Monday, June 21, 2010

దెయ్యాల వేదాలు, మానవ రవాణా

బాధ వేస్తుంది.

మనదేశం ఒక అమానవీయస్థితిలో ఉన్నందుకు గణాంకాల్లో పెద్దపీట లభిస్తే గుండె రగిలిపోతుంది. పనిమనుషులుగా వెట్టిమనుషులుగా వేశ్యలుగా పెద్దలూ పిన్న లూ రవాణా అవుతున్న దుర్మార్గం మనదేశంలో విస్త­ృతంగా జరుగుతున్నదని, దాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక అభియోగం మోపింది. కొలంబియా, నైజీరియా వంటి దేశాల కంటె కూడా మన దేశం అధ్వాన్నంగా ఉన్నదట. మానవ రవాణాలో దారుణపరిస్థితిలో ఉన్న మూడో అంచె దేశాలు- సౌదీ అరేబియా, జింబాబ్వేల కంటె కొంచెం మెరుగ్గా ఉండి, రెండో అంచెదేశాలలో స్థానం సంపాదించుకున్నదట.

ఇంతకీ ఈ మానవ రవాణా ఏమిటి? ఆధునిక రూపాలలో సాగుతున్న ఒకానొక శ్రామిక వ్యాపారం. బలవంతపు శ్రమ కావచ్చు, వెట్టి చాకిరీ కావచ్చు, రుణవిమోచనకోసం పనిచేయడం కావచ్చు, వలస వెళ్లి కష్టం చేయడం కావచ్చు, అపహరణకో మోసానికో గురై వ్యభిచారవృత్తిలోకి వెళ్లడం కావచ్చు, ఇళ్లల్లో పనిమనుషులుగా వెళ్లడం కావచ్చు, పిల్లల చేత పనిచేయించడం కావచ్చు, బాలవేశ్యలను తయారుచేయడం కావచ్చు... ఇవన్నీ పోవాలని ఎవరికి మాత్రం ఉండదు? సమాజంలో ఇటువం టి దుర్మార్గాలు ఉండడం ఎవరికి మాత్రం సంతోషం?

భూస్వామ్య వ్యవస్థలో వెట్టి ఒక దోపిడిరూపం. దానికి కులవ్యవస్థ కూడా తోడై సామాజిక సాధికారత లభించింది. స్వాతంత్య్రం వచ్చి ఇంత కాలమైనా భూస్వామ్యం మనదేశంలో చెప్పుకోదగినంత బలహీనపడిందని చెప్పలేము. కాకపోతే, ఇంకా పాతవ్యవస్థలు ప్రబలంగా ఉన్న ప్రాంతాలతో సహా, శ్రమదోపిడీ రూపాల్లో ఎంతో కొంత మార్పు వస్తున్నది. బహుశా అమెరికా విదేశాంగ శాఖ 'ఆందోళన' చెందుతున్నది ఈ అవశేష దురాచారం విషయంలో అయి ఉండదు. ఆధునికమైన, సమకాలికమైన వెట్టిచాకిరీల గురించి, మనుషుల నుంచి దౌర్జన్యంగా శ్రమను పిండడం గురించి ఆ దేశాని కి ఇంత కలవరం ఉండడం ఆశ్చర్యమే కాబట్టి, మరేదో అంతరార్థం కూడా ఈ అభియోగాల వెనుక ఉండవచ్చు.

అమెరికాకే కాదు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ దాతృత్వ సంస్థలకు కూడా మానవ రవాణా ఇప్పుడు ఒక ప్రియాతిప్రియమైన చర్చనీయాంశం. పశ్చిమం లో వాన పడితే ఇప్పుడు ప్రపంచం అంతా గొడుగు పడుతుంది కాబట్టి, భారతదేశం వంటి దేశాల్లో కూడా అది ఒక ప్రాధాన్య అంశం. ఈ మధ్య కాలంలో,
వ్యభిచార యమకూపాల నుంచి స్త్రీలను విముక్తం చేయడం, బాలకార్మికులను, వలస కార్మికుల ను వారి వారి యజమానులనుంచి విడిపించడం మన దేశంలో, రాష్ట్రంలో కూడా ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తున్నాయి. విధానాలే కాదు, ప్రాధాన్యాలు కూడా అంతర్జాతీయంగానే నిర్ణయం అవుతున్నాయి కాబట్టి, నిధుల ప్రవాహం కూడా ఆ ప్రాధాన్యాలను బట్టే ఉంటుంది కాబట్టి, అధికార యంత్రాంగం అంతా అదే దిశగా పనిచేస్తూ ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు ఆ రంగంలోనే క్షేత్రకార్యాచరణ చేస్తుంటారు. స్టార్ హోటళ్లలో అవే అంశాల మీద వర్క్‌షాప్‌లు, సదస్సులుజరుగుతుంటాయి. సమస్య మూలకారణాన్ని మాత్రం స్పృశించకుండా, మనుషులను వారి వారి దుస్థితుల నుంచి భౌతికంగా ఎట్లా పెకిలివేయగలమా అన్న అంశంపై ఆంగ్లభాషలో చర్చలు సాగుతుంటాయి.

అంతర్జాతీయ ప్రాధాన్యాలు చమత్కారంగా ఉంటాయి. మనకు మలేరియానో అతిసారనో పెద్ద సమస్యగా ఉంటుంది. బిల్‌గేట్స్ మాత్రం ఎయిడ్స్ నివారణకే దానంచేస్తానంటారు. మనకు కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం ఉంటుంది. ప్రపంచ బ్యాంకు మాత్రం పాత కాల్వల లైనింగ్‌కే అప్పు ఇస్తానంటుంది. మన గ్రామాలకు మంచినీరు అవసరం అయితే, అంతర్జాతీయ పెద్ద లు మాత్రం మరుగుదొడ్లు లేకపోవడమే అతి పెద్ద సమస్య అని నిర్ధారిస్తారు, స్థానిక వనరుల మీద గ్రామ సమాజాలకు అదుపు పోవడం ప్రమాదకరమని మనం అనుకుంటే, వనరుల భోక్తల తో సంఘాలు పెట్టించి, వాటిని అమ్ముకునే హక్కు వారికే ఇవ్వాలని విదేశీ దాతలు సూచిస్తుంటారు.  మన సమాజంలో ఇంకా గృహహింసా,యాసిడ్‌దాడులూ ఉధృతంగా సాగుతూనే ఉంటా యి, కానీ, స్త్రీ శిశుసంక్షేమ శాఖలు మాత్రం తమకు ఎవరో కట్టిన గంతల్లోంచి కనిపించే ట్రాఫికింగ్ మాత్రమే ఏకైక సమస్యగా పరిగణిస్తాయి.

ఇదంతా అయోమయంగా ఉంటుంది. ఇంగ్లీషు వాడు ఒకచేత్తో బైబిల్, మరో చేత్తో తుపాకితో ప్రపంచాన్ని జయించాడంటారు. అదే పద్ధతి నేటికీ కొనసాగుతున్నది. ఒక వైపు బీటీ వాళ్లే తెస్తారు, పర్యావరణం రక్షించాలనీ వాళ్లే చెబుతారు. ఎరువులూ పురుగులమందులూ వాళ్లే కుమ్మరిస్తారు, ప్రకృతి వ్యవసాయమూ వాళ్లే ప్రోత్సహిస్తారు. ఒక వైపు గ్రామాలను వాళ్లే అస్వతంత్రం చేస్తారు, మరోవైపు స్వయంశక్తి బృందాలను నిర్మించమంటారు. గ్రామాల్లో నేడు ఇంతటి పారిశుద్ధ్య సమస్య, శుభ్రతా సమస్య రావడానికి కారణమైన విధానాలు వాళ్లే ప్రవేశపెడతారు, ఆరుబయలు మలవిసర్జన ఆడవారికి అవమానం కదా అని వారే మనకు ఆత్మగౌరవ పాఠాలు చెబుతారు. లేతలేత చేతులతో పత్తివిత్తనాల పరపరాగాన్ని సంపర్కం చేయిస్తారు, అయ్యో బాలకార్మికుల చేత పనిచేయిస్తారా అంటూ మనల్ని నిలదీస్తారు. హరి త విప్లవం, నీలివిప్లవం, క్షీరవిప్లవం- అన్నీ వాళ్లే రుద్దుతారు. విధ్వంసం అంతా జరిగాక, ఆకులు పట్టుకోవడం గురించి వాళ్లే ప్రచారం చేస్తారు. ఒకవైపు ఓజోన్ పొరను తూట్లు పొడుస్తూ, గ్లోబల్ వార్మింగ్ గురించి వార్నింగులూ తాఖీదులూ జారీచేస్తారు.

మరి మానవరవాణా ఎందుకు జరుగుతున్నట్టు? పైనచెప్పిన నిర్వచనాల కిందికి వచ్చేదే మానవరవాణాయా? అమెరికాతో సహా తెల్లదేశాలన్నీ భారత్ నుంచి, చైనా నుంచి తక్కిన ఆసియా ఆఫ్రికా దేశాల నుంచి చేస్తున్న బాడీషాపింగ్‌కు తెలుగు అనువాదం ఏమిటి? రూపాయి కంటె డాలర్ఎక్కువనే కదా, భారతీయ యువకులు చిన్న ఉద్యోగాలకు కూడా ఎగబడి పోతున్నది? మరి ఇండియాలో పట్టణాల్లో సంపాదించే కొద్దిపాటి రూపాయిలు కూడా పల్లెల్లో డాలర్ల వలె వెలుగుతాయనే కదా, గ్రామీణులు పట్టణాలకు వలసవస్తున్నది? గ్రామాలలో మనుగడలు సంక్షోభంలో పడినందువల్లనే కదా, ఆత్మహత్యలు చేసుకోగా మిగిలిన జనం దేశాలు పట్టి వెడుతున్నది? భారతదేశంలో పట్టణాలు, అందులోనూ సంపన్నవాడలు ధగధగా మెరిసిపోతున్నందువల్లనే కదా, పల్లెలు కటికచీకట్లోకి అటునుంచి పట్నాల మురికివాడల్లోకీ తరలివెడుతున్నది?  అసలు ప్రపంచమంతా అవుట్‌సోర్సింగ్ పేరుతో కారుచవక కాయకష్టాన్ని కబ్జా చేయకపోతే, డాలర్‌కు, పౌండ్‌కు,యూరోకు ఆ వైభవమెక్కడిది? అభివృద్ధి రథచక్రాల కింద బలహీనులు నలిగిచావవలసిందేనని సోషల్ డార్వినిజాన్ని ప్రవచించి, మరోవైపు ఆర్తత్రాణ పరాయణత్వపు అభినయం ఎందుకు?

ఎందుకంటే, నీతీ న్యాయమూ ఒక ఆధిపత్యపు సాధనాలుగా మారినందువల్ల. ఫిరంగిగొట్టాలకు మనుషులను కట్టి పేల్చినవాళ్లు, మనుషుల్ని పశువుల్లాగా ఆఫ్రికన్ గ్రామాలనుంచి ఓడలకెక్కించినవాళ్లు, సముద్రమధ్యంలో ఒక నరకకారాగారాన్ని నిర్మించి దేశదేశాల బందీల్ని హింసించినవాళ్లు- మానవహక్కులను మూడోప్రపంచం మీదకు షరతులుగా వదులుతారు. అమానుషత్వం అక్షర క్రమమే తెలియనట్టుగా, ఖైదీలు నేసిన వస్త్రాలను కొనుగోలుచేయబోమంటారు, అడవులంటే కలప మాత్రమేనని, వనమంటే వేట మాత్రమేనని నమ్మి ఆచరించినవాళ్లు, ఇప్పుడు జీవవైవిధ్యం గురించి, కర్బనసంపత్తి గురించి విలపిస్తూ ఉంటారు.ట్రాఫికింగ్ జరగకూడదు. మనుషులు పరోక్ష నిర్బంధపు స్వచ్ఛందత నుంచి ఇనుపగొలుసులు తామే తొడుక్కుంటారు. బతుకు భారమై కూటికోసం కూలికోసం పట్టణాలకు తరలివెడతారు. ఉనికిలో, పనిలో ఏ ఆశా లేక తనువులనే అమ్ముకోబోతారు. ఈ దయనీయత, దుర్మార్గం సమసిపోవాలి.

వీళ్లంతా ఎక్కడ పట్టణాలను ముట్టడిస్తా రో, ఎక్కడ ప్రభుత్వాలు అదుపుచేయనంత జనసమ్మర్దం అధికారకేంద్రాలను ముంచెత్తుతుందోనని ఏలినవారికి భయం. తమకు అవసరమైనంత వరకు, తమ హర్మ్యాలను నిర్మించేంత వరకు, తమ ఇంట్లోనో దేశంలోనో మురికిని కడిగేసే పనివరకు- మనుషు లు దొరికితే చాలు, హద్దులు దాటి తరలివచ్చి ఎక్కడ తమ బంగారు దేశంలో పౌరస త్వం కోరతారోనని వారికి బెంగ. అందుకే, ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలి, అప్పుడప్పు డు వర్క్‌పర్మిట్‌లతో వచ్చి చాకిరీ చేసి పోవాలి. మనుషులను హీనస్థితిలో ఉన్నచోటనే ఉంచేయడానికి, నిస్ప­ృహలో తమంతటతామే మరణించడానికి ప్రభుత్వాలు ఎన్నిప్రయత్నాలైనా చేస్తాయి. గ్రామీణాభివృద్ధి పేరుతో, ఉపాధి హామీ పేరుతో కుమ్మరిస్తు న్న నిధులన్నీ పల్లెజనం పొలిమేరలు దాటకుండా కృత్రిమంగా నిలపడానికే. ఒకవైపు గ్రామం కాళ్లకింద నిప్పులు,మరొకవైపు పల్లెల చుట్టూ కందకాలు.

రవాణా కావడానికి మనుషులు పశువులూ కారు, సరుకులూ కారు. జనం తమ పల్లెల్ని, దేశాల్ని తామే బాగుచేసుకుంటారు. అందుకోసం అవసరమైతే పట్టణాలను చుట్టుముడతారు. సంపన్నదేశాలలో సమ్మర్దంగా సంక్షోభంగా పరిణమిస్తారు. ఆశాదూతలై ఎన్ని దిక్కులు తిరిగినా కాళ్లు తమ నేలమీదనే నిలుపుకుంటారు.

2 comments:

  1. చాలా బాగా రాశారు. ఎవరూ ఎత్తిచూపని కోణాల్ని స్పృశించారు. Very much impressed. ఇలాగే ముందుకు సాగిపోండి, కనీసం మాలాంటివారి కోసం.

    ReplyDelete