Thursday, July 8, 2010

వాస్తవాలు తెలియాలి

ఆదిలాబాద్ జిల్లాలో గత శుక్రవారం నాడు జరిగిన 'ఎన్‌కౌంటర్'లో మావోయిస్టు అగ్రనాయకుడు చెరుకూరి రాజకుమార్‌తోపాటు మరణించిన హేమచంద్ర పాండే ఎవరన్నది వివాదంగా మారింది. అతను పాత్రికేయుడని, బహిరంగ సాధారణ జీవితం గడుపుతున్న ఉద్యోగి అని భార్య, కుటుంబ సభ్యులు చెబుతుండగా, కాదు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి అని అధికార యంత్రాంగం వాదిస్తున్నది. మావోయిస్టు నేతను హతమార్చిన ఎన్‌కౌంటరే పెద్ద ప్రశ్నార్థకమైనప్పటికీ, అది ఆశ్చర్యపడనక్కరలేనంత, కొత్తగా ఆందోళనపడనక్కరలేనంత సర్వసాధారణమైనందున, పాండే గుర్తింపే ఇప్పుడు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది.

పాండే జర్నలిస్టు అయితే చంపకూడదని, నక్సలైట్ అయితే చంపవచ్చునని కాదు. పాత్రికేయుడై ఉంటే, వృత్తిపరమైన సమాచార సేకరణలో భాగంగా ఆజాద్‌ను కలసినప్పుడు, పోలీసులు ఆయనను చంపి ఉంటే, మన ప్రజాస్వామ్య, మానవ హక్కుల ప్రస్థానం మరో 'ఉన్నత' స్థానానికి చేరుకున్నట్టు లెక్క. అది సహజంగానే పత్రికలు, ప్రసార సాధనాలన్నీ ఆందోళన చెందవలసిన పరిణామం, స్వేచ్ఛను ప్రేమించేవారంతా కలవరపడవలసిన దుర్మార్గం. ఎన్‌కౌంటర్లలో ఉన్న బూటకానికి, దౌష్ట్యానికి తోడు మరింత క్రౌర్యం జతకలిసిన దారుణం. ప్రధాన స్రవంతి రాజకీయాల వైఫ ల్యం కారణంగా, దేశవ్యాప్తంగా వివిధ మిలిటెంట్ ఉద్యమాలు పెరిగిపోతున్నాయి, సంక్షోభం రానురాను ఉధృతమవుతున్నది. మావోయిస్టు ఉద్యమం మధ్య, ఉత్తర, తూర్పు భారత్‌లలో వేగంగా విస్తరిస్తున్నది.

ఈ పరిణామాలను ప్రజలకు నిష్పక్షపాతంగా అందజేయవలసిన బాధ్యత మీడియా మీద ఉంటుంది. ప్రభుత్వాలు వివిధ మిలిటెంట్ ఉద్యమాల నేతలను ఎట్లా పరిగణించినప్పటికీ, ప్రజాప్రయోజనాల రీత్యా,
పాత్రికేయులు వారితో ఇంటర్వ్యూలు చేయడం, వారి వైఖరులను నివేదించడం చేయవలసి ఉంటుంది. పాండే పాత్రికేయుడే అయితే, అతని హత్య అటువంటి వార్తాసేకరణ నిరోధానికి చేసిన హెచ్చరికగా దీన్ని భావించాలా? 

మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పత్రికలు, టీవీచానెళ్లు తరచు మావోయిస్టు నేతలతో ప్రత్యేక ఇంటర్వ్యూలు అందిస్తున్నా యి. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాల వైఖరితో నిమిత్తం లేకుండా విప్లవ, తిరుగుబాటు సంస్థల ప్రతినిధులతో, ఉగ్రవాద నేతలతో కూడా పాత్రికేయులు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. సమాచారం ఏకపక్షంగా ఉండకూడదని, ప్రజల శ్రేయస్సు రీత్యా వాస్తవాలను, వైఖరులను వెల్లడిచేయడం బాధ్యత అని పత్రికారంగం భావిస్తుంది. బిన్‌లాడెన్ ఇంటర్వ్యూ కోసం అంతర్జాతీయ విలేఖరులు వందలాది మంది తమకు తోచిన మార్గాల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నారని ఒక అంచనా. మరణానికి కొన్ని నెలల ముందు ఎల్‌టిటీఈ నేత ప్రభాకరన్‌తో టైగర్ల అధీన ప్రాంతంలో బిబిసి ఇంటర్వ్యూ చేసింది. సమాచారాన్ని నిర్బంధం ద్వారా నిరోధించడం- ప్రజల్లో అవాస్తవాలు ప్రచారం కావడానికి, పర్యవసానంగా భయాందోళనలు, తప్పుడు అంచనాలు నెలకొనడానికి దారితీస్తుంది. ఇంటర్వ్యూలు చేయబోయిన పాత్రికేయులను నిషిద్ధసంస్థల సానుభూతిపరులుగానో, సభ్యులుగానో చిత్రించడం దారుణం.

పాండే ఒక ప్రైవేటు సంస్థలో వారి ఆన్‌లైన్ పత్రికలో పనిచేస్తున్నాడని చెబుతూ మేనెలలో ఆయన తీసుకున్న జీతం కాయితాన్ని కూడా కుటుంబసభ్యులు చూపిస్తున్నారు. ఒక వార్తాకథనం కోసం నాగ్‌పూర్ వెడుతున్నానని ఇంట్లో చెప్పి జూన్30 నాడువెళ్లిన పాండే చెప్పిన తేదీకి తిరిగిరాకపోయే సరికి ఆయన తల్లి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చారు. హేమంత్ పాండే పేరుతో ఫ్రీలాన్సర్‌గా ఆయన వివిధ హిందీ పత్రికల్లో రాసిన వ్యాఖ్యావ్యాసాల ప్రతులు కూడా పాండే భార్య చూపిస్తున్నారు. ఈ ఆధారాలను గమనిస్తే,ఆయన సాధారణ జీవితంలోనే ఉన్నారని అర్థమవుతుంది, వృత్తి గా, ప్రవృత్తిగా కూడా పాత్రికేయుడేనని తెలుస్తోంది. కాకపోతే, పాండే విద్యా ర్థి దశ నుంచి ఉత్తరాఖండ్‌లో స్థానికంగా ఉన్న వామపక్ష ఉద్యమాలలో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. అజ్ఞాత జీవితంలో కానీ, సాయుధ దళాలలో కానీ అతను పనిచేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అతని మీద పోలీసు కేసు లు కూడా ఏమీ లేవు. అతను ఆజాద్‌ను ఇంటర్వ్యూ కోసం కలిశారా, వారి కలయిక ఎప్పుడు ఎట్లా జరిగింది అన్నవి తెలియడం లేదు.

లభించినంత వరకు ఆధారాలు పాండేను పాత్రికేయుడిగానే నిర్ధారిస్తుండ గా, పోలీసులు మాత్రం అతను మావోయిస్టు సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తిగా నే చెబుతున్నారు. జర్నలిస్టే కాదని ఖండిస్తున్నారు. పాత్రికేయుడిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం వల్ల చెలరేగే వివాదం గురించి వారికి తెలుసును కాబట్టే, వారు తమ వాదంపై పట్టుబడుతున్నారని అర్థమవుతోంది. ఈ విషయంలో నిజానిజాలు నిర్ధారించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎన్‌కౌంటర్‌మీద న్యాయవిచారణ జరిపితే వాస్తవాలు వెల్లడి కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బాధితుడుగా ఉన్నది పాత్రికేయుడు కాబట్టి, పాత్రికేయ సంఘాలు స్వతంత్రంగా దర్యాప్తు చేసి సాధికారికమైన వాస్తవాలను బయటపెట్టవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చిన శాంతి ప్రతిపాదనపై తమ పార్టీ సహచరులతో చర్చించడానికి దండకారణ్యానికి వెళుతున్నప్పుడు నాగ్‌పూర్‌లో ఆజాద్ పోలీసులకు చిక్కి ఉంటారని శాంతి, న్యాయ ఉద్యమకారుడు ప్రొఫెసర్ బన్వరిలాల్ శర్మ అభిప్రాయపడ్డారు. మేధా పాట్కర్, డాక్టర్ వి.ఎన్. శర్మ తదితర సామాజిక కార్యకర్తలు ఆజాద్, పాండే ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు పోలీసులు, భద్రతాదళాల మనోస్థైర్యం గురించి ఎంతో పట్టింపుతో ఉంటాయి. ప్రజలను రక్షించవలసిన బలగాలలో ఆత్మవిశ్వా సం చెదరకుండా ఉండడం అవసరమే కావచ్చు. అదే సమయంలో ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమైన వ్యవస్థలలో సంశయాలు, సందేహాలు నివృత్తి చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటుంది.
పాత్రికేయులలో మనోస్థైర్యం దెబ్బతింటే ప్రజాస్వామ్యానికి జరిగే హాని ఇంకా తీవ్రమైనది. కాబట్టి, ఆజాద్, పాండే ఎన్‌కౌంటర్ల విషయంలో పూర్తి వాస్తవాలను ప్రజలకు అందించే దిశగాప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. హేమచంద్ర పాండే ఎవరనే విషయమై దర్యాప్తునకు ఆదేశించినట్టు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం తెలిపారు. పాండే భార్య బబిత హోం మంత్రిని కలుసుకున్న తరువాత సబిత ఈ విషయం వెల్లడించారు. 

(జూలై 6 , 2010  ఆంధ్రజ్యోతి సంపాదకీయం)  

2 comments:

  1. ఈ సంఘటన చదవగానే నాకు ఇనుముతో కూడిన అగ్నికి కూడా సమ్మెట పోటు తప్పదు కదా అనే సామెత గుర్తు వచ్చింది.

    ReplyDelete