Saturday, April 17, 2010

సైనిక రాజకీయవాదులూ, అర్ధ మావోయిస్టులూ..

ప్రపంచపు దుఃఖాన్ని కళ్లారా చూస్తున్నప్పుడు మిధ్యావాదాన్ని అంగీకరించలేము. లోకపు అశాశ్వతతని  చూస్తూ కూడా ఉనికే సత్యమని భ్రమించలేము. అందుకని, తథాగతుడు రెండు తీవ్రవాదాలనూ కాదని మధ్యేమార్గాన్ని ప్రతిపాదిస్తున్నాడు. కార్యకారణాల వల్లనే అస్తిత్వమూ నాశనమూ కలుగుతున్నాయి. కారణాన్ని అంతరింపజేస్తేనే కార్యంకూడా అంతరిస్తుంది.
- సంయుక్తాగమ, 12వ అధ్యాయం

ఏ దృక్పథం కారణంగా సమస్యలు ఉత్పన్నమయ్యాయో అదే దృక్పథంతో వాటిని పరిష్కరించలేము
- అల్బర్ట్ ఐన్‌స్టీన్

  navya.తనతో లేనివాళ్లంతా బిన్‌లాడెన్‌తో ఉన్నట్టేనని జార్జిబుష్ జూనియర్ 2001లో అన్నాడు. మావోయిస్టులపై తీవ్రమైన సాయుధ చర్యలు తీసుకోవాలనే వాదనతో ఏ మాత్రం విభేదించే వాళ్లయినా అర్ధమావోయిస్టులేనని బిజెపి నేత అరుణ్‌జైట్లీ అంటున్నాడు. పతంజలి కథలో ఒక తొండ ప్రపంచాన్ని అంతే సులువుగా అర్థంచేసుకుంటుంది.

  తొండలు, తొండలు తినేవి, తొండల్ని తినేవి- ఈ మూడే రకాల జీవులే ప్రపంచంలో ఉంటాయనేది దాని జ్ఞానం. సమస్యలను యుద్ధరంగంలో మాత్రమే తేల్చుకోవాలనుకునే వాళ్లంతా ప్రపంచాన్ని తాము, ఇతరులు అనే సరళమైన ద్వంద్వంలోనే అర్థంచేసుకుంటారు.

  తన కొలువు కూటంలోనే ఉంటూ వీలయినప్పుడల్లా హితవచనాలు పలికిన భీష్మద్రోణుల్ని పాండవ పక్షపాతులని నిందించగలిగాడుకానీ, సైన్యాధిపత్యం ఇవ్వవలసివచ్చినప్పుడు వారి విధేయతను దుర్యోధనుడు శంకించలేకపోయాడు. మావోయిస్టులంటే మనప్రజలే కదా, వారి మీద విమాన బాంబులను ఎట్లా వేస్తాం?- అని వ్యాఖ్యానించింది భారతవాయుసేన అధిపతి కాబట్టి సరిపోయింది కానీ, అతనొక రాజకీయవాది అయితే పార్లమెంటులో అతనికి ఐఎస్ఐ కిరీటాన్ని అల్‌ఖాయిదా పతకాన్ని దేశద్రోహ బిరుదాన్ని అలంకరించి ఉండేవారు.

  ప్రతిపక్షం అంతా ఒకటిగాఉంటే కాంగ్రెస్‌లో రెండు గొంతులు వినిపిస్తున్నాయన్నది బిజెపి ఆరోపణ. ఆకుపచ్చని వేట మీద వామపక్షమూ రామపక్షమూ ఒకటికావడం విడ్డూరం కానప్పుడు, ఛత్తీస్‌గఢ్‌లో, జార్ఖండ్, బెంగాల్‌లలో రాజకీయ ప్రయోజనాలున్న కాంగ్రెస్‌లో ఒక దిగ్విజయు డో మరొకరో భిన్నంగా మాట్లాడడంలో వింత ఏమున్నది? పంజాబ్‌లో అణచివేతను అతి పకడ్బందీగా నిర్వహించిన కెపిఎస్ గిల్ సైతం ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నదేమిటి, దాన్నెట్లా సమర్థిస్తాం- అని అడుగుతుంటే - ప్రజాప్రతినిధులుగా ఎన్నికై సమస్యను పౌర, రాజకీయ దృక్పథం నుంచి చూడవలసిన వారంతా యూనిఫారాలు ధరించిన తుపాకీ భాష మాట్లాడడం నేడు కనిపిస్తున్న దృశ్యం.  అడవుల్లో ఉండి పోరాడుతున్నవారు ఒకపక్షం, పార్లమెంటులో ఉన్నవారిది ఒకపక్షం- రెండు పక్షాలు
  ఉండాలని ఇప్పుడు బలపడుతున్న వాదన. మూడోగొంతు మూగబోతే తప్ప రణరంగం స్పష్టంగా ఉండదు.

  ఒక్క దండకారణ్యంలోనే కాదు, యావత్ భారతదేశంలోనూ,ఆమాటకు వస్తే ప్రపంచమంతా ద్వంద్వ శిబిరాలలోకి కుదించుకుపోవాలని ప్రభువులు ఆశిస్తున్నారు. సోవియట్ యూనియన్ అంతర్థానం తరువాత లోకం ఇక ఒకే గొడుగు కిందికి వస్తుందనుకున్నారు కానీ, జార్జిబుష్ తనకు ప్రతిద్వంద్విగా టెర్రరిజాన్ని ఎంచుకుని- రెండు ధ్రువాలను పునరుద్ధరించా రు. ఇక అపై ప్రపంచమంతా ఒకే యుద్ధరంగంలో నిమగ్నమైంది. తన, పర నిర్వచనాలను అదే నిర్వచించింది. కార్యకారణాలతో నిమిత్తం లేనిరాజకీయం అవతరించింది. అసలిదంతా ఎట్లా మొదలైందో ఎవరికీ అక్కరలేదు. ఏకైక పరిష్కారాన్ని కాదని ఇతర అన్వేషణలు చేసేవారందరూ అవతలి శిబిరంవారే. ఉదారవాదం ఒకప్పుడు పశ్చిమదేశాలు ప్రపంచానికి అందించిన ఆదర్శం. ఇప్పుడందులోని ఆద ర్శం నశించి, ఆర్థిక నయా ఉదారవాదంగా క్షీణించి పోయింది.

  సమాజంలోని ప్రయోజనాల ఘర్షణ అనేక రూపాలు తీసుకుంటుంది. నాగరికత, వికాసం- ఈ రూపాలను సాధ్యమైనంతగా మానవీయం చేయాలని ప్రయత్నిస్తూ వచ్చాయి. కానీ, చరిత్రలోనూ వర్తమానంలోనూ అతిపెద్ద అమానుషత్వం స్వార్థం. స్వార్థం క్రూరత్వానికీ, ఆక్రమణకీ, అంతిమంగా ఎడతెగని రక్తపాతానికీ దారితీస్తున్న ది. ఈ పరిస్థితి నుంచి తమను తాము కాపాడుకోవడానికి, ప్రపంచాన్ని కాపాడడానికి అనేక శక్తులు అనేక రకాల మార్గాలను అనుసరిస్తూ వస్తున్నాయి. కొన్ని మార్గాలు మౌలికమైన మార్పును ఆశించవచ్చు. కొన్ని క్రమపరిణామాన్ని కోరుకోవచ్చు. మార్పు తీరును బట్టి, దాన్ని కోరుకునేవారి స్వభావాన్ని బట్టి అనుసరించే మార్గాలు కూడా రకరకాలుగా ఉంటున్నాయి. వాటిలోని తీవ్రతను బట్టి, కొన్ని మెత్తవికాను, కొన్ని కఠినమైనవికాను కనిపించవచ్చు. మరి కొన్ని మధ్యస్థంకాను, తటస్థంకాను, అవకాశవాదం కాను తోచవచ్చు.

  కానీ, అన్ని ఏకకాలంలో ఉనికిలో ఉండడం, ఉండడానికి అనుమతించడంలోనే ప్రజాస్వామ్యం ఔదార్యం దాగి ఉన్నది. నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరమౌషధం ఏదీ ఇంకా సిద్ధం కాలేదు. సిద్ధంకావాలనుకోవడం సమంజసం కూడా కాదు. అటువంటప్పు డు- తమ తమ మార్గాలలో సాధన చేసే అవకాశం అందరికీ ఉండాలి. మార్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు తప్పొప్పులు చెప్పగల తీర్పరులకు, రిఫరీలుగా వ్యవహరించే పెద్దమనుషులకు. మరోమార్గం సూచించగల వేత్తలకు కూడా సమాజంలో స్థానం ఉండాలి. అనేకసత్యాల ఉనికిని అంగీకరించలేని సమాజం- ఏదో ఒక ఆధిపత్య సత్యాన్ని పరమ సత్యంగా ప్రకటిస్తుంది, అందుకు హింసను, అణచివేతను సాధనాలుగా వాడుకుంటుంది.

  విదురులూ భీష్ములూ తగ్గిపోవడమే నేటి ప్రధాన సమ స్య. ద్రౌపదిపై దౌర్జన్యం జరిగినప్పుడు నిస్సహాయులుగా మిగిలిపోయినా, ఆ అత్యాచారంలో వారు భాగస్వాములు కాలేదు. అ«ధికారపీఠంలో ఉన్న వారికి సైతం అధికారాతీతమైన ధర్మం చెప్పగలిగేవారు ఇప్పుడు కొరవడడమే పెద్ద సమస్య.  బినాయక్‌సేన్ కూడా మావోయిస్టు అయ్యాక, మేధాపాట్కర్‌కు కూడా విశేషణాలు తొడిగాక, అరుంధతీరాయ్‌పై కూడా ముద్రలు సిద్ధమయ్యాక- ఇక ఘర్షణాయుత సమాజంలో రాయబారులెవరు? ఎమర్జెన్సీకి బాధితులు కావడమే కాదు, ఆ అనుభవం నుంచి ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు నడుం కట్టిన అనేక శక్తులు ఇప్పుడు సమాజంలోని కొన్ని శ్రేణుల మీద అప్రజాస్వామిక హింసకు సమర్థకులుగా మారుతున్నారు.

  మావోయిస్టుల మార్గం సరైనదా కాదా అన్నదికాదు సమస్య. వారిని కలుపుమొక్కలలాగానో, చీడపురుగులలాగానో ఏరిపారేసే లక్ష్యం కూడా కాదు అస లు సమస్య. ఆదివాసుల ప్రాణాలకూ, ఈ దేశం ఖనిజసంపదకు ఎవరిది పూచీ అన్న ది పెద్ద ప్రశ్న. ప్రకృతి సంపదను పరాధీనం చేయడానికి ఇదొక్కటే మార్గం అయితే, గ్రీన్‌హంట్ దేశమంతా విస్తరిస్తుందికదా? సమాచార హక్కు కింద 'అవాంఛనీయమైన' సమాచారాన్ని సేకరిస్తున్నందుకు అస్సాంలో అఖిల్ గొగోయ్ అనే రైతు సంఘ కార్యకర్తను మావోయిస్టుగా కేసుపెట్టారు. ఇకపై ప్రభుత్వాలతో ఏ మాత్రం విభేదించి న వారినయినా- ఒకే ముద్రతో సత్కరించే పాడుకాలం ముందున్నది. రెండు శిబిరాల నడుమ ఉన్నవారినెవరినైనా ఒకేవైపు నెట్టివేసే ప్రయత్నం ఇది.

  ఈ దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకమో భ్రమో ఉన్నవారనేకులున్నారు. ప్రయత్ని స్తే ఈ వ్యవస్థకు మరమ్మత్తులు చేయవచ్చునని విశ్వసించేవారూ ఉన్నారు. మావోయిస్టుల వంటి సాయుధ సాధకుల మార్గం అనివార్యమూ అద్భుతమూ కానక్కరలేదని అనుకునే వారూ ఉన్నారు. అయితే, వారికి భవిష్యత్తుపై నమ్మకం కలిగించవలసిన బాధ్యత మావోయిస్టులది కాదు, ఎందుకంటే వారు ఇప్పటి ప్రజాస్వామ్యవ్యవస్థను విశ్వసించేవారు కాదు. ఆ బాధ్యత తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమని చెప్పుకునేవారి ది. ఈ వ్యవస్థకు స్పందనలు మిగిలే ఉన్నాయని, మార్పును తెచ్చేవారిని అది ప్రోత్సహిస్తుందని నమ్మకం కలగకపోతే, రెండేమార్గాలు మిగులుతాయి. కార్యదీక్ష, నిబద్ధత, తపన ఉన్నవారిని చేజేతులా రెండో శిబిరానికి అప్పగించడమే జరుగుతుంది.

  No comments:

  Post a Comment