Tuesday, March 2, 2010

ఇది మంచిది కాదు

ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ ఇకపై భారతీయ సంతతికి చెందినవాడిగా తప్ప, భారతీయుడిగా ఉండబోవడం లేదనే వార్త లౌకిక, ప్రజాస్వామికవాదులందరినీ కలచివేసింది. ఆయన చిత్రాలపై సుమారు దశాబ్దంన్నరగా సాగుతున్న వివాదాలేమైనప్పటికీ, 95 సంవత్సరాల పండువయస్సులో ఆయన దేశంకానిదేశంలో తలదాచుకోవలసి రావ డం, చివరకు ఖతార్ అనే చిన్నదేశంలో పౌరసత్వం పొంది శాశ్వతంగా మాతృదేశంనుంచి వేరుకావలసి రావడం సామాన్య భారతీయులకు కూడా బాధ కలిగిస్తున్నవిషయం. పైగా, అంతర్జాతీయంగా భారతదేశానికి ఇది అప్రదిష్టను కలిగించిన పరిణామం.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌కు ప్రత్యేకమైన గుర్తిం పు ఉన్నది. ఆంతరంగికంగా ఎన్ని సమస్యలున్నా, అణచివేతలు, సంక్షోభాలు, ఘర్షణలూ ఉన్నా- అంతర్జాతీయ పటం మీద మాత్రం భారత్‌ది తలెతతుకుని నిలుచున్న చరిత్ర. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో జాతివిముక్తి పోరాటాలన్నిటికీ బాసటగా నిలబడి నెల్సన్ మండేలా, యాసర్ అరాఫత్, ఫిడెల్ కాష్ట్రో వంటి నేతల ప్రశంసలు పొందిన దేశం మనది. చైనా అభ్యంతరాలను లెక్కచేయకుం డా, టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న దలైలామాకు భారత్ ఆశ్రయమిచ్చింది. సోవియట్ యూనియన్‌తో సన్నిహిత మైత్రి నెరిపిన కాలంలో నే, స్టాలిన్ కుమార్తె స్వెత్లానా అమెరికా లో ఆశ్రయం పొందడం కోసం భారత్ నే మజిలీగా చేసుకున్నప్పటికీ, అందుకు అనుమతించింది. పాలస్తీనా ప్రవాస
ప్రభుత్వానికి గుర్తింపునిచ్చి ఆదరించింది. వర్ణవివక్షను వ్యతిరేకిస్తూ, దక్షిణాఫ్రికాతో సంబంధాలను నిరాకరించింది. ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు, నిరాదరణకు గురిఅయిన వారికి భారత్ ఒక విశ్వసనీయమైన ఆశ్రయంగా పరిగణ న పొందింది.  ఇటువంటి దేశంలో ఒక చిత్రకారుడు బతకలేక పరాయిదేశం వెళ్లవలస రావడం చారిత్రక విషాదం. భారతదేశంలోని ప్రఖ్యాత చిత్రకారులందరూ ఆయన పక్షాన వాదించినా, ప్రజాస్వామ్యవాదులు ఆయన స్వేచ్ఛను సమర్థించినా, అవేవీ ఆయనకు ఆయన చిత్రాలకు భౌతికమయిన రక్షణ కల్పించలేకపోయాయి. వివాదాస్పదమైన చిత్రాల గురించి, హుస్సేన్ వివరణ మీద కూడా సరిఅయిన, సహనంతో వివేకంతో కూడిన కళావిమర్శ కూడా జరగలేదు.

స్వేచ్ఛాస్వాతంత్య్రాల విషయంలో భారత్ కట్టుబాటు సడలుతూ రావడం హుస్సేన్ ఉదంతంతో ఒక పరాకాష్ఠకు చేరి ఉండవచ్చును కానీ, ఇటువంటి సంఘటనల పరంపరలో ఇదే మొదటిది కాదు. సాల్మన్ రష్దీ భారతీయ సంతతివాడైనప్పటికీ, బ్రిటిష్ పౌరుడైనందున ఆయన విషయంలో భారత్ తీసుకు న్న వైఖరిపై పెద్దగా విమర్శలు రాలేదు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్‌కు స్వదేశంలో ప్రమాదం ఉన్నప్పుడు- భారత్ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. దానికి భారత్‌లోని ముస్లిమ్ మైనారిటీలు అభ్యంతరం చెబుతూ వచ్చారు. హైదరాబాద్‌లో జరిగినటువంటి చేదు అనుభవాలు ఆమెకు భారత్‌లోని వివిధ ప్రాంతాలలో ఎదురయ్యాయి. దే శం వదలివెళ్లమని ఆమెకు నేరుగా చెప్పనప్పటికీ, వెళ్లవలసిన పరిస్థితులైతే వచ్చాయి. 'భారతదేశంలోనే నాకు రక్షణ, ఆశ్ర యం లేకపోతే, ప్రపంచంలో మరెక్కడ నేను తలదాచుకోవాలి?' అని ఆమె ఆవేదన చెందారు కూడా. తస్లీమా రచనలను భారత్‌లోని హిందూత్వ వాదు లు ప్రశంసించి తలకెత్తుకోవడం, ముస్లిములలో మరింత ఆగ్రహానికి అసహనానికి కారణమైంది. తాజాగా కర్ణాటకలో జరుగుతున్న హింసాకాండ- తస్లీ మా తాజా రచనలోని కొన్ని భాగాలను ఒక పత్రిక ముద్రించినందువల్లనే అని తెలుస్తోంది.

మతతత్వంతో సంబంధంలేని హేతువాదులు, లౌకికవాదులు కూడా భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన వివాదంలో చిక్కుకోవడం మరో విచిత్ర పరిస్థితి. ఖమ్మంలో క్రాంతికార్ అనే రచయిత ప్రచురించిన ఒక ఇంగ్లీషు పుస్త కం ముస్లిం మైనారిటీలలో ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా, క్రాంతికార్‌తో పాటు, ఆయనకు సహకరించారనే అభియోగంపై ప్రముఖ హేతువాది, సీనియర్ పాత్రికేయుడు నరిశెట్టి ఇన్నయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. క్రాంతికార్ గతంలో వామపక్ష ఉద్యమాలలో పాల్గొన్నవారు. తరువాత హేతువాద, నాస్తిక ఉద్యమాలలో చురుకుగా పనిచేస్తున్నారు. అరెస్టయినవారెవరూ మతతత్వవాదులు కారు. ఆ ప్రచురణ వల్ల కలత చెందిన వారికి, ఆయన ద్వారా వివరణ ఇప్పించడం కానీ, ఉభయులనూ చర్చకు ఒప్పించడం ద్వారా కానీ సమస్యను పరిష్కరించవలసింది పోయి, పోలీసులు తీవ్రమైన చర్య తీసుకున్నారు. ప్రగతిశీల ఉద్యమాలకు, భావాలకు గుమ్మం వంటి ఖమ్మంలో సైతం- ఈ ప్రగతిశీల హేతువాదుల అరెస్టులపై మౌనరాగమే వినిపించడం ఆశ్చర్యకరమైన విషాదం.

ఒకరు ఒక రచయితను, మరొకరు మరో రచయితను నిషేధించడమో, ప్రవాసంలోకో నిర్బంధంలోకో పంపడమో చేస్తూ పోతే- చివరకు సమాజంలో భావప్రకటనే ఉండదు. ఎవరికి వారు ఏకపక్షంగా చేసే ఆదేశాలూ నిర్ధారణలే తప్ప చర్చకు అవకాశమే ఉండదు. హుస్సేన్ వంటి ప్రఖ్యాత చిత్రకారుడిని దేశం ఇప్పటికే కోల్పోయింది. క్రీడాస్ఫూర్తిని ప్రతిఫలించే ఒక్క మాట మాట్లాడినందుకు షారూఖ్ ఖాన్‌వంటి జనాదరణ పొందిన నటుడు అష్టకష్టాలు పడవలసి వచ్చిం ది. అటువంటి సంఘటనలు జరగకూడదని మనం మనసావాచా కోరుకుంటే- అందుకు కావలసింది ప్రజాస్వామిక వాతావరణమని, పరస్పర సహనమని మరువ కూడదు. ఒకరి అభిప్రాయం పట్ల మరొకరు సహనం చూపితేనే ప్రజాస్వామ్యానికి అర్థం. ఇతరుల అభిప్రాయాన్ని మన్నిస్తేనే మన అభిప్రాయానికి కూడా రక్షణా మన్ననా దొరుకుతాయి. భారతదేశంలో నెలకొన్న వాతావరణం కారణంగా, కొద్దిపాటి విమర్శను కూడా భయంగా శత్రుపూరితంగా చూసే పరిస్థితి మైనారిటీలకు ఉండవచ్చును. ప్రజాస్వామిక వాతావరణం, సహన సంస్కృ తి అవసరం కూడా వారికే ఎక్కువ అన్నది కూడా వాస్తవం.

భావప్రకటనాస్వేచ్ఛ అంటే ఎవరైనా ఏదైనా రాయవచ్చునని కాదు. కానీ, రచనారంగంలో ఉన్నవారిని కట్టడి చేయడానికి మంచి మార్గంలో పెట్టడానికి రచనారంగానికి సంబంధించిన పోరాటరూపాలనే ఎంచుకోవాలి. విమర్శను విమర్శతో ఎదుర్కొనాలి. రచయితలు కూడా సందర్భాన్ని గుర్తెరిగి, సున్నితత్వాలను పరిగణనలోనికి తీసుకుని వ్యవహరించాలి. ఎవరైనా హద్దు మీరిన ట్టు భావిస్తే, దాన్ని అదే పాఠకుల మధ్య ఎంతటి తీవ్రమైన విమర్శ ద్వారానైనా పూర్వపక్షం చేయవచ్చు. ఆరోగ్యకరమైన, పరిణతి చెందిన ప్రజాస్వా మ్యం లక్షణం అది.

7 comments:

 1. meeru cheppina vaarito hussain ni polika cheyalememo ani naa abhipraayamu.
  nenu Hussain gurinchi ento chadivaanu...
  aayana manchi chitrakaarudu ayi undavachhu..
  atanni chooste naaku Sarfarosh lo Nasiruddin Shah vesina character gurtostundi.
  aayana migata vaari manobhavaalani kinchaparichadu.. ippatike vini untaaru... praacheena dharmamu ( Hindutvamu ) anusarinche vaari devatalanu nagnamuga, asabhyamuga chitreekarinchaadu..

  Gullalo, nagnam ga untayi kadaaa anochhu... kaani, prastutam maarutunna kaalaaniki anugunam gaa, devullu ante oka rakamaina ooha undi andarikkeee. vaatini kinchaparichevaallu.. manchidi kaadu
  aayana anduku eppudaina kshamaapana korinattu nenu choodaledu

  ReplyDelete
 2. How come India became unsafe all of a sudden for someone who lived here for so long?

  If you ask me, its slap in the face of country and we foolishly are wasting our time talking and thinking about him.

  ReplyDelete
 3. ప్రవాస దుఃఖితుడు
  http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=48419&Categoryid=1&subcatid=17

  ReplyDelete
 4. >>మాతృదేశంనుంచి వేరుకావలసి రావడం సామాన్య భారతీయులకు కూడా బాధ కలిగిస్తున్నవిషయం.

  నాకు తెలిసిన వాళ్ళెవరూ బాధ పడటం లేదండి.. మీరు తెలుగు బ్లాగులనే ఒక sample గా తీసుకోండి.. ఎవరూ అతని గురించి పట్టించుకోవడం లేదు.. మీడియా ఒవర్ ఆక్షన్ తప్ప ఆ జీవి అంత సీన్ లేదు..
  అతనికి అంత మంచి ఉద్దేశ్యం ఉంటే ఇప్పుడు హిందువులకు ఎందుకు క్షమాపణ చెప్పడు?? మన వల్ల కొందరు బాధ పడ్డారు అని తెలిసినప్పుడు.. ఆ communication gap fill cheyyadam పద్దతి కాదా?? అలా చెయ్యకుండా నేను లండన్ పోతాను, కతార్ పోతాను.. అనడం దగుల్బాచి తనం తప్ప మరేం కాదు..

  having said so, I want him to be brought to India and let justice be done upon him as per IPC.

  -Karthik

  ReplyDelete
 5. భారతదేశంలో ఉంటూ అధిక సంఖ్యాకులైన హిందువుల దేవతలను నగ్నంగా చిత్రించి తన నగ్నత్వాన్ని బయటపెట్టిన ఈ తొంభై ఐదేళ్ళ ముసలివాని గురించి మీరు అంతగా చింతించనవసరం ఉందనుకుంటున్నారా?

  ReplyDelete
 6. నేను నా వ్యాసంలో ఎమ్‌.ఎఫ్‌. హుస్సేన్‌ వేసిన చిత్రాల మంచిచెడ్డలను, ఆయన మీద ఉన్న వివాదాన్ని స్పృశించలేదు. అది వేరేచర్చ. కాకపోతే, కళాకారుడు బాధ్యతాయుతంగా ఉండాలని అంగీకరిస్తాను. అదేసమయంలో, భావప్రకటనాస్వేచ్ఛ బేషరతుగా ఉండాలని కూడా విశ్వసిస్తాను. ఒక కళాకారుడు కానీ, రచయిత కానీ సవ్యంగా ప్రవర్తిస్తున్నారా లేదా అన్న దానికి అనేక సమాధానాలు వచ్చే అవకాశమున్న సమాజం మనది. ఏ ఒక్క చిన్న వర్గం అభ్యంతరం చెప్పినా, అది భావప్రకటన స్వేచ్ఛకు భౌతికమైన నిర్బంధంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. కాబట్టి, కళా, సాహిత్య, భావ రంగాలలో అభ్యంతరాలను ఆయా రంగాలలో అందుబాటులో ఉన్న పద్ధతుల ద్వారానే ఎదుర్కొనాలి తప్ప భౌతిర దాడులరూపంలో, బహిష్కరణల రూపంలో కాదని అనుకుంటున్నాను. హుస్సేన్‌ విషయంలో జరిగింది సబబనుకుంటే,తస్లీమా విషయంలో జరిగింది సబబనుకునే వారుంటారు. ప్రముఖ హేతువాది, పాత్రికేయుడు అకారణంగా జైలుపాలవ్వడం, సభ్యసమాజం దానిమీద స్పందించే పరిస్థితి లేకపోవడం- సమాజంలో పెరుగుతున్న అసహనానికి గుర్తులు. వ్యాసంలోని అంశాలను సీరియస్‌గా తీసుకుని స్పందించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు.

  ReplyDelete