Saturday, February 27, 2010

ప్రేమ

రొండు హృదయాలు ఒకే పన్‌థాన పయనించుట ప్రేమ అట. ముళ్లపూడివాడు చెప్పాడు.
లోకం దారికి హైజాక్‌ కావడమే ప్రేమ.
దేవుని వలెనే ప్రేమయు లేదు అంటాడు సౌదా.
లేదు లేదు లేదు, లేదా?

***

పార్వతి దేవదాసు పెళ్లి జరిగితే ఏమయ్యేదిట?
సి ఎస్సార్‌ ఇంట్లో కాక సావిత్రి  ఏ ఎన్నార్‌ ఇంట్లో అంట్లు తోమేదిట!
మల్లీశ్వరీ నాగరాజూ కూడా అంటే. కోతికొమ్మచ్చులు మానేసి పిల్లల్ని కన్నారట అంతే.

పెళ్జి జరిగితే అంతే. దే లివ్‌డ్‌ హేపీలీ ఎవరాఫ్టర్‌- సుఖంగా జీవించి పారేస్తారు.

***

ప్రేమ అంటే వొకళ్లకోసం వొకళ్లు ఏడవడం, వొకళ్ల పిల్లల్నివొకళ్లు కనడం, వొకళ్ల బరువును వొకళ్లు మోయడం, వొకళ్ల సాన్నిధ్యాన్ని మరొకరు కలవరించడం.
ప్రేమ అంటే వొకళ్లనొకళ్లు ఏడిపించడం, పిల్లల్ని పెంచలేక ఇద్దరూ ఏడ్వడం, వొకళ్లకొకళ్లు బరువుకావడం, వొకరినుంచి వొకరు విడిపోవడం.
ప్రేమ అంటే వొకరినొకరు సంపూర్ణంగా కోరుకోవడం, వొకరితో మరొకరు సంపూర్ణం కావడం, వొకరిపైవొకరు వసంతం చల్లుకోవడం, వొకరికొకరు నిఘంటువు కావడం.

ప్రేమ అంటే వొకరిని మరొకరు నిశ్శేషం చేయడం, పిల్లిలో ఎలక ఐక్యం కావడం, వొకరినొకరు అపార్థంచేసుకోవడం, వొకరిపై వొకరు బురద చిందించడం, వొకరికొకరు నారికేళపాకం కావడం

***

తిలక్‌ తిలక్‌ నువ్వు బాగా చెప్తావు బద్ధవైరం లాంటి ప్రేమగురించి
పురాణాలూ పురాణాలూ మీరు బాగా చెప్పారు కత్తిగట్టి జయవిజయులు సాధించిన సాయుజ్యం గురించి
రాత్రి చీకటి బ్రాకెట్‌ మరీ ఇరుకవుతుందని రఘునాథం బలే అన్నావు!

***

పెళ్లిలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రేమల గురించి చెప్పడం లేదు; అసలు ప్రేమే ఒక ఆత్మహత్య.
పెళ్లి తప్పనేవాళ్లు, కుటుంబాలు తప్పనేవాళ్లు కూడా ప్రేమ కరెక్టంటారు. వొకళ్లకళ్లలోకి వొకళ్లు పాతాళాల లోతు చూడాలంటారు. వొకరి మనసులకు మరొకరు ఊకొట్టాలంటారు. వొకరి నిద్రలకు మరొకరు జోకొట్టాలంటారు.  ఒకరి విజయగాథలకు మరొకరు జైకొట్టాలంటారు. రాత్రిళ్లు 'ప్రేమేసి' కావులించుకుంటే 'భయపడ్డావా' అని అడక్కుండా మరింతగా హత్తుకుంటే రాజేశ్వరి అమీర్‌తో లేచిపోయేది కాదంటారు. భావుకత్వం వొండుకుని, కంపానియన్‌షిప్‌ను వొడ్డించుకుంటే ప్రేమ భుక్తాయాసంతో త్రేన్చవచ్చునంటారు.

భక్తీ, మూఢభక్తీ లేనట్టే మంచి ప్రేమా, చెడ్డప్రేమా కూడా లేవు.
భగ్నప్రేమికుల విషాద యోగం ఒక ఆత్మవంచనా భ్రమ.
విజయప్రేమికుల  ఉత్సాహం ఒక పరవంచనాభ్రమ.

***

కుటుంబం కూడా ఒక మతం అంటాడు సౌదా.
ఆ మతంలో దేవుడు ప్రేమే.
పెళ్లి వంటి యజ్ఞయాగాదులు చేసినా, శుద్ధప్రేమవాదం వంటి మధురభక్తిని ఆశ్రయించినా మతం మతమే
.


( ఇది చాలా పాత కాలమ్. 1992  లో ఆంధ్ర జ్యోతి  ఆదివారం అనుబంధంలో రాసిన 'సింగిల్ కాలమ్' లో ఇది ఒక వారం రచన.)

1 comment:

  1. శ్రీనివాస్,

    “ప్రేమ అంటే వొకరినొకరు సంపూర్ణంగా కోరుకోవడం, వొకరితో మరొకరు సంపూర్ణం కావడం, వొకరిపైవొకరు వసంతం చల్లుకోవడం, వొకరికొకరు నిఘంటువు కావడం”
    నిజాల్ని సున్నితం గా భావుకత తో చెప్పటం లో ఒక కనిపించని అందముంటుంది. అది ఇందులో కనిపిస్తోంది.
    . మీ కామెంట్ బాక్స్ లో ఏదో సమస్య వుంది. ఒక కామెంట్ పెట్టడానికి ఎన్నో సార్లు ప్రయత్నించాల్సి వస్తోంది. దాని సంగతి కాస్త చూడకూడదా?

    ReplyDelete