Sunday, July 11, 2010

ఒక అబద్ధం కావాలి, ప్లీజ్!

ఆడుకుందునే అమ్మా నాకొక చంద్రుడు కావాలని రామచంద్రుడు అడిగినప్పుడు మంత్రి సుమంతుడు అద్దంలో ప్రతిబింబాన్ని చూపి అల్లరిమాన్పాడట. అట్లాగే, అనగనగా ఒక చిట్టి రాకుమారికి కూడా మబ్బుతునకతో ఆడుకోవాలని మనసయిందట. ఎవరూ తెచ్చి ఇవ్వకపోయే సరికి బెంగపెట్టుకుని మంచం పట్టిందట. చివరకు ఒక తోటమాలి దూది పోగేసి మబ్బుముక్కలా చేసి రాకుమార్తెకు ఇచ్చాడట. కోరినది నెరవేరినదీ అనుకుని అమ్మాయి కోలుకున్నదట. జురెక్ బెకర్ అనే జర్మన్ రచయిత రాసిన 'జాకబ్ ద లయర్' అనే నవలలో కథానాయకుడుతన అసత్యవర్తనకు సమర్థనగా చెప్పుకున్న కథ అది. జాకబ్ కానీ, సుమంతుడు కానీ చెప్పింది అబద్ధమా? లేక కృత్రిమ సత్యమా?

అగ్రజన్ముడి హక్కు కోసం బైబిల్‌లోని జాకబ్ కూడా అబద్ధమాడతాడు. బెకర్ నవలలోని జాకబ్, నవల పేరుతోనే వచ్చిన సినిమాలో హీరో రాబిన్ విలియ మ్స్ కూడా అబద్ధమాడతారు కానీ ఈ అబద్ధం వేరు, ఇది సత్యమంత పవిత్రమైనది. జర్మన్ ఆక్రమణలోని ఒక పోలిష్ ఘెట్టోలో యూదులు అత్యంత హీనమైన జీవితానికీ, అనివార్యమైన మరణానికీ నడుమ వేలాడుతూ ఉంటారు. ఫాసిజా న్ని తుడిచిపెట్టడానికి సోవియట్ సేనలు వస్తున్నాయన్న వార్త వారి కొనప్రాణాలకు కొత్తఊపిరి పోసింది.

లీలగా తెలిసిన ఆ సమాచారానికి చిలవలు పలవలు జోడించి, నిత్యం అసత్యంతో పోషించి జాకబ్ సహయూదులలో ఆశను సజీవం గా ఉంచుతాడు. తన దగ్గర రేడియో ఉన్నదని, దాని ఆధారంగానే తాను మిత్రరాజ్యసేనల కదలికల గురించి చెప్పగలుగుతున్నానని నమ్మిస్తాడు. ఆ రేడియో ఒక అబద్ధం. తాను రోజూ చెబుతున్న విజయవార్తలు అబద్ధం. గెస్టొపో జాకబ్ ను బంధించి, ఆ అబద్ధాన్ని అబద్ధంగా అందరిముందూ ఒప్పుకొమ్మని అడుగుతారు. తన అసత్యానికి కట్టుబడి జాకబ్ నోరుమెదపడు. అందుకు బదులుగా చచ్చిపోతాడు. ఘెట్టో అంతటినీ హింసాశిబిరాలకు తరలిస్తుండగా, రష్యన్‌సేనలు ఎదురుపడతాయి.

'జాకబ్ ద లయర్'లో నాయకుడు తోటివారి ఆశ కొడిగట్టకుండా చూడడానికి అబద్ధమాడితే, 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో కథానాయకుడైన ఇటాలియ న్ యూదు కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపులో తనతో పాటు ఉన్న ఐదారేళ్ల కొడుకుని నాజీగార్డుల కంటికి కనిపించకుండా దాచడమే కాకుండా, ఆ పిల్లవాడికి అదొక హింసా శిబిరమని తెలియకుండా చూస్తాడు. అక్కడ జరుగుతున్నదంతా ఒక క్రీడ అని అబద్ధం చెప్పడమే కాకుండా, అందుకు తగినట్టుగా ప్రతి సందర్భంలోనూ అభినయిస్తాడు. చివరకు తనను నాజీలు కాల్చివేయడానికి తీసుకువెడుతున్నప్పుడు కూడా కొడుకుకు ఆ భ్రమ తొలగకుండా చూస్తాడు. ఆటలో గెలిచేవారికే ట్యాంక్ బహుమతి అని, తన తండ్రి తనకు ఆ బహుమతి అందించడం కోసమే ఆడుతున్నాడని భ్రమించిన పిల్లవాడికి, చివరకు శిబిరంలోకి దూసుకువచ్చిన అమెరికన్ ట్యాంక్ విముక్తి కలిగిస్తుంది.

మభ్యపరచడానికీ మోసపుచ్చడానికీ అణచిపెట్టడానికి అధీనం చేసుకోవడానికీ లోకంలో చాలా ఆయుధాలున్నాయి. కుత్తుకలను కోసే కత్తులే కాదు, ధర్మశాస్త్రాలూ కర్మసిద్ధాంతాలూ నీతిశతకాలూ రాజ్యాంగాలూ నేరస్మ­ృతులూ కొల్లలుగా ఉన్నాయి. చరిత్ర నిండా అబద్ధాల రహదారుల మీద అధిపతులు చేసిన దండయాత్రలే కనిపిస్తాయి. రాజదండం విధించిన పరమసత్యాల క్రీనీడలో, లలాటలిఖితాల మీద నమ్మకంతో, అరచేతి గీతల మీదా అనూహ్యతల మీదా విశ్వాసంతో సామాన్యులు జీవన వైతరణిని ఈడేరు స్తూ ఉంటారు. కత్తుల వంతెన లాంటి కాలంలో, చారిత్రక విభాతసంధ్యల సందర్భాలలో మనుషులు సత్యాసత్యాల సరిహద్దులలో ఒక బలహీనపు ఆశాదీపాన్ని ఆశ్రయించి చిరువిజయాలు కూడా సాధిస్తారు. అంతిమ విజయం న్యాయాని దే అన్న ఒకే ఒక్క సూక్తి లక్ష అపజయాలను సహించే శక్తినిస్తుంది.

ఇదింతే ఇక మారదు అన్న విరక్తి ఎవరెస్టుల్ని కూడా కూల్చివేస్తుంది. తెగింపు తెచ్చుకున్న గుండెలకు ప్రాణవాయువు అందకపోతే, శాశ్వత సత్యాలు తెలిసిన జ్ఞానులకు క్షేత్రవాస్తవం సహకరించకపోతే, కన్ను పొడుచుకున్నా ఆకాశంలో ఒక చుక్కయినా మినుకుమనకపోతే, దారిపొడుగునా సమాధులే తప్ప విజయస్తంభాలు తారసపడకపోతే- నిరాశ పిశాచమై పట్టిపీడిస్తుం ది. ఆశాదూతలు, వైతాళికులు విరజిమ్మిన వెలుగుపుంజాలన్నీ 'బ్లాక్‌హోల్'లో జీర్ణమై పోతాయి. పాడుకాలం దాపురించినప్పుడు, ఆశలు అడుగంటిపోవడమే కాదు, ఆశ్వాస న ఇచ్చే అబద్ధాలు కూడా అంతరించిపోతాయి. పంటి బిగువున ప్రాణం నిలుపుకోవాలన్న ప్రేరణే నశించిపోతుంది. ఉందిలే మంచీకాలం ముందూముందునా అని ధైర్యం చెప్పేవారుండరు, రోజులు గడిస్తే గాయం మానుతుందని తత్వం బోధపరిచే వారూ ఉండరు. ఏమో గుర్రం ఎగరావచ్చు, నందుడు రాజూ కానూవచ్చు- అన్న నిర్లిప్తనిరీక్షణా ఉండదు. శాంతి, క్రాంతి జగమంతా జయిస్తుంద న్న ధీమా లేనప్పుడు, నిజంగానే నిజంగానే.. అన్న సందేహం ప్రవేశిస్తుంది. ఒక్క మంచిమాటా లేని కాలం ఇది. ఒక్క విజయగాథా వినిపించని ఎడారి యుగమిది. ఆవలివైపున చిరుకాంతి కూడా కనిపించని చీకటిబిలమి ది. మిగిలిన కలిమి కలలే అయినప్పుడు, వాటినీ దోచుకునే దొరలున్న వల్లకాటి అధ్వాన్న శకమిది. పంచాంగ ప్రవచనాలలో అంతా ఎడతెగని దుర్భిక్షమే, సోది ఎరుకల్లో అవధుల్లేని అరిష్టమే, అంజనమేసినా దొరకనిది విశ్వాసమొక్కటే.

సత్యమో అసత్యమో ఇప్పుడేదో ఒక ప్రకటన కావాలి. మాయో మంత్రమో ఊహలకు రెక్కలు కావాలి. పురాణమో ఇతిహాస మో ఒక వీరగాథ కావాలి. ఆక్టోపసో, రామచిలకో మనమే గెలుస్తామన్న జోస్యం చెప్పాలి. సృష్టిలోని సమస్త మార్మికతలూ, ఇంద్రజాలాలూ కలసి, కొనప్రాణంతో ఉన్న భవితవ్యానికి కాయకల్పం చేయాలి. ఈ లోకం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి- అని ఎవరో మళ్లీ గుర్తు చేయాలి. ఎండమావి అబద్ధం కావచ్చు, ఒయాసిస్సు నిజం కావచ్చు.

కానీ, దాహం తీరే వరకు గుండె పిడచకట్టకుండా ఉండడానికి ఒక భ్రమ కావాలి. చీకటి కాలం లో వెలుతురు స్వప్నాలు కావాలి. సత్యం కఠినంగా కర్కశంగా ఉన్నప్పుడు ఒక ప్రియమైన అసత్యంకావాలి. సమాజమూ ప్రపంచమూ అంతా ఒక పెద్ద కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపు అయినప్పుడు, విముక్తి ఎక్కడినుంచో తరలి వస్తుందన్న నమ్మ కం ఉండాలి, ఇదంతా ఒక ఆటేలెమ్మన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి.

1 comment:

  1. Interesting idea.
    I agree that we need a little butterfly of hope, when the Pandora's box is opened.

    ReplyDelete