Thursday, March 25, 2010

చట్టం, నీతి

వివాహానికి ముందు శృంగార సంబంధాల విషయంలో, పెళ్లి లేకుండా స్త్రీ పురుషులు కలసి జీవించడం విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నాడు (మార్చ్ 23 , 2010 )  చేసిన కొన్ని వ్యాఖ్యలు సహజంగానే భారతీయ సమాజంలో కలకలం రేపుతున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్‌తో సహా ముగ్గురు న్యాయమూర్తులున్న ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆదేశాలో తుదితీర్పులో అంతర్భాగాలో కావు. వివాహానికి ముందు శృంగార సంబంధాలు కలిగి ఉండడంలో తప్పులేదని అన్నందుకు తమిళ సినీనటి ఖుష్‌బూపై దాఖలయిన క్రిమినల్ కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు అవి. తనపై కేసులను కొట్టివేయాలంటూ కుష్‌బూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తుదితీర్పును న్యాయమూర్తులు రిజర్వ్ చేశారు.

ఎయిడ్స్ గురించిన భావప్రచారంలో భాగంగా 2005లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్‌బూ సురక్షిత శృంగారం అవసరాన్ని చెప్పారు. "అమ్మాయిలు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పేమీ లేదు. అయితే, గర్భం రాకుండా, లైంగిక వ్యాధులు రాకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి'' అని ఆమె వ్యాఖ్యానించారు. అంతే కాదు, చదువుకున్న మగవాడెవరైనా తనకు భార్యగా లేదా ప్రియురాలిగా ఉండేవాళ్లు అంతకుముందు కన్యలుగా ఉండాలని ఆశించడం తగదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ముఖ్యంగా దళిత పాంథర్స్ పార్టీ, పిఎంకె పార్టీలు ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. అనేకమంది ఆమె మీద కేసులు పెట్టారు. ఈ మొత్తం వివాదంలో సినీ పరిశ్రమ నుంచి కానీ, తమిళ సమాజం నుంచి కానీ తనకు మద్దతు పెద్దగా రాకపోయినప్పటికీ, ఖుష్‌బూ తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నారు. వివాదం ఉద్రిక్తతకు దారితీసినప్పటికీ ధైర్యంగా నిలబడ్డారు. తన మీద పెట్టిన కేసుల ఫలితం ఏమైనప్పటికీ, ఖుష్‌బూ ఎదుర్కొన్న చేదుఅనుభవం వృధాగా పోలేదు. అది మరింత విస్త­ృతమైన చర్చగా మరోసారి ముందుకు రానున్నది. సాక్షాత్తూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు- ఆ చర్చకు మరింత ఆమోదం, గౌరవం లభించనున్నది.

పెళ్లికిముందే శృంగారం కానీ, పెళ్లి లేకుండా సహజీవనం కానీ ఎట్లా నేరం అవుతాయి?- అని న్యాయమూర్తులు న్యాయవాదులను అడిగారంటే అర్థం చట్టం ఏమి చెబుతోందో వివరించమని మాత్రమే. చట్టప్రకారం అవి నేరాలు కావనే ధ్వని అందులో
ఉన్నమాట నిజమే. ఇక్కడ 'నేరం' అన్న మాటను న్యాయపరిభాషలోనే తీసుకోవాలి. సమాజంలో నిషిద్ధమైన అంశాలు, ఆమోదం లేని అంశాలు, ఆంక్షలున్న అంశాలు చాలా ఉంటాయి. వాటిని పాపం అనో, అధర్మం అనో, తప్పు అనో చెప్పవచ్చు. కానీ, చట్టపరిభాషలో ఆ మాటలకు విలువ ఉండదు. అక్కడ 'నేరం' అన్న మాటే చెల్లుతుంది. నేరం అంటే, చట్టం అక్రమమని నిర్వచించిన చర్య మాత్రమే.   భారత దేశంలోఅమలులో ఉన్న ఏ చట్టమూ సమ్మతితో కూడిన శృంగార సంబంధాలను నేరంగా పరిగణించడం లేదు. సెక్స్ వర్కర్స్ విషయంలో కూడా అవినీతికర కార్యకలాపాల నిరోధం పేరుతో అస్పష్టమైన చట్టాన్ని ఆశ్రయించి మాత్రమే కేసులు పెడుతున్నారు. పెళ్లి, బహుభార్యత్వం, దత్తత, వారసత్వం, విడాకులు, ఆస్తిపంపకాలు- వంటి అంశాల్లో మాత్రమే చట్టం ప్రమేయం ఉంటుంది, ఆయా అంశాల్లో సమస్యలను పరిష్కరించడానికి వివాహచట్టాలు కానీ, పర్సనల్ లా కానీ ఉన్నాయి. విడాకుల కేసుల్లో భార్యో భర్తో వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం ఒక కారణంగా పేర్కొనవచ్చు. తన భార్యతో సంబంధం పెట్టుకున్న మరో మగవాడిని నేరస్థుడిగా భర్త కేసు పెట్టవచ్చును కానీ, అందులో కూడా స్త్రీ నేరస్థురాలు కాదు. వయోజనులైన స్త్రీ పురుషులు ఎటువంటి వివాహ బంధం లేకుండా పూర్తి పరస్పర సమ్మతితో శృంగార సంబంధం కలిగి ఉంటే దాన్ని నేరంగా భారతదేశ చట్టాలు పరిగణించవు.

ఈ అవగాహన లేకుండా- వివాహేతర సంబంధాలు చట్టవ్యతిరేక సంబంధాలుగా చాలా మంది పొరబడుతుంటారు. అటువంటి వారికి చట్టాన్ని గుర్తు చేయడానికే న్యాయమూర్తులు ఆ ప్రశ్నలు వేసి ఉంటారు. వయోజనులైన స్త్రీ పురుషులు కలసి జీవించడాన్ని చట్టం ఎక్కడా నిషేధించలేదు. న్యాయమూర్తుల ప్రశ్నలు, వ్యాఖ్యలు- చట్టం తెలిసినవారిని ఆశ్చర్యపరిచే అవకాశం లేదు. సమాజంలో బలంగా ఉన్న విలువలనే చట్టంగా భ్రమించేవారికి మాత్రమే అవి దిగ్భ్రాంతికి కలిగిస్తాయి. వరకట్నం వంటి వాటిని చట్టం నేరాలుగా ఒప్పుకున్నప్పటికీ, సమాజం ఇంకా ఆమోదిస్తూనే ఉన్నది. అస్పృశ్యతను చట్టం నిషేధించినా ఇంకా దేశం నుంచి పూర్తిగా తొలగిపోలేదు. అలాగే, సమాజంలో కొందరో, అధికులో తప్పులుగా భావించే అనేకం చట్టం దృష్టిలో నేరాలు కాకపోవచ్చు.

నీతిమాలిన పనులన్నీ నేరాలు కావు- అన్న వ్యాఖ్య ద్వారా న్యాయమూర్తులు ఒక స్పష్టమైన సూచన చేశారు. సామాజిక నీతికి, చట్టానికి తేడా ఉన్నదని వారు చెబుతున్నారు. పెళ్లికి ముందు సెక్స్‌ని కానీ, పెళ్లి లేని సహజీవనాన్ని కానీ సమర్థించడమో వ్యతిరేకించడమో న్యాయమూర్తులు చేయలేదు. ఒక పెద్ద 'అవినీతి' కి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేసిందని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మానవసంబంధాలకు, నైతిక విలువలకు సంబంధించిన అంశాలపై న్యాయస్థానాల ప్రమేయం అవసరం కావడమే అసంగతం. ఖుష్‌బూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం ఉన్నవారు చర్చల ద్వారా, ప్రత్యామ్నాయ భావ ప్రచారం ద్వారా ఎదుర్కొనాలి తప్ప, చట్టపరమైన చర్యలకు దిగడం అప్రజాస్వామికం. వేగంగా మారుతున్న సమాజంలో విలువలు కూడా తీవ్రమైన మార్పులకు లోనవుతాయి. ఉమ్మడికుటుంబాలు, తల్లిదండ్రులపై పిల్లలకు, పిల్లలపై తల్లిదండ్రులకు ఉండిన సాంప్రదాయిక భావోద్వేగాలు- ఇప్పటి సమాజంలో కనిపించవు. గత వంద సంవత్సరాలలో భారతీయ సమాజంలో వచ్చిన పెను మార్పులు, మానవసంబంధాలను కూడా తీవ్రంగా మార్చివేశాయి. స్త్రీ పురుష సంబంధాలలో అసమానతలను తగ్గించే దిశగా అనేక ప్రజాస్వామిక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు, స్త్రీలలో ఆత్మగౌరవం, స్వేచ్ఛాకాంక్ష పెరుగుతున్న కొద్దీ పురుషాహంకారం వెర్రితలలు వేసి హింసోన్మాదానికి దారితీయడమూ కనిపిస్తుంది. ఈ సందర్భంలో ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలు స్త్రీలకు సాధికారత పెంచే ప్రయత్నం చేస్తూ, విలువలలో వచ్చే విప్లవాలను సమాజానికే వదిలివేయాలి. స్త్రీపురుష సంబంధాలను చట్టపరంగా నియంత్రించడం అసాధ్యం. సమాజంలోని పౌరులు సమాజం విషయంలోనే కాక, తమ వ్యక్తిగత జీవితాల విషయంలో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించేట్టు తల్లిదండ్రులు, సమాజ హితవరులు, సాహిత్యకళారంగాలు కృషిచేయాలి. ఇతరులకు హాని చేయకపోవడం, ఇతరుల స్వేచ్ఛను హరించకపోవడం, సమష్టి పురోగతికి కట్టుబడి ఉండడం- వీటికి మించిన సామాజిక నీతి మరొకటి లేదు.

5 comments:

 1. చాలా సమగ్రమైన విశ్లేషణ.అభినందనలు.

  ReplyDelete
 2. 100% agreed with u.
  Nijam varakatnam neram gaa pariginincha badutundi,kani enni marriages without douri jarugutunnayi.
  samajam lo eppudyna ekkuva mandi patinchedi oka rule ga chelamani avutundi
  Antha matrana ade correct kadu.
  Viluvalu veru,chattam,nyaam veru.

  ReplyDelete
 3. మీరు చెప్పింది అందరికి ఆమోదయోగ్యమే. నీతిమాలిన పనులు చట్ట పరిధి లోకి రాక పోవచ్చు, నేరం కాకపోవచ్చు . చట్టాన్ని అనుసరించి తీర్పు చెప్పటం తప్పు కాదు. కాని వివాహానికి ముందు శృంగార సంబందాల గురించి రాధాక్రిష్ణుల ప్రస్తావన అనవసరం. పలానా కేసు లో ఇలా జరిగింది అని దృష్టాంతం(illustration) ఇచ్చి నంత తేలిగ్గా వివాదస్పద వ్యాక్యలు చెయ్యటం తప్పు కాదా!

  రాజు

  ReplyDelete
 4. శ్రీనివాస్ గారూ
  ఆధునిక సమాజంలో శర వేగంగా వస్తున్న మార్పులు స్త్రీ పురుష సంబంధాలను తీవ్రంగా
  అలజడికి గురి చేస్తున్నాయి .చివరి పేరా లో చెప్పిన విషయాలు ఆ అలజడిని సరిగ్గా
  అర్ధం చేసుకోడానికి ఉపయోగపడేలా వున్నాయి

  ReplyDelete
 5. చాలా వరకూ సమాజం లోని నీతీ చట్టం చెప్పే న్యాయమూ ఓవర్ ల్యాప్ అవుతాయి. కొన్ని విషయాలలో ఆ రెండూ విబేధిస్తాయి. ముఖ్యం గా నాలుగు గోడల మధ్యా జరిగే విషయాల గురించి,అగోడల మధ్య ఉండే వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించనప్పుడు చట్టం పట్టించుకోదు.
  రాజకీయం చేస్తే నీతే న్యాయమౌతుంది. రేపు ఏ బాబా రాం దేవో వివాహం ముందు శృంగారానికి శిక్షవెయ్యాలని ఒక ఉద్యమం తీసుకు వచ్చి, ఆ ఉద్యమం ఆధారం గా అధికారంలోకి వచ్చి, చట్టం చేశాడనుకోండి. అప్పుడు ఈ నీతే న్యాయమై కూర్చొంటుంది. ఈ భూమ్మీద పాపపు ఆలోచనలు చేశాను అని ఒప్పుకొన్న తరువాత, అంతకు ముందు అలా ఆలోచించినందుకు శిక్ష విధించిన చట్టాలున్న దేశాలు కూడా ఉన్నాయి. నీతికీ న్యాయానికీ మధ్య స్పష్టమైన గీత ఏమీ లేదు. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా లాంఛనం గా శాసనమైన నీతే న్యాయమౌతోంది.

  ReplyDelete