Sunday, April 11, 2010

నిరంతర మరణ స్రవంతి

మనుషులు అట్లా మూటలు మూటలుగా, ఛిద్రమైన అవయవాలతో, కాలిపోయిన చర్మంతో కళేబరాలుగా మారిపోవడం గుండెల్ని పిండేస్తుంది. నిటారుగా నడవవలసిన మనుషులు అట్లా నేలపై శవాలుగా బారులు తీరడం బాధ కలిగిస్తుంది. మనుషులు, వాళ్లెవరైనా సరే, మనుషులైతే చాలు, నిస్సహాయంగా పిట్టలురాలినట్టు రాలిపోవడం అమానవీయమనిపిస్తుంది.

ఏ అమ్మ కన్న బిడ్డలో, ఏ రైతు కొడుకులో, ఏ నిరుపేద సంతానమో దేశంకాని దేశంలో చావునోట చిక్కి తల్లులకు కడుపుకోత మిగిల్చినప్పుడు, రోదించాలనీ, కడివెడు కన్నీరు కార్చాలనీ ఏ అనుబంధమూ లేని వారికి కూడా అనిపిస్తుంది. దేవుడా, బీభత్స మరణాలు, అర్థాయుష్షులు లేని కాలంలోకి మమ్మల్ని తీసుకువెళ్లవా అని ప్రార్థించాలనిపిస్తుంది.

navya. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో బుధవారం నాడు మావోయిస్టులు పన్నిన ఉచ్చులో చిక్కి 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించినప్పుడు అయ్యో పాపం అనుకోని వారుండరు. భారత్‌లో చురుకుగా ఉన్న మిలిటెంట్ ఉద్యమాలన్నిటిలో, చివరకు కాశ్మీర్ సాయుధసంస్థల చేతుల్లో కూడా ఇంతమంది భద్రతాసిబ్బంది ఒకే సంఘటనలో మరణించలేదు కాబట్టి, దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది. పాలనతో, భద్రతానిర్వహణతో సంబంధం ఉన్న వారంతా తీవ్రంగా కలవరపడ్డారు, ఆగ్రహం చెందారు. విశ్లేషకులు, విమర్శకులు, వ్యాఖ్యాతలు కూడా స్పందనల్లో ఆవేశాలకు ఉద్వేగాలకు పెద్దపీట వేశారు. సంఘటన ఎంతటి తీవ్రమైనదంటే, చివరకు ఆ నరహననానికి పాల్పడిన మావోయిస్టులు సైతం ఆ మరణాలకు విచారపడ్డారు.

దుఃఖం కలిగినప్పుడు దుఃఖపడవలసిందే. మరణం ఎదురైనప్పుడు వెంటనే కలగవలసిన తెలివిడి- జీవితం కొనసాగవలసిందేనని. అప్పుడు దుఃఖ కారణాలను వెదకాలి. మళ్లీ అటువంటి దుఃఖం ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి. వివేకం లోపించనప్పుడు వ్యక్తులే అటువంటి సమీక్షకు సిద్ధపడతారు. అటువంటప్పుడు, యావత్ జాతికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మరింతగా బుద్ధికి పనిచెప్పాలి. ఆవేశాలకు లోనుకావడానికి ప్రభుత్వాధినేతలు పామర కక్షిదారులు కారు. కానీ, మన దేశరక్షణ మంత్రి చిదంబరం గారు మాత్రం ప్రతీకారభాష మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే ఆయన కూడా ఖంగు తిని ఉంటారు కాబట్టి, అట్లా మాట్లాడారు
లెమ్మని అనుకోవచ్చు, కానీ, ఆ తరువాత రోజు ఆ మరుసటి రోజు కూడా ఆయన భాషలో మార్పులేదు. చివరకు ఆ 76 మంది మరణానికి అంతిమ బాధ్యత తనదేనని రాజీనామాకు కూడా సిద్ధపడి వద్దనిపించుకున్నారు.

భద్రతాదళాల నైతికస్థైర్యం తగ్గకూడదని, మావోయిస్టుల నైతికస్థైర్యం పెరగకూడదని బిజెపి కోరుకుంటున్నది. అందుకే చిదంబరం రాజీనామా అవసరంలేదని అంటున్నది. మరి ఉగ్రవాదులు హింసకు పాల్పడినప్పుడల్లా శివరాజ్‌పాటిల్‌ను రాజీనామా చేయమని అడిగినప్పుడు ఈ తర్కం ఏమైందో అర్థం కాదు. శివరాజ్‌పాటిల్ ముంబైదాడులు జరిగేదాకా ఎన్ని ఉపద్రవాలు జరిగినా మన్నుతిన్న పాములాగా కొనసాగారు. ఆయనతో పోలిస్తే చిదంబరం చర్మం ఇంకా దళసరిగా మారలేదని అనుకోవచ్చు.  కానీ, ఇట్లా నైతికబాధ్యత వహించడంలో ఆయనకు పెద్ద మంచిపేరేమీ లేదు. పివి నరసింహారావు మంత్రివర్గంలో సహాయమంత్రి హోదాలో వాణిజ్యశాఖను స్వతంత్రంగా నిర్వహించిన చిదంబరం సెక్యూరిటీల కుంభకోణం పై విచారణ దృష్ట్యా రాజీనామా చేయవలసి వచ్చింది. అప్పుడు ఆయన రాజీనామాను డిమాండ్ చేసిన ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు రాజీనామా చేయవద్దని చిదంబరాన్ని కోరుతున్నాయి.

అప్పుడెప్పుడో ఇరవయ్యేళ్ల కిందట జరిగిన సంగతి వదిలేస్తే, నాలుగైదేళ్ల కిందట కూడా పార్లమెంటులో ప్రతిపక్ష ఎన్‌డిఎ, అధికార యుపిఎలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు చిదంబరాన్నిరాజీనామా చేయమని కోరాయి. అప్పుడాయన ఆర్థిక మంత్రి. వేదాంత కంపెనీలో చిదంబరం ఒక డైరెక్టర్ అని, 2003 దాకా ఆ కంపెనీ తరఫున వాదించిన న్యాయవాది అని విమర్శిస్తూ వివిధ పార్టీలు ఆయన రాజీనామాను కోరాయి. భారతీయ జనతాపార్టీ అయితే చాలా తీవ్రంగా చిదంబరాన్ని తప్పుపట్టింది.

వేదాంత గ్రూపు కంపెనీతోనే కాదు, బాల్కో లో మెజారిటీ వాటాలున్న స్టర్‌లైట్ కంపెనీతో కూడా చిదంబరానికి లాభసాటి సంబంధాలున్నాయని విమర్శలు వచ్చాయి. విషయమేమిటంటే, చిదంబరానికి ఉన్న ఈ ఆర్థిక, న్యాయవాద సంబంధాలకూ ఇప్పుడు హోంమంత్రిగా ఆయన నిర్వర్తిస్తున్న కర్తవ్యానికీ సంబంధం ఏదో ఉన్నదని మావోయిస్టులే కాదు, గాంధేయవాదులూ, సోషలిస్టులూ కూడా ఆరోపిస్తున్నారు

దండకారణ్యంలో అపారంగా ఉన్న ఖనిజవనరులను చేజిక్కించుకోవడానికి బహుళజాతి, దేశీయ కార్పొరేషన్లు ప్రభుత్వంతో వందలాది ఒప్పందాలు చేసుకున్నాయని, ఆ వనరుల దోపిడీకి అవరోధంగా ఉన్నారు కాబట్టే, మావోయిస్టుల ఏరివేత సాగుతున్నదని అంటున్నారు. 'గ్రీన్‌హంట్' అన్నదే లేదంటారు చిదంబరం. ఆ మాట ఉన్నదో లేదో కానీ, ఆ పని మాత్రం కొనసాగుతున్నది.

అన్యాయంగా మరణించిన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు తాము ఏ పవిత్ర కర్తవ్యం కోసం దండకారణ్యానికి వెళ్లారో తెలిసి ఉండకపోవచ్చు. దాని మంచి చెడ్డలూ తెలిసి ఉండకపోవచ్చు. తమ విధి నిర్వహణ తప్ప మరేమీ వారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ, వారు అక్కడికి నిరాయుధులుగానో, సాధారణ ప్రజలుగానో వెళ్లలేదు. మావోయిస్టులను నిర్మూలించడానికే వెళ్లారు.

మావోయిస్టులు కూడా అక్కడేదో శాంతియజ్ఞం చేయడానికి దండకారణ్యంలో లేరు. వారు రాజ్యంతో తలపడాలనే వెళ్లారు, ఈ పోరాటాల క్రమంలో ఎదురయ్యేవేమిటో ఉభయులకూ తెలుసు. ప్రభుత్వం అప్పగించిన కర్తవ్య నిర్వహణలో బుధవారం ఎదురైనటువంటి ఎదురుదెబ్బలు భద్రతాదళాలకు తరచు ఎదురుకావచ్చు. ఇంత కంటె పెద్ద నష్టాలు కూడా మున్ముందు జరగవచ్చు. చిదంబరం బిగ్గరగా ప్రతీకారం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, దుఃఖం కొనసాగుతుందే తప్ప, అది అంతరించదు.

గత కొద్దినెలలుగా గ్రీన్‌హంట్ పేరిట 120 మందికి పైగా అమాయక ఆదివాసీలను భద్రతాదళాలు చంపివేశాయని,అందుకే ప్రతీకారంగా దాడిచేశామని మావోయిస్టులు చెబుతున్నారు. ఒకేసంఘటనలో కాకుండా వేరువేరుగా భద్రతాదళాల చేతుల్లో చనిపోయిన అంతమంది గురించి హాహాకారాలు వినిపించకపోవడం అన్యాయం. అయితే, మావోయిస్టులది కూడా ప్రతీకారభాషే.  అణచివేయడం కోసమే ఎన్‌కౌంటర్లు చేస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకోదు, ఆయుధాల కోసం, అణచివేతను అడ్డుకోవడానికి హింస చేస్తున్నామని నక్సలైట్లూ ఒప్పుకోరు. పరస్పరం భయభ్రాంతులను చేయడానికి, తమవారిలో నైతిక స్థైర్యం పెంచడానికే ఈ బీభత్సం అని అసలే చెప్పుకోరు. రానున్న రోజులలో నోరులేని ఆదివాసీల దుర్మరణాలు, వారిపై అత్యాచారాలు తరచు వినవలసి వస్తుంది. ఈ దేశం అధికారసోపానంలో అట్టడుగున ఉన్నవారు కాబట్టి, వారి నైతికస్థైర్యం నశించిపోయినా దిక్కులేదు. వారు ఎందరు మరణించినా రాజీనామాలు చేస్తామని ఏ నాయకుడూ ముందుకు రాడు.

రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలిచ్చి తెలంగాణలో వందలాదిమంది ఆత్మహత్యలకు పరోక్షంగా కారణమైనందుకు రాజీనామా చేయాలని చిదంబరానికి అనిపించలేదు. ఈ 2010 సంవత్సరంలో ఇప్పటిదాకా విదర్భలో 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా వ్యవసాయమంత్రి మరాఠా శరద్‌పవార్‌కు నైతికబాధ్యత గుర్తుకురాదు. దేశంలోని వనరులను పరాధీనం చేసే మహాయజ్ఞానికి సోమయాజిగా ఉన్న ప్రపంచప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రధానమంత్రికి ఏ బాధ్యతా కనిపించదు. అభివృద్ధి రథమైనా, శాంతిభద్రతల రథమైనా అమాయకుల కళేబరాల మీదుగా దూసుకుపోవలసిందే! ఏ యూనిఫాంలో ఉన్నా, ఆదివాసీ ఆచ్ఛాదనలో ఉన్నా దుఃఖం దంతెవాడది, దేశానిది. కంటికి కన్ను తీసుకుంటూ పోతే అంధులమైపోతామన్న గాంధీకి ఇక్కడ ఇప్పుడు స్థానం లేదు. మూలకారణంబెయ్యది అని శోధించే వివేకానికీ ఇక్కడ చెల్లుబాటు లేదు. కార్పొరేట్ల ప్రపంచప్రభువుల నైతికస్థైర్యాన్ని పదిలంగా కాపాడడం ఒక్కటే ఇక్కడి జాతీయధర్మం.

No comments:

Post a Comment