Thursday, September 2, 2010

విమోచన వివాదం

సెప్టెంబర్‌17 మరొకసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఉధృతమైన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, ఈసారి వివాదం మరింత బలంగా ముందుకు వచ్చింది. అనుకూల ప్రతికూల వాదాలతో వాతావరణం వేడెక్కుతున్నది. 'తెలంగాణ విమోచన' దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడానికి ప్రభుత్వాల వద్ద  అప్రకటిత కారణాలేమి ఉన్నాయో అవి  ఇంకా యథాతథంగానే ఉన్నాయి. సెప్టెంబర్‌17 వ తేదీని  ఒక ఉత్సవదినంగా పరిగణించడానికి తెలంగాణలోని వివిధ వర్గాలకున్న అభ్యంతరాలు కూడా తొలగిపోలేదు. సీమాంధ్ర ప్రాంతం నుంచి కొత్తగా వినిపిస్తున్న వ్యతిరేకత కూడా ఈ పరిస్థితికి తోడవుతున్నది.

బ్రిటిష్‌ వలసపాలన భారతదేశంలో సృష్టించివెళ్లిన సమస్యలు అనేకం. అనేకానేక చారిత్రక కారణాల వల్ల బ్రిటిష్‌వారు భారతదేశంలోని అనేక భూభాగాలను ప్రత్యక్షంగా పాలించగలిగారు, అవే చారిత్రక కారణాల వల్ల కొన్ని ప్రాంతాలను స్వదేశీ సంస్థానాధీశుల సామంత పాలన కింద వదిలివేశారు. అటువంటి స్వదేశీసంస్థానాలలో ముఖ్యమైనది, పెద్దది హైదరాబాద్‌ సంస్థానం. అధికారికంగా హైదరాబాద్‌పాలకులు  సామంతులు కాకపోయినప్పటికీ, బ్రిటిష్‌వారి పరమాధికారాని (పారమౌంట్‌సీ)కి లోబడి వ్యవహరించారు. సొంతంగా సైన్యం, సొంతంగా విదేశాంగ విధానం లేని సంస్థానాధీశులు స్వతంత్రులని చెప్పడానికి లేదు, అదే విధంగా సొంత పోలీసు, న్యాయ యంత్రాంగాలు, సొంత కరెన్సీ కలిగినందున పూర్తి అధీనులనీ చెప్పలేము. హైదరాబాద్‌, కాశ్మీర్‌,మైసూర్‌, బరోడా వంటి సంస్థానాలలో ప్రజలు బ్రిటిష్‌వలసపాలనలోని మంచిచెడ్డలకు వెలిగానే ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాలు 1947 ఆగస్టు 15 తరువాత కూడా హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం పాలనలో ఉన్నాయి. భారతదేశానికి  స్వాతంత్య్రం 'ఇచ్చిన' బ్రిటిష్‌వారు, స్వదేశీసంస్థానాల భవితవ్యాన్ని త్రిశంకుస్వర్గంలో ఉంచారు. భారత్‌లో  కలవాలా, పాకిస్థాన్‌లో భాగం కావాలా, స్వతంత్రంగా ఉండాలా అన్నది సంస్థానాలే నిర్ణయించుకోవాలని చెప్పారు. సర్దార్‌ పటేల్‌ మంత్రాంగం వల్ల మూడువందలకు పైగా సంస్థానాలు భారతయూనియన్‌లో విలీనం కావడానికి అంగీకరించాయి కానీ, హైదరాబాద్‌,కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్థానాల విషయంలో సమస్య తలెత్తింది. ఏడవ నిజాం స్వతంత్రంగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. భారత-హైదరాబాద్‌ ప్రభుత్వాలు యథాతథ ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఫలితంగా 1947 ఆగస్టు 15 నాడు హైదరాబాద్‌ సంస్థానంపై పరమాధికారం బ్రిటిష్‌వలస పాలకుల నుంచి భారతయూనియన్‌కు సంక్రమించింది. బ్రిటిష్‌ రెసిడెంట్‌ స్థానంలో భారత ప్రతినిధి బాధ్యత తీసుకున్నాడు.  మువ్వన్నెల పతాకం అధికారికంగా హైదరాబాద్‌లో రెపరెపలాడలేదు. జాతీయవాదులు మాత్రమే నిర్బంధాల నడుమ భారతపతాకాన్ని ఎగురవేశారు.

స్వతంత్రదేశంగా ఉండడానికి ఏడవ నిజాం చేసిన ప్రయత్నాలు, భారతప్రభుత్వంతో సంప్రదింపులు,సవాళ్లు, హెచ్చరికలు, గడువులు- అన్నీ జరిగాక చివరకు 1948 సెప్టెంబర్‌13 నుంచి 17 వరకు 'పోలీసు చర్య' జరిగి, హైదరాబాద్‌ 'విమోచన'  పూర్తయింది. సైనిక చర్య ద్వారా సమస్యను పరిష్కరించాలని నాటి నెహ్రూ-పటేల్‌ ప్రభుత్వం భావించడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి.  ఒకటి- ముస్లిముల రాజ్యంగా హైదరాబాద్‌ను పరిగణించి, దాన్ని రక్షించుకోవాలనే నినాదంతో 'రజాకార్లు' పేరుతో సాయుధబృందాలు సంస్థానంలో బలీయమైన శక్తిగా ఎదగడం.  తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్యశక్తులతో మిలాఖత్‌ అయి, కమ్యూనిస్టుల మీద, పేదప్రజలమీద దాడులు అత్యాచారాలు చేయడం, బలవంతపు మతమార్పిడులకు పాల్పడడం రజాకార్లు చేశారు. సంస్థానంలోని మరాఠీ ప్రాంతాలు ఉస్మానాబాద్‌, బీడ్‌, పర్భనీ వంటి చోట్ల వారి కార్యాచరణ భిన్నంగా ఉండేది, ఎక్కువగా కార్తకర్తల సమీకరణలు చేసి, సంస్థాన సరిహద్దులను రక్షించే కార్యక్రమాలు చేపట్టారు. మరొక కారణం- కమ్యూనిస్టులు. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో పోరాటం ఉధృతంగా జరగుతూ ఉంది. దశాబ్దం ముందు నుంచే జనసమీకరణ, ఉద్యమసన్నాహాలు జరగుతూ, 1946 నుంచి సాయుధపోరాటం ఆరంభమైంది. కమ్యూనిస్టుల వ్యాప్తి నవస్వతంత్రభారతనేతలకు సహజంగానే రుచించలేదు. ఏమైతేనేం, మొండికేసిన నిజాంను, అతన్ని కీలుబొమ్మచేసి విజృంభిస్తున్న రజాకార్లను, పల్లెసీమల్లో పట్టుబిగిస్తున్న కమ్యూనిస్టులను ఒకే దెబ్బతో అణచివేయాలన్న సంకల్పంతో 'ఆపరేషన్‌ పోలో' జరిగింది.

భారతసైన్యాలు హైదరాబాద్‌ను స్వాధీనంచేసుకోవడాన్ని జనంపెద్ద సంఖ్యలో స్వాగతించారు. నిజాంనిరంకుశపాలననుంచి విముక్తి దొరికిందని సంతోషించారు. అయితే, ఆ పరిణామాన్ని అందరూ ఒకేరకంగా తీసుకోలేదు.   ఏడో నిజాం పరిపాలన చివరి సంవత్సరాలలో, ముఖ్యంగా రజాకార్ల అనధికార ప్రభుత్వం సాగుతున్న కాలంలో ముస్లిములందరూ పాలకులే అనే అర్థంలో 'అమన్‌ మాలిక్‌' నినాదం ప్రాచుర్యంలోకి వచ్చింది. సాధారణ, నిరుపేద ముస్లిమ్‌ కూడా హైదరాబాద్‌లో పాలకవర్గంలో భాగమేననే ప్రచారం ముస్లిములపై గణనీయమైన ప్రభావమే వేసింది. నిజాం పాలనను గట్టిగా వ్యతిరేకించి, ప్రజాస్వామిక పోరాటాలలో పాల్గొన్న ముస్లిములు కూడా తక్కువేమీ కాదు. కానీ, పోలీసుచర్య జరిగిన తీరు, చర్యలో భాగంగా జరిగిన నిర్బంధచర్యలు, అనంతర కాలంలో ముస్లిములకు పలుకుబడి, ఆదరణ,  ఉపాధి మార్గాలు కూడా తగ్గిపోవడం- వంటి కారణాల వల్ల పోలీసుచర్య హైదరాబాద్‌ సంస్థాన ముస్లిముల జీవితాలను తలకిందులు చేసిన పరిణామంగా ఆ వర్గం అనుభవపూర్వకంగా భావించింది. అదే విధంగా, పోలీసుచర్య అనంతరం భారతసైన్యం తెలంగాణ పల్లెల్లో కమ్యూనిస్టులపై సాగించిన అణచివేత కారణంగా- అక్కడ కూడా సార్వజనీనమైన సంతోషం వెల్లివిరియలేదు. కమ్యూనిస్టుల ఊచకోత కోసమే పోలీసుచర్య జరిగిందని సాయుధపోరాట ప్రాంతాలలో భావించారు. అందువల్ల వారి దృష్టిలో కూడా సెప్టెంబర్‌17కు పవిత్రత లేకపోయింది.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో ముస్లిమ్‌ రాజకీయ నాయకత్వం కలసినడవకపోవడానికి గతం కూడా కారణం. నిజాంపతనం ముందూవెనుకా కాలం నాటి చేదు జ్ఞాపకాలు ప్రత్యేక తెలంగాణరాష్ట్రంలో మైనారిటీలకు అభద్రతను కలిగిస్తాయని ముస్లిమ్‌ నేతలు భావిస్తున్నారు.  ఈ భయాందోళనలను తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్థం కావడంలేదు. సెప్టెంబర్‌17 విషయంలో కమ్యూనిస్టులు మెత్తపడినట్టు కనిపిస్తున్నా, ముస్లిములనుంచి ఆమోదం లభించడం కష్టం. ఆ ఆమోదం లేదు కనుకనే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 'విమోచన దినం' పై మౌనం పాటిస్తూ వచ్చాయి.

మరి తెలంగాణకు ఒక స్వాతంత్య్రదినం వంటి పర్వదినం అక్కరలేదా? తప్పనిసరిగా కావాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున తెలంగాణ ఇంకా రాచరిక నియంతృత్వంలోనే మగ్గుతున్నది. అయితే,  కొన్ని వర్గాలకు ఏమంత సంతోషదాయకం కాని రోజును కాకుండా, మరో రోజును ఎంచుకోలేమా?- అన్నది ముఖ్యమైన ప్రశ్న.  ఏ జ్ఞాపకమైనా, ఏ పర్వదినమైనా ప్రజలను కలిపేటట్టు ఉండాలి తప్ప, విభజన తీసుకువచ్చేట్టు ఉండకూడదు. అలాగే, చరిత్రలోని వివాదాలను వర్తమానంలో పరిష్కరించుకుని, విశ్వాసం కలిగిస్తే, ఏ రోజును పండగ చేసుకోవడానికైనా అందరూ ముందుకు వస్తారు. విచక్షణ, వివేకం చూపవసింది నాయకులు.

3 comments:

  1. telangana ane peru lone kashtaalu vunnayemo?

    ReplyDelete
  2. కె. శ్రీనివాస్ గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete