Sunday, July 18, 2010

మళ్లీ వచ్చిన కృష్ణదేవరాయలు

'కృష్ణరాయలు తెలుగు దుర్గములగు కొండవీడు 'నగల్చ'గా, 'బెల్లముకొండ అచ్చు చెఱచ'గా, 'కంబుమెట్టు కదల్చ'గా, ఆనాటి ఆంధ్రకవులు 'భళా'అని ఆ కర్ణాట క్షితినాథుని కరవాల ధారాచకచ్చకలను వర్ణించిరే కాని ఆంధ్రులకు పట్టిన దుర్దశను గూర్చి కన్నీటి చుక్క వదలలేదు' (-సి.నారాయణరెడ్డి, ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు- ప్రయోగములు, 1989, పేజీ 373) 

చరిత్ర విచిత్రమైనది. అది గతం గురించి చెబుతున్నట్టుంటుంది కానీ, వర్తమానంమీదే దాని గురి. కాలం విధించిన కర్తవ్యం అసంపూర్తిగా ఉండిపోతే, ఆ చరిత్ర మళ్లీ మళ్లీ కొత్త కొత్త వ్యాఖ్యానాలతో ప్రత్యక్షమవుతుంది. చిహ్నంగా మారిన చరిత్రలో భావావేశాలకే కానీ, వాస్తవాలకు తావులేదు. ఆంధ్రదేశంలో మరోసారి వీరవిహారం చేస్తున్న శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి ఇరవయ్యొక్కేళ్ల పాటు ఎట్లా పాలించాడో, అతని మాతృభాష ఏమిటో, అతను ఏమేమి మంచిపనులు చేశాడో, పాలకుడిగా ఏయే కాఠిన్యాలను ప్రదర్శించాడో తెలుసుకుని అంచనా వేయడం ఒక పండిత ప్రక్రి య. కానీ, చరిత్రలోని చాలా మంది చక్రవర్తుల వలె అతను కూడా రాజకీయ చిహ్నంగా మారిపోయాడు కాబట్టి అతని గురించి మనమేమి చెప్పుకోదలచుకున్నా మో దాన్ని మాత్రమే వింటున్నాము.

కృష్ణరాయలు తెలుగువాడేనని బల్లగుద్ది వాదించేవారున్నారు. మావాడేనని చెప్పుకునే ఫలానా కులాలు అనేకం ఉన్నాయి. వైభవోజ్జ్వల విజయనగరం సామ్రా జ్యం కాకతీయ అవశేషమేనని చెప్పే చరిత్ర ఉన్నది. ఆ మాట ఉంటే కన్నెర్ర చే సే కర్ణాటక పండితులున్నారు. దక్షిణాదిలో ముస్లిమ్ రాచరికాన్ని నిలువరించిన హైందవ యోధుడిగా కృష్ణదేవరాయలను కీర్తించే దేశభక్తులున్నారు. లేదు, బుడత కీచులకు దేశంలో స్థావరమిచ్చినవాడు అతనేనని విమర్శించే సందేహ జీవులూ ఉన్నారు. రాచరికాన్ని పక్కన బెట్టి మానవత్వంతో చేసిన 'రాయల కరుణ కృత్యము'ల గురించి రచనలు చేసిన వారున్నారు. మల్లీశ్వరిగా తెరకెక్కించినవారూ ఉన్నారు. ఏ వివాద మూ లేని సార్వజనీన
జనస్మతులకైతే లెక్కలేదు. అంగళ్ల రతనాలు అమ్మిన నగరం, అష్టదిగ్గజాలతో సాహిత్యాన్ని అంబారీ ఎక్కించిన యుగం, ఊరూరా సముద్రాలంతటి తటాకాలు నిర్మించిన రాజ్యం..

అష్టదిగ్గజాలు ఆయన ఆస్థానంలో ఉన్నది అబద్ధమే కావచ్చు, కోకొల్లల కథల తెనాలి రామలింగడు ఆయన సమకాలికుడే కాకపోయి ఉండవచ్చు. తెలుగును ప్రేమించినంతగా ఇంకొంచెం మిన్నగా కన్నడాన్ని సంస్కృతాన్ని కూడా ఆయన ప్రేమించి ఉండవచ్చు. దేశభాషలందు తెలుగు లెస్స- అన్న మాట వేరెవరో మొదట అని ఉండవచ్చు.
అయినా సరే తెలుగువాళ్లు తెలుగుతనానికి వైభవానికి కృష్ణరాయలనే ప్రతీకగా తీసుకున్నారు. విజయనగర సామ్రాజ్యం కంటె విస్తీర్ణంలో పాలనాకాలంలో అధికమని చెప్పదగ్గ కాకతీయులను కానీ, శతాబ్దంన్నరపాటు మహాసామ్రాజ్యాన్ని పాలించి, అచ్చతెనుగు కావ్యానికి పోషణనిచ్చిన కుతుబ్‌షాహీలను కానీ తెలుగు వీరులుగా గుర్తించలేదు. హంపీ శిథిలాల శిలలు ద్రవించి ఏడ్చినవనీ, 'ఆంధ్ర వసుంధరాధిపోజ్జ్వల విజయ ప్రతాపరభసంబు' చరిత్రలో కలసిపోయినదనీ ఎవరూ ఓరుగల్లు శిథిలాల చెంత కానీ, పాడుబడిన గోలకొండ నీడలో కానీ విలపించలేదు. నేటి ఒక జిల్లా దాటని ఎల్లలు కలిగిన వేంగి గురించి కవి సమ్రాట్టులు పెట్టుకున్నంత బెంగ కూడా ఎవరూ పెట్టుకోలేదు. అశోకుడినీ సముద్రగుప్తుడినీ కాక ఛత్రపతి శివాజీని, రాణాప్రతాప్‌సింగ్ నీ జాతీయ వీరులుగా ఎట్లా గుర్తించామో, రుద్రమదేవినీ మల్కిభరామ్‌నీ కాక కృష్ణరాయలిని ఆంధ్రవీరుడి గా గుర్తించినట్టున్నాము.

కృష్ణరాయల నాటికి నేటి రాష్ట్రాల సరిహద్దులే లేవు కనుక ఇప్పటి రాజకీయ పటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను పరిశీలించడం తప్పు కావచ్చు. బహుభాషా రాజ్యాన్ని ఎటువంటి భాషాభేదాలూ లేకుండా పాలించిన ప్రభుత్వం ఆయనదని అనుకుందాం. అయినా సరే, తెలుగువారి భాషాప్రయుక్త రాష్ట్రం కోసం ఆయనను కావ్యాల్లో, కవితల్లో,కథల్లో నవలల్లో సినిమాలో ఉపయోగించుకున్నాము. కృష్ణరాయల విషయంలో ఒక విశేషం ఏమిటంటే, ఆయన తుంగభద్ర-కృష్ణకు ఎగువన పరిపాలన సాగించలేదు.    దండయాత్రలు చేశాడు కానీ, వరాహ పతాకాన్ని ఎగురవేయలేదు. పాలించిన తెలుగు ప్రాంతాలని కూడా స్థానిక పాలకులపై యుద్ధం చేసి గెలుచుకున్నాడన్నది వేరే సంగతి. పాలించనంత మాత్రాన ఆయన తెలంగాణకు చెందకుండాపోలేదు కూడా. బ్రిటిష్ ఆంధ్రలో కృష్ణదేవరాయలు భాషోద్యమ చిహ్నంగా మారడానికి 1920 దశాబ్దం దాకా పట్టిందికానీ, 1901 నాటికే తెలంగాణలో ఆయన ఒక ఆరాధ్యుడయ్యాడు. నైజామ్ రాజ్యంలో తెలంగాణ తెలుగు వారిని సంఘటితం చేసే సుదీర్ఘ ప్రక్రియలో తొలిఅడుగు అని చెప్పదగ్గ తొలిగ్రంథాలయం కృష్ణరాయల పేరుతోనే వెలిసింది. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం- తెలంగాణలో ప్రజాహిత రంగానికి నాంది పలికింది.

సాధారణంగా ఎవరి రాజ్యానికి వారు భక్తులై ఉంటారు. విజయనగర సామ్రాజ్యం పతనం కావడాని కి కారణాలలో ఒకటైన గోలకొండ రాజ్యాన్ని కాదనుకుని, తెలంగాణ వికాసోద్యమకారులు మాత్రం 'విస్మృ త సామ్రాజ్యాన్నే' పలవరించారు. అందుకు కారణం- నాటి నైజాము పాలనలో తెలుగుకు ఆదరణ లేకపోవ డం.  తెలుగును పోషించాడనుకున్న రాజును కీర్తించడం ద్వారా తెలంగాణ తెలుగువారిలో స్వాభిమానాన్ని రగిలించడం వారి ఉద్దేశం. తెలంగాణలో నిజాముపాలన కు వ్యతిరేకంగా, బ్రిటిష్ ఆంధ్రలో తమిళుల ఆధిపత్యాహంకారాలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ప్రతీక కృష్ణరాయలు. ఆయన 'బాహుజాగ్రత్ బాడబాగ్నులు' అనేక చిన్న తెలుగు దుర్గాలను దహించివేసినా, తరువాతి కాలంలో తెలుగువారిలో జాతీయాభిమానానికి రాయల స్మ­ృతి కారణమైంది.

ఇప్పుడు రాయల ఉత్సవాలు ఏ వైభవగతానికి మనలను ఆకర్షిస్తాయి? ఏ ఐక్యత కు ప్రేరేపిస్తాయి? ఆలస్యంగా మేల్కొన్న మన ప్రభుత్వానికి- తమిళ, కన్నడ ప్రభుత్వాలకు ఉన్నట్టు-చరిత్రపైనా వర్తమానంపైనా ఎటువంటి ఉద్వేగపూరితమైన ప్రేమ లేదు కాబట్టి, ఉత్సవాలు కేవలం డొల్లగా, ఉత్తుత్తి భువన విజయాల అనుకరణగా మిగిలిపోతాయి. ఒక ప్రాంతంగా రాయలసీమకు, లేదా ఏదో ఒక సామాజికవర్గానికి అస్తిత్వ చిహ్నంగా రాయలు ప్రాసంగికత కొనసాగుతూనే ఉండవచ్చు.

అత ను తన కాలంలో పాలించినంత సామ్రాజ్యం, అతని స్మ­ృతికి ఉండకపోవచ్చు. 20 వ శతాబ్దం ప్రథమార్థంలో తెలుగుప్రాంతాలన్నిటిలో రాయలు నిర్వహించిన పాత్ర ఆ కాలానికే పరిమితమై పోవచ్చు. ఒకవేళ, తెలుగువారిలో రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రస్తుతం కనిపిస్తున్న విభజనను తగ్గించడానికి రాయలజ్ఞాపకం పనికివస్తుందనుకున్నా, ఇప్పుడు రాయలకు ఆ శక్తి లేదు. తిరుమలేశునికి ఆయన చేయించిన ఆభరణాలలాగే, నిరుడు కురిసిన హిమసమూహములు ఎప్పుడో కరిగినీరై పోయాయి.

2 comments:

  1. ఎట్టి వక్రీకరణ లేకుండా, నిష్పాక్షిక విశ్లేషణతో సాగిన మీ వ్యాసం చదివి, చాల ఆనందించాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు!

    ReplyDelete