Sunday, April 4, 2010

చందమామ లాంటి అందమైన దీవి...

ప్రళయానికీ ప్రళయానికీ మధ్య ప్రపంచం, యుద్ధానికీ యుద్ధానికీ మధ్య శాంతి. అనేక గ్రీష్మాల మధ్య ఒక వర్షం. ముసుర్ల మధ్య తెరిపి. దుఃఖమే నిత్యం. ఆనందం బుద్బుదం.

అంతా సమసిపోయినట్టే ఉంటుంది. కర్ఫ్యూ కాస్త సడలించినట్టే ఉంటుంది. జీవితం మళ్లీ మొదలయినట్టే ఉంటుంది. దుమ్ము కిందికి తోసేశాక, తివాచీ శుభ్రంగానే ఉంటుంది. కత్తులు మొలిచిన వీధి పూలతోట లాగా నటిస్తుంటుంది. నెత్తుటి ఆటను రేపటికి వదిలి, 'నేడు' శాకాహారి అవుతుంది. ఓ.కె. జీవితం రణరంగమైనప్పుడు, విరామకాలంలోనే జీవించడం నేర్చుకోవాలి. కాలికీ వేలికీ తగిలే కళేబరాల మధ్య ఒక తరం తరం గడిపింది బీరుట్ నగరం. బాంబుకీ బాంబుకీ నడుమ కునుకుతీయడం నేర్చుకుంది బాగ్దాద్ పట్టణం.

navya. ఒక అర్థగోళం వెలిగిపోతున్నప్పుడు మరొక సగం చీకటిలో మునిగినట్టు- ఈ ప్రపంచం కొంత వైభవోజ్జ్వల మహాయుగంలో, మరికొంత వల్లకాటి అధ్వాన్నశకంలో. ఆమూలన చమురుచుక్క, ఈ మూలన ఇంధనం కావడమే ప్రపంచీకరణ. ఒక చెమటచుక్క ఖండాంతరాలు పయనించడమే ఏకధ్రువం. లోకానికంతటికీ ఒకేనేరం, ఒకరే పోలీస్- అదే నూతనవ్యవస్థ.

సృష్టి ఆరంభకాలంలో- భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. - కదా? అందుకని ఒక నావను కల్పించి కొందరిని రక్షించాడు, భూమిని ముంచేశాడు. నేటి బలాత్కారాన్ని దేవుడు ఇంకా చూచియుండలేదు. మంచిమనుషులకు నావను
కల్పించలేదు. ప్రళయానికి ఇంకా సమయం రాలేదు. అందుకని మనుషులు ఎవరికి వారే నోవాలైపోతారు. ఎవరి నావను వారే నిర్మించుకుంటారు. ఎవరి దీవులను వారే కనుగొంటారు. లోకపుటన్యాయాలూ కాల్చే ఆకలి కూల్చేవేదన వారిని ముంచెత్తినప్పుడు- సంచలిస్తున్న నాడులను ఈనెలు తీసి -ఒక కలల దోనెను అల్లుకుంటారు. లోలోనుంచి ఆత్మ చేసే ఆక్రందనలు వినిపించకుండా ఎలుగెత్తి ఒక ప్రేమగీతం పాడుకుంటారు. కాలంలో ఒక చిన్న గుయ్యారాన్ని తొలుచుకుని అందులో తలదాచుకుంటారు. ప్రేమరాహిత్యం పిడుగులు కురిపించినప్పుడు- అర్జునా ఫల్గుణా అని విరుగుడు మంత్రం పఠిస్తారు.

మనుషులు వర్గాలుగా గుంపులుగా జాతులుగా కులాలుగా మాత్రమే యుద్ధం చేయరు. రాజులూరాజులూ పాలకులూ పాలకులూ మాత్రమే యుద్ధాలు చేయరు. యుద్ధరంగాలన్నీ గుర్రపుడెక్కల దుమ్ముతో, ఫిరంగుల మోతతో నిండివుండవు. మనుషులందరి పాదాల కింద మరెవరో మనుషుల శిరస్సులుండడమే సమాజసూత్రం. నాలుగుపాదాలా నడిచే ధర్మరాజ్యంలో సైతం నిశ్శబ్ద యుద్ధం సాగుతూ ఉంటుంది. నిరాయుధమైన నిర్దాక్షిణ్యమైన ప్రచ్ఛన్నయుద్ధం పరచుకుని ఉంటుంది. నీతిసూత్రాల న్యాయశాస్త్రాల రక్షకభట శస్త్రాల శృంఖలాలలో మనుషులు గింజుకుంటూ ఉంటారు. కారాగారాలు మారువేషాలతో కాపుకాసి ఉంటాయి. ఒక యజమాని కష్టాన్ని దోచుకుంటాడు. మరో యజమాని ఆత్మను అపహరిస్తాడు. ఇంకో యజమాని రెక్కలను కత్తిరిస్తాడు.

కర్ఫ్యూ ఎక్కడో కల్లోలప్రాంతంలో ఉండదు. ఒకసారి లోనికి తరచిచూస్తే, నిర్మానుష్యమైన అంతరంగం కనిపిస్తుంది. ఆలోచనలు సంచరించలేని పహారా కనిపిస్తుంది. అడుగుతీసి అడుగువేయలేని అగడ్తలు కనిపిస్తాయి. ఓడిన శిరస్సులు వేలాడే కోటగుమ్మాలు కనిపిస్తాయి. కంచెలూ సంకెళ్లూ నోరుతెరచుకున్న మొసళ్లూ అలముకున్న జీవితంలో మనుగడ ఒక గెరిల్లాయుద్ధం. చాకచక్యం ఉంటే చినుకుకీ చినుకుకీ మధ్య తడవని బాణంలా దూసుకుపోవాలి. ధైర్యం ఉంటే గాయాలనే ఆభరణాలుగా ధరించి విర్రవీగాలి. ప్రేమే ఉంటే జీవితంలో ఒక రహస్యజీవితాన్ని కట్టుకోవాలి.

పనివాడికి విశ్రాంతి కావాలి. సైనికుడికి విరామం కావాలి. కల్లోల సమాజానికి కొంత శాంతి కావాలి. ప్రభువులకూ యుద్ధప్రభువులకూ అది కూడా తెలుసు. పో. కుటుంబం ఒక విశ్రాంతి. భార్య బానిసకొక బానిస. పిల్లలు, రేపటి కార్మికులో సైనికులో బానిసలో. కాసేపు పడకగదిలోకి వెళ్లు. మరి కాసేపు పూజగదిలోకి వెళ్లు. ఇంకాసేపు సినిమాలోకి వెళ్లు. వెయ్యిచానెళ్ల రంగులపెట్టెలోకి ఉష్ట్రపక్షి లా తలదూర్చు. ఇంకా శాంతించకపోతే, కత్తులు తీసుకుని పక్కవాడిని పొడువు. వ్యవస్థఅంతా ఎన్ని చెరసాలలున్నాయో అన్ని వినోదశాలలూ సిద్ధం. మొలుస్తున్న రెక్కలకు మత్తుమందివ్వు. నీ కాళ్లను నువ్వే నరుక్కో. మరీ ఫీలింగ్స్ ఎక్కువా? ఏకాంత యవనికాభ్యంతరమునకేగి వెక్కివెక్కి రోదింపుము.

ఏలినవారే అందించే రెడీమేడ్ విశ్రాంతులకూ, వ్యాపారులు సమకూర్చే ఆక్సిజన్ పార్లర్‌లకీ, యుద్ధప్రభువులు నూరిపోసే ఉన్మాదాలకీ ప్రలోభపడని జీవితేచ్ఛ ఇంకా లోకంలో మిగిలే ఉన్నది. అన్ని సంకెళ్లూ తెగిపోయే అంతిమయుద్ధం సమీపించేలోగా, బంధనాలను ఎక్కడికక్కడ తెగనరుకుతూనే ఉంటారు. చీకటిలో మగ్గుతూ వెలుగునీ, నాలుగు గోడల మధ్య నుంచి ఆకాశాన్నీ స్వప్నిస్తుంటారు. మనస్సీమలలో విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉంటారు. ఏరుపోటెత్తినా ఎదురీదుతూనే ఉంటారు. చందమామ లాంటి అందమైన దీవి కోసం జోర్‌సేయ్ బార్‌సేయ్ చేస్తూనే ఉంటారు. పాటలోనుంచి ప్రేమలోనుంచి చిరుచిరు విజయాలనుంచి శ్రమతెలియనివ్వని ఆనందాన్ని పొందుతారు.

ప్రళయాలూ యుద్ధాలూ లేని ప్రపంచం వచ్చే దాకా వెన్నెల రోజులు రావు. సడలించిన అమావాస్యలతోనే సర్దుకోవాలి. పున్నములతో లేచిపోయిన సాహసగాధలను గానంచేయాలి. అనేక గ్రీష్మాల మధ్య ఒక వర్షం. ఇంద్రధనుస్సుల అందాలతోనే మురిసిపోవాలి. దుఃఖమే నిత్యం. అందుకు సిద్ధపడాలి. ఆనందం బుద్బుదమే అయినా అద్భుతం. అలసిపోని సాధన చేయాలి.

No comments:

Post a Comment