుద్ధితో ఆమె నిర్వహిస్తూ వచ్చారు. బొంబాయి జాతీయ కాంగ్రెస్‌కు కూడా ఆమె హాజరయ్యారు.  ప్లేగువ్యాధి బాధితులకు సేవ చేసి, తాను స్వయంగా ఆ వ్యాధి బారిన పడి ఆమె మరణించారు.
 
  స్త్రీవిద్య గురించి స్వాతంత్య్రం గురించి అచ్చమాంబ అభిప్రాయాలు- 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంథరచనోద్దేశాన్ని వివరించిన మాటల్లో చూడవచ్చు.  ఆడవారు బలహీనులని, మూఢులని, తెలివితక్కువవారని ఉన్న అభిప్రాయాన్ని, స్త్రీలకు విద్య అనుమతిస్తే అది దుర్వినియోగం అవుతుందన్న పొరపాటు భావనను పూర్వపక్షం చేసి వాస్తవంగా ఆదర్శంగా జీవించిన స్త్రీల గాథలను పరిచయం చేయడం తన ఉద్దేశమని ఆమె పీఠికలో పేర్కొన్నారు.
 
  పాతివ్రత్యమూ కుటుంబ ప్రయోజనం కోసం స్త్రీ విద్య అన్న చట్రంలోనే అచ్చమాంబ రాసినప్పటికీ- ఆమె రచనలలో అక్కడక్కడా విశేషమైన భావాలు కనిపిస్తాయి.  కథనంలో కూడా కొత్త పోకడలు తారసపడతాయి. 'దంపతుల ప్రథమ కలహము' (1902) అన్న కథలో నాయిక లలిత తన అమ్మమ్మ పార్వతమ్మతో "అమ్మమ్మా, యిది మీ కాలము కాదు. ఇప్పటి కాలమున వివాహము కాగానే మేము గృహిణీ పదమునక ర్హురాండ్రమగుదుమే కాని ధనమిచ్చి కొన్న భానిసలము కాము. మా వంటి పత్నులు పురుషుల యహంభావము నెంతమాత్రము సహింపజాలరు'' అని అంటుంది. లలిత పాత్రపై రచయితకు సానుభూతి ఏమీ లేదు. అహంకారిగా చిత్రించిన పాత్రే. కానీ, కాలముతో పాటు మారుతున్న విలువలు ఈ మాటల్లో వ్యక్తమవుతున్నాయి. లలిత అమ్మమ్మ కూడా తన కాలంలో  ఏదో ధిక్కారం చేసిన వ్యక్తే. భర్త " చెప్పినదంతయు జేయకుండుటయే తన గౌరవము హెచ్చుటకు మార్గమని తలంచి''న వ్యక్తే ఆమె. వర్తమానంలో ఆ పాత్ర పశ్చాత్తాపపడిందనుకోండి. అయినప్పటికీ, ఏ తరానికాతరం తమ స్వతంత్రతాకాంక్షని వ్యక్తపరుస్తూనే ఉన్నదని తెలియడం ఆనందాన్నిస్తుంది.  " ... మీరిరువురును మీమీ స్వాతంత్య్రములను హెచ్చింపుచుండినచో కలహము ముదిరి గృహమొక యరణ్యము వలె దుఃఖప్రదమగును'' అన్న సామరస్యభావాన్నే రచయిత చెప్పినప్పటికీ-  ఆత్మాభిమానమో అహంకారమో మహిళలలో పెరుగుతున్న వాస్తవికతను కూడా రికార్డు చేశారు.   ఈ కథకు గురజాడ 'దిద్దుబాటు' కథతో కొంత పోలిక కనిపిస్తుంది. 'సానిదానిపాట' మీద మోజుపెంచుకున్న గోపాలరావుకు బుద్ధిచెప్పడానికి భార్య కమలిని పుట్టింటికి వెడుతున్నట్టు ఒక ఉత్తరం రాసిపెడుతుంది. గోపాలరావులో పశ్చాత్తాపం కలిగాక మంచం కింద దాక్కున్న కమలిని గాజుల చప్పుడు వినిపిస్తుంది. -అదీ గురజాడ రాసిన 'మొదటి' కథ.  అచ్చమాంబ కథ 'దంపతుల ప్రథమకలహము'లో తన వెంట నాటకానికి రాని భార్యమీద అలిగిన భర్త ఇల్లు విడిచిపోదామని ఆలోచించి, చివరకు ఇంటి అరుగుమీద పడుకుంటాడు, తన ధోరణి వల్ల కలిగే ప్రమాదమేమిటో అమ్మమ్మ హితబోధ వల్ల తెలుసుకున్న భార్య లలిత ఇల్లంతా వెదికి కలవరపడుతుంది. చివరకు అరుగు మీద పడుకున్న భర్తను కనుగొంటుంది.  గురజాడ రాసిన కథలో కథానాయిక చిరు హెచ్చరిక ద్వారా భర్తలో సద్వర్తన కలిగించే ప్రయత్నంచేస్తుంది. అచ్చమాంబ కథ పురుషుడికి అనుకూలంగా ఉన్నప్పటికీ, కథలో ముగింపు టెక్నిక్‌ మాత్రం ఒక్కటే కావడం విశేషం.
 
  ప్రపంచంమీద, జీవితం మీద సానుకూల దృష్టి ఉండాలని చెప్పిన " అద్దమును సత్యవతియును'' (1903) అన్న కథ , కథ అనడానికి కూడా వీలు లేని ప్రాథమికమైన రచన అయినప్పటికీ, అందులో ఆమె చెప్పిన ఈ మాటలు ప్రత్యేకమైనవి. " ... ఈ జగమంతయు నొక యద్దమనియు మనము దాని వైపున కోపముగా చూచిన బ్రతిబింబము కోపముగా, సంతోషముగా దానింగనిన బ్రతిబింబము సంతోషముగాను కనిపించును''. సంవాద రూపంలో ఉన్న 'స్త్రీవిద్య' (1903) అన్న కథలో భర్త పాత్ర చేత స్త్రీవిద్య ప్రాశస్త్యాన్ని రచయిత చెప్పిస్తారు. సాధారణమైన ప్రయోజనాలతో పాటు  భర్త చెప్పిన హేతువులు-  " నీకే చదువు వచ్చి యుండిన శాస్త్రములో నేమి వ్రాసియున్నది నీవే చదివి తెలిసికొనజాలి యుందువు. నేనిదివరకు జదివిన శాస్త్రములలో ఎక్కడను స్త్రీలు చదువగూడదనిన మాట లేదు. బహుశా యే శాస్త్రములోను నిట్టి సంగతి యుండదని నా తాత్పర్యము. ''. ఈ కథలో రచయిత ఒక ఊహను కూడా కథాంశంలో భాగంగా చిత్రించారు. చదువునేర్చిన తరువాత తన భార్య లేఖ రాయడం, తాను దాన్ని చదవడం, పిల్లలను కూర్చుండబెట్టుకుని ఆమె వారికి చదువు చెప్పడం- ఈ దృశ్యాన్ని భర్త ఊహించుకుని చెబుతాడు.  ఇందులోనే భార్యాభర్తల సంబంధం గురించి చెప్పిన ఒక వాక్యం ఆసక్తికరంగా ఉంటుంది. "పరస్పరానురాగముగల మనబోటి భార్యాభర్తలొండొరులు ప్రేమపూర్వకముగా జేయు నేకార్యమేని నితరుల కది యల్పముగా దోచినను వారిలో వారికది యొక యమూల్యముగా దోచక మానదు.'' ఒక కథలో నగల మోజు భార్యకున్నట్లు చిత్రించిన రచయిత 'ధనత్రయోదశి' (1902) కథలో భర్తే అవినీతికి పాల్పడినట్టు, భార్య అతన్ని సన్మార్గంలోకి దిద్దినట్టు చిత్రించారు. " కష్టపడి సంపాదించుకొనిన పదిరూపాయిలను సుఖముగా దినినటుల నీ దొంగసొమ్మును దినగలమా, దానిని మనము ముట్టినపుడెల్ల నిది మీరు విశ్వాసదోషము వలనే సంపాదించి తినుమన్నదని మనసు దెప్పుచుండదా? ... నాకీ దరిద్రములో గలుగుచున్న పరమానందమిక దొరుకజాలదు గదా!'' అని భార్య పాత్ర విజయల క్ష్మి భర్తను నిలదీస్తుంది.
 
  'సత్ప్రాత్రదానము'( (1902) కథలో  రచయిత ఒక పాత్ర ద్వారా  చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తి కలిగిస్తుంది.  ఒక అంధుడికి పావలా దానం చేయమని కొడుకు అడిగినప్పుడు, అతని తల్లి అట్లా చేయకుండా అన్నం మాత్రం పెట్టి పంపిస్తుంది. ఆ గుడ్డివాడి కొడుకులు గ్రామంలో కౌలు రైతులు. వారికి లభించే ఆదాయం ఏమాత్రం సరిపోదు. డబ్బు దానం చేస్తే ఆ అంధుడు తన కుమారులకు దాన్ని ఇచ్చి కుటుంబానికి సాయపడేవాడు కదా అని కొడుకు అడిగితే, తల్లి- తల్లిదండ్రులను సంసారాన్ని నడపవలసిన బాధ్యత కొడుకులదే  అని చెబుతుంది. "  ఆ గ్రుడ్డివాని పుత్రులిరువురు హైదరాబాదు వంటి పట్నమున కరిగి కూలిపనిచేసినను వారు వారి కుటుంబములను రక్షించుకొనగలరు'' అంటుంది. "వారట్లేల చేయరు?'' అని కొడుకు అడుగుతాడు. " కొన్ని పశువులు గడ్డి లేక నోటికి మన్ను తగులుచుండినను నొక చోటనే గరిక మేయుచు బరుండును గాని వానికి కొంచెము దూరములో పచ్చని పసరిక యున్నను నవి లేచి యట కరుగ నొల్లవు'' అని తల్లి చెబుతుంది.  స్వయంగా దూరప్రాంతంలో ఉద్యోగరీత్యా ఉండవలసి వస్తున్న అచ్చమాంబ కుటుంబానికి కౌలురైతులు కూలీలుగా మారడానికి పట్నం వెళ్లకపోవడం అర్థం కాకపోవచ్చును. భిక్షాటనకు పాల్పడడం కంటె ఉన్న ఊరు వదిలి పట్నంలో  కూలికి వెళ్లడమే నీతి అని చెప్పడమే ఆమె ఉద్దేశం కావచ్చును.
 
  అచ్చమాంబ కథలను తిరిగి ఒకచోట అందుబాటులోకి రావడంవల్ల,  తెలుగుసాహిత్యపాఠకులలో మూసుకుపోయిన కొన్ని కిటికీలు తిరిగి తెరుచుకుంటాయి. ఆనాటి సంస్కారభావాలనే కాదు, స్త్రీ ఆలోచనలను కూడా అర్థం చేసుకోవడానికి ఈ  పాఠ్యాలు పనికివస్తాయి. మనకు తెలియని మన చరిత్ర విస్త­ృతమైందని స్త్రీవాదులే కాదు, తెలంగాణవాదులు కూడా సంతోషిస్తారు.  తెలుగు సాహిత్యం సంపన్నమవుతుంది.

5 comments:

 1. చాలా విషయాలు తెలుసుకున్నాను. థాంక్యూ!

  కుటుంబరావు గారు రాసిన "అనుభవం" నవల్లో డాక్టర్ అచ్చమాంబ పిల్లల పెంపకం మీద రాసిన పుస్తకం ప్రస్తావన వస్తుంది. ఆమె, ఈవిడ ఒకరేనాండీ?

  ReplyDelete
 2. శ్రీనివాస్ గారు, వ్యాసం సమగ్రం గా బావుంది.
  సుజాత, ఆ అచ్చమాంబ వేరు. ఆమె డాక్టర్. ఇప్పుదంటే మనకు మన శరీర స్పృహ బాగానే వుంది కానీ మా అమ్మ, మీ అమ్మగారి తరం వాళ్ళకు కానుపు, పిల్లల పెంపకం గురించి అసలైన పరిజ్ననం కలిగించే పుస్తకం ఆమె రాశారు. మా అమ్మ గారికి అచ్చమాంబ గారంటే చాలా అభిమానం. ఆమె విజయవాడ లో వుండేవారు.
  ఈ అచ్చమాంబ గారు మొదట గా స్త్రీల సాహిత్య చరిత్ర రాసిన విదుషీమణి.

  ReplyDelete
 3. చాలా బావుందండీ. విలువైన వ్యాసం. సాహిత్య చరిత్రని ఎలా అధ్యయనం చెయ్యాలని మంచి విషయాలు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంకలనం రావడం కూడా సంతోషించాల్సిన విషయం.

  సుజాత గారు, భండారు అచ్చమాంబ గారి రచనల ప్రసక్తి శ్రీపాద వారి కథల్లో కొన్ని చోట్ల కనిపిస్తుంది. విజయవాడా వాస్తవ్యులైన డా. అచ్చమాంబగారు వేరు. ఆవిడ ప్రసూతి వైద్యులు, కమ్యూనిస్టు నాయకురాలు, 1950 - 70 కాలంలో విజయవాడాలో ప్రముఖ వ్యక్తి.

  ReplyDelete
 4. శ్రీనివాస్ గారు-
  మంచి పరిచయం చేసారు.ధన్యవాదాలు.

  "ఆప్తులైన పురుషులచే గౄహమున నిర్భందింపడు స్త్రీలు రక్షితురాండ్రు కారు.ఏ స్త్రీలు తమ యాత్మను తామే కాపాడుకొందురో వారే సురక్షితురాండ్రు" -అచ్చమాంబ

  ఆమె వాడిన భాష సరళంగా సూటిగా పాఠకులకి అర్ధమవడమే కాక అలోచింప చేసేలా రచనలు చేసి..సాహిత్యాన్ని సమాజ సంస్కరణకి ఉపయోగించిన రచయిత్రి అభినందనీయురాలు.

  1902 సంవత్సరం లో బందరు లో "బృందావన స్త్రీ సమాజం" అనే పేరు తో మొదటి మహిళా సంఘాన్ని స్థాపించారు.'హిందూ సుందరి'పత్రికలో కొన్ని వ్యాసలు కూడా రాశారు(ట).

  ReplyDelete
 5. డాక్టర్ అచ్చమాంబ గా సుప్రసిద్ధులైన కొమర్రాజు అచ్చమాంబ కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు కుమార్తె. సోదరి భండారు అచ్చమాంబ 1905 జనవరి 18 నాడు మరణించగా, 1906 లో జన్మించిన తన కూతురుకు లక్ష్మణరావు ఆమె పేరే పెట్టినట్టున్నారు. భండారు అచ్చమాంబ స్త్రీల సాహిత్య చరిత్ర రాసినట్టు లేదు. ఆమె రాసిన అబలా సచ్చరిత్ర రత్నమాల కొందరు ఆదర్శ స్త్రీమూర్తుల జీవిత గాథా సంగ్రహం.

  ReplyDelete