Sunday, August 1, 2010

ఆశారాహిత్యమే అసలు కారణం

అప్పుడు చనిపోయిన వేణుగోపాలరెడ్డి, శనివారం నాడు కన్నుమూసిన ఇషాన్‌రెడ్డి ప్రత్యక్ష దృశ్యాలుగా మారకుండా అపరాత్రివేళ ఆత్మాహుతు లు చేసుకున్నారు కానీ, శ్రీకాంత్‌చారి కానీ, యాదయ్యకానీ వేలాది ప్రజల మధ్య, వందలాది కెమెరాకళ్ల ముందు తమను తాము అగ్నిజ్వాలలుగా ప్రదర్శించుకున్నారు. ఎవరైనాసరే ఎందుకైనా సరే ప్రాణాలు తీసుకోవడం సమర్థించకూడదు, అటువంటి చర్యలను ప్రోత్సహించకూడదు. అటువంటి ఆత్మహననానికి పాల్పడిన వారిని కీర్తించడం, శ్లాఘించడం కూడా పొరపాటే కావచ్చు. కానీ, ఈ దారుణాలకు, బీభత్స దృశ్యాలకు మానసిక దౌర్బల్యమో, నిరాశా నిస్పృహలో కారణమని నిర్ధారించి, విద్యార్థులకు, యువతకు ఉచిత ఉపదేశాలు చేయడం వల్ల ప్రయోజనం ఉన్నదా? ఇటువంటి విషాద సంఘటనలు పునరావృత్తం కాకుండా నిరోధించగలిగే శక్తి ఉద్యమ నాయకత్వం సహా సంబంధిత పక్షాలకు ఉన్నదా? వ్యక్తిగతంగా ఉజ్వల భవిష్యత్తు ఉండి కూడా ఒక ఆకాంక్ష నెరవేర్చుకోవడానికో, నెరవేరనందుకో ప్రాణాలు తీసుకుంటూ, ప్రాణత్యాగాన్ని ఒక రాజకీ య నిరసన రూపంగా మార్చుకుంటున్న యువతరానికి విశ్వాసం కలిగించగలిగిన చిత్తశుద్ధి మన నాయకులకు, పాలకులకు ఉన్నదా?

ఈ ప్రశ్నలు ఎందువల్ల ప్రాసంగికం అంటే- ఆత్మాహుతులు కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఉధృతం కావడం వల్ల మాత్రమే జరగడం లేదు. నెలకొని ఉన్న పరిస్థితుల మీద నిర్వేదంతో, ఉద్యమ గమనం మీద అసంతృప్తితో, నిర్ణయం తీసుకోవలసిన బాధ్యులలో కనిపిస్తున్న స్పందనా రాహిత్యంపై నిరసనతో జరుగుతున్నవి. తెలంగాణ సమస్య విషయంలో మాత్రమే కాదు, మొత్తంగా అన్ని ప్రజా సమస్యల విషయంలో పాలకులు, రాజకీయ పక్షాలు, ప్రభుత్వ యంత్రాంగం
స్పందనా రాహిత్యంతో వ్యవహరిస్తున్నాయి. జనాభిప్రాయాన్ని పెడచెవిన పెట్టడం, అభివృద్ధి పేరిట విధ్వంసాన్ని రుద్దడం, గొంతెత్తే ఉద్యమ కారులను పోలీసు బలగాలతో అణచివేయడం- ఈ విధానం తప్ప మరొకటి పాలకులకు తెలియదు.

కార్పొరేట్లకు, సంపన్నులకు ప్రజల వనరులను అప్పగించి, ముడుపులతో తమ కడుపులు నింపుకునే దళారులే పాలకులుగా మారిన స్థితిలో స్పందనా రాహిత్యం ఒక జాతీయ విధానంగా అవతరించింది. తమ కష్టాలు ఆశలు అరణ్య రోదనలుగా మారినప్పుడు, తమ మనోభావాలకు వేదిక కావలసిన రాజకీయపక్షాలు మోస పూరితంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజలు తమ గుండెకోతను వ్యక్తంచేయడానికి ఉన్న మార్గాలేమిటి?   విప్లవమంటే వ్యాస రచన కాదన్నాడు ఒక మహా నాయకుడు. విప్లవమే కానక్కరలేదు, ప్రయోజనాల ఘర్షణలో ప్రజల తరఫున జరిగే ఏ పోరాటమైనా ఆహ్లాదకరంగానో అతిసున్నితంగానో ఉండదు. ప్రాణత్యాగాల ప్రగల్భాలతోనో, చీల్చిచెండాడే పదాడంబరంతోనో, ఉత్సాహపరచే ఆటపాటలతోనో ప్రజా ఉద్యమాలు పరుగులు పెట్టవు. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట స్వప్నాలు ఊహలు ఆచరణలోకి అనువాదం చెందాలి, కాల్పనికత పచ్చివాస్తవంగా పరివర్తన చెందాలి.

అట్లా చెందినప్పుడు- పోరాటాల రంగస్థలమూ, పరిభాష, సన్నివేశాలూ అన్నీ మారిపోతాయి. విజయం కోసం జరిపే ప్రస్థానం కన్నుల పండుగగానో వీనుల విందుగానో ఉండదు. తెగింపు, సంకల్పబలం, సాధనసంపత్తి- వీటి ఆధారంగా గెలుపు నిర్ణయం కావచ్చు కానీ, అంతిమంగా న్యాయమో అన్యాయమో గెలువవచ్చు కానీ, ఆ ప్రయాణం మాత్రం రక్తసిక్తంగా భయానకంగా విషాదంగా ఉండక తప్పదు. ఉద్యమాలూ పోరాటాలే కానక్కరలేదు, కలిగించిన నమ్మకం, ఇవ్వచూపిన కానుక, చేసిన వాగ్దానం- కూడా ఒక పర్యవసా నం కోసం, ఫలితం కోసం ఎదురుచూస్తుంటాయి. రగిలి న ఆవేశాలతో లక్ష్మణరేఖల దగ్గర పడిగాపులు పడలేకపోతాయి. ప్రయాణం ప్రారంభం కాకుండా, వేసిన గొంగడి లాగానే ఆశ మిగిలినప్పుడు, సాకారం దిశగా ఆకాంక్షలు అడుగుముందుకు వేయనప్పుడు, సాగదీసి సాచివేసి నాయకత్వాలు జనంతోనే 'రాజకీయం' చేస్తున్నప్పుడు- నిరాశలోకి పరిణమించిన నిరీక్షణ, తెగింపు గా మారిన విచక్షణ- మంచును బద్దలు చేయాలనుకుంటాయి, చావుకేక పెట్టి కుంభకర్ణులను నిద్రలేపాలనుకుంటాయి. అది మంచిదా చెడ్డదా అని కాదు ప్రశ్న, అంతదాకా రానిచ్చిందెవరన్నది ప్రశ్న.

ఎప్పుడంటే అప్పుడు ఎగదోసి ఎప్పుడంటే అప్పుడు చల్లార్చడానికి జనమనోభావాలు రాజకీయుల పాచికలు కావు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఎంతో చరిత్ర ఉన్నది, దాని సమర్థనలు దానికి ఉన్నాయి కానీ, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ద్రోహంచేసిన చరిత్ర ఉండి కూడా మలివిడత ఉద్యమం నుంచి లాభాలు పిండుకోవాల ని చూసింది, పిండుకున్నది.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సమీకరణ, సహాయం లేకుండా, సోనియాగాంధీ అన్యాపదేశ సూచన లేకుండా 2004లో కాంగ్రెస్ రాష్ట్రంలో గెలువగలిగేదే కాదు. పార్టీ మేనిఫెస్టోలో,యుపిఏ ఉమ్మడి కార్యక్రమం లో, ప్రధాని ప్రసంగంలో అన్నిటిలోనూ చాకచక్యమైన ప్రస్తావనలతో కాంగ్రెస్ మభ్యపెడుతూనే ఉంది. చివరకు 2009 డిసెంబర్9 ప్రకటన, తిరిగి 23 నాడు చేసిన మరో ప్రకటన- ఒక తీవ్రమైన సమస్య విషయంలో ఆ పార్టీ చూపిన ఆషామాషీ తనాన్ని నిరూపించాయి.

ఈ నాన్‌సీరియస్ వైఖరిని, ద్వంద్వార్థ విధానా న్ని సహించలేని తెలంగాణ జనమే 2009 డిసెంబర్‌లో ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. గత ఏడెనిమిది నెలలుగా జరిగిన ఉద్యమాన్ని టిఆర్ఎస్ నడిపించిందనుకుంటే పొరపాటు. ఉద్యమం వెనుక ఆ పార్టీ నాయకత్వం అనివార్యంగా నడువవలసి వచ్చింది. ప్రభుత్వాలను దారికి తేవడానికే కాదు, పార్టీలు తాము కట్టుబడిన విధానాలపై పనిచేయించడానికి కూడా ప్రజలే పూనుకోవలసి వచ్చింది. టిఆర్ఎస్ శాసనసభ్యులు తమ స్థానాలను వదిలిచేసిన త్యాగం వల్ల కాక, ఉద్యమంలో కొన్ని వందల మంది బలిదానం చేయడం వల్లనే ఉప ఎన్నికలలో తెలంగాణవాదానికి విజయం సమకూరింది.

ఉద్యమలక్ష్యం నెరవేరడం పోరాటం నడిచే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తుల వల్ల కానీ, పరిష్కరించవలసిన వారి అలస త్వం నిర్లక్ష్యం వల్ల కానీ ఉద్యమకారుల్లో సానుభూతిపరుల్లో నిస్పృహ రాదు. ఎన్ని నష్టాలు కష్టాలు ఎదురైనా, జయించి తీరతామన్న ఆశను ఇచ్చే సంస్థ, నేతృ త్వం ఉంటే, ఆత్మహత్యలు ఆత్మాహుతులు జరగవు.  తమ వెంటనడుస్తున్న జనశ్రేణిలో తన నాయకత్వం మీద నమ్మకం కలిగించవలసిన బాధ్యత, ధైర్యం ఇవ్వవలసిన కర్తవ్యం ఉద్యమ నాయకత్వానిది. పోరాటం ఆగిపోకుండా ముందుకు తీసుకుపోవలసిన బాధ్యతతో పాటు, గత్యంతరం లేని స్థితిలో నాయకత్వాన్ని కూడా తామే మోసుకు తిరగవలసిన స్థితిలో పడిన తెలంగాణ యువతరం, తర చు నిస్పృహాత్మక దశలను ఎదుర్కొనవలసి వస్తున్నది.

చనిపోతూ ఇషాన్ రాసిన లేఖలో - తెలంగాణకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం నేతలపై తీవ్రమైన విముఖత వ్యక్తం చేశాడు. దానితో పాటు- డిసెంబర్‌దాకా సమయం ఉంది, ఈలోగా తెలంగాణ సమస్యల మీద పోరాటం చేయి, బాబ్లీపై చంద్రబాబు బూటకపు పోరాటం చేశాడు, కెసిఆర్, నువ్వు పోలవరంపై నిజమైన పోరాటం చేయాలి- అని కోరాడు. ఇషాన్ ఆశించిన నిజమైన పోరాటాలు ఉద్యమ నాయకత్వం చేపట్టగలదా?

1 comment:

  1. కాంగ్రెస్ తెలంగాణా ఇస్తామని చెప్పి చాలా సార్లు మోసం చేసింది. TRS గెలిచినా కాంగ్రెస్ తెలంగాణావాదాన్ని నీరుగారుస్తుందని తెలంగాణావాళ్లకి అనుమానాలు రావడం సహజమే. కానీ ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం.

    ReplyDelete