Monday, June 7, 2010

కోహినూరే కాదు, ఇంగ్లండ్ వెలుగే మనది!

సుమారు ఇరవయ్యేళ్ల కిందట. రాంచీలో జర్నలిస్టుల జాతీయ సభలు జరుగుతుంటే వెళ్లి, పనిలో పనిగా కొందరు మిత్రులం బుద్ధగయ, రాజగృహ, నలంద చూడడానికి వెళ్లాం. నలంద నుంచి గయ తిరిగి వచ్చేటప్పుడు ఒక ప్రైవే టు జీపులో వచ్చాము. లోకల్‌గా షటిల్ సర్వీసు నడిపే ఆ జీపు డ్రైవర్ మా దగ్గర మనిషికి ఇర వై రూపాయలు అడిగాడు. అదే జీపులో ఎక్కిన ఇద్దరు విదేశీ టూరిస్టులకు మాత్రం మనిషికి మూడువందలు డిమాండ్ చేసి బేరం తరువాత రెండువందలకు దిగాడు. వాళ్లు అదే మహద్భాగ్యమని ఎక్కేశారు. మేం జీపు డ్రైవర్‌తో మాటలు కలిపి, అన్యాయం కదా, వాళ్ల దగ్గర రెండొందలు రెండొందలు వసూలుచేయడమని అడిగాము. అప్పుడా బీహారీ డ్రైవర్ చెప్పిన సమాధానం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. రెండొందలేళ్లు దోచుకున్నారు సార్, ఎన్ని రెండొందలు అయి తే ఆ బాకీ తీరుతుంది?''. ఆ ఇద్దరు విదేశీ టూరిస్టులు బ్రిటిషర్లు అవునో కాదో కానీ, ఆ డ్రైవర్ అందరు తెల్లటూరిస్టుల నుంచి అదే తర్కంతో నైతిక ధైర్యంతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నాడు.

navya. చరిత్రకు సంబంధించిన ఒక స్పృహ, చారిత్రక అన్యాయాలకు పరిహారం పొందాలన్న దృష్టీ ఒక సాధారణ ఉత్తరాది అర్థ విద్యావంతునికి ఉండడం ఆశ్చ ర్యం కలిగిస్తుంది. భారతదేశంలోని మహా మహా దేశభక్తులకీ, మేధావులకీ అటువంటి ఆలోచనే లేకపోవడంతో పాటు, అసలేమీ జరగనట్టు బ్రిటన్‌పైనా అమెరికాపైనా ఆరాధానాపూర్వక అభిప్రాయాలు ఉంటాయి. ముప్పయ్యేళ్ల కిందట ప్రిన్స్ చార్లెస్ మనదేశం వచ్చినప్పుడు ఒక సినిమా నటి ఆయనను ముద్దుపెట్టుకుని సృష్టించిన సంచలనమే తప్ప మరో రాజకీయ ప్రకంపన లేదు. మన రాష్ట్రం లో మాత్రం రాడికల్స్ అల్లూరి సీతారామరాజు అమరత్వాన్ని గుర్తుచేసుకుని గోబ్యాక్ చెప్పారు. భారతదేశం స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఎలిజబెత్ రాణి మన దేశ సందర్శనకు వచ్చినప్పుడు మాత్రం జలియన్ వాలాబాగ్ మారణకాండకు బ్రిటన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ప్రబలంగా వినిపించింది. చివరకు ఆమె క్షమాపణ చెప్పలేదనుకోండి. మధ్య ఆసియానుంచో, పడమటి కనుమల గుండానో మన దేశానికి వచ్చి రాజ్యాలు స్థాపించి
ఇక్కడే స్థిరపడిపోయిన బహమనీలు, మొగలులు, కుతుబ్‌షాహీల వంటి వారిమీద ఉన్న వ్యతిరేకత, రెండువందలేళ్లు దేశాన్ని నిలువునా దోచుకుని సంపదనం తా తరలించుకుపోయిన బ్రిటిష్‌వారి మీద లేకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది.

రెండోప్రపంచ యుద్ధంలో చావు తప్పి కన్నులొట్టపోయింది కాబట్టి, చితికిపోయి న వైభవం మీద ఉన్న జాలితో బ్రిటన్‌ను భారతీయులు క్షమిస్తారేమో కానీ, అంత క్షమకు ఆ దేశం అర్హమైనదేమీ కాదు. చింతచచ్చినా పులుపు చావనట్టు- సొంతం గా ఫాక్‌లాండ్స్ యుద్ధం వంటి చిన్న చిన్న ఘర్షణల్లోకి దిగడంతో పాటు, అమెరికాతో కలసి ఆఫ్ఘానిస్థాన్, ఇరాక్‌లలో యుద్ధ యుగళగీతాలు పాడుతున్నది. ప్రతిరోజూ యునైటెడ్ కింగ్‌డమ్‌లో అహంకారపు రవి అస్తమిస్తూనే ఉన్నాడు కానీ, జ్ఞాన సూర్యుడు మాత్రం ఉదయించడం లేదు.

మా కోహినూర్ వజ్రం మాకివ్వండని భారతదేశ ఎంపీ లు బ్రిటిష్ ప్రభుత్వానికి మళ్లీ అర్జీ పెట్టుకున్నారు, మేం ఇవ్వం పొమ్మని వాళ్లు మళ్లీ చెప్పారు. సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన అతి విలువైన ఆ వజ్రం అనేక చేతులు మారి చివరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కిరీటంలోకి వెళ్లింది. వలసవాదం లేకపోతే, దాని గమ్యం 'టవర్ ఆఫ్ లండన్' అయి ఉండేదే కాదు. కాకతీయుల సామ్రాజ్యంలో భాగంగా ఉండిన నేటి గుంటూరు జిల్లా పరిటాల దగ్గర దొరికిన ఆ వజ్రం, తుగ్లక్ వరంగల్ ముట్టడిలో ఢిల్లీ కైవసం అయింది. ఆ తరువాత నాదిర్‌షా దాన్ని నెమలి సింహాసనంతో పాటు తరలించుకుపోయాడంటారు. ఆఫ్ఘానిస్థాన్‌మీద దాడి చేసిన సిక్కు యోధుడు రంజిత్‌సింగ్ దాన్ని తిరిగి భారత్‌కు తీసుకువచ్చాడు. తన మరణానంతరం ఒరిస్సాలోని పూరి జగన్నాథాలయానికి అప్పగించాలని రంజిత్‌సింగ్ వీలునామా రాశాడు. ఆ విల్లు అమలుకాకుండా, అతని వారసుడినుంచి బ్రిటిషర్లు ఆ వజ్రా న్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 22 గ్రాముల బరువున్న ఆ వజ్రం విలువ తో ప్రపంచానికంతా రెండురోజుల పాటు అన్నం పెట్టవచ్చునని మొగలుల కాలం లో చెప్పుకునేవారట. ఇప్పుడు అంతకంటె విలువైన రత్నాలు,వజ్రాలు ఉండి ఉండవచ్చును కానీ, చరిత్ర సమకూర్చే అదనపు మూల్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే దానికి మించిన 'రాయి' మరొకటి లేదు. బ్రిటిష్ రాణి కిరీటంలో ప్రధాన వజ్రంగా మారిన కోహినూర్ కేవలం వైభవ చిహ్నమేనా? వలసవాద, పరాధీన భారతదేశపు దైన్యం కూడా దాని ధగధగల్లో మిళితమై ఉన్నది.

మన కోహినూర్ మనకు కావాలని అడగడం న్యాయం. అందులో సందేహం లేదు. కానీ అడగవలసింది అది ఒక్కటేనా? రెండు వందల ఏళ్ల వలసపాలనకు పరిహారం అడగక్కరలేదా? అణుయుద్ధ బాధితురాలైన జపాన్ పరిహారం కోరిం ది, బానిస వ్యాపారంతో అమానుషత్వానికి పాల్పడినందుకు ఆఫ్రికన్ సమాజం చర్చిని క్షమాపణ కోరింది. మన దేశం ఏమి కోరింది?   బ్రిటిష్‌వారు వేసిన రైలు మార్గాలకీ, వారు నేర్పిన సంస్కారానికీ, ప్రవేశపెట్టిన ఆధునికతకీ పరవశించడం తప్ప, మన దేశభక్తులు చేస్తున్నదేమిటి? దేశానికి స్వాతంత్య్రం ఇచ్చేముందు, ఈ దేశంలోని దళితులకు, బలహీనులకీ రక్షణ ఏర్పాట్లు చేసి వెళ్లమని అడిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా- బ్రిటిష్ వారి దోపిడీని తీవ్రంగా ఏవగించుకున్నారు.  వారు తెచ్చిన సంస్కారానికి బదులుగా మనమేమి కోల్పోయామో తెలుసునా అని ప్రశ్నించారు. బ్రిటిష్‌వారు భారత్‌కు చేసిన దానిని డబ్బు, సంపదలతో కొలవగూడదని చెబుతూనే ఆయన ఇలా అంటారు. 'మొగలులు మరాఠాల అనంతర పాలకులు నైతికంగా మెరుగైన వారేమీ కాదని, స్థానిక నిరంకుశులు బందిపోట్లు అని చెప్పబడిన వారి పాలనలోనే మహోన్నత సంస్కృతీపరులమనిచెప్పుకున్నవారి పాలన కంటె దేశ ఆర్థిక స్థితి మెరుగుగా ఉంద'ని ఆయన సోదాహరణంగా నిరూపించారు.

భారతదేశంలో చేతి వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసంచేసి ఇంగ్లండ్ సంపాదించింది చాలా ఉన్నది. ఇక్కడి వనరులను దోచుకుని తరలించినదీ చాలా ఉన్నది. రెండువందల ఏళ్ల కాలంలో వందలాది కోట్ల పౌండ్ల ధనాన్ని ఈస్టిండియా కంపెనీ కానీ, ఇంగ్లండ్ ప్రభుత్వం కానీ దోచుకున్నాయి. స్వాతంత్య్ర సమయంలో వాటికి దొరికిన పరిహారం ఎంత? ఇక వెళ్లిపోయి అరవయ్యేళ్లయి నా, ఇంకా దేశంలో బ్రిటిష్‌వారు పెట్టివెళ్లిన టైమ్‌బాంబులు పేలుతూనే ఉన్నా యి. వర్తమాన భారతం లోని సమస్యలన్నిటికీ మూలం బ్రిటిష్ పాలనలోనే ఉన్నా యి. మరి నేటి సంక్షోభాలకు దేశం చెల్లిస్తున్న మూల్యానికి పరిహారం ఏది? 

మన దేశానికి చెందిన అనేక పత్రికలు పుస్తకాల మూలప్రతులు, అనేక కళాఖండాలు కూడా ఇంగ్లండ్‌లోనే ఉన్నాయి. మనకు మన ప్రాచీన సంపద కావాలంటే, పాతకాయితాల ప్రతులు కావాలంటే ఖరీదు ఇచ్చి కొనుక్కోవాలి. కోహినూర్ కూడా ఖరీదుకు ఇస్తారేమో కనుక్కుంటే సరిపోతుంది.

9 comments:

 1. బ్రిటిష్ పురాతన వస్తు చట్టం లేకపొతే ఈపాటికి ఏ అంబానిలొ , మిట్టలొ కొనేసి ఉండేవారెమో.. ఈస్టిండియా కంపెనీని ఎందుకూ పనికిరాదని తెలిసినా పంతానికి పోయి మన ఇండియన్ ఒకతను ఈమద్యే సొంతం చేసుకున్నాడుట.. అది బ్రిటిష్ పురాతన వస్తు చట్టం కింద రాదు కాబట్టి వీలయింది.. ఇది అలా కుదరదు కదా..
  బ్రిటిష్ వారికి వీర భక్తులు ఈ తరం లొ చాలా మంది వున్నారు.. అసలు బ్రిటిష్ వారె రాకపొతే ఇండియా ఎమయిపొయేదొ.. అని వాపొయె మేధావులకి కొదవలేదు .. ఈ మద్య అలాంటి వ్యక్తిలొ ఒక బ్లాగులొ వాదించల్సి వచ్చిందిలెండి అందుకే గుర్తొచ్చింది..

  ReplyDelete
 2. శభాష్! మంచి విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు.
  కానీ " సోదాహరణంగా వివరించారు" అని చెప్పిన విషయం కొంచెం తికమక పెడుతోంది వివరిస్తారా?

  ReplyDelete
 3. ధరణిజ గారూ, ధన్యవాదాలు.

  మంచుపల్లకి గారూ, పురాతన వస్తు చట్టం కింద కోహినూర్ వజ్రాన్ని పరిగణించారంటే, కనీసం వాళ్లైనా దాన్ని 'తమ' చారిత్రక సంపద గా భావించినట్టు. అంతవరకు సంతోషించవచ్చు. తమ వారసత్వం అనుకోకపోతే కూడా వాళ్ళు మనకు ఇచ్చేవాళ్ళు కాదు, అమ్మకానికి పెట్టేవాళ్ళు. విషాదం ఏమిటంటే, మనకు చారిత్రకమైన పగలూ లేవు, ప్రేమలూ లేవు. ఆ వజ్రం మన దేశానికి వస్తే భద్రంగా ఉంటుందా - అనుమానమే. అసలు విషయం కోహినూర్ కాదు, వెనక్కి ఇచ్చేయాలంటే బ్రిటన్ చాలా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చినా ఇవ్వకున్నా, అడగాలన్న దృష్టి లోపించడమేసమస్య.

  మందాకిని గారూ, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు 12 వ సంపుటంలో 'బ్రిటిష్ రాచ పాలన నాటికి ఇండియా' అన్న వ్యాసంలోని వాక్యాలను అక్కడ యధాతథంగా ప్రస్తావించాను. బ్రిటిష్ వారి కంటే ముందు భారత దేశాన్ని పాలించిన మొగలులు, మరాఠాలు ఆర్థికంగా మెరుగైన విధానాలు అనుసరించారని అంబేద్కర్ ఆ వ్యాసంలో అనేక ఉదాహరణలతో నిరూపించారు. భారతదేశాన్ని అన్ని రకాలుగా లోబరచుకోవడం తప్ప బ్రిటిష్ వారికి మరే ఆదర్శం లేదని, బ్రిటిష్ పాలన గురించిన ఉదార అభిప్రాయాలు వ్యక్తం చేసేవారిపై జాగ్రత్తగా ఉండాలని కూడా అంబేద్కర్ ఆ వ్యాసంలో రాశారు.

  ReplyDelete
 4. మీరు చాలా బాగా దేశభక్తిని ప్రతిబింబిబ్చే విధం గా రాశారు.
  Please read below article.

  The New Nationalist Movement in India
  Four decades before Indian independence, a writer raises the question,

  "Why is England in India at all?"
  By Jabez T. Sutherland

  http://www.theatlantic.com/magazine/archive/1969/12/the-new-nationalist-movement-in-india/4893/

  ReplyDelete
 5. శ్రీనివాస్ గారు, మీ గురించి నాకు మరి కొన్ని వివరాలు తెలపగలరా. ఎందుకంటే బ్లాగులు చదివేవారి లో చాలా మంది ఆంధ్ర కి బయట ఉన్నవారు. మీరు రాసే వ్యాసాలు చదువుతుంటే ఎంతో అనుభవం, నాలేడ్జ్ ఉన్న వారు తప్పించి అలా రాయలేరనిపిస్తున్నాది.

  ReplyDelete
 6. శ్రీకర్ గారు, నేను పాత్రికేయుడిగా ముప్పై సంవత్సరాలుగా తెలుగు పత్రికల్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఆంద్ర జ్యోతి దినపత్రిక కు సంపాదకుడిగా ఉన్నాను. వృత్తి జర్నలిజం అయితే, ప్రవృత్తి అభిరుచి సాహిత్యం. సాహిత్య విద్యార్థిని. నా విద్యాభ్యాసం అంటా తెలుగు సాహిత్యంలోనే.

  ReplyDelete
 7. ____________________________
  కాకతీయుల సామ్రాజ్యంలో భాగంగా ఉండిన నేటి గుంటూరు జిల్లా పరిటాల దగ్గర దొరికిన ఆ వజ్రం,
  ____________________________

  గుంటూరు జిల్లాలో కూడా ఇంకో పరిటాల ఉందా? నాకు తెలిసి, కృష్ణా జిల్లాలో, కంచికచర్ల దగ్గర పరిటాల అనే ఊరు ఉంది.

  ReplyDelete
 8. గణేష్ గారూ.. మీరు చెప్పింది నిజం. పరిటాల ఇప్పుడు కృష్ణా జిల్లా లోనే ఉంది. కృష్ణా గుంటూరు మండలాలు ఒకటిగా ఉన్నప్పటి వివరం, తరువాత కాలంలో మార్పు లేకుండా కొన్ని పుస్తకాల్లో కొనసాగడం వల్ల జరిగిన పొరపాటు. కోహినూరు వజ్రం సరిగ్గా ఎక్కడ దొరికింది అనే విషయంలో కూడాభిన్నాభిప్రాయాలున్నాయి.

  ReplyDelete