Sunday, June 13, 2010

భోపాల్‌: భూతమేకాదు భవిష్యత్తు కూడా!

పురుగుమందులు మనుషుల్ని చంపడం మనకు కొత్త కాదు.
ఎండ్రిన్‌ దగ్గర నుంచి మోనోక్రోటోఫాస్‌ దాకా  మందులన్నిటికీ  పురుగులకంటె మనుషులంటేనే మహా ఇష్టం. మనుషుల్ని పురుగుల్లా చంపడమంటే బలే ఇష్టం.
మిథైల్‌ ఐసో సైనేట్‌.
క్రిమిసంహారకాలని  తయారుచేయడంలో  అది ఒక రసాయనం. కట్టలు తెంచుకున్నప్పుడు అది విషవాయువై విరుచకుపడుతుంది.
అనగనగా పాతికేళ్ల కిందట, అది ఒకే ఒక్క రాత్రి భోపాల్‌ పట్నం మీద మృత్యువై వ్యాపించింది.  వేలాదిమందిని చంపేసింది, లక్షలాదిమందిని రోగిష్ఠులను చేసింది. అక్కడి గాలినీ నీటినీ సమస్త జీవనాన్నీ టన్నుల కొద్దీ విషంతో నింపింది.

అల్పప్రాణాలపై  అలక్ష్యంతో మాత్రమే విషవాయువు హత్యలు చేయదు. అహంకారపూర్వకంగా యుద్ధోన్మాదంతో కూడా హత్యలు చేస్తుంది. వియత్నాంలో అది భూతకాలం.  ఇరాక్‌లో, ఆఫ్ఘనిస్థాన్‌లో అది నిరంతర వర్తమానం. నాపామ్‌, లిండేన్‌, పైరేత్రమ్‌, అల్యుమినియమ్‌ఫాస్పేట్‌, డిల్ట్రిన్‌, డయాజినిన్‌... విష రసాయనాల జాబితా అనంతం.

విషం మారువేషం కూడా వేస్తుంది. హరితవిప్లవమై పలకరించి పెస్టిసైడై వెక్కిరిస్తుంది. విత్తనాన్నే కాదు చిత్తాలను కూడా జన్యుమార్పిడి చేస్తుంది. మనకు ఊపిరాడడం కోసం మన తలుపులకే కన్నం వేస్తుంది. ప్రజాస్వామ్యంలో  సంస్కరణల సంస్థానాలు నిర్మిస్తుంది.

యూనియన్‌కార్బైడ్‌ ఒక నామవాచకం కాదు. సర్వనామం. వారెన్‌ ఆండర్సన్‌ వ్యక్తి కాదు, వ్యవస్థ.  అన్నిటి కంటె అతి పెద్ద విషవాయువు సామ్రాజ్యవాదం, దానికి పర్యాయపదం అమెరికా.

***

వాస్కొడిగామా వచ్చి ఒక మిరియం మొక్క అడిగాడు. కంపెనీవాడు వచ్చి షాజహాన్‌ను మూడు అడుగులనేల అడిగాడు.  చంద్రగిరి చేరి చెన్నపట్నం అడిగాడు. కళ్లు తెరిచి చూసే సరికి, దేశం మీద యూనియన్‌ జాక్‌  రెపరెపలాడింది. గ్రామం కుత్తుక కోసి, మగ్గం వేళ్లు నరికి, పన్నుల  పంట పండించుకుని ఓడలకొద్దీ నెత్తుటినీ చెమటనీ తరలించుకుపోయింది.  

అదంతా ఫ్లాష్‌బ్యాక్‌. ఇప్పుడంతా కొత్తకథ. ఎవడూ వచ్చి మనల్ని స్థలం అడగడు. తలుపు దగ్గర నుంచుని రారమ్మని మనమే పిలుస్తుంటాము. భూమినిచాపగా చుట్టి వాడి చంకలో మనమే పెడతాము. పంచభూతాలను పళ్లెంలో పెట్టి మనమే సమర్పిస్తాము. వినయంగా అప్పు తీసుకుని విధేయంగా కప్పం కడతాము.  స్వేచ్ఛ కోరినవాడిని స్వచ్ఛందంగా మనమే చంపుకుంటాము. కోరితే, ఏలినవారికి  మన కుత్తుక కోసుకుని మనమే అప్పగిస్తాము. ప్రాణవాయువును ఎగుమతి చేసి, విషవాయువు దిగుమతి చేసుకుంటాము. వారి రథాల కోసం
మన రహదారులను వెడల్పు చేస్తాము. వారితో సంభాషణ కోసం మన భాషలను మనమే చంపుకుంటాము. వారిని నిర్దోషులను చేస్తూ న్యాయవ్యవస్థను సంస్కరించుకుంటాము.  తామే పాలించుకుని, తామే రక్షించుకోవలసిన వలస వలె కాకుండా, వారి పెరటిలోని విడిదివలె మన దేశాన్ని తీర్చిదిద్దుకుంటాము.

మెకాలే బడి నుంచి ఆక్స్‌ఫర్డ్‌ దాకా చదువులలో సారమెల్ల చదివిన పెద్దలకు గద్దెనప్పగించిన తరువాత, సార్వభౌమాధికారం  ఒక చమత్కారం. ఒక ఉత్సవ విగ్రహం. ఒక్క ఉత్తుత్తి కిరీటం.  బుద్ధి పడమటిపొద్దులో ఇంకిన తరువాత, నేతల వెన్నెముకలన్నీ చిలక్కొయ్యకే వేళ్లాడుతుంటాయి. వారికి కృష్ణరాయలు  కావడం కంటె వైస్‌రాయలు కావడంలోనే ఆసక్తి. విభీషణుడిమీదా, అంభిమీదా, జయచంద్రునిమీదా వారికి భక్తి.  చేతుల్లోనుంచి కాక, మోచేతి కింది నుంచే వారికి భుక్తి.

కిట్టనివాళ్లు వాళ్లని  దళారులంటారు. ఇంటికి జెష్ట పొరుగుకి లక్ష్మి అని కూడా వాళ్ల గురించే అంటారు. చేతచిక్కిన దొంగను వాళ్లు గోడదాటిస్తారు. సొంత సోదరుణ్ణి కూడా వేటాడి మరీ అప్పగిస్తారు.

పదిహేను వేల ప్రాణాల గురించి, మరణాల గురించి, జీవితాల గురించి వాళ్లను అడగండి. సమాధానం డాలర్లలో దొరుకుతుంది. హంతకులకు అభయం ఇవ్వవలసిన జాతీయ కర్తవ్యం గురించి అంతర్జాతీయ భాషలో మంచి ఉపన్యాసం దొరుకుతుంది.  అణుశక్తి ఒప్పందం వల్ల సమకూరే లాభం గురించి, భవిష్యత్తులో జరిగే భారతీయచెర్నోబిల్‌లకు మనమే స్వావలంబనతో పరిహారం చెల్లించుకోవలసిన అగత్యం గురించి  ఒక భోపాల్‌ మెమోరియల్‌ లెక్చరూ దొరుకుతుంది. .

***
విదేశ శక్తుల గురించి విదేశభక్తుల గురించి కొత్తగా చెప్పుకునేందుకు ఏమున్నది కానీ, ఇప్పుడు మాత్రం  ఈ దేశదుస్థితి మీదనే ఆగ్రహంగా ఉన్నది, ఆవేదనగా ఉన్నది, అన్నిటికంటె మించి  అవమానంగా ఉన్నది.  భోపాల్‌ చచ్చిపోయిన అభాగ్యులమీదా, ఈ దేశంలో చస్తూ బతుకుతున్న కోట్లాది దౌర్భాగ్యులమీదా రెండోసారి విషంచిమ్మింది మాత్రం భారత దేశ పరాధీనతే. ఇంతగా పాదాక్రాంతులమయ్యామా, ఇంతగా అస్వతంత్రులమయ్యామా, ఇంతగా  ఆత్మహననం చేసుకున్నామా- అన్నది అర్థమయ్యింది మాత్రం ఇప్పుడే. ఈ ఆవేదన నుంచి కూడా రాజకీయమథనం మొదలయింది.  ఆండర్సన్నో అర్జున్‌సింగో బోనులో నిలబడవచ్చు.  రీగన్‌కూ రాజీవ్‌కూ ప్రమేయం లేకుండానే హంతకులు సరిహద్దు దాటారని ఎవరు నమ్మగలరు? కొత్త ఆయుధం దొరికిందని సంబరపడుతున్న జాతీయ ప్రతిపక్షమా, అర్జెంటుగా అఫ్జల్‌గురును ఉరితీయాలని  ఉద్యమిస్తున్నప్పుడు ఆండర్సన్‌ఎందుకు గుర్తుకు రాలేదని ఎవరు అడుగుతారు?

***

విషవాయువు కబళించి, మట్టి కప్పిన ఆ పాప శూన్యనేత్రాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
భోపాల్‌ ఒక ఆస్విజ్‌.
భోపాల్‌ ఒక హిరోషిమా.
భోపాల్‌ 1984 ఢిల్లీ
భోపాల్‌ నూతన ప్రపంచ వ్యవస్థ.
భోపాల్‌ ఒక సశేష భవిష్యత్తు.

4 comments:

 1. చాలా చాలా బాగా వ్రాసారండి. పదునుగా, పరమ సత్యంగా!

  ReplyDelete
 2. భూతాన్ని ... సంభాషణగా
  భవిష్యత్ కాలమ్ లో చూసాం ..
  గురువు గారూ

  శ్రిచమన్ ..

  ReplyDelete