Monday, July 5, 2010

బతుకును ప్రేమిస్తే మరణమే బహుమతి

రెండు దశాబ్దాల తరువాత కొత్త రూపు దిద్దుకుని విడుదలైన కొమురం భీమ్ సిని మా, నిర్మాణ ప్రమాణాలలో ఎన్ని పరిమితులున్నప్పటికీ, చెప్పవలసింది మాత్రం చెప్పగలిగింది. త్యాగానికీ సంకల్ప బలానికీ సాహసానికీ ఉండే శాశ్వత గౌరవాన్ని చాటి చెప్పింది. తన గురించి తాను మాట్లాడకుండా పక్కవాళ్ల గురించి మాట్లాడతావెందుకని నిజాము ప్రభుత్వాధికారి కొమరం భీమ్‌ను అడుగుతాడు. ముప్పై ఎకరాలు పట్టా ఇస్తానన్నా భీమ్ ఎందుకు పోరాటం విరమించడో అసిఫాబాద్ అవ్వల్ తాలూక్‌దార్ ఆశ్చర్యపోతాడు.

అధికారబలం ఉన్నవాడికి ప్రపంచమంతా బానిసల్లాగే కనిపిస్తారు. అర్థబలం ఉన్నవాడికి ప్రతీదీ అమ్ముడుపోయే సరుకుగానే కనిపిస్తుంది. ఆశ, ప్రలోభం, స్వార్థం, లాభం- ఇవి తప్ప మనుషుల్ని నడిపించేవేవీ ఉండవని వాళ్లకు గట్టి నమ్మకం ఉంటుంది. పైవాడికి మోకరిల్లడం, కిందివాడిని అణగదొక్కడం తప్ప మరో విలువ వాళ్లకు తెలియదు. ఏటికి ఎదురీదే ఉలిపికట్టెలను చూస్తే వారికి నిరసన. ఎవరైనా సరే, గెలవలేని యుద్ధాలు ఎందుకు చేస్తారన్నది వారికి కొరుకుడు పడని ప్రశ్న.

సమస్కంధులైనవారో, కాస్త అటూ ఇటూగా ఉన్న బలాల వారో ప్రత్యక్ష యుద్ధం ద్వారా విజేతలు కావడానికి ప్రయత్నిస్తారు. పాలకవర్గాల మధ్య, రాజుల మధ్య జరిగే దండయాత్రలూ ఆక్రమణలూ అటువంటి కోవలోకి వస్తాయి. కానీ, చరిత్రలో అన్ని యుద్ధాలూ అట్లా సమానస్థాయి పక్షాల మధ్య జరగవు. కొండలను ఢీకొనే పొట్టేళ్లూ, మహాశక్తులతో తలపడే అల్పప్రాణులూ మానవజాతి చరిత్ర నిండా తారసపడుతూనే ఉంటాయి.

ధర్మం పక్షానో, న్యాయం పక్షానో పోరాడేవాళ్లు, అవమానానికి వ్యతిరేకం గా, అభిమానాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేసేవాళ్లు జనగాథల్లో చిరస్మరణీయులుగా
మిగిలిపోతారు. భౌతిక యుద్ధంలో మరణించీ, పరాజయం పొందీ కూడా మరేదో యుద్ధంలో వాళ్లు విజేతలుగా మిగిలిపోతారు. ఏ యుద్ధంలో అయినా మోహరించిన బలాలూ బలగాలకు తోడు ఒక అదృశ్యపక్షం కూడా రంగంలో ఉంటుంది. అదే న్యాయం. లేదా నైతికత, లేదా సూనృతం.

బ్రిటిష్ సేనల బలం ఎంతటిదో తిరగబడ్డ రాంజీగోండుకు తెలియదా, విల్లుపట్టిన అల్లూరి సీతారామరాజుకు తెలియదా,తూటా పేల్చిన భగత్‌సింగ్‌కు తెలియదా, నిజాము పోలీసుల శక్తి ఏమిటో కొమరం భీముకు తెలియదా- తెలుసు. ఓడిపోవడం కాదు, లొంగిపోవడం నేరమని కూడా తెలుసును. వారి మొక్కవోని సంకల్పం వారి విజేతలకు మూర్ఖత్వంగా కనిపించి ఉండవచ్చు. తమను తాము ధ్వంసం చేసుకుని ఎడతెగని నిర్బంధంలో, మృత్యువులో నిటారుగా నిలబడడం ఎందుకో దండధారుల కు అర్థం కాకపోవచ్చు. అడ్డదారుల్లో వ్యక్తిగత లబ్ధి కోసం లోభపడకుండా మెరుగైన ఉమ్మడి మనుగడ కోసం ఎందుకు తాపత్రయపడతారో వారి ఊహకే అందకపోవచ్చు. అర్థరహితమైన, తాము విసర్జించిన నైతికత ఎదుటిపక్షానికి అంతటి శక్తి నెట్లా ఇస్తున్నదో అర్థం కాకపోవచ్చు.

ఏ రాజ్యానికైనా చతురంగబలగాలో, ఆర్థిక వ్యవస్థో సుస్థిరతను ఇస్తాయనుకుంటారు కానీ, పాలించడానికి పాలకుల కు ఉండే నైతికహక్కే సిసలైన స్థైర్యాన్ని ఇస్తుంది. ఒక్కోసారి ప్రజలు అమాయకత్వం నుంచి, అజ్ఞానం నుంచి, వెనుకబాటుతనం నుంచి పాలకుల రాజ్యార్హతను మదింపువేయవచ్చు, క్రూరులకూ దుష్టులకూ కూడా జైజైలు కొట్టవచ్చు. అట్లా జయజయధ్వానాలు రప్పించుకోవడానికి ప్రజలకు ఏదో విదిలింపో చదివింపో ప్రభువులు చేస్తారు, అన్నదానా లు చేస్తారు, గుడులూ గోపురాలూ కడతారు, మడులూ మాన్యాలూ ఇస్తారు. ఏదో ఒక చిన్న అనుబంధాన్ని పోషిస్తూ, దాని ఆధారంగా సమస్త ప్రజానీకాన్ని రాజదండం కింద అణచిపెడతారు. ఆ చిన్న బంధం కూడా, చిన్న పాటి నీతిపీలిక కూడా లేకుండా జనాన్ని పాలించాలనుకున్నప్పుడు అది నిరంకుశత్వమో నియంతృత్వమో అవుతుంది, దాని పీఠానికి నాలుగుకాళ్లూ విరిగిపోయి ఉంటాయి, ఎప్పుడు కుంగిపోతుందో తెలియని మట్టికాళ్ల రాక్షషి అవుతుంది. కణ్ణగి కన్నెర్ర చేస్తే కాలిపోయిన మధురానగరం వలె  ధర్మాగ్రహం ముందు రాజ్యం కుప్పకూలిపోతుంది.

బహుశా ఇప్పుడు భారత ప్రభుత్వం అటువంటి అనైతిక పునాదుల మీద నిలబడి ఉన్నది. తనలోనుంచి తాను పిగిలిపోతున్న దుస్థితిలో ఉన్నది. తూటాలు తప్ప మాటలు తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఎంవోయూలు తప్ప చర్చలు అక్కరలేని ప్రలోభంలో ఉన్నది. దేశాన్నంతా తెగనమ్మి నాలుగు కమిషన్‌రాళ్లు తెచ్చుకోవాలనుకునే అమాత్యుల నీడలో, జాతిజాతి నంతా   నిర్వాసితను చేసే దుర్మార్గం పీడలో, వేదనలన్నీ అరణ్యరోదనలయ్యే ఏలుబడిలో - జనజీవనమంతా తడిసె నెత్తుటితో, కాకుంటే కన్నీళులతో.. అరవయ్యేళ్లుగా ఆరనికాష్టంలా ఉన్న ఈశాన్యం. తుపాకుల మోతలే కాదు, ఏళ్ల తరబడి నిరశనదీక్షలూ వారాల తరబడి దిగ్బంధాలు కూడా దున్నపోతు మీది వానలే. వేర్పాటో స్వాతంత్య్రమో ఎడతెగని విషాదం కాశ్మీర్. జీవితమంతా నిత్య అంతిమయాత్ర. ఉగ్రవాదానికే కాదు, రాళ్లవానకు కూడా తుపాకులు తప్ప మరో సమాధానంలేదు. భోపాల్ హంతకుడిని దేశం దాటించిన నేతలే, ఆకుపచ్చని అణచివేతలో ఆదివాసుల నరమేధం నిర్వహిస్తారు. కార్బైడ్ న్యాయంజరగనేలేదు, దేశమంతా అణు కుంపట్లు. అడుగడుగునా ఆధునిక సంస్థానాలు, ఆదాయాల మధ్య అగాధాలు. విద్యాలయాలు న్యాయస్థానాలు ఆరోగ్యనిలయాలు అన్నీ- ప్రపంచీకరణ పూసలో ఒదిగిన దారాలు.
చెప్పుకోవడానికి ఒక్క న్యాయమూ లేని, రాజ్యంతో ఒక్క పేగుబంధమూ లేని దేశంలో- బతుకును ప్రేమించేవారంతా మరణించడమే రాజధర్మం. కొమురం భీమ్ సినిమా విడుదలైన రోజునే, ఆతను నమ్మిన సత్యాన్ని సాధనచేసిన నేలలోనే చెరుకూరి రాజకుమార్ నేలకొరిగాడు. అతనిమార్గం ఈ దేశానికి, ఆదివాసులకు విముక్తి సాధిస్తుందో లేదో తెలియదు. కానీ, త్యాగమూ సంకల్పమూ సాహసమూ అన్న శాశ్వతవిలువలను సాధనచేస్తున్న మార్గం అతనిది. ఓడిపోయే యుద్ధంచేసి, గెలిచిన మార్గం అతనిది. యంత్రాంగాలూ రాజ్యాంగాలూ ధర్మశాస్త్రాలూ సాధనాలన్నీ అంతరించి, హత్యలు తప్ప మరో ఆయుధం లేని బలహీనతలోకి దిగజారిన అనైతిక వ్యవస్థ కొన వూపిరి మూలుగు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నది. ప్రజాస్వామ్యపు అవశేషాలన్నీ సర్వశక్తులూ కూడదీసుకుని మరో భ్రమనో ప్రయత్నాన్నో అందించకపోతే ఈ శైథిల్యం శ్మశానమై విస్తరిస్తుంది.

2 comments: