Sunday, March 7, 2010

విప్లవానికి డెడ్‌లైన్

edit."భారతదేశంలోని ఏ పల్లెకైనా వెళ్లండి, ఒక రైతు కూలీని, చిన్న రైతును గుసగుసగా అడగండి, ఏం చేద్దామని- మీకు వచ్చే సమాధానం ఒకటే, భూస్వామిని ఖత మ్ చేద్దాం''- స్వాతంత్య్రానంతరం దేశంలో కొత్త తరం విప్లవ రాజకీయాలకు ఆద్యుడై న చారు మజుందార్ అన్న మాటలవి. గ్రామీణ భారతమంతా భూస్వామ్య పీడనలో నలిగిపోతూ, విముక్తి కోసం పరితపిస్తోందని, ఆ ఆకాంక్షను అందుకుంటే చాలు విప్ల వం మూలమలుపులో ఉన్నట్టేనని ఆయన బలంగా నమ్మారు.

నక్సల్బరీ వసంత మేఘ గర్జన 1967లో ఆరంభమై బెంగాల్‌లో మారుమోగి, శ్రీకాకుళంలో ప్రతిధ్వనించినప్పు డు ఆయన 1975 నాటికి భారతవిప్లవం పూర్తవుతుందని విశ్వసించారు, పదే పదే తన రచనలలో ఆ ఆశాభావాన్నే ప్రకటించారు. నక్సల్బరీ, శ్రీకాకుళం రెండూ 1971 నాటికి తీవ్ర నిర్బంధంలో అణగిపోయాయి. విప్లవం వస్తుందనుకున్న సంవత్సరానికి ఎమర్జె న్సీ వచ్చింది.   చారుమజుందారే 1975 దాకా జీవించలేదు. విప్లవానికి సారధ్యం వహించాలనుకున్న సిపిఐఎంఎల్ ముక్కచెక్కలైంది. ఇంకా అక్కడక్కడా మిగిలిపోయిన సాయుధ బృందాలు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ఇక అంతా ముగిసిపోయిందనే పాలకులు భావించారు.

కానీ, ముగిసిపోలేదు. 1980లో కె.ఎ. అబ్బాస్ తీసిన 'నక్సలైట్స్' సినిమా ముగింపులో పెద్ద ఎన్‌కౌంటర్ తరువాత అంతా సమసిపోయిందనుకుని పోలీస్ అధికారి 'అబ్ కోయీ నక్సల్‌వాదీ జిందా హై' అని మెగాఫోన్‌లో అరుస్తుంటాడు. గూడెంలో నుంచి ఒక గిరిజన బాలుడు విల్లంబులు పట్టుకుని చేతులు ఎత్తుతాడు.  ఏమంత గొప్పగా లేని ఆ
సినిమాలో ఆ ఒక్క ఆశావహ దృశ్యమే ఆకట్టుకుంటుంది. నిజంగానే నక్సలైట్ ద్య మం ముగిసిపోలేదు. మళ్లీ మొదలయింది. విప్లవ గీతంలో కవితాత్మకంగా చెప్పిన మాట 'తిరిగి తిరిగొస్తుంది నక్సల్బరీ' నిజంగానే నిజమైంది.చారు మజుందార్ తరువా త మళ్లీ ఏ విప్లవ నాయకుడూ విప్లవానికి ఒక లక్ష్య సంవత్సరాన్ని నిర్ణయించలేదు. సుదీర్ఘకాలం జరుగుతూ ఉండవలసిన ఆచరణేనని విశ్వసిస్తూ వచ్చారు.

కేంద్రహోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె. పిళ్లై ఇప్పుడు ఆ సాహసం చేశారు. 2050 కి కానీ, 2060కి కానీ భారతదేశంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఒక టైమ్ టేబుల్ ఆవిష్కరించారు. ఈ ఏడూ వచ్చే ఏడూ హింస పెరిగే అవకాశం ఉన్నదని, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో పౌరపాలనా వ్యవస్థకు పూర్తి అదుపు రావడానికి మరో దశాబ్దం దాకా పట్టవచ్చునని పిళ్లై చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక సంఘటనలను బట్టి వచ్చే రెండు మూడేళ్లలో ఏమిజరిగే అవకాశమున్నదో చెప్పవచ్చు, ఆదివాసీ ప్రాంతాలు, మారుమూ ల ప్రాంతాల్లో ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ రావడానికి ఎంత కాలం పట్టవచ్చో అనుభవజ్ఞులైన అధికారులు లెక్కలు వేయవచ్చు. కానీ, మావోయిస్టుల టైమ్ టార్గెట్ ఏమి టో పిళ్లై ఎట్లా చెబుతున్నారు? అరెస్టులు, దాడులు జరిగినప్పుడు మావోయిస్టుల దగ్గరనుంచి దొరికిన పత్రాల ఆధారంగా చెబుతున్నానని పిళ్లై అంటున్నారు.  ఆయన లెక్క ఏమిటో కానీ, తమ లక్ష్యసాధనకు ఇంకో నాలుగు దశాబ్దాలు పడుతుందని మావోయిస్టులు బాహాటంగా అంగీకరిస్తారనుకోలేము. పిళ్లై అంచనాలలో కొన్ని వాస్తవికమైనవి కూడా ఉండడం విశేషం. మావోయిస్టులు ప్రాబల్యం వహిస్తున్న ప్రాంతాలలో ప్రభు త్వం పూర్తిస్థాయిలో ప్రవేశించడం ఇప్పట్లో సాధ్యం కాదనేది ఆయన అంగీకరించారు.

ఇప్పటి పరిస్థితిలో మావోయిస్టులదే పైచేయిగా ఉన్నదని, హార్డ్‌కోర్ నక్సల్స్‌లో ఐదుశాతం మందిని కూడా దెబ్బతీయలేకపోయామని, వచ్చే మూడేళ్లలో పట్టు ప్రభుత్వం చేతిలోకి వచ్చి పరిస్థితి తారుమారుకావడం ప్రారంభమవుతుందని పిళ్లై ఊహ. మావోయిస్టులు గెలుస్తారా, ఓడిపోతారా, ఎప్పుడు ఎవరిది పైచేయి అవుతుంది, ఏ భూభాగం ఎవరిచేతిలో ఉంటుంది- వంటి ప్రశ్నలన్నీ సైనిక పరిభాషకు చెందినవి. మావోయిస్టులు కూడా తరచు తమ ప్రసంగాలలో, ఇంటర్వ్యూలలో అటువంటి భాషనే వాడుతుంటారనుకోండి. వ్యూహ ప్రతివ్యూహాల తో, ఆయుధభాషతో నిమిత్తం లేకుండా వెలుపలినుంచి పరిశీలించినప్పుడు- ప్రజాస్వామిక వ్యవస్థలు పూర్తిగా పాదుకొనకపోయినందువల్లనో, లేదా విఫలమయినందునో ఇతర పోరాట మార్గాలు అవతరిస్తాయనేది అందరూ అంగీకరించే సత్యం.

ఉగ్రవాదం విషయం లో పొరుగుదేశం మీదనో, అంతర్జాతీయ కుట్రల మీదనో నెపాన్ని మోపడం జరుగుతున్నది కానీ, 'వామపక్ష తీవ్రవాదం' విషయంలో నిందలు మాత్రమే వేసి చేతులు దులుపుకోవడం ఇంకా పెద్దగా జరగడం లేదు. సామాజిక ఆర్థిక సమస్యగా చూడాలనో, అభివృద్ధిలో అసమానతల వల్లనో, పరిపాలనలో శూన్యం వల్లనో సమస్య తలెత్తుతున్నదన్న అభిప్రాయాలు ఇంకా ప్రబలంగా చెలామణీలో ఉన్నాయి.  అవి పూర్తిగా సరిఅయినవైనవని కాదు కానీ, సమస్యకు సంబంధించిన కార్యకారణాలను గుర్తించే ప్రయత్నమైనా వాటి లో కనిపిస్తుంది. మావోయిస్టులు పనిచేస్తున్న ప్రాంతాల్లో స్థానిక ప్రజల మద్దతు వారికి గణనీయంగా ఉంటున్నది. ఈ యుద్ధంలో సామాన్యుల రక్తం చిందించకుండా, ప్రభు త్వం పట్టు సాధించడం అసాధ్యమైన పరిస్థితిలో దారుణమైన రక్తపాతం జరిగే అవకా శం ఉన్నది. ఇప్పటికే, ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న సంఘటనలు పౌరసమాజాన్ని కలచివేసే విధంగా ఉన్నాయి.

మావోయిస్టులను విమర్శించడానికి కానీ, తప్పుపట్టడానికి కానీ ఆస్కారంలేని విధం గా వారి వ్యవహారసరళి ఉండడం లేదు. పార్లమెంటరీ, బహిరంగ రాజకీయరంగంలో నెలకొని ఉన్న శూన్యం రానురాను పెరుగుతున్నప్పటికీ, సాయుధ కమ్యూనిస్టులు ఇంకా అజ్ఞాత, రహస్య విధానాలనే అనుసరిస్తున్నారు. ఆదివాసీప్రాంతాలలో, ఆధునికపూర్వ ఉత్పత్తి సంబంధాలున్న ప్రాంతాలలో పనిచేసినంత స్థిరంగా, బలంగా- ఇతర ప్రాంతాలలో చేయడానికి వారి పద్ధతులు, ఆలోచనలు అనుగుణంగా ఉండడం లేదు.

అనేక బాధిత ప్రజావర్గాలు ఇతర మార్గాలలో వ్యవస్థను ప్రజాస్వామీకరించడానికి చేస్తు న్న ప్రయత్నాలతో, పోరాటాలతో మావోయిస్టులకు ప్రమేయం ఉండడం లేదు. తీవ్రమైన నిబద్ధత, వ్యవస్థ మీద పూర్తి అవిశ్వాసం ఉన్న వారికి తప్ప - అసంఖ్యాకంగా ఉన్న సాధారణ ప్రజాస్వామికవాదుల కు మావోయిస్టు పార్టీ ఇవ్వగలిగే కార్యక్రమం ఏమీ ఉండడం లేదు. అనేక సందర్భాలలో వారు అనుసరించే నిర్దాక్షిణ్యమైన హింసాయుతమైన విధానాలు జనసామాన్యానికి అంగీకారంగా ఉండడం లేదు.  ప్రజాస్వామ్యం అన్నది నిరర్ధకమైన విధానం అని మావోయిస్టులు విశ్వసిస్తూ ఉండవచ్చును కానీ, తమ జీవితాల్లోకి ఎంతో కొంత ప్రజాస్వామ్యం- ఓట్ల రూపంలోనో ప్రాతినిధ్యం రూపంలోనో వస్తున్నప్పుడు ఆ మార్పుల విషయంలో సానుకూలంగా ఆశావహంగా ఉంటున్న అట్టడుగు శ్రేణులు మావోయిస్టుల వలె ఇప్పుడప్పుడే నిస్పృహను, నిరాకరణను ఆశ్రయించకపోవచ్చు.

అయితే, మారుమూల, ఆదివాసీ ప్రాంతాలలో పనిచేస్తున్నప్పటి కీ- మావోయిస్టులు గతం కంటె భిన్నమైన పెద్ద పోరాటం చేస్తున్నారని ఒప్పుకోవాలి. గతంలో షావుకారులో, అటవీ అధికారులో గిరిజనులపై చేసే దోపిడీ పీడనలు ఉద్యమాలను రగిలిస్తే- ఇప్పుడు వనరులపై పట్టు కోసం జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికులు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించే పనిలో మావోయిస్టులున్నారు.  అమాయకులైన ఆదివాసీలను, వారికే తెలియని బృహత్ లక్ష్యం కోసం ఆశ్రయంగా, అనుచరులుగా వాడుకోవడం ఎంతవరకు సబబు- అన్న ప్రశ్న తరచు వినిపిస్తుంటుంది కానీ, ఈరోజు మధ్య, తూర్పు, ఉత్తర భారతాల్లో భారత ప్రజానీకానికి అంతటికీ చెందిన ఉమ్మడి వనరుల రక్షణ కోసం గిరిజనులూ వారితో పాటు సాయుధ విప్లవకారులే ప్రయత్నిస్తున్నారన్నది కూడ వాస్తవం.

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమం బలంగా ఉన్న కాలంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని జాతీయ మీడియా, ఇప్పుడు యుద్ధరంగం హిందీ రాష్ట్రాలకు మారింది కాబట్టి పట్టింపు చూపుతోంది. చర్చల ద్వారా సమస్యను, సంక్షోభాన్ని వాయిదా వేయాలనే దృష్టితో మేధావులు, ప్రజాస్వామికవాదులు ఒక ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. ప్రభుత్వం, మావోయిస్టులు కూడా ఆ ప్రతిపాదనకు తమదైన రీతిలో స్పందించారు.

ఎప్పుడో ఒకప్పుడు తాత్కాలికంగా విరామం, కొన్ని చర్చలు జరిగితే జరగవచ్చును కానీ, దీర్ఘకాలికంగా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. మావోయిస్టులు నమ్ముతు న్న విధానం- మారుతున్న భారతీయ సమాజంలో యథాతథంగా ఫలితాలనిస్తుందా లేదా అన్నది ప్రశ్న. సామాజిక పరివర్తనకు హింసాయుతంగా చేసే సైనికపోరాటమే ఏకైక రాజకీయపోరాటమని మావోయిస్టులు విశ్వసిస్తూ ఉండాలని ప్రభుత్వం కూడా ఆశిస్తూ ఉండవచ్చు.

యుద్ధరంగంలో ఎదుర్కొనడమే లాభదాయకమని ప్రభుత్వాలు భావిస్తూ ఉండవచ్చు. భారతీయ సమాజాన్ని ప్రజాస్వామీకరించే కర్తవ్యం నిరంతరమని, అందుకు బహుముఖమైన రంగాలలో ప్రయత్నాలు సాగవలసి ఉన్నదని మావోయిస్టులు గుర్తించాలని కోరుకుంటున్న వారు కూడా దేశంలో గణనీయంగా ఉన్నారు. ఎందుకంటే- "కర్తవ్యనిష్ఠ'' అధికంగా ఉన్నట్టు పిళ్లై స్వయంగా అంగీకరించిన మావోయిస్టుల మీద - వారి పద్ధతులతో, చర్యలతో తీవ్రంగా విభేదించే వారు కూడా ఎంతో కొంత ఆశలు పెట్టుకుని ఉన్నారు.

No comments:

Post a Comment