Saturday, March 13, 2010

ఉత్తరాంధ్ర 'అవతార్'

అద్భుత సాంకేతిక విలువలున్న 'అవతార్' సినిమాకు ఆస్కార్‌లూ, ప్రేక్షకాదరణా లభించడంలో ఆశ్చర్యం లేదు కానీ, ఒక సినిమా హాలీవుడ్‌నుంచి అటువంటి కథతో రావడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదో ఒక సుదూరలోకంలో లభించే విలువైన ఖనిజం కోసం సకల ఆయుధ సంభారాలతో వెళ్లిన మానవులు, మనుషుల్లాగానే ఉండే అక్కడి జీవులను అణచివేసి, వారి 'ఆత్మవృక్షాన్ని' కూల్చివేసి దాని కింద ఉన్న నిక్షేపాన్ని అపహరించాలని ప్రయత్నించడం ఆ సినిమా ఇతివృత్తం.  సాధారణంగా అమెరికాలో నిర్మాణమయిన సినిమాల్లో గ్రహాంతరవాసులు మానవులకు హాని తలపెట్టబోతారు, మనుషులు వారిని తిప్పికొడతారు. కానీ, ఇందులో కథ తిరగబడింది. పైగా, సామ్రాజ్యవాదులు, బహుళజాతి కంపెనీలు అనేక మూడో ప్రపంచదేశాల వనరుల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని స్ఫురింపజేసేట్టు కథనం సాగుతుంది.  ఒక బ్రిటిష్ దాతృత్వ స్వచ్ఛంద సంస్థ 'సర్వైవల్ ఇంటర్నేషనల్' డైరెక్టర్ స్టీఫెన్ కొర్రీ ఈ మధ్య బెంగాల్‌ను సందర్శించినప్పుడు 'అవతార్' కథనూ ఒరిస్సాలో బాక్సైట్ మైనింగ్ ప్రయత్నాలనూ పోల్చి వ్యాఖ్యలు చేశారు. 'అవతార్' ఒక కల్పనా కథ. ఒరి స్సా గిరిజనులు వాస్తవంలో అదే పోరాటాన్ని చేస్తున్నారు- అని ఆయన వ్యాఖ్య.

సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీలన్నీ విశాఖమన్యంలో బాక్సై ట్ చిచ్చు గురించి ప్రస్తావించాయి. బాక్సైట్ తవ్వకాలను జిందాల్ కంపెనీకి అప్పగించడంపై తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఒరిస్సాలో వేదాంత కంపెనీ అయినా, ఆంధ్రలో జిందాల్ అయినా ఆదివాసీల మనుగడకు, పర్యావరణానికీ చేస్తున్న హాని ఒక్కటే. ఇంతకాలం గొప్పగా చెప్పుకుంటున్న అటవీ పరిరక్షణ చట్టాలను, ఆదివాసీ సార్వభౌమిక జీవహక్కులను అత్యంత నిస్సంకోచంగా రకరకాల పద్ధతులలో ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. ఆదివాసీలను ప్రలోభపెడుతున్నాయి, వారిలో వారికి చీలికలు తెస్తున్నాయి. వారితో ఉండి పోరాటానికి నిర్దేశం చేస్తున్నవారిని నిర్మూలిస్తున్నాయి.

'అవతార్' వంటి సందర్భాలు మనదేశంలో కేవలం ఆదివాసీల విషయంలోనే ఎదురుకావడం లేదు. అభివృద్ధి పేరుతో స్థానిక మనుగడలను, ప్రకృతిని ధ్వంసం చేసే పని మైదాన ప్రాంతాలలో కూడా సాగుతున్నది. పరిశ్రమల కోసమని పచ్చనిపంట పొలాలను బలి ఇవ్వడం మన రాష్ట్రమంతటా అదే పనిగా సాగుతున్నది. బహుళజాతి సంస్థలు, బడా పారిశ్రామికులు ప్రారంభించిన ఈ 'ప్రకృతిమేధం' సకలరంగాలకూ విస్తరిస్తున్నది. కోస్తాంధ్ర తీరం పొడవునా తలపెట్టిన 'కారిడార్' అభివృద్ధిని,జీవనోపాధిని ఎంతగా సాధిస్తుందో తెలియదు కానీ, కోట్లాది మంది సాంప్రదాయిక జీవనాధారాలను, అపురూపమైన సహజ పర్యావరణరక్షణలను «ధ్వంసం చేయనున్నాయి. విద్యుదుత్పాదన కంపెనీలు పనిగట్టుకుని ఉత్తరాంధ్రపై దృష్టిసారించడంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తున్నది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, అక్కడ పరిశ్రమల స్థాపన జరగవలసిన అవసరం- అన్నీ వాస్తవమే.   కానీ, అభివృద్ధి పేరుతో వారికి ఇవ్వజూపుతున్నది నిజంగా వారి శ్రేయస్సుకేనా అన్న ప్రశ్న వేసుకోకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాపపడవలసి వస్తుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 17 పవర్ ప్లాంట్‌లు రానున్నాయట. ఇందులో ఒకటి అణువిద్యుత్ కేంద్రం. తక్కిన వాటిలో అత్యధికం థర్మల్ పవర్‌ప్లాంట్లు. ఈ విద్యుత్ విప్లవం తీవ్రమైన విధ్వంసానికి కూడా దారితీయగలదని ఆంధ్రవిశ్వవిద్యాయలం శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు.

శ్రీకాకుళంలో బొగ్గు ఇంధనంగా విద్యుదుత్పాదన ఏమిటని ఆశ్చర్యం కలుగుతుం ది. అవసరమైన బొగ్గులో అధికభాగం ఒరిస్సా నుంచి తెచ్చుకుంటారట. మరి కొంత విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటారట. ఒరిస్సాకు, సముద్రతీరానికి సమీపంలో ఉండడం ఉత్తరాంధ్రకు అనుకూల అంశాలట.   మన రాష్ట్రంలో గ్యాస్ వినియోగ సామ ర్థ్యం తగినంత లేకపోవడం వల్లనే ఇతర ప్రాంతాలకు తరలించవలసి వస్తోందని కెజిబేసిన్ గ్యాస్ ఉత్పాదకులు అంటున్నప్పుడు, కొత్తగా ఏర్పరచే ప్లాంట్స్‌ను గ్యాస్ ఆధారితంగా నిర్మిస్తారని భావిస్తారు. కానీ, కొత్త ప్లాంట్స్‌లో అత్యధిక భాగం బొగ్గుతోనే ఉత్పత్తి చేస్తాయి. ఏ ఇంధనం వాడినా తేడా ఏముంటుంది అంటే- థర్మల్ విద్యుదుత్పాదన వల్ల కలిగే కాలుష్యం చాలా ఎక్కువ.

శ్రీకాకుళం జిల్లాకు గత కొన్ని సంవత్సరాలుగా సంక్రమించిన కొత్త కిరీటం ఒకటి ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడ వలస కూలీలు కనిపించినా వారు అయితే మహబూబ్‌నగర్ జిల్లావారు లేదంటే శ్రీకాకుళం జిల్లావారు. ఇప్పుడు ఈ విద్యుత్‌ప్లాంట్ల వల్ల కానీ, వాటి వల్ల సమకూరే ఇతర అభివృద్ధి వల్ల ఈ వలసలు తగ్గుతాయా అంటే లేదు, మరింతగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.   ఉదాహరణకు సంతబొమ్మాళి మండలం లో రెండు విద్యుత్ ప్లాంట్ల కోసం తంపర భూముల్లో 2,450 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈ తంపర భూములు స్థానికులకు ఎన్నో రకాలుగా జీవనాధారంగా, పర్యావరణానికి అనేక విధాలుగా రక్షణగా ఉంటున్నవి. ఈ భూములపై ఆధారపడి జీవించే మత్స్యకారుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లు వదిలే ఉష్ణజలాలు జలచరాలను చంపేస్తాయి. సమీపంలోని పక్షుల అభయారణ్యంలో వలసపక్షుల రాకడ ఆగిపోతుంది. థర్మల్ ప్లాంట్లు వదిలే బూడిద సమీపంలోని పంటభూములను కలుషితం చేస్తుంది.

ఉద్దానం నడిబొడ్డున ఉన్న సోంపేటలో నిర్మించ తలపెట్టిన భారీ థర్మల్ ప్లాంట్‌ను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిత్తడి నేలల్ని బంజరుభూములుగా ప్రకటించి విద్యుత్ కంపెనీకి ఇవ్వ డం మీద ప్రజలు ప్రభుత్వంమీద ఆగ్రహంగా ఉన్నారు. ఈ చిత్తడినేలల్లో లభించే నీటిమీద 5వేల ఎకరాల వ్యవసాయభూములు ఆధారపడి ఉన్నారు. వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి ఇచ్చేదీ ఈ నేలలే.   ఇక కొవ్వాడ దగ్గర తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి. గతంలో నాగార్జున సాగర్ వద్ద అణువిద్యుత్ కేంద్రం స్థాపించాలని జరిగిన ప్రయత్నాలను ప్రజలు వ్యతిరేకించారు. ప్రపంచంలో కొత్తగా అణువిద్యుత్ కేంద్రాల స్థాపన ఆగిపోయినా, మూడో ప్రపంచదేశాలలో వాటిని విస్తరించాలన్న ప్రయత్నంసాగుతోంది.  భారత్-అమెరికా అణుఒప్పందంలోని వాణిజ్య ఉద్దేశం- భారత్‌కు అణు రియాక్టర్లను విక్రయించడం. ఇంధన సమస్యకు పరిష్కారంగా అణువిద్యుత్‌ను పశ్చిమదేశాలు కొత్తగా ముందుకు తెచ్చాయి. నాగార్జున సాగర్ వద్ద ఎటువంటి అభ్యంతరాలు వచ్చాయో- డామ్ భద్రత వంటివి మినహా- అటువంటి అభ్యంతరా లు శ్రీకాకుళం జిల్లాకూ వర్తిస్తాయి. కానీ, వెనుకబడిన జిల్లాలకు ఒక వరంగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నారు.

అభివృద్ధి, వెనుకబాటు తనం మీద విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై అక్కడి నేతలు గొంతు విప్పుతున్న తరుణంలో- ప్రగతిపేరుతో ఎటువంటి పరిశ్రమలు వస్తున్నాయో సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నది. అభివృద్ధి కార్యక్రమం ఏదైనా సరే కొందరిని నిర్వాసితులను సృష్టిస్తుందని, అందుకు సిద్ధపడాలని వాదించే వారుంటారు. కానీ, లభించే ప్రయోజనానికీ, చెల్లించే మూల్యానికీ పొంతన ఉన్నదా లేదా అని చూసుకోవడం అవసరం. ఎవరు మూల్యంచెల్లిస్తే, ఎవరు ప్రయోజనం పొందుతారు- అని కూడా ప్రశ్నించుకోవాలి

No comments:

Post a Comment