Tuesday, March 30, 2010

మట్టిదేశం

        (పాలమూరు.  అధికార భాషలో   ఆ జిల్లా పేరు మహబూబ్‌నగర్‌.  ఆకలిజిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా- ఇట్లా దానికి పర్యాయనామాలు అనేకం. బిరబిరా కృష్ణమ్మ ఆ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది కానీ, గుక్కెడునీరు కూడా ఎత్తిపోయదు.  దేశంలోని భారీ ప్రాజెక్టులన్నిటికీ మట్టి తట్టలు మోసింది పాలమూరు కూలీలే. బతుకు యుద్ధంలో పోరాడడానికి దేశం కాని దేశం వె ళ్లే పాలమూరు కష్టజీవులు, అయితే జీవచ్ఛవాలుగానో, కాకపోతే మృతదేహాలుగానో తిరిగివస్తారు. అక్కడ శాశ్వతంగా విడిదిచేసిన కరువు, దేవుని వరమో, ప్రకృతిశాపమో కాదని- అది మానవ  కల్పితమని, వ్యవస్థ దుర్మార్గం వల్లనే దురవస్థ అని చాటి చెప్పిన సంస్థ 'కరువు వ్యతిరేక పోరాట కమిటీ'. 1995 నుంచి 2005 వరకు దశాబ్దం పాటు, మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రామీణ జీవనబీభత్సాన్ని  హృదయవిదారకంగా,  ఉద్యమప్రేరకంగా ఆవిష్కరించిన సంస్థ అది. ప్రజలతో సజీవసంబంధం పెట్టుకుని, పుట్టినమట్టికి చుక్కనీరు కోసం తపించిన ఉపాధ్యాయ కార్యకర్తల అసామాన్య కృషి అది. కమిటీ వెలికి తెచ్చిన వాస్తవాలను, గణాంకాలను చట్టసభల్లో, రాజకీయసభల్లో వల్లెవేసి పేరు తెచ్చుకున్న నాయకులు,  ఆ సంస్థ బలవన్మరణం పొందకుండా ఆపలేకపోయారు.  ఎవరికోసం వారు తపనపడడం ఒక నేరమైతే, పరుల కోసం పాటుపడడం మహాపరాధమని భావించిన వ్యవస్థ- ఆ సంస్థ మీద నిందలు వేసింది. దాని బాటలో పల్లేర్లు చల్లింది. తనను తాను రద్దుచేసుకుంటున్నట్టు సంస్థ ప్రకటించుకునేట్టు చేసింది. పది సంవత్సరాల  పాటు పాలమూరు తనను తాను లోలోపలికి చూసుకునేట్టు, వెలుపలికి వ్యక్తం అయ్యేట్టు చేసిన కరువు వ్యతిరేక పోరాట కమిటీ- ఇప్పుడు లేదు. ఆసంస్థ తన పదిసంవత్సరాల కార్యాచరణలో ప్రచురించిన కరపత్రాలను సంకలనం చేసి 'పాలమూరు అధ్యయన వేదిక' 'గొంతెత్తిన పాలమూరు'పేరుతో పుస్తకంగా ప్రచురించింది. దీనికి కె.బాలగోపాల్‌ ముందుమాట రాశారు.
       మార్చి 28 ఆదివారం నాడు మహబూబ్‌నగర్‌ టౌన్‌హాల్‌లో  ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. పాలమూరు కరువు కారణంగా అసహజమరణం చెందినవారి కుటుంబసభ్యులు పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కరువు వ్యతిరేక పోరాట కమిటీ నేడు లేకున్నా అది చేసిన కృషి పాలమూరు ప్రజాజీవితాన్ని ఎట్లా వెలిగించగలదో వక్తలందరూ ఆశాభావంతో చెప్పారు.
      కరువు వ్యతిరేక పోరాట కమిటీ కరపత్రాలతోపాటు, పాలమూరు స్థితిగతులపై, కమిటీ రద్దయిపోవడంపై పత్రికల్లో వచ్చిన సంపాదకీయాలను, ఇతర రచనలను కూడా  ఈ పుస్తకంలో ప్రచురించారు. 2001లో పాలమూరు వలసమరణాల గురించి తెలుసుకుందామని కమిటీ సహకారంతో జిల్లాలో పర్యటించిన రచయితల బృందంలో నేను కూడా ఉన్నాను. అది జరిగిన వెంటనే అప్పడు 'వార్త' దినపత్రికలో రాస్తున్న 'సందర్భం' కాలమ్‌లో 'మట్టిదేశం' అనే  రచనచేశాను. ఆ రచనను  కూడా 'గొంతెత్తిన పాలమూరు'పుస్తకంలో చేర్చారు. ఆ కాలమ్‌ ఇక్కడ  చదవండి: )

నువ్వు పెళ్లిచేసుకుని పోయేచోట ఎంతో సిరిసంపద ఉన్నది, గోడ్డుగోదా ఉన్నది, మంచి వ్యవసాయం ఉన్నది, నువ్వు మెట్టినింట సుఖపడతావు- అంటూ బొంగురు తీగల సారంగిని శ్రుతిచేసి శ్రుతిచేసి ఆ వృద్ధ గాయకుడు పాడుతున్నాడు. అనామక కళాకారుడు అతను. పేరు ఆలియా, అతనొక 'ఢాడి', లంబాడాల వంశచరిత్రలగాయకుడు. అతని పాట వందల ఏండ్ల కిందటి రాజస్థానంలోకి, అక్కడి ఎడతెగని ఆరుబయళ్లలోకి, అక్కడి పంచరంగుల దుస్తులలోకి , వెన్నెల వన్నెల వెండి సొమ్ములలోకి  మమ్మల్ని తీసుకువెళ్లింది. సారంగితో పాటు తంబూరా వంటి రబాబ్‌ అనే వాయిద్యంతో అతను  లంబాడాల పాటలుపాడాడు.  ఆలియా వేలికొసలనుంచి ­విరజిమ్ముతున్న ప్రకంపనాలు ఒక బిడారు ప్రయాణంలాగా, ఒక ఎడతెగని వలస లాగా, ఒక అనాది దుఃఖంలాగా..

ఆలియాపాట ఒక స్వప్నం మాత్రమే. లంబాడా అమ్మాయి పెళ్లిచేసుకుని వెళ్లేచోట ఏ సిరిసంపదా ఉండదు. వడిబియ్యం నింపుకున్న కడుపుతోనే దేశంపోవాలె, మట్టితట్టలతోనే కొత్తకాపురం మొదలుపెట్టాలె.  ''దూరాన నా రాజు కే రాయిడౌనో'' అని ­  విరహగీతాలు పాడుతూ
ఇళ్లల్లో బెంగపడడానికి కూడా లేదు. లెంక అంటే జత, అంటే జంట. అందమైన మాటలు. గుంపులో పడి దేశంపోయే మనుషుల లెక్క లెంకల్లోనే ఉంటుంది. దీపం పెట్టవలసిన కొంపల్నీ, అందులో ముసలిముతకనీ వదిలేసి వయస్సూ ఓపికా ఉన్న వాళ్లంతా పసిపిల్లల్ని కూడా తీసుకుని ఎక్కడికో కూడా తెలియని దేశం వెడతారు. వాళ్లు మన్ను తవ్వి  తట్టల్ని  మోసి నిర్మించే అభివృద్ధి సౌధాలూ ఆధునిక దేవాలయాలు వారికే­మీ  తెలియదు. వారికి తెలిసిన దేశం ఒకటే అది మట్టిదేశం. 

పాలమూరు దేశంనుంచి మట్టిదేశం వెళ్లి అక్కడ బతుకుయుద్ధంచేస్తున్న వాళ్ల సంఖ్య లక్షలాది. ఆ యుద్ధరంగంనుంచి మృత­వీరుల  శవపేటికలు వెనుకకురావడం ఈ మధ్య  తరచూ ఎదురవుతున్న ­విషాదం.  మే 28 వ తేదీన కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి మండలం తుర్కమద్దికుంట గ్రామంలో ఒక లారీ బోల్తాపడి  ఎనిమిది మంది కార్మికులు మరణించిన వార్త సర్వసాధారణమైన రోడ్డుప్రమాదం వార్తలవలె కనిపించవచ్చును కానీ, మృతులంతా మహబూబ్‌నగర్‌జిల్లాకు చెందిన వలసకార్మికులని  తెలిసినప్పుడు అది ఒక వ్యవస్థాగతమైన హత్యాకాండ అని అర్థమవుతుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి వరంగల్‌ మహానాడులో హైటెక్‌ ముఖ్యమంత్రి  ప్రగల్భాలు పలుకుతున్న సమయంలోనే, పనికి ఆహారపథకం వలసలను ఎంతగా తగ్గించిందో తలాతోకాలేని లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్న సమయంలోనే- అక్కడికి అతి సమీపంలో  ఈ దుర్ఘటన జరిగింది.

పొట్టచేతపట్టుకుని వెళ్లిన పరాయిదేశంలో  చచ్చిపోవడం ఒక ­విషాదం అయితే, ఈ ­విషాదాల చుట్టూ ఎంతటి వ్యవస్థాత్మకమైన పరిహాసం కనిపిస్తోందో!  మాన­వీయ  సున్నితత్వాలు ఏ­మీ  లేకుండా ఎంతగా బండబారిపోయిందో?  చుక్కనీరు లేక అణగారిపోతున్న పాలమూరు జిల్లానుంచి 45 మంది కార్మికులు- అందరూ లంబాడాలే- కరీంనగర్‌లో పెద్దపల్లి వద్ద శ్రీరాంసాగర్‌ లైనింగ్‌ పనులలో పనిచేస్తున్నారు.  తమకు నేరుగా లాభించని, ఒక సుదూరప్రాంతపు సాగునీటి ప్రాజెక్టులో పాలమూరు కార్మికులు పనిచేయవలసిరావడం ఒక అవమానం. అయితే, ఆ అవమానం ఈ నాటిది కాదు. భాక్రానంగల్‌ నుంచి నాగార్జునసాగర్‌, శ్రీశైలం దాకా పాలమూరు గుంపుకూలీలే నిర్మించారు, ఇతర ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ వారెప్పుడూ కూలీలుగానే ­మిగిలిపోయారు. ఇప్పుడు శ్రీరాంసాగర్‌ లైనింగ్‌పనులు చేస్తే మాత్రం తప్పేమిటి?  అది ఎంతో కొంత తెలంగాణాకు లాభించే ప్రాజెక్టే కదా? కానీ, ఆ లైనింగ్‌పనులొక ఫార్సు.  కొత్తసాగునీటి ప్రాజెక్టులకు పైసాకూడా అప్పు ఇవ్వని ప్రపంచబ్యాంకు పాతప్రాజెక్టుల నిర్వహణకు, ఆయకట్టుపెంపు మరమ్మత్తులకు అప్పులిస్తోంది.  ఈ మరమ్మత్తుల వల్ల కంట్రాక్టర్లకు లాభం జరిగినంతగా రైతాంగానికి ఏలాభమూ జరగదు. పాలమూరు కూలీలు లారీ బోల్తాపడి చనిపోయింది ఆ మరమ్మత్తు ప్రాజెక్టులోనే.  నెలకు ఏడువందల రూపాయల వేతనం, రోజుకు 12 గంటల పని, కట్టుబానిసత్వం, ఒక సెలవుకు రెట్టింపు పని- ­వీటికి సిద్ధపడి వచ్చే  పాలమూరు కార్మికుల  మీద  కాంట్రాక్టర్లనుంచి, ప్రపంచబ్యాంకు దాకా అందరూ లాభాలు గడిస్తున్నవారే. ఈ లైనింగుల వల్ల  కాయితాల ­మీద  తప్ప అంగుళం కూడా ఆయకట్టు కూడా పెరగదు. అటు రిజర్వాయర్‌ అంతా మేటవేసి, ఎగువన నీటి ప్రవాహం తగ్గుతుంటే నీరెక్కడి నుంచి వస్తుంది? పారిపోయిన నీటికి కట్టే కట్టలు ఇ­వి.  ఒకపక్క మరమ్మత్తుపనులు చేస్తూ, మరోపక్క ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండోదశ కు మళ్లీమరొక్కసారి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం  జరిపారు, నిధులెక్కడివో చెప్పకుండా.  శ్రీరాంసాగర్‌ రెండోదశ, వరదకాల్వల ­మీద  ఎంతో కొంత ప్రత్యక్ష పరోక్ష ఆశ పెట్టుకున్న పాలమూరు జిల్లా­ మీద  మరొకసారి అబద్ధపు ఆశలు గుమ్మరించారు.   

వలసవెళ్లిన కార్మికుల ముసలి తల్లిదండ్రులు ఆకలిచావులకు బలికావడం రెండేళ్లకిందట పాలమూరుజిల్లాలో జరిగింది. ఇప్పుడు వలసవెళ్లినవాళ్లు రకరకాల ప్రమాదాలలోనో, అనారోగ్యాలలోనో మరణించి శవాలుగా తిరిగిరావడం చూస్తున్నాము. ఈ మరణాలే­వీ యాదృచ్ఛికాలు, ప్రమాదాలూ కావు. భూ­మీ  నీటివసతీ తమకే ఉండనక్కరలేదు, గ్రామంలో ముగ్గురు నలుగురికి ఉన్నా మేంఉన్నవూర్లోనే పనులుచేసుకుని బతికేవాళ్లం కదా, దేశంకాని దేశంపోయి చచ్చేవాళ్లం కాదుకదా, బిడ్డలనమ్ముకోవాలా, పెళ్లాలను అమ్ముకోవాలా, చెల్లెళ్లను అమ్ముకోవాలా అని ఆలోచించవలసి వచ్చేది కాదు కదా- అని పాలమూరు వలసకార్మికులు గుండెలు బాదుకుంటున్నారు. బికె లక్ష్మాపూర్‌లో చచ్చిపోయిన భూరోనాయక్‌కు ఇద్దరుపిల్లలు, చిన్నచిన్న పిల్లలు. అతని తమ్ముడు చంద్రునాయక్‌ కూడా ప్రమాదంలో నడుములు ­విరిగి శాశ్వతంగా పనిచేయలేని స్థితిలోకి వెళ్లాడు. అతనికి నలుగురు పిల్లలు. ''ఏం చెయ్యమంటరు, ఎట్ల పెంచి పెద్దచెయ్యాలె ­వీండ్లను, పెండ్లిండ్లెట్ల చెయ్యాలె, చావమంటరా''- అని చంద్రునాయక్‌ భార్య సుగుణ నిలదీస్తున్నది. 'తెల్వి తక్కువోళ్లను పట్కపోయి నెలకు ఏడువందలిచ్చి, నూకల బువ్వబెట్టి, ఇట్ల పీనిగలను పంపిస్తరా, ఎంతకాలం సార్‌ ఈ బతుకులు, ఎంతకాలం ఇట్ల దేశంపోవాలె, మన్ను పోయాలె, తినాలె''- అని లక్ష్మాపూర్‌ గ్రామం అడుగుతున్నది. అదే ప్రమాదంలో చనిపోయినవారిలో అయిదుగురు లింగాల మండలం జీనుగుపల్లి గ్రామానికి చెందినవారు. భర్తను, మూడేళ్ల కూతురును కోల్పోయిన నేగావత్‌ లక్ష్మిణి, చెట్టంత కొడుకులు ఇద్దరిని పోగొట్టుకున్న తారాబాయి, ఏడాదిన్నర కిందటపెళ్లయి, ఇప్పుడు భర్తను పోగొట్టుకున్న శంకరమ్మ, ఊర్లో తాళాలు పలకరిస్తున్న సగం ఇండ్లు- జీనుగుపల్లి మొత్తం పీనుగుపల్లిలాగా మారిపోయింది, ''ఎంతవూరు సార్‌ ఇది, ఇక్కడికే ఏడాదేడాది మూడు టూరిస్టుబస్సులొస్తయి మట్టిదేశం తీస్కపోవడానికి''.

అక్కడ బోల్తాపడింది లారీయేమో కానీ, ఇక్కడ అనేక జీ­తాలు తలకిందులయ్యాయి, మట్టిదేశం వెళ్లి లక్షలు సంపాదించి, అప్పులు తీర్చింది ఎవరూ లేరు కానీ, శవంగానో, శవప్రాయంగానో తిరిగివచ్చేవారే ఎక్కువ. ఈ చావులు ఇప్పట్లో ముగిసే­వి  కావు. ముఖ్యమంత్రి దత్తు జిల్లా అయిన పాలమూరులో ఈ నరమేధం కొనసాగుతూనే ఉంటుంది, టోనీబ్లెయిర్‌నీ, ఉల్ఫెన్‌సన్‌నీ రప్పించి, పాలమూరు దరిద్రాన్నీ, డ్వాక్రాగ్రూపుల్నీ చూపించి వేలకోట్ల అప్పు తెచ్చినా, కల్వకుర్తి ఎత్తిపోతలకు మాత్రం చిల్లిగవ్వకూడా రాలదు, నీరు లేనంత కాలం, నెత్తురు అమ్ముకోవలసిందే. కారుచవక శ్రమ కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వాలకు,సంపన్నులకు అందుబాటులో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే, లక్ష్మాపూర్‌, జీనుగుపల్లి తండాల వంటి తండాల్లో ఇంటింటికి కనీసం అరలక్ష అప్పుఉన్నది. ఆ అప్పు తీరేది కాదు.
(సందర్భం, వార్త, 2001 )

No comments:

Post a Comment