Monday, May 31, 2010

వైఎస్ జగనూ, శ్రీకృష్ణకమిటీ, చిరంజీవీ, మధ్యంతరమూ

రాష్ట్రంలో పెరిగిన రాజకీయ ఉష్ణోగ్రత యాదృచ్ఛికంగా ముసురుకున్న అనేక పరిణామాల ఫలితమని అనిపిస్తుంది కానీ, నిజంగా అందులో యాదృచ్ఛికత పాలు ఎంత ఉన్నదో ఆలోచించవలసినదే. భావోద్వేగాలు, ఉద్యమ అవసరాల రీత్యానే జగన్ పర్యటనను తెలంగాణవాదులు నిరోధించాలనుకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న కలహం కీలకదశకు చేరడానికి అది దోహదపడడమేమిటి, చిరంజీవికి సోనియా పిలువు రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు అదనపు ఓట్ల కోసమని చెబుతున్నా, అంతకు మించిన ఆంతర్యమేదో అందరికీ బోధపడడమేమిటి, తమ పార్టీ ప్రభుత్వం మీదనే జగన్ ఫిర్యాదు చేయడమేమిటి, తమ పార్టీ ఎంపీ మీదనే ప్రణబ్ బహిరంగ అభిశంసన ఇవ్వడమేమిటి- అంతా ఆశ్చర్యమే.

లగడపాటి దగ్గరనుంచి లక్ష్మీపార్వతి దాకా జగన్‌కు కొత్త సమర్థకులు లభించడమేమిటి, నిన్నటిదాకా తెలంగాణలో అనుంగు సహచరులుగా ఉన్నవారు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఎడం జరగడమేమిటి, ఇంత కోలాహలం నడుమ తెలుగుదేశం మహానాడు గొంతు పీలగానైనా వినిపించకపోవడమేమిటి- అన్నీ ఆశ్చర్యాలే.

navya. సద్దుమణిగిందనుకున్న తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉందని కొందరు కనిపెట్టి ఉండవచ్చు. ప్రజారాజ్యానికి మంచిరోజులు వస్తున్నాయని మరికొందరు శకునం చెప్పవచ్చు. జగన్‌తో పోరాడుతున్నది రోశయ్యో అధిష్ఠానమో ఎవరైతేనేం
వారిదే పైచేయి అయిందని ఇంకొందరు విశ్లేషించవచ్చు. అయితే ఏమిటి? అంతవరకేనా ఆసక్తులు ఉండవలసింది? పైనచెప్పిన పరిణామాలూ వ్యక్తులూ సంస్థలూ ఉద్యమాలూ అన్నీ అందరూ ప్రజాజీవనంతో ముడిపడిఉన్నవారు కాదా?ఈ పరిణామాల వెనుక జరుగుతున్నదేమిటి? ఇదంతా దేనికి దారితీస్తుంది? అన్న కుతూహలమైనా ఉండవలసిన అవసరం లేదా? ప్రజలకు ఉండవలసింది కేవలం కలహభోజనాసక్తేనా, రాజకీయక్రీడాసక్తేనా? ఒక దృష్టి నుంచి చూస్తే, ఇదంతా రాజశేఖరరెడ్డి దుర్మరణం నుంచి ప్రారంభమైన సంఘటనల పరంపర. దానితో పాలకపార్టీలో నాయకత్వ సంక్షోభం మొదలయింది.

ఆ నేపథ్యంలో --గత నవంబర్ నెల చివరలో కె.చంద్రశేఖరరావు ఆమరణదీక్ష ప్రారంభించిన తరువాత మొదలైన రాజకీయ పరిణామాల క్రమం, డిసెంబర్9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన తరువాత ఒక కీలకస్థితికి చేరింది. అప్పటినుంచి ఆ క్రమం వెనక్కి తిప్పలేని విధంగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కానీ, సమైక్యాంధ్ర ఆందోళన కానీ బలంగా లేకపోవచ్చు.

కానీ, విభజన స్థిరపడిపోయింది. పార్టీలన్నీ శిబిరాలుగా మారిపోయాయి. శ్రీకృష్ణ కమిటీ నియామకం తరువాత పరిస్థితిలో స్థిరత్వం వచ్చింది కానీ, అది పరిష్కారాన్ని వాయిదా వేసే స్థిరత్వమే కానీ, దానంతట అదే శాశ్వత పరిష్కారం కాదు. కమిటీకి నివేదనలు ఇచ్చేవారు ఇస్తున్నారు, దాని పని అది చేస్తూ పోతున్నది కానీ, రాష్ట్రంలో పరిపాలన ఒక విచిత్రమైన స్తబ్దతకు లోనయింది.

రాష్ట్ర ప్రభుత్వంలో సాధికారత కలిగిన నాయకత్వం సమస్య అట్లా ఉండగా, ఏ పార్టీ కూడా దీర్ఘకాలికమైన దృష్టి నుంచి చూడలేని స్థితి ఏర్పడింది. రాష్ట్రాభివృద్ధి గురించి శాశ్వత ప్రణాళికలు వేయలేని పరిస్థితి, ప్రస్తుత ప్రభుత్వ నాయకత్వం స్థిరత్వం ఎంత వరకు అన్నది అనిశ్చితంగా ఉండడంతో- రాజకీయమైన తాత్కాలిక దృష్టి ఆవరించింది.


రోశయ్యకు పోటీదారుగా భావిస్తున్న జగన్ విషయంలో ప్రతిపక్ష పార్టీలకు కూడా తీవ్ర అభ్యంతరాలుండడంతో- జగన్‌మీద యుద్ధంలో కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గరనుంచి తెలుగుదేశం, టిఆర్ఎస్ దాకా అందరూ ఒకే వైపు ఉన్నట్టు కనిపించసాగారు. రాష్ట్రవిభజన జరిగితే పరిస్థితి ఏమిటి అన్న విషయంలో కూడా దీర్ఘకాలికమైన వ్యూహాన్ని రూపొందించుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉండిపోయింది.

ఈ దశలో భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది, అప్పటి అవసరాలేమిటి అన్న ప్రశ్నలకు ఎంతో కొంత సమాధానం తెలిసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో పార్టీ నాయకత్వ సమస్య ముందుకు వచ్చినప్పుడు- ఢిల్లీ నేతలకు జగన్ విషయంలో ఇప్పటి స్థాయిలో వ్యతిరేకత ఉండి ఉండకపోవచ్చు.

రాజశేఖరరెడ్డి విజయవంతమైన నాయకత్వంలోనూ కొన్ని సమస్యలను ఎదుర్కొన్న అధిష్ఠానం- జగన్ వ్యవహారసరళి చూసి బెదిరిపోయి ఉంటుంది. అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలమంతా రోశయ్యతోనే నడిపించాలన్నది ఢిల్లీ ఉద్దేశం అయి ఉండే అవకాశం లేదు. వై.ఎస్. అనంతర 'శూన్యం' లేదా 'సంక్షోభం' నేపథ్యంలోనే కెసిఆర్ నిరాహారదీక్ష, తదనంతర ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన ఒక సంభావ్యతగా ముందుకు వచ్చింది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా కానీ, దానితో నిమిత్తం లేకుండాకానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏమి చేయాలో ఇప్పటికే ఆ పార్టీకి ఒక అవగాహన ఉండి ఉండాలి. రాష్ట్రవిభజనకూ రాష్ట్రంలోని ప్రస్తుత నాయకత్వ సమస్యకూ ముడిపెట్టి కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తున్నదా, కేవలం తాత్కాలిక ప్రాతిపదికన సమస్యలను పరిశీలిస్తున్నదా తెలియదు కానీ, సమగ్రమైన వ్యూహం ఏదో ఆ పార్టీకి ఉన్నదేమోనన్న అనుమానం మాత్రం కలుగుతుంది.

1 comment:

  1. కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్రమైన వ్యూహమే ఉంది ఉండవచ్చు. రాష్ట్ర విభజన గురించి ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటుంది అనడం లో సందేహం లేదు.

    ReplyDelete