Thursday, May 20, 2010

సరిహద్దులు

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి పనిచేస్తున్న శ్రీకృష్ణ కమిటీ ప్రస్తుతం సాగుతున్న 'సరిహద్దు'వివాదాన్ని గమనిస్తున్నదో లేదో తెలియదు. జనం సంగతేమో కానీ, రాజకీయాలలో మాత్రం స్పష్టమైన విభజన కనిపిస్తున్నది. ఎటువంటి ప్రత్యేక అనుమతులూ లేకుండా దేశంలోనే ఎక్కడైనా ఎవరైనా సంచరించవచ్చునని రాజ్యాంగం చెబుతుండగా, ఇంకా విభజన జరగని ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మరొకరు పర్యటించడం మీద పెద్ద రగడే జరుగుతున్నది.

వై.ఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్ మలివిడత 'ఓదార్పు యాత్ర' తెలంగాణ ప్రాంతంలో జరగనున్నది. లోక్‌సభలో సమైక్యాంధ్ర పక్షాన నిలిచిన జగన్ తెలంగాణలో అడుగుపెట్టడానికి వీలులేదని, ప్రతిఘటిస్తామని తెలంగాణ వాదులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆసక్తికరంగా ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీలో చిరుపోరు జరుగుతోంది. ఇక, ప్రత్యేకాంధ్రవాదుల ఆహ్వానం మీద ఈ నెలాఖరులో తీరాంధ్రలో పర్యటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె.చంద్రశేఖరరావు నిర్ణయించుకున్నారు. పర్యటనకు అభ్యంతరం లేదని సమైక్యాంధ్రవాదులు, నేతలు అన్నారు కానీ, గతంలో వాడిన 'విద్వేష' భాషకు కెసిఆర్ క్షమాపణ చెప్పికానీ రావడానికి వీలులేదనే గొంతులూ వినిపిస్తున్నాయి.

ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చుననే దానిలో సూత్రప్రాయంగా అభ్యంతరపెట్టవలసినదేమీ ఉండదు. ప్రజారంగంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను, సందర్భశుద్ధిని, ఔచిత్యాన్ని పరిగణనలోకి తీసుకుని తమ తమ చర్యలను రూపొందించుకోవలసి ఉంటుంది. ఎవరి సంచారమైనా జనభద్రతకు హానికరంగా పరిణమిస్తుందని భావించిన పక్షంలో
ప్రభుత్వ యంత్రాంగం ఆంక్షలు విధించడం కూడా జరుగుతుంటుంది. ఒక అభిప్రాయం బలంగా ఉన్న ప్రాంతంలో తద్విరుద్ధమైన భావాలున్నవారు పర్యటించడం, ప్రసంగించడం వల్ల అశాంతి ఏర్పడే అవకాశముంటుంది. అదే సమయంలో, తమ తమ నిరసనలను వ్యక్తం చేయడానికి ప్రజలకు ఉన్న హక్కును కూడా గుర్తించవలసి ఉంటుంది.పర్యటనలను నిరసించడం ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి 'గోబ్యాక్' నిరసనలు, పర్యటనల బహిష్కరణలు మనకు తెలిసినవే.

రాష్ట్రంలోని ఉభయప్రాంతాల మధ్య సరిహద్దుగోడలు నిర్మితమవుతున్నాయన్న అభిప్రాయం వై,ఎస్. రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికలకు ముందు నంద్యాల లో చేసిన ప్రసంగంలోనే వ్యక్తమయింది. హైదరాబాద్‌కు రావాలంటే రాయలసీమ, కోస్తాలకు చెందిన వారు వీసాలు తీసుకోవాలా?- అని ఆయన ఆనాడు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.   లేని గోడలను ఆయన కల్పిస్తున్నారని ఆనాడు తెలంగాణవాదులు విమర్శించారు. ఇక 2009 డిసెంబర్, జనవరి మాసాల్లో తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలు ఉధృతంగా ఉన్న కాలంలో, ఉభయప్రాంతాల మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సాధారణ ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు కానీ, అభిప్రాయాలు ప్రాంతాలవారీగా క్రోడీకరణ చెంది, భిన్నాభిప్రాయం వ్యక్తమయ్యే పరిస్థితే కనిపించలేదు.

ఉద్యమతీవ్రత, భావోద్వేగాలు అధికంగా ఉన్న తెలంగాణలో సమైక్యవాద నాయకులకు మాత్రమే కాదు, స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా సంచారం కష్టమయింది. ఖమ్మం వంటి సరిహద్దు జిల్లాల్లో వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరైన సీమాంధ్ర నేతలు గట్టి నిరసనలు ఎదుర్కొన్నారు.  ఇటువంటి పరిస్థితుల్లో జగన్, వైఎస్ మరణానంతర మృతుల కుటుంబాలకు ఓదార్పు ఇవ్వడానికి వరంగల్ వంటి తెలంగాణవాద కేంద్రానికి రావాలనుకోవడంలో రాజకీయ విజ్ఞత ఎంతవరకు ఉన్నదన్నది పక్కన బెడితే, ఆ పర్యటన జరిపే హక్కు ఆయనకు ఉన్నదని అంగీకరించాలి. సమైక్యాంధ్రవాదిగా ఆయనకు నిరసన తెలిపే హక్కు తెలంగాణవాదులకు కూడా ఉన్నదని గుర్తించాలి.

శాంతిభద్రతలకు, జగన్ క్షేమానికి హానికలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అయితే, గతంలోని అనుభవాలు ఆందోళన కలిగించే మాట నిజమే. నేతల పర్యటనలు ఉద్రిక్తంగా మారడానికి ప్రభుత్వ యంత్రాంగం అతిస్పందనలు కూడా ఒక కారణం. హైదరాబాద్‌లో ఓయూ కేంపస్‌లో రాజకీయనేతల పర్యటనలకు, జాతీయ స్థాయి ప్రతిపక్షనాయకురాలు సుష్మాస్వరాజ్ సభకు అనుమతి నిరాకరించడం ఈ సందర్భంగా కెసిఆర్ వంటి వారు గుర్తు చేస్తున్నారు.  అంతే కాదు, ఇతర ప్రాంతాల నేతలు పర్యటించినప్పుడైనా, స్థానిక ప్రజాప్రతినిధులు ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పుడైనా తెలంగాణవాదులు నిరసన తెలిపితే పోలీసులు కఠినంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. అతిగా స్పందించడం వల్ల తాత్కాలికంగా పరిస్థితి అదుపులోకి వస్తుంది తప్ప, దీర్ఘకాలికంగా ఉద్రిక్తత, వైరభావం పెరుగుతాయి. నిరసన ప్రదర్శనలను ప్రమాదకరమైనవిగా భావించడం ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదు. హక్కులను అనుమతించడం, శాంతిభద్రతలను కాపాడడం- పరస్పర విరుద్ధమైన అంశాలు కావు.

ఉద్యమనాయకత్వాలు కూడా ఈ సందర్భంగా గుర్తించవలసినది ఒకటి ఉన్నది. తమ తమ భావాలు బలమైనవని, న్యాయమైనవని భావించినప్పుడు భిన్నాభిప్రాయానికి భయపడవలసిన అవసరం లేదు. సహనం ఉదాత్తతకే గుర్తు అవుతుంది కానీ, బలహీనతకు కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక ఉద్యమాల నేపథ్యంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య దురదృష్టవశాత్తూ నెలకొన్న అపోహలు- ఇటువంటి పరస్పర భావ వినిమయం వల్లనే తొలగిపోతాయి. తమ వాదనలో ఉన్న న్యాయాన్ని, సహేతుకతని ఇతరులు గుర్తించడానికి ఇది ఒక అవకాశం. న్యాయం జరగదేమోనన్న అసహనం ప్రజాస్వామిక స్ఫూర్తినే దెబ్బతీయడం వాంఛనీయం కాదు. ఇతర పక్షాలతో మాట్లాడే సందర్భాలు వచ్చినప్పుడు ఆవేశాలు వెనుకపట్టు పట్టి, ఒప్పించే ధోరణిలో అనునయంగా వ్యవహరించాలన్న దృష్టికలుగుతుంది.  కేవలం టీవీ చానెళ్ల చర్చల్లో, తమ ప్రాంత ప్రజల మనోభావాలను సంతృప్తి పరచే లేదా ఆవేశాలను రెచ్చగొట్టే సవాళ్లు, దూషణలు చేయడం వేరు. వాస్తవ క్షేత్రంలోకి దిగి, ప్రతికూల వాతావరణంలో తమ అభిప్రాయాలను ప్రకటించడం వేరు. ఇటీవలి ఉద్యమాల కంటె ముందు రాష్ట్రంలో అటువంటి సహనపూర్వక వాతావరణం ఉండేది.   జయశంకర్ వంటి తెలంగాణవాద ప్రముఖులు సీమాంధ్రప్రాంతాలలో పర్యటించి తమ వాదాన్ని వినిపించి వచ్చేవారు. ప్రత్యేకవాదాన్ని వ్యతిరేకించేవారు కూడా తెలంగాణ ప్రాంతంలో తమ అభిప్రాయాలు నిర్భయంగా చెప్పగలిగేవారు. ఉద్యమాల తీవ్రత విషయంలో రాజీపడకుండానే, ఆ ప్రజాస్వామిక సంప్రదాయాన్ని పునరుద్ధరించడం తెలుగు సమాజానికి అవసరం.

No comments:

Post a Comment