Sunday, August 22, 2010

కోస్తా పొడవునా కొండచిలువ!

పదేళ్ల కిందటి మాట. మలివిడత తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే బలంగా వినిపిస్తున్నది. ఆ నేపథ్యంలో సమైక్యవాదాన్ని విశ్వసించే ఒక వామపక్షనాయకుడు ఒక ఆసక్తికరమైన వాదన వినిపించారు. 'కోస్తాంధ్ర అభివృద్ధి చెందిందం టే అందుకు భౌగోళికమైన కారణాలు కూడా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాలకు ఏ దేశంలో అయినా అభివృద్ధికి అధిక అవకాశాలుంటాయి.  చైనాలో కూడా కోస్తాప్రాంతాలన్నీ తక్కిన దేశం కంటె అభివృద్ధి చెందుతున్నాయి.' ప్రాంతీయ అసమానతలకు విధానపరమైన లోపాలు, ఆధిపత్యధోరణులు కారణమని భావించే వారికి ఆ నైసర్గిక, భౌగోళిక కారణాలు విచిత్రంగానే ధ్వనించాయి.

సముద్రతీరం మాత్రమే కాదు, కొన్నిచోట్ల జీవనదులు, మరికొన్ని చోట్ల పర్వతశ్రేణు లు, కొన్ని చోట్ల విశాలమైన మైదాన ప్రాంతాలు కూడా-ఆయా దేశాలకు సానుకూలతలుగా ఉంటాయి. జీవనం ఎంతో దుర్భరంగా ఉండే ఎడారి సీమలు కూడా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకు బంగారు గనులుగా పనికి వస్తాయి. పరిసర ప్రాకృతిక వ్యవస్థతో తన మనుగడను అనుసంధానించుకోగలిగితేనే మనిషి అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. సమాజాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఎట్లా సమష్టి ప్రయోజనాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకుంటారన్న ది, వాటి వాటి విచక్షణ, వివేకాల మీద ఆధారపడి ఉంటుంది.   దారిద్య్రం కానీ, సంపన్నత కానీ ఆ విచక్షణ, వివేకం మీదనే సంక్రమిస్తాయి. బంగారాన్ని తవ్వితీయడం తెలిసి, దాన్నొక సాధారణ అలంకార లోహంగా వినియోగించుకుంటున్న అమెరికా ఖండ మూలవాసులు యూరోపియన్ల దెబ్బకు దాదాపు అంతరించిపోయారు, అదే బంగారం అమెరికాను స్వర్ణమయం చేసింది. బంగారం, బొగ్గు, వజ్రాలు పుష్కలం గా ఉన్న ఆఫ్రికా ఖండం చీకటిలోనే మిగిలిపోయింది. వనరులు ఎక్కడ ఉన్నాయన్న ది కాక, ఎవరిచేతిలో ఉన్నాయన్నది చాలా ముఖ్యమైన అంశం.

శ్రీకృష్ణకమిటీ సభ్యుడు అబూ సలే షరీఫ్ గతవారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదిహేనేళ్ల కాలంలో కోస్తాంధ్రలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతుందని, ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అభివృ ద్ధి ఇకపై కోస్తాంధ్రకు తరలివస్తుందని ఆయన అన్నారు. గ్యాస్‌పైప్‌లైన్లు,
పోర్టులు, సువిశాల తీరప్రాంతం కోస్తాంధ్రను సుసంపన్నం చేయనున్నాయని ఆయన వివరించారు. షరీఫ్ వ్యాఖ్యలలో రాష్ట్రవిభజన గురించిన సూచన ఏదైనా ఉన్నదా అన్న కుతూహలాన్ని కాసేపు పక్కనబెడితే, కోస్తాలో కొత్తగా జరగబోయే అభివృద్ధి ఏమిటన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. సముద్రతీరం కొత్తగా వచ్చింది కాదు. సహజ వాయు నిక్షేపాలను కనిపెట్టి కూడా దశాబ్దాలు గడచిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఒరగబోయే అభివృద్ధి ఏమిటట? అదేదో ఇంతకాలం ఎందుకు జరగలేదట?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న క్రమంలో జరిగిన అనేక వాదవివాదాల్లో ఆంధ్రమేధావుల ఫోరమ్‌కు చెందిన చలసాని శ్రీనివాస్ కొన్ని కొత్త కోణాల ను ముందుకు తెచ్చారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతం కావడం వల్ల, కోస్తాంధ్ర వివక్షకు గురి అయిందని, రాష్ట్రస్థాయి వ్యవస్థలు కానీ, సంస్థలు కానీ తీరాంధ్రలో స్థాపితం కాలేదని, కనీసం చెప్పుకోదగిన ఒక ఆస్పత్రికి కూడా ఆ ప్రాంతం నోచుకోలేదని ఆయన అంటున్నారు. ఆయన చెబుతున్న దాంట్లో వాస్తవాలున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే, అక్కడ స్థానికంగా అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయన్న శ్రీనివాస్ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. కాకపోతే, అభివృద్ధిని స్థానికంగా కాక, హైదరాబాద్ చుట్టూ కేంద్రితం చేసింది కూడా ప్రభుత్వ విధానా లు, కోస్తాంధ్రకు చెందిన ప్రాబల్య వర్గాలు అన్న అంశానికి ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు.

అభివృద్ధి ఎక్కడ జరిగిందని కాక, ఎవరి ద్వారా ఎవరి కోసం జరిగిందన్న ప్రశ్నను ఆయన వాదన పట్టించుకోదు. అయితే, అబూ సలే షరీఫ్ జరగబోతోందని చెబుతున్న అభివృద్ధీ చలసాని శ్రీనివాస్ కోరుకుంటున్న అభివృద్ధీ ఒకటేనా అన్నది ప్రశ్న.   కోస్తా ప్రాంతానికి నైసర్గికమైన అనుకూలాంశాలున్నాయని, చైనాయే అందుకు ఉదాహరణ అనీ చెప్పిన వామపక్షనేత ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారో లేదో తెలియదు. చైనాతో సహా అనేక వర్ధమాన దేశాల్లో ప్రపంచీకరణ తీరప్రాంతాలలో 'సునామీ అభివృద్ధి'ని సృష్టిస్తోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలన్నిటినీ బలహీనపరచి, వనరులను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేయడమే పరమావధిగా గ్లోబల్ అభివృద్ధి జరుగుతున్నది.

ముడివనరులను, చవుక మానవశక్తిని ప్రపంచానికి అమ్ముకోవడమే తక్షణాభివృద్ధి మార్గమని చైనావంటి దేశా లు భావిస్తూ ఉండవచ్చు, అదే మార్గంలో మనదేశమూ సాగుతుండవచ్చు. కానీ, అభివృద్ధిరథచక్రాల కింద నలిగిపోతున్న నిర్వాసితులు దాన్ని అనుమతించడం లేదు.   తీరాంధ్ర పొడవునా 73 థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పి, లక్ష మెగావాట్ల దాకా విద్యుదుత్పత్తి చేయాలన్న సంకల్పం సోంపేట రైతులను ఏమీ భ్రమింపజేయలేకపోతున్నది. తొమ్మిది ఓడరేవులను, తీరం పొడవునా వందలాది ఫార్మా, రసాయ న కర్మాగారాలను నెలకొల్పాలన్న ప్రయత్నం 14 లక్షల మత్స్యకార కుటుంబాలను ఆనందపరచడం లేదు.  గొప్పగా చెప్పుకునే 900 కిలోమీటర్ల సముద్రతీరం- స్థానికులను నిరుద్యోగులను నిరాశ్రయులను చేసి, జలాలను కలుషితం చేసి, మనుగడలను ముంచివేయబోతున్నది. సముద్రానికీ, మానవ ఆవాసాలకీ నడుమ ఉన్న భూభాగమంతా కార్పొరేట్ కారిడార్‌గా మారబోతున్నది. షరీఫ్‌గారూ, మీరు ఆశపెడుతున్న అభివృద్ధి ఇదే నా? శ్రీనివాస్‌గారూ, మీరు ఈ ప్రక్రియను ఆమోదిస్తారా?

దురాశతో బంగారు బాతును కోసుకుతినే అభివృద్ధి మార్గం కోస్తాంధ్రకు కొత్తదేమీ కాదు. డాలర్ల కోసం రొయ్యల మడుగులు తయారుచేసి, ఇప్పుడు ఉప్పుకయ్యలుగా మారిన పంటపొలాలను చూసి దుఃఖపడుతున్న అనుభవం ఉండనే ఉన్నది. నీటిని టీఎంసీల కొద్దీ తాగే రక్కసిపంటలు, ఆయకట్టు చివర్లలో అగాధాల్లోకి వేసిన బోరుబావులు, అడుగుతవ్వితే మధురజలాలు ఉబికే నేలలో నిండిన ఫ్లోరైడ్ విషం, పారిశుద్ధ్యం కరవైన పట్టణాలు- ఇవీ తీరాం ధ్ర వైభవానికి సూచికలు.   వీటికి తోడు ఇప్పుడు అనకొండలాగా ఇచ్ఛాపురం నుంచి తడ దాకా స్వర్ణచతుర్భుజికి సమాంతరంగా పరచుకుంటున్న కారిడార్. దేశమంటే మట్టికానట్టే, ప్రాంతాలంటే కూడా మట్టికాదు. మనుషులే. ప్రాంతీయ అభివృద్ధి అంటే అక్కడి మనుషుల అభివృద్ధే. హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణను సంపన్నం చేయనట్టే, తీరాంధ్రకు సమకూరే వైభవం కూడా కోస్తాప్రజలకు సౌభాగ్యాన్ని ఇవ్వ దు. ముందే చెప్పినట్టు, ఏ నేలమీద ఏ పరిశ్రమలున్నాయన్నది కాదు, అవి ఎవరిచేతుల్లో ఎవరి కోసం ఉన్నాయన్నది ప్రశ్న. సమైక్యం సంగతి సరే, చాపకిందికి వస్తున్న నీరు తెలుస్తున్నదా?

వనరుల మీద నిర్ణయాధికారం స్థానికులకే ఉండాలన్న నినాదం తెలంగాణకే పరిమితమైనది కాదు. సార్వజనీనమైనది, సార్వత్రకమైనది. తెలంగాణ వనరులపై స్వయం నిర్ణయాధికారం కావాలన్నది ఎటువంటి ఆకాంక్షో, తీరాంధ్ర వనరులను స్థానికుల అభీష్ఠానుసారం మాత్రమే వినియోగించాలన్నది కూడా అటువంటి ఆకాం క్షే.  రాష్ట్ర విభజన జరిగినా జరుగకున్నా తీరాంధ్రలో రానున్న సంవత్సరాలలో విధ్వంస రథచక్రాలు పరుగు తీస్తూనే ఉంటాయి. లక్షలాది ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసే, దాదాపు కోటి మందిని జీవనాధారాల నుంచి, ఆవాసాల నుంచి నిర్వాసితులను చేసే దుర్మార్గాన్ని నిరోధించాలనే సంకల్పం తీరాంధ్రనేతలకు ఉన్నదా?

1 comment:

  1. neethulu cheppe nethalaku sankalpam vundho ,ledo kaani prajalaku vundani sompeta prajalu niruupinchaaru.

    ReplyDelete