Wednesday, October 6, 2010

గద్దర్ ఫ్రంట్

ప్రజాగాయకుడు గద్దర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ప్రజాఫ్రంట్ తెలంగాణ రాజకీయాల లో కలకలం సృష్టిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తిరుగులేని నాయకత్వశక్తిగా కనిపిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ఎస్)కి అకస్మాత్తుగా గట్టి పోటీదారు రంగప్రవేశం చేయడంతో, ఆ పార్టీ మీద అసంతృప్తి ఉన్న శ్రేణులు, శక్తులు అన్నీ పునఃసమీకరణ ప్రయత్నాలలో పడ్డాయి. కార్యవాదులైన విద్యార్థి ఉద్యమకారుల కమిటీలు, దళిత, బహుజ న, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యమసంఘాలు, క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేస్తూ నాయకత్వ సరళిపై ఆగ్రహంతో ఉన్న స్థానిక జేఏసీలు- గద్దర్ ఫ్రంట్‌కు తమ మద్దతు తెలియజేస్తున్నాయి. టిఆర్ఎస్ రాజకీయ వ్యూహంతో బెంబేలెత్తినట్టు కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు, తెలంగాణ ఉద్యమంలో అనుయాయి పార్టీగా మారిపోయి న బిజెపి నాయకులు కూడా ప్రజాఫ్రంట్ ప్రయత్నాన్ని స్వాగతించారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు కోసం ఉద్యమనిర్మాణం, డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ భారీ జనసమీకరణ- ఇవి రెండు మాత్రమే ఇప్పటివరకు ఫ్రంట్ కార్యక్రమం గురించి తెలిసిన అంశాలు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో జరిగే విస్తృత సమావేశం అనంతరం ఫ్రంట్ విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళిక వెల్లడవుతాయని భావిస్తున్నారు. ఆ తరువాతే, వివిధ రాజకీయ పక్షాలు ఫ్రంట్ గురించిన తమ అధికారిక వైఖరులను వెల్లడించే అవకాశం ఉంది.

మలి విడిత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టిఆర్ఎస్ ఆవిర్భావానికి ఆరేడేళ్లకు ముందే ఆరంభమయింది. 1996లో భువనగిరిలో జరిగిన 'తెలంగాణ జనసభ' ఉద్యమారంభ దశ లో మైలురాయి. తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొన్న నేతలు, వివిధ ప్రజాసంఘాలు, కళాకారులు పాల్గొన్న ఆ సభలో గద్దర్ ప్రధానాకర్షణ. అనంతరం, వరంగల్‌లో జరిగిన మరొక భారీ జనసమీకరణ తెలంగాణ ఉద్యమానికి రెండవ మైలురాయి. కళా, సాహిత్య,
సాంస్కృతిక, మేధావి, యువజన శ్రేణులు స్థానికంగానూ, తెలంగాణ స్థాయిలోనూ చేస్తూ వచ్చిన వివిధ ప్రయత్నాలు ఒక బలమైన శక్తిగా రూపొందుతున్న క్రమంలో 2001లో టిఆర్ఎస్ పార్టీ అవతరించింది. కెసిఆర్ కంటె ముందు నుంచి తెలంగాణ ఉద్యమ పతాకా న్ని పట్టుకున్న గద్దర్‌కు వివిధ ప్రజాశ్రేణులనుంచి ఆమోదమూ, ఆహ్వానమూ ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. కేవలం తెలంగాణలోనే కాక, యావత్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాకళాకారుడి గా విఖ్యాతుడైన గద్దర్, రాష్ట్రభవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఉద్యమంలో నాయకుడిగా ఉండడం- అన్ని ప్రాంతాల ప్రజలలోనూ నమ్మకాన్ని, నిబ్బరాన్ని కలిగించే అంశం. అయితే, ఉద్యమ నాయకత్వం అనేది కేవలం సీనియారిటీ వల్లకానీ, ప్రఖ్యాతి వల్ల కానీ సమకూరే అంశం కాదు. అందుకు అనేక ఇతర అంశాలు దోహదం చేయవలసి ఉంటుంది.

తెలంగాణ ప్రాంతానికి దాని చరిత్ర ఎంత గర్వకారణమో, అంత శాపం కూడా. నైజాం కాలంలో ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం గురించి ప్రపంచమంతటికీ తెలుసు. ఆ పోరాటం విజయవంతమయిందో, అర్థాంతరంగా సమసిపోయిందో కానీ ఫ్యూడలిజం మిగిలే ఉండింది. 1970ల తరువాత మరో విడత భూస్వామ్య వ్యతిరేక పోరాటం రగిలి అనేక సామాజిక, ఆర్థి క మార్పులు సాధించినా ఇప్పటికీ-ఆవ్యవస్థ అవశేషాలు అంతరించాయని చెప్పలేము.

తెలంగాణలో సామాజిక సమస్య అత్యంత వాస్తవమైనది, వాయిదా వేయడానికి వీలు లేనిది. రెండు మూడుదశాబ్దాల పాటు మావోయిస్టుల పోరాటం ఫలితంగా బలహీనపడిన కొందరు భూస్వాములు, తెలంగాణవాదం పేరుతో తిరిగి ప్రాబల్యం పొందగలిగారన్నది నిజమే. తెలంగాణ ఉద్యమంలోని అభివృద్ధి అంశాలు, రాజకీయ అంశాలు, భావోద్వేగాలు తీవ్రమైనవి కాబట్టి, ఈ సామాజిక కోణాన్ని ఉద్యమకారులు, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. గత డిసెంబర్ 9 కంటె ముందు, ఆతరువాత జరిగిన పరిణామాలలో తెలంగాణ ఉద్యమంలో తిరుగులేని ఐక్యత కనిపించింది. రాజకీయంగా ఎదురుదెబ్బలు తిని కృశించిపోయిన టిఆర్ఎస్ మహాబలశాలిగా అవతరించింది. ఆ తరువాత ఆ పార్టీ వ్యవహారసరళి తిరిగి కొన్ని వర్గాలను నొప్పించడం మొదలయింది. శ్రీకృష్ణకమిటీ నివేదిక సమర్పణ సమీపిస్తున్న దశలో, రాజకీయ సమీకరణాలు వేగం పుంజుకుంటున్న సమయంలో - ఇప్పుడీ గద్దర్ ఫ్రంట్ అవతరణ జరిగింది.

తెలంగాణలో వివిధ సామాజిక శక్తుల ఉద్యమం బలంగా ఉన్నది. అయితే, ఆ శక్తులు ఏకతాటి మీద నిలబడి ముందుకు సాగుతాయా లేదా అన్నది ముఖ్యమైన ప్రశ్న. స్థైర్యం,రాజకీయ విజ్ఞత, దూరదృష్టి కలిగిన రాజకీయ కార్యక్రమం ఇవ్వగలిగిన నాయకత్వం లేకపోతే ఐక్యత నామమాత్రమే కాగలదు. సామాజిక శక్తులను కూడదీసుకుని ప్రత్యామ్నాయం గా నిలబడాలని ప్రయత్నించిన దేవేందర్‌గౌడ్‌కు ఎటువంటి ఫలితం ఎదురయిందో తెలిసిందే. బడుగు బలహీన వర్గాల నాయకత్వం తగినంత శక్తి పుంజుకోకపోతే, ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో అందుబాటులో ఉన్న గట్టి నాయకత్వాన్నే ప్రజలు వరిస్తారని అనుభవం చెబుతోం ది. ఈ నేపథ్యంలో గద్దర్ ప్రయత్నం సఫలం కావాలంటే, వారి రాజకీయ కార్యక్రమం స్పష్టంగా ఉండాలి. ఉద్యమాలతో నిమిత్తం లేకుండా ఎన్నికల ప్రక్రియమీదే టిఆర్ఎస్ ఎక్కువ ఆధారపడింది. అది ఒక తీవ్రవైఖరి అయితే, ఎన్నికల ప్రక్రియతో పనిలేకుండా ఉద్యమాల మీదనే ఆధారపడతామని చెప్పడం మరో తీవ్రవైఖరి. ఎన్నికల వ్యవస్థ మీద విప్లవకారులకు విసుగూ విముఖతా ఉన్నాయి కానీ, దళిత, బహుజన శ్రేణులు ప్రజాస్వామ్యంలోనే తమ భాగస్వామ్యం కోరుతున్నాయని మరచిపోకూడదు. మన వ్యవస్థలో నాయకత్వం ఉద్యమాల ద్వారా కూడా అవతరిస్తుంది కానీ, ఆ నాయకత్వం స్థిరపడాలంటే మాత్రం వేదికలు ఎన్నికల రాజకీయాలే! గద్దర్‌ఫ్రంట్ ఉద్యమాలు మాత్రమే చేస్తే, వాటి ఎన్నికల ప్రయోజనాలు మరో పార్టీ ఖాతాలోకి పోతాయి. అందువల్ల, ఏ సామాజిక న్యాయం కోసం గద్దర్‌ఫ్రంట్ తాపత్రయపడుతోందో, అది ఆచరణలో మృగ్యం అవుతుంది. 

ప్రత్యేక రాష్ట్రం కోసం తపన పడుతూ, టిఆర్ఎస్ కారణంగా నిస్సహాయంగా ఉండిపోయిన అన్ని రాజకీయ శక్తులను కూడగట్టడం, ఇంతకాలం టిఆర్ఎస్ విస్మరించిన పని- అట్టడుగుస్థాయి నుంచి ఉద్యమాన్ని సమీకృతంగా నిర్మించడం-ని చేపట్టడం- గద్దర్ ఫ్రంట్ చేయవలసినపని. ఒకపార్టీగా ఏర్పడకపోయినా- ఒక ఫ్రంట్‌గా ఉద్యమ, రాజకీయ వేదిక గా వ్యవహరిస్తామని స్పష్టం చేయాలి.  ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తనకున్న ఆదరణ ను పరిగణనలోకి తీసుకుని సీమాంధ్ర ప్రాంతాలలో కూడా సానుకూల అభిప్రాయాన్ని రాబట్టడానికి ప్రయత్నించడం, విభజన మీద భయాందోళనలను తొలగించడం గద్దర్‌మాత్రమే చేయగలిగిన పని. వచ్చే శనివారం నాడు ఫ్రంట్ రూపొందించుకునే కార్యక్రమం ఏదైనప్పటికీ- అది పూర్తిస్థాయి ప్రజాస్వామికమైన, అహింసాయుతమైన ఉద్యమంగా ఉండేట్టు జాగ్రత్త పడాలి. అప్పుడు మాత్రమే అది ప్రస్తుత ఉద్యమనాయకత్వానికి నిజమైన ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదు.

2 comments:

 1. Mr srinivas

  your estimation is correct .
  gaddar should lead the movement with his alleys who foolowand beleive gaddar at least 8 months that is up to may 2011. with this same spirit, if it could be done , gaddar may be called telangana hero.
  is it so easy to gaddar ? he is only do prove him self .

  b s ramulu
  social philopher

  ReplyDelete
 2. ఇది కూడా చూడగలరుఃhttp://sahacharudu.blogspot.com/2010/10/blog-post_10.html?showComment=1286691427774_AIe9_BH3f8E23XX_MlFqrLtZBx3FQyUrB8Ko43lQHRHk1RvYnkjxlczFLY0LvU63dMyBBvfOmfrx-sUpO3VWRRvntdHCzmLyCM7_yv2VWI4SrHogpx6CiEcusM_YCeeZkc0qMpMkgGkjttpvfHfslHi1uXEPXYAYY6RBqsX3EZeWkz-piaQxvRQunMiHoLCJVvWBFox7PWiixPAOS9RQ44ya8l73iEXiTRcj4cd_8jMEtm_g9M2fbtOdH0PF63D8BBT6XcpbcGqN_wNt39M1VTPglnlb3WcE_7Siz8-BmZyK0oTR7EyNxAYkNwr40Qd8h8i0V6Cn8l_9F8srysdh7B9gjWMvtabcj-rhzkPSe-7QJ5nVQR9XsewvgkO20MHXIFxVFO8zkdZnmKwgp244zaBTtytE22lGCfn-5T1DKXhD76RtSTZXGdjehQjflwcG_p7a5BJSl7AYDLbk5pR_Be-xLTVVee0IBE_1UAzGhmD6xvqcmtJ7wjHwLfdGWLt9Zpk3GvoHIqnBfsZr6xtUYXFrVFiZi72mH5Oo390V3opjHRvrCKGvKW1yI_3LfxQ3aN5-DvLfsGnBErWie0enYls5cmZSslajAuuTdMukEENlm8F77BTjCeNSza76CSYpMm7p98qDxAwTbeegU4gzlRCrLJyesZ9PcPX1-IxsF5hsqBNFNM1clIvI71Ix46laJHRc1tNFkcm7tiYLc_VpZ-oUJHt2JqOfh6n5hSOjNMsleUdt_SNiMY852yeMZACla16ouZBhJ0B-cXJGJKtY0BljHKncIBCDZ8QUCQROcNWAGnyGobG-w6oF9-BesYNhFUGyjsmJa0-0o1B9kM-4hhKyUB-tIm-SRmtLWij2VrUOawtx-vL2HTylgx5xA489ColJlqwJLnhLC75Kc_Maa37v00AW0OaNC59tukm-xSNND7j6r8PTajOPNdXq9DRLzSi0r5yVXI8wQku9WW5pOtTpCOMR0mKllQ#c3932888537223894229

  ReplyDelete