Sunday, May 16, 2010

 ఉరిశిక్షతో అంతా క్షేమమా?

కొందరు నిష్క్రమించినప్పుడు ప్రపంచం కాసేపు లేదా కొన్నాళ్లు శూన్యంగా కనిపించవచ్చు. మరి కొందరు వెళ్లిపోయినప్పుడు మాత్రం లోకం సజావుగా సాగుతున్నట్టు కనిపిస్తుంది కానీ, ఏదో ఒక చీకటి విడతలు విడతలుగా విరుచుకుపడుతుంది. పదే పదే ఆ ఖాళీని తడుముకోవలసివస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు, సమైక్యాంధ్ర నినాదం పరిస్థితిని అనూహ్యమైన మలుపులు తిప్పినప్పుడు - బాలగోపాల్ లేకపోవడం అటువంటి లోటుగానే కనిపించింది.   ఆయన క్రియాశీల ప్రజాజీవితం గురించిన లోటు సరే, ఆలోచనాపరుడిగా ఆయన ఉనికి చాలా అవసరంగా అనిపించిన సందర్భం అది. చలం చెప్పిన 'సూనృతశక్తి' కారణంగా లోకానికి దుర్నిరీక్ష్యంగా కనిపించి, అనివార్య గౌరవాన్ని, తన మాటలకు సాధికారతను పొందిన మేధావి ఆయన. అంతటా మౌనమో, ఒకే ఒక ఆవేశమో అలముకున్న సమయంలో, పరిస్థితిని అర్థం చేయించే చూపు ఆయన ఇవ్వగలిగేవాడు.

navya. బాలగోపాల్ ఇప్పుడేం చెబుతాడో అని వెదుక్కున్న అనేకానేక సందర్భాలలో తాజా సందర్భం కసబ్ ఉరిశిక్ష ప్రకటన. అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష తీర్పు అసహజమో అనూహ్యమో కాదు. కానీ దానికి భారతదేశ పౌరసమాజం, అందులోనూ ఉదారవాద భావాలున్న శ్రేణులూ ఎట్లా స్పందిస్తాయన్నది ఒక అవసరమైన కుతూహలం.
న్యాయం జరిగిందన్న ఆనందమూ దానితో ముడిపడిన ఆవేశోద్వేగాలూ అంతటా తీవ్రశ్రుతిలో వినిపించాయి తప్ప, భిన్నమైన స్వరాల అలికిడే లేదు. 'ఓపెన్' వారపత్రిక డిప్యూటీ ఎడిటర్ మనూజోసెఫ్ 'వేర్ ఆర్ ద బ్యూటిఫుల్ పీపుల్'?' (మే 14, 2010 సంచిక) అన్న వ్యాసంలో ఈ ప్రశ్నే వేశారు. కసబ్ వంటి వ్యక్తిని చంపకుండా వదిలిపెట్టాలని అనుకోగలిగే నైతిక ధైర్యం సామాన్యులకైతే ఉండదు కానీ, ఉన్నతమైన నైతిక స్పష్టత ఉన్న వాళ్లు ప్రతికూల స్పందనలకు, దూషణలకు కూడా సిద్ధపడి గొంతువిప్పాలి కదా? అన్నది ఆయన ప్రశ్న. బాలగోపాల్ ఉండి ఉంటే దీనిపై ఆలోచించడానికి ఒక ప్రాతిపదిక ఇచ్చి ఉండేవాడు.

మనూజోసెఫ్ ఆవేదనలో కొంత తొందరపాటు కూడా ఉన్నది. ఎంతటి అవగాహనాధైర్యమూ ఉన్నవారైనా సందర్భశుద్ధి లేకుండా స్పందనలను, అందులోనూ అప్రియ స్పందనలను అందించాలని కోరుకోవడం పొరపాటు, అందులోనూ జనంలో భావావేశాలు బలంగా ఉన్నప్పుడు. కాకపోతే, ఇప్పుడు ఘనీభవించిన మౌనాన్ని చూసినప్పుడు, క సబ్ విషయంలో కొంత కాలం గడచిన తరువాత అయినా గొంతులు విచ్చుకుంటాయా అని జోసెఫ్‌లో భయసందేహం కలిగి ఉండవచ్చు. ఎందుకంటే, కసబ్ మరణశిక్ష తీర్పు తరువాత వినపడవలసిన గొంతులేవీ వినిపించలేదు. మావోయిస్టు ఉద్యమం విషయంలో సాహసోపేతమైన రిపోర్టు రాసి, తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న అరుంధతీరాయ్ సైతం ఈ విషయంలో ఏమీ మాట్లాడలేదు. ఇందిర హంతకుల వకల్తా పుచ్చుకున్న రామ్ జెఠ్మలానీ వంటి వారు సైతం ఏమీ వ్యాఖ్యానించలేదు. కసబ్ విషయంలో జరగవలసింది ఒకటే అని దేశంలోని అసంఖ్యాకులు అనుకుంటున్నారు, ఈ విషయంలో మౌనమే శరణ్యమని ఇతరులు కూడా భావిస్తున్నారు. ఈ వాతావరణం ఎంత కాలం ఉంటుందో
చెప్పలేము. కొంతకాలం గడిచాక, ఈ ఉద్వేగాలు ఉండవు అనుకోవడానికి కూడా లేదు. కసబ్ మరణశిక్ష - ఇప్పటిదాకా పెండింగ్‌లో పడిన ఇతర శిక్షలను కూడా చర్చలోకి తెచ్చింది.  మరణశిక్షల అమలులో ఉన్న న్యాయ, రాజ్యాంగ ప్రక్రియలపైనే ఇప్పుడు అసహనం వ్యక్తం అవుతున్నది. పద్ధతిప్రకారం ప్రక్రియ జరగడం ఒక బలహీనతగా, అసమర్థతగా జనభాషణలో మారిపోయింది.

నిజానికి భారత రాజ్యం 'అసమర్థ'మైనదీ, 'బలహీన'మైనదీ కాదు. మనదేశంలో అధికారికంగా అమలుజరిగే మరణశిక్షలు స్వల్పం. అనధికార, చట్టవ్యతిరేక శిక్షలు అసంఖ్యాకం. సుదీర్ఘమైన న్యాయప్రక్రియలుకానీ, మరణశిక్షలపై పౌరహక్కులపై చర్చలు కానీ, ప్రజాస్వామ్యీకరణ కోసం జరిగే ఉద్యమాలు కానీ- భారతదేశపు ద్వంద్వ ముఖాలలో ఒకానొక ముఖానికి సంబంధించినవి మాత్రమే.
అసమానతలను కాపాడడానికి, ప్రశ్నించేవారి గొంతునొక్కడానికి వ్యవస్థలోను, ప్రభుత్వంలోను అనేక పద్ధతులు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి ఒక మతోన్మాదంగా మారిన దేశంలో, ప్రజాస్వామ్యం తరుచు ఒక పరిహాసాస్పద అంశంగా, బలహీనతగా పరిగణన పొందడం సహజం. భారతదేశంలోని ప్రజాస్వామ్యవ్యవస్థను స్వలాభంతో అనుభవిస్తున్న శక్తులే ఇటువంటి అప్రజాస్వామిక అభిభాషణలు చేస్తుండడం విషాద వైచిత్రి.

అజ్మల్ కసబ్ ఒక దుర్మార్గుడు. తీర్పుచెప్పిన న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు అతని క్రూరత్వాన్ని వర్ణించడానికి భాష చాలదు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లో కొన్ని నిమిషాల వ్యవధిలో 66 మందిని కాల్చిచంపిన ఘోరహంతకుడు అతను. నిజానికి అతను నవంబర్26 నాటి సంఘటనల క్రమంలోనే తక్కిన ఉగ్రవాదుల వలెనే చనిపోయి ఉండవలసిన వాడు. హత్యలు చేసి, ఆ తరువాత చనిపోవడమే తనకు అప్పగించిన పని అని అతనే వాంగ్మూలాల్లో చెప్పాడు. అతన్నిప్పుడు ఉరితీస్తే, అతని కోసం చెమ్మగిల్లే నయనాలేమీ ఉండవు. ఉండనక్కరలేదు కూడా.   విచారణాధికారులు చెప్పినదంతా వాస్తవమే అనుకుంటే, పాకిస్థాన్‌లోని కసబ్ తల్లిదండ్రులు కూడా తమ కుమారుడి చావుకు దుఃఖించకపోవచ్చు, కొడుకు ఘనకార్యం చేసి స్వర్గానికి వెడుతున్నాడని సంతృప్తిపడుతూ ఉండవచ్చు. అతనికి మరణశిక్ష విధించడంలోని మంచిచెడ్డలను ఎవరన్నా చర్చిస్తే- అది కసబ్ మీద ప్రేమతో కాదు, అతనికి ప్రాణభిక్ష పెట్టడం కోసం కాదు. ముంబైదాడులలో చనిపోయిన 170 మంది అమాయకుల మీద అగౌరవంతో కాదు.

ముంబైదాడుల వంటి సంఘటనల్లో బాధితులు ఎవరైనా కావచ్చు. మీరూ నేనూ అతనూ ఆమే ఎవరైనా కావచ్చు, హిందువులూ ముస్లిములూ క్రైస్తవులూ ఎవరైనా కావచ్చు. ఒక దుర్మార్గం లేదా ఒక దుర్ఘటన లేదా ఒక హత్యాకాండ లేదా ఒక ఉపద్రవం జరిగిన తరువాత- అటువంటివి మళ్లీ జరగకుండా ఏమి చేయగలమనేది ప్రభుత్వాలూ సమాజమూ ఆలోచించాలి. అందుకు పనికివచ్చేచర్యలు తీసుకోవాలి.   దురదృష్టవశాత్తూ- కసబ్ మరణశిక్ష ముంబైదాడుల వంటి సంఘటనలను నిరోధించలేదు.  ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్.. ఏ నగరంలో అయినా ఎప్పుడైనా అటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగవచ్చు.
ముంబై బాధితులు కానీ, పౌరులు కానీ, ఆ మాటకు వస్తే, రేపు బాధితులు అయ్యేఅవకాశం ఉన్న భారతపౌరులు ఎవరైనా కానీ అడగవలసింది- భారత ప్రభుత్వమా, అటువంటి మృత్యుక్రీడ మళ్లీ జరగకుండా, నువ్వేం చేస్తున్నావు? నీ గూఢచర్యమూ తుపాకీగుళ్లూ తనికీలూ సోదాలూ ఇవి కావు, అవేవీ దాడులను నిరోధించలేవు, మనుషులను లెక్కపెట్టి చంపే ఘాతుకాలు జరగవలసిన అగత్యం లేని, అటువంటి ఆలోచనలే రాని పరిస్థితులను సృష్టించడానికి నువ్వేం చేస్తున్నావు? మూలకారణాన్ని నువ్వు ముట్టుకున్నావా? ఎందుకంటే-- ముంబైదాడులకు మూలం కసబ్‌కాదు. ఆ హింసాక్రమంలో అతను ఆదీ కాదు, అంతమూ కాదు.  అతనిని తీర్చిదిద్దిన శక్తులూ, ఆ శక్తులకు కారణమైన పరిణామాలూ అన్నీ యథాతథంగా ఉన్నాయి. అతనికి శిక్షణ ఇచ్చినవారూ, అతనికి ఆదేశాలిచ్చినవారూ సురక్షితంగానే ఉన్నారు. ఇరుగుపొరుగులో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే అగ్రవాద తంత్రమూ అట్లాగే ఉన్నది. తల్లిదండ్రులకు డబ్బూ, యువరక్తానికి అమరత్వమూ కానుకగా వస్తే, ఎంతటి సాహసానికైనా, ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడగల పేదరికమూ వ్యవస్థాగత క్రౌర్యమూ అలాగే ఉన్నాయి. ఆదిమమైన సహజన్యాయం ఏదో దక్కిందని నిన్నటి బా«ధితులకు ఆత్మసంతృప్తి తప్ప, రేపటి బాధితులకు కసబ్ మరణశిక్షలో దాగిన హామీ ఏదీ లేదు.

ఇదంతా ఎక్కడ మొదలైంది? కసబ్ ఉరితాడును పట్టుకుని చరిత్రలోకి దిగితే ఎక్కడ అడుగు తగులుతుంది? విభజించి పాలించి కుంపట్లు మిగిల్చివెళ్లిన బ్రిటిష్ వలసవాదీ, ప్రచ్ఛన్నయుద్ధకాలంలో పశ్చిమాసియాలో పాగావేసిన అమెరికన్ సామ్రాజ్యవాదీ, ఆప్ఘనిస్థాన్‌ను కబళించిన సోవియట్ రష్యా, అంకుల్‌శామ్ ప్రోద్బలంతో దానికి పక్కలో బల్లెంగా మతోన్మాదాన్ని పెంచిన పాకిస్థాన్, భారతదేశంలోనే జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం, బొంబాయి పేలుళ్లు, గుజరాత్ మారణకాండ, అలవాటుగా ఆనవాయితీగా మారిపోయిన బాంబులక్రీడ- ఎన్ని ఎన్ని చెబితే ముంబయి దాడుల నేపథ్యం చెప్పగలము? కసబ్‌ను తీర్చిదిద్దిన హింసాశక్తులే కాదు, పరిస్థితులూ క్షేమంగా ఉన్నప్పుడు, ఎవరిని శిక్షించి ఏ ఘనకార్యం సాధించినట్టు సంబరపడాలి ? ఏ విజయానికి భ్రమించి, ఏ అపజయానికి అంధులమవుతున్నాము? - ఇటువంటి ప్రశ్నలు అడిగే స్థిమితం మన సమాజానికి లేదు.

మరణశిక్షను వ్యతిరేకించడమంటే, ఎంతటి ఘోరనేరానికి విధించేశిక్షనైనా వ్యతిరేకించడం అని మాటవరుసకు చెబుతున్నప్పటికీ, ప్రతీకారం ఒక జాతీయ ఉద్వేగంగా మారినప్పుడు నోరుపెగలని స్థితిలోకి భారతీయ సభ్యసమాజం చేరుకున్నది.  మరణశిక్షతో సమస్య పరిష్కారం కాబోతున్నదని పాలకులు మభ్యపెడుతున్నారని, ప్రమాదం మిగిలే ఉన్నదని హెచ్చరించలేని నిస్సహాయతలోకి మీడియా జారుకున్నది. వరుస బాంబుపేలుళ్ల కన్నా, ఉన్నట్టుండి పొరుగుదేశం నుంచి జరిగే దాడులకన్నా- మనుషులలో స్పందనలు, ఆలోచనలు గడ్డకట్టడం ప్రమాదకరం. జనంలో ఉండే సామూహిక ఆవేశాలకే మీడియా కూడా వేదిక కావడం వినాశనకరం.

No comments:

Post a Comment