Monday, September 27, 2010

బహుముఖమవుతున్న విభజన

సెప్టెంబర్24 నాడు ఏదో ఉపద్రవం రాబోతున్నదన్న భయం దేశమంతా వ్యాపించింది. అంతటి ముందు జాగ్రత్త బహుశా అవసరమే కావచ్చు. క్షణికావేశాలను, అవధుల్లేని ఆవేశ ఉద్వేగాలను అటువంటి వాతావరణం నెమ్మదింపజేసే అవకాశం ఉండవచ్చు. కానీ, భిన్న విశ్వాసాలున్న జనవర్గాలు తమ వివాదాలను స్వయంగా తామే న్యాయస్థానానికి అప్పజెప్పినా- సమాజంలో సంప్రదింపులు, సంభాషణ, నచ్చచెప్పుకోవడం కోర్టు బయట కూడా కొనసాగుతున్నప్పుడే న్యాయ నిర్ణయాన్ని అంగీకరించే సంసిద్ధత ఉభయ పక్షాలకూ సమకూరుతుంది.  లేకపోతే, బొమ్మాబొరుసా వంటి నిర్ణయమేదో న్యాయస్థానం నుంచి వస్తుందని, అది ఏదో ఒక పక్షాన్ని తీవ్రంగా ఆశాభంగానికి గురిచేస్తుందని భయపడక తప్పదు. పోయిన శుక్రవారం ఆ 'గండం' తప్పిపోయింది. ఇప్పట్లో మళ్లీ ఆ పరిస్థితి రాదని, ఏదో చేసి వివాదాన్ని తీర్పుతో సహా వాయిదాల అటక ఎక్కిస్తారని అనుకుంటున్నారు కానీ, 28 నాడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందో నిరీక్షించవలసే ఉన్నది.

అయోధ్య వివాదంతో పోల్చకూడదు కానీ, ఈ ముందు జాగ్రత్తల హడావుడి చూసినప్పుడు, రాష్ట్ర విభజన సమస్య కూడా చాలా మందికి స్ఫురించింది. శ్రీకృష్ణకమిటీ తన నివేదికను సమర్పించినప్పుడో, ఆ నివేదికపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించేరోజు వచ్చినప్పుడో కూడా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితే నెలకొంటుందా? ఆ నిర్ణయాన్ని నిబ్బరంగా స్వీకరించడానికి ఉభయ ప్రాంతాల ప్రజలు సంసిద్ధంగా ఉన్నారా? లాటరీ ఫలితం కోసం చూసినట్టుగా ప్రజలు ఎదురుచూస్తున్నారా? లేదా- నిర్ణయానికి తమను తాము సంసిద్ధం చేసుకుంటున్నారా?- ఈ ప్రశ్నలు సహజమైనవే కానీ, సమాధానం లేనివేమీ కావు. అయోధ్య వివాదానికీ, రాష్ట్ర విభజన సమస్యకూ తుదినిర్ణయం విషయంలో కూడా పోలిక లేదు. అయోధ్య విషయంలో సామాజిక సామరస్య ప్రక్రియలు,
పౌరజోక్యం, రాజకీయ పరిష్కారం- అన్నీ వెనుకపట్టు పట్టి, కేవలం న్యాయస్థానంలో వివాదం మిగిలి ఉన్నది. న్యాయస్థానం తీర్పును ఉభయపక్షాలూ గౌరవిస్తాయన్న నమ్మకం లేదు, ఎవరి వైఖరులు వారు కొనసాగిస్తూనే ఉన్నారు.

రాష్ట్రవిభజన విషయం లో- సమస్య ఒక కమిటీ చేతిలో ఉన్నది. అది న్యాయస్థానం వలె ఒకే చోట కూర్చుని సాంకేతికమైన పరిశీలన చేయడం లేదు. సంబంధిత పక్షాలతో సంప్రదింపులు జరుపు తూ, వివిధ వాదనలు వింటూ, ప్రత్యక్షంగా సమాచారాన్ని అభిప్రాయాలను సేకరిస్తూ పారదర్శకంగా పనిచేస్తున్నది. సంబంధిత పక్షాలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, పరిష్కారాన్ని కమిటీకి వదిలివేయకుండా, తన ప్రత్యేక మార్గంలో కొనసాగుతున్నది.

ప్రజలను ప్రభావితంచేసే పరిణామాలు రాష్ట్రసమాజంలో కొనసాగుతూ ఉన్నాయి. చర్చలు వాదోపవాదాలు ఘర్షణలు- ఏ స్థాయిలో జరిగినా ఎట్లా జరిగినా- రాష్ట్ర విభజన గురించిన చర్చ సజీవంగా ఉన్నది, ఆ చర్చ పరోక్షంగా ప్రజలను భావి పరిణామాలకు సంసిద్ధం చేస్తున్నది. అంటే, కమిటీ కోసం అంతా నిశ్శబ్దమై పోలేదు. కమిటీకి వాస్తవాలను, వాదనలను వినిపించే ప్రక్రియ సమాజంలో కూడా చురుకుగా సాగుతున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, న్యాయవాదుల సమ్మె- రాష్ట్రంలో వాతావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేశాయి. స్థానికత గురించి కెసిఆర్ చేసిన ప్రకటన వివాదాస్పదమై చర్చకు, దూషణభూషణలకు దారితీసింది. హైదరాబాద్‌లో, తెలంగాణలో స్థానికేతరులు లేదా దీర్ఘకాలికంగా స్థిరపడిన ఇతరుల ప్రతిపత్తి గురించిన చర్చ జరగ డం అంటే, రాష్ట్రవిభజన అవకాశాలను అందరూ ఒక మేరకు గుర్తించినట్టే.

తెలంగాణ లో పుట్టినవారంతా స్థానికులే అని కెసిఆర్ చేసిన ప్రకటన- ఆ సందర్భంలో అపార్థాలకు ఆస్కారం ఇచ్చింది కానీ, దాన్ని ఆయనే చెప్పినట్టు స్థూలవిధానంగా స్వీకరిస్తే ఆక్షేపించవలసింది ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమం గతంలో అనేక మార్లు అటువంటి స్థూల విధానాన్ని ప్రకటిస్తూనే వచ్చింది. అయితే, దాని వల్ల నిర్దిష్ట సందర్భాల లో వచ్చే సమస్యలుండవచ్చు. ఆ స్థూల విధానాన్ని వివరణలతో, మినహాయింపులతో సవరించవలసిన అవసరం ఉండవచ్చు. కానీ, ఆ ప్రకట న ద్వారా తెలంగాణలో స్థిరపడిన ప్రజానీకానికి అభయం ఇచ్చినట్టయింది. తెలంగాణలో స్థిరపడిన వారిని కానీ, హైదరాబాద్‌తో ఆర్థిక ప్రయోజనాలున్న వాణిజ్య వేత్తలను కానీ అనుకూలంగా మలచుకోవలసిన అవసరం కూడా తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి ఉన్నది. స్థానికతకు కెసిఆర్ ఇచ్చినది తుది నిర్వచనం కాదని, సంబంధిత పక్షాలన్నిటితో సంప్రదింపుల ద్వారా మాత్రమే ఖచ్చితమైన నిర్వచనం రూపొందుతుందని కెసిఆర్ విమర్శకులకు కూడా తెలియకపోలేదు.

మానసికంగా ఎప్పుడో విభజన జరిగిపోయిందనీ, జరగవలసిందిక అధికారికమైన తెగదెంపులు మాత్రమేనని తెలంగాణ ఉద్యమకారులు అంటుంటారు. మానసిక విభజన ను కొలిచే సాధనాలు లేవు కానీ, గత డిసెంబర్-జనవరి మాసాలలో ఉధృతంగా జరిగిన ఉద్యమాల తరువాత ఉమ్మడివేదికలు చీలిపోవడం స్పష్టంగా కనిపించసాగింది. గత కొన్ని వారాలుగా అయితే, లాయర్లు, డాక్టర్లు, నిరుద్యోగులు, తాజాగా ఎన్జీవోలు ప్రాంతాల వారీగా చీలిపోయారు. తమ తమ ప్రత్యేక డిమాండ్లను ముందుకు తేవడం మొదలుపెట్టారు. గుంటూరులో హైకోర్టు బెంచి కోసం చాలా కాలానికి మళ్లీ మొదలైన ఉద్యమం- రాష్ట్రవిభజన ఉద్యమం నేపథ్యంలో తమ స్థానిక భవిష్యత్ ప్రయోజనాల ను పదిల పరచుకునే ప్రయత్నమే. రానున్న రోజులలో విభజనానంతర ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నాలు ఇంకా అనేక వర్గాల నుంచి, శ్రేణుల నుంచి ప్రస్ఫుటమవుతాయి.

విభజన సమస్య తెలంగాణలో ప్రయోజనాలున్న ప్రాంతేతరులదిగా, లేదంటే హైదరాబాద్ ప్రతిపత్తి మీద పట్టింపు ఉన్నవారి సమస్యగా ఇంతకాలం కనిపిస్తూ వచ్చింది. నిజానికి విభజన కేవలం భౌగోళికమయినది మాత్రమే కాదు. ఇందులో సామాజికమయిన కోణం ముఖ్యమైనది, కీలకమయినది. అది ప్రస్తుత సందర్భంలో మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజులలో సమసిపోయినట్టు కనిపించిన అంతర్గత విభేదాలు తిరిగి తెలంగాణ ఉద్యమంలో నేడు తలెత్తుతున్నాయి. దళిత, బిసి శ్రేణుల నుంచి ఉద్యమ నాయకత్వం తీవ్రమయిన విమర్శను ఎదుర్కొంటున్నది. సమైక్యాంధ్రవాదుల గొంతు బలంగా వినిపించినప్పుడు అణగారిపోయిన ప్రత్యేకాంధ్ర, సామాజికాంధ్ర నినాదాలు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సీమాంధ్ర ప్రాంత నాయకత్వం అక్కడి దళిత, బహుజన శ్రేణుల నుంచి గట్టిసవాళ్లను ఎదుర్కొంటున్నది. కొన్ని దళిత సంఘాలు, సంస్థలు బాహాటంగా నే తెలంగాణవాదానికి మద్దతు ఇస్తున్నాయి. హైకోర్టు లాయర్ల సమ్మెతో రాష్ట్ర స్థాయి దళిత లాయర్ల సంఘం భుజంకలిపి నడవడం చూశాము. ఇది ఒక చిత్రమైన సన్నివే శం. తెలంగాణలో స్థానిక పాలకవర్గాలు పూర్తిస్థాయి నాయకత్వానికి ఎదగే అవకాశాలను ప్రత్యేక రాష్ట్రంలో గుర్తిస్తుండగా, సీమాంధ్రప్రాంతాలలో సాంప్రదాయ పాలకవర్గాల ప్రాబల్యం తగ్గి, తమ గుర్తింపు పలుకుబడి పెరిగే అవకాశాలను అక్కడి దళిత, బలహీనవర్గాలు దర్శిస్తున్నాయి. హైదరాబాద్‌లోనో, తెలంగాణాలోనో ప్రయోజనాలున్న వర్గాల వారే సమైక్యాంధ్ర గురించి మాట్లాడుతున్నారని, సీమాంధ్ర నేలతో మాత్రమే మనుగడను, భవితవ్యాన్ని ముడివేసుకున్న స్థానిక వర్గాల ఆకాంక్షలు భిన్నంగా ఉన్నాయని కొందరు బలంగానే వాదిస్తున్నారు. హైదరాబాద్‌తో సహా దేన్ని వదులుకుని అయినా సరే పోలవరానికి అవరోధాలు లేకుండా చేస్తే చాలునని మాట్లాడుతున్నవారు కోస్తాంధ్రలో, సాగునీటిని వాగ్దానం చేస్తే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా నష్టం లేదని చెబుతున్నవారు రాయలసీమలో కనిపిస్తున్నారు. ఇన్ని రకాల వాదనల అర్థం ఒకటే- రాష్ట్ర విభజనకు సంబంధించిన పర్యవసానాలు ప్రాంతాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, వృత్తిరంగాల వారీగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరకంగా ఉన్నాయి. ఈ అన్ని రకాల శక్తుల మధ్య సంప్రదింపులు, చర్చలు బహిరంగంగానో, ద్వైపాక్షికంగానో, బహుముఖంగానో జరగవలసిన అగత్యం ఉన్నది.

రాష్ట్ర విభజనకు సంబంధించి విస్తృతాభిప్రాయాన్ని కూడగట్టడం కత్తిమీద సామువంటిది. అది కేవలం ప్రకటనల ద్వారా భీషణ ప్రతిజ్ఞలూ వీరాలాపాలూ చేసే నేతల వల్ల మాత్రమే జరిగేది కాదు. ఉద్యమాల తీరుతెన్నులు మాత్రమే పరిస్థితిని జటిలంగా నో సరళంగానో మార్చగలవు. ఉభయప్రాంతాల మధ్య సహజీవనం విభజననిర్ణయం తో నిమిత్తం లేకుండా చిరకాలం జరగవలసినది కాబట్టి- పరస్పరత, సౌహార్దం పరిష్కార సాధనలో అంతర్లీన విలువలుగా ఉండాలి. ఉభయప్రాంతాల మధ్య ప్రజలమధ్య ఉద్యమ సంబంధం పరిష్కారాన్ని శాంతియుతమూ పరస్పర ప్రయోజనకర మూ చేయగలదు.

No comments:

Post a Comment