Sunday, February 21, 2010

ఎటువంటి ప్రజలకు ఎటువంటి నేతలు!

ఒక వార్తాచానెల్ వారు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఒక సీనియర్ తెలంగాణ నాయకుడు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలో వివరంగా చె ప్పారు. వై.ఎస్. అనుయాయివర్గంలో ఆయన కూడా ఒక ముఖ్యులు. వై.ఎస్. హయాంలో తెలంగాణ నాయకులకు ఏ పని కావాలంటే ఆ పని జరిగేదని, అటువంటి మహానాయకుడు లేనందున తెలంగాణకు న్యాయం కావాలంటే ప్రత్యేక రాష్ట్రమే మార్గమని ఆయన అన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రో, పార్టీ అధిష్ఠాన వర్గమో ఆయనను చేరదీసి పను లు జరిపించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే ఆయన నిబద్ధత మారుతుందేమోనని వినేవాళ్లకు సహజంగానే అనుమానం కలిగింది.

పనులు జరుగుతాయని, కాంట్రాక్టుల బకాయి బిల్లులు పాస్ చేయించుకోవచ్చునని, మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ కోటాలో స్థానం దొరుకుతుందేమోన ి, 1969 ఉద్యమం ముగిసాక పీవీకి ఇచ్చినట్టు ఇప్పుడు కూడా కేంద్రం వెనక్కితగ్గి తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే అది తనకే దక్కుతుందని, ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ పార్టీ వెనుకబడకూడదని- ఇలా రకరకాల కారణాలతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి సరికొత్తగా దూకిన పెద్దలెందరో ఉన్నారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారికి ఆచారం ఎక్కువన్నట్టు- ఇట్లా కొత్తగా వీర ఉద్యమకారులైనవారంతా అరివీరభయంకరమైన ప్రసంగాలు, భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ వచ్చారు.

వీరితో లాభం లేదు లెమ్మని నిశ్చయానికి వచ్చిన వారిలో కొత్త ఆశలు కలిగేలా సరికొత్త వెన్నెముకను ఝళిపిస్తూ వచ్చారు. వారందరూ శనివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ, రాష్ట్ర అభివృద్ధి మీద మనసు లగ్నం చేశారు. మరి కొందరు ఊళ్లోనే ఉండి మొహం చాటేశారు, మరికొందరు తమ ముఖారవిందాలను ఢిల్లీలో భద్రపరుచుకున్నారు.

ఇక, ఎప్పుడో ఒకసాి వచ్చే నీలిచంద్రుడిలాగా ప్రత్యక్షమై, కత్తి నాలుకలతో నిప్పుమాటలతో,
తాటాకు చప్పు ళ్లు చేసే మహానాయకులు మౌనవ్రతంలో ఉండిపోయారు. ఇప్పటి కల్లోలం అంతా ఎక్కడినుంచి మొదలైందో కూడా వారు మరచిపోయారు. నాయకత్వం వహించవలసిన ఊరేగింపు నుంచి ఎప్పుడో చల్లగా జారుకున్నారు. నేనున్నానేనున్నానని ధైర్యం ఇవ్వడం సంగతి అటుంచి, ఆవేశపడుతున్న యువకులను వారి ఖర్మానికి వారిని వదిలేశారు.

చిదంబరం మొదటిమాటతో తెలంగాణ యువజనంలో కోటి ఆశలు చిగురించాయి. మొగ్గగా ఉండగానే రెండో మాట వాటిని తుంచివేసింది. ఉద్యమంలో న్యాయం ఉంటే, ప్రాణం ఉంటే ఎన్ని సార్లైనా పునర్జన్మించవచ్చునన్న భరోసా ఇవ్వని ఉద్యమ నాయకత్వం- అన్నీ తెలిసి కూడా కమిటీకి కమిట్ అయిపోయిం ది. ఆశలను విధివిధానాలపైకి మళ్లించింది. రాజ్యాంగ సంక్షోభం ఒక పరిష్కారంగా భ్రమింపజేసింది. చివరకు విధానం తెలిసింది, తెలంగాణ విధీ తెలిసింది. సంసి్ధత లేని నేతలు సంక్షోభం సృష్టించలేరని తేలింది. చిదంబరం తుంచింది మొగ్గనే, తెలంగాణ నాయకత్వం మాత్రం వేళ్ల మీదనే వేటు వేసింది.

edit. చదువులను, ప్రాణాలను లెక్కచేయని విద్యార్థులు, యువజనులు ఒకవైపు. పదవికి పదవీ అవకాశాలకు అంగుళం దూరమైనా విలవిల్లాడే నేతలు మరొకవైపు. నిర్భయం, త్యాగనిర తి, పోరాటం కలగలసిన జనసందోహం ఒకవైపు. దగా ద్రోహం దళారీతనం మూసపోసిన నాయకత్వం మరోవైపు. శాంతికి, అహింసకు, ఆత్మబలికి కట్టుబడిన చిత్తశుద్ధి ఇటువైపు. వాగాడంబరం, ప్రగల్భాలు, హింసాప్రవచనాలు అటువైపు. తెగిస్తే తెలంగాణ అదిగో అనుకునే అమాయకత్వం ఒకవైపు. అన్నీ తెలిసిన వ్యూహ రాజకీయం మరోవైపు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ నిలువునా చీలి ఉంది. తెలంగాణను చరిత్ర శపించింది కాబోలు.

వర్థిల్లిన మహా సామ్రాజ్యాలు రెండు. కాకతీయులది, కుతుబ్‌షాహీలది. ఒకదాన్ని తుగ్లక్, మరొదాన్ని ఔరంగజేబు శిథిలం చేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం తెలంగాణను కూడా కలుపుకుని ఉంటే పీడాపోయేది, మంచోచెడో ఇక్కడా మెకాలే మానసపుత్రులు వర్థిల్లేవారు. కొంచెం లౌక్యం, కొంచెం వ్యవహారం, కొంచెం రాజకీయం ఇక్కడా అబ్బి ఉండేవి. అదేమి ఖర్మమో, మొదటి నుంచీ పోరాటపు ఆరాటమే. మొదటిస్వాతంత్య్రపోరాటంలో ఇక్కడే కత్తులు లేచాయి. రాంజీగోండు ఇక్కడే ఉరిపడ్డా డు.

ఆదివాసులను దండుకట్టి కొమురంభీము రాలిపోయాడు. దేశమంతా 'సంస్కారవంతమైన' జాతీయోద్యమం చరఖాయుధంతో విజయాలు సాధిస్తున్నప్పుడు- ఇక్కడ సత్యాగ్రహమే నిషిద్ధం అయింది. జాతికే పిత అయిన మహాత్ము డు హైదరాబాద్‌లో మాత్రం సత్యాగ్రహాన్ని నిషేధించారు. ఊర్లకు ఊర్లే ఆయుధాలు పట్టి, కరకుభూస్వామ్యం మీద యుద్ధం చేసినప్పుడు- ప్రపంచమంతా తెలంగాణకి జేజేలు పలికింది. భళిరా, నెత్తురోడటంలో నీకు నీవే సాటిరా అని కీర్తించింది. ఐదువేల మరణల త్యాగం, పదివేల గ్రామాల పోరాటం- కాలగర్భంలో కలసిపోయాయి. ప్రతియుద్ధమూ త్యాగంతోనో ద్రోహంతోనో ముగుస్తుం ది. వైకుంఠపాళిలో పదేపదే పాము కరుస్తుంది.

అయినా పట్టువదలని విక్రమార్కుడు కళేబరాన్ని తిరిగి భుజాన వేసుకుంటాడు. 1969 వస్తుంది. 1978 వస్తుంది. మరో మూడుదశాబ్దాలు కోటగుమ్మాలకు తెలంగాణ కళేబరాలే వేలాడతాయి. అయినా బుద్ధి రాదు. ఓటమి జీర్ణంకాదు. ఏదీ రాదని అనుభవం చెబుతున్నా ఏదో ఒకటి కావాలి. అందుకోసం గొంతెత్తాలి. బతుకు కోసం చావాలి. తెలంగాణకు వర్తమానం మరోశాపం. నాయకుడు ఎదిగితే వాడొక భూస్వామి. ఎదగబోయే యువకుడైతే వాడొక నక్సలైట్. నాయకులు లేని తెలంగాణ ప్రజలం టే అందరికీ ఎంత ప్రేమో! ఎంతటి అద్భుతమైన ప్రజలు! ఎంతటి అల్పమైన నేతలు! మొండివారో గట్టివారో అమాయకులో అజ్ఞానులో ఎంతటి గొప్ప ప్రజలు! తెలుగువారంతా కీర్తించిన సాహసం, ప్రపంచమంతా గుర్తించిన పోరాటం- ఈ భుజకీర్తులకు మురిసిోయింది తెలంగాణ.

అటువంటి ప్రజ- తమకు నాయకత్వం వహించమని తమంతట తాము ప్రాధేయపడుతుంటే, అర్థిస్తుంటే - మీరే దిక్కు, అధికార పీఠం మీద మీరే కూర్చోండి అని నచ్చచెబుతుంటే- అధిష్ఠానాల పంచనలో, ఆత్మవంచనలో భద్రతను వెదుక్కోవడం ఎంత దయనీయం? నాయకులం అయ్యే అర్హత తమకు లేదని, ఎప్పుడూ ద్వితీయశ్రేణిలో మగ్గిపోతూ కాసిని విదిలింపులతో సంతృప్తి చెందుతామని ఇంత బాహాటంగా అంగీకరించడం ఎంత విషాదం? సిరిపురం యాదయ్య అనాథ. తెలంగాణ లాగే. తెలంగాణకు నాథుడు లేదు. నాయకుడు లేడు. కొంచెం న మ్మకమిచ్చేవాడు లేడు. రాజీనామాలు చేయకపోతే మానె రాజీపడకుండా ఉంటానని చెప్పగలిగే మనిషి లేడు. అనాథల హృదయాలపై ముసురుకుంటున్న నిరాశల మబ్బులను చెదరగొట్టే నేత లేడు.

బహుశా తెలంగాణకు కొత్త నాయకత్వం కావాలి. ప్రత్యేకరాష్ట్రం కోసమనే కాదు, భవిష్యత్తు కోసం కావాలి. మునగచెట్టెక్కించి కిందపడేసే వారు కాక, నేల మీద కాళ్లు నిిపే మార్గదర్శులు కావాలి. అనాథులంతా అశాంతులంతా తమ ను తామే నడిపించుకోవాలి. భ్రమలకూ ప్రగల్భాలకూ బలికాకుండా వివేకానికి విజ్ఞతకు విలువ ఇవ్వాలి. యోగ్యత లేని మనుషుల ద్రోహాలకు కలవరపడడం మానుకోవాలి. విలువైన ప్రాణాలను వృధా చేయడం విరమించాలి.

3 comments:

 1. హ్మ్మ్..ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఈ వ్యాసం నన్ను చాలా బాధ పెట్టింది. నేను తెలంగాణ లో పుట్టి, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణాకి మంచిది కాదని నమ్ముతున్న వ్యక్తిని. అయినా కూడా, నాకు ఇది చదివిన తరవాత ఎందుకో మనసు కొంచెం వ్యాకులం చెందింది.

  మీరన్నట్లు నిజంగానే "బ్రిటిష్ సామ్రాజ్యం తెలంగాణను కూడా కలుపుకుని ఉంటే పీడాపోయేది". కొంచెం లౌక్యం, కొంచెం వ్యవహారం, కొంచెం రాజకీయం ఇక్కడా అబ్బి ఉండేవి. అదేమి ఖర్మమో, మొదటి నుంచీ పోరాటపు ఆరాటమే.

  మిగతా చోట్ల కొన్ని కొన్ని వ్యాక్యాలు గుండె కలుక్కు మనేలా చేసాయి. తెలంగాణ కుగ్రామాల్లో పెరగడమంటే ఏమిటో అది నేను వ్యక్త పరచలేను. అంతా రాసే ఓపిక లేదు కాని, చాలా సంవత్సరాల నుంచీ నా బాల్యానికీ, నా ఫ్రెండ్స్ ఇతరత్రా చెప్పే బాల్యానికీ అసలు పొంతనే లేదు. నేనేదో వెరే దేశంలోనో, వెరే సంస్క్రుతి లోనో పెరిగాను అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంతటితో ఆపేస్తాను.

  కాని ఒక్కటి మాత్రం ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతపు చాలా మంది, అంతగా గుర్తిచనిదేంటంటే, కొన్ని చోట్ల సటిల్ గానూ, మరికొన్ని చోట్ల అంత సటిల్ గా కాకుండానూ, వాళ్ళు చూపించే సుపిరీయర్, హై రోడ్ ఆటిట్యూడే, చాలా వరకి, ఈ రెబెల్ ఆటిట్యూడ్ కి ఫ్యూయల్ ని ఆడ్ చేస్తోందని.

  మొన్నెక్కడో పార్టీలో ఉంటే, దూరంగా ఒక అమ్మాయి మాటలు వినపడ్డాయి. "తెలంగాణలో అసలు మిడిల్ క్లాసే ఉండదంటండీ, అ లాట్ ఆఫ్ ఎక్స్ట్రీం పూర్, అండ్ లిమిటెడ్ రిచ్ పీపుల్ మాత్రమే ఉంటారంట" అని :-).

  భగవంతుడా. నా ఈ ఆడవాళ్ళని రక్షించు అనుకున్నా.

  ReplyDelete
 2. శ్రీనివాస్ గారు బాగా రాశారు. చివర్లో తెలంగాణకు కొత్త నాయకత్వం కావాలన్నారు. తెలంగాణకే కాదు. అన్ని స్థాయిల్లో నిబద్ధత గల నాయకత్వం కావాలి.. అది దేశాన్ని సర్వతోముఖాభివ్రుద్ధి వైపు నడిపించాలి. అలాంటి నాయకులు లేకే ఇప్పడు ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు.

  ReplyDelete
 3. శ్రీనివాస్ గారు...
  చాలా బాగా వివరించారు.

  "ప్రతియుద్ధమూ త్యాగంతోనో ద్రోహంతోనో ముగుస్తుంది" కానీ గతంలో తెలంగాణ పోరాటాలు మాత్రం ప్రతిసారీ ద్రోహంతోనే ముగిసాయి. మరి ఈ సారి ఎలాంటి ముగుంపు వస్తుందో?

  ReplyDelete