Friday, June 25, 2010

 చీకటి రోజులు


"గట్టి ప్రతిపక్షం, స్వతంత్రమైన న్యాయవ్యవస్థ, ఆంక్షలు లేని మీడియా- ప్రజాస్వామ్య సౌధానికి ఈ మూడే స్తంభాలు. ఎమర్జెన్సీ ఈ మూడింటినీ ధ్వంసం చేసింది''- ముప్పయ్యైదేళ్ల కిందట జూన్25 అర్థరాత్రి ఇందిరాగాంధి విధించిన అత్యవసర పరిస్థితి పై అకాలీనాయకుడు లోంగోవాల్, తానింకా కటకటాల వెనుకకు వెళ్లక ముందు చేసిన వ్యాఖ్య అది.

ఎమర్జెన్సీ అనగానే, నిర్బంధానికి లోనయిన మహామహులైన జాతీయ ప్రతిపక్షనేతలతో పాటు, సంస్థలుగా మార్క్సిస్టు పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అనేక చిన్నా పెద్దా విప్లవసంఘాలు గుర్తుకు వస్తాయి కానీ, అకాలీదళ్ గురించి పెద్దగా చెప్పుకోము. కానీ, ప్రశ్నించే పెద్ద గొంతులన్నీ మూగబోయిన తరువాత కూడా అత్యవసర పరిస్థితి విధింపును  నిలకడగా బాహాటంగా ఎదిరిస్తూ వచ్చిన రాజకీయపక్షం అకాలీదళ్.  మొత్తం మీద ఎమర్జెన్సీ కాలంలో లక్షాయాభైవేల మంది నిరంతర నిర్బంధంలోకి వెడితే, అందులో సుమారు మూడోవంతు మంది అకాలీలు, వారి అనుయాయులైన సిక్కులే. ఆందోళనకారులపై, అకాలీనేతలపై ఇందిర ప్రభుత్వం విరుచుకుపడింది, జైళ్లలో కుక్కింది. అంతటితో ఆమె ప్రతిక్రియ పూర్తికాలేదు. అది ప్రతీకారంగా రూపుదిద్దుకుంది.  1980లో తిరిగి అధికారంలోకి రాగానే, పంజాబ్ అకాలీ ఉద్యమంలో చిచ్చుపెట్టే కార్యక్రమం చేపట్టింది. తరువాత కథ
తెలిసిందే. తానే ఎగదోసిన భింద్రన్‌వాలేతో సహా వేలాదిమంది సిక్కు యువకులు పంజాబ్ కల్లోలంలో మరణించారు. స్వయంగా తాను కూడా ఆ ఘటనల పరంపరలోనే ఆహుతి అయ్యారు. అందుకు ప్రతిగా జరిగిన హత్యాకాండలో కూడా వేలాదిమంది సిక్కులు మరణించారు. ఎమర్జెన్సీ గురించిన పై వ్యాఖ్య చేసిన లోంగోవాల్ కూడా ఆతరువాత హత్యకు గురిఅయ్యారు.

1975-77 అత్యవసర పరిస్థితి నేపథ్యం నుంచి, పర్యవసానాల నుంచి భారతీయ రాజ్యవ్యవస్థ చాలా గుణపాఠాలు తీసుకున్నది. అతి మితవాదుల దగ్గరనుంచి, అతి తీవ్రవాదుల దాకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహరించిన ఒక సంక్షుభిత పరిస్థితిలో ఒక నిరంకుశ పాలకురాలు తీసుకున్న నిర్ణయం అత్యవసర పరిస్థితి విధింపు. అనేక రకాల ప్రత్యర్థి శ్రేణులతో ఒకేసారి యుద్ధం చేయడం పొరపాటని వ్యవస్థకు తెలిసి వచ్చింది. శత్రువులను వారు కల్పిస్తున్న ప్రమాద తీవ్రత ఆధారం గా వేరుచేసి ఒక్కొక్కరిని లొంగదీసుకోవాలని తెలుసుకుంది. అంతే కాదు, ప్రతిఘటనలో పాలుపంచుకున్న శ్రేణులన్నిటినీ వేరువేరు పద్ధతుల్లో దారికి తీసుకురావాలని నిర్ణయించుకుంది.

ఒక సార్వత్రక అత్యవసర పరిస్థితి స్థానంలో ప్రత్యేక, పరిమిత, దీర్ఘకాలిక నిర్బంధ పరిస్థితులను అమలుచేయాలని గుణపాఠం నేర్చుకుంది. అందులో భాగంగానే అకాలీదళ్‌ను చీల్చింది, బలహీనపరిచింది, నామమాత్రం చేసింది. అధికారకూటముల్లో ఒక సాధారణ భాగస్వామిగా మలచింది. ఎమర్జెన్సీ ని అమలు చేయనని భీష్మించి, అందుకోసం పదవిని కూడా కోల్పోయిన కరుణానిధి ఆ తరువాత దీర్ఘకాలం అధికారానికి దూరమై, చివరకు సంకీర్ణయుగంలో లాభసాటి భాగస్వామిగా స్థిరపడిపోయారు.   సిండికేట్‌తరం సీనియర్లు కాలధర్మం చెందగా, ఆగ్రహించిన యంగ్‌టర్క్‌లు సాధువులైపోగా, కూటములు పెట్టి ఓటము లు పొందీ పార్టీలు మార్చీ శోషిల్లిన సోషలిస్టులు హిందీబెల్ట్‌లో రెండు రాష్ట్రాలతో సంతృప్తి చెందారు. ఎమర్జెన్సీని సమర్థించి ఆ తరువాత నాలిక కరచుకున్న సిపిఐ, కాంగ్రెస్‌లో ప్రగతిశీలతను అన్వేషించే ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నది.

ఇక ఎమర్జెన్సీ రోజుల్లో అతిమితవాద పక్షంగా, ప్రతీఘాత శక్తిగా నింద పొందిన నేటి 'సంఘపరివారం' కూడా ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో చాలా మార్పులను చూసింది. అధికార సోపానాలను అధిరోహించడానికి ఎటువంటి ఎజెండాను రూపొందించుకోవాలో తెలుసుకుని, ఆ క్రమంలో ఢిల్లీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోగలిగింది. జాతీయవాద దేశభక్తికి తానొక్కటే ప్రతినిధినని భావించే బిజెపి, దాని సహచర సంస్థలు ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే ఏ విలువలను చెప్పారో వాటిని మాత్రం కాలక్రమంలో వదిలిపెట్టారు. మీసాను వ్యతిరేకించినవారు టాడాను ఆహ్వానించారు, పోటాను తీసుకువచ్చారు, ఇంకా ఇంకా కఠినమైన చట్టాలు కావాలని కోరుతున్నారు. పౌరహక్కుల గురించి గొంతెత్తినవారు, ఇప్పుడు వాటి పేరెత్తితేనే మండిపడుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి జాతీయ రాజకీయాలను పంచుకుం టూ, వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఎజెండాలు రూపొందించుకుంటున్నారు.

మరి ఎమర్జెన్సీ కాలంలో తీవ్రమైన నిర్బంధాన్ని అనుభవించి, అజ్ఞాతంలోకి కూడా వెళ్లి పనిచేసిన మార్క్సిస్టు పార్టీ, ఆ అనుభవం నుంచి ఏమి నేర్చుకున్నది? అత్యవసర పరిస్థితి ముగిసిన వెంటనే 1977లో బెంగాల్ రాష్ట్ర అధికారాన్ని చేపట్టిన మార్క్సిస్టు పార్టీ కూటమి మొన్ననే ముప్పైమూడేళ్లు పూర్తిచేసుకుని ఇంకా కొనసాగుతున్నది. ఇంత సుదీర్ఘకాలం అధికారంలో ఉండగలగడం వెనుక ఆ పార్టీ చేసిన త్యాగాలు, అనుసరించిన విధానాలు తప్పకుండా పనిచేసి ఉంటాయి. మరి 1977 లో ఉన్నంత పదునుగా, నిజాయితీగా ఆ పార్టీ విధానాలు ఉన్నాయా? ఉంటే, ఇప్పుడు ఎందుకు క్షీణత మొదలయింది?- ఇవీ ఇప్పుడు చర్చలో ఉన్న ప్రశ్నలు. ఎమర్జెన్సీలోనూ, అంతకుముందు బెంగాల్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అణచివేత విధానాలనే మార్క్సిస్టు పార్టీ ఎందుకు అనుసరిస్తోంది? విప్లవవాదం సామాజిక ఆర్థిక సమస్య అని భార్గవ కమిషన్ ముందు కూడా వాదించిన పార్టీ, ఇప్పుడు, ఎందుకు  దాన్ని ఆచరణలో శాంతిభద్రతల సమస్యగానే పరిగణిస్తూ బలప్రయో గం చేస్తున్నది?

ఆర్థిక సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ తను అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది? ఈ ప్రశ్నలను విన్నప్పుడు- మార్క్సిస్టు పార్టీ కూడా అత్యవసర పరిస్థితి తరువాత, తీవ్రతను రాజీపడని తనాన్ని తగ్గించుకుంటూ వస్తోందని అనిపిస్తుంది. కాంగ్రెస్ వెంట నడుస్తోంద ని సిపిఐని విమర్శించిన పార్టీ, ఇప్పుడు తానే కాంగ్రెస్‌తో మరింత సన్నిహితంగా మెలగుతోంది.

ఈ సకల పక్షాలూ రకరకాల స్థాయిలలో అధికారసోపాన పటంలో అంతర్భాగం కాగా, దానికి వెలుపల ఉండే శక్తులన్నీ చట్టబద్ధం కాని పద్ధతుల్లో అలజడీ సృష్టిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, నిత్యనిర్బంధం అనుభవిస్తున్నారు. వారిపేరుతో రకరకాల నల్లచట్టాల కోరలు తొడుక్కున్న ప్రభుత్వాలు, గాంధేయవాదినైనా- చిత్తశుద్ధి తో పనిచేస్తే- మావోవాదిగానో ఉగ్రవాదిగానో ముద్రవేసి నిర్బంధంలోకి నెడుతున్నాయి.   అధికార వికేంద్రీకరణ జరగాలనో, పర్యావరణాన్ని రక్షించాలనో, అభివృద్ధిఅమానుషత్వాన్ని నిరోధించాలనో ప్రయత్నించే శక్తులు కూడా ఒకహద్దు దాటి, మౌలిక ప్రశ్నలు వేస్తే, వారికి కఠిన చట్టాలే సమాధానం చెబుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పుడు నిర్బంధ చట్టాలకింద, సాయుధ బలగాల ప్రత్యేక చట్టాల  కింద మగ్గుతున్నాయి. 35 ఏళ్ల కాలంలో, జనతా సర్కార్ ఉండిన రెండున్నరేళ్లు మినహాయిస్తే, తక్కిన సమయమంతా ఎమర్జెన్సీ ఏదో ఒక రూపంలో పాక్షికంగానో, సంపూర్ణంగానో కొనసాగుతూనే ఉన్నది.

తీవ్రయుద్ధాల స్థానంలో దీర్ఘకాలికమై న చిరుయుద్ధాలను ప్రపంచ ప్రభువులు నిర్వహిస్తున్నట్టే, అత్యవసర పరిస్థితిని సైతం మన దేశం 1975 వలె ఉధృతితో, సార్వత్రకంగా కాక, తక్కువ స్థాయిలో పరిమిత వర్గాలకు, ప్రాంతాలకు మాత్రమే అమలు చేస్తూ కొనసాగిస్తున్నది. ఎమర్జెన్సీ ని ప్రతిఘటించిన వారిలో అత్యధికులను వ్యవస్థ ఇప్పుడు జీర్ణం చేసుకున్నప్పటికీ, నాటి పోరాట స్ఫూర్తి దేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి అత్యవసరం, మార్గదర్శకం.

1 comment:

  1. ఆ చీకటి రోజులను గుర్తుచేస్తూ మన సామాజిక బాధ్యతలను గుర్తెరిగేలా రాసినందుకు ధన్యవాదాలు. దీనిపై నేను రాసినదానిని చూడగలరుః http://saamaanyudu.wordpress.com/2010/06/25/352/

    ReplyDelete