Monday, July 26, 2010

ప్రతిష్ఠానం నుంచి బాబ్లీ దాకా...

నీటి కంటె నెత్తురు చిక్కన అన్నది ఇంగ్లీషు వాడి సామెత. మానవ సంబంధాల తిరుగులేని తనాన్ని చెప్పే వ్యక్తీకరణ అది. అలమట్టి వివాదం సందర్భం గా కర్ణాటకతో కానీ, తాజాగా బాబ్లీ సమస్య సందర్భంగా మహారాష్ట్రతో కానీ రాజకీయంగా ఎంతగా కత్తులు నూరుకున్నా- తెలుగు వారికి, కన్నడిగులకు, మహారాష్ట్రులకు మధ్య వైమనస్యం, విద్వేషం పాదుకొనకపోవడం నెత్తురు చిక్కదనాన్ని నిరూపించిన సందర్భం. తెలుగుదేశం పార్టీ నేతలపై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన దౌర్జ న్యం చిన్నదేమీ కాదు. అయితే, ఉభయ ప్రాంతాల మధ్య నిర్మితమైన అనుబంధం ఒక్క దుర్ఘటనతో చెదిరిపోయేదీ కాదు.

నీరు సామాన్యమైనది కాదు. పిడచగట్టుకుపోయిన గొంతులకు అది జీవధార అవుతుంది. చినుకై వానై మనుగడకు ఆధారమైనదే, వరదై విలయమై ఉనికినే తుడిచిపెడుతుంది. ప్రవాహాల వెంటనే మనిషి ప్రస్థానం సాగుతూ వచ్చింది. భూమీ నీరూ పచ్చదనమూ సంపదలైన తరువాత, వనరుల పంపకాల కోసం నెత్తురు జీవనదిగా పారింది.  అమృతం కోసం దేవదానవులు కొట్లాడుకున్నారేమో కానీ, మంచినీళ్ల కోసమే మానవులు మహాయుద్ధాలు చేశారు. న్యాయమే గెలిచిందో ఏ జగన్మోహిను లు వచ్చి అక్రమ పంపకాలు చేశారో తెలియదు కానీ, బలవంతుడి పెరట్లోనే గంగ మ్మ చెరపడింది. రాజులు మహానదుల కోసం పోరాడితే, సామాన్యులు పొలంగట్ల దగ్గర ఆరాటపడ్డారు.

అన్నదమ్ములై ఇచ్చిపుచ్చుకుంటే నీటికి కొదవేముంది కానీ, దాయాదులై దురాశాపరులైన మనిషికే దుర్భిక్షం ఎదురవుతున్నది. గౌతమ బుద్ధుని కాలం నాటికే గణతంత్ర రాజ్యాల మధ్య జలవివాదాలుండేవని చరిత్ర చెబుతున్నది. సమ్మక్కసారక్క జాతర కు నేపథ్యమైన యుద్ధం కూడా నీళ్ల కోసం జరిగిందేనని పురా ణం చెబుతోంది. ఐదునదులనూ నెత్తుటితో ముంచిన పంజాబ్ పోరాటం చివరకుఉగ్రవాదమో తీవ్రవాదమో అయింది కానీ, ఆరంభమయింది నీటి వాటా గురించిన ఆందోళనగానే.

మహారాష్ట్రతో మన సంబంధమేమిటని వేసుకునే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే కాదు, క్లిష్టం కూడా. రాష్ట్రాలు ఏర్పడి ఐదున్నర దశాబ్దాలు మాత్రమే గడిచాయని, ప్రజల భావోద్వేగాలు ఇంకా భాషాప్రయుక్తంగా స్థిరపడలేదని గుర్తించకపో తే, కొన్ని కొన్ని సౌహార్దతలు, కొన్ని కొన్ని అపనమ్మకాలు ఎందుకు బలపడ్డాయో అర్థం కావు. ఆర్యావర్తం, మధ్యభారతం, దక్షిణాపథం- వంటి స్థూల విభాగాలు భారతదేశానికి ఎప్పటినుంచో ఉన్నాయి కానీ, ఆ ప్రాతిపదికకు లొంగని ఇతర అస్తిత్వాలు కూడా చరిత్ర క్రమంలో ఏర్పడ్డాయి. నర్మద, తుంగభద్ర వంటి రెండు అప్రధాన నదుల మధ్య భూభాగం సుమారు ఏడెనిమిది శతాబ్దాలుగా 'దక్కన్' పేరుతో ఒకప్రత్యేక అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నది. అంతకు ముందు చాలా కాలం నుంచి, నేటి మహారాష్ట్రకు
తెలంగాణ ప్రాంతానికి, దిగువ తీరాంధ్రకు కూడా సంబంధాలున్నా యి. మొదటి ఆంధ్రసామ్రాజ్యం అని చెప్పుకునే శాతవాహన సామ్రాజ్యం తొలి రాజధాని ప్రతిష్ఠానపురం (నేటి పైఠన్) గోదావరీతీరంలో మహారాష్ట్రలోనే ఉన్నది.   శాతవాహనుల పాలన కృష్ణ,గోదావరి తీరాల వెంట విశాలమైన భూభాగంలో సాగింది. ఆ రెండు నదులూ మహారాష్ట్రలో పుట్టి దిగువకు ప్రవహిస్తున్నాయి. శాతవాహనుల తరువాత దేవగిరి యాదవు లు దిగువ మహారాష్ట్రను, ఎగువ ఆంధ్రదేశాన్ని పాలించా రు. దేవగిరి రాజ్యం అనంతరం పరిణామాలే కాకతీయ సామ్రాజ్య అవతరణకు దారితీశాయి.

దక్కన్ లో బహమనీ సామ్రాజ్యం, గోలకొండ రాజ్య అవతరణకు పరోక్షంగా కారణమైంది. మొగలులతో తలపడిన ఛత్రపతి శివాజీ ఆ ప్రయత్నంలో గోల్కొండ సుల్తాన్‌లతో స్నేహంగా మెలిగాడని, ఉభయులూ కలసి మొగలులను అదుపుచేయడానికి ప్రయత్నించారని చరిత్ర పుస్తకాలలో పెద్దగా చదవం కానీ అది వాస్తవం. బహమనీలు, కుతుబ్‌షాహీలు పరాజితులైన తరువాత ఔరంగాబాద్ రాజధానిగా ఏర్పడిన దక్షిణ మొగలాయి రాజ్యం తరువాత హైదరాబాద్ రాజధానిగా వలసవెళ్లి, క్రమంగా నిజాముల సుబేదారి స్వతంత్ర రాజ్యంగా మారిపోయింది. 1948 దాకా హైదరాబాద్ రాజ్యంలో నేటి మరఠ్వాడా ప్రాంతం కూడా అంతర్భాగంగా ఉంది. మహారాష్ట్రలోని భక్తకవుల సంప్రదాయం, రామదాసు వంటి వారిని స్పృశించడమే కాక, పండరిపురం పాండురంగని తెలుగువారి దేవుడిని చేసింది. నాడు పాండురంగడయినా, నేడు షిరిడీ సాయిబాబా అయినా మహారాష్ట్ర సీమలో తెలుగువారు వెదుక్కున్న భిన్నమయిన ఆధ్మాత్మిక ఉపశమనానికి గుర్తులు.

నిరంతరం యుద్ధ క్షేత్రంగా ఉండడం వల్ల, మొగలాయిలకు తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చిన అనుభవం ఉండడం వల్ల, సమాజంలో శ్రామికకులాల భక్తి ఉద్యమం తీసుకువచ్చిన సంచలనం వల్ల మహారాష్ట్రులు రాజనీతిలో, పరిపాలనలో, విద్యలో పురోగతి సాధించగలిగారు. నిజాం రాజ్యంలో మహారాష్ట్రులు కూడా భాగం కావడం వల్ల, తక్కిన కన్నడ, తెలుగు ప్రజల కంటె వారికి పెద్దపీట లభించింది. తమకు లభిస్తున్న ప్రాధాన్యం మరాఠీలకు స్వాతిశయాన్ని కూడా పెంచింది. 1921 నవంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్ వివేకవర్థనీ హాలులో జరిగిన 'నిజాము రాష్ట్ర సంఘసంస్కార సభ'లో ఆలంపల్లి వెంకటరామారావు అనే తెలు గు న్యాయవాది ప్రసంగించడం ప్రారంభం కాగానే మరాఠీలు గేలిచేస్తూ గందరగోళం సృష్టించారు. ఆ సభ నుంచి తెలుగువారందరూ బయటికి వచ్చేశారు.  నవంబర్12 తేదీ రాత్రి టేక్మాల్ రంగారావు అనే మరో న్యాయవాది ఇంట్లో తెలుగువారు సమావేశమై 'ఆంధ్రజనసంఘము'ను స్థాపించారు. అదే ఆంధ్రమహాసభగా పరిణమించి, తెలంగాణలో రాజకీ య, సాంస్కృతిక వికాసానికి దారితీసింది. నిజాం రాజ్యం లో తెలంగాణవారి ఆత్మాభిమాన ప్రకటనకు కారణమైన అవమానం పాలకుల నుంచి కాదని, మరాఠీలనుంచి అని చాలా మందికి గుర్తు లేదు.

హైదరాబాద్ రాజ్యం విచ్ఛిన్నమై మరాఠీ ప్రాంతాలు మహారాష్ట్రలో కలసినప్పు డు, పాపం వాళ్లెవరూ హైదరాబాద్ కావాలని కానీ, ఉండిపోతామని కానీ అనలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి వె దుక్కుంటూ అధిక సంఖ్యాకులు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో తిలక్‌రోడ్, కాచీగూడ, వైఎంసిఎ ప్రాంతాల్లో తమ ఉనికిని నిలబెట్టుకుం టూ సమ్మిశ్రిత నగర జీవనంలో కలగలసిపోయారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉత్తర తెలంగాణ నుంచి అనేక మంది కార్మికులు, ముఖ్యంగా నేతపనివారు భివాం డి, షోలాపూర్, బొంబాయి, అటునించి సూరత్ కూడా వెళ్లి స్థిరపడ్డారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మహారాష్ట్ర సరిహద్దు పరిమళం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కానీ, నల్లగొండ, మహబూబ్‌నగర్ మారుమూల పల్లెల నుంచి కూడా ముంబయి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శివసేన అవతరించిన కొత్తల్లో మరాఠీయేతరుల మీద ప్రదర్శించిన దౌర్జన్యం ప్రధానంగా తమిళులమీద సాగింది కానీ, తెలుగువారు పెద్దగా బాధితులు కాలేదు.

ఆశ్చర్యం ఏమిటంటే, ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలోని కన్నడ ప్రాంతంలో అల్‌మట్టి ఆనకట్ట, మహారాష్ట్ర ప్రాంతంలో బాబ్లీ నిర్మితమవుతున్నాయి. అంటే, రాచరికపాలనలో ఉండిన వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి కోసం అక్కడి రాష్ట్రప్రభుత్వా లు ఏవో ప్రయత్నాలు చేస్తున్నాయి, తపన చెందుతున్నాయి. అటువంటి కృషి ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ నిజాం ప్రాంతాలలో ఇంతకాలం ఎందుకు జరగలేదన్నది శేష ప్రశ్నగానే మిగులుతుంది.

3 comments:

 1. మీ చారిత్రిక అవగాహన చూస్తే .. ముచ్చటేస్తుంది. ’రాయల వారి’ పై మీరు వ్రాసిన పోష్టు, ఈ పోష్టు చదివాక, మీరు సామాన్యులు కారని అర్థమయింది. కొంప దీసి ... మీరు ’ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ ’శ్రీనివాస్’ గారు కాదు కదా! ఏమయినా ..
  మీకు నా హృదయపూర్వక అభినందనలు!

  ReplyDelete
 2. అయ్యా!

  తిన్నామా....పడుకున్నమా.....తెల్లారిందా.....నెలాఖరయ్యిందా....మన జీతం మనకొచ్చిందా......? ఇలాంటి ప్రశ్నలే సర్వస్వం అనుకొనే నేటి యువతకి చరిత్ర యెందుకు గుర్తుచేస్తారు?

  తేకుమళ్ళ రామారావు గారూ, ఆంధ్ర జన సంఘం, ఇవన్నీ యెవడికి కావాలి?

  నిజాం ప్రాంతాల లో యెందుకు జరగలేదు......అంటే.....అదంతే మరి!

  ReplyDelete