Sunday, May 23, 2010

కార్పొరేట్ రాజ్యమూ... కొల్లాయి గాంధీ..

"నేను ప్రభుత్వం వారి ఆస్తిని కాదు. అమెరికా ప్రభుత్వానికి ఇక వీడ్కోలు. నా ఇష్టానికి వ్యతిరేకంగా అది నా మీద రుద్దిన పౌరసత్వానికి వీడ్కోలు. అది చేసే హత్యల్లో నేను భాగం కాలేను, నాకు జీవితం మీద అపారమైన ప్రేమ ఉంది.''- పోయిన సంవత్సరం జూన్19 నాడు తన అమెరికన్ పాస్‌పోర్టును, బర్త్ సర్టిఫికేట్‌ను ముక్కలు ముక్కలు చేసి ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి మీద సమర్పిస్తూ జెఫ్ నేబెల్ చేసిన ప్రకటనలోని కొన్ని వాక్యాలవి.   వియత్నాం యుద్ధంలో పాల్గొని, అమెరికాయుద్ధోన్మాదం ఎట్లా ఉంటుందో స్వానుభవంలో తెలుసుకుని, గాంధీ రచనల ద్వారా ప్రత్యామ్నాయ ఆలోచనల ప్రేరణ పొందిన నేబెల్ పదిహేను సంవత్సరాలుగా భారత్‌లోనే ఉంటున్నారు. మానసికంగా అమెరికాతో ఎప్పుడో తెగదెంపులు చేసుకున్న నేబెల్, సాంకేతికంగా కూడా మాతృదేశాన్ని పరిత్యజించారు.

navya. అమెరికా ప్రభుత్వమే కాదు, ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ దుర్మార్గమైనవే అన్నది నేబెల్ అవగాహన. ఇరవయ్యొకటో శతాబ్దం ప్రథమదశాబ్దం ముగుస్తున్నప్పుడు- గాంధీ, సత్యాగ్రహం అన్న మాటలు అతి పురాతనంగా, శిథిలంగా వినిపిస్తున్నప్పుడు నేబెల్ ఒక ఉలిపికట్టె, తెల్లతోలు ఉలిపికట్టె.

నేబెల్ ఇప్పుడు ఏ దేశపౌరసత్వమూ లేని మనిషి. అమెరికా పౌరుడిగా ఆ దేశ ప్రతిష్ఠను, సర్వాధికారాన్ని ధిక్కరించిన నేరగాడు. అతను భారత్‌లో ఏ ప్రతిపత్తితో నివసించగలడు? తనకు ఆశ్రయం ఇవ్వాలని అతను కోర్టును కోరాడు. అతని నివేదన విచారణలో ఉన్నది. దౌత్యఅంశాలు, చట్టపరమైన నిబంధనలు ఏమి చెబుతున్నా, అతను గాంధేయవాదిగానే ఆ సత్యాగ్రహాన్ని ప్రదర్శించాడన్నది ఫలితంపై ప్రభావం చూపించక తప్పదు. సోషలిజాన్ని సాధన చేసిన దేశాల దగ్గరనుంచి, నియంతృత్వంతో తలలెగురవేసిన దేశాల దాకా- అన్నీ దుర్మార్గమైన ఏకస్వామ్య దేశాలనీ, ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ అంటే ఆయా దేశాల ప్రజలకు తెలియదని అమెరికా చెబుతూ వచ్చింది, దేశదేశాల నుంచి ఏలికల బాధలు పడలేక శరణు కోరిన వారికి తన పాదాల చెంత కొంత చోటిచ్చింది.  ప్రచ్ఛన్నయుద్ధకాలంలో తూర్పు నుంచి పడమరకు జరిగిన ఫిరాయింపులు అసంఖ్యాకం. వాటికి లభించిన ప్రచారం అమితం. స్టాలిన్ కుమార్తె స్వెత్లానా కూడా వయా భారత్ అమెరికాకు ఫిరాయించారు. ఒక్క దలైలామాకు తప్ప మరే ప్రముఖుడికీ భారత్ ఆశ్రయమిచ్చినట్టు కనిపించదు. అటువంటిది సాక్షాత్తూ, ప్రపంచ స్వేచ్ఛకు రాజధాని అయిన అమెరికాను రోసి, పౌరసత్వ కిరీటాన్ని కాలదన్ని నేబెల్ భారత్‌ను రాజకీయ శరణు కోరడం ఆశ్చర్యాతి ఆశ్చర్యం. అమెరికాకు తోకగానో, ఈకగానో మారిపోతుందనుకున్న భారత్‌ను, అమెరికాకు ప్రత్యామ్నాయంగా లేదంటే భిన్నంగా భావించడం ఆశ్చర్యమే కాదు, ప్రతిష్ఠాత్మకం కూడా.

కానీ, నేబెల్ అమెరికన్ ప్రభుత్వాన్ని హింసావిధ్వంసాల కుంభస్థలంగా గుర్తించిన మాట నిజమే కానీ, అతని దృష్టిలో మంచి ప్రభుత్వాలంటూ లేనే లేవు. " రాజకీయ అధికారమంతా నియంతృత్వమే. అధికారం ఏ రూపంలో ఉండాలి, సరిహద్దులను ఎట్లా నిర్ణయించాలి, తన పరిధి ఎంత వరకు, పన్నులెంత వసూలు చేయాలి- వీటన్నిటిలోనూ ఏకపక్ష అధికారమే. వాటిని ఎవరైనా నిరాకరిస్తే, ధిక్కరిస్తే చివరకు మిగిలేది జైలు లేదంటే, ప్రతిఘటనలో మరణం'' అంటాడతను. రాజ్యం అంటేనే మానవచైతన్యానికి పట్టిన చీడ, రాచపుండు. అది జీవితానికి, నీతికి వ్యతిరేకం, మానవప్రాణులకు ఆత్మహత్యాసదృశం. రాజ్యం సారాంశమే బెదిరింపు లేదా అవిధేయులపై బలప్రయోగం- అని అతని నిర్ధారణ. ఎంత ఉదాత్తంగా కనిపించే ప్రభుత్వమైనా చెడు నుంచి దూరంగా ఉండలేదు. ఎందుకంటే, దాని పుటుకే హింసలో, దాని బతుకే అబద్ధం, హింస. ఈ భూప్రపంచం మీద ఏ ప్రభుత్వానికీ దాని భూమి మీద న్యాయమైన హక్కులేదు. రాజ్యం చేతుల్లో ఉన్న నేల అంతా కొల్లగొట్టినదీ, దొంగిలించిందీ. అయితే, అతను ఏమి కోరతాడు, లోకం ఎట్లా ఉండాలి?

ప్రపంచ ప్రజలంతా పరస్పరం సహకరించుకుంటూ, చిరకాలం మన్నే విధంగా వనరులను బాధ్యతగా వినియోగించుకుంటూ ఉండే సమాజాలుగా వ్యవహరించాలని నేబెల్ కోరిక. ప్రపంచంలోని అన్ని మతాల, ధర్మాల సిద్ధాంతాలలోని మౌలిక భావనలకు కట్టుబడి మనుషులు బతకాలని ఆయన అంటారు. ఏమిటా మౌలిక భావనలు? చంపకు, అపహరించకు, జీవితాన్ని ప్రేమించు, అపకారం చేయకు, ఏమి చెబుతావో దాన్ని చేయి, దురాశ నుంచి ప్రలోభం నుంచి దూరంగా ఉండు, ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మలచడానికి నీ సమయాన్ని, శక్తిని, సంపదను వినియోగించు.

మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీకి నిజంగా అంత శక్తి ఉందా? లోకం ఇప్పుడు నడుస్తున్న తీరుకు ఒక ప్రత్యామ్నాయం ప్రతిపాదించగలిగిన శక్తి ఆయన నమ్మకాలకు ఉన్నదా? గాంధీ గురించి ఈ దేశంలో ఉన్న అంచనాలు ఆయనకు అంతటి స్థానాన్ని ఇవ్వవు. ఆయన మార్గాన్ని అక్షరాలా విశ్వసించి, దానికి ఒక తాత్విక ప్రతిపత్తి కల్పించాలనుకునే వారు ఎవరైనా ఉంటే గింటే ఆ తరం అంతరించిపోయింది. ఆయనను సమకాలంలోనూ, ఆ తరువాతా విమర్శించినవారు తీసుకున్నంత సీరియస్‌గా ఆయన అనుయాయులు ఆయనను తీసుకోలేదేమో అనిపిస్తుంది. గాంధీ అహింసామార్గం ఒక వర్గసామరస్యధోరణి అని, ఆయన అంతరాంతరాలలో వర్ణాశ్రమ ధర్మాన్ని విశ్వసించి, ఎదుగుతున్న భారతీయ జాతీయసంపన్నవర్గానికి అండదండగా ఉన్నవాడని, బ్రిటిష్‌సామ్రాజ్యవాదంతో ఆయన ఎప్పుడూ రాజీలేని పోరాటం చేయలేదని కమ్యూనిస్టులు, సోషలిస్టులు, సామాజిక ఉద్యమకారులు, రకరకాల మిలిటెంట్ స్వాతంత్య్రపోరాటవాదులు విమర్శించారు. భారతదేశం వంటి విశాలమైన, విభిన్న జీవనరీతులు, కులాలు, మతాలు, తెగలు ఉన్నదేశంలో, 'ఆధునికత' ఇంకా శైశవదశలో ఉన్న కాలంలో- ఒక విశాల ప్రజాఉద్యమాన్ని నిర్మించడంలో ఆయనకుండే పరిమితులను, స్థలకాలాదులకున్న పరిమితులను నిజంగా గాంధీ విమర్శకులు పరిగణనలోకి తీసుకున్నారా అని సందేహం కలుగుతుంది. ఆయన నిజంగా భావి భారత పాలకవర్గాల కోసమే ఉద్యమాన్ని నడిపాడనుకున్నా, ఆ క్రమం బాధ్యతారహితమైన, దేశభక్తి రహితమైన నేటి కార్పొరేట్ సంపన్న వర్గాల అవతరణకు దారితీస్తుందని ఆయన ఊహించారా, ఆశించారా? అన్నది మరో ప్రశ్న. నిరాడంబరత, ప్రకృతిసహజమైన జీవనం, మితమైన వనరుల వినియోగం, నైతికతకు పెద్దపీట- వంటి గాంధీ పాటించిన, బోధించిన విలువలను కానీ, వాటి వెనుక ఉన్న ఆయన దృక్పథాన్ని ఆయన సమర్థకులు, విమర్శకులు కూడా పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది. జెఫ్ నేబుల్ వంటి వారు నేటి కార్పొరేట్ దురాశా వ్యవస్థలకు ప్రత్యామ్నాయం గాంధీ బోధనలలో ఉన్నదంటే అందుకే ఆశ్చర్యం వేస్తుంది.

నూతన ఆర్థికవిధానాలు ఆరంభమైన తొలిసంవత్సరాలలోనే ఒక ఆంగ్లపత్రికలో 'కొద్దిగా వేగం తగ్గిద్దామా'? అంటూ ఒక వ్యాసం వచ్చింది. అభివృద్ధి రథచక్రాలు దుర్మార్గమైన వేగంతో వెడుతున్నాయని, దానితోపాటు మనుషుల్లో సంపాదనావ్యసనం, భోగలాలస, సరుకుల వినియోగం- అన్నీ పెరిగిపోతున్నాయని,గతంలో ఎన్నడూ లేనంతగా మనిషి ప్రకృతిని కొల్లగొడుతున్నాడని, ఈ పరిస్థితి మనుషులను మరింత క్రూరులుగా, లోభులుగా మారుస్తున్నదని ఆ వ్యాసం హెచ్చరించింది. ఒక ప్రక్రియ మన్నిక ఉండే విధంగా సాగకుండా పట్టుతప్పి వేగంగానో, మందకొడిగానో సాగుతున్నప్పుడు, ఆప్రక్రియపై నమ్మకం ఉన్నవారు సైతం హితవులు చెబుతారు. సమాజంలో అసమానతలను కాపాడాలనుకునేవారు సైతం, అంతరాలు మరీ పెరిగిపోతే అసలుకే మోసం వస్తుందని ఆధిపత్యవర్గాలకు సలహా ఇస్తారు. దుర్మార్గం తగ్గించుకోకపోతే, కొన్ని సంస్కరణలన్నా ప్రవేశపెట్టకపోతే జనం తిరుగుబాటు చేస్తారు జాగ్రత్త అని అగ్రవర్ణాలకు, వర్గాలకు వారి హితవరులే బోధ చేస్తారు. చరిత్రలో అటువంటి సందర్భాలు అనేకం. ఇప్పటి విచిత్రస్థితి ఏమిటంటే- సమాజంలో పగ్గాలు లేని అభివృద్ధి అశ్వం మీద సవారీచేస్తున్న పెద్దలకు నాలుగు మంచిమాటలు చెప్పగలిగే అస్మదీయులే లేరు. మొత్తం వ్యవస్థనే కడిగిపారేయాలనేవారు ఎలాగూ ఉంటారు, వారి కార్యక్షేత్రం, కార్యక్రమం వేరు. కానీ, అదుపు తప్పి ఆత్మహత్యాసదృశంగా మారిన వృద్ధి ఉన్మాదాన్ని కాసింత ఉపశమింపజేయాలని ప్రయత్నిస్తున్న మధ్యేమార్గవాదులు లేరు. బహుశా, గాంధీ ఆ లోటును పూర్తి చేయగలడనుకోవచ్చు. మనుషుల మధ్య తక్కువ హింస, ఎక్కువ సహకారం, ప్రకృతితో తక్కువ వైరం, ఎక్కువ మమకారం, తక్కువ కాపీనం, ఎక్కువ సంతృప్తి కలిగిన సమాజాన్ని సృష్టించాలనుకునే జెఫ్ నేబెల్ ఆదర్శం గాంధీని ఆలింగనం చేసుకోవడం అందుకే అతి సహజం.

No comments:

Post a Comment