Monday, August 16, 2010

ఝండా వూంచా రహే హమారా

మూడునాలుగు దశాబ్దాల కిందటి దాకా ఆగస్టు 15 అంటే కనీసం పిల్లల కు ముఖ్యంగా పల్లెల బడిపిల్లలకి పెద్ద హడావుడి. తెల్లవారుజామునే లేచి ఊరుఊరంతా చుట్టేసే ప్రభాతభేరి. బోలో స్వతంత్రభారత్‌కీ జై, గాంధీ మహాత్మునికీ జై, పండిట్ నెహ్రూ అమర్‌హై- అంటూ చిన్నారిగొంతుల నినాదా లు. స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియకపోవచ్చు, ఏ పరాధీనత నుంచి విము క్తి లభించిందో అర్థం కాకపోవచ్చు. కానీ, ఏదో ఒక ఉద్వేగం. దేశభక్తి గీతాలు వింటే ఒక పులకింత. సినిమాల్లో గాంధీ నెహ్రూల క్లిప్పింగులు కనిపిస్తే, చప్పట్లతో నివాళులు. దేనినో పొందిన ఉత్సాహం ఇంకా కొత్తగానే ఉన్న రోజులు. నిరా శ ఆవరిస్తున్నా నిస్ప­ృహలోకి వెళ్లని రోజులు. కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి- అంటూ దేశభక్తికి కొనసాగింపు కోరుతున్న సందేశాలు. త్యాగం,నిరాడంబరత, సమాజహితాన్ని కోరే ఆదర్శం- ఇంకా అప్పటికి చెల్లుతున్న నాణేలు.

పల్లెల్లో పరిస్థితి ఇప్పుడు బాగానే మారిపోయి ఉంటుంది. కొద్దిపాటి శక్తి ఉన్న కుటుంబాల పిల్లలంతా ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. స్పెషల్ క్లాసు లు రద్దుచేసి, జెండావందనాలు చేస్తారో లేదో తెలియదు. కార్పొరేట్ కాలేజీల్లో సోమవారం టెస్టులుంటాయి, ఆదివారం జెండాపండుగకు వచ్చి నాలుగు మార్కులు నష్టపోతారో లేదో తెలియదు. సర్కారీస్కూళ్లలో చదువుకునే ఎస్సీఎస్టీ అట్టడుగుబీసీ పిల్లలూ వాళ్లకుపాఠాలుచెప్పే పంతుళ్లలో మిగిలి న దేశభక్తులూ పాడుబడిన బడిగోడల మధ్య జెండా ఎగరేసి నాలుగుమంచిమాటలు చెప్పుకోవచ్చు.

పట్నాల్లో అయితే, ఏదైనా సరే ఒక తిరణా లే కాబట్టి, ఇండిపెండెన్స్ డే కూడా ధమాకా గానే జరిగిపోతుంది. ట్రాఫిక్ జంక్షన్లదగ్గర చిన్న చిన్న పిల్లలు కార్లకు అడ్డం పడి, జెండాలు అమ్ము తూ వ్యాపారదక్షత
చూపుతూ ఉంటారు. ఎవరో ఒక అభాగ్యుడు వంటినిండా తెల్లటిరంగు పులుముకుని, ఒక కర్రా, పాతకళ్లజోడూ ధరించి గాంధీ వేషం వేసి నాలుగు డబ్బులను ఆకర్షిస్తూ ఉంటాడు. అవకాశం దొరికితేచాలు అభినందించాలని కాచుకు కూర్చున్న ఎస్సెమ్మెస్ వీరులు పుంఖానుపుంఖాలుగా దేశభక్తి సందేశాలను గుప్పిస్తూ ఉంటారు. వీధిచివర్లలో ఛోటాబడా నేతలు జెండాలు ఎగరవేసి అనుచరగణాన్ని ఆనందపరుస్తుంటారు. ఎవరన్నా జెండా తలకిందులుగా ఎగురవేస్తారేమోనని మీడియా వేయికళ్లతో కాచుక్కూచుంటుంది. ఒక పబ్లిక్ హాలిడే నష్టమయిందే అని కొందరు ప్రభుత్వోద్యోగులు బాధపడుతూ ఉంటారు. సందర్భం దొరికింది కదా అని డిస్కౌంట్ సేల్ ప్రకటించిన మాల్స్ కిటకిటలాడుతూ ఉంటాయి.

టీవీల్లో హిందీలో అయితే కార్గిల్, ఎల్ఓసీ తెలుగులో అయితే రోజా,ఖడ్గం పదహారోసారి కలర్‌ఫుల్ దేశభక్తిని కురిపిస్తాయి. ముందురోజే కొనుక్కున్న మందుబాటిళ్లతో సాయంత్రాలు మత్తెక్కిపోతాయి. భావాడంబరం దేశభక్తి కంటె హీనమైనదని గుడిపాటి వెంకట చలం ఎందుకు అన్నాడో చాలామందికి తెలియదు కానీ, జాతీయోద్యమకాలంలోనే ప్రజారంగం లో పనిచేస్తున్నవారి కపటత్వాన్ని, ద్వంద్వ విలువలను ఆయన ఎన్నో కథలలో రాశాడు.   సరే, పెద్దగీత వచ్చి చిన్నగీతను చిన్నది చేస్తుంది కాబట్టి, ఇప్పటి నేతలతో పోలిస్తే, ఆనాటి నాయకులు మహానుభావులు. పోల్చనక్కరలేకుండా కూడా వారిలో అనేకులు మహితాత్ములు. మచ్చలేనివారు, త్యాగధనులు. వారి విగ్రహాలు మిగిలాయి, జీవితచరిత్రలు నిలిచాయి. వారు ఎందుకు నిలబడ్డారో మాత్రం విస్మ­ృతిలోకి వెళ్లింది.

గాంధీగారి స్వదేశీ భావన ఒక గతించిన గతం. స్వరాజ్యం ఒక ఛాందసం. మిత వినియో గం ఒక చెల్లని కాసు. గాంధీని గట్టిగా నమ్మితే ఏమవుతుందో వినాయక్‌సేన్‌ను అడగవచ్చు. మేధాపాట్కర్‌నూ అడగవచ్చు. మగ్గానికి ఉరిపోసుకునే చేనేత కార్మికుడినీ అడగవచ్చు. కాంగ్రెస్ జెండా మీద తప్ప మరెక్కడా కనిపించని రాట్నా న్నీ అడగవచ్చు. నెహ్రూ చెప్పింది ప్రగతిశీలతో, ప్రభుత్వరంగ సోషలిజమో ఏదైతేనేమి దాని గురించి మన్‌మోహన్‌సింగ్‌కు బాగా తెలుసు. ఎవరి స్వేచ్ఛను కత్తిరిస్తే ఎవరి స్వేచ్ఛకు రెక్కలు మొలుస్తాయో చిదంబరానికి తెలుసు. పటేల్ ఉక్కుమనిషి అవునో కాదో కానీ, ఆయన 350 సంస్థానాలను కలిపేసుకుంటే రెట్టింపు నయాసంస్థానాలు వెలిశాయి. గాంధీ తరం బిర్లాలు నిచ్చెనమెట్లలో ఎక్కడున్నారో కానీ, చిల్లర అంగళ్ల అంబానీలు అరివీరసంపన్నులయ్యారు. జాతిగర్వించిన జంషెడ్‌జీ టాటా వారసులు, కొత్తతరంతో పోటీపడు తూ బాడీషాపింగులూ వనరుల విధ్వంసాలూ చేయసాగారు. అభివృద్ధి అంటే ఏమిటో నందిగ్రామ్‌లో చూడవచ్చు. స్వేచ్ఛ అంటే ఏమిటో సోంపేట మృతుల ఇళ్లలో అనుభవానికి వచ్చి ఉండవచ్చు.

ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియనే కొనేశాడట. ప్రపంచీకరణా వ్యాపారస్వేచ్ఛా మజాకా? కాకపోతే, ఆలోపే ఇండియాను ప్రపంచమంతా కలిసి కొనేసింది. వాపీకూపతటాకాదులు నిధినిక్షేపాలతో సహా ఎవరెవరో పట్టా రాసేసుకున్నారు. తానులుతానులు బట్టతో త్రివర్ణపతాకం విస్తరిస్తోంది. దేశం మాత్రం రానురాను కుంచించుకుపోతోంది.

1 comment:

  1. intha manchi blog inni rojulu yelaa missayyaanu?

    ReplyDelete