Friday, March 19, 2010

ఎం. ఎఫ్‌. హుస్సేన్‌లోని వైరుధ్యం

'ఇది మంచిది కాదు' అన్న శీర్షికతో ఈ మధ్య రాసిన సంపాదకీయంలో ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ భారత పౌరసత్వాన్ని త్యజించడం మీద వ్యాఖ్యానించాను. ఆయన స్వదేశాన్ని వదిలి వెళ్లవలసి రావడం భారత్‌కు అప్రతిష్ఠాకరమని , ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదని ఆ వ్యాసంలో నేను అభిప్రాయపడ్డాను.  ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ మార్చి 19 తేదీ నాడు రాసిన కాలమ్‌లో ఇదే అంశాన్ని మరో కోణం నుంచి స్పృశించారు. హుస్సేన్‌లోని ద్వంద్వ విలువలను ఎత్తి చూపుతూ, ఆయన ఖతార్‌ దేశాన్ని ఎంచుకోవడంలోని వైరుధ్యాన్ని నిరూపించారు. ఇర్ఫాన్‌ వ్యాసం వల్ల భారతీయ సమాజం మీది నా అసంతృప్తి ఏ మాత్రం తగ్గలేదు. హుస్సేన్‌ మీది గౌరవం మాత్రం తగ్గింది.  ఇర్ఫాన్‌ వ్యాసం ' పౌరసత్వం వదులుకోవడం తగదు' ఇక్కడ చదవండి:

పౌరసత్వం వదులుకోవడం తగదు
మొహమ్మద్‌ ఇర్ఫాన్

ప్రపంచంలో అత్యంత కఠిన రాచరిక వ్యవస్థ కలిగిన రాజ్యాలలో గల్ఫ్ దేశాలు ప్రధానమైనవి. స్వేచ్ఛాయుత వాతావరణం, భావస్వేచ్ఛ అనేది ఇక్కడ మరిచిపోవలసిందే! అందు కే కీలకమైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ.టి.ఓ)లో వర్ధమాన దేశాలకు సంబంధించిన సదస్సును ఖతార్‌లో నిర్వహించడానికి కార ణం ఇక్కడ నిరసన గళం విప్పడానికి అవకాశం ఉండకపోవడమే. అలాంటి దేశాన్ని ప్రఖ్యాత చిత్రకారుడు మగ్బూల్ ఫిదా హుస్సేన్ (ఎం.ఎఫ్.హుస్సేన్) తన దేశంగా ఏరికోరి ఎంపిక చేసుకోవడం విస్మయం కలిగించింది. స్వేచ్ఛ కలిగిన యూరప్ లేదా అమెరికాను కాకుండా గల్ఫ్ బందీఖానాలో ఈ చిత్రకారుడు ఎందుకు వచ్చి పడ్డాడో తెలియదు.

దేశం గర్వించదగ్గ చిత్రకారుడైన హుస్సేన్ గూర్చి పాశ్చత్య దేశాలలోని చిత్రాభిమానులకు తెలిసిన దాంట్లో ఒక్క శాతం కూడా గల్ఫ్ అరబ్బులకు తెలియదు. అసలు హుస్సేన్ తరహా భావాలు కలిగిన వ్యక్తులు లేదా కళాకారులంటే అరబ్బులకు గిట్టదు. అయినప్పటికి ఆయన గత నాలుగేళ్లుగా గల్ఫ్‌లో నివాసముంటున్నారు. ఆయన గీసిన కొన్ని దేవతల బొమ్మలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని 2004లో ఆందోళన మొదలైన కొద్దికాలానికి ఆయన దుబాయికి మకాం మార్చారు.

navya. దుబాయిలో తన కళకు సరైన ఆదరణ లేకపోవడంతో ఆయన ఎక్కువగా ప్యారిస్, లండన్ నగరాలలోని ఆర్ట్ గ్యాలరీలలో తన ప్రదర్శనలు నిర్వహించి తిరిగి దుబాయి వచ్చేవారు. అనతి కాలంలోనే దుబాయిలోని భారతీయ ప్రముఖులలో ఒకరుగా ఎదిగిన హుస్సేన్ భారతీయ కాన్సలేట్ జనరల్ తన నివాసంలో నిర్వహించే అన్ని ముఖ్య విందులలో పాల్గొనేవారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న శశి థరూర్ అధికారంలోకి రాక ముందు దుబాయికి వచ్చిన సందర్భంగా జరిగిన విందులో కూడా హుస్సేన్ పాల్గొన్నారు.

స్వదేశంలో ఆయనపై ఎన్ని కేసులున్నా విదేశాలలో మాత్రం భారతీయ అధికారులతో సహా భారతీయులందరూ ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారు. దుబాయిలో 2007లో ఒకసారి నోవాటెల్ హోటల్‌లో ఆయన ఆర్ట్ గ్యాలరీ షోను ఏర్పా టు చేయడానికి సిద్ధమైనా భారత్‌లోని ఒక హిందూ సంస్థ నుంచి వచ్చిన బెదిరింపు కారణాన భారతీయులైన దాని నిర్వాహకులు షోను రద్దుచేశారు. దుబాయి నుం చి ఆయన కొన్నిసార్లు ఖతార్‌కు వెళ్లారు. అక్కడ
ఖతార్ రాజకుటుంబం పెయింటింగులను ఆదరిస్తున్నట్టు తెలుసుకున్నారు.

ఖతార్ రాజు శేఖ్ హామద్ రెండవ భార్య, 54 ఏళ్ల శేఖా మోజా ఈ పెయింటింగులను అభినందించారు. తాను ఏరికోరి 300 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియానికి ఈ ప్రఖ్యాత చిత్రకారుడు సరైన వ్యక్తి అని ఆమె భావించారు. ఆ తర్వాత ఆయన కొన్ని నెలలుగా దుబాయిని విడిచి దోహా (ఖతార్)కు మకాం మార్చారు. భారత్ తనను మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన కొందరి వద్ద వాపోయారు. కానీ ఎవరూ కూడా ఆయన తన భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటారని అనుమానించలేకపోయారు.
రాజు భార్య సహాయంతో ఖతార్ పౌరసత్వాన్ని పొం దిన ఆయన తన భారతీయ పాస్‌పోర్టును అప్పగించకముందు తన మిత్రుడు హిందూ పత్రిక యజమాని ఎన్. రామ్ ద్వారా తాను ఖతార్ పౌరసత్వం స్వీకరించిన విషయాన్ని వెల్లడించడం వ్యూహాత్మకం. తాను ఏకంగా పాస్‌పోర్టును అప్పగించి (పౌరసత్వం రద్దు చేసుకోవడం) విషయం బహిర్గతమైతే మీడియాలో చర్చనీయాంశం అవుతుందని ఆయన ఈ విధంగా చేశారు. పాస్‌పోర్టు అప్పగింత సమయంలో ఖతార్‌లోని భారతీయ రాయబారి దీపా గోపాలన్ సౌందర్యాన్ని హుస్సేన్ కీర్తించారు.

ఒకవైపు భారతీయ పౌరసత్వాన్ని త్యజిస్తూనే మరోవైపు విదేశాలలోని భారతీయ సంతతికి ఇచ్చే పి.ఐ.ఓ కార్డు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్డు ద్వారా ఆయన వీసా లేకుండా ఎప్పుడంటే అప్పుడు భారతదేశానికి వచ్చి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. భారతీయ న్యాయస్థానాలలో ఉన్న కేసుల సంఖ్య, భద్రతకు భయపడి ఆయ న పౌరసత్వం వదులుకున్నారంటే అది మూర్ఖత్యం. వారెంటు చూపి దేశంలో అడుగుపెట్టిన క్షణమే ఖతార్ జాతీయుడైన హుస్సేన్‌ను అరెస్టు చేసేందుకు భారతీయ అధికారులకు అధికారం ఉంది.

అలాంటప్పుడు పి.ఐ.ఓ కార్డు మినహాయింపు కాదు. తన భద్రతకు సంబంధించి మహారాష్ట్ర సర్కారుపై గుర్రుగా ఉంటే ఆయన కేంద్ర జోక్యం కోరాల్సింది లేదా మరే ఇతర రాష్ట్రానికో వెళ్లవలసింది. దోహాలో అల్ తావూన్ వీధిలో అతి సంపన్న అరబ్బు లు నివసించే ప్రాంతంలో విలాసవంతమైన భవంతిలో నివసిస్తున్న హుస్సేన్ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇస్లాం సంస్కృతి ప్రతిబింబించే పెయింటింగులు దర్శనమివ్వడమే కాకుండా సాక్షాత్తు ఆయన కూడా అరబ్బుల తరహా కద్దురా (తోబ్) దుస్తులను ధరిస్తున్నారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.

మత మనోభావాల విషయంలో ఆంధ్రుడైన సి.పీటర్‌ను దేశం నుంచి బహిష్కరించిన రోజే ఇదే ఆరోపణపై ఉన్న హుస్సేన్‌కు ఖతార్ తమ పౌరసత్వం బహూకరించింది. తనపై అత్యంత ప్రమాదకరమైన కేసులుండి కూడా మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం ఒక దశలో రాంజెఠ్మలానీ ద్వారా భారత్‌కు తిరిగి రావడానికి ప్రయత్నాలు చేశారు. అలాంటి హుస్సేన్ జీవిత చరమాంక దశలో మాతృభూమిని తిరస్కరించవలసింది కాదు. అందునా పద్మ పురస్కారాలతో పాటుగా రాజ్యసభకు నామినేట్ సభ్యునిగా వ్యవహరించిన ఈ పెద్ద మనిషికి ఇది తగదు.

4 comments:

  1. khataar raanilO maadhureedeekshit kanabadi vuntundi. anduke akkada vundipOyuntaadu.eeyanakichchina padma birudulu venakki teesukovali. aa dammunda veellaki..

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారు,వ్యాసం అసంపూర్తిగా ముగిసిందా అని నా అనుమానం.

    ReplyDelete
  3. ఇలాంటి చిత్రాలు గీయమని ముహమ్మదు ప్రవక్త చెప్పలేదు.హుసేన్ తో సహా భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులే.అసలు ఈ దేశంలో పుట్టుక కలగటమే ఎన్నోజన్మల పుణ్యఫలం.ఒకరిమతం జోలికి ఇంకొకరు వెళ్ళకపోవటం ఉత్తమం.ఒక మతస్తులు గౌరవించే ప్రవక్తలను,దేవతలను ఇతర మతస్తులు కూడా గౌరవించాలి.అన్ని మతగ్రంధాలలో హింస ఉంది.ఏ మతమూ హింసకు అతీతం కాదు.బౌద్ధం జైనం తప్ప.పూర్వగ్రంధాలలో హింసను ప్రోత్సహించే వాక్యాలున్నా ఆధునిక సమాజం బాట అహింసే.మానవత్వమే మంచి మతం.

    ReplyDelete