Friday, April 30, 2010

ఖడ్గ సృష్టికర్త

"నిజంగా ప్రపంచానికి కవిత్వమే కావలిస్తే ఇంతకంటె అదను లేదు. సాహసీ! నీ సందేశం కోసం విశ్వం తన చాతక వదనం తెరుచుకున్నది. నీ గానానికి మా వీణా తంత్రుల శ్రుతి సవరిస్తున్నా ము. తలుపులన్నీ వివృతం చేసి ఉంటాము. నువ్వు రావాలి. రావా లి.... నువ్వు ఎప్పుడు వస్తావో! ఎలాగ వస్తావో! నువ్వు Cyclone లాగో, Sulphuric Acidలాగో గంధ సింధూరం లాగో గండ భేరుండం లాగో రావోయ్! రావోయ్! యువకవీ!! నవకవీ!!''
(శ్రీశ్రీ: 1936)

edit. కష్టజీవికి రెండువైపులా నిలబడిన కవికి నమస్కారం. కాలం కడుపుతో ఉండి కన్న మహాకవికి నమస్కారం. 'అంచనా వేయలేమతని చలచ్చంచల దీప్తలేఖిని' అంటూ తరతరాలు పారవశ్యపడిన ప్రతిభామూర్తికి నమస్కారం. అనేక శిఖరాలు అధిరోహించిన సాహసికి నమస్కారం. తప్పటడుగులు వేసిన పసి బాలుడికి, తప్పుటడగులు వేసిన సామాన్య మానవుడికి నమస్కారం.

హేలీ తోకచుక్కలాగో, గురజాడ 'తోకచుక్క'లాగో శ్రీరంగం శ్రీనివాసరావు 1910లో కళ్లు తెరిచాడు. డెబ్బైమూడు సంవత్సరాల పాటు ఈ లోకంలో తుఫానులాగా, గంధక«ధూమం లాగా, గండభేరుండంలాగా సంచరించాడు. వీరుడూ తానే విదూషకుడూ తానే అయి తిరిగి వెళ్లిపోయాడు. సమకాలంలోనూ భవిష్యత్తులోని అనంతకాలాల్లోనూ జాతిజనులు పాడుకునే 'మంత్రాలను' అందించి వెళ్లా డు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించాడు.

'మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం'- ఇదీ శ్రీశ్రీ సారాంశం. పతితులను, భ్రష్ఠులను, బాధాసర్పదష్టులను, అధోజగత్సహోదరులను, సమ్మె కట్టిన కూలీలను, వారి భార్యలను, పిల్లలను, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలను, ఉరితీయబడ్డ శిరస్సులను, పడుపుకత్తెలను, ఖైదీలను, ఖూనీకోర్‌లను,
ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలను-కవిత్వంలోకి ప్రేమగా తీసుకురావడమే శ్రీశ్రీ అక్షరప్రపంచానికీ ప్రపంచానికీ చేసిన దోహదం. లోకపు ఆకాశాలను విశాలం చేసేవారిని లోకులు ఎన్నడూ మరచిపోరు. అందుకనే, ఆయనను ఈ శతజయంతి సందర్భాన సగౌరవంగా స్మరించుకుంటున్నాము.

ఇరవయ్యో శతాబ్దం తొలినాళ్లలో ప్రపంచాన్ని తపింపజేసిన ఒక మహాస్వప్నాన్ని తానూ కలగని పలవరించిన వాడు శ్రీశ్రీ. అది తొణకిన స్వప్నమా, తొలగిన స్వర్గమా? శ్రీశ్రీ ఇప్పటికీ, ఎప్పటికీ ఒప్పుకోడు. స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించే ఆశాదూతలవైపు చూపిస్తాడు. ఆకాశాలను లోకానికి చేరువగా తీసుకువచ్చే, ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అర్పించే సాధకుల వైపు చూపిస్తాడు.

గ్రంథాలయాల్లో నిద్రించకుండా శ్రీశ్రీని మెలకువగా ఉంచుతున్నది మరోప్రపంచపు నిర్విరామ సమరమే. శతజయం తి వేళ ఆయనను సమకాలికుడిగా మిగుల్చుతున్నది సమసమాజ ఆదర్శమే. ఆధునిక శబ్దానుశాసనుడుగా కీర్తిస్తారు శ్రీశ్రీని, గొప్పదనమంతా ఆయన పదజాలంలోనే ఉన్నట్టు. నిజమే. కవితాపాదాలను నినాదస్థాయికి తీసుకువెళ్లినవాడు శ్రీశ్రీ. రూపకాన్ని కొత్త ఎత్తులకు చేర్చినవాడు శ్రీశ్రీ.

ప్రవక్తలాగా, అభిభాషిస్తున్న మహావక్తలాగా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనిలో సాగే ఆయన చెప్పే కవితాపాదాలు కంఠోపాఠమైన అభిమానులు అసంఖ్యాకులు. ఆయన నుంచి అరువు తీసుకోనిదే తెలుగు పత్రికలకు రోజు గడవదు. ఏదోరూపంలో ఆయన తారసపడని తెలు గు రచనే కనపడదు.

కవి మాత్రుడు కాదు శ్రీశ్రీ. వ్యక్తికి బహువచనం శక్తి అన్న వాడు తా ను ఒక మహాశక్తిగా మారాడు. గోడలు పగులగొట్టడమే కాదు, నెత్తు రూ కన్నీళ్లు కలసిన కొత్త టానిక్ ఇవ్వడమే కాదు, కవిగా తాను సాధించిన ప్రఖ్యాతిని తిరిగి సమాజానికే ఇచ్చిన మనిషి. కవిత్వంలోనే కాదు పత్రికారచనల్లో ఉపన్యాసాల్లో సంఘ ఆచరణల్లో వేయిచేతులతో నోళ్ల తో తన ఆదర్శాలను సిద్ధాంతాలను చాటింపు వేశాడు.

ఒక్కడిని చేసి సాహిత్య సాంస్కృతిక లోకం ఆయనపై దొంగదాడి చేస్తే మనోవైకల్యానికి గురి అయ్యాడు. పౌరహక్కుల ఉద్యమానికి పాదు వేశాడు. స్పెయిన్ అంతర్యుద్ధం నుంచి ఫ్రాన్స్‌లో రెక్కవిప్పిన రివల్యూషన్ దాకా దర్శించిన బలవత్ ఝరవత్ పరివర్తనలను శ్రీకాకుళంలోకి అనువదించుకున్నాడు. తెలంగాణ పల్లెలను పాదచారియై పలకరించాడు. ఏ దేశమేగినా, ఏ సభలో మాట్లాడినా తెలుగు సాహిత్యం గొప్పదనం గురించి వైనవైనాలుగా వర్ణించి చెప్పాడు. వ్యక్తిగత అలవాట్ల గురించి డబ్బు ప్రలోభాల గురించి చిలవలు పలవలుగా లోకం మాట్లాడుకుంది కానీ, బైరాగితనంతో చేతిలో కాసులేకుండా మరణించాడు.

శ్రీశ్రీ లేకపోయాక అంతా శూన్యమే అన్నారు అనంతర కవులు. ఒక చారిత్రక విభాతం అందించిన అహంకారంతో ' ఈ శతాబ్దం నాది'అని శ్రీశ్రీ ప్రకటించుకున్నాడు. 1930 తరువాత తెలుగు సాహిత్యాన్ని తానే నడిపించానని చెప్పుకున్నాడు. అంటే అన్నాడు కానీ, తన జీవితకాలంలోనే పుత్రాదిచ్ఛేత్ పరాజయాన్ని అంగీకరించాడు. ఆరుద్రకు ఇచ్చిన వారసత్వం వెనక్కి తీసుకున్నాడేమో కానీ, గద్దర్ వంగపండులను ఔరసపుత్రులను చేసుకున్నాడు.

మహాప్రస్థానం నుంచి ఆరంభమైన ప్రవాహానికి తానే ఒక ఉపనదిగా మారిపోయాడు. తనను అధిగమిస్తూ ముందుకు వెడుతున్న తరాన్ని ప్రేమగా అనుసరించాడు. చాలా దూరం చూడగలిగాడు కానీ, మనసులను చాలా విశాలం చేయగలిగాడు కానీ- కొన్ని పార్శ్వాలకు కన్ను తెరువలేకపోయాడు, మరి కొన్నిటికి చెవియొగ్గలేకపోయాడు. కాలాన్ని దాటగలిగిన జ్ఞాను లు కూడా సర్వకాలాతీతులు కాదని నిరూపించాడు.

ఇప్పుడతను, ఒక వంక జయభేరి మోగిస్తున్న ప్రపంచీకరణను, భువనభవనపు బావుటాగా రెపరెపలాడుతున్న డాలర్‌నోటును చూసి నిరాశపడి- నిజంగానే, నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా అని సందేహంలో పడతాడా లేక : ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది అని ప్రకటిస్తాడా? చెప్పలేము. కానీ ఆయన సదస్సంశయాలూ ఆలోలములాలోచనలూ ఎట్లా ఉన్నా శాశ్వతచిరునామా ఆశావాదానికే కట్టబెట్టాడు.

కానీ, ప్రశ్నల్ని ఝళిపిస్తూ రంగస్థలాన్ని ఆక్రమించుకుంటున్న కొత్త సామాజిక, అస్తిత్వ శక్తులు తన అక్షరాలకు ఎన్నిమార్కులు వేస్తాయోనని మాత్రం భయం భయంగా వినయం గా మహాకవి నిరీక్షిస్తున్నాడు. ఆలోచిస్తే, ఆయనా ఒక ప్రాశ్నికుడే. ప్రశ్నించి ప్రశ్నించి ప్రపంచాన్ని విశాలం చేసిన వాడే. 'ప్రశ్నలే, ప్రశ్నలే, జవాబులు సంతృప్తి పరచవు'

2 comments:

  1. గత ఏడాదిగా శ్రీశ్రీని తల్చుకుంటూ ఊదరగొడుతున్న స్మారక వ్యాసాలకి భిన్నంగా చాలా బాగా రాశారు.

    ప్రాశ్నికుడే?
    ఆసక్తికరమైన ప్రయోగం.

    ReplyDelete