Monday, October 4, 2010

సంయమనం, సెన్సార్‌షిప్

తీర్పులు చెప్పిన తరువాత సంచలనాలు, ఉద్రిక్తతలు రావడం మునుపు అనుభవమే కాని, ముందస్తుగా తేదీలు ప్రకటించిన తీర్పు చుట్టూ ఇంత ఉత్కంఠ, ఇన్ని భయాందోళనలు కమ్ముకోవడం మాత్రం అయోధ్య వ్యాజ్యం విషయంలోనే జరిగింది. అలహాబాద్ లక్నో బెంచి తీర్పు తేదీని ప్రకటించిన వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశం దేశప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా 'సున్నితమైన ప్రాంతాలు' అని భావించిన చోట భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు, అదనపు బలగాలను మోహరించారు, మీడియాకు ముందు జాగ్రత్తలు చెప్పారు. మతపెద్దలు, శాంతి కార్యకర్తలు హితబోధలు చేశారు. తీర్పు తేదీ సెప్టెంబర్24 నుంచి వాయిదాపడి చివరకు 30వ తారీఖుకు ఖరారు అయింది. తీర్పు వచ్చింది. ఏ హింసా సంఘటనలు లేకుండానే ఉద్రిక్తత చల్లారిపోయింది.

ఇంతకీ అంతటి భయం ఎందుకు వ్యాపించింది? సుమారు పాతిక సంవత్సరాలు గా భారతీయ సమాజంలో అశాంతికి, అనేక అప్రియ సంఘటనలకు కారణమైన ఒక సున్నితమైన వివాదానికి సంబంధించి వెలువడే తీర్పు-సహజంగా ఏ తీర్పు అయినా కక్షిదారులలో ఒకరికి అనుకూలంగా, మరొకరికి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి- తీవ్రమైన ప్రతిస్పందనలకు కారణమవుతుందని ప్రభుత్వాధినేతలు, అధికార యంత్రాంగం, రాజకీయ వాదులు ఆందోళన చెందారు. రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యతా రహితంగా వ్యవహరించే నేతలకు మన దేశంలో
కొదవ లేదు కనుక, అటువంటి ఆందోళన అతి సహజమూ, వాంఛనీయమూ కూడా. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల కావచ్చు, ప్రజలు చూపిన సంయమనం వల్ల కావచ్చు, నిర్లిప్త త, నిర్వేదం వల్లనూ కావచ్చు- ఎటువంటి దురదృష్టకరమైన పరిణామాలూ సంభవించలేదు.

కొత్త సమస్యలు ఉత్పన్నం కాలేదు సరే, పాత సమస్య పరిష్కారం అయిందా? నిశ్శబ్దం లేదా మౌనం ఉంటే తీర్పునకు సర్వామోదం లభించినట్టేనా? ప్రజలలో ఆవేశకావేశాలు ఉద్వేగాలు రగల్చకుండా పాటించవలసిన సంయమన బాధ్యతలో భాగంగా- జాతీయ, ప్రాంతీయ మీడియా అంతా తీర్పు వార్తను, విశ్లేషణను కూడా ఆరోజున 'సానుకూల దృష్టితో' అందించవలసి వచ్చింది. ఎనిమిదివేల పేజీల తీర్పును మొత్తంగా అర్థం చేసుకుని, తోచిన అన్వయాలతో హడావుడిగా వ్యాఖ్యానించడం సబబు కాదు కానీ, ప్రస్ఫుటంగా కనిపిస్తున్న అంశాలను కూడా స్పష్టంగా చెప్పడానికి మీడియా సంకోచించింది.

తీర్పులో ఉన్న సంక్లిష్టత, దాన్ని సర్వామోదకరమైనదిగా చిత్రించడానికి -సదుద్దేశంతోనే అయినప్పటికీ- సమాచార సాధనాలు పడిన తాపత్రయం, దేశవ్యాప్తంగా నెలకొన్న కర్ఫ్యూ వాతావరణం కలిసి ప్రజా స్పందనను కూడా నియంత్రించాయి. సంయమనం ఆచరణలో సెన్సార్‌షిప్‌గా కూడా పనిచేసిందనుకోవాలి. తీర్పు వల్ల లబ్ధి చెందామని భావించినవారు సైతం బాహాటంగా సంబరపడలేదు. నష్టపోయామని అనుకున్నవారు సైతం నిరసనలను తీవ్రంగా ప్రకటించలేదు. ఓట్ల లెక్కలతో మాట్లాడే రాజకీయ పక్షాలు కూడా వ్యవధి కావాలని కోరుతున్నాయి. మరి, ఉద్రిక్తత ఉపశమించిన తరువాత కూడా- స్పందనలు ఇట్లా నియంత్రితంగానే ఉంటాయా?

ఉండవు. తీర్పు మీద విమర్శలు ఉద్యమ ప్రతినిధుల నుంచి సన్నగా వినిపించడం సరే, సెక్యులర్ భావాలు కలిగిన మేధావుల నుంచి పెద్దగానే వ్యక్తమవుతున్నాయి. ఇది న్యాయసంబంధమైన తీర్పు కాదని, రాజకీయ తీర్పు అని చరిత్రకారిణి రొమిల్లా థాపర్ వ్యాఖ్యానించారు. తలా ఇంత భూమి పంచడం అనే పని ప్రభుత్వమే ఎప్పుడో చేయగలిగిన పని అని, దాని కోసం ఇంత విచారణ ఎందుకని ఆమె ప్రశ్నిస్తున్నారు. చరిత్ర స్థానంలో విశ్వాసాలను పరిగణనలోనికి తీసుకోవడం కొత్త న్యాయ సంప్రదాయం అవుతుందన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. సివిల్ వ్యాజ్యాన్ని విచారిస్తున్న న్యాయస్థానం బాబ్రీమసీదు కూల్చివేతను పరిగణనలోకి తీసుకోలేదని, అదే సమయంలో రామాలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని మాత్రం నిర్ధారించిందని థాపర్ సమాజం దృష్టికి తెస్తున్నారు.

సుప్రసిద్ధ ఆంగ్ల పాత్రికేయుడు దిలీప్ పడ్‌గోవ్‌కర్ కూడా విశ్వాసాలు, నమ్మకాల మీద ఆధారపడిన తీర్పును తప్పుపడుతున్నారు. భూ యాజమాన్య హక్కు గురించి విచారించిన కోర్టు ఆ విషయం మీదనే దృష్టి కేంద్రీకరించాలి కానీ, న్యాయపరిధిలోకి రాని అంశాలను ఎట్లా పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన ఆశ్చర్యపడుతున్నారు. ఈ విమర్శలు ఇంకా పదునుదేలి, న్యాయపరిగణనల మీదనే పెద్ద చర్చగా మారే అవకాశం కనిపిస్తున్నది. వివాదంలో ఆసక్తి ఉన్న ఇరుపక్షాల వారూ వేస్తున్న కొన్ని సాధారణమైన ప్రశ్నలు కోర్టుతీర్పు విజ్ఞతకు గురిపెడుతున్నాయి. భూమి మీద హక్కు కోరిన వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడీ సూట్ల ను కాలదోషం పట్టినవిగా కొట్టివేసిన కోర్టు, తిరిగి వారికి మూడోవంతు చొప్పున భూమి కేటాయించడంలో సబబేమిటన్నది అటువంటి ఒక ప్రశ్న.

వ్యాజ్యాలు నడిపిన కక్షిదారుల్లో ఉభయపక్షాల వారూ సుప్రీంకోర్టుకు వెడుతున్నా రు కాబట్టి, వివాదం తిరిగి మొదటికి వచ్చినట్టే. మరి లక్నో బెంచి తీర్పు సా«ధించిందేమిటి? ఈ తీర్పు వివాదంలో కొన్ని కొత్త హక్కులను రంగం మీదకు తెచ్చింది. రామజన్మభూమికి న్యాయపరంగా గుర్తింపునిచ్చింది. సమాచారసాధనాలు తగ్గించి చూపాయికానీ, ఈ అంశం నిజానికి రామజన్మభూమి ఉద్యమకారులకు పెద్ద విజయమే. ఎందుకంటే, కోర్టుల నుంచి అటువంటి నిర్ధారణను ఆ ఉద్యమకారులే ఆశించినట్టు కనిపించదు. విశ్వాసాలకు సంబంధించిన అంశాలను న్యాయస్థానాలు నిర్ధారించలేవన్నది వారి వాదన. అదే సమయంలో రామజన్మభూమి నిర్ధారణ మసీదు పునరుద్ధరణవాదులకు అపజయమే. (ఈ తీర్పులోని అంశాలను జయాపజయాలుగా చూడవద్దని అనేకులు కోరారు కానీ, అది ఉద్వేగాలను ఆ రూపంలో వ్యక్తం చేయవద్దని అభ్యర్థించడానికే తప్ప- వ్యాజ్యంలో గెలుపోటములు ఉండవనికాదు.) పాత స్థలంలో యథాతథంగా మసీదు పునరుద్ధరణ అవకాశాలు ఈనిర్ణయంతో వెనక్కిపోయినట్టే. అలాగని, వారిని పూర్తిగా వివాదం నుంచి బయటకు పంపలేదు. ముస్లిములకు కూడా అక్కడి భూమిమీద ఎంతో కొంత హక్కు నిలిపింది.

అంటే ఉభయపక్షాలనూ సంతృప్తిపరిచే ఉద్దేశ్యంతో కాబోలు, పంపకం వంటి పరిష్కారాన్ని ఇవ్వడంతో పాటు, సమస్యను యథాతథంగా కొనసాగించే వీలుకూడా కల్పించింది. స్థల యాజమాన్య హక్కు గురించి చట్టపరమైన నిర్ధారణ చేయడానికి బదులు ఈ అదనపు బాధ్యతను న్యాయస్థానం ఎందుకు తీసుకున్నట్టు? అన్నది ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న. ఏకాభిప్రాయం కుదరని సమస్యల విషయంలో న్యాయస్థానాలకు ఇటువంటి పాత్ర నివ్వ డం మంచిదేనా? అయోధ్య సమస్య వదిలేద్దాం, రేపు ఎదురయ్యే కొత్త సమస్యలకో, పాత సమస్యలకో లక్నో బెంచి తీర్పు ఒక సంప్రదాయంగా మారదా? భారతీయ న్యాయవ్యవస్థ పై ఈ తీర్పు ఎటువంటి అభిప్రాయాన్ని బయటి లోకానికి కలిగిస్తుంది? కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు, మెజారిటీవాద «ధోరణిలోకి న్యాయస్థానాలు కూడా వెళ్లిపోతున్నాయా? అది న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రభావితం చేయదా? సెప్టెంబర్ 30 నాడు వ్యాపించిన భయప్రశాంత వాతావరణం పూర్తిగా ఉపశమించిన తరువాత అయినా, తీర్పు మంచిచెడ్డలను చర్చించగలిగే నిబ్బరం మన సమాజానికి అలవడుగాక!

1 comment: